హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, మూడవ అధ్యాయం: మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 22 – 28) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము

↑ విషయ సూచిక

باب إزالة النجاسة وبيانها

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

22

హదీసు 22

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { سُئِلَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنْ اَلْخَمْرِ تُتَّخَذُ خَلًّا? قَالَ: "لَا".‏ } أَخْرَجَهُ مُسْلِمٌ وَالتِّرْمِذِيُّ، وَقَالَ: حَدِيثٌ حَسَنٌ صَحِيحٌ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) వివరించారు : “సారాయిని పులియబెట్టి ‘కాడి’ (సిర్కా)ని తయారు చేయటం గురించి దైవప్రవక్త ﷺను దర్యాప్తు చేయగా ఇలా చేయరాదు అని ఆయన ﷺ నొక్కి పలికారు.” (ముస్లిం, తిర్మిజీ. దీన్ని ప్రామాణికమైనదిగా తిర్మిజీ ధృవీకరించారు).

English

Narrated Anas bin Malik (rad): Allah’s Messenger (ﷺ) was asked about making vinegar out of wine. He said, “No (it is prohibited)”. [Reported by Muslim, and At-Tirmidhi and the latter graded it Hasan-Sahih (fair and sound)].

సారాంశం

మద్యం (షరాబు, సారాయి) ద్వారా తయారుచేసే ‘సిర్కా‘ లేక కాడి నిషిద్ధం (హరామ్) అన్నదానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. అయితే ఈ విషయమై ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వాస్తవానికి ఒక వస్తువు తన యధాస్థితిని కోల్పోతే దానికి సంబంధించిన ఆదేశాలు కూడా మారతాయి. మద్యం గనక తన నిజస్థితిని కోల్పోయి సిర్కాగా మారిపోతే అప్పుడు కూడా నిషిద్ధంగానే పరిగణించబడుతుందా? అన్న విషయంపై ఒక నిర్దిష్టమయిన అభిప్రాయం లేదు. అయితే మద్యాన్ని ‘సిర్కా’గా మార్చటాన్ని మాత్రం వారించటం జరిగింది.

ఈ హదీసు యొక్క పూర్వాపరాలు ఇలా ఉన్నాయి – హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) దగ్గర అనాధల మద్యం అప్పగింతగా ఉండేది. మద్యపానం నిషేధించబడిందన్న దైవాజ్ఞ రాగానే పాపం ఆ అనాథలకు తీవ్రమయిన నష్టం కలుగుతుందికదా! అని ఆయనకు జాలి కలిగింది. ఈ నష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతోనే ఆయన దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, మద్యాన్ని సిర్కాగా మార్చేందుకు అనుమతి కోరారు. కాని అలా చేయరాదని దైవప్రవక్త ﷺ తాకీదు చేశారు. ఇంత స్పష్టంగా వారించిన మీదట కూడా ఎవరయినా మద్యం ద్వారా సిర్కాను తయారుచేయవచ్చని తీర్పు (ఫత్వా) ఇస్తే అతడు ధర్మోపదేశాన్ని ఉల్లంఘించినట్లే లెక్క. ఈ హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే మద్యానికి సంబంధించిన ఏ రకాన్ని వినియోగించినా, మద్యం నుండి ఎలాంటి ద్రవపదార్థాన్ని వడబోసి తీసినా అది అధర్మమే అవుతుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 22

23

హదీసు 23

وَعَنْهُ قَالَ: { لَمَّا كَانَ يَوْمُ خَيْبَرَ, أَمَرَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَبَا طَلْحَةَ, فَنَادَى: "إِنَّ اَللَّهَ وَرَسُولَهُ يَنْهَيَانِكُمْ عَنْ لُحُومِ اَلْحُمُرِ]اَلْأَهْلِيَّةِ], فَإِنَّهَا رِجْسٌ" } مُتَّفَقٌ عَلَيْه ِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఖైబర్ యుద్ధం జరిగిన రోజున దైవ ప్రవక్త ﷺ ఆదేశానుసారం అబూ తల్హా (రదియల్లాహు అన్హు) బిగ్గరగా ప్రకటన గావించారు – “పెంపుడు గాడిదల మాంసాన్ని మీరు తినడాన్ని దైవం మరియు దైవప్రవక్త ﷺ వారిస్తున్నారు. ఎందుకంటే అవి అశుద్ధమైనవి.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Anas bin Malik (rad): On the day of Khaibair, Allah’s Messenger (ﷺ) commanded Abu Talha to announce: “Allah and His Messenger have prohibited for you (eating of) the flesh of the donkeys, for it is unclean”. [Agreed upon].

సారాంశం

గాడిద మాంసం హరామ్ (నిషిద్ధం) అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. కేవలం ఇబ్నె అబ్బాస్ మాత్రమే దీనిని ధర్మసమ్మతంగా భావిస్తున్నారు. గాడిద ఎంగిలి నలుగురు ఇమాముల దృష్టిలోనూ పరిశుద్ధమైనదే. కొద్దిమంది ధర్మశాస్త్రవేత్తలు మాత్రమే దీనిని అశుద్ధంగా తలపోస్తున్నారు. ఉదాహరణకు : ఇమామ్ హసన్ బస్రీ (రహిమహుల్లాహ్), ఇమామ్ ఔజాయి (రహిమహుల్లాహ్) ప్రభృతులు. ఈ వ్యవహారంలో నలుగురు ఇమాముల అభిప్రాయం ఎక్కువ ప్రాధాన్యతతో కూడుకున్నది, అనుసరణీయమైనది.

హదీసు ఉల్లేఖకులు

పెంపుడు గాడిద మాంసం నిషేధం గురించి ఎలుగెత్తి ప్రకటించిన ప్రవక్త సహచరుడు అబూ తల్హా (రదియల్లాహు అన్హు). పెద్ద సహాబాల్లో ఒకరు. అబూ తల్హా (రదియల్లాహు అన్హు) మారు పేరు. అసలు పేరు జైద్ బిన్ సహ్ల్ బిన్ అస్వద్ బిన్ హరామ్ అన్సారీ. అఖబాలో బైత్ (ప్రమాణం) చేసిన వారిలో ఈయన కూడా ఉన్నారు. ముఖ్యమయిన యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. ఉహుద్ సంగ్రామంలో దైవప్రవక్త ﷺ కు రక్షణగా నిలిచిన సమయంలో చేతికి తీవ్రమయిన గాయం అయింది. హునైన్ యుద్ధంలో 20 మంది శత్రు సైనికులను సంహరించారు. హి.శ. 34లో మరణించారని కొందరూ, 54లో పరమపదించారని మరికొందరూ వాదిస్తున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 23

24

హదీసు 24

وَعَنْ عَمْرِو بْنِ خَارِجَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { خَطَبَنَا رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-بِمِنًى, وَهُوَ عَلَى رَاحِلَتِهِ, وَلُعَابُهَا يَسِيلُ عَلَى كَتِفَيَّ.‏ } أَخْرَجَهُ أَحْمَدُ, وَاَلتِّرْمِذِيُّ وَصَحَّحَه ُ.

హజ్రత్ అమ్ర్ బిన్ ఖారిజ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తన వాహనంపై కూర్చుని ‘మినా’ ప్రదేశంలో మమ్మల్ని ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఆ సమయంలో ఆ ఒంట నెమరువేయగా దాని నోటి నురుగు నా భుజాలపై పడి ప్రవహించింది.” (అహ్మద్, తిర్మిజీ – తిర్మిజీ దీని సత్యతను ధృవీకరించారు)

English

Narrated ‘Amr bin Kharija (rad): Allah’s Messenger (ﷺ) delivered a Khutba (religious talk) to us at Mina while mounted on his camel and its saliva was pouring on my shoulders [Reported by Ahmad and At-Trimidhi and the latter graded it Sahih (sound)].

సారాంశం

ఏ పశువుల మాంసం తినటం ధర్మసమ్మతమో వాటి నోటి నురుగు కూడా పరిశుద్ధమైనదేననీ, అది శరీరంపై పడినంత మాత్రాన అశుద్ధత ఏర్పడదని ఈ హదీసువల్ల విశదమవుతోంది.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన అమ్ర్ బిన్ ఖారిజ బిన్ మున్తఫిఖ్ అసదీ అన్సారీ వర్గీయులు. అబూ సుఫ్యాన్‌కు మద్దతుదారులు. అసదీ తెగకు చెందినవారని కూడా ప్రతీతి. ప్రముఖ సహాబీలలో ఒకరు. సిరియాలో స్థిర నివాసమేర్పరచుకున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 24

25

హదీసు 25

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا, قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَغْسِلُ اَلْمَنِيَّ, ثُمَّ يَخْرُجُ إِلَى اَلصَّلَاةِ فِي ذَلِكَ اَلثَّوْبِ, وَأَنَا أَنْظُرُ إِلَى أَثَرِ اَلْغُسْلِ فِيهِ } مُتَّفَقٌ عَلَيْه ِ. وَلِمُسْلِمٍ: { لَقَدْ كُنْتُ أَفْرُكُهُ مِنْ ثَوْبٍ رَسُولِ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فَرْكًا, فَيُصَلِّي فِيهِ }. وَفِي لَفْظٍ لَهُ: { لَقَدْ كُنْتُ أَحُكُّهُ يَابِسًا بِظُفُرِي مِنْ ثَوْبِهِ }.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు : “దైవప్రవక్త ﷺ తన లుంగీకి అంటుకుని వున్న వీర్యపు మరకను కడిగేవారు. ఆ వస్త్రాన్నే శుభ్రంగా ఉతికి దాంతో నమాజ్ చేసేవారు. కడిగిన ఆ గుర్తులను, వాటి ప్రభావాన్ని నేను (నా కళ్ళారా) స్పష్టంగా చూసేదానిని.”

(బుఖారీ, ముస్లిం)

“నేను దైవప్రవక్త ﷺ వస్త్రంపై వున్న వీర్యపు మరకను గీకివేసేదాన్ని. ఆయన ఆ వస్త్రంతోనే నమాజ్ సలిపేవారు” అని ముస్లింలో ఉంది.

ముస్లింలోని మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: “వీర్యపు మరక ఆరిపోయిన మీదట నేను ఆ వస్త్రాన్ని నా గోళ్ళతో గీకి తొలగించేదానిని.”

English

Narrated ‘Aisha (rad): Allah’s Messenger (ﷺ) used to wash the semen and then go out for prayer in that (very) garment and I could still see the trace of the washing on it. [Agreed upon]

In the version of Muslim: “I used to scrape it (the semen) off the garment of Allah’s Messenger (ﷺ) and then he offered prayer with it.

In yet another version of Muslim: Verily! I (‘Aisha) used to scrape it (the semen) off his garment with my nails while it was dry.

సారాంశం

రేతస్సు లేక వీర్యపు మరకలను తొలగించడానికి. బట్టలను ఉతకటం అనివార్యం కాదని, ఇతరత్రా విధానాల ద్వారా కూడా ఈ మలినాన్ని తొలగించవచ్చుననీ దీనిద్వారా అవగతమవుతోంది. ముఖ్యంగా అది ఆరిపోయినపుడు దాన్ని గీకివేసినా, డ్రైక్లీనింగ్ చేసినా, వేరితర గుడ్డతో తుడిచివేసినా, గరకు గడ్డితో లేక బద్దతో గీకి పారద్రోలినా సరిపోతుంది. ఈ హదీసు వెలుగులో వీర్యపు మరకలను కొంతమంది పండితులు పరిశుద్ధమైనవిగా తలపోశారు. కాని అవి పరిశుద్ధమైనవనడానికి ప్రబల నిదర్శనాలేమీ లేవు. వీర్యపు మరకలను కడిగి, ఉతికి, పిండి, నలిపి పారద్రోలిన ఆధారాలున్నాయని ఆచార్య షౌకానీ (రహిమహుల్లాహ్) “నైలుల్ ఔతార్”లో పేర్కొన్నారు. కనుక అత్యధిక హదీసువేత్తల అభిప్రాయం ప్రకారం వీర్యం (రేతస్సు) అశుద్ధమైనదని భావించటమే సరైనది. దానిని తొలగించడానికి పైన సూచించిన పద్ధతులలో ఏదైనా ఒక పద్ధతిని అవలంబించాల్సిందే. అయితే ఆచార్య షౌకానీ (రహిమహుల్లాహ్) మాత్రం వీర్యాన్ని పరిశుద్ధమైనదిగా ఖరారు చేయటం విశేషం! ఇది అశుద్ధం అనడానికి మూలాధారం ఏదీ లేదంటారాయన. మొత్తానికి ఈ విషయంలో ఈయన అభిప్రాయం విభిన్నంగా ఉంది.

ఇకపోతే ఈ జిగటుపదార్థం పరిశుభ్రమైనదా లేక అపరిశుభ్రమైనదా? అన్న విషయంలో ఎలాగూ అభిప్రాయభేదం ఏర్పడింది. పురుషాంగం నుండి వెలువడిన జిగటు పదార్థం కూడా నోటి చొంగ మాదిరిగా పరిశుద్ధమైనదేనని ఒక వర్గం వాదించింది. ఈ దృక్పథాన్ని కలిగివున్న వారిలో ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), దావూద్ జాహిరీ (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ముఖ్యులు. ప్రవక్త సహచరులలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా), ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ల దృక్పథం కూడా ఇదే. రెండవ దృక్పథం కలిగి ఉన్న వారిలో ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) ముఖ్యులు. అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో ఆరిపోయిన వీర్యపు మరకను గీకివేసినట్లయితే అది పరిశుభ్రమైపోతుంది, నీళ్ళతోనే కడగవలసిన అవసరం లేదు. ఇరుపక్షాల వారూ తమ తమ దృక్పథాల కనుగుణంగా ప్రబల నిదర్శనాలను చూపుతున్నారు.

వీర్యాన్ని పరిశుద్ధమైనదిగా భావించేవారు చూపే ఆధారం ఇది : “సదరు హదీసులో గీకివేసిన తరువాత వస్త్రాన్ని కడిగినట్లుగా లేదు. అందుచేత ఇది పరిశుద్ధమైనది. ఒకవేళ అది గనక అశుద్ధమైనదైతే గీకిన తరువాత తప్పక దాన్ని ఉతికి ఆరేసేవారు.”

వీర్యాన్ని అశుద్ధమైనదిగా భావించిన వారి ఆధారం చూడండి: “వీర్యంతో కలుషితమైన చోటును నీళ్ళతో కడగటమే సమంజసం. ఒకవేళ అదే గనక పరిశుద్ధమై ఉంటే దానిని తొలగించే ప్రస్తావనే వచ్చేది కాదు కదా!”

హాఫిజ్ ఇబ్నె ఖయ్యిమ్ ‘బదాయిల్ ఫవాయిద్’ (పేజీ 119 – 126)లో దీన్ని క్షుణ్ణంగా చర్చించారు.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన వారు హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా). మహాప్రవక్త ﷺ మదీనాకు వలసపోక రెండు సంవత్సరాల క్రితమే ఆమెను వివాహమాడారు. హిజ్రీ 1లో ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నారు. అప్పటికి ఆమె వయస్సు 9 సంవత్సరాలు. ఆమె ప్రజ్ఞాపాటవాల గురించి వేరుగా చెప్పనవసరం లేదు. హిజ్రీ 58వ సంవత్సరం రమజాన్ నెల 17వ తేదీన మరణించారు. హజ్రత్ అబూ హురైర(రదియల్లాహు అన్హు) ఆమె జనాజా నమాజ్‌కు సారధ్యం వహించారు. జన్నతుల్ బఖీలో అంత్య క్రియలు జరిగాయి. గొప్ప విద్వాంసురాలు. భారీ సంఖ్యలో హదీసులను ఉల్లేఖించారు. అరబీ కవనంలో మంచి ప్రవేశం ఉండేది. ఆమె పాతివ్రత్యం గురించి ఆకాశం నుండి ప్రకటన గావించబడింది. దివ్య ఖుర్ఆన్‌లోని నూర్ సూరాలో ఈ వృత్తాంతం ఉంది. దైవప్రవక్త ﷺ ఈమెగారి కుటీరంలోనే ఖననం చేయబడ్డారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 25

26

హదీసు 26

وَعَنْ أَبِي اَلسَّمْحِ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ يُغْسَلُ مِنْ بَوْلِ اَلْجَارِيَةِ, وَيُرَشُّ مِنْ بَوْلِ اَلْغُلَامِ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اَلْحَاكِم ُ.

దైవప్రవక్త ﷺ ఉద్బోధించారని హజ్రత్ అబూ అస్సమహ్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఆడ పిల్ల మూత్రం పోస్తే ఆ వస్త్రాన్ని కడగాలి. మగ పిల్లవాడు మూత్రంపోస్తే నీళ్ళు చిలకరించినా చాలు.” (అబూదావూద్, నసాయి దీనిని ఉల్లేఖించారు. హాకిమ్ దీని ప్రామాణికతను గురించి ధృవీకరించారు).

English

Narrated Abu As-Samh (rad): Allah’s Messenger (ﷺ) said: “The urine of a baby girl should be washed off and the urine of baby boy should be sprinkled (with water)”. [Reported by Abu Da’ud and An-Nasa’i and Al-Hakim graded it Sahih (sound)].

సారాంశం

ఆడ శిశువు మూత్రం, మగ శిశువు మూత్రం షరీయత్‌పరంగా వేర్వేరు ఆదేశాలు కలిగి ఉన్నాయని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఆడపిల్ల మూత్రం పోసిన వస్త్రాన్ని కడగటమైనా, మగపిల్లవాడు మూత్రం పోసిన వస్త్రంపై నీళ్ళు చిలకరించటమైనా – వారిద్దరూ కేవలం పాలు త్రాగినంత కాలమే ఈ వేర్వేరు ఆదేశాలు వర్తిస్తాయి. పాలతోపాటు వేరితర ఆహారపదార్థాన్ని తిన్న రోజు నుండే వారిరువురి మూత్రం ఒకే రకమయిన మలినంగా భావించబడుతుంది. ఆ రోజు నుండీ వారిరువురికీ ఒకే ఆదేశం వర్తిస్తుంది. మగ పిల్లవాని మూత్రంపై నీళ్ళు చిలకరించిన కారణంగా ఆ మూత్రం ‘పరిశుద్ధమైనద’ని భావం ఎంతమాత్రం కాదు. కాకపోతే హదీసులో మగపిల్లవాని మూత్రాన్ని పారద్రోలే విషయంలో కొంత సడలింపుల వైఖరి కనబరచబడిందంతే.

హదీసు వల్ల తేటతెల్లమయ్యే దేమిటంటే ఆడ శిశువు – మగ శిశువుల మూత్రంలో కించిత్ వ్యత్యాసం ఉంది. పాలు త్రాగే వయస్సులో ఆడపిల్ల మూత్రం మగపిల్లవాని మూత్రంకన్నా ఎక్కువ అశుద్ధమైనదిగా పరిగణించబడింది. ఈ క్షీర గడువు తరువాత వారిరువురిలో ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇబ్నె వహబ్ (రహిమహుల్లాహ్), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), హసన్ బస్రీ (రహిమహుల్లాహ్), ఇస్హాఖ్ బిన్ రాహ్వే (రహిమహుల్లాహ్)ల దృష్టిలో మగపిల్లవాని మూత్రంపై నీళ్ళు చిలకరిస్తే సరిపోతుంది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మాత్రం కడగటం అవసరమని భావించారు.

హదీసు ఉల్లేఖకులు

అబూ అస్సమహ్ మారు పేరనీ, అసలు పేరు ఇయ్యాద్ అనీ భావించబడుతోంది. ఈయన దైవ ప్రవక్త ﷺ చేత స్వాతంత్ర్యం పొందిన బానిస. దైవప్రవక్త ﷺ సేవకునిగా ఉన్నారు. అనంతరం ఆయన ఎవరికీ కనబడకుండా పోయారనీ, ఇబ్నె అబ్దుల్ బిర్ చెప్పారు. అందుచేత ఆయన ఎక్కడ, ఎప్పుడు మరణించారో తెలియదు. ఈ ఒక్క హదీసు మాత్రమే ఆయనచేత ఉల్లేఖించబడినది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 26

27

హదీసు 27

وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِي بَكْرٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ ‏-فِي دَمِ اَلْحَيْضِ يُصِيبُ اَلثَّوْبَ‏-: { "تَحُتُّهُ, ثُمَّ تَقْرُصُهُ بِالْمَاءِ, ثُمَّ تَنْضَحُهُ, ثُمَّ تُصَلِّي فِيهِ" } مُتَّفَقٌ عَلَيْه ِ.

బట్టలకు అంటుకున్న బహిష్టు రక్తం గురించి దైవప్రవక్త ﷺ చెబుతూ, “మొదట దాన్ని గీకి శుభ్రం చేయండి. తర్వాత నీళ్ళలో (నానబెట్టి) కడగండి. ఆ తర్వాత దానిపై బాగా నీరు పోయండి. అనంతరం ఆ వస్త్రాన్ని కట్టుకుని నమాజ్ చేయండి” అని అన్నారని హజ్రత్ అస్మా బిన్తె అబూబకర్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు.

(బుఖారీ, ముస్లిం)

English

Narrated ‘Asma bint Abu Bakr (rad): The Prophet (Saw) said regarding menstruation blood that smears a garment, “She should scrape it, rub it with water, then wash it and then she may pray in it”. [Agreed upon]

సారాంశం

గీకటం ద్వారా, నీళ్ళలో నానబెట్టడం ద్వారా ఆ వస్త్రం రక్తపు మరకలున్నచోట నీరు బాగా పీల్చు కుంటుంది. ఆ తరువాత ఉతికి ఆరేస్తే మలినం తొందరగా దూరమై వస్త్రం పరిశుభ్రమవుతుంది. కేవలం నీళ్ళలో ముంచి తీయటం వల్ల రక్త ప్రభావం తొలగిపోదు.

ఒకవేళ నీళ్ళలో నానబెట్టి బాగా ఉతికిన మీదట కూడా బహిష్టు రక్తపు మరకలు తొలగకపోతే, అందులో చింతించవలసిన విషయం ఏమీ లేదు. అటువంటి వస్త్రం తొడిగి నమాజ్ చేయటంలో షరీయత్‌పరంగా దోషం ఏమీ లేదు.

హదీసు ఉల్లేఖకులు

అస్మా బిన్తె అబూ బకర్ (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ﷺ గారి ధర్మపత్ని అయిన హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)కు అక్క అవుతారు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా)కు తల్లిగారు. మక్కాలో విశ్వసించి ఇస్లాం స్వీకరించిన తొలి ముస్లింలలో ఈమె ఒకరు. అనంతరం మదీనాకు వలస వచ్చారు. హిజ్రీ 73లో తన కుమారుడు అబ్దుల్లాహ్ హత్య గావించబడిన నెల రోజులకు – మక్కా నగరంలో – మరణించారు. అప్పటికి ఆమెకు నూరేళ్ళు నిండాయి. ఇంతటి వార్ధక్యం పొందినప్పటికీ ఆమె పళ్ళు ఊడిపోవటంగానీ, బుద్ధీ వివేకాలలో కించిత్ మార్పు రావటంగానీ జరగకపోవటం విశేషం!

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 27

28

హదీసు 28

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَتْ خَوْلَةُ: { يَا رَسُولَ اَللَّهِ, فَإِنْ لَمْ يَذْهَبْ اَلدَّمُ? قَالَ: "يَكْفِيكِ اَلْمَاءُ, وَلَا يَضُرُّكِ أَثَرُهُ" } أَخْرَجَهُ اَلتِّرْمِذِيُّ, وَسَنَدُهُ ضَعِيف ٌ.

హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: “ఓ దైవప్రవక్తా ﷺ! (రక్తం పీల్చిన గుడ్డను బాగా నలిపి ఉతికిన పిదప కూడా) రక్తపు మరక చెరగకపోతే ఏం చేయాలి?” అని ఖౌలా (రదియల్లాహు అన్హా) విన్నవించుకోగా ఆయన ﷺ ఇలా బదులిచ్చారు: “చేసేదేముందీ, బాగా నీరు పొయ్యి. (నీటిలో బాగా జాడించు) అంతే చాలు. ఆ మరకలు నీకు ఎలాంటి హాని కలుగజెయ్యవు.” (ఇమామ్ తిర్మిజీ దీనిని ఉల్లేఖించారు. ప్రామాణికత రీత్యా ఈ హదీసు బలహీనమైనది)

English

Narrated Abu Huraira (rad): Khaula said, “O Messenger of Allah, suppose the (trace of) the blood does not go?” He said, “(Washing it with) water will suffice you and its trace won’t harm you”. [Reported by At Tirmidhi, and its Sanad (chain of narrators) is weak].

సారాంశం

మలినాన్ని దూరం చేయడానికి ఉద్దేశ్యించిన విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తే చాలు అది పరిశుద్ధమై పోతుందనీ, ఇంతచేసిన తరువాత కూడా మలిన ప్రభావం కానవస్తే షరీయత్‌పరంగా అందులో ఎలాంటి లొసుగూ లేదని పై హదీసు ద్వారా వ్యక్తమవుతోంది. ఈ హదీసు ముస్లిం అనుచర సమాజానికి అందిన తీరునుబట్టి ధర్మ శాస్త్రవేత్తలు దీనిని ‘బలహీనమైన హదీసు’గా ఖరారు చేశారు. అయితే హదీసులో ప్రస్తావించబడిన అంశంలో మాత్రం ఎలాంటి బలహీనత లేదు.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసులో దైవప్రవక్త ముందు ధర్మ సందేహం వెలిబుచ్చిన ఖౌలా (రదియల్లాహు అన్హా) పూర్తి పేరు ఖౌలా బిన్తె యసార్. ఈమె సుప్రసిద్ధ సహాబియ. అబూ సలమా బిన్ అబ్దుర్రహ్మాన్ గారు ఈమె ఆధారంగా ఈ హదీసును ఉటంకించారు. బహుశా ఈ హదీసును వివరించిన వారు ఖౌలా బిన్తె యమాన్ అయి ఉండవచ్చునని ఇబ్నె అబ్దుల్ బిర్ అనుమానం వ్యక్తపరిచారు. అయితే సంకలనకర్త దీనిని త్రోసిపుచ్చారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.3 మాలిన్యం, దాన్ని దూరం చేసే విధము|హదీసు 28