హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 68వ అధ్యాయం: సందేహాస్పద విషయాల జోలికి పోరాదు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 9 హదీసులు (హదీసు 588 – 596) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు

↑ విషయ సూచిక

باب الورع وترك الشبهات

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు :

{وَتَحْسَبُونَهُ هَيِّناً وَهُوَ عِنْدَ اللَّهِ عَظِيمٌ} [النور١٥]

"మీరు దానిని మామూలు విషయంగా భావించారు. వాస్తవానికి అల్లాహ్ దృష్టిలో అది చాలా పెద్ద విషయం." (అన్ నూర్ : 15)

{إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ} [الفجر:١٤]

"నిస్సందేహంగా నీ ప్రభువు మాటేసి ఉన్నాడు. (అంటే మీ ఆచరణల్ని పరీక్షిస్తున్నాడు)." (అల్ ఫజ్ర్ : 14)

వివరణ

పైన పేర్కొనబడిన దివ్య ఖుర్‌ఆన్ సూక్తుల్లో మొదటి సూక్తి దైవప్రవక్త సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) పై కపటులు, అవిశ్వాసులు కలిసి అభాండాన్ని సృష్టించినప్పుడు ఆమె సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని చాటుతూ అవతరించినది. దురదృష్టవశాత్తు కొంతమంది ముస్లింలు కూడా కపటులకు వంతపాడి ఆ పాపంలో పాలుపంచుకున్నారు. కారణం వారు దాన్ని మామూలు విషయంగా భావించడమే. కాని ఆ తర్వాత దైవప్రవక్త సతీమణిపై అభాండాలు వేయటం మామూలు విషయం కాదని, అది ఘోరాతిఘోరమైన నేరమని దేవుడు ముస్లింలను హెచ్చరించాడు.

ఇకపోతే గ్రంథకర్త ఈ సూక్తిని సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఔచిత్యం ఏమిటంటే సాధారణంగా మనిషి మామూలు విషయాలుగా భావించి ఎన్నో తప్పులు, పాపాలకు ఒడిగడుతుంటాడు. నిజానికి ఎంత చిన్నదయినప్పటికీ పాపం పాపమే.

English

“…you counted it a little thing, while with Allah it was very great.” [An-Nūr 24:15]

“Verily, your Rubb is Ever Watchful (over them).” [Al-Fajr 89:14]

588

హదీసు 588

وعن النُّعمان بنِ بَشيرٍ رضيَ اللَّه عنهما قال: سمِعْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "إِنَّ الحَلاَلَ بَيِّنٌ، وإِنَّ الحَرامَ بَيِّنٌ، وَبَيْنَهما مُشْتَبِهاتٌ لاَ يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنَ النَّاسِ، فَمَن اتَّقى الشُّبُهاتِ، اسْتَبْرَأَ لِدِينِهِ وعِرْضِهِ، وَمَنْ وَقَعَ فِي الشبُهاتِ، وقَعَ في الحَرامِ، كالرَّاعي يرْعى حَوْلَ الحِمى يُوشِكُ أَنْ يَرْتَع فِيهِ، أَلاَ وإِنَّ لِكُلِّ مَلِكٍ حِمًى، أَلاَ وَإِنَّ حِمَى اللَّهِ مَحَارِمهُ، أَلاَ وإِنَّ فِي الجسَدِ مُضغَةً إِذَا صلَحَت صَلَحَ الجسَدُ كُلُّهُ، وَإِذا فَسَدَتْ فَسدَ الجَسَدُ كُلُّهُ: أَلاَ وَهِي القَلْبُ" متفقٌ عَلَيْهِ. ورَوَياه مِنْ طُرُقٍ بأَلْفاظٍ مُتَقارِبَةٍ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: హలాల్ (ధర్మసమ్మతమైన) విషయాలేవో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. హరామ్ (నిషిద్ధ) విషయాలు కూడా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. అయితే ఆ రెండింటిమధ్య అనుమానాస్పద విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలియదు. కాబట్టి అనుమానాస్పద విషయాలకు దూరంగా ఉన్నవాడు తన ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడుకున్నవాడవుతాడు. దీనికి భిన్నంగా అనుమానాస్పద విషయాల జోలికి పోయినవాడు నిషిద్ధ విషయాల్లో పడిపోయే ప్రమాదముంది. అతడు గరిక గట్టుపై పశువుల్ని మేపుకుంటున్న కాపరిలాంటివాడని చెప్పవచ్చు. అతని పశువులు (ఏ క్షణంలోనయినా) గట్టుదాటి ప్రక్కనున్న పొలంలోకి వెళ్ళి మేసే ప్రమాదముంటుంది.

వినండి! ప్రతి రాజుకీ నిర్ణీత సరిహద్దులుంటాయి.అలాగే అల్లాహ్ (సామ్రాజ్య) సరిహద్దులంటే ఆయన నిషేధించిన విషయాలే.

వినండి! మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది పాడయితే మొత్తం మానవ శరీరమే పాడయిపోతుంది. బాగా గుర్తుంచుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం, సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)

English

An-Nu`man bin Bashir (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “What is lawful is clear and what is unlawful is clear, but between them are certain doubtful things which many people do not know. So he who guards against doubtful things keeps his religion and his honour blameless. But he who falls into doubtful things falls into that which is unlawful, just as a shepherd who grazes his cattle in the vicinity of a pasture declared prohibited (by the king); he is likely to stray into the pasture. Mind you, every king has a protected pasture and Allah’s involved limits is that which He has declared unlawful. Verily, there is a piece of flesh in the body, if it is healthy, the whole body is healthy, and if it is corrupt, the whole body is corrupt. Verily, it is the heart.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

అనుమానాస్పదమైనవి అంటే అత్యధికమంది ప్రజలకు అవి ధర్మసమ్మతమైనవో కావో తెలియవని అర్థం. అలాంటి విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. ధర్మాధర్మాలను లెక్కచేయకుండా మనిషి అనుమానాస్పద విషయాల వెంటపడితే త్వరలోనే అతను నిషిద్ధ విషయాల్లోనూ చిక్కుకునే ప్రమాదముంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 588

589

హదీసు 589

وعن أَنسٍ رضيَ اللَّهُ عنه أَنَّ النَبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَجَدَ تَمْرَةً فِي الطَّرِيقِ، فقالَ: "لَوْلاَ أَنِّي أَخافُ أَنْ تَكُونَ مِنَ الصَّدَقَةِ لأَكَلْتُها". متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺకు దారిలో ఒక ఖర్జూర పండు కనిపించింది. దాన్ని చూసి ఆయన, "ఇది దానం చేయబడిన ఖర్జూర పండేమోనన్న భయం గనక నాకు లేకపోతే నేను దీన్ని నిస్సంకోచంగా తిని ఉండేవాణ్ణి" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: The Prophet ﷺ found a dry date-fruit lying in the way and said, “Had it not been for fear of being from charity I would have eaten it.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 589

590

హదీసు 590

وعن النَّوَّاسِ بنِ سَمعانَ رضي اللَّه عنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "البرُّ حُسنُ الخُلُقِ وَالإِثمُ مَا حاكَ فِي نفْسِكَ، وكَرِهْتَ أَنْ يَطَّلَعَ عَلَيْهِ النَّاسُ" رواه مسلم. "حاكَ"بالحاءِ المهملة والكاف، أَيْ تَرَدَّدَ فيهِ.

హజ్రత్ నవ్వాస్ బిన్ సమ్‌ఆన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ఉత్తమ నైతికతకు మారుపేరే సత్కార్యం. నీ మదిని తొలిచేది, ప్రజలకు తెలిస్తే బాగుండదని నువ్వు భావించేదే పాపకార్యం. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

An-Nawwas bin Sam`an (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Piety is good manner, and sin is that which creates doubt and you do not like people to know of it.”[Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాంలో ఉత్తమ నీతినడవడికలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉత్తమ నీతినడవడికలంటే ఇతరుల్ని నగుమోముతో పలకరించటం, ప్రజలకు కష్టపెట్టకుండా ఉండటం, వీలైనంతవరకు వారికి సౌలభ్యం కలుగజేయటానికి కృషిచేయటం, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవటం, మంచిపనుల్లో ఇతరులకు తమవంతు సహాయం అందించటం, అవసర మైన చోట విశాల హృదయంతో డబ్బు ఖర్చుపెట్టటం, తమకోసం ఇష్టపడేదే ఇతరుల కోసం కూడా ఇష్టపడటం మొదలగునవి. ఇవన్నీ నైతిక విలువలు. ఇస్లాం దృష్టిలో ఇవే సత్కార్యాలు కూడాను. వీటికి భిన్నంగా నీచమైన, చెడ్డదైన ప్రతి పనీ పాపకార్యమే అవుతుంది. పై హదీసులో పాపకార్యానికి రెండు గుర్తులు తెలియజేయబడ్డాయి. ఒకటి: ఆ పని చేయాలా వద్దా అని మనసులో సందేహం వస్తూ ఉంటుంది. రెండు: ఆ పని గురించి ప్రజలకు తెలియటం తనకిష్టం ఉండదు. ఏదయినా పనికి ముందు ఈ రెండు ఆలోచనలు గనక మనసులో పుట్టినట్లయితే అది తప్పకుండా పాపకార్యమే అయి ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 590

591

హదీసు 591

وعن وابصةَ بنِ مَعْبِدٍ رضيَ اللَّه عنه قَالَ: أَتَيْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: " جِئْتَ تسأَلُ عنِ البِرِّ؟ "قُلْتُ: نَعَمْ، فَقَالَ:"اسْتَفْتِ قَلْبَكَ، البِرُّ: مَا اطْمَأَنَّتْ إِلَيْهِ النَّفْسُ، واطْمَأَنَّ إِلَيْهِ القَلْبُ، والإِثمُ مَا حاكَ في النَّفْسِ وتَرَدَّدَ فِي الصَّدْرِ، وإِنْ أَفْتَاكَ النَّاسُ وَأَفْتَوكَ" حديثٌ حسن، رواهُ أحمدُ، والدَّارَمِيُّ في"مُسْنَدَيْهِما".

హజ్రత్ వాబిసా బిన్ మాబద్ (రదియల్లాహు అన్హు) కథనం : నేనోసారి దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాను. అప్పుడు (నేనేమీ చెప్పకముందే) ఆయన, "నువ్వు సత్కార్యం గురించి అడగటానికొచ్చావు కదూ!?" అన్నారు. నేను ఔనన్నాను. దానికాయన, "నీ మనసునడుగు (చెబుతుంది). నువ్వు చేస్తున్న పనిపట్ల మనస్సు నిమ్మళంగా ఉండి, హృదయంలో ఎలాంటి అలజడి లేకపోతే అదే సత్కార్యం. కాని నీ మదిని తొలిచేది, నీ హృదయంలో సంశయాలు సృష్టించేదే పాపకార్యం. ప్రజలు నీతో ఆ పని సమ్మతమేనని చెప్పినాసరే; సమ్మతమేనని చెప్పినాసరే.

(ఈ హదీసు హసన్ కోవకు చెందినది, దీనిని అహ్మద్, దారిమీలు ఉల్లేఖించారు).

(సుననె దారిమి – వాణిజ్య ప్రకరణం)

English

Wabisah bin Ma`bad (radiyallahu anhu) reported: I went to Messenger of Allah ﷺ and he asked me, “Have you come to inquire about piety?” I replied in the affirmative. Then he said, “Ask your heart regarding it. Piety is that which contents the soul and comforts the heart, and sin is that which causes doubts and perturbs the heart, even if people pronounce it lawful and give you verdicts on such matters again and again.”[Ahmad and Ad-Darmi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 591

592

హదీసు 592

وعن أَبي سِرْوَعَةَ بكسر السين المهملة وفتحها عُقْبَةَ بنِ الحارِثِ رضي اللَّهُ عنهُ أَنَّهُ تَزَوَّجَ ابْنَةً لأبي إِهاب بنِ عَزِيزٍ، فَأَتَتْهُ امْرَأَةٌ فَقَالَتْ: إِنِّي قَد أَرْضَعْتُ عُقْبَةَ وَالتي قَدْ تَزَوَّجَ بِهَا، فَقَالَ لَها عُقبةُ: مَا أَعْلَمُ أَنَّكِ أَرضَعْتِني وَلاَ أَخْبَرتِني، فَرَكَبَ إِلى رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بالمَدِينَةِ، فَسَأَلَهُ، فَقَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كَيْفَ، وَقَدْ قِيلَ؟،" ففَارقَهَا عُقْبَةُ ونكَحَتْ زَوْجاً غيرَهُ. رواهُ البخاري. "إِهَابٌ"بكسرِ الهمزة، وَ"عزِيزٌ"بفتح العين وبزاي مكررة.

హజ్రత్ అబూ సిర్వఆ ఉఖబా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) గారే స్వయంగా చేసిన కథనం ప్రకారం ఆయన అబూ ఇహాబ్ బిన్ అజీజ్ కూతుర్ని వివాహమాడారు. అప్పుడు ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, "నేను ఉఖబాకూ, అతను పెళ్ళాడిన అమ్మాయికి – ఇద్దరికి (వారి చిన్నతనంలో) పాలు పట్టాను" అని చెప్పింది. ఆ మాటకు ఉఖబా, "నువ్వు నాకు పాలు పట్టావన్న సంగతి నాకసలు తెలియదు. నువ్వు (పెళ్ళికి ముందైనా) ఆ విషయం నాతో చెప్పలేదు" అని అన్నారు.

ఆ తరువాత ఆయన దైవప్రవక్త ﷺ దగ్గరికి ప్రయాణమయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళి (పరిస్థితిని వివరించి) ఇప్పుడు తానేం చేయాలో చెప్పమని అడిగారు. దానికి ఆయన "ఈ సంగతి తెలిసిన తరువాత ఇక నీ వివాహబంధం ఎలా నిలిచి ఉంటుంది?" అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని విద్య, లావాదేవీలు, నికాహ్, సందేహాస్పద విషయాల ప్రకరణాలు)

English

`Uqbah bin Al-Harith (radiyallahu anhu) reported that he had married a daughter of Abu Ihab bin `Aziz and a woman came to him and said she had suckled both `Uqbah and the woman whom he had married, to which he replied: “I am not aware that you suckled me, and you did not inform me.” So he (`Uqbah) rode to Messenger of Allah ﷺ in Al-Madinah and put the matter before him. The Messenger of Allah ﷺ said, “How can you continue (to be her husband) after what you have been told?” `Uqbah (radiyallahu anhu) therefore divorced her and she married another man.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ప్రసవం, పిల్లలకు పాలు త్రాపించటం, స్త్రీల లోవిషయాల్లాంటి పురుషులకు తెలియకుండా ఉండే సమస్యల్లో ఒకే ఒక స్త్రీ సాక్ష్యం కూడా చెల్లుతుందని చెప్పటానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. ఇందులో ఒక స్త్రీ తాను ఉఖబా దంపతులిరువురికీ చిన్నప్పుడు పాలు త్రాపించాననీ, ఆ విధంగా వారిద్దరూ పాలవరస అన్నాచెల్లెళ్ళు అయ్యారని చెప్పగానే ఆ దంపతులు విడిపోయారు. దైవప్రవక్త ﷺ కూడా పాలవరుస సంబంధం ఉందని తెలిసిన తర్వాత వారి దాంపత్యం ధర్మసమ్మతం కాదని ఖరారు చేశారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 592

593

హదీసు 593

وعن الحَسَنِ بن عَليٍّ رضّيَ اللَّهُ عنهما، قَالَ: حَفِظْتُ مِنْ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "دَعْ مَا يَرِيبُكَ إِلى مَا لاَ يرِيبُك" رواهُ الترمذي وقال حديث حسن صحيح. ومعناهُ: اتْرُكْ مَا تَشُكُّ فِيهِ، وخُذْ مَا لاَ تَشُكَّ فِيهِ.

హజ్రత్ హసన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా నేను విని గుర్తుపెట్టుకున్నాను. "నిన్ను సంశయంలో పడవేసే విషయాన్ని వదలిపెట్టు. నిస్సందేహమైన పనులు మాత్రమే చెయ్యి." (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు)

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం)

English

Hasan bin `Ali (radiyallahu anhuma) reported: I have retained these words of Messenger of Allah ﷺ, “Leave what causes you doubt and turn to what does not cause you doubt.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 593

594

హదీసు 594

وعن عائشةَ رضيَ اللَّهُ عنها، قَالَتْ: كانَ لأبي بَكْرٍ الصَّدِّيقِ، رضيَ اللَّهُ عنهُ غُلامٌ يُخْرِجُ لَهُ الخَراجَ وكانَ أَبو بَكْرٍ يَأْكُلُ مِنْ خَرَاجِهِ، فَجَاءَ يَوماً بِشَيءٍ، فَأَكَلَ مِنْهُ أَبُو بَكْرٍ، فَقَالَ لَهُ الغُلامُ: تَدْرِي مَا هَذا؟ فَقَالَ أَبُو بَكْرٍ: ومَا هُوَ؟ قَالَ: كُنْتُ تَكَهَّنْتُ لإِنْسَانٍ في الجاهِلِيَّةِ ومَا أُحْسِن الكَهَانَةَ إِلاَّ أَنِّي خَدَعْتُهُ، فَلَقِيني، فَأَعْطَاني بِذلكَ هَذَا الَّذِي أَكَلْتَ مِنْهُ، فَأَدْخَلَ أَبُو بَكْرٍ يَدَه فَقَاءَ كُلَّ شَيءٍ فِي بَطْنِهِ، رواه البخاري. "الخَراجُ": شَيءَ يَجْعَلُهُ السَّيِّدُ عَلى عَبْدِهِ يُؤدِّيهِ إلى السيِّد كُلّ يَومٍ، وَبَاقي كَسبِهِ يَكُونُ للعَبْدِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) గారి దగ్గర ఒక బానిస ఉండేవాడు. అతను డబ్బు సంపాదించి తెస్తే అబూబక్ర్ దాన్ని వినియోగించుకునే వారు. ఒకరోజు బానిస ఏదో తెచ్చిస్తే అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) దాన్ని తీసుకొని తిన్నారు. కాసేపయిన తరువాత బానిస ఆయనతో, "మీరు తిన్నదేమిటో తెలుసా?" అని అడిగాడు. "ఏమిటో చెప్పు" అన్నారు అబూబక్ర్ (రదియల్లాహు అన్హు). దానికతను, "అజ్ఞానకాలంలో నేను ఒకతనికి జోస్యం చెప్పాను. అసలు జోతిష్యం అంటే ఏమిటో సరిగ్గా నాక్కూడా తెలియదు. నేను అతనికి ఏదో చెప్పి మోసపుచ్చాను. ఇవ్వాళ అతను నన్ను కలుసుకొని ఈ వస్తువు ఇచ్చాడు. అందులో కొంత మీకిస్తే మీరు దాన్ని తిన్నారు" అని చెప్పాడు.

ఆ మాట వినగానే అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) చేతిని నోట్లోకి దోపుకొని కడుపులోకి దిగిపోయిన దాన్ని కూడా బయటికి కక్కేశారు. (బుఖారీ)

బానిస తాను సంపాదించిన ధనంలో కొంతభాగం (పన్నురూపంలో) యజమానికి ఇచ్చుకోవలసి ఉంటుంది. దానినే 'ఖరాజ్' అంటారు. 'ఖరాజ్' పోగా మిగిలినదంతా బానిసకే చెందుతుంది.

(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: Abu Bakr (radiyallahu anhu) had a slave who brought him his earnings and Abu Bakr (radiyallahu anhu) would eat from it. One day he brought him something and when Abu Bakr (radiyallahu anhu) had eaten some of it, the slave asked him whether he knew where he had got that (food) from, Abu Bakr (radiyallahu anhu) asked what it was, and he replied: I acted as a soothsayer for a man in the pre-Islamic period, and not being good at it, I deceived him; today he met me and he rewarded me for that soothsaying what you have eaten. Abu Bakr (radiyallahu anhu) put his hand in his mouth and vomited up all that he had eaten.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో జోతిష్య వ్యాపారం చాలా జోరుగా సాగుతుండేది. ఇస్లాం ధర్మం వచ్చిన తరువాత జ్యోతిష్యాన్ని, జ్యోతిష్యం ద్వారా ధనం ఆర్జించటాన్ని నిషిద్ధపరచటం జరిగింది. అందుకే బానిస తనకు ఇచ్చిన ఆహార పదార్థం జోస్యం చెప్పి ఆర్జించినదని తెలియగానే అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తిన్నది కూడా బయటికి కక్కేశారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 594

595

హదీసు 595

وعن نافِعٍ أَنَّ عُمَرَ بنَ الخَطَّابِ رَضيَ اللَّهُ عَنْهُ، كَانَ فَرَضَ للْمُهاجِرِينَ الأَوَّلِينَ أَربَعَةَ آلافٍ، وفَرَضَ لابْنِهِ ثلاثةَ آلافٍ وخَمْسَمائةٍ، فَقِيلَ لَهُ: هُوَ مِنَ المُهاجِرِينَ فَلِم نَقَصْتَهُ؟ فَقَالَ: إِنَّما هَاجَر بِهِ أَبُوه يَقُولُ: لَيْسَ هُوَ كَمَنْ هَاجَرَ بِنَفْسِهِ. رواهُ البخاري.

హజ్రత్ నాఫే (రహిమహుల్లాహ్) కథనం : హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అగ్ర ముహాజిర్లకు (సంవత్సరానికి) నాల్గువేల దిర్హంల వేతనం నిర్ణయించారు. తన కుమారునికి మాత్రం మూడున్నర వేలే నిర్ణయించారు. ఎవరో దీని గురించి ఆయనతో మాట్లాడుతూ, "మీ కుమారుడు కూడా ముహాజిరే కదా! ఆయన వేతనం ఎందుకని తగ్గించారు?" అని అడగ్గా, అందుకాయన "అతణ్ణి అతని తండ్రి హిజ్రత్ చేయించాడు" అని అన్నారు. అతను స్వయంగా హిజ్రత్ చేసిన వారిలాంటివాడు కాడని ఆయన అభిప్రాయం.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం)

English

Nafi` (radiyallahu anhu) reported: `Umar bin Al-Khattab (radiyallahu anhu) fixed the payment amounting to four thousand dirhams for each of the early Emigrants, but for his son, he fixed only three thousand five hundred. He was asked: “He is also an (early) Emigrant, why have you fixed a lesser sum for him?” He said: “It was his father who took him along with him. He is not like one who emigrated by himself.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి నీతినిజాయితీలు, ఇహలోకపు సిరిసంపదల పట్ల ఆయన అనాసక్తతా భావం వివరించబడ్డాయి. ఆయన తన కుమారునికి ఇతర ముహాజిర్ల కంటే ఐదువందల దిర్హమ్‌లు తక్కువ వేతనం నిర్ణయించారు. ముహాజిర్లు అంటే ఇతర దేశాల నుంచి ఇస్లామీయ రాజ్యానికి వలస వచ్చినవారు. స్వయాన ఉమర్ మరియు ఆయన కుమారుడు అబ్దుల్లాహ్ కూడా ఆ విధంగా వలస వచ్చినవారే. ఆ కాలంలో ముహాజిర్లకు ప్రభుత్వ ధనాగారం నుంచి ఉపకార వేతనాలు ఇవ్వబడేవి. ఆ ఉపకార వేతనాలను ఖలీఫా నిర్ణయిస్తాడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా ఎన్నికైనప్పుడు ఆయన తన కుమారునికి ఇతర ముహాజిర్ల కంటే తక్కువ వేతనం నిర్ణయించారు. అలా ఎందుకు చేశారని ప్రజలు అడగ్గా "నా కొడుకు ఒంటరిగా హిజ్రత్ చేసి ఇక్కడికి రాలేదు. అతను నా వెంట వచ్చాడు" అని చెప్పారు.

కాని ఈ రోజుల్లో ముస్లిం దేశాలమీద పడి భక్షిస్తున్న పాలక మహాశయుల జీవితాల వైపు ఒకసారి చూడండి. తమ బంధుమిత్రులకే హోదాలు, తమ పార్టీవారికే పదవులు, తమ అడుగులకు మడుగులొత్తేవారి కోసం, తమ అవినీతికి కొమ్ముకాసేవారి కోసమే జాతీయ వనరులన్నీ వెచ్చిస్తారు. సామాన్య ప్రజల సమస్యలు, పేదోళ్ల కష్టాలు వారికి అస్సలు పట్టవు. ప్రతి పనిలోనూ సొంతలాభాలు అంచనా వేసుకునే స్వార్థపరులయ్యారు నేటి మన నాయకులు!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 595

596

హదీసు 596

وعن عطِيَّةَ بنِ عُرْوةَ السَّعْدِيِّ الصَّحَابِيِّ رضيَ اللَّه عنهُ قالَ. قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "لايبلغ العبدُ أَنْ يَكُونَ منَ المُتَّقِينَ حَتَّى يَدَعَ مالا بَأْس بِهِ حَذراً لما بِهِ بَأْسٌ". رواهُ الترمذي وقال: حديثٌ حسن.

హజ్రత్ అతియ్యా బిన్ ఉర్వా సాదీ సహాబీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : దోషపూరిత విషయాలనుండి తన్ను తాను కాపాడుకునేందుకు (కొన్ని) దోషరహిత విషయాలకు కూడా దూరంగా ఉండనంతవరకూ మనిషి దైవభీతిపరుల స్థాయికి చేరుకో లేడు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు).

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం)

షేఖ్ అల్‌బానీ గారు ఈ హదీసుని బలహీనమైనదిగా ఖరారు చేశారు. వివరాల కోసం ఖర్‌జావీ గారి "అల్ హలాల్ వల్ హరామ్" పుస్తకం 178వ పేజీ చూడండి.

English

`Atiyyah bin `Urwah As-Sa`di (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “No one will attain complete righteousness until he abandons (certain) unobjectionable (but doubtful) things so as to remain on his guard against something objectionable.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

సందేహాస్పద విషయాలకు దూరంగా ఉండటం దైవభీతిపరులకు చాలా అవసరమనీ, అది వారి లక్షణమని ఈ హదీసులో నొక్కిచెప్పబడింది. ఆధారాల రీత్యా ఈ హదీసు బలహీనమైనది అయినప్పటికీ ఇందులోని విషయం ఇతర ప్రామాణిక హదీసుల్లో వివరించబడిన విషయమే కనుక దానిని అంగీకరించవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|68. సందేహాస్పద విషయాల జోలికి పోరాదు|హదీసు 596