హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 47. దైవానికిష్టమయిన దాసుని లక్షణాలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 47వ అధ్యాయం: దైవానికిష్టమయిన దాసుని లక్షణాల గురించి, అటువంటి లక్షణాలను అలవరచుకోవటానికి ప్రయత్నించటం గురించి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 387 – 389) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

47. దైవానికిష్టమయిన దాసుని లక్షణాల గురించి, అటువంటి లక్షణాలను అలవరచుకోవటానికి ప్రయత్నించటం గురించి….

↑ విషయ సూచిక

باب علامات حب الله تَعَالَى للعبد والحثَّ عَلَى التخلق بِهَا والسعي في تحصيلها

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ} [آل عمران:٣١]

"ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు : మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడూ అనన్యంగా కరుణించేవాడూను." (ఆలి ఇమ్రాన్ : 31)

ఇంకొకచోట ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు:

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَنْ يَرْتَدَّ مِنْكُمْ عَنْ دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلا يَخَافُونَ لَوْمَةَ لائِمٍ ذَلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ} [المائدة:٥٤]

"విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మంనుడి వైదొలగిపోతే (పోవచ్చు), అల్లాహ్ ఇంకా ఎంతోమందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. ఆయన అపారమైన సాధన సంపత్తికి యజమాని, సర్వమూ తెలిసినవాడు." (అల్ మాయిదా : 54)

వివరణ

దేవుడిని అభిమానించేవారు దైవప్రవక్తకు విధేయత చూపుతారు. దైవప్రవక్త చూపిన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఆయన్ని అనుసరించకుండా, ఆయన విధానానికి విలువ ఇవ్వకుండా దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే అది ఒట్టి బూటకమే అవుతుంది. దేవుడు కూడా తన ప్రవక్తను అనుసరించేవారినే యిష్టపడతాడు. కనుక దైవప్రసన్నతను చూరగొనాలంటే దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించటమే ఏకైక మార్గమని గ్రహించాలి.

ఇకపోతే దైవాన్ని అభిమానించేవారు పై రెండవ సూక్తిలో పేర్కొనబడిన గుణగణాలను అలవరచుకోవాలి. విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ వ్యవహరించాలి. దేవుని మార్గంలో ఎదురయ్యే కష్టాలను, కడగండ్లను సహనస్థయిర్యాలతో ఎదుర్కోవాలి. ఇలాంటి సద్గుణాలను అలవరచుకోకుండా ఎవరూ దైవ సామీప్యాన్ని, ఆయన ప్రసన్నతను పొందలేరు.

English

“Say (O Muhammad ﷺ to mankind): `If you (really) love Allah then follow me (i.e., accept Islamic Monotheism, follow the Qur’an and the Sunnah), Allah will love you and forgive you of your sins. And Allah is Oft-Forgiving, Most Merciful.”’ [Āl ‘Imrān 3:31]

“O you who believe! Whoever from among you turns back from his religion (Islam), Allah will bring a people whom He will love and they will love Him; humble towards the believers, stern towards the disbelievers, fighting in the way of Allah, and never afraid of the blame of the blamers. That is the Grace of Allah which He bestows on whom He wills. And Allah is All-Sufficient for His creatures’ needs, All-Knower.” [Al-Mā’idah 5:54]

387

హదీసు 387

وعن أَبي هريرة رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ اللَّه تَعَالَى قَالَ: مَنْ عادَى ليَ ولِيّاً، فقدْ آذَنْتُهُ بِالحَرْبِ، ومَا تَقَرَّبَ إِليَّ عَبْدِي بِشَيءٍ أَحَبَّ إِلَيَّ مِمَّا افْتَرَضْتُ عَلَيْهِ، وَمَا يَزَالُ عَبْدِي يَتَقَرَّبُ إِلَيَّ بِالنَّوَافِلِ حَتَّى أُحِبَّهُ، فَإذَا أَحْببْتُهُ، كُنْتُ سَمْعَهُ الَّذِي يَسْمَعُ بِهِ، وَبَصَرَهُ الَّذِي يُبْصِرُ بِهِ، ويَدَهُ الَّتي يبْطِشُ بِهَا، وَرجْلَهُ الَّتي يَمْشِي بِها وإنْ سَأَلَني أَعْطَيْتُهُ، وَلَئِنْ اسْتَعَاذَنِي لأُعِيذَنَّهُ" رواه البخاري. معنى"آذَنْتُهُ": أَعْلَمْتُهُ بِأَنِّي مُحَارِبٌ لَهُ. وقوله:"اسْتَعَاذَني"روي بالباءِ وروي بالنون.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ దేవుడు ఇలా అంటున్నాడని తెలియజేశారు :

"ఎవరైనా నా మిత్రుణ్ణి ద్వేషిస్తే నేనతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నా దాసుడు నేను విధించిన పనుల్ని (ఫర్జ్‌లను) నిర్వర్తించి నా సామీప్యం పొందాలనుకుంటే, దాన్ని నేను అన్నింటికన్నా ఎక్కువగా యిష్టపడతాను. (వాటితోపాటు) నా దాసుడు స్వచ్ఛంద ఆరాధనల (నవాఫిల్) ద్వారా కూడా నా సామీప్యాన్ని పొందటానికి కృషి చేస్తూ ఉంటాడు. అది చూసి నేనతన్ని ప్రేమించటం మొదలుపెడతాను. నేను గనక అతన్ని ప్రేమించానంటే నేనతను వినే చెవినైపోతాను, అతను చూసే కన్ను నయిపోతాను, అతను పట్టుకునే చేయినైపోతాను, అతను నడిచే కాలునైపోతాను. అతను నన్నేదయినా అడిగితే తప్పకుండా ఇస్తాను. అతను శరణు కోరితే తప్పకుండా నేనతనికి శరణు ఇస్తాను.

(బుఖారీ)

'ఆజంతుహూ' అంటే నేనతనితో యుద్ధం ప్రకటిస్తున్నానన్న సంగతి అతనికి తెలియజేస్తాను అని అర్థం. 'ఇస్తఆజనీ' అన్న పదం 'ఇస్తఆజబీ' అని కూడా ఉల్లేఖించబడింది. రెండింటికీ ఒకే అర్థం వస్తుంది.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Allah, the Exalted, has said: `I will declare war against him who treats with hostility a pious worshipper of Mine. And the most beloved thing with which My slave comes nearer to Me, is what I have enjoined upon him; and My slave keeps on coming closer to Me through performing Nawafil (voluntary prayers or doing extra deeds besides what is obligatory) until I love him, (so much so that) I become his hearing with which he hears, and his sight with which he sees, and his hand with which he strikes, and his leg with which he walks; and if he asks Me something, I will surely give him, and if he seeks My Protection (refuge), I will surely protect him”.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

దేవుని మిత్రులు (ఔలియా అల్లాహ్) అనదగిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఈ హదీసులో పొందుపరచబడ్డాయి. పరిపూర్ణ భక్తీ విశ్వాసాలు కలిగివున్న వ్యక్తి మాత్రమే దేవుని మిత్రుడు (వలీ) అని పిలువబడటానికి అర్హుడు. దివ్య ఖుర్‌ఆన్‌లో దేవుని మిత్రుల లక్షణాలను గురించి వివరిస్తూ వారు విశ్వాసులు, దైవభక్తిపరులు, ధర్మపరాయణులై ఉంటారని చెప్పబడింది. దాని ప్రకారం చూస్తే దైవభీతిపరుడైన ప్రతి విశ్వాసి దేవుని మిత్రుడే అవుతాడు. దేవుని మిత్రులంటే ఆకాశం నుండి దిగివచ్చిన వారేమీ కారు. వాళ్ళూ అందరిలాంటి మనుషులే. భక్తీ విశ్వాసాలు తప్ప వారిలో మానవాతీత లక్షణాలేమీ ఉండవు.

కొంతమంది అమాయకులు దేవుని మిత్రులంటే మానవాతీత వ్యక్తులనీ, వారిలో అసామాన్య శక్తులుంటాయనీ, వారు అద్భుతాలు, మహిమలు సృష్టించగలవారయి ఉంటారని తలపోస్తుంటారు. ధర్మంతో ఏమాత్రం సంబంధం లేకుండా, కనీసం తమ శరీర శుభ్రత గురించయినా పట్టించుకోకుండా బజారుల వెంబడి తిరిగే పిచ్చివాళ్ళని పట్టుకొని దేవుని మిత్రులని అంటుంటారు. ఇది ప్రజల మూర్ఖత్వం కాకపోతే ఏమిటి?! మతి స్థిమితం లేని పిచ్చివాళ్లు, ధర్మాదేశాల్ని పట్టించుకోని వాళ్ళు 'ఔలియా అల్లాహ్' ఎలా కాగలగుతారు? వాస్తవానికి దేవుని మిత్రులనదగినవారు దైవాదేశాల్ని, దైవప్రవక్త సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. దైవభీతి, ధర్మపరాయణతలు మూర్తీభవించిన వ్యక్తిత్వం గలవారయి ఉంటారు. అలాంటి దేవుని ప్రియదాసుల్ని ద్వేషించటం, వారితో వైరాన్ని పెంచుకోవటం దేవునితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటంతో సమానం. పరిపూర్ణ విశ్వాసం గలవారు దేవుని దృష్టిలో కూడా ఆదరణీయులుగా పరిగణించబడతారు.

విశ్వాసి దేవుని విధుల్ని పాటిస్తూ, స్వయంగా తన తరపునుండి కూడా (నఫిల్) ఆరాధనలు చేస్తూ దైవసామీప్యాన్ని పొందటానికి కృషి చేస్తూ ఉంటాడు. ఆ విధంగా కృషిచేసి అతను చివరకు దైవప్రసన్నతను చూరగొంటాడు. దేవుడు అతన్ని తన ప్రియదాసుడిగా చేసుకుంటాడు. అతనికి ప్రత్యేక రక్షణ కల్పిస్తాడు. వారి అవయవాల ద్వారా చెడుపనులు జరగకుండా కాపాడతాడు. ఇక ఆ దాసుడు ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా దైవాభీష్టాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. దేవుడు అసహ్యించుకునే విషయాల జోలికి పోకుండా తన్ను తాను కాపాడుకోగల్గుతాడు. దేవుడు దాసుని కన్ను, చెవి, చెయ్యి, కాలు అయిపోవడమంటే భావం ఇదే!

కాని బహుదైవారాధకులు కొందరు దేవుడు నిజంగానే వలీల చెవులుగా, కళ్ళుగా, కాళ్ళుగా రూపుచెందుతాడని, వారిలో అంతర్లీనమైపోతాడని ఆఖరికి ఈ వలీలే భగవదవతారం ఎత్తుతారని ఈ హదీసుకు వక్రభాష్యం చెబుతుంటారు. ఇలాంటివారు దేవునితోపాటు ఎవరినయినా ప్రార్థించవచ్చని అంటారు. సహాయం అవసరమైనప్పుడు, యా అల్లాహ్ అనే బదులు యా ముహమ్మద్!, యా అలీ! యా హుసైన్! యా అబ్దుల్ ఖాదిర్! అని కూడా అర్థిస్తారు. నిజానికి ఇదంతా మార్గభ్రష్టతే. ఇంకా చెప్పాలంటే ఇది 'షిర్క్' (అంటే దైవానికి ఇతరుల్ని సాటి కల్పించటం)తో సమానం.

ఆరాధనలన్నిటిలో విధులకు (ఫర్జ్‌లకు) ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని విధులను పాటిస్తూ, దైవ సామీప్యాన్ని పొందే మార్గం ఇతర మార్గాలన్నిటికన్నా దేవునికి అత్యంత ప్రియమైనది. ఎందుకంటే ఫర్జ్ ఆరాధనలు ధర్మానికి పునాదుల్లాంటివి. పునాది గట్టిగా లేకపోతే కట్టడం కూడా బలహీనంగానే ఉంటుంది. అదేవిధంగా విధుల్ని నిర్వర్తించకుండా కేవలం నఫిల్ ఆరాధనలు చేస్తే దానివల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. ఫర్జ్‌లను నిర్వర్తించనివాడు అసలు ముస్లిం అని చెప్పటానికి అనర్హుడు. ఫర్జ్ ఆరాధనల్ని వదలిపెట్టేవారికి ఖుర్‌ఆన్ హదీసుల్లో ఎన్నో హెచ్చరికలు చేయబడ్డాయి. కాని నఫిల్ ఆరాధనల్ని వదలిపెట్టిన వారిని తప్పుపట్టడం జరగదు. అయితే ఫర్జ్‌లతో పాటు నఫిల్ కార్యాలు కూడా పాటిస్తే దాని ప్రయోజనం మరింత ఎక్కువవుతుంది. దైవ సన్నిధిలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది, అలాంటి వారే దేవుని మిత్రులవుతారు.

దేవుడు తన ప్రియదాసుల ప్రార్థనల్ని తప్పకుండా అంగీకరిస్తాడు. వారు కోరింది ఇవ్వటానికి సదా సిద్ధంగా ఉంటాడు. అయితే ప్రార్థన స్వీకరించబడుతుందంటే తక్షణమే వారు అనుకున్నది జరిగిపోతుందని అర్థం ఎంతమాత్రం కాదు. దేవుడు పరిస్థితుల ఉచితానుచితాలను బట్టి త్వరగాగాని లేదా కొంచెం ఆలస్యంగాగాని వారి ప్రార్థనల్ని స్వీకరిస్తాడన్నదే దాని భావం!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|47. దైవానికిష్టమయిన దాసుని లక్షణాల గురించి, అటువంటి లక్షణాలను అలవరచుకోవటానికి ప్రయత్నించటం గురించి….|హదీసు 387

388

హదీసు 388

وعنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَالَ: "إِذَا أَحَبَّ اللَّهُ تَعَالَى العَبْدَ، نَادَى جِبْريل: إِنَّ اللَّه تَعَالَى يُحِبُّ فُلاناً، فَأَحْبِبْهُ، فَيُحبُّهُ جِبْريلَ، فَيُنَادى في أَهْلِ السَّمَاء: إِنَّ اللَّه يُحِبُّ فُلاناً، فَأَحِبوهُ، فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ، ثُمَّ يُوْضَعُ لَهُ القَبُولُ في الأَرْضِ" متفقٌ عليه. وفي رواية لمسلمٍ: قال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ اللَّه تَعَالَى إِذا أَحبَّ عبْداً دَعا جِبْريلَ، فقال: إِنِّي أُحِبُّ فُلاناً فَأَحْبِبْهُ، فَيُحِبُّهُ جِبْريلُ، ثُمَّ يُنَادِي في السَّماءِ، فَيَقُولُ: إِنَّ اللَّه يُحِبُّ فُلاناً، فَأَحِبُّوهُ فَيُحبُّهُ أَهْلُ السَّمَاءِ ثُمَّ يُوضَعُ لَهُ القَبُولُ في الأَرْضِ، وإِذا أَبْغَضَ عَبداً دَعا جِبْريلَ، فَيَقولُ: إِنِّي أُبْغِضُ فُلاناً، فَأَبْغِضْهُ، فَيُبْغِضُهُ جِبْريلُ، ثُمَّ يُنَادِي في أَهْلِ السَّماءِ: إِنَّ اللَّه يُبْغِضُ فُلاناً، فَأَبْغِضُوهُ، فَيُبْغِضُهُ أَهْلُ السَّماءِ ثُمَّ تُوضَعُ لَهُ البَغْضَاءُ في الأَرْضِ ".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: దేవుడు తన దాసుడ్ని ప్రేమించినప్పుడు, "దేవుడు ఫలానా దాసుడ్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా అతన్ని ప్రేమించు" అని జిబ్రయీల్ దూతకు చెబుతాడు. దైవాదేశం మేరకు జిబ్రయీల్ కూడా ఆ దాసుడ్ని ప్రేమించటం మొదలుపెడతారు. ఆ తరువాత ఆయన నింగినున్న వారి ముందు, "దేవుడు ఫలానా దాసుణ్ణి ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా అతడిని ప్రేమించండి" అని అంటారు. దాంతో ఆ దాసుడ్ని నింగినున్న వారు కూడా ప్రేమించడం మొదలుపెడతారు. తరువాత నేలనున్న వారిలోనూ అతనికి ఆదరణ లభిస్తుంది. (బుఖారీ – ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దేవుడు ఏ దాసుడినయినా ప్రేమించినప్పుడు జిబ్రయీల్ దూతను పిలిచి, "నేను ఫలానా దాసుడ్ని ప్రేమిస్తున్నాను. కనుక నువ్వు కూడా అతన్ని ప్రేమించాలి" అని అంటాడు. దేవుని ఆదేశం విని జిబ్రయీల్ కూడా ఆ వ్యక్తిని ప్రేమించటం మొదలుపెడతారు. ఆ తరువాత నింగినున్న వారితో, "దేవుడు ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కనుక మీరు కూడా అతన్ని ప్రేమించండి" అని జిబ్రయీల్ చెబుతారు. దాంతో నింగినున్నవారూ అతన్ని ప్రేమిస్తారు. తరువాత అతనికి నేలనున్నవారిలోనూ ఆదరణ లభిస్తుంది.

అదేవిధంగా దేవుడు ఏ దాసుడినయినా ద్వేషించినప్పుడు జిబ్రయీల్ దూతను పిలిచి "నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా అతణ్ణి ద్వేషించు" అని అంటాడు. దేవుని ఆజ్ఞ మేరకు జిబ్రయీల్ కూడా అతన్ని ద్వేషిస్తారు. తరువాత ఆయన నింగినున్న వారి ముందు, "దేవుడు ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా అతన్ని ద్వేషించండి" అని ప్రకటిస్తారు. దాంతో నింగినున్న వారు కూడా అతన్ని ద్వేషిస్తారు. ఆ తరువాత నేలనున్న వారిలో కూడా అతని పట్ల ద్వేషభావం పుడుతుంది."

(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When Allah loves a slave, calls out Jibril and says: `I love so-and-so; so love him’. Then Jibril loves him. After that he (Jibril) announces to the inhabitants of heavens that Allah loves so-and-so; so love him; and the inhabitants of the heavens (the angels) also love him and then make people on earth love him”.[Al-Bukhari and Muslim].

Another narration of Muslim is: Messenger of Allah, ﷺ said: “When Allah loves a slave, He calls Jibril (Gabriel) and says: `I love so-and-so; so love him.’ And then Jibril loves him. Then he (Jibril) announces in the heavens saying: Allah loves so-and-so; so love him; then the inhabitants of the heavens (the angels) also love him; and then people on earth love him. And when Allah hates a slave, He calls Jibril and says: `I hate so-and-so, so hate him.’ Then Jibril also hates him. He (Jibril) then announces amongst the inhabitants of heavens: `Verily, Allah hates so-and-so, so you also hate him.’ Thus they also start to hate him. Then he becomes the object of hatred on the earth also”. [Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దేవుని ప్రియదాసులకు లభించే ప్రతిఫలం ఏమిటో ఈ హదీసులో వివరించబడింది. దేవుని అభిమానానికి పాత్రుడైన వాడు నింగినున్న వారిలోనూ, నేలనున్న వారిలోనూ ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. దీనికి విరుద్ధంగా దేవుని ఆగ్రహానికి గురయినవాడికి రెండు లోకాల్లోనూ పరాభవమే మిగులుతుంది. ప్రాపంచిక జీవితంలో ఎవరయినా ప్రేమాభిమానాలకు పాత్రులు కాగలిగారంటే వారి నైజంలో ఉన్న మంచితనం, సాధుస్వభావం మూలంగానే వారు ఆ స్థితికి ఎదిగారని గమనించాలి. అంటే వారు మంచిని మంచిగా, చెడును చెడుగానే తలపోస్తారు. అయితే మనిషి నిరంతరం పాపాలకు పాల్పడుతూపోతే క్రమక్రమంగా అతని నైజం (గుణం, స్వభావం) కూడా మారిపోతుంది. అదేగనక జరిగితే అతడు మంచిని చెడుగా, చెడును మంచిగా నమ్మే నికృష్ట స్థితికి దిగజారుతాడు. అట్టి పరిస్థితిలో లోకంలో అతని నిర్ణయాలకు, అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇలాంటి పాపాత్ములు సాధారణంగా సజ్జనులను యిష్టపడరు. దుర్మార్గుడు ఎల్లప్పుడూ దుర్మార్గుల స్నేహాన్నే కోరుకుంటాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|47. దైవానికిష్టమయిన దాసుని లక్షణాల గురించి, అటువంటి లక్షణాలను అలవరచుకోవటానికి ప్రయత్నించటం గురించి….|హదీసు 388

389

హదీసు 389

وعن عائشةَ رضي اللَّهُ عنها، أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، بعَثَ رَجُلاً عَلَى سرِيَّةٍ، فَكَانَ يَقْرأُ لأَصْحابِهِ في صلاتِهِمْ، فَيخْتِمُ ب {قُلْ هُوَ اللَّهُ أَحَدٌ} فَلَمَّا رَجَعُوا، ذَكَروا ذلكَ لرسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ: "سَلُوهُ لأِيِّ شَيءٍ يَصْنَعُ ذلكَ؟ "فَسَأَلوه، فَقَالَ: لأنَّهَا صِفَةُ الرَّحْمَنِ، فَأَنَا أُحِبُّ أَنْ أَقْرَأَ بِهَا، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"أَخْبِرُوهُ أَنَّ اللَّه تعالى يُحبُّهُ" متفقٌ عليه.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ఒకాయన్ని ఒకానొక సైనికపటాలానికి నాయకునిగా నియమించి పంపారు. ఆయన తన తోటి సైనికులకు నమాజు చేయించినప్పుడల్లా ఖుర్‌ఆన్ పారాయణం చేసినప్పుడు చివరగా "ఖుల్‌హువల్లాహు అహద్" (సూరా తప్పకుండా) చదివేవారు. సైనికదళం తిరిగి వచ్చిన తరువాత అందులోని సైనికులు దైవప్రవక్తకు ఈ విషయం చెప్పారు. అందుకాయన "ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తాడో అడగండి" అని అన్నారు. వాళ్ళు ఆయన్ని ఈ విషయం గురించి అడగ్గా, "ఇందులో కరుణామయుని గుణాలు పొందుపరచబడ్డాయి. అందుకే దాన్ని (ఎక్కువగా) చదవటాన్ని నేను యిష్టపడతాను" అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు ఆయన "మరయితే దేవుడు కూడా అతన్ని యిష్టపడుతున్నాడని అతనికి తెలియజేయండి" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ తౌహీద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah, ﷺ appointed a man in charge of an army unit who led them in Salat (prayer); he always concluded his recitation with Surat Al-Ikhlas: “Say (O Muhammad ﷺ): ‘He is Allah, (the) One. Allah-us-Samad (Allah – the Self-Sufficient). He begets not, nor was He begotten. And there is none equal or comparable to Him.”’ (112:1-4) Upon their return to Al-Madinah, they mentioned this to Messenger of Allah ﷺ, who said, “Ask him why he does so?” He was asked and he said, “This Surah contains the Attributes of Allah, the Gracious, and I love to recite it. Messenger of Allah ﷺ then told them, “Tell him that Allah loves him”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దేవుని గుణగణాలతో నిండివున్న దివ్య ఖుర్‌ఆన్ సూక్తుల్ని, సూరాల్ని యిష్టపడటం, వాటిని మాటిమాటికీ పఠిస్తూ ఉండటం ద్వారా కూడా దైవాభిమానాన్ని చూరగొనవచ్చు. ఈ హదీసు ద్వారా బోధపడుతున్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే, నమాజులోని ప్రతి రకాత్‌లో ఖిరాత్ (దివ్య ఖుర్‌ఆన్ పారాయణం) చేసినప్పుడు చివరగా "ఖుల్‌హువల్లాహు అహద్" సూరా పఠించటం ధర్మసమ్మతమే. ఇందులో షరీఅత్‌పరమైన ఆంక్షలేమీ లేవు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|47. దైవానికిష్టమయిన దాసుని లక్షణాల గురించి, అటువంటి లక్షణాలను అలవరచుకోవటానికి ప్రయత్నించటం గురించి….|హదీసు 389