హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 366వ అధ్యాయం: రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1802 – 1803) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
366. రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం
باب النهي عن صمت يومٍ إلَى الليل
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1802
عَنْ عليٍّ رضي اللَّه عَنْهُ قالَ: حَفِظْتُ عَنْ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لاَ يُتْمَ بَعْدَ احْتِلامٍ، وَلا صُمَاتَ يَوْمٍ إِلَى اللَّيْلِ "رواه أَبُو داود بإسناد حسن. قالَ الخَطَّابي في تفسيرِ هَذَا الحديثِ: كَانَ مِنْ نُسُكِ الجاهِلِيَّة الصّمَاتُ، فَنُهُوا في الإسْلامِ عَنْ ذلكَ، وأُمِرُوا بِالذِّكْرِ وَالحَدِيثِ بالخَيْرِ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: "వయోజనులైన తర్వాత అనాధతనం ఉండదు. పగలు నుంచి రాత్రిదాకా మౌనవ్రతం పాటించే ఆచారానికి (షరీఅత్లో) ఎలాంటి విలువ లేదు" అనే విషయాలు నేను దైవప్రవక్త ﷺ నుంచి విని గుర్తుపెట్టుకున్నాను.
(అబూదావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు)
ఇమామ్ ఖత్తాబీ ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు: అజ్ఞానకాలం నాటి ఆరాధనల్లో మౌనవ్రతం కూడా ఉండేది. ఇస్లాం దీనిని నిషేధించి, "(మౌనంగా ఉండే బదులు) దేవుణ్ణి కీర్తించండి, మంచి మాటలు మాట్లాడండి" అని ఆదేశించింది.
(సుననె అబూదావూద్లోని వసాయా ప్రకరణం)
English
`Ali (radiyallahu anhu) said: I have retained in my memory the saying of the Messenger of Allah ﷺ that: “No one is considered an orphan after he has attained the age of maturity; and it is unlawful to remain silent from dawn till night.”[Abu Dawud with Hasan (good) Isnad].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|366. రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం|హదీసు 1802
హదీసు 1803
وعَنْ قيس بن أَبي حازِمٍ قالَ:"دَخَلَ أبُو بكرٍ الصِّدِّيقُ رضي اللَّه عَنْهُ عَلَى امْرَأَةٍ مِنَ أحْمَسَ يُقَالُ لهَا: زَيْنَبُ، فَرَآهَا لا تَتَكَلَّم. فقالَ:"مَالهَا لا تَتَكَلَّمُ"؟ فقالُوا: حَجَّتْ مُصْمِتَةً، فقالَ لهَا:"تَكَلَّمِي فَإِنَّ هَذَا لاَ يَحِلُّ، هَذَا منْ عَمَلِ الجَاهِلِية"، فَتَكَلَّمَت. رواه البخاري.
హజ్రత్ ఖైస్ బిన్ అబూ హాజిమ్ (రదియల్లాహు అన్హు) కథనం: అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) జైనబ్ అనబడే ఒకానొక అహ్మస్ తెగ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. చూస్తే ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు. అది గమనించి ఆయన "ఈవిడ మాట్లాడదు ఎందుకని?" అని జనాన్ని అడిగితే, "తను (ఎవరితోనూ) మాట్లాడనని మొక్కుకుంది" అని చెప్పారు జనం. అది విని ఆయన ఆ మహిళను ఉద్దేశించి "మాట్లాడు. మౌన వ్రతం ధర్మసమ్మతం కాదు. ఇది అజ్ఞానకాలపు ఆచారం" అని చెప్పారు. అప్పట్నుంచి ఆమె (మౌనవ్రతాలు మాని) మాట్లాడటం మొదలెట్టింది. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని మనాఖిబుల్ అన్సార్ ప్రకరణం)
English
Qais bin Abu Hazim ¨(radiyallahu anhu)(c) said: Abu Bakr (radiyallahu anhu) came upon a woman named Zainab from the Ahmas tribe and noticed that she was observing total silence. He said: “What has happened to her? Why does she not speak?” People informed him that she had sworn to remain silent. He then said to her: “You should speak, it is not permissible (to observe silence), for it is an act of the Days of Ignorance (Jahiliyyah).” (After hearing this) she started speaking.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
1) అనాధలు బాల్యంలో మాత్రమే అనాధలుగా పరిగణించబడతారు. వయోజనులైన తర్వాత ఎవరినీ అనాధలుగా భావించటం జరగదు. ఇహ్తెలామ్ (నిద్రలో వీర్య స్ఖలనం జరగటం) వయోజన దశగా నిర్ణయించబడింది. అయితే దీనికి నిర్ణీత వయస్సు అనేది ఏదీ లేదు. వివిధ దేశాలకు చెందిన పిల్లలు విభిన్న వయసుల్లో ఇహ్తెలామ్ దశకు చేరుకుంటారు. అక్కడి వాతావరణ పరిస్థితులు దానికి కారణమవుతుంటాయి.
2) అజ్ఞానకాలంలో మౌనవ్రతాన్ని కూడా ఒక ఆరాధనగా, దైవసామీప్యానికి చేరుకునే ఒక మార్గంగా భావించేవారు. ఇటువంటి ఇబ్బందులతో కూడుకున్న ఆరాధనా పద్ధతులకు ఇస్లాంలో అనుమతి లేదు. అందుకని ఆరాధనా ఉద్దేశంతో మౌనంగా ఉండటాన్ని వారించటం జరిగింది. మౌనంగా ఉండటం కన్నా అల్లాహ్ను ధ్యానిస్తూ, ఆయన పవిత్రతను, గొప్పదనాన్ని కీర్తిస్తూ ఉండటం ఎంతో మేలని ఇస్లాం నొక్కివక్కాణిస్తోంది. అయితే అశ్లీలం మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, చాడీలు చెప్పుకోవటం కంటే మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని మాత్రం చెబుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|366. రోజల్లా మౌనవ్రతం పాటించటం నిషిద్ధం|హదీసు 1803
You must be logged in to post a comment.