హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 36వ అధ్యాయం: ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 8 హదీసులు (హదీసు 291 – 298) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం
باب النفقة عَلَى العيال
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{وَعَلَى الْمَوْلُودِ لَهُ رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوفِ} [البقرة:٢٣٣]
"పిల్లల తండ్రి వారి తల్లులను తగురీతిలో భోజన వస్త్రాలను సమకూర్చి పోషించవలసి ఉంటుంది." (అల్ బఖర : 233)
మరోచోట ఇలా సెలవిచ్చాడు :
{لِيُنْفِقْ ذُو سَعَةٍ مِنْ سَعَتِهِ وَمَنْ قُدِرَ عَلَيْهِ رِزْقُهُ فَلْيُنْفِقْ مِمَّا آتَاهُ اللَّهُ لا يُكَلِّفُ اللَّهُ نَفْساً إِلاَّ مَا آتَاهَا} [الطلاق:٧]
"సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చు పెట్టాలి. తక్కువ ఉపాధి ఇవ్వబడిన వ్యక్తి, అల్లాహ్ తనకు ఇచ్చిన ధనం నుంచే ఖర్చుపెట్టాలి. అల్లాహ్ తాను ప్రసాదించిన దానికి మించి ఎవరిపైనా భారం మోపడు." (అత్ తలాఖ్ : 7)
ఇంకొకచోట ఇలా అన్నాడు :
{وَمَا أَنْفَقْتُمْ مِنْ شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ} [سبأ:٣٩]
"మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు." (సబా : 39)
English
“The father of the child shall bear the cost of the mother’s food and clothing on a reasonable basis”. [Al-Baqarah 2:233]
“Let the rich man spend according to his means, and the man whose resources are restricted, let him spend according to what Allah has given him. Allah puts no burden on any person beyond what He has given him”. [Aṭ-Ṭalāq 65:7]
“And whatsoever you spend of anything (in Allah’s Cause), He will replace it”. [Saba’ 34:39]
హదీసు 291
وعن أَبي هريرة رضي اللَّه عنه قال: قال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "دِينَارٌ أَنْفَقْتَهُ في سبيلِ اللَّه، وَدِينَارٌ أَنْفَقتَهُ في رقَبَةٍ، ودِينَارٌ تصدَّقْتَ بِهِ عَلَى مِسْكِينٍ، وَدِينَارٌ أَنْفقْتَهُ علَى أَهْلِكَ، أَعْظمُهَا أَجْراً الَّذي أَنْفَقْتَهُ علَى أَهْلِكَ" رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఒక దీనారుని నువ్వు దేవుని మార్గం (అంటే ధర్మోన్నతి కోసం చేసే కృషి)లో ఖర్చు చేస్తావు. ఒక దీనారుని నువ్వు బానిసకు స్వేచ్ఛ ప్రసాదించటం కోసం ఖర్చు చేస్తావు. మరో దీనారు ఓ అభాగ్యుడికి దానంగా ఇస్తావు. ఇంకో దీనారుని నువ్వు నీ ఆలుబిడ్డలకోసం ఖర్చు పెడతావు. అయితే వీటన్నింటిలో నువ్వు నీ ఆలుబిడ్డల కోసం ఖర్చుపెట్టే దీనారే అత్యంత పుణ్యప్రదమైనది." (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “A dinar you spend in Allah’s way, or to free a slave, or as a charity you give to a needy person, or to support your family, the one yielding the greatest reward is that which you spend on your family”.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు జకాత్ ఇచ్చే స్తోమతలేని తక్కువ ఆదాయంగల వారికి ఉద్దేశించబడినది. అలాంటివారు తమ దగ్గరున్న డబ్బుతో ముందుగా తమ ఆలుబిడ్డల అవసరాలను తీర్చాలి. వారి భోజన వస్త్రాల కోసం డబ్బు ఖర్చుపెట్టాలి. అందులోనే వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. మనిషి ఆలుబిడ్డలపై ఖర్చుపెట్టడం అతని విధి. దీనికి భిన్నంగా దానధర్మాలు చేయటం నఫిల్ (స్వచ్ఛంద) ఆరాధన మాత్రమే. అలాంటప్పుడు విధిని (ఫర్జ్ను) విస్మరించి స్వచ్ఛంద (నఫిల్) ఆరాధనల్ని పాటిస్తే లాభమేంటి? అయితే జకాత్ ఇచ్చే స్థోమత కలిగిన ధనవంతులకు ఈ నిబంధన వర్తించదు. వారి వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంటుంది. స్థోమత కలిగివున్న ధనవంతులు తమ జకాత్ సొమ్మును తమ ఆలుబిడ్డలపై ఖర్చు పెట్టకూడదు. దానిని జకాత్ సొమ్ము పుచ్చుకోవటానికి అర్హులైనవారికే ఇవ్వాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 291
హదీసు 292
وعن أَبي عبدِ اللَّهِ وَيُقَالُ له: أبي عبدِ الرَّحمن ثَوْبانَ بْن بُجْدُدَ مَوْلَى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَفْضَلُ دِينَارٍ يُنْفِقُهُ الرَّجُلُ دِينَارٌ يُنْفِقُهُ عَلَى عِيالِهِ، وَدِينَارٌ يُنْفِقُهُ عَلَى دابَّتِهِ في سبيلِ اللَّه، ودِينَارٌ يُنْفِقُهُ علَى أَصْحابه في سبِيلِ اللَّهِ" رواه مسلم.
దైవప్రవక్త ﷺచే స్వేచ్ఛనొసగబడిన బానిస హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ సౌబాన్ బిన్ బుజ్దుద్ – ఈయన్ని అబూ అబ్దుర్రహ్మాన్ అని కూడా పిలుస్తారు – చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "మనిషి తన ఆలుబిడ్డల కోసం ఖర్చుపెట్టే దీనారు (పుణ్యం రీత్యా) అత్యుత్తమ దీనారు. తరువాత దైవమార్గంలో (ఉపయోగించే) తన వాహనం కోసం ఖర్చుపెట్టేది. ఆ తరువాత దైవమార్గంలో తన సహచరుల కోసం ఖర్చుపెట్టే దీనారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Thauban bin Bujdud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The most excellent dinar is one that a person spends on his family, and the dinar which he spends on his riding-animal in the way of Allah (in Jihad), and the dinar he spends on his companions in the way of Allah”.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు కూడా తక్కువ ఆదాయం గలవారికే వర్తిస్తుంది. చాలీచాలని జీతాలతో బతికేవారు అతిగా దానాలు చేసి ఆలుబిడ్డల్ని ఇబ్బందులకు లోనుచేయటం కూడా మంచిపద్ధతి కాదు. అలాంటి వారు తమ ఆలుబిడ్డల్ని సుఖపెడితే అదే వారి పాలిట గొప్ప దానంగా పరిగణించబడుతుంది. ఆ తరువాత కూడా ఏమైనా మిగిలివుంటే అప్పుడు హదీసులో వివరించబడిన క్రమంలో ఖర్చుపెట్టాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 292
హదీసు 293
وعن أُمِّ سلَمَةَ رضي اللَّهُ عنها قَالَتْ: قلتُ يَا رسولَ اللَّهِ، هَلْ لِي أَجْرٌ فِي بَنِي أَبي سلَمةَ أَنْ أُنْفِقَ علَيْهِمْ، وَلَسْتُ بتَارِكَتِهمْ هَكَذَا وهَكَذَا، إِنَّماهُمْ بنِيَّ؟ فَقَالَ: "نَعَمْ لَكِ أَجْرُ مَا أَنْفَقْتِ علَيهِم" متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : నేనొకసారి దైవప్రపవక్తతో, "దైవప్రవక్తా! నేను (నా భర్త) అబూ సలమా పిల్లల కోసం డబ్బు ఖర్చు పెడితే అందులో నాకు పుణ్యం లభిస్తుందా? వాళ్ళు అటూ ఇటూ అడుక్కుంటూ తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. వాళ్ళు కూడా నా పిల్లలే కదా!" అని అడిగాను. దానికి ఆయన "అవును, నువ్వు వారికోసం ఖర్చు చేస్తున్నదానికి నీకు (తప్పకుండా) పుణ్యం లభిస్తుంది" అని సమాధానమిచ్చారు. (బుఖారీ – ముస్లిం)
(బుఖారీ – ముస్లింలోని జకాత్ ప్రకరణాలు)
English
Umm Salamah (radiyallahu anha) reported: I asked Messenger of Allah ﷺ, “Would I be rewarded for what I spend on Abu Salamah’s sons? For I can’t let them go here and there (to beg people).” Messenger of Allah ﷺ replied, “Spend on them and you will be rewarded for what you spend on them”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
తల్లిదండ్రులు కడుపుతీపితోనే తమ సంతానంపై డబ్బు ఖర్చుపెడతారు. అయినప్పటికీ దేవుడు దానిపై కూడా తల్లిదండ్రులకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కొన్ని సందర్భాల్లోనయితే ఈ పుణ్యం ఇతర దానధర్మాలకన్నా రెట్టింపు అయిపోతుంది. ఇది దేవుని మహదానుగ్రహం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 293
హదీసు 294
وعن سعد بن أَبي وقَّاص رضي اللَّه عنه في حدِيثِهِ الطَّويلِ الذِي قَدَّمْناهُ في أَوَّل الْكِتَابِ في بَابِ النِّيَّةِ أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ لَهُ: " وَإِنَّكَ لَنْ تُنْفِقَ نَفَقَةً تَبْتَغِي بِهَا وَجهَ اللَّه إلاَّ أُجِرْتَ بِهَا حَتَّى مَا تَجْعلُ في فيِّ امرأَتِكَ" متفقٌ عَلَيهِ.
గ్రంథ ప్రారంభంలో సంకల్పానికి సంబంధించిన అధ్యాయం క్రింద మేము పేర్కొన్న సుదీర్ఘ హదీసులో సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ తనతో "నీవు దైవ ప్రసన్నతను బడయటం కోసం ఖర్చుచేసేదానికి నీకు తప్పకుండా పుణ్యం లభిస్తుంది. ఆఖరికి నీవు నీభార్య నోటికందించే దానిపై (ముద్ద) కూడా నీకు పుణ్యం దొరుకుతుంది" అని అన్నారని తెలియజేశారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం; సహీహ్ ముస్లింలోని వీలునామా ప్రకరణం)
English
Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported in a Hadith included in the chapter of Intention, that Messenger of Allah ﷺ said, “Whatever you spend seeking thereby the Pleasure of Allah, will have its reward, even the morsel which you put in the mouth of your wife”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనిషికి సహజంగానే తన ఆలుబిడ్డలపై ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమానురాగాల మూలంగానే అతను వారిని పోషించటానికి కష్టపడతాడు. వారి అవసరాలన్నీ తీరుస్తాడు. వారు సుఖంగా ఉంటే తానూ సంతోషిస్తాడు. అయితే మనిషి ఇదంతా తాను దైవాజ్ఞమేరకే చేస్తున్నానని సంకల్పించుకుంటే చాలు అతని సంతోషం కూడా 'ఆరాధన' అయిపోతుంది. దానిపై అతనికి పుణ్యమూ లభిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 294
హదీసు 295
وعن أَبي مَسْعُودٍ الْبَدرِيِّ رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا أَنْفَقَ الرَّجُلُ عَلَى أَهْلِهِ نفقَةً يحتَسبُها فَهِي لَهُ صدقَةٌ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబూ మస్వూద్ బద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "మనిషి గనక పుణ్యాన్ని ఆశిస్తూ తన భార్యాబిడ్డలపై డబ్బు ఖర్చుపెడితే అది అతని తరపున దానంగా పరిగణించబడుతుంది" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Abu Mas`ud Al-Badri (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When someone spends on his family seeking his reward for it from Allah, it is counted as a charity from him”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
'పుణ్యాన్ని ఆశించడమంటే' దేవుడు తనపై మోపిన ఆలుబిడ్డల పోషణా బాధ్యతను నిర్వహిస్తున్నాననీ, బంధువుల హక్కుల్ని నెరవేర్చాలన్న దైవాజ్ఞను పాటిస్తున్నాననీ, దీనివల్ల దేవుడు తన పట్ల ప్రసన్నుడౌతాడని భావించటం. ఇలా భావించి ఆలుబిడ్డల కోసం డబ్బు ఖర్చుపెడితే దానిపై కూడా పుణ్యం లభిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 295
హదీసు 296
وعن عبدِ اللَّهِ بنِ عمرو بنِ العاصِ رَضي اللَّه عنهما قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كَفي بِالمرْءِ إِثْماً أَنْ يُضَيِّعَ مَنْ يقُوتُ" حديثٌ صحيحٌ رواه أَبو داود وغيره. ورواه مسلم في صحيحه بمعنَاهُ قَالَ: "كَفي بِالمرْءِ إِثْماً أَنْ يَحْبِسَ عَمَّنْ يملِكُ قُوتَهُ".
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : "మనిషి ఒకరి తిండి తిప్పలకు బాధ్యుడై తన (బాధ్యతను) నిర్లక్ష్యం చేయటం చాలు అతను పాపిష్టి మనిషి అని చెప్పటానికి!" (ఈ హదీసు దృఢమైనది. దీనిని అబూదావూద్ వెలికితీశారు.) ఇమామ్ ముస్లిం కూడా దీనిని "మనిషి ఒకరి తిండికి యజమాని అయి అతనికి తిండి పెట్టకుండా ఉండటం చాలు అతను పాపిష్టి మనిషి అని చెప్పటానికి!" అని దైవప్రవక్త ﷺ చెప్పారన్న అర్థంలో ఉల్లేఖించారు.
(సుననె అబూదావూద్ మరియు సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణాలు)
English
`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “Neglecting one’s own dependents is a reason enough for a man to commit a sin”.[Abu Dawud]
The narration in Muslim is: Messenger of Allah ﷺ said, “It is enough sin for a person to hold back the due of one whose provision is in his hand”.
ముఖ్యాంశాలు
ఆలుబిడ్డల పోషణలో నిర్లక్ష్యం వహించటం మహాపాపం. మనిషి కర్మల జాబితాలో ఇతర పాపాలేమీ లేకుండా ఈ ఒక్క పాపం ఉన్నా దానిపై దేవుడు ప్రళయదినాన అతన్ని పట్టుకొని శిక్షిస్తాడు.
ఈ హదీసు భావం ఎంతో విస్తృతమైనది. ఒక్క ఆలుబిడ్డలే గాకుండా పోషణాపరంగా తనపై ఆధారపడివున్న వారందరూ దీనిక్రిందికి వస్తారు. తన అధీనంలో పనిచేసే ఉద్యోగులు, నౌకర్లు, సేవకుల హక్కుల్ని నెరవేర్చే బాధ్యత గనక తనపై ఉంటే యజమాని తప్పకుండా ఆ బాధ్యతను నిర్వర్తించాలి. బాధ్యతా నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యానికి పాల్పడినా దేవుని దృష్టిలో అతను నేరస్థుడిగా పరిగణించబడతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 296
హదీసు 297
وعن أبي هريرةَ رضي اللَّهُ عنه أَن النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا مِنْ يوْمٍ يُصْبِحُ الْعِبَادُ فِيهِ إِلاَّ ملَكَانِ يَنْزلانِ، فَيقولُ أَحدُهُما: اللَّهُمَّ أَعْطِ مُنْفِقاً خَلفاً، ويَقولُ الآخَرُ: اللَّهُمَّ أَعْطِ مُمْسِكاًتَلَفاً"متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు : ప్రతి రోజూ ఇద్దరు దైవదూతలు దిగివస్తారు. వారిలో ఒక దూత, "దేవా! ఖర్చుపెట్టేవాడికి ప్రతిఫలాన్ని ప్రసాదించు!" అని ప్రార్థిస్తే, రెండవ దూత, "దేవా! కూడబెట్టుకునేవాడి సంపదను నాశనం చెయ్యి" అని అంటాడు. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Two angels descend every morning, and one says: `O Allah, give him who spends something, in place of what he spends.’ The other one says: `O Allah, give destruction to him who withholds”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా మంచివారికి మేలు జరగాలని ప్రార్థించటంతోపాటు చెడ్డవారిని శపించటం కూడా ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. ఇంకా దీనిద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టటం పుణ్యప్రదమైనట్లుగానే, అసలు ఖర్చు చేయకుండా పిసినారితనానికి పాల్పడటం కూడా పాపమే. పిసినారితనం మనిషిని దైవశిక్షకు గురిచేస్తుంది. ఇతరులకు ఇవ్వకుండా, తాము అనుభవించకుండా సంపదను వృధాగా నాశనం చేసుకునే పిసినిగొట్టుల్ని మనుషులేకాదు, దైవదూతలు కూడా అసహ్యించుకుంటారు. పిసినారులకు ఎక్కడా విలువ ఉండదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 297
హదీసు 298
وعنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الْيَدُ الْعُلْيا خَيْرٌ مِنَ الْيدِ السُّفْلَى وابْدَأْ بِمَنْ تَعُولُ، وَخَيْرُ الصَّدَقَةِ مَا كَانَ عَنْ ظَهْرِ غِنَى، ومَنْ يَسْتَعِففْ، يُعِفَّهُ اللَّهُ، ومَنْ يَسْتَغْنِ يُغْنِه اللَّهُ" رواه البخاري.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : "పై (ఇచ్చే) చెయ్యి, క్రింది (పుచ్చుకునే) చెయ్యికన్నా శ్రేష్ఠమైనది. డబ్బు ఖర్చుపెట్టేటప్పుడు ముందు నీపై ఆధారపడి ఉన్న వారితో మొదలుపెట్టు. అవసరాలన్నీ తీరిపోయాక చేసే దానమే అత్యుత్తమ దానం. ఎవరైనా ఇతరుల ముందు చేయి చాపకుండా ఉండాలనుకుంటే దేవుడు (తప్పకుండా) వారికా భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా ఎవరైనా నిరపేక్షా భావాన్ని కోరుకుంటే దేవుడు అతన్ని నిరపేక్షాపరునిగా మారుస్తాడు."
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The upper hand is better than the lower one (i.e., the spending hand is better than the receiving hand); and begin (charity) with those who are under your care; and the best charity is that which given out of surplus; and he who asks (Allah) to help him abstain from the unlawful and the forbidden, Allah will fulfill his wish; and he who seeks self-sufficiency will be made self-sufficient by Allah”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
దైవమార్గంలో ఖర్చుపెట్టడం గొప్ప పుణ్య కార్యమే. అయితే తనపై ఆధారపడివున్న వారి అవసరాలను తీర్చకుండా దానధర్మాల్లో డబ్బు ఖర్చుపెట్టడం సముచితం కాదు. ముందు ఆలుబిడ్డలు, మరియు తన అధీనంలో ఉన్నవారి అవసరాలను తీర్చాలి. దేవుని సన్నిధిలో ఇది కూడా దానంగానే పరిగణించబడుతుంది.
మనిషి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఇతరుల ముందు చేయి చాపి అడుక్కోవటం మర్యాదస్తులకు శోభించదు. కనుక నిరపేక్షాభావాన్ని అలవరచుకోవాలి. లేనిదానికోసం వెంపర్లాడకుండా ఉన్నదాంట్లోనే తృప్తిగా బ్రతకాలి. ఆత్మతృప్తిని, నిరపేక్షా భావాన్ని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|36. ఆలుబిడ్డలపై ఖర్చు చేయడం|హదీసు 298
You must be logged in to post a comment.