హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 30వ అధ్యాయం: సిఫారసు చేయటం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 248 – 249) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
30. సిఫారసు చేయటం
باب الشفاعة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{مَنْ يَشْفَعْ شَفَاعَةً حَسَنَةً يَكُنْ لَهُ نَصِيبٌ مِنْهَا} [النساء: ٨٥]
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు: "మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవాడికీ అందులో భాగం లభిస్తుంది." (అన్ నిసా : 85)
English
“Whosoever intercedes for a good cause will have the reward thereof.” [An-Nisā’ 4:85]
హదీసు 248
وعن أَبي موسى الأَشعري رضي اللَّه عنه قَالَ: كَانَ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا أَتَاهُ طالِبُ حاجةٍ أَقْبَلَ عَلَى جُلسائِهِ فَقَالَ: "اشْفَعُوا تُؤجَرُوا ويَقْضِي اللَّه عَلَى لِسان نَبِيِّهِ مَا أَحبَّ" مُتَّفَقٌ عَلَيهِ. وفي رواية:"مَا شَاءَ".
హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తన దగ్గరికి ఎవరైనా అవసరంలో ఉన్న వ్యక్తి వచ్చి (సహాయం చేయమని కోరితే) ఆయన తనతోపాటు కూర్చొనివున్న వారితో "ఇతని కోసం సిఫారసు చేయండి. దానివల్ల మీకూ పుణ్యం లభిస్తుంది. దేవుడు తాను తలచిన నిర్ణయాన్ని తన ప్రవక్తనోట వెలువరిస్తాడు" అని అనేవారు. (బుఖారీ – ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో "మా అహబ్బ"కు బదులు 'మా షాఅ' అని ఉంది. (రెండింటి అర్థం ఒక్కటే).
(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: Whenever a needy person would come to the Prophet ﷺ, he would turn to those who were present and say, “If you make intercession for him, you will be rewarded, because Allah decreed what He likes by the tongue of His Messenger”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ధర్మసమ్మతమైన విషయాల్లో తోటి సోదరుల కొరకు సిఫారసు చేయటం పుణ్యప్రదమే. కాని నిషిద్ధ విషయాల్లోగాని లేక షరీఅత్ విధించిన శిక్షల్ని రద్దుచేయమని గాని సిఫారసు చేసే అనుమతి, అర్హత ఎవరికీ లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|30. సిఫారసు చేయటం|హదీసు 248
హదీసు 249
وعن ابن عباس رضي اللَّه عنهما في قِصَّة برِيرَةَ وزَوْجِها. قَالَ: قَالَ لَهَا النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَوْ راجَعْتِهِ؟ "قَالتَ: يَا رَسُولَ اللَّه تأْمُرُنِي؟ قَالَ:"إِنَّما أَشفعُ" قَالَتْ: لاَ حَاجَةَ لِي فِيهِ. رواه البخاري.
బరీరా మరియు ఆవిడ భర్తకు సంబంధించిన సంఘటన గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) చేసిన కథనం : దైవప్రవక్త ﷺ ఆమెతో, "నీవు నీ భర్త (ముగీస్) దగ్గరికి తిరిగి వెళ్ళిపోతే (బాగుంటుంది)" అని అన్నారు. దానికి ఆమె, "(నేను తిరిగి నా భర్త దగ్గరికి వెళ్ళాలని) ఆజ్ఞాపిస్తున్నారా దైవప్రవక్తా!" అని అడిగింది. అందుకాయన "(లేదు లేదు) నేను కేవలం సిఫారసు చేస్తున్నానంతే" అన్నారు. దానికి ఆమె, "నాకు ఆయన అవసరం లేదు" అని తెగేసి చెప్పింది.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని విడాకుల ప్రకరణం)
English
Ibn `Abbas (May Allah bepleased with them), reported in connection with the case of Barirah (May Allah bepleased with her) and her husband: The Prophet ﷺ said to her, “It is better for you to go back to your husband.” She asked: “O Messenger of Allah, do you order me to do so.” He replied, “I only intercede” She then said: “I have no need for him”.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త ప్రియసతీమణి ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి బానిసరాలు. ఈమె ముగీస్ అనే బానిసను వివాహమాడారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈమెకు బానిసత్వం నుండి స్వేచ్ఛ నొసగారు. బానిసత్వం నుండి స్వేచ్ఛపొందిన స్త్రీకి తన బానిస భర్తతో సంసారం చేయటం యిష్టం లేకపోతే తన వివాహ బంధాన్ని త్రెంచుకునే హక్కు ఇచ్చింది ఇస్లాం ధర్మం. దాని ప్రకారం ఈమె కూడా తన హక్కును వినియోగించుకుంటూ తన భర్త ముగీస్ నుండి విడిపోయారు. కాని ముగీస్‌కు మాత్రం బరీరా అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఇతను ఆమెను అనుసరిస్తూ తిరిగేవాడు. తనతో వివాహబంధాన్ని త్రెంచుకోవద్దని ప్రాధేయపడేవాడు. దైవప్రవక్తకు ఈ విషయం తెలిసింది. ఆయన ముగీస్ దైన్యస్థితికి జాలిపడ్డారు. అతనితో వివాహబంధాన్ని పునర్నిర్మించుకోమని బరీరాకు సిఫారసు చేశారు. కాని లాభం లేకపోయింది. ఇది షరీఅత్ ఆజ్ఞ అయితే కాదు కదా! ఇది కేవలం సలహా మరియు సిఫారసు మాత్రమే. అందుకని హజ్రత్ బరీరా (రదియల్లాహు అన్హా)గారు ఈ సలహా తనకు ప్రయోజనకరమైనది కాదని తలపోసి దైవప్రవక్త ﷺ చేసిన సిఫారసును ఒప్పుకోలేదు. దీనిద్వారా ఇస్లాం ధర్మం వ్యక్తిగత హక్కుల్ని సమ్మతించి ఆమోదించిందని తెలుస్తోంది. ఇస్లాం వ్యక్తుల హక్కుల్ని గౌరవిస్తుంది. అయితే ఆ హక్కుల వినియోగం షరీఅత్ పరిమితులకు లోబడి ఉండాలి. షరీఅత్ ప్రసాదించిన స్వేచ్ఛను హరించడానికి ఎవరికీ అధికారం లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|30. సిఫారసు చేయటం|హదీసు 249
You must be logged in to post a comment.