హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 28. తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 28వ అధ్యాయం: తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 242 – 245) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

28. తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు

↑ విషయ సూచిక

باب ستر عورات المسلمين والنهي عن إشاعتها لغير ضرورة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَنْ تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ} [النور:١٩]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు: "విశ్వాసుల్లో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యథాభరితమైన శిక్షకు అర్హులు." (అన్ నూర్ : 19)

English

“Verily, those who like that (the crime of) illegal sexual intercourse should be propagated among those who believe, they will have a painful torment in this world and in the Hereafter.” [An-Nūr 24:19]

242

హదీసు 242

وعن أَبي هريرة رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يسْتُرُ عَبْدٌ عبْداً فِي الدُّنْيَا إِلاَّ سَتَرهُ اللَّه يَوْمَ الْقيامَةِ "رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఇహలోకంలో ఒక దాసుడు మరొక దాసుడ్ని (అంటే అతని పాపాలను) తెరమరుగు పరిస్తే ప్రళయ దినాన దేవుడు అతన్ని (అంటే అతని పాపాలను) తెరమరుగు పరుస్తాడు."

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah will cover up on the Day of Resurrection the defects (faults) of the one who covers up the faults of the others in this world”.[Muslim].

ముఖ్యాంశాలు

ప్రజల లోటుపాట్లను అందరి ముందూ ప్రస్తావించి, వారిని అవమానం పాలుచేయకుండా వీలైనంత వరకు వారి తప్పుల్ని దాచి ఉంచటం ఉత్తమ నైతికతకు తార్కాణం. దేవుడు తన దాసుల పాపాలను కప్పిపుచ్చుతాడు. ఆ విధంగా తోటి మనుషుల పాపాలను దాచి ఉంచితే దైవత్వ గుణాన్ని పుణికిపుచ్చుకున్నట్లవుతుంది. అందుకే ఒకరి తప్పుల్ని రహస్యంగా దాచిపెట్టే వారిని దేవుడు చాలా యిష్టపడతాడు. పరలోకంలో వారి దోషాలను కప్పిపుచ్చి వారు పరాభవం పాలుగాకుండా కాపాడతాడు. వారి పాపాలను మన్నిస్తాడు లేదా తమ పాపాల గురించి వారిని నిలదీయకుండానైనా ఉంటాడు. ఒకవేళ వారిని నిలదీసినా అందరిముందు కాకుండా ఒంటరిగా వారిని పాపాల గురించి అడుగుతాడు. ఆ తరువాత వారిని క్షమించనూవచ్చు లేదా అవసరమనుకుంటే శిక్ష నిమిత్తం కొంతకాలం నరకంలో ఉంచనూవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|28. తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు|హదీసు 242

243

హదీసు 243

وعنه قَالَ: سمِعت رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "كُلُّ أَمَّتِي مُعَافًى إِلاَّ المُجاهرينَ، وإِنَّ مِن المُجاهرةِ أَن يعمَلَ الرَّجُلُ بالليلِ عمَلاً، ثُمَّ يُصْبحَ وَقَدْ سَتَرهُ اللَّه عَلَيْهِ فَيقُولُ: يَا فلانُ عَمِلْتُ الْبَارِحَةَ كذَا وَكَذَا، وَقَدْ بَاتَ يَسْترهُ ربُّهُ، ويُصْبحُ يَكْشفُ سِتْرَ اللَّه "مُتَّفَقٌ عَلَيهِ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు : బహిరంగంగా పాపకార్యాలకు పాల్పడేవారు తప్ప నా అనుచర సమాజంలోని ప్రతి ఒక్కడూ క్షమార్హుడే. మనిషి రాత్రి పూట ఏదైనా (తప్పు)చేసి, తెల్లవారిన తరువాత తను చేసిన పాపాన్ని దేవుడు మరుగుపరచి ఉంచినప్పటికీ తాను మాత్రం (సిగ్గులేకుండా), "ఒరేయ్! రాత్రి నేను ఈ పని చేశాన్రా" అంటూ (నలుగురిలో) చెప్పుకోవటం కూడా బహిరంగ పాపమే అవుతుంది. అతని ప్రభువు అతని పాపాన్ని తెరమరుగున ఉంచగా, తెల్లవారాక అతనే స్వయంగా ఆ తెరను తొలగించటానికి ప్రయత్నిస్తున్నాడు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Every one of my followers will be forgiven except those who expose (openly) their wrongdoings. An example of this is that of a man who commits a sin at night which Allah has covered for him, and in the morning, he would say (to people): “I committed such and such sin last night,’ while Allah had kept it a secret. During the night Allah has covered it up but in the morning he tears up the cover provided by Allah Himself.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మానవ దౌర్బల్యం చేత మనిషివల్ల తప్పులు దొర్లటం సహజమే. తప్పు జరిగినప్పుడు దానిపై పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ, ఎవరికీ ఆ విషయం తెలియకుండా గుట్టుగా ఉంచుకుంటే దైవసన్నిధిలో ఆ తప్పు మన్నించబడుతుందని ఆశించవచ్చు. దైవాన్ని క్షమాభిక్ష వేడుకుంటే దేవుడు దాన్ని తప్పకుండా క్షమిస్తాడు. అందులో సందేహం లేదు. కాని సిగ్గూ ఎగ్గూ లేకుండా బహిరంగంగా అందరిముందు పాపకార్యాలకు పాల్పడేవాడిని, తాను చేసిన పాపాలను గురించి తానేదో ఘనకార్యం చేసినట్లు నలుగురికీ చెప్పుకునేవాణ్ణి మాత్రం దేవుడు క్షమించడు. ఎందుకంటే, అలాంటి మనిషికి బొత్తిగా దైవభయం ఉండదు. దైవాజ్ఞలకు, ధర్మాదేశాలకు అతను పూచికపుల్లంత విలువ కూడా ఇవ్వడు.

ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే, అలాంటి వ్యక్తికి తాను చేస్తున్న చెడు పనులపై పశ్చాత్తాపం చెందే భాగ్యం కూడా లేకుండా పోతుంది. పైగా చెడుపని చేసి నలుగురిలో గర్వంగా చెప్పుకోవటం దైవశిక్షకు సవాలు విసరడంతో సమానం. మరి అలాంటి వ్యక్తి దైవ సన్నిధిలో క్షమార్హుడు ఎట్లా అవుతాడు?

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|28. తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు|హదీసు 243

244

హదీసు 244

وعنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا زَنَتِ الأَمةُ فَتبينَ زِناهَا فَليجلدْها الحدَّ، وَلا يُثَرِّبْ عَلَيْهَا، ثمَّ إِنْ زَنَتِ الثَّانية فَلْيجلدْها الحدَّ وَلا يُثرِّبْ عَلَيْهَا، ثُمَّ إِنْ زَنتِ الثَّالثةَ فَلْيبعَها ولوْ بِحبْلٍ مِنْ شعرٍ" مُتَّفَقٌ عَلَيهِ."التَّثْرِيبُ": التَّوْبيخُ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : బానిస స్త్రీ వ్యభిచారానికి పాల్పడినప్పుడు ఆమె వ్యభిచార నేరం బయటపడితే ఆమెకు కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఆమెను మందలించకూడదు. ఆమె మళ్ళీ వ్యభిచారం చేస్తే అప్పుడు కూడా ఆమెకు కొరడా దెబ్బల శిక్ష విధించాలి. అంతే గాని, ఆమెను మందలించకూడదు. కాని మూడోసారి కూడా ఆమె వ్యభిచారానికి పాల్పడితే వెంట్రుకలతో పేనిన తాడుకు బదులుగానైనా సరే ఆమెను అమ్మి వేయాలి. (ఆమె పీడ వదలించుకోవాలి).

(బుఖారీ – ముస్లిం)

'తస్‌రీబ్' అంటే మందలించటం అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని బానిసవిమోచన ప్రకరణంలోనూ సహీహ్ ముస్లింలోని శిక్షల ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: The Prophet ﷺ said, “When a slave-girl commits fornication and this fact of fornication has become evident, she must be given the penalty of (fifty) lashes without hurling reproaches at her; if she does it again, she must be given the penalty but she should not be rebuked. If she does it for the third time, he should sell her, even for a rope woven from hair (i.e., something worthless)”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

బానిస స్త్రీ వ్యభిచరిస్తే శిక్షగా ఆమెకు యాభై కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది. ఈ శిక్ష స్వయంగా ఆమె యజమాని కూడా విధించవచ్చు. పై హదీసులో యజమానినే సంబోధించటం జరిగింది. మందలించకుండా, ఛీత్కరించుకోకుండా ఉంటే బహుశా ఆమె ఇంకోసారి అలాంటి ఘాతుకానికి పాల్పడకుండా ఉంటుందేమో! అందుకే ఊరికే ఆమెను ఛీత్కరించుకోవటం తగదని చెప్పబడింది. కొన్నిసార్లు ప్రేమతో చెప్పే మాటలే మనసుపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. అందుకే బానిస స్త్రీ వ్యభిచరిస్తే ముందుగా ఆమెకు ప్రేమతో నచ్చజెప్పాలి. వినకపోతే ఆమెను ఎంత తక్కువ ధరకైనా అమ్మి ఆమె పీడ వదిలించుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|28. తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు|హదీసు 244

245

హదీసు 245

وعنه قَالَ: أُتِيَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِرجلٍ قَدْ شرِب خَمْراً قَالَ: "اضْربُوهُ" قَالَ أَبُو هُرَيْرةَ: فمِنَّا الضَّارِبُ بِيدهِ والضَارِبُ بِنَعْله، والضَّارِبُ بِثوبِهِ. فَلَمَّا انْصَرَفَ قَال بعْضُ الْقَومِ: أَخْزاكَ اللَّه، قَالَ: لا تقُولُوا هَكَذا لا تُعِينُوا عليه الشَّيْطان" رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : మద్యం తాగివున్న ఒక వ్యక్తిని దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసుకురావటం జరిగింది. అప్పుడు ఆయన (ఆగ్రహంతో) "ఇతణ్ణి వాయించండి" అన్నారు. ఆయన అలా అనగానే మాలో కొందరు చేతులతో, కొందరు పాదరక్షలతో, కొందరైతే బట్టలతోనే అతణ్ణి (ఎడాపెడా) కొట్టారు. (కాసేపటికి) అతను వెళ్ళిపోయాక కొందరు, "దేవుడు నిన్ను అవమానించుగాక!" అని అతనికి శాపనార్థాలు పెట్టసాగారు. అది విని ఆయన "అలా అనకండి. అతనికి వ్యతిరేకంగా షైతానుకు సహాయపడకండి" అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని శిక్షల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: A man who had drunk wine was brought to the Prophet ﷺ and he asked us to beat him; some struck him with their hands, some with their garments (making a whip) and some with their sandals. When he (the drunkard) had gone, some of the people said: “May Allah disgrace you!” He (the Prophet ﷺ) said, “Do not say so. Do not help the devil against him”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఒక ముస్లింను శపించడమంటే ఒకవిధంగా షైతాన్‌కు సహాయపడటమే. షైతాన్ కర్తవ్యం కూడా ముస్లింలను భ్రష్టుపట్టించటం, ఇహపరాలలో వారిని అవమానాలకు గురిచేయటమేకదా!

ఈ హదీసును ఆధారంగా చేసుకొని కొంతమంది మద్యం సేవించినందుకు నిర్ణీత శిక్ష ఏమీ లేదని, మద్యం తాగినవాడికి తగిన రీతిలో బుద్ధి చెబితే చాలని అభిప్రాయపడ్డారు. మరొక వర్గం వారు మద్యం తాగినందుకు నలభై కొరడా దెబ్బల శిక్షపడుతుందని వాదిస్తున్నారు. వాస్తవానికిది మద్యపాన శిక్ష నిర్ణయించబడటానికి పూర్వం జరిగిన సంఘటన. ఆ తరువాతి కాలంలో దైవప్రవక్త ﷺ ఒకసారి మద్యం తాగిన వ్యక్తికి నలభై కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇక అదే నిర్ణీత శిక్ష అయింది.

హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తన ఖిలాఫత్ హయాంలో, ఆ తరువాత హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తాను ఖలీఫా అయిన తొలినాళ్ళలో దీనినే అమలుపరిచారు. ఆ తరువాత ఉమర్ (రదియల్లాహు అన్హు) అదనంగా మరో నలభై చేర్చి మొత్తం ఎనభై (80) కొరడా దెబ్బల శిక్షను విధించటం మొదలుపెట్టారు. పండితుల అభిప్రాయం ప్రకారం మద్యపాన నేరానికి అసలు శిక్ష నలభై కొరడా దెబ్బలే గాని న్యాయనిర్ణేత ఉచితమని భావిస్తే అదనంగా మరో నలభై కొరడా దెబ్బల దాక విధించవచ్చు. అత్యధిక మంది విద్వాంసులు ఈ రెండవ అభిప్రాయాన్నే సమర్థించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|28. తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు|హదీసు 245