హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 27వ అధ్యాయం: ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 18 హదీసులు (హదీసు 224 – 241) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….

↑ విషయ సూచిక

باب تعظيم حُرمات المسلمين وبيان حقوقهم والشفقة عليهم ورحمتهم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{وَمَنْ يُعَظِّمْ حُرُمَاتِ اللَّهِ فَهُوَ خَيْرٌ لَهُ عِنْدَ رَبِّهِ } [الحج:٣٠]

"ఎవడైనా అల్లాహ్ విధించిన పవిత్ర నియమాలను గౌరవిస్తే, అది అతని ప్రభువు దృష్టిలో స్వయంగా అతడికే శ్రేయస్కరమైనది." (అల్ హజ్ : 30)

మరొకచోట ఇలా అంటున్నాడు :

{وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ} [الحج:٣٢]

"ఎవరైనా అల్లాహ్ నిర్ణయించిన చిహ్నాలను గౌరవిస్తున్నారంటే అది (వారి) హృదయాలలోని దైవభీతి వలననే." (అల్ హజ్ : 32)

ఇంకొకచోట ఇలా సెలవిస్తున్నాడు :

{وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ} [الحجر: ٨٨]

"విశ్వాసుల పట్ల మృదువుగా మెలగు." (అల్ హిజ్ర్ : 88)

{مَنْ قَتَلَ نَفْساً بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعاً وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعاً} [المائدة:٣٢]

ఆయన ఇంకా ఇలా అంటున్నాడు : "హత్యకు బదులుగాగాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకుగాని కాక (అన్యాయంగా) ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాలను కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే." (అల్ మాయిద : 32)

English

“And whosoever honours the sacred things of Allah, then that is better for him with his Rubb”. [Al-Ḥajj 22:30]

“And whosoever honours the Symbols of Allah, then it is truly from the piety of the heart”. [Al-Ḥajj 22:32]

“And lower your wing for the believers (be courteous to the fellow believers)”. [Al-Ḥijr 15:88]

“…if anyone killed a person not in retaliation of murder, or (and) to spread mischief in the land – it would be as if he killed all mankind, and if anyone saved a life, it would be as if he saved the life of all mankind”. [Al-Mā’idah 5:32]

224

హదీసు 224

وعن أَبي موسى رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الْمُؤْمنُ للْمُؤْمِن كَالْبُنْيَانِ يَشدُّ بعْضُهُ بَعْضاً" وَشَبَّكَ بَيْنَ أَصَابِعِه. متفق عليه.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : విశ్వాసులు పరస్పరం కట్టడం లాంటివారు. అందులోని ఒక భాగం మరో భాగానికి ఊతంగా ఉంటుంది. (అలాగే విశ్వాసులందరూ కూడా పరస్పరం కలసిమెలసి ఉంటారు).

దీని గురించి ఉపదేశిస్తున్నప్పుడు ఆయన తన చేతుల వ్రేళ్ళను ఒక దానిలో ఒకటి జొప్పించి (విశ్వాసులు కూడా ఇలాగే ఐకమత్యంతో ఉంటారని ప్రజలకు) చూపించారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది).

English

Abu Musa (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “The relationship of the believer with another believer is like (the bricks of) a building, each strengthens the other.” He ﷺ illustrated this by interlacing the fingers of both his hands.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ముస్లింలందరూ ఐకమత్యంతో ఉండాలని ఈ హదీసు బోధిస్తోంది. ప్రతి ముస్లిం ముస్లిం సమాజానికి ఒక ఇటుక లాంటివాడు. ఇటుకలన్నీ ఒకదానిపై ఒకటి పేర్చబడి పరస్పరం ఆధారాన్నిచ్చుకుంటూ గట్టి గోడలా నిలబడినట్లు ముస్లింలు కూడా పరస్పరం సహాయకారులుగా కలిసిమెలిసి ఉండాలని ఈ హదీసు ఉపదేశిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 224

225

హదీసు 225

وعنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَن مَرَّ فِي شَيْءٍ مِنْ مَسَاجِدِنَا، أَوْ أَسْوَاقِنَا، ومَعَه نَبْلٌ فَلْيُمْسِكْ، أَوْ لِيَقْبِضْ عَلَى نِصالِهَا بِكفِّهِ أَنْ يُصِيب أَحَداً مِنَ الْمُسْلِمِينَ مِنْهَا بِشَيْءٍ" مُتَّفَقٌ عليه.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : ఎవరైనా మా మస్జిదుల గుండాగాని లేక మా బజారుల గుండాగాని వెళ్తున్నప్పుడు, తమ వెంట బాణం ఉంటే దాన్ని ఆపి ఉంచాలి లేదా దాని మొనను చేత్తో గట్టిగా పట్టుకొని నడవాలి. లేకపోతే అది ఏ ముస్లింకైనా తగిలి బాధ కలిగించవచ్చు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని నమాజు ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Abu Musa (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Whoever enters our mosque or passes through our market with arrows with him, he should hold them by their heads lest it should injure any of the Muslims”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సత్యధర్మాన్ని స్వీకరించిన వారి రక్షణ కోసం ఇస్లాం ధర్మం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే శాంతి, సౌమనస్యాలను పరిరక్షించే ముస్లింలు సైతం నేడు ఆయుధాల వాడకంలో ఎంతో అజాగ్రత్త వహిస్తున్నారు. పనికిమాలిన సరదాల కోసం, వ్యర్థ వ్యసనాల కోసం ఆయుధాలను ఉపయోగించి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. అకారణంగా ఎంతోమంది అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటున్నారు. విధ్వంసకర బాంబులను, మందుపాతరలను పేల్చుతూ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ముస్లింలు తమ ధర్మాదేశాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా, నిర్భయంగా వ్యవహరిస్తున్నారో వారు అనుసరిస్తున్న వైఖరే చాటుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 225

226

హదీసు 226

وعن النُّعْمَانِ بنِ بشِيرٍ رضي اللَّه عنهما قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ وتَرَاحُمِهِمْ وتَعاطُفِهِمْ، مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَداعَى لهُ سائِرُ الْجسدِ بالسهَرِ والْحُمَّى" متفقٌ عليه.

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో, కనికరించుకోవటంలో, ప్రేమావాత్సల్యాలతో మెలగటంలో ఒక దేహం లాంటి వారు. దేహంలో ఒక అవయవానికి బాధకలిగినప్పుడు మొత్తం దేహమంతా బాధతో, జబ్బుతో మూలుగుతుంది.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Nu`man bin Bashir (May Allah bepleased with them) reported: Messenger of Allah ﷺ said, “The believers in their mutual kindness, compassion and sympathy are just like one body. When one of the limbs suffers, the whole body responds to it with wakefulness and fever”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ముస్లిం గ్రంథంలో ఇలాంటిదే ఇంకొక హదీసు ఉంది. దాని ప్రకారం విశ్వాసులందరూ ఒకే మనిషిలాంటివారు. అతని కంటికి బాధ కలిగినప్పుడు మొత్తం శరీరం ఆ బాధను అనుభవిస్తుంది. అతనికి తల నొప్పి వచ్చినప్పుడు శరీరమంతా ఆ నొప్పితో బాధపడుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 226

227

హదీసు 227

وعن أَبي هُريْرَةَ رضي اللَّه عنه قَالَ: قبَّل النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم الْحسنَ ابن عَليٍّ رضي اللَّه عنهما، وَعِنْدَهُ الأَقْرعُ بْنُ حَابِسٍ، فَقَالَ الأَقْرَعُ: إِنَّ لِي عَشرةً مِنَ الْولَدِ مَا قَبَّلتُ مِنْهُمْ أَحداً فنَظَر إِلَيْهِ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقَالَ: "مَن لا يَرْحمْ لاَ يُرْحَمْ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ (మనవడు) హసన్ బిన్ అలీని ముద్దాడారు. అప్పుడు అఖ్రా బిన్ హాబిస్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన ఆ దృశ్యాన్ని చూసి "(దైవప్రవక్తా!) నాకు పదిమంది పిల్లలున్నారు. కాని ఏనాడూ నేను వాళ్ళలో ఏ పిల్లవాడ్నీ ముద్దాడలేదు" అని అన్నారు. దానికి ఆయన అఖ్రా వైపు చూసి "కనికరించనివాడిపై కనికరం చూపబడదు" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: The Prophet ﷺ kissed his grandson Al-Hasan bin `Ali (May Allah bepleased with them) in the presence of Al-Aqra` bin Habis. Thereupon he remarked: “I have ten children and I have never kissed any one of them.” Messenger of Allah ﷺ looked at him and said, “He who does not show mercy to others will not be shown mercy”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పసిపిల్లలను ప్రేమతో ముద్దాడటం ధర్మసమ్మతమే. పైగా దీనిద్వారా దైవకారుణ్యాన్ని పొందవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలపై వాత్సల్యం చూపాలి. ఇది పిల్లల హక్కు. ఆ హక్కుని నిర్వర్తించడంలో తల్లిదండ్రులు ఏ లోటూ రానివ్వకూడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 227

228

హదీసు 228

وعن عائشةَ رضي اللَّه عنها قَالَتْ: قدِم ناسٌ مِن الأَعْرابِ عَلَى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فقالوا: أَتُقبِّلونَ صِبيْانَكُمْ؟ فَقَالَ:"نَعَمْ"قالوا: لَكِنَّا واللَّه مَا نُقَبِّلُ، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَوَ أَمْلِكُ إِنْ كَانَ اللَّه نَزعَ مِنْ قُلُوبِكُمْ الرَّحمَةَ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: కొంతమంది పల్లెవాసులు దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి, "మీరు కూడా మీ పిల్లల్ని ముద్దాడుతారా?!" అని అడిగారు. దానికి ఆయన "అవున"న్నారు. అందుకు వారు, "మేము మాత్రం (మా పిల్లల్ని) ముద్దుపెట్టుకోం" అని అన్నారు. ఆ మాట విని, "దేవుడు మీ హృదయాల నుండి మమతానురాగాలు తీసివేస్తే దానికి నేనేం చేయగలను?" అని అన్నారు దైవప్రవక్త ﷺ.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

`Aishah (May Allah bepleased with her) reported: Some bedouins came to Messenger of Allah ﷺ and asked: “Do you kiss your children?” He said, “Yes”. They then said: “By Allah, we do not kiss them.” The Prophet ﷺ replied, “I cannot help you if Allah has snatched kindness from your hearts”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పిల్లలపై ప్రేమావాత్సల్యాలు కురిపించడంలోనూ ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని పొందడానిక్కూడా అదృష్టం ఉండాలి. అందరికీ ఆ భాగ్యం లభించదు. ప్రేమపరిమళాలతో నిండివున్న హృదయాలే అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించగలవు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 228

229

హదీసు 229

وعن جريرِ بنِ عبدِ اللَّه رضي اللَّه عنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ لاَ يرْحَم النَّاس لاَ يرْحمْهُ اللَّه" متفقٌ عَلَيهِ.

హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ప్రజలపై దయజూపనివాడిపై దేవుడు కూడా దయజూపడు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఏకేశ్వరోపాసనా ప్రకరణంలోనూ, సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Jarir bin `Abdullah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “He who is not merciful to people Allah will not be merciful to him.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సృష్టిలోని జీవరాశుల పట్ల దయాదాక్షిణ్యాలతో వ్యవహరించటం దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైన ఆచరణ. ఆఖరికి పశుపక్ష్యాదులపై కనికరించినా కూడా దేవుడు అమితంగా సంతోషిస్తాడు. కనికరం చూపేవ్యక్తి దైవకారుణ్యానికి అర్హుడౌతాడు. ప్రాణికోటిలో మనిషి ప్రత్యేకత నుద్దేశ్యించుకొని పై హదీసు వాక్యాల్లో ప్రజలపై దయచూపాలని ఆదేశించబడింది కాని వాస్తవానికి పశుపక్ష్యాదులపై కూడా తప్పకుండా దయచూపాల్సిందే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 229

230

హదీసు 230

وعن أَبي هُريرةَ رضي اللَّه عنه، أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا صَلَّى أَحدُكُمْ للنَّاسِ فلْيُخَفِّفْ، فَإِنَّ فِيهِمْ الضَّعِيفَ وَالسقيمَ والْكَبِيرَ. وإِذَا صَلَّى أَحَدُكُمْ لِنَفْسِهِ فَلْيطَوِّل مَا شَاءَ" متفقٌ عَلَيهِ. وفي روايةٍ:"وذَا الْحاجَةِ".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : మీలో ఎవరైనా ప్రజలకు నమాజ్ (ఎవరికీ భారమనిపించకుండా నమాజును) క్లుప్తంగా చేయించాలి. ఎందుకంటే (నమాజుకు వచ్చే) వారిలో బలహీనులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు కూడా ఉంటారు. ఒకవేళ ఎవరయినా ఒంటరిగా చేస్తున్నప్పుడు కావాలనుకుంటే ఎంత సుదీర్ఘంగానయినా చేసుకోవచ్చు.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో "అవసరం నిమిత్తం వెళ్ళవలసిన వారు (కూడా ఉంటారు)" అని ఉంది.

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “When one of you leads the Salat, he should not prolong it because the congregation includes those who are feeble, ill or old”. One version adds: “those who have to attend to work”) While offering prayers alone, you may pray as long as you like”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

నమాజుకు వచ్చేవారిలో పెద్దలు, పిన్నలు, బాటసారులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు కూడా ఉండవచ్చు. కనుక సామూహిక నమాజులో నమాజ్‌కు సారధ్యం వహించే వ్యక్తి (ఇమామ్) అనుయాయుల్ని (ముఖ్తదీలను) దృష్టిలో పెట్టుకొని నమాజును సంక్షిప్తంగా చేయించాలని పై హదీసులో తాకీదు చేయబడింది. నమాజును సంక్షిప్తంగా చేయించడమంటే అందులో క్లుప్తంగా ఖుర్‌ఆన్ పారాయణం చేయడమని అర్థం. అంతేగాని రుకూ, సజ్దా, ఖౌమా వంటి వాటిని సరిగ్గా నిర్వర్తించకుండా నమాజుని త్వరగా ముగించేయాలని భావం కాదు. నమాజులోని ప్రధానాంశాల్ని (తాదీలె అర్కాన్) సరిగ్గా నిర్వర్తించడం దైవప్రవక్త సంప్రదాయం. ఆయన "మీరు నన్ను ఏ విధంగా నమాజు చేస్తున్నట్టు చూశారో అదేవిధంగా మీరూ నమాజు చేయండి" అని ఆదేశించారు. కాబట్టి అందులోని ప్రధానాచరణల్ని తప్పకుండా సరైన రీతిలో నిర్వర్తించాలి. అందులో మాత్రం తొందరపాటు పనికిరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 230

231

హదీసు 231

وعن عائشة رضي اللَّه عنها قَالَتْ: إِنْ كَان رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَيدعُ الْعَمَلَ، وهُوَ يحِبُّ أَنَ يَعْملَ بِهِ، خَشْيةَ أَنْ يَعْمَلَ بِهِ النَّاسُ فيُفْرَضَ عَلَيْهِمْ"متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ తనకిష్టమైనప్పటికీ కొన్ని పనుల్ని ఆచరించకుండా వదలిపెట్టేవారు. తనను చూసి ప్రజలు కూడా దానిని ఆచరించడం మొదలుపెడితే, (క్రమంగా) అది వారిపై విధిగా చేయబడుతుందన్న భయంతోనే ఆయన అలా చేసేవారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని 'తహజ్జుద్' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

`Aishah (May Allah bepleased with her) reported: Messenger of Allah ﷺ would sometimes abstain from doing something he wished to do, lest others should follow him and it might become obligatory upon them.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ తన అనుచర సమాజాన్ని ఎంతగానో ప్రేమించేవారు. ధార్మిక విషయాల్లోనయినా మరే విషయంలోనైనా సరే తన సమాజం ఇబ్బందుల్లో పడిపోవటాన్ని ఆయన ఏమాత్రం వాంఛించేవారు కాదు. అందుకే ప్రజల ముందు ఎక్కువగా నఫిల్ నమాజులు, నఫిల్ ఆరాధనలు చేయడానికి తటపటాయించేవారు. తనను చూసి ప్రజలు కూడా నిర్విరామంగా నఫిల్ నమాజులు చేయడం మొదలుపెడితే క్రమంగా వారు దాన్ని విధి (ఫర్జ్)గా తలపోసే అవకాశం ఉందని లేదా దేవుడే స్వయంగా వారిపై దాన్ని విధిగా చేయవచ్చునీ, దాని వల్ల సమాజం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందన్న భయంతో తనకు ప్రియమైన ఆరాధనల్ని కూడా ఆయన త్యాగం చేసేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 231

232

హదీసు 232

وعنْهَا رضي اللَّه عنها قالَتْ: نَهَاهُمْ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَن الْوِصال رَحْمةً لهُمْ، فَقَالُوا: إِنَّكَ تُواصلُ؟ قَالَ: "إِنِّي لَسْتُ كَهَيئَتِكُمْ إِنِّي أَبِيتُ يُطْعِمُني رَبِّي ويَسْقِيني" متفقٌ عَلَيهِ مَعناهُ: يجعَلُ فيَّ قُوَّةَ مَنْ أَكَلَ وَشَرَبَ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ తన సహచరులపై జాలితో వారిని నిర్విరామంగా ఉపవాసాలు పాటించవద్దని ఆదేశించారు. దానికి ఆయన సహచరులు, "మరి మీరు స్వయంగా నిర్విరామ ఉపవాసాలు పాటిస్తున్నారుగా?" అని విన్నవించుకోగా, అందుకాయన, "నేను మీలాంటి వాడ్ని కాను. రాత్రి నేను (నా ప్రభువు వద్ద) గడుపుతాను – నా ప్రభువు నాకు తినిపిస్తాడు. త్రాగిస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

అంటే దేవుడు నాకు తినే, త్రాగే, వ్యక్తికి లభించే శక్తిని ప్రసాదిస్తాడని అర్థం.

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని ఉపవాస ప్రకరణాలు)

English

`Aishah (May Allah bepleased with her) reported: The Prophet ﷺ prohibited his Companions out of mercy for them, from observing continuous fasting without a break. They said: “But you observe fast continuously”. He replied, “I am not like you. I spend the night while my Rubb provides me with food and drink”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

'నేను మీలాంటి వాడ్ని కాను' అంటే మీలాంటి మానవుణ్ణి కానని అర్థం ఎంతమాత్రం కాదు. దైవంతో తనకున్న సంబంధం, సామీప్యం మీకు లేవని చెప్పటమే ఆయన అసలు ఉద్దేశ్యం. ఈ సామీప్యం వల్ల దేవుడు ఆయనకు మనోబలాన్ని, ఆధ్యాత్మిక పారవశ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన మనోమస్తిష్కాలను జ్యోతిర్మయం చేస్తుంటాడు. దాంతో ఆయన తినకపోయినా, త్రాగకపోయినా దైవం తరపునుండి ఆయనలో అంత శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. దీని ద్వారా నిర్విరామంగా ఉపవాసాలు పాటించడమనేది దైవప్రవక్త ﷺ గారి విశిష్టత అన్న సంగతి బోధపడుతోంది. దాన్ని సమాజం అనుసరించాల్సిన అవసరం లేదు. పైగా ఆయన ప్రజలు దీన్ని ఆచరించకూడదని ఆదేశించారు. ఇలాంటి సమాజపరమైన లేదా ఆరాధనాపరమైన ప్రత్యేక వ్యవహారాల్లో ఆయన ఆదేశాలే అనుసరణీయం గాని ఆయన ఆచరణలు కావు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 232

233

హదీసు 233

وعن أَبي قَتادَةَ الْحارِثِ بنِ ربْعي رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنِّي لأَقُومُ إِلَى الصَّلاةِ، وَأُرِيدُ أَنْ أُطَوِّل فِيها، فَأَسْمعُ بُكَاءَ الصَّبِيِّ، فَأَتَجوَّزَ فِي صلاتِي كَرَاهِيَةَ أَنْ أَشُقَّ عَلَى أُمِّهِ" رواه البخاري.

హజ్రత్ అబూ ఖతాదా హారిస్ బిన్ రిబ్‌యా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: నేను నమాజుకై నించుంటాను. సుదీర్ఘంగా నమాజు చేయాలనుకుంటాను. కాని అంతలోనే నాకు ఎవడో ఒక పిల్లవాడి ఏడుపు వినపడుతుంది. దాంతో నావల్ల ఆ పిల్లవాడి తల్లికి బాధకలగడం యిష్టంలేక నమాజును క్లుప్తంగా ముగిస్తుంటాను. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం)

English

Abu Qatadah Al-Harith bin Rib`i (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “I stand up to lead Salat with the intention of prolonging it. Then I hear the crying of an infant and I shorten the Salat lest I should make it burdensome for his mother”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఇక్కడ కూడా క్లుప్తంగా నమాజు చేయడమంటే సంక్షిప్త పారాయణమనే అర్థం. సహీహ్ ముస్లింలోని ఉల్లేఖనం ఈ విషయాన్ని వివరిస్తుంది. అందులో పిల్లవాడి ఏడుపు వినగానే దైవప్రవక్త ﷺ చిన్న సూరాని పారాయణం చేసేవారని ఉంది. దీనిద్వారా ఆయనకు తన అనుచర సమాజం పట్ల ఉన్న ప్రేమానురాగాలు విదితమవుతున్నాయి. ఆరాధనలో ఉన్నప్పుడు కూడా సహచరులెవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆయన దానికి ప్రతిస్పందించేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 233

234

హదీసు 234

وعن جُنْدِبِ بن عبد اللَّه رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ صَلَّى صَلاةَ الصُّبحِ فَهُوَ فِي ذِمةِ اللَّه فَلا يطْلُبنَّكُمْ اللَّهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ، فَإِنَّهُ منْ يَطْلُبْهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ يُدرِكْه، ثُمَّ يكُبُّهُ عَلَى وجْهِهِ في نَارِ جَهَنَّم" رواه مسلم.

హజ్రత్ జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఉదయం నమాజు (ఫజ్ర్) చేసిన వ్యక్తి దేవుని రక్షణలో ఉంటాడు. కనుక దేవుడు తాను (ఇచ్చిన) రక్షణ గురించి మిమ్మల్ని ప్రశ్నించకుండా జాగ్రత్తపడండి. ఆయన ఎవరినయినా (తన దాసునికిచ్చిన) రక్షణ విషయమై నిలదీశాడంటే, ఇక అతణ్ణి పట్టుకొని నరకంలో బోర్లా పడేస్తాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణం)

English

Jundub bin Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When anyone offers the Fajr (dawn) prayer, in congregation, he is in the Protection of Allah. So let not Allah call him to account, withdrawing, in any respect, His Protection. Because, He will get hold of him and throw him down on his face in the Hell-fire.’‘[Muslim]

ముఖ్యాంశాలు

ఫజ్ర్ నమాజు చేసిన వ్యక్తికి అల్లాహ్ రక్షణ కల్పిస్తాడని ఈ హదీసు చెబుతోంది. అలాంటి వ్యక్తి అల్లాహ్ రక్షణలో ఉంటాడు కనుక ఇతరులెవరూ అతనికి హానికల్గించకుండా జాగ్రత్తపడాలి. అతన్ని వేధించడంగాని, అతని ధన, మాన ప్రాణాలకు కీడు తలపెట్టడం గాని చేయకూడదు. ఎవడైనా దాన్ని లెక్కచేయకుండా ప్రతిరోజూ ఫజ్ర్ నమాజు పాటించే వ్యక్తిని హింసిస్తున్నాడంటే దేవుడు తన దాసుడికిచ్చిన రక్షణ విషయంలో అతను అభ్యంతరం తెలుపుతున్నాడన్నమాట! దేవుడు ప్రళయదినాన తన నిర్ణయాలను ధిక్కరించినవారిని తప్పకుండా నిలదీసి అడుగుతాడు.

2. ఇక్కడ ఉదయపు నమాజు అంటే ఒక్క ఫజ్ర్ నమాజ్ అనేకాదు. ఐదుపూటల నమాజులూ దీని క్రిందికి వస్తాయి. పెందలాడే మేల్కొని నమాజ్ చేయడం మనసుకు కష్టమనిపిస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఫజ్ర్ నమాజ్‌నే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఫజ్ర్ నమాజ్ చేసేవాడు తతిమ్మా నమాజులు కూడా సాధారణంగా పాటిస్తాడని దీని భావం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 234

235

హదీసు 235

وعن ابن عمر رضي اللَّه عنهما أَنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "المُسْلِمُ أَخُو المُسْلِمِ، لا يظْلِمُه، وَلاَ يُسْلِمهُ، منْ كَانَ فِي حَاجَةِ أَخِيهِ كَانَ اللَّهُ فِي حاجتِهِ، ومَنْ فَرَّج عنْ مُسْلِمٍ كُرْبةً فَرَّجَ اللَّهُ عنْهُ بِهَا كُرْبَةً مِنْ كُرَبِ يوْمَ الْقِيامَةِ، ومَنْ سَتَرَ مُسْلِماً سَتَرهُ اللَّهُ يَوْم الْقِيَامَةِ" متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : ఒక ముస్లిం తోటి ముస్లింకు సోదరుడు. ఒక సోదరుడు తన సోదరుడిపై దౌర్జన్యం చేయడు, అతన్ని (నిస్సహాయుడిగా చేసి శత్రువుకి) అప్పగించడు. తన సోదరుని అవసరాలను తీర్చే పనుల్లో (తలమునకలై) ఉన్న వ్యక్తి అవసరాలను దేవుడు తీరుస్తాడు. ముస్లింపై వచ్చిపడిన ఒక కష్టాన్ని తొలగిస్తే దేవుడు కూడా ప్రళయదినాన అతనికి ఎదురయ్యే కష్టాలలో ఒక కష్టాన్ని అతన్నుండి తొలగిస్తాడు. ఇంకా తోటి ముస్లిం (పాపాల)ను తెరమరుగుచేస్తే దేవుడు కూడా ప్రళయదినాన అతని పాపాలను తెరమరుగుచేస్తాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

Ibn `Umar (May Allah bepleased with them) reported: Messenger of Allah ﷺ said, “A Muslim is a brother of another Muslim. So he should not oppress him nor should he hand him over to (his satan or to his self which is inclined to evil). Whoever fulfills the needs of his brother, Allah will fulfill his needs; whoever removes the troubles of his brother, Allah will remove one of his troubles on the Day of Resurrection; and whoever covers up the fault of a Muslim, Allah will cover up his fault on the Day of Resurrection”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ముస్లింలందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. కుటుంబంలో తండ్రి తన కొడుకుపై, సోదరుడు తన తోటి సోదరుడిపై ఎన్నటికీ దౌర్జన్యం చేయడు. తన కళ్ళముందే తన సోదరుడు శత్రువుచేతికి చిక్కడాన్ని ఎవడూ సహించడు. అతను అవసరాల్లో ఉంటే అతని అవసరాన్ని తీర్చడానికి అన్నివిధాలా కృషిచేస్తాడు. అతను కష్టాల్లో ఉంటే సానుభూతితో చలించిపోతాడు. అతని కష్టాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. తన సోదరుని వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని మరుగుపరుస్తాడు. ముస్లింలందరూ కూడా పరస్పరం అలాగే వ్యవహరించాలి. దీనివల్ల దేవుడు ప్రసన్నుడై ఇహపరాల్లో వారికి అమూల్య ప్రతిఫలాలను ప్రసాదిస్తాడు. ముస్లింలు దీనిపై అమలు జరిపితే పరలోక సాఫల్యంతో పాటు ఇహలోకపు ఇల్లుకూడా వారికొరకు స్వర్గధామం కాగలదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 235

236

హదీసు 236

وعن أَبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "المُسْلِمُ أَخُو الْمُسْلِم لاَ يخُونُه وَلاَ يكْذِبُهُ وَلاَ يخْذُلُهُ، كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حرامٌ عِرْضُهُ ومالُه ودمُهُ التَّقْوَى هَاهُنا، بِحسْبِ امْرِىءٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِرَ أَخاهُ المُسْلِم" رواه الترمذيُّ وَقالَ: حديث حسن.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఒక ముస్లిం తోటి ముస్లింకు సోదరుడు. ఒక ముస్లిం తోటి ముస్లింకు ద్రోహం చేయడు, అతనితో అబద్ధం చెప్పడు (లేదా అతన్ని అబద్ధం చెప్పేవాడిగా జమకట్టడు). అతణ్ణి నిస్సహాయుడిగా వదలిపెట్టడు. ఒక ముస్లిం ధన, మాన ప్రాణాలు తోటి ముస్లిం కొరకు నిషిద్ధం (గౌరవప్రదమైనదిగా) చేయబడ్డాయి. దైవభీతి ఇక్కడ (మనసులో) ఉంటుంది. ఒకడు తన తోటి ముస్లిం సోదరుణ్ణి అల్పుడిగా భావిస్తున్నాడంటే, అతని భావన ఒక్కటి చాలు అతడు చెడ్డవాడని చెప్పడానికి!

(దీనిని తిర్మిజీ ఉల్లేఖించి 'హసన్'గా పేర్కొన్నారు).

(జామె తిర్మిజీలోని సత్కార్యాల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “A Muslim is a brother to a Muslim. He should neither deceive him nor lie to him, nor leave him without assistance. Everything belonging to a Muslim is inviolable for a Muslim; his honour, his blood and property. Piety is here (and he pointed out to his chest thrice). It is enough for a Muslim to commit evil by despising his Muslim brother.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఇంతకుముందు వచ్చిన హదీసులోని విషయాన్నే ఇక్కడ ఇంకాస్త విపులంగా, వివరంగా చర్చించడం జరిగింది. ముస్లింలు పరస్పరం తమ సోదరుల ధన మాన ప్రాణాలను రక్షించాలని ఇందులో తాకీదు చేయబడింది. ఈ హదీసులో చెప్పబడిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, మనిషిలో దైవభీతి అనేది ఓ మనోమయస్థితి. ఎవరి మనసులో ఎంత దైవభీతి ఉందో ఎవరూ తొంగి చూడలేరు. మానవుని మనస్థితి దేవుడికే బాగా తెలుసు. కనుక ఎవరూ తాను గొప్ప దైవభక్తుణ్ణనీ, ఇతరులు తనకంటే అధములని ఎన్నడూ భావించరాదు. ఒకరి మనసులోని విశ్వాసం (ఈమాన్), చిత్తశుద్ధి, దైవభీతి గురించిన కచ్చితమైన జ్ఞానం దైవానికి తప్ప మరెవ్వరికీ ఉండదు. అందుకని ఇతరులెవరినీ అల్పులుగా భావించరాదు. అయితే బహిరంగంగా దేవుని అవిధేయతకు పాల్పడేవారి సంగతి వేరు. వారి చేష్టల మూలంగా వారిపట్ల తమ అయిష్టతను వ్యక్తం చేయవచ్చు. పైగా ఈ అయిష్టత నిజమైన విశ్వాసానికి ప్రతీక. కాని వీరిని కూడా అల్పులుగా భావించకుండా ఉండటమే ఉత్తమం. మొత్తానికి అయిష్టాన్ని వ్యక్తం చేయటం వేరు, అధములుగా భావించడం వేరన్నమాట!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 236

237

హదీసు 237

وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَحاسدُوا وَلاَ تناجشُوا وَلاَ تَباغَضُوا وَلاَ تَدابرُوا وَلاَ يبِعْ بعْضُكُمْ عَلَى بيْعِ بعْضٍ، وكُونُوا عِبادَ اللَّه إِخْواناً. المُسْلِمُ أَخُو الْمُسْلِم لاَ يَظلِمُه وَلا يَحْقِرُهُ وَلاَ يَخْذُلُهُ. التَّقْوَى هَاهُنا ويُشِيرُ إِلَى صَدْرِهِ ثَلاَثَ مرَّاتٍ بِحسْبِ امْرِيءٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِر أَخاهُ المُسْلِمَ. كُلَّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حرامٌ دمُهُ ومالُهُ وعِرْضُهُ" رواه مسلم. "النَّجَش"أَنْ يزِيدَ فِي ثَمنِ سلْعةٍ يُنَادِي عَلَيْهَا فِي السُّوقِ ونحْوهِ، وَلاَ رَغْبةَ لَه فِي شِرائهَا بَلْ يقْصِد أَنْ يَغُرَّ غَيْرهُ، وهَذا حرامٌ."والتَّدابُرُ": أَنْ يُعرِض عنِ الإِنْسانِ ويهْجُرَهُ ويجعلَهُ كَالشَّيءِ الَّذِي وراءَ الظهْر والدُّبُرِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : "మీరు పరస్పరం అసూయ చెందకండి. క్రయవిక్రయాల సమయంలో (కొనే ఉద్దేశ్యం లేకుండానే) బేరంమీద బేరం చేస్తూ (వస్తువు) ధరను పెంచి మోసానికి పాల్పడకండి. ఒండొకరిపట్ల అక్కసును పెంచుకోకండి. పరస్పరం విముఖులైపోకండి. ఒకరి బేరం మీద ఇంకొకరు బేరమాడకండి. దేవుని దాసులారా! పరస్పరం అన్నదమ్ములై మెలగండి. ఒక ముస్లిం తోటి ముస్లింకు సోదరుడు. ఒక ముస్లిం తన సోదరుడిపై దౌర్జన్యం చేయడు, అతణ్ణి అల్పునిగా భావించడు, అతన్ని నిస్సహాయుడిగా వదలిపెట్టడు. దైవభీతి ఇక్కడుంటుంది (ఆయన తన ఛాతీవైపు సైగచేస్తూ మూడుసార్లు అన్నారు). ఒకడు తన తోటి ముస్లిం సోదరుణ్ణి అల్పుడిగా భావిస్తున్నాడంటే, ఆ ఒక్క భావన చాలు, అతను చెడ్డవాడని చెప్పటానికి. ఒక ముస్లిం ధన, మాన ప్రాణాలు తోటి ముస్లిం కొరకు 'నిషిద్ధం' (హరాం) చేయబడ్డాయి. (ముస్లిం)

'నజష్' అంటే, అంగడిలోనయినా లేక మరే ప్రదేశంలోనయినా అమ్మకానికి సిద్ధంగాఉన్న వస్తువును ఎక్కువ ధరతో బేరం కుదుర్చుకోవటం. నిజానికి అలా చేసే వ్యక్తికి ఆ వస్తువుని కొనాలని ఉండదు. ఆ వస్తువు ధరను పెంచి తొలి కొనుగోలుదారుని మోసగించే ఉద్దేశ్యంతో బేరమాడతాడు. ఇలా చేయడం నిషిద్ధం (హరాం). 'తదాబుర్' అంటే ఎదుటి వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం, అతన్ని వదలిపెట్టడం, ఎదుటి వ్యక్తిపట్ల వీపు వెనకాల ఉన్న వస్తువుని పట్టించుకోనట్లుగా వ్యవహరించడం.

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Do not envy one another; do not inflate prices by overbidding against one another; do not hate one another; do not harbour malice against one another; and do not enter into commercial transaction when others have entered into that (transaction); but be you, O slaves of Allah, as brothers. A Muslim is the brother of another Muslim; he neither oppresses him nor does he look down upon him, nor does he humiliate him. Piety is here, (and he pointed to his chest three times). It is enough evil for a Muslim to hold his brother Muslim in contempt. All things of a Muslim are inviolable for his brother-in-faith: his blood, his property and his honour”.[Muslim].

ముఖ్యాంశాలు

ఇందులో ముస్లింల పరస్పర శ్రేయోభిలాషను గురించి, సౌభ్రాతృత్వం గురించి మరింత విస్తృతంగా బోధించటం జరిగింది. ముందుగా ముస్లింలు పరస్పరం అసూయ చెందరాదని వారించబడింది. అసూయ అనేది అత్యంత నీచమైన నైతికరుగ్మత. అగ్ని కట్టెలను కాల్చినట్లు ఇది మనిషి సత్కార్యాలను కాల్చి భస్మం చేసేస్తుంది. మనసులో అసూయాగ్ని రగిలిన వ్యక్తి ఇతరులు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేడు. ఎల్లప్పుడూ ఇతరులు నాశనమయిపోవాలని కోరుకుంటాడు. ఆ తరువాత పై హదీసులో ముస్లింలు పరస్పరం విరోధాన్ని, అక్కసును పెంచుకోవడాన్నుంచి, పరస్పర వైముఖ్యం నుండి వారించటం జరిగింది. ఎందుకంటే ఇది ఇస్లామీయ సౌభ్రాతృత్వానికే గొడ్డలిపెట్టు.

చివరలో 'నజష్' నుండి వారించటం జరిగింది. నజష్ వ్యవహారం ఒట్టి దగా, మోసాలతో కూడుకున్నది. ఇది పరస్పర శ్రేయోభిలాష భావానికి విరుద్ధం. ప్రజలు పరస్పరం మంచిని అభిలషించాలని ఇస్లాం బోధిస్తోంది. ఒక వ్యక్తి బేరమాడుతున్నప్పుడు అతనికి పోటీగా ఇంకొకవ్యక్తి ఆ వస్తువుని బేరమాడటం వల్ల గొడవలు, తగాదాలు జరగటానికి ఆస్కారముంది. అందుకే దీనిని కూడా నిషేధించడం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 237

238

హదీసు 238

وعن أَنسٍ رضي اللَّه عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لا يُؤْمِنُ أَحدُكُمْ حتَّى يُحِبَّ لأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ" متفقٌ عليه.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : "తన కోసం యిష్టపడేదే తన సోదరుని కోసం కూడా యిష్టపడ నంతవరకూ మీలో ఎవరూ (నిజమైన) విశ్వాసి కాజాలరు." (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణాల్లో ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Anas (May Allah bepleased with him) reported: The Prophet ﷺ said, “No one of you shall become a true believer until he desires for his brother what he desires for himself”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఒక ముస్లిం తన కోసం యిష్టపడేదే తన సోదరుని కోసం కూడా యిష్టపడితే, ఇక ప్రతి వ్యవహారంలోనూ అతను తోటి ముస్లిం మంచినే అభిలషిస్తాడు. అతనికి కీడు జరగాలని ఎన్నటికీ కోరుకోడు. ప్రజలమధ్య ఇలాంటి శ్రేయోభిలాష సర్వవ్యాప్తమైనపుడు సమాజంలో అందరూ పరస్పరం మంచిని కాంక్షించేవారు తప్ప ఒకరికి కీడు జరగాలని కోరుకునేవారెవరూ ఉండరు. పైగా సానుభూతితో, సహకార భావంతో కలిసి జీవిస్తారు. ఒండొకరి శ్రేయాన్ని కాంక్షిస్తారు. ఫలితంగా సమాజంలో శాంతి, సౌమనస్యాలు వర్థిల్లి సమాజం శ్రేయోరాజ్య రూపకల్పనకు దోహదపడుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 238

239

హదీసు 239

وعنه قال: قال رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "انْصُرْ أَخَاكَ ظَالِماً أَوْ مَظْلُوماً"فقَالَ رَجُلٌ: يَا رَسُول اللَّه أَنْصرهُ إِذَا كَانَ مَظلُوماً أَرَأَيْتَ إِنْ كَانَ ظَالِماً كَيْفَ أَنْصُرُهُ؟ قَالَ:"تَحْجُزُهُ أَوْ تَمْنعُهُ مِنَ الظُّلْمِ فَإِنَّ ذلِك نَصْرُهْ" رواه البخاري.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త ﷺ "నీ సోదరుడు దౌర్జన్యం చేసేవాడయినా లేక పీడితుడయినా అతనికి సహాయం చెయ్యి" అని అన్నారు. దానికి ఒక వ్యక్తి, "దైవప్రవక్తా! అతను పీడితుడయితే సహాయం చేస్తాను (గాని) అతనే స్వయంగా దౌర్జన్యం చేసేవాడయినప్పుడు నేనతనికి సహాయం ఎలా చేసేది?" అని సందేహపడగా, "నువ్వతన్ని దౌర్జన్యం చేయకుండా ఆపు. అదే అతనికి నువ్వు చేసే సహాయం" అని అన్నారు దైవప్రవక్త ﷺ. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం)

English

Anas (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Help your brother, whether he is an oppressor or is oppressed”. A man enquired: “O Messenger of Allah! I help him when he is oppressed, but how can I help him when he is an oppressor?” He ﷺ said, “You can keep him from committing oppression. That will be your help to him”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సమాజంలోని దౌర్జన్యాన్ని, అత్యాచారాలను రూపుమాపాలని ఈ హదీసు ఆదేశిస్తోంది. దౌర్జన్యానికి గురైన వ్యక్తికి సహాయం చేయటంతోపాటు దౌర్జన్యానికి పాల్పడే వ్యక్తిని కూడా దౌర్జన్యం చేయకుండా ఆపాలి. ఇది సాహసోపేతమైన పని. ఒక అత్యాచారిని అత్యాచారం చేయకుండా ఆపటం కూడా శ్రేయోభిలాష క్రిందికే వస్తుంది. కనుక అత్యాచారిని అత్యాచారం చేయకుండా ఆపితేగాని శ్రేయోభిలాష విధి నెరవేరదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 239

240

హదీసు 240

وعن أَبي هريرة رضي اللَّه عنه أَنَّ رسول الَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "حقُّ الْمُسْلمِِ عَلَى الْمُسْلِمِ خمسٌ: رَدُّ السَّلامِ، وَعِيَادَةُ الْمرِيضَ، واتِّبَاعُ الْجنَائِزِ، وإِجابة الدَّعوةِ، وتَشمِيت العْاطِسِ "مُتَّفَقٌ عليه. وفي رواية لمسلمٍ: "حق الْمُسْلمِ سِتٌّ: إِذا لقِيتَهُ فسلِّم عليْهِ، وإِذَا دَعاكَ فَأَجبْهُ، وَإِذَا اسْتَنْصَحَكَ فَانْصحْ لهُ، وإِذا عطَس فحمِد اللَّه فَشَمِّتْهُ. وَإِذَا مرِضَ فَعُدْهُ، وَإِذَا ماتَ فاتْبعهُ ".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺఇలా ప్రబోధించారు : ఒక ముస్లింకు తోటి ముస్లింపై ఐదు హక్కులున్నాయి. సలాంకు జవాబు చెప్పటం, వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించటం, శవం (జనాజా) వెంట వెళ్ళటం, ఆహ్వానాన్ని అంగీకరించటం, తుమ్మినవానికి (అల్ హమ్దులిల్లాహ్ అని అతను అంటే) (యర్‌హముకల్లా అని) జవాబు చెప్పటం. (బుఖారీ – ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక ముస్లింకు తోటి ముస్లింపై ఆరు హక్కులున్నాయి. నువ్వతన్ని కలుసుకున్నప్పుడు అతనికి సలాం చెయ్యి. అతను నిన్ను (విందు భోజనానికి) ఆహ్వానిస్తే అతని ఆహ్వానాన్ని అంగీకరించు. అతను నీ నుంచి మంచిని ఆశిస్తే నువ్వు (కూడా) అతని శ్రేయాన్ని అభిలషించు. అతను తుమ్మి అల్ హమ్దులిల్లాహ్ అని అంటే దానికి నువ్వు (యర్‌హముకల్లాహ్ అని) జవాబు చెప్పు. అతను జబ్బు పడితే అతన్ని పరామర్శించు. అతను చనిపోతే అతని (శవం) వెంట వెళ్లు (అంటే అతని జనాజాకు హాజరుకమ్మని అర్థం.)

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణంలోనూ, నికాహ్ ప్రకరణంలోనూ, పానీయాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “A believer owes another believer five rights: responding to greetings, visiting him in illness, following his funeral, accepting his invitation, and saying `Yarhamuk-Allah (May Allah have mercy on you),’ when he says `Al-hamdu lillah (Praise be to Allah)’ after sneezing”.[Al-Bukhari and Muslim].

Muslim’s narration is, “There are six rights of a Muslim upon a Muslim: When you meet him, greet him; when he invites you, respond to him; when he seeks counsel, give him advice; when he sneezes and praises Allah, say to him: `May Allah have mercy on you (Yarhamuk-Allah)’; when he is sick, visit him; and when he dies, follow his funeral”.

ముఖ్యాంశాలు

పైన పేర్కొనబడిన హక్కుల్ని ముస్లింల పరస్పర హక్కులని చెప్పి వారి మధ్య సౌభ్రాతృత్వాన్ని, ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేయటం జరిగింది. ఈ విషయాలు పైకి సామాన్యమైనవిగా కనబడతాయి. కాని పరిణామాల రీత్యా ఇవి బృహత్తర కార్యాలు. వీటిని ఆచరిస్తే సమాజం బాగుపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 240

241

హదీసు 241

وعن أَبي عُمارة الْبراءِ بنِ عازبٍ رضي اللَّه عنهما قَالَ: أَمرنا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِسبْعٍ: أَمرنَا بِعِيادة الْمرِيضِ، وَاتِّبَاعِ الْجنازةِ، وتَشْمِيتِ الْعاطِس، وَإِبْرارِ الْمُقْسِمِ، ونَصْرِ المظْلُومِ، وَإِجابَةِ الدَّاعِي، وإِفْشاءِ السَّلامِ. وَنَهانَا عَنْ خواتِيمَ أَوْ تَختُّمٍ بالذَّهبِ، وَعنْ شُرْبٍ بالفَضَّةِ، وعَنِ المياثِرِ الحُمْرِ، وَعَنِ الْقَسِّيِّ، وَعَنْ لُبْسِ الحَرِيرِ وَالإِسْتَبْرَقِ وَالدِّيبَاجِ. مُتَّفَقٌ عليه. وفي روايةٍ: وإِنْشَادِ الضَّالةِ فِي السَّبْعِ الأُولِ. "المياثِرِ"بيَاء مُثَنَّاةٍ قبْلَ الأَلِفِ، وَثَاء مُثَلَّثَة بعْدَهَا، وَهِيَ جمْعُ مَيْثِرةٍ، وَهِي شَيْءٌ يتَّخَذُ مِنْ حرِيرٍ وَيُحْشَى قُطْناً أَوْ غَيْرَهُ ويُجْعلُ فِي السُّرُجِ وكُورِ الْبعِيرِ يجْلِسُ عَلَيْهِ الرَّاكِبُ"والقَسيُّ"بفتحِ القاف وكسر السينِ المهملة المشدَّدةِ: وَهِيَ ثِيَابٌ تُنْسَجُ مِنْ حَرِيرٍ وكَتَّانٍ مُخْتَلِطَيْنِ."وإِنْشَادُ الضَّالَّةِ": تَعرْيفُهَا.

హజ్రత్ అబూ ఉమారా బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ మమ్మల్ని ఏడు పనులు చేయమని ఆదేశించారు. ఇంకా ఏడు పనులు చేయవద్దని వారించారు. వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించాలని, శవం (జనాజా) వెంట వెళ్ళాలని, తుమ్మినవాడికి జవాబు పలకాలని, ప్రమాణం చేసేవాడి ప్రమాణాన్ని నెరవేర్చాలని, బాధితుడికి సహాయం అందించాలని, ఆహ్వానించేవాడి ఆహ్వానాన్ని అంగీకరించాలని, సలాంను వ్యాప్తిచేయాలని ఆదేశించారు. ఇంకా బంగారపు ఉంగరాలు తొడగరాదని, వెండి పాత్రల్లో తినడం, త్రాగడం చేయరాదని, ఎర్రని పట్టు జీను ఉపయోగించరాదని, 'ఖస్' (ప్రాంతంలో తయారైన పట్టు) వస్త్రాలు తొడగరాదని, పట్టు వస్త్రాలు, ఇస్తబ్రఖ్ పట్టు వస్త్రాలు, దీబాజ్ పట్టు వస్త్రాలు ధరించరాదని ఆయన మమ్మల్ని వారించారు.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనం ప్రకారం మొదటి ఏడు విషయాల్లో ఆయన దొరికిన వస్తువుల్ని గురించి (అవి వాటి యజమాని దగ్గరికి తిరిగి చేరుకునేందుకు ప్రకటిస్తూ ఉండాలని ఆదేశించారు.

'మయాసిర్' అనేది 'మైసరా'కు బహువచనం. దీనిని పట్టు వస్త్రంతో తయారు చేసి అందులో నూలు మొదలగునవి కుక్కి దానిని వాహనారోహకుడు కూర్చోవటానికి వీలుగా గుర్రాల వీపులపై, ఒంటెల అంబారీలపై ఉంచుతారు. ఖస్సి అంటే పట్టు మరియు ఉన్ని రెండింటిని కలిపి తయారు చేసే వస్త్రాలు. "ఇన్‌షాదుజ్జ్యాల్లహ్" అంటే దొరికిన వస్తువుల గురించి ప్రకటించటం అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణంలోనూ, పానీయాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

Al-Bara’ bin `Azib (May Allah bepleased with them) reported: The Prophet ﷺ commanded us to observe seven things and forbade us seven. He ordered us to visit the sick; to follow funeral processions; to respond to a sneezer with `Yarhamuk-Allah (May Allah have mercy on you)’ when he says `Al-hamdu lillah (Praise be to Allah),’ to help the oppressed and to help others to fulfill their oaths, to accept invitation and to promote greeting. He forbade us to wear gold rings, to drink in silver utensils, to use Mayathir (silk carpets placed on saddles), to wear Al-Qassiy (a kind of silk cloth) to wear fine silk brocade.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రమాణం చేసేవాడి ప్రమాణాన్ని నెరవేర్చడమంటే ఎవరైనా మీపై నమ్మకంతో 'దైవంతోడు! మీరు తప్పకుండా ఈ పని చేయాల్సిందే' అని అంటే మీరు అతని నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆ పనిని పూర్తి చేయాలని అర్థం. అయితే ఆ పని అధర్మమైనది కాకూడదు. ధర్మసమ్మతమైన, నైతికపరమైన పనులైతే తప్పకుండా చేసిపెట్టాలి. బంగారం, పట్టు వస్త్రాలు కేవలం పురుషులకే నిషిద్ధం. స్త్రీలు నిస్సంకోచంగా వాటిని ధరించవచ్చు. ఇస్లాం ధర్మం స్త్రీలమాదిరి సౌకుమార్యం, నాజూకుతనం పురుషుల్లో ఉండటాన్ని గర్హిస్తుంది. అందుకే వారికి పట్టు, బంగారం ధరించటానికి అనుమతి ఇవ్వలేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|27. ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో వ్యవహరించడం గురించి…….|హదీసు 241