హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 262. విన్న విషయాన్ని పరిశోధించి చెప్పాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 262వ అధ్యాయం: మనిషి తాను చెప్పేదాన్ని, ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పమని తాకీదు చేయటం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 1549 – 1551) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

262. మనిషి తాను చెప్పేదాన్ని, ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పమని తాకీదు చేయటం

↑ విషయ సూచిక

باب الحثَّ عَلَى التثُّبت فيما يقوله ويحكيه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَلا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ} [الإسراء: ٣٦]

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "నీకు తెలియని విషయాల వెంటపడకు." (ఇస్రా: 36)

{مَا يَلْفِظُ مِنْ قَوْلٍ إِلاَّ لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ} [ق: ١٨]

"మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు." (ఖాఫ్: 18)

English

“And follow not (O man, i.e., say not or do not or witness not) that of which you have no knowledge.” [Al-Isrā’ 17:36]

“Not a word does he (or she) utter, but there is a watcher by him ready (to record it).” [Qāf 50:18]

1549

హదీసు 1549

وعنْ أَبي هُريْرة رضي اللَّه عنْهُ أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كَفَى بالمَرءِ كَذِباً أنْ يُحَدِّثَ بِكُلِّ مَا سمعِ" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: విన్న ప్రతి మాటనూ (నిజానిజాలు తెలుసుకోకుండా) వివరించటం చాలు, ఒక మనిషి అబద్ధాలకోరు అని చెప్పటానికి!

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని పీఠిక)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “It is enough for a man to prove himself a liar when he goes on narrating whatever he hears.”[Muslim].

ముఖ్యాంశాలు

విన్న ప్రతి మాటనూ నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు చెప్పేయటం లేక దాన్ని నిజమని తలపోయటం తగదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఎందుకంటే ఒకవేళ ఆ మాట గనక అబద్ధమయితే దాన్ని తన నోటి ద్వారా చెప్పినందుకు తాను కూడా అబద్ధాలకోరుగా పరిగణించబడే అవకాశముంది. అందుకని ముందుగా నిజానిజాలు విచారించుకొని మాట్లాడాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|262. మనిషి తాను చెప్పేదాన్ని, ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పమని తాకీదు చేయటం|హదీసు 1549

1550

హదీసు 1550

وعن سمُرة رضي اللَّه عنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ حدَّث عنِّي بِحَدِيثٍ يرَى أنَّهُ كذِبٌ، فَهُو أحدُ الكَاذِبين" رواه مسلم.

హజ్రత్ సమురా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: తాను అబద్ధం చెబుతున్నానని తెలిసి కూడా ఎవరయినా ఒక విషయం గురించి అది నేను అన్నమాట అని చెబితే అతనూ ఓ అబద్ధాలకోరుగానే పరిగణించబడతాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని పీఠిక)

English

Samurah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who relates from me something which he deems false is one of the liars.”[Muslim]

ముఖ్యాంశాలు

కొన్ని ఉల్లేఖనాల్లో 'కాజిబైన్' అనే పదం ఉంది. దాని ప్రకారం హదీసు భావం 'ఇద్దరు అబద్ధాలకోరుల్లో ఇతనూ ఒకడుగా పరిగణించడతాడు' అని అవుతుంది. ఇద్దరు అబద్ధాలకోరులంటే ఒకడు, దైవప్రవక్త ﷺ గురించి అబద్ధాలు కల్పించేవాడు, రెండోవాడు వాటిని ఇతరుల వరకూ చేరవేసేవాడు. అబద్ధపు హదీసుల్ని ఏమాత్రం తటపటాయించకుండా వివరించే పండితుల్ని, బోధకుల్ని ఇందులో తీవ్రంగా హెచ్చరించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|262. మనిషి తాను చెప్పేదాన్ని, ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పమని తాకీదు చేయటం|హదీసు 1550

1551

హదీసు 1551

وعنْ أسماءَ رَضِيَ اللَّه عنْها أنَّ امْرأة قالَتْ: يَا رَسُول اللَّه إنَّ لِي ضرَّةَ فهل علَيَّ جناحٌ إنْ تَشبعْتُ مِنْ زَوْجِي غيْرَ الَّذِي يُعطِيني؟ فَقَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "المُتشبِّعُ بِما لَمْ يُعْطَ كَلابِس ثَوْبَي زُورٍ" متفقٌ عليه. المُتشبِّعُ: هو الذي يُظهرُ الشَّبع وليس بشبعان، ومعناها هُنا: أنَّهُ يُظهرُ أنَّهُ حَصلَ لَهُ فضِيلةٌ وليْستْ حاصِلة."ولابِس ثَوْبي زورٍ"أيْ: ذِي زُورٍ، وَهُوَ الَّذِي يزَوِّرُ عَلَى النَّاس، بِأنْ يَتَزَيَّى بِزيِّ أهْلِ الزُّهدِ أَو العِلم أَو الثرْوةِ، ليغْترَّ بِهِ النَّاسُ وليْس هُوَ بِتِلك الصِّفةِ، وَقَيلَ غَيْرُ ذَلِكَ واللَّه أعْلَمُ.

హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక స్త్రీ (దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి) "దైవప్రవక్తా! నాకు ఒక సవతి ఉంది. నా భర్త నాకు ఏమీ ఇవ్వకపోయినా ఆయన నాకు చాలా ఇస్తున్నాడని నేనామెతో చెబితే అది తప్పవుతుందా?" అని అడిగింది. అందుకు దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ, "ఒక వస్తువు తనకు ఇవ్వకపోయినా ఇచ్చినట్టు బూటకాన్ని ప్రదర్శించేవాడు, ఒక జత అబద్ధపు బట్టలు తొడుక్కున్నవాడితో సమానం" అని అన్నారు. (బుఖారీ-ముస్లిం)

'ముతషబ్బి' అంటే తనకు తృప్తిగా లేకపోయినా పైకి తృప్తిని వ్యక్తపరిచేవాడు. ఇక్కడ దీని భావం ఏమిటంటే తనకు (విద్యావిషయాల్లో లేక సిరిసంపదల రీత్యా) ప్రత్యేక స్థానముందనే ధోరణిని ప్రదర్శించటం. వాస్తవానికి అతనికి ఆ స్థానం ఉండదు. 'సౌబై జూరిన్'కు వాస్తవిక రూపం 'సౌబై జూ జూరిన్.' అంటే ప్రజల్ని తన వలలో వేసుకునే ఉద్దేశ్యంతో వారి ముందు తనలో లేని రూపాన్ని ప్రదర్శించేవాడు. అతను ప్రజల్ని మోసం చేసేందుకు ఐహిక అనాసక్తపరుల, విద్యావంతుల, ధనవంతుల వేషం వేస్తాడు. వాస్తవానికి అతనిలో ఆ మంచిగుణాలు ఉండవు. కొందరు దీనికి మరికొన్ని అర్ధాలు కూడా చెప్పారు. వాస్తవం అల్లాహ్‌కు తెలుసు.

(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ, అలంకరణల ప్రకరణం)

English

Asma’ (radiyallahu anha) reported: A woman came to the Messenger of Allah ﷺ and said: “I have a co-wife. “Is there any harm for me if I give her the false impression of getting something from my husband which he has not in fact given me?” The Messenger of Allah ﷺ said, “The one who creates a false impression of receiving what one has not been given is like one who wears two garments of falsehood.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

కొంతమంది తమకు అసలు ప్రపంచం పట్ల ఆసక్తే లేనట్టు గొప్ప ఆరాధనాపరులుగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు గొప్ప పండితుల వేషం వేసుకొని ప్రజలచేత తమ పాండిత్యాన్ని ఒప్పింపజూస్తుంటారు. ఇంకొందరు ప్రజలు తమల్ని చూసి ధనవంతులనుకోవాలని ఎల్లప్పుడూ మంచి ఖరీదైన దుస్తులు ధరిస్తుంటారు. ఒకవేళ మోసం కోసం ఇలా చేస్తున్నట్లయితే అది ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది. మనిషి తన వాస్తవిక పరిస్థితి ఏమిటో దాన్నే పైకి వ్యక్తపరచాలి. అంతకుమించి తన్నుతాను గొప్పవానిగా ప్రదర్శించటానికి పూనుకోరాదు.

అదే విధంగా సవతులు కూడా ఒకర్నొకరు మోసపుచ్చుకునే ఉద్దేశ్యంతో తమ గురించి లేనిపోని విషయాలు చెప్పుకోరాదు. కేవలం సవతుల మనసుల్ని మండించటానికి, వారిలో అసూయ జ్వాలల్ని రగిలించటానికి భర్తకు తమ మీద ప్రత్యేక చనువు, ప్రేమానురాగాలున్నట్లు, ఆయన తమ మీద కానుకల వర్షం కురిపిస్తున్నట్లు చెప్పుకోరాదు. ముఖ్యంగా అలా జరగనప్పుడు. ఒకవేళ అలా జరుగుతున్నా, అది భర్త చేస్తున్న తప్పు కనుక దాన్ని కప్పి ఉంచటానికి ప్రయత్నించాలిగాని ఆ విషయం సవతులతో చెప్పి వారి హృదయాలను గాయపర్చరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|262. మనిషి తాను చెప్పేదాన్ని, ఒకరి నుంచి విని వివరించే దాన్ని పరిశోధించుకొని చెప్పమని తాకీదు చేయటం|హదీసు 1551