హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 261వ అధ్యాయం: అబద్ధంలోని ధర్మసమ్మతమైన రకాలు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1548) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
261. అబద్ధంలోని ధర్మసమ్మతమైన రకాలు
باب بيان مَا يجوز من الكذب
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
إْعْلَمْ أنَّ الْكَذب، وَإنْ كَانَ أصْلُهُ مُحرَّماً، فيَجُوزُ في بعْض الأحْوالِ بشرُوطٍ قَدْ أوْضَحْتُهَا في كتاب:"الأذْكارِ"ومُخْتَصَرُ ذَلِكَ أنَّ الكلامَ وسيلةٌ إِلَى المقاصدِ، فَكُلُّ مَقْصُودٍ محْمُودٍ يُمْكِن تحْصيلُهُ بغَيْر الْكَذِبِ يَحْرُمُ الْكذِبُ فِيهِ، وإنْ لَمْ يُمكِنْ تَحْصِيلُهُ إلاَّ بالكذبِ جازَ الْكذِبُ. ثُمَّ إنْ كانَ تَحْصِيلُ ذَلِكَ المقْصُودِ مُباحاً كَانَ الْكَذِبُ مُباحاً، وإنْ كانَ واجِباً، كَانَ الكَذِبُ واجِباً، فإذا اخْتَفى مُسْلمٌ مِن ظالمٍ يُريدُ قَتلَه، أوْ أخْذَ مالِه، وأخَفي مالَه، وسُئِل إنسانٌ عَنْهُ، وَجَبَ الكَذبُ بإخفائِه، وكذا لو كانَ عِندهُ وديعَةٌ، وأراد ظالِمٌ أخذَها، وجبَ الْكَذِبُ بإخفائها، والأحْوطُ في هَذَا كُلِّه أنْ يُوَرِّي، ومعْنَى التَّوْرِيةِ: أنْ يقْصِد بِعبارَتِه مَقْصُوداً صَحيحاً ليْسَ هُوَ كاذِباً بالنِّسّبةِ إلَيْهِ، وإنْ كانَ كاذِباً في ظاهِرِ اللًّفظِ، وبِالنِّسْبةِ إِلَى مَا يفهَمهُ المُخَاطَبُ ولَوْ تَركَ التَّوْرِيةَ وَأطْلَق عِبارةَ الكذِبِ، فليْس بِحرَامٍ في هَذَا الحَالِ. واسْتَدلَّ الْعُلَماءُ بجَوازِ الكَذِب في هَذَا الحَال
ఒక విషయం తెలుసుకోండి. వాస్తవానికి అబద్ధం పలకటం నిషిద్ధమే. కాని కొన్ని సందర్భాల్లో కొన్ని షరతులకు లోబడి అబద్ధం చెప్పవచ్చు. వాటిని నేను ఇంతకు ముందు కితాబుల్ అజ్కార్ (ధ్యాన ప్రకరణం)లో వివరించాను. వాటి సారాంశం ఇది: ఉద్దేశ్యాలు నెరవేరటానికి సంభాషణ ఒక సాధనం. కనుక ఒక అభిలషణీయమైన ఉద్దేశ్యం నెరవేరటానికి అబద్ధం చెప్పవలసిన అవసరం లేనప్పుడు అబద్ధం చెప్పటం నిషిద్ధం. ఒకవేళ అబద్ధం చెప్పనిదే ఆ మంచి ఉద్దేశ్యం నెరవేరటం సాధ్యంకాకపోతే అప్పుడు అబద్ధం చెప్పవచ్చు. ఇంకో విషయమేమిటంటే ఆ ఉద్దేశ్యాన్ని సాధించటం ధర్మసమ్మతమైతే (దానికోసం) అబద్ధం చెప్పటం కూడా ధర్మసమ్మతమవుతుంది. ఒకవేళ ఉద్దేశ్యాన్ని సాధించటం తప్పనిసరి అయినప్పుడు అబద్ధం చెప్పటం కూడా తప్పనిసరి అవుతుంది. (ఉదాహరణకు) ఒక దుర్మార్గుడు ఒక ముస్లింని చంపటానికో లేక అతని దగ్గరున్న ధనం తీసుకోవటానికో ప్రయత్నిస్తున్నాడనుకోండి. (అతనికి భయపడి) ఆ ముస్లిం దాక్కున్నాడు. డబ్బును కూడా దాచాడు. అలాంటప్పుడు ఎవరినైనా ఆ ముస్లిం లేక అతని ధనం జాడ తెలుపమని అడిగితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచటం కోసం ఆ వ్యక్తి అబద్ధం చెప్పటం అవసరం (వాజిబ్). అలాగే ఒకవేళ అతని దగ్గర ఏదయినా అప్పగింత (అమానతు) ఉందనుకోండి. ఏ దుర్మార్గుడయినా దాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆ అప్పగింత గురించి అతనికి తెలియకుండా ఉండటం కోసం తప్పనిసరిగా అబద్ధం చెప్పాలి. అయితే ఇలాంటి వ్యవహారాలన్నిటిలోనూ 'తౌరియా' చేయటం నిందారహిత పద్ధతి. తౌరియా అంటే ద్వంద్వార్ధాలు పలికే మాటలు మాట్లాడాలి. ఆ మాటలకు పై భావం ఒకటుంటే లోపల మరొక భావముంటుంది. తౌరియా చేసే వ్యక్తి తాను చెప్పేమాటల్లో, ఎదుటి వ్యక్తి అర్ధం చేసుకునే దాన్నిబట్టి అబద్ధం చెబుతున్నట్లుగా అనిపిస్తాడు కాని వాస్తవానికి ఆ మాటల ద్వారా తన ఉద్దేశ్యం, తాను తలచుకున్నదాన్ని బట్టిచూస్తే అది అబద్ధం అయి ఉండదు. ఒకవేళ ఎవరయినా తౌరియా చేయకుండా పచ్చి అబద్ధం చెప్పినా పై సందర్భాల్లో అలా చేయటం నిషిద్ధం కాదు. ఇలాంటి సందర్భాల్లో అబద్ధం చెప్పవచ్చుననే విషయానికి పండితులు ఉమ్మె కుల్సూమ్ హదీసును నిదర్శనంగా భావిస్తున్నారు. ఆ హదీసు ముందు రాబోతోంది.
English
The learned compiler of this book has put forth some arguments to prove that it is lawful to tell a lie under the stress of circumstances. An example of this is the case of a Muslim who hides himself or his money from a tyrant who is bent on killing him or taking his money from him. If one knows the whereabouts of this Muslim or his money and is asked about it, it is permissible to lie in this case to save a Muslim’s life or his property, but it is better to give an equivocal answer, that is one which is not clear or definite in meaning, and that can be interpreted in more than one way in order to shun lying altogether.
హదీసు 1548
حدِيث أمِّ كُلْثومٍ رَضِيَ اللَّه عنْهَا أنَّها سَمِعَتْ رَسُولَ اللَْه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "لَيْس الكَذَّابُ الَّذي يُصلحُ بيْنَ النَّاسِ، فينمِي خَيْراً أَوْ يقولُ خَيْراً "متفقٌ عَلَيهِ. زاد مسلم في رواية:"قالت: أمُّ كُلْثُومٍ: ولَم أسْمعْهُ يُرْخِّصُ في شَيءٍ مِمَّا يقُولُ النَّاسُ إلاَّ في ثلاثٍ: تَعْني: الحَرْبَ، والإصْلاحَ بيْن النَّاسِ، وحديثَ الرَّجُلَ امْرَأَتَهُ، وَحَدِيثَ المرْأَةِ زوْجَهَا.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) తెలియజేశారు: ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పరచే ఉద్దేశ్యంతో ఇతరులకు మంచిమాటలు చేరవేసేవాడు, మంచి మాటలు పలికేవాడు అబద్ధాలకోరు కాడు. (బుఖారీ-ముస్లిం)
ఒక ఉల్లేఖనంలో ముస్లిం అదనంగా ఇలా వివరించారు: హజ్రత్ ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ మూడు సందర్భాల్లో తప్ప మరే సందర్భంలోనూ ప్రజలకు సంభాషణలో (అబద్ధం చెప్పటానికి) అనుమతినిచ్చినట్లు తాను వినలేదు. ఆ మూడు సందర్భాలు అంటే: "యుద్ధం, ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పరచటం, భర్త భార్యతో మాట్లాడటం లేక భార్య భర్తతో మాట్లాడటం" అని ఆమె అభిప్రాయం.
English
The sum and substance of discussion has been derived from the narration ascribed to Umm Kulthum (radiyallahu anha). She said: The Messenger of Allah ﷺ said, “A liar is not the one who tries to bring about a reconciliation between the people and speaks good to avert dispute or to convey good.” [Al-Bukhari].
ముఖ్యాంశాలు
అనుమతినివ్వటమంటే అబద్ధం చెప్పేందుకు అనుమతినివ్వటమని అర్థం. 'యన్మీ ఖైరన్' అంటే మంచిచాడీలు చెప్పటం. ఒకరి మంచి మాటలు మరొకరికి చేరవేయటం. ఇద్దరు విరోధుల్ని కలపటం కోసం, వారి మధ్యనున్న విద్వేషాన్ని, వైషమ్యాన్ని దూరం చేయటం కోసం తమ తరఫునుంచి కొన్ని మంచి అబద్ధాలు కల్పించుకొని వారికి చెప్పటం మూలంగా వారి మధ్యనున్న విద్వేషాలు, వైషమ్యాలు మంచులా కరిగిపోయి వారి అంతరాల అగాధాలు పూడుకొని విడదీయరాని ఆత్మీయబంధంగా మారిపోయిందనుకోండి. ఆ పని చేసినవారు దేవుని దృష్టిలో అబద్ధాలకోరులుగా, చాడీలు చెప్పేవారిగా పరిగణించబడరు. అదే విధంగా యుద్ధసమయంలో కూడా అవసరం ఏర్పడినప్పుడు, జరగని సంఘటన గురించి జరిగిందని అబద్ధం చెప్పవచ్చు. లేకపోతే ముస్లింలకు ఘోరనష్టం జరుగుతుంది. మూడో సందర్భం భార్యాభర్తల సంభాషణకు సంబంధించినది. వైవాహిక సంబంధాన్ని కొనసాగించటం కోసం లేక దాని సుఖమయం కోసం కొన్నికొన్ని సందర్భాల్లో భార్య భర్తతో, భర్త భార్యతో కొన్ని విషయాలు దాచవలసి వస్తుంది. సామాజిక జీవనంలో ఇలాంటి ఎన్నో మలుపులు ఎదురౌతుంటాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో చూచాయగా అబద్ధం చెప్పటం ధర్మసమ్మతమే. కాని దీన్ని ఆసరాగా చేసుకొని భార్యాభర్తలు, పొద్దస్తమానం అబద్ధం చెప్పుకోవచ్చని దీనిభావం ఎంతమాత్రం కాదు. అబద్ధం ముమ్మాటికీ అబద్ధమే. అది ఘోరపాతకం. అందుకని సామాజిక జీవనం కూడా నిజం మీదనే ఆధారపడి ఉండాలి. వారిరువురి నీతినడవడికలు పరస్పరం అద్దంలా పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. అందులోనే సామాజిక జీవన సౌఖ్యం, ఆనందం ఇమిడి ఉంది. కొన్నికొన్ని సందర్భాల్లో ఈ విధానం వికటించి నిజాన్ని దాచటం, అబద్ధం చెప్పటం మూలంగా మనుషుల మధ్య అంతరాల అగాధాలు మరింత పెరిగిపోయే ప్రమాదముంటుంది. కనుక అవసరమైన పరిస్థితుల్లోనే అబద్ధం సత్ఫలితాలను ఇవ్వగలదు.
ఇస్లాం ధర్మం సమాజంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని ముందుగానే పసిగట్టి వారికి ఈ అనుమతిని ప్రసాదించింది. ఇస్లాంధర్మ సహజత్వానికి ఇది ప్రబల తార్కాణం కనుక ఈ సౌకర్యాన్ని అనుమతి మేరకు ఉపయోగించుకోవటంలోనే మేలు ఉంది. అవనసరంగా ఉపయోగిస్తే దానివల్ల నష్టమే జరుగుతుంది. ఇహలోక నష్టం, పరలోక నష్టం కూడా.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|261. అబద్ధంలోని ధర్మసమ్మతమైన రకాలు|హదీసు 1548
You must be logged in to post a comment.