హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 243వ అధ్యాయం: దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 11 హదీసులు (హదీసు 1398 – 1408) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత

↑ విషయ సూచిక

باب فضل الصَّلاة عَلَى رَسُول الله صلى الله عليه وسلم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{إِنَّ اللَّهَ وَمَلائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيماً} [الأحزاب: ٥٦]

"అల్లాహ్, ఆయన దూతలు దైవప్రవక్తపై 'దరూద్'ను పంపుతారు. విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్‌లు పంపండి." (అల్ అహ్‌జాబ్: 56)

ముఖ్యాంశాలు

'దరూద్'ను అరబీలో 'సలాత్' అంటారు. దేవుడు దరూద్ పంపటమంటే కారుణ్య వర్షం కురిపించటమనీ, దూతలు దరూద్ పంపటమంటే మన్నింపు కోసం ప్రార్థించటమనీ, విశ్వాసులు దరూద్ పంపటమంటే శ్రేయస్సు కోసం దుఆ చేయటమనీ ఇంతకుముందే చెప్పుకున్నాం. పైన పేర్కొనబడిన ఆయతులో దేవుడు ముస్లింలను దైవప్రవక్తకై దరూద్, సలామ్‌లు రెండూ పంపమని ఆదేశిస్తున్నాడు. దీని వివరాలు మున్ముందు 1406వ హదీసులో రాబోతున్నాయి.

English

“Allah exalts the mention of His Messenger ﷺ and His angels supplicate Him to do so. O you who believe! supplicate Allah to exalt his mention and to grant him safety and security.

1398

హదీసు 1398

وعنْ عبد اللَّه بن عمرو بن العاص، رضي اللَّه عنْهُمَا أنَّهُ سمِع رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "مَنْ صلَّى عليَّ صلاَةً، صلَّى اللَّه علَيّهِ بِهَا عشْراً" رواهُ مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నారు: నా కోసం, ఒకసారి దరూద్ పఠించిన వ్యక్తి మీద దేవుడు పది కారుణ్యాలు కురిపిస్తాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: I heard the Messenger of Allah ﷺ saying: “Whoever supplicates Allah to exalt my mention, Allah will exalt his mention ten times.”[Muslim].

ముఖ్యాంశాలు

దరూద్ పఠించటమంటే "అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్….." అనే దుఆను చివరి వరకూ పఠించటమని అర్థం. ఈ దుఆలో దైవప్రవక్త ﷺ మీద దేవుని కారుణ్య వర్షం కురవాలనీ, ఆయన అంతస్తులు పెరగాలనీ ప్రార్థించటం జరుగుతుంది. ఇలా ప్రార్థిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. పై హదీసు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1398

1399

హదీసు 1399

وعن ابن مسْعُودٍ رضي اللَّه عنْهُ أنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَوْلى النَّاسِ بِي يوْمَ الْقِيامةِ أَكْثَرُهُم عَليَّ صَلاَةً "رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నాకోసం అందరికంటే ఎక్కువగా దరూద్ పఠించినవాడు ప్రళయదినాన నాకు అత్యంత చేరువలో ఉంటాడు. (తిర్మిజీ-హసన్)

(తిర్మిజీలోని సలాత్ అధ్యాయం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “The people who will be nearest to me on the Day of Resurrection will be those who supplicate Allah more often for me.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

అందరికన్నా చేరువలో ఉంటాడంటే దైవప్రవక్త ﷺ సిఫారసుకు అందరికన్నా ఎక్కువ హక్కుదారుడౌతాడని భావం. ఈ హదీసు కూడా దైవప్రవక్త ﷺ మీద అతి ఎక్కువగా దరూద్ పఠిస్తూ ఉండాలని ప్రబోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1399

1400

హదీసు 1400

وعن أوس بن أوسٍ، رضي اللَّه عنْهُ قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ مِن أَفْضلِ أيَّامِكُمْ يَوْمَ الجُمُعةِ، فَأَكْثِرُوا عليَّ مِنَ الصلاةِ فِيهِ، فإنَّ صَلاتَكُمْ معْرُوضَةٌ علَيَّ"فقالوا: يَا رسول اللَّه، وكَيْفَ تُعرضُ صلاتُنَا عليْكَ وقدْ أرَمْتَ؟، يقولُ: بَلِيتَ، قالَ:"إنَّ اللَّه حَرم عَلَى الأرْضِ أجْساد الأنْبِياءِ". رواهُ أَبُو داود بإسنادٍ صحيحِ.

హజ్రత్ ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ (తన సహచరులకు ప్రబోధిస్తూ), "మీరోజుల్లో జుమా రోజు (శుక్రవారం) అత్యంత శ్రేష్ఠమైనది. కనుక ఆ రోజు నా కోసం ఎక్కువగా దరూద్ పఠించండి. మీరు పఠించే దరూద్ నాకు చేరవేయబడుతుంది" అని అన్నారు. అది విని సహచరులు, "దైవప్రవక్తా! మేము పఠించే దరూద్ మీకు ఎలా చేరవేయబడుతుంది. అప్పటికి మీరు మట్టిలో కలిసిపోయి ఉంటారు కదా?" అని అడిగారు. అందుకాయన, "దేవుడు, దైవప్రవక్తల శరీరాలను మట్టి కోసం నిషేధించాడు" అని చెప్పారు. (అబూదావూద్ ఈ హదీసును దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

(అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం)

English

Aus bin Aus (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Among the best of your days is Friday; so supplicate Allah more often for me in it , for your supplications will be displayed to me.” He was asked: “O Messenger of Allah! How will our blessings be displayed to you when your decayed body will have mixed with the earth?” He ﷺ replied, “Allah has prohibited the earth from consuming the bodies of the Prophets.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

మట్టికోసం నిషేధించటమంటే మట్టి వాటిని తినకుండా చేయటమని అర్థం. అంటే మట్టి దైవప్రవక్తల శరీరాలను తినకుండా ఉంచుతుందని భావం. అందువల్ల ప్రవక్తల భౌతిక కాయాలు మట్టిలో కృశించిపోకుండా ఉంటాయి. మనం దైవప్రవక్త ﷺకోసం పఠించే దరూద్, దైవదూతల ద్వారా ఆయనకు చేరవేయబడుతుంది. ఇతర హదీసుల ద్వారా కూడా ఈ విషయం బోధపడుతోంది.

ఇంకో విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆయన ఆత్మను శరీరంలోకి ప్రవేశింపజేయటం జరుగుతుంది. దాంతో ఆయన, తనకు సలాం చేసిన వారికి ప్రతిసలాం కూడా చేయగల్గుతారు. (హదీసువేత్తల దృష్టిలో ఆత్మను శరీరంలోకి తిరిగి ప్రవేశింపజేయటమనే హదీసు 'హసన్' కోవకు చెందినది. అంటే ఆమోద యోగ్యమైనదేనన్నమాట) ఈ హదీసు మొదట్లోని కొంతభాగం 'జుమానాటి విశిష్ఠత' అనే అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1400

1401

హదీసు 1401

وعنْ أَبي هُريْرةَ رضي اللَّه عنهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "رَغِم أنْفُ رجُلٍ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ علَيَّ" رواهُ الترمذي وقالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నా కోసం దరూద్ పఠించని వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక! (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “May his nose soil with dust in whose presence mention is made of me and he does not supplicate for me.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ముక్కుకి మన్ను తగలటమంటే, అవమానం, పరాభవం పాలుగావటమని అర్థం. దైవప్రవక్త శుభనామం విన్నప్పుడు దరూద్ పఠించే బదులు బొటనవేళ్ళకు ముద్దుపెట్టుకొని కళ్ళకద్దుకునేవారు ఈ హదీసు నుండి గుణపాఠం నేర్చుకోవాలి. దైవప్రవక్త శుభనామం విన్నప్పుడు దరూద్ పఠించమనే ఆదేశం ఉందిగాని బొటనవేళ్ళకు ముద్దుపెట్టుకోమని ఎక్కడా లేదు. పోతే దైవప్రవక్త పేరు విన్నప్పుడు దరూద్ పఠించటం తప్పనిసరా లేక కేవలం అభిలషణీయమా? అన్న విషయంలో స్వల్పమైన భేదాభిప్రాయం ఉంది. కొంతమంది పండితులు తప్పనిసరి (వాజిబ్) అని అంటే మరికొందరు అభిలషణీయం (ముస్తహబ్) అని అంటున్నారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1401

1402

హదీసు 1402

وعنهُ رضي اللَّه عنْهُ قَالَ: قالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَجْعلُوا قَبْرِي عِيداً، وَصلُّوا عَلَيَّ، فَإنَّ صَلاتَكُمْ تَبْلُغُني حيْثُ كُنْتُمْ" رواهُ أَبُو داود بإسنادٍ صحيح.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు నా సమాధిని తిరునాళ్ళగా చేసుకోకండి. నా కోసం దరూద్ పఠించండి. మీరెక్కడున్నా మీరు పఠించే దరూద్ నాకు చేరుతుంది. (అబూదావూద్ ఈ హదీసుని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు.)

(సుననె అబూదావూద్‌లోని మనాసిక్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Do not make my grave a place of festivity, and supplicate Allah for me, for your supplication reaches me wherever you are.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

"నా సమాధిని తిరునాళ్ళగా చేసుకోకండి" అంటే తిరునాళ్ళలోలాగా నా సమాధి దగ్గర గుమిగూడి ఉత్సవాలు జరపకండి అని భావం. దురదృష్టవశాత్తు ధర్మంలో కొత్తపోకడలు లేవనెత్తే ఒకవర్గం ఈ విధంగా సమాధుల దగ్గర ఉత్సవాలు, వేడుకలు జరపటాన్ని చాలా మంచిపనిగా భావిస్తోంది. కాని దైవప్రవక్త ﷺ అంతటివారే తన సమాధి దగ్గర ఉత్సవాలు, వేడుకలు జరుపరాదని వారిస్తున్నారు. మరి అలాంటప్పుడు సామాన్య వలీల, పుణ్యాత్ముల సమాధుల దగ్గర తిరునాళ్ళలు, జాతరలు, ఉత్సవాలు, వేడుకలు నిర్వహించటం ధర్మసమ్మతం ఎట్లా అవుతుంది? కొంతమంది ఈ హదీసు భావాన్ని వక్రీకరించి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. "నా సమాధిని తిరునాళ్ళగా చేసుకోకండి" అంటే "తిరునాళ్ళకులాగా ఏడాదికోసారి రాకండి. అడపాదడపా, తరచూ వస్తూ ఉండండి"అని అర్థం తీసుకుంటున్నారు. ఎంత తేడా! వాస్తవానికి దాని అర్థం అది కాదు. ఆ తర్వాతి వాక్యాలు పరిశీలిస్తే అసలు భావం ఏమిటో సులభంగా బోధపడుతుంది. తర్వాత దైవప్రవక్త ఏమంటున్నారో చూడండి- మీరెక్కడున్నా మీ దరూద్ నాకు చేరుకుంటుంది- అంటే మీరు పనిగట్టుకొని నా దగ్గరికి రానవసరం లేదనే కదా అర్థం. దైవప్రవక్త ﷺ సమాధి దగ్గరకు అసలు వెళ్ళనేకూడదు అని మా అభిప్రాయం ఎంతమాత్రం కాదు. ప్రవక్త సమాధిని సందర్శించాలన్న అభిలాష ప్రతి ముస్లింకూ ఉంటుంది. అలా సందర్శించటం ముస్తహబ్ (అభిలషణీయమన్న) విషయంలోనూ ఎలాంటి సందేహం లేదు. అయితే దైవప్రవక్త సమాధి సందర్శనం కోసం, లేదా అక్కడకెళ్ళి దరూద్ పఠించటం కోసం పనిగట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి బదులు మస్జిదె నబవీని దర్శించుకునే ఉద్దేశ్యంతో మదీనా నగరానికి బయలుదేరి అలాగే ప్రవక్త సమాధిని కూడా చూసి వద్దాం అని అనుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1402

1403

హదీసు 1403

وعنهُ أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا مِنْ أَحَدٍ يُسلِّمُ علَيَّ إلاَّ ردَّ اللَّه علَيَّ رُوحي حَتَّى أرُدَّ عَليهِ السَّلامَ". رواهُ أَبُو داود بإسنادٍ صحيحٍ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా నాకు సలాం చేస్తే (ఆ సమయంలో) దేవుడు తప్పకుండా నా ఆత్మను నా వద్దకు త్రిప్పిపంపిస్తాడు. దాంతో నేనతనికి ప్రతిసలాం చేయగలుగుతాను. (అబూదావూద్ ఈ హదీసుని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు)

(సుననె అబూదావూద్‌లోని మనాసిక్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whenever someone greets me, Allah returns the soul to my body (in the grave) and I return his greeting.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

దీనిద్వారా దైవప్రవక్త ﷺ సమాధిలో బ్రతికే ఉన్నారనీ, తనకు సలాం చేసేవారికి ఆయన ప్రతిసలాం చేస్తూ ఉంటారని బోధపడుతోంది. అయితే ఆ జీవితం సమాధి జీవితం కనుక దాని వాస్తవాలు మనకు తెలియవు. దైవప్రవక్తలు సమాధుల్లో బ్రతికే ఉంటారన్న విషయం నిజమే అయినప్పటికీ- వారి జీవితం కూడా మన ప్రపంచ జీవితం లాగే ఉంటుందనీ పైగా అది ఇంకా పరిపూర్ణంగా ఉంటుందని వాదించటం సమంజసం కాదు. ఈ వాదన నిరాధారమైనది. పైగా ఖుర్‌ఆన్ హదీసుల వివరాలకు విరుద్ధమైనది. ఒకవేళ దైవప్రవక్త ﷺ ప్రపంచంలోలాగా బ్రతికే ఉంటే ఆత్మను త్రిప్పిపంపాల్సిన అవసరం ఏముంటుంది? ఆత్మ అవసరం లేకుండానే ప్రతిసలాం చేయగలిగేవారు కదా! అయితే ఈ సందర్భంగా మనకో సందేహం రావచ్చు. ప్రపంచంలో కోట్లాది ముస్లింలున్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు అనుక్షణం దరూద్ పఠిస్తూనే ఉంటారు. అలా అయితే మాటిమాటికీ ఆత్మను త్రిప్పిపంపించటం ఎలా సాధ్యమవుతుంది? దీనికి సమాధానం ఒక్కటే. ఈ అనుమానం దేవునిమీద అవిశ్వాసానికి తార్కాణం. దేవుడు తన ఆత్మను త్రిప్పి పంపిస్తాడని స్వయంగా దైవప్రవక్త ﷺ చెప్పిన తర్వాత మన పని దాని వాస్తవికతను విశ్వసించటం వరకే. అది ఎలా జరుగుతుంది? దానిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాలు మనకు అనవసరం. దేవుడు అన్నీ చేయగల సమర్ధుడన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వసించే అగోచర విషయాల్లో దీన్ని కూడా ఒకటిగా భావించాలి. వాటి వాస్తవిక పరిస్థితి గురించి దేవునికి తప్ప మరెవరికీ తెలియదు. మొత్తానికి ఈ హదీసులో వీలైనంత ఎక్కువగా దైవప్రవక్త ﷺ కోసం దరూద్‌లు పఠిస్తూ, ఆయనకు సలాములు చేస్తూ ఉండాలని ప్రబోధించబడింది. అలా చేస్తే దైవప్రవక్త ﷺ కూడా ప్రతిసలాం చేస్తారు. ఆయనచేత ప్రతిసలాం చేయించుకోవటం నిజంగా మహాభాగ్యం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1403

1404

హదీసు 1404

وعن علِيٍّ رضي اللَّه عنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " الْبخِيلُ مَنْ ذُكِرْتُ عِنْدَهُ، فَلَم يُصَلِّ علَيَّ". رواهُ الترمذي وقالَ: حديثٌ حسنٌ صحيحٌ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: తన ముందు నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పిసినిగొట్టు. (తిర్మిజీ-హసన్, సహీహ్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

`Ali (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The miser is the one in whose presence I am mentioned but he does not supplicate for me.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

అసలు పిసినారితనమంటే ఏమిటీ? ఒకరికి చెందవలసిన హక్కు ఇవ్వకపోవటం. అదే పిసినారితనం. దైవప్రవక్త ﷺ ముస్లింల ఇహపరాల సాఫల్యం కోసం, వారి సౌభాగ్యం కోసం ఎంతగానో కృషిచేశారు. అలాంటి మహనీయునికి ఏమీ ఇవ్వలేకపోయినప్పటికీ కనీసం ఆయన శుభనామం విన్నప్పుడు ఆయన కోసం దరూద్ పఠించటమయినా చేయాలి. ముఖ్యంగా తీరికవేళల్లో, ఎలాంటి ఒత్తిడులూ లేనప్పుడు దరూద్ పఠిస్తూ ఉండాలి. అదేమీ ఖర్చుతో కూడుకున్న పనికూడా కాదు. అయినప్పటికీ ఏ ముస్లిం అయినా ప్రవక్త శుభనామం వినికూడా ఆయన కోసం దరూద్ పఠించటం లేదంటే అతన్ని పరమ పీనాసిగా భావించాలి. చెప్పొచ్చేదేమిటంటే దైవప్రవక్త ﷺ శుభనామం విన్నప్పుడు దరూద్ పఠించాలి. లేదా కనీసం 'సల్లల్లాహు అలైహి వ సల్లం' అని అయినా అనాలి. ఈ సంక్షిప్త వాక్యంలో దరూద్, సలాంలు రెండూ ఉన్నాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1404

1405

హదీసు 1405

وعنْ فَضَالَةَ بنِ عُبَيْدٍ، رضي اللَّه عَنْهُ، قَالَ: سمِع رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَجُلاً يدْعُو في صلاتِهِ لَمْ يُمَجِّدِ اللَّه تَعالى، وَلَمْ يُصلِّ عَلى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عَجِلَ هَذَا"، ثمَّ دعَاهُ فَقَالَ لهُ أوْ لِغَيْرِهِ: "إِذَا صلَّى أحَدُكُمْ فليبْدأْ بِتَحْمِيدِ ربِّهِ سُبْحانَهُ والثَّنَاءِ عليهِ، ثُمَّ يُصلي عَلى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ثُمَّ يدْعُو بَعدُ بِما شاءَ". رواهُ أَبُو داود والترمذي وقالا: حديثٌ حسن صحيحٌ.

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక వ్యక్తి నమాజు చేసి దుఆ చేయటానికి ఉపక్రమించాడు. అయితే (దానికి ముందు) అతను దైవస్తోత్రం చేయలేదు. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ కూడా పఠించలేదు. అది చూసి దైవప్రవక్త ﷺ 'ఇతను తొందరపడ్డాడు' అని అన్నారు. ఆ తర్వాత అతన్ని దగ్గరికి పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దేశ్యించి, "మీలో ఎవరయినా నమాజ్ చేసి (ఆ తర్వాత దుఆ చేయాలనుకుంటే) ముందు దైవస్తోత్రంతో ప్రారంభించాలి. తర్వాత దైవప్రవక్తపై దరూద్ పఠించాలి. ఆ తర్వాత తమకిష్టమొచ్చింది ప్రార్థించుకోవాలి" అని ఉపదేశించారు. (అబూదావూద్, తిర్మిజీ-సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

Fadalah bin `Ubaid (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ heard some one supplicating after his prayer without praising Allah and without supplicating Allah for the Prophet ﷺ. With regard to him, the Messenger of Allah ﷺ said, “This man rushed.” Then he called him and said, “When any one of you have performed Salat (prayer) and wants to supplicate, let him praise Allah first then glorify Him in the beginning and then he should supplicate Allah for me. Then he may supplicate for whatever he likes.”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దుఆ అంటే నమాజ్ తర్వాత చేసే దుఆ అయినా లేక సలాంకు ముందు తషహ్హుద్, దరూద్‌ల తర్వాత చేసే దుఆలోనయినా సరే (మొదటి అభిప్రాయమే సముచితంగా కనిపిస్తోంది) ముందుగా దైవాన్ని స్తుతించి, దరూద్ పఠించి ఆ తర్వాతే ప్రార్థన (దుఆ) చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1405

1406

హదీసు 1406

وعن أَبي محمدٍ كَعب بن عُجرَةَ، رضي اللَّه عنْهُ، قَالَ: خَرج علَيْنَا النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقُلْنا: يَا رَسُولَ اللَّه، قَدْ علِمْنَا كَيْف نُسلِّمُ عليْكَ فَكَيْفَ نُصَلِّي علَيْكَ؟ قَالَ:"قُولُوا: اللَّهمَّ صَلِّ عَلَى مُحمَّدٍ، وَعَلى آلِ مُحمَّد، كَمَا صَلَّيْتَ عَلى آلِ إبْرَاهِيمَ، إنَّكَ حمِيدٌ مجيدٌ. اللهُمَّ بارِكْ عَلى مُحَمَّد، وَعَلى آلِ مُحَمَّد، كَما بَاركْتَ عَلَى آلِ إبْراهِيم، إنَّكَ حميدٌ مجيدٌ". متفقٌ عليهِ.

హజ్రత్ అబూ ముహమ్మద్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త ﷺ మా దగ్గరికి వచ్చారు. అప్పుడు మేమాయన్ని "దైవప్రవక్తా! మీపై సలాం పంపే విధానమయితే తెలుసు. కాని మీపై దరూద్ ఎలా పంపాలి?" అని అడిగాం. అందుకాయన ఈ విధంగా పఠించమని చెప్పారు:

"అల్లాహుమ్మ! సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమాసల్లైత అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్‌త అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్." (అల్లాహ్! ఇబ్రాహీమ్ పరివారాన్ని కరుణించినట్లుగానే ముహమ్మద్‌ను, ఆయన పరివారాన్ని కూడా కరుణించు. నిస్సందేహంగా నీవు స్వయంగా స్తుతి పాత్రుడవు. ఎంతో ఘనత కలవాడవు. నీవు ఇబ్రాహీమ్ పరివారంపై శుభాలు కురిపించినట్లు గానే ముహమ్మద్‌పై, ఆయన పరివారంపై కూడా శుభాలను కురిపించు. నిస్సందేహంగా నీవు స్వయంగా స్తుతి పాత్రుడవు, ఎంతో ఘనత కలవాడవు.) (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abu Muhammad Ka`b bin `Ujrah (radiyallahu anhu) reported: The Prophet ﷺ came to us and we asked him, “O Messenger of Allah, we already know how to greet you (i.e., say As-salamu `alaikum), but how should we supplicate for you?” He ﷺ said, “Say: `Allahumma salli `ala Muhammadin, wa `ala `ali Muhammadin, kama sallaita `ala `ali Ibrahima, innaka Hamidum Majid. Allahumma barik `ala Muhammadin, wa `ala `ali Muhammadin, kama barakta `ala `ali Ibrahima, innaka Hamidum Majid [O Allah, exalt the mention of Muhammad and the family of Muhammad as you exalted the family of Ibrahim. You are Praised and Glorious. O Allah, bless Muhammad and the family of Muhammad as You blessed the family of Ibrahim. You are Praised and Glorious.”’[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త ﷺ సహచరులు తమకు సలాం పంపే విధానం తెలుసని చెప్పారు. అత్తహియ్యాత్‌లో "అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు" అన్న పలుకులే అవి. దైవప్రవక్త ﷺ ఆదేశం మేరకు సహచరులు నమాజుల్లో ఈ విధంగా పఠిస్తూ ఉండేవారు. కొంతకాలం తర్వాత "దైవప్రవక్తకై దరూద్, సలామ్‌లు పంపండి" అనే ఖుర్‌ఆన్ సూక్తి అవతరించింది. అప్పుడు సహచరులు తమకు సలాం ఎలా పఠించాలో తెలుసు కాని, దరూద్ ఎలా పఠించాలి? అని సందేహంలో పడిపోయారు. ఈ విషయమే దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావించారు. అప్పుడాయన ఈ హదీసు ద్వారా ఆ విషయాన్ని స్పష్టీకరించారు. ఆ విధంగా ఖుర్‌ఆన్ ఆదేశం మేరకు నమాజులో దరూద్; సలామ్‌లు రెండూ సంపూర్ణమయ్యాయి. అంటే ఒక ముస్లిం ప్రతి నమాజులో దరూద్, సలామ్‌లు రెండూ పఠిస్తాడన్నమాట!

ధర్మంలో కొత్త పుంతలు తొక్కే ప్రభృతులు కొందరు దరూద్, సలామ్‌ల కోసం 'అస్సలాతు వస్సలాము అలైక యా రసూలల్లాహ్' అనే కొత్త మాటను కల్పించుకున్నారు. వారిని అలా ఎందుకు చదువుతారని అడిగితే 'దరూదే ఇబ్రాహీమ్'లో కేవలం దరూద్ మాత్రమే ఉంది. మేము కల్పించుకున్న వాక్యంలోనయితే దరూద్, సలామ్‌లు రెండూ ఉన్నాయి. చూడండి!' అని అంటారు. పైగా వారు ఆ వాక్యపఠనం కోసం ప్రత్యేక సమయాన్ని కూడా నిర్ణయించుకున్నారు. అజాన్‌కు ముందు ఈ వాక్యం పఠించాలని చెబుతారు. అసలు విషయం ఏమిటంటే దైవప్రవక్త ﷺ ప్రవచించిన పలుకులు, వచనాలు వీరికి సంతృప్తికరంగా లేవు. వీరికి ఆయన విధానం పట్ల అభిమానం కూడా లేదు. అందుకే తమ తరపు నుండి ధర్మంలో కొత్తకొత్త విషయాలను సృష్టించుకుంటున్నారు. కాని వాస్తవానికి ఇహపరాల సాఫల్యం, శ్రేయోశుభాలు దైవప్రవక్త విధానాన్ని అనుసరించటంలోనే ఉన్నాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1406

1407

హదీసు 1407

وعنْ أَبي مسْعُود الْبدْريِّ، رضي اللَّه عنْهُ، قالَ: أَتاناَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَنَحْنُ في مَجْلِس سَعدِ بنِ عُبَادَةَ رضي اللَّه عنهُ، فقالَ لهُ بَشِيرُ بْنُ سعدٍ: أمرَنَا اللَّه أنْ نُصلِّي علَيْكَ يَا رسولَ اللَّهِ، فَكَيْفَ نُصَّلي علَيْكَ؟ فَسكَتَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، حَتَّى تَمنَّيْنَا أنَّه لمْ يَسْأَلْهُ، ثمَّ قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قولُوا: "اللَّهمَّ صلِّ عَلى مُحَمَّدٍ، وَعَلى آلِ مُحمَّدٍ، كَمَا صليْتَ عَلَى آلِ إبْراهِيم، وَبارِكْ عَلى مُحَمَّد، وعَلى آلِ مُحمَّد، كَمَا بَاركْتَ عَلى آلِ إبْراهِيم، إنكَ حمِيدٌ مجِيدٌ، وَالسَّلاَمُ كَمَا قَدْ عَلِمتم " رواهُ مسلمٌ.

హజ్రత్ అబూమస్‌వూద్ బద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త ﷺ మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో మేము సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) సమావేశంలో కూర్చొని ఉన్నాం. అప్పుడు బషీర్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని ఉద్దేశ్యించి 'దైవప్రవక్తా! దేవుడు మమ్మల్ని మీపై దరూద్ పంపమని ఆదేశిస్తున్నాడు. అయితే మేము ఏమని మీపై దరూద్ పంపాలి?' అని అడిగారు.

ఆ మాట విని దైవప్రవక్త ﷺ మౌనం వహించారు. ఆయన మౌనం చూసి మాకు ఈ మనిషి ఆయన్ని ఈ విషయం అడిగి ఉండకపోతే బాగుండుననిపించింది. కాసేపు మౌనం తర్వాత దైవప్రవక్త ﷺ ఈ విధంగా పఠించమని బోధించారు: "అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ, వ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్‌త అలా ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మ్మజీద్." (అల్లాహ్! నీవు ఇబ్రాహీమ్‌ను కరుణించినట్లుగానే ముహమ్మద్‌ను, ఆయన పరివారాన్ని కూడా కరుణించు. నీవు ఇబ్రాహీమ్‌పై శుభాలు కురిపించినట్లు గానే ముహమ్మద్‌పై ఆయన పరివారంపై కూడా శుభాలను కురిపించు. నిస్సందేహంగా నీవు స్వయంగా స్తుతిపాత్రుడవు, ఎంతో ఘనత కలవాడవు.)

ఆ తర్వాత ఆయన, 'పోతే, సలామ్ పద్ధతి మీకు తెలిసిందే' అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abu Mas`ud Al-Badri (radiyallahu anhu) reported: We were sitting in the company of Sa`d bin `Ubadah (radiyallahu anhu), when the Messenger of Allah ﷺ came to us. Bashir bin Sa`d said: “O Messenger of Allah! Allah has commanded us to supplicate for you, but how should we do that?” The Messenger of Allah ﷺ kept silent. We were much perturbed over his silence and we wished he did not asked him this question. The Messenger of Allah ﷺ said, “Say: `O Allah, exalt the mention of Muhammad and the family of Muhammad as you exalted the family of Ibrahim. And bless Muhammad and the family of Muhammad as You blessed the family of Ibrahim. You are the Praised, the Glorified,’ and the method of greeting (i.e., Salam) is as you know.”[Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺపై సలాం పంపే పద్ధతి సహచరులు అంతకుముందు నుంచి పఠిస్తూ వస్తుండేదేనని ఈ హదీసులో కూడా వివరించారు. ఆ పద్ధతి స్వయంగా ఆయన నేర్పినదే. అత్తహియ్యాత్‌లోని "అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు" అన్న పలుకులే అవి. పరివారం (ఆల్) అంటే దైవప్రవక్త సతీమణులు, బనూ హాషిమ్, బనూ అబ్దుల్ ముత్తలిబ్ తెగవారిలో ఆయన్ని విశ్వసించిన బంధువులు అని భావం. అయితే మరికొంతమంది పండితులు దైవప్రవక్త విధానాన్ని అనుసరించేవారందరూ ఆయన పరివారం క్రిందికే వస్తారని తలపోస్తున్నారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే తమకు ఏదయినా విషయం తెలియకపోతే పండితుల్ని అడిగి తెలుసుకోవాలి. అంతేగాని స్వయంగానే ధర్మంలో వినూత్న పోకడలు సృష్టించరాదు. ఇంకోవిషయం – పండితులంటే మిడిమిడి జ్ఞానంతో ఇతరుల అభిప్రాయాలను వల్లిస్తూ తమస్వంతంగా ఆలోచించి తీర్పులిచ్చే వారు కాదు. ఖుర్‌ఆన్ హదీసుల వెలుగులో తీర్పులిచ్చేవారే పండితులు. కనుక వారినే సంప్రదించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1407

1408

హదీసు 1408

وعَنْ أَبي حُمَيْدٍ السَّاعِديِّ، رضي اللَّه عنهُ، قالَ: قَالُوا يَا رسولَ اللَّه كَيْفَ نُصَلِّي عَلَيْكَ؟ قالَ: "قولُوا: اللَّهُمَّ صلِّ عَلَى مُحمِّدٍ، وعَلى أزْواجِهِ وَذُرِّيَّتِهِ، كَمَا صَلَّيْتَ عَلَى آلِ إبْراهِيمَ، وباركْ عَلى مُحَمَّدٍ، وعَلى أَزْوَاجِهِ وذُرِّيَّتِهِ، كَمَا بارَكتَ عَلَى آلِ إبْراهِيم، إنَّكَ حمِيدٌ مجِيدٌ" متفقٌ عليهِ.

హజ్రత్ అబూ హుమైద్ అస్సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం (తామొకసారి దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ) "దైవప్రవక్తా! మేము మీపై దరూద్ ఎలా పఠించాలి?" అని అడిగారు. అందుకాయన ఈ విధంగా పఠించమని చెప్పారు: "అల్లాహుమ్మ! సల్లి అలా ముహమ్మద్ వ అలా అజ్‌వాజిహీ వజుర్రియ్యతిహీ కమాసల్లైత అలా ఇబ్రాహీమ వ బారిక్ అలా ముహమ్మద్ వ అలా అజ్‌వాజిహీ, వ జుర్రియ్యతిహీ కమా బారక్‌త అలా ఇబ్రాహీమ ఇన్నక హమీదుంమ్ మ్మజీద్." (అల్లాహ్! ఏ విధంగానయితే నీవు ఇబ్రాహీమ్‌ను కరుణించావో అదే విధంగా ముహమ్మద్‌ను, ఆయన సతీమణులను, ఆయన సంతానాన్ని కూడా కరుణించు. అలాగే ఏ విధంగానయితే నీవు ఇబ్రాహీమ్‌పై శుభాలు కురిపించావో అదే విధంగా ముహమ్మద్‌పై, ఆయన సతీమణులపై, ఆయన సంతానంపై కూడా శుభాలను కురిపించు. నిస్సందేహంగా నీవు గౌరవనీయుడవు. స్వయంగానే స్తుతి పాత్రుడవు.) (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అహాదీసుల్ అంబియా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abu Humaid As-Sa`idi (radiyallahu anhu) reported: The Companions of the Messenger of Allah ﷺ said: “O Messenger of Allah! How should we supplicate for you?” He ﷺ replied, “Say: `Allahumma salli `ala Muhammadin wa `ala azwajihi wa dhurriyyatihi, kama sallaita `ala Ibrahima; wa barik `ala Muhammadin wa `ala azwajihi wa dhurriyyatihi, kama barakta `ala Ibrahima, innaka Hamidum-Majid (O Allah sent Your Salat (O Allah, exalt the mention of Muhammad and his wives and offspring as You exalted the mention of the family of Ibrahim, and bless Muhammad and the wives and the offspring of Muhammad as you blessed the family of Ibrahim. You are the Praised, the Glorious‘.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మూలంలో 'అజ్‌వాజ్' అనే పదం వచ్చింది. అజ్‌వాజ్ అనేది 'జౌజ్'కు బహువచనం. జౌజ్ అంటే అసలు జత అని అర్థం. స్త్రీ పురుషునికి జత అవుతుంది. పురుషుడు స్త్రీకి జత అవుతాడు. అందుకే అరబీలో ఈ పదం స్త్రీ పురుషులిద్దరి కోసం వాడబడుతుంది. మొత్తానికి ఇక్కడ అజ్‌వాజ్ అంటే దైవప్రవక్త సతీమణులని భావం. వీరు మొత్తం పదకొండుమంది. వారిలో ఇద్దరు భార్యలు ఆయన బ్రతికుండగానే చనిపోయారు. ఇక మిగతా తొమ్మిది మంది భార్యలూ దైవప్రవక్త ﷺ చనిపోయిన తరువాత కూడా బ్రతికే ఉన్నారు. ఇస్లాం ధర్మం ప్రకారం ఒక పురుషుడు ఏకకాలంలో నలుగురి కంటే ఎక్కువమంది స్త్రీలను వివాహమాడటం ధర్మసమ్మతం కాదు. అయితే ఈ విషయంలో దైవప్రవక్త ﷺకు మినహాయింపు ఉంది. అదేమిటంటే దేవుడు ఆయనకు ఏకకాలంలో పదకొండుమంది స్త్రీలను వివాహ మాడేందుకు అనుమతినిచ్చాడు. ఆ అనుమతిలో కూడా ఎన్నో విజ్ఞతా వివేచనాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి ఎన్నో కారణాలను ఇస్లామియ విద్వాంసులు వివరించారు. (ఫత్‌హుల్ బారీ, నికాహ్ ప్రకరణం చూడండి)

దైవప్రవక్త సతీమణులు ఆయన పరివారం (ఆల్) క్రిందికి రారని కొంతమంది వాదిస్తారు. వారి వాదనను కూడా ఈ హదీసు ఖండిస్తోంది. ఈ హదీసే కాదు, ఖుర్‌ఆన్ ద్వారా కూడా భార్యలు తమ భర్తల పరివారం క్రిందికే వస్తారని తెలుస్తోంది. ఇకపోతే దైవప్రవక్త కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళ సంతానం అందరూ కూడా ఆయన పరివారం క్రిందికే వస్తారు. అయితే ఆయన మరణానంతరం ఆయన సంతానంలో హజ్రత్ ఫాతిమా మరియు ఆమె సంతానం తప్ప మరెవరూ మిగిలి ఉండలేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|243. దైవప్రవక్త ﷺ కోసం దరూద్ పఠించటం – దాని విశిష్ఠత|హదీసు 1408