హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 130వ అధ్యాయం: స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 838 – 844) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు

↑ విషయ సూచిక

باب الرؤيا وَمَا يتعلق بها

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَمِنْ آيَاتِهِ مَنَامُكُمْ بِاللَّيْلِ وَالنَّهَارِ} [الروم: ٢٣]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "దేవుని సూచనలలో మీరు రాత్రి, పగలు నిద్రపోవటం కూడా ఒకటి." (అర్ రూమ్ : 23)

English

“And among His Signs is your sleep by night and by day.” [Ar-Rūm 30:23]

838

హదీసు 838

وعن أبي هريرةَ رضي الله عنه قَالَ: سَمِعتُ رَسُولَ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "لَمْ يَبْقَ مِنَ النُبُوَّة إِلاَّ المبُشِّراتُ"قالوا: وَمَا المُبشِّراتُ؟ قَالَ:"الُّرؤْيَا الصَّالِحةُ "رواه البخاري.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి దైవప్రవక్త ﷺ తన అనుచరులకు హితబోధ చేస్తూ, "ప్రవక్త పదవి (నబువ్వత్) భాగాలలో ఇక శుభవార్తాహరులు మాత్రమే మిగిలున్నారు" అని చెప్పారు.

అది విని అనుచరులు సందేహపడుతూ, "శుభవార్తాహరులంటే ఎవరు?" అని అడిగారు. దానికాయన "శుభ వార్తాహరులంటే మంచి కలలు" అని చెప్పారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “All that is left from Prophethood is the glad tidings.” He was asked what the glad tidings were, and he said, “The good dream.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

కలలో మనిషి భయంకరమైన, బాధాకరమైన, సంతోషకరమైన, ఉత్సాహకరమైన దృశ్యాలెన్నో చూస్తుంటాడు. కొన్నిసార్లు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే కలలోకి రావటంలోనూ ఆశ్చర్యం లేదు. పూర్వకాలంలో ప్రవక్తలకు వచ్చే కలలు నిజమయ్యేవి. అయితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ ﷺతో ప్రవక్తల పరంపర ముగిసిపోయింది. ఇక ఆయన తర్వాత ప్రపంచంలో మరో ప్రవక్త ప్రభవించే అవకాశాలు లేవు. కనుక వహీ (దైవవాణి) అవతరణ కూడా జరగదు. కాని ప్రవక్త పదవికి సంబంధించిన ఒక విషయం ప్రళయం వరకూ కొనసాగుతూనే ఉంటుంది. అదే మంచి కలలు రావటం. సత్యవంతులయిన విశ్వాసులకు స్వప్నావస్థలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు చూపించబడతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 838

839

హదీసు 839

وعنه أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إذَا اقتَربَ الزَّمَانُ لَمْ تَكَدْ رُؤْيَا الُمؤْمن تَكذبُ، وَرُؤْيَا المُؤْمِنِ جُزْءٌ منْ ستَّةٍ وَأرْبَعيَنَ جُزْءًا مِنَ النُبُوةِ "متفقٌ عَلَيْهِ. وفي رواية: "أصْدَقُكُم رُؤْيَا: أصْدُقكُم حَديثاً".

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ప్రళయం సమీపించే కాలంలో విశ్వాసికి వచ్చే కలలు సాధారణంగా అసత్యమైనవి కాజాలవు. ప్రవక్త పదవి (నబువ్వత్)లోని నలభై ఆరు భాగాలలో విశ్వాసికి వచ్చే కల కూడా ఒకటి. (బుఖారీ – ముస్లిం)

వేరొక హదీసులో ఇలా ఉంది : మీలో కలల విషయంలో అందరికన్నా సత్యవంతుడయినవాడే మాటల్లోనూ అందరికన్నా సత్యవంతుడయి ఉంటాడు.

(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వప్న ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When the time draws near (i.e., near the end of the world), the dream of a believer can hardly be false; and the dream of a believer represents one part from forty-six parts of Prophethood.”[Al-Bukhari and Muslim].

One narration says: Messenger of Allah ﷺ said, “The most truthful of you in their speech are those who see the truest visions.”

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 839

840

హదీసు 840

وعنه قَالَ: قالَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ رَآنِي في المنَامِ فَسَيَرَانيِ في الَيَقَظَةِ أوْ كأنَّمَا رآني في اليَقَظَةِ لايَتَمثَّلُ الشَّيْطانُ بي". مُتَّفَقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : దైవప్రవక్త ﷺ తన అనుచరులకు హితబోధ చేస్తూ, "నన్ను స్వప్నావస్థలో చూసినవాడు త్వరలోనే (అంటే ప్రళయదినాన) జాగృదావస్థలో కూడా నన్ను చూస్తాడు (లేక ఆయన) అతను నన్ను జాగృదావస్థలో చూసినట్లే. ఎందుకంటే షైతాన్ నా రూపంలో (కలలోకి) రాలేడు" అని చెప్పారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వప్న ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “He who sees me in his dream will see me in his wakefulness (or he ﷺ may have said it is as though he has seen me in a state of wakefulness), for Satan does not appear in my form.”[Al-Bukhari and Muslim ].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో రెండు విషయాలు బోధించబడ్డాయి. వాటిలో ఏది దైవప్రవక్త ﷺ చెప్పినదో ఉల్లేఖకునికి గుర్తులేదు. మొదటిమాట చెప్పిఉన్నట్లయితే – కలలో దైవప్రవక్తను చూసిన వ్యక్తికి ప్రళయదినాన కూడా ఆయన దర్శన భాగ్యం లభిస్తుంది అని భావం. మరోమాటలో చెప్పాలంటే ఆ కల ఆ వ్యక్తి విశ్వాసాన్ని ధృవీకరిస్తుందన్నమాట!

ఒకవేళ దైవప్రవక్త ﷺ చెప్పినది రెండోమాట అయితే దాని భావం తెలుస్తూనే ఉంది. కలలో దైవప్రవక్త ﷺ ను చూస్తే నిజంగానే ఆయన్ని చూసినట్లుగా భావింపబడుతుంది. ఎందుకంటే ఇతరులెవరూ దైవప్రవక్త రూపంలో కనిపించరు. షైతాన్ దైవప్రవక్త ﷺ రూపంలో మనుషుల కలల్లోకి రాలేడు. అయితే యిక్కడ ఒక విషయం గమనార్హం. షైతాన్ దైవప్రవక్త రూపంలో మానవుల కలల్లోకి రాలేడు కాని మరెవరినో చూపించి ఈయనే దైవప్రవక్త అని భ్రమ మాత్రం కలిగించగలడు. అందుకని ముస్లిం అయిన ప్రతి వ్యక్తికీ హదీసుల్లో చెప్పబడిన విధంగా దైవప్రవక్తగారి రూపురేఖలు గుర్తుండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 840

841

హదీసు 841

وعن أَبي سعيد الخدريِّ رضي الله عنه أنَّه سمِع النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "إِذَا رَأى أَحدُكُم رُؤْيَا يُحبُّهَا فَإنَّما هِيَ مِنَ اللهِ تَعَالَى فَليَحْمَدِ اللهَ عَلَيهَا وَلْيُحُدِّثْ بِها وفي رواية: فَلا يُحَدِّثْ بَها إِلاَّ مَنْ يُحِبُّ وَإذا رَأَى غَيَر ذَلك مِمَّا يَكرَهُ فإنَّما هِيَ منَ الشَّيْطانِ فَليَسْتَعِذْ منْ شَرِّهَا وَلا يَذكْرها لأَحَدٍ فَإنَّهَا لا تضُُّره" متفقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: మీకు సంతోషకరమైన కలలు దేవుని తరపు నుండి వస్తాయి. కనుక అలాంటి కలలు వచ్చినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ కల గురించి ఇతరులకు చెప్పుకోవాలి. వేరొక ఉల్లేఖనంలో 'తను యిష్టపడేవారికి మాత్రమే చెప్పుకోవాలి' అని ఉంది.

కాని మీలో ఎవరయినా కలలో అవాంఛనీయమయిన విషయమేదయినా చూస్తే, అది షైతాన్ తరపు నుండి వచ్చిందని గ్రహించాలి. కనుక అతను వాటి కీడు నుండి శరణు వేడుకోవాలి. దాని గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు. ఆ కల వల్ల అతనికి ఎలాంటి నష్టం జరగదు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వప్న ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “When one of you sees a dream that he likes, then it is from Allah. He should praise Allah for it and relate it to (others).”

Another narration adds: Messenger of Allah ﷺ said, “He should not report it except to those whom he loves. And if he sees one which he dislikes, then it is from the Satan. He should seek refuge in Allah against its evil and should not mention it to anyone. Then it will not harm him.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో మంచి మరియు చెడు- రెండు రకాల కలలగురించీ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మంచి కలలు దేవుని తరపునుంచి శుభవార్తల్లాంటివి. వాటి గురించి ఇతరులకు తెలియజేయదలచుకుంటే కేవలం మీ సన్నిహితులు, మీ శ్రేయం కోరే ఆత్మీయులకు మాత్రమే తెలియజేయాలి. కనిపించినవారికల్లా ఆ కలల గురించి తెలియజేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మీ పట్ల అసూయ ఉన్నవారిలో ఆ శుభవార్తలు మరింత అసూయను రగిలించవచ్చు.

ఇకపోతే చెడు కలలు : వీటిగురించి ఎవరితోనూ చెప్పకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే సాధారణంగా ఇవి షైతాన్ దుష్టప్రేరణల వల్ల వస్తాయి. ప్రజలకు ఆ కలలు చెబితే వారు దుశ్శకునాలు చెప్పి మిమ్మల్ని మరింతగా భయపెడ్తారు. అలాంటి కలలు వచ్చినప్పుడు దైవాన్ని శరణువేడుకోవాలి. దైవం మీద గట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. ఇన్షాఅల్లాహ్ వాటివల్ల ఎలాంటి నష్టం జరుగదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 841

842

హదీసు 842

وعن أَبي قَتَادَة رضي الله عنه قَالَ: قَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " الرُّؤْيَا الصَّالَحِةُ وفي رواية الرُّؤيَا الحَسَنَةُ منَ اللهِ، والحُلُم مِنَ الشَّيْطَان، فَمَن رَأى شَيْئاً يَكرَهُهُ فَلْيَنْفُثْ عَن شِمَاله ثَلاَثاً، ولْيَتَعَوَّذْ مِنَ الشَْيْطان فَإنَّها لا تَضُرُّهُ" متفق عليه."النَّفثُ"نَفخٌ لطيفٌ لاريِقَ مَعَهُ.

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మంచి కలలు దేవుని తరపు నుండి వస్తాయి. చెడ్డ కలలు షైతాన్ తరపు నుండి వస్తాయి. కనుక ఎవరికయినా కలలో ఏదయినా చెడు విషయం కన్పిస్తే ఎడమవైపున మూడు సార్లు థూ… థూ అని చెప్పి షైతాన్ బారినుండి శరణు వేడుకోవాలి. అలా చేస్తే ఆ కల వల్ల అతనికి ఎలాంటి నష్టం జరగదు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వప్న ప్రకరణం)

English

Abu Qatadah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “A good vision (dream) is from Allah and a bad dream is from the Satan. He who sees something in a dream that he dislikes, should blow thrice on his left, must seek Allah’s Refuge from the evil of the Satan (i.e., by saying: A`udhu billahi minash-Shaitanir-Rajim). Then it will not harm him.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 842

843

హదీసు 843

وعن جابر رضي الله عنه عن رَسُولِ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إذَا رَأى أحَدُكُم الرُّؤيا يَكْرَهُها فلْيبصُقْ عَن يَسَارِهِ ثَلاَثاً، وْليَسْتَعِذْ بِاللهِ مِنَ الشَّيَطانِ ثَلاثاَ، وليَتَحوَّل عَنْ جَنْبِهِ الَّذِي كَانَ عَلَيْهِ "رواه مسلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరికయినా చెడ్డ కల వస్తే మేల్కొన్న వెంటనే అతను ఎడమ వైపున మూడుసార్లు థూథూ అని మెల్లిగా ఉమ్మివేసి షైతాన్ బారినుండి మూడుసార్లు దేవుడ్ని శరణువేడుకోవాలి. ఆ తర్వాత మరో వైపుకు తిరిగి పడుకోవాలి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని తాబీర్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “When one of you sees a bad dream let him blow three times on his left, seek refuge in Allah from the Satan three times (i.e., by saying: A`udhu billahi minash-Shaitanir-Rajim) and change the side on which he was lying.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 843

844

హదీసు 844

وعن أَبي الأسقع واثِلةَ بن الأسقعِ رضي الله عنه قال: قال رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ مِنْ أعظَم الفَرى أنْ يَدَّعِي الرَّجُلُ إِلَى غَيْرِ أبِيه، أوْ يُري عَيْنهُ مَالم تَرَ، أوْ يقولَ عَلَى رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَا لَمْ يَقُلْ" رواه البخاري. كتَاب السَّلاَم

హజ్రత్ అబుల్ అస్‌ఖా వాసిలా బిన్ అస్‌ఖా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: కన్న తండ్రిని వదలి వేరే వ్యక్తిని తన కన్న తండ్రిగా సూచించుకోవటం, (కలలో) చూడని దాన్ని చూశానని చెప్పటం, దైవప్రవక్త ﷺ చెప్పని విషయాన్ని చెప్పినట్లు ఆయనకు అబద్ధం ఆపాదించటం ఘోరమైన అపనిందలు.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని మహిమోన్నతుల ప్రకరణం)

English

Wathilah bin Al-Asqa` (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Of the worst lies are: to claim a false father, or to pretend to have seen what one has not seen (tell a false dream), or to attribute to the Messenger of Allah ﷺ what he has not said.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

కన్న తండ్రిని వదలి వేరే వ్యక్తిని కన్న తండ్రిగా సూచించుకోవటం ఘోరపాపం. అది ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తుంది. రక్త సంబంధాన్ని వక్రీకరించుకొని చెప్పుకోవటం వల్ల మానవ సంబంధ బాంధవ్యాల్లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఆఖరికి వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా తయారయ్యే ప్రమాదముంది. అందుకే రక్త సంబంధాన్ని వక్రీకరించుకొని చెప్పేవారికి దేవుడు స్వర్గాన్ని నిషేధిస్తాడని దైవప్రవక్త ﷺ హెచ్చరించారు.

హదీసులో చెప్పబడిన రెండో విషయం తమకు వచ్చే కలలను గురించి అబద్ధం చెప్పటం. మనిషి ఇతరులు తనను గౌరవిస్తారనో లేక తన కల గురించి విన్నవారు తనను పొగుడుతారనో తన కల గురించి అబద్ధం చెబుతాడు. ఉన్నవీ, లేనివి కల్పించి వివరిస్తాడు. వాస్తవానికి కలలో చూడని విషయాన్ని చూశానని చెప్పటం దేవునికి అబద్ధం ఆపాదించటంతో సమానం. దేవుడు తనకు చూపించని విషయాన్ని చూపించాడని చెప్పటం ఎంత నేరం?! తనకే అబద్ధం ఆపాదించే సాహసానికి ఒడిగట్టిన వారికి దేవుడు ఎంతటి కఠినమైన శిక్ష విధిస్తాడో వేరే చెప్పనక్కర్లేదు.

ఇకపోతే చివరి విషయం, దైవప్రవక్త ﷺకు అబద్ధాలు ఆపాదించటం. ఇది కూడా మహాపాపం. దైవప్రవక్త ﷺ చెప్పని విషయాన్ని చెప్పినట్లు ప్రకటిస్తే ఆయన అనుచర సమాజాన్ని అపమార్గానికి లోనుచేయటానికి ప్రయత్నించినట్లవుతుంది. అందుకే తన మీద అబద్ధం కల్పించి చెప్పేవారు తప్పకుండా నరకానికి పోతారని దైవప్రవక్త ﷺ హెచ్చరించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|130. స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు|హదీసు 844