హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 7. వాణిజ్య పుస్తకం, 20వ అధ్యాయం: ఆస్తుల పంపకం. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 805 – 817) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
7.20 ఆస్తుల పంపకం
باب الفرائض
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 805
عَنِ ابْنِ عَبَّاسٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَلْحِقُوا اَلْفَرَائِضَ بِأَهْلِهَا , فَمَا بَقِيَ فَهُوَ لِأَوْلَى رَجُلٍ ذَكَرٍ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : వారసుల కోసం షరీయత్ నిర్ధారించిన వాటాలను ఆయా హక్కుదారులకు ఇచ్చేయండి. ఆ తర్వాత మిగిలిన దానిని అతి సన్నిహితులయిన పురుష బంధువులకు ఇవ్వండి.” (బుఖారీ, ముస్లిం)
English
Narrated Ibn 'Abbas (RA): Allah's Messenger (ﷺ), "Give the prescribed shares to those who are entitled to them, and what remains goes to the nearest male relative (of the deceased)." [Agreed upon].
సారాంశం
హదీసులో ‘అహ్లె ఫరాయిజ్’ గురించి తాకీదు చేయబడింది. ఈ అధ్యాయం క్రింద షరీయత్ పరిభాషలో ‘అహ్లె ఫరాయిజ్’ అంటే దైవగ్రంథమయిన ఖుర్ఆన్ మరియు మహాప్రవక్త ﷺ విధానం ప్రకారం ఆస్తుల వాటాలు పొందవలసిన వారసులని భావం. నిర్ధారిత వాటాలను ఆయా వారసులకు ఇచ్చివేసిన మీదట కూడా ఏదైనా మిగిలి వుంటే మృతునికి చాలా దగ్గరివారైన పురుష బంధువులకు ఇవ్వాలన్నమాట! మృతునికి అత్యంత సన్నిహితులైన వారిలో తొలుత కొడుకుల పేరు వస్తుంది. ఆ తరువాత మనవళ్ళు, ముని మనవళ్ళు మొదలగువారు. ఆ తరువాత మృతుని తండ్రి, తాత. ఆ తర్వాత భ్రాతృజులు, పినతండ్రి, పెత్తండ్రి మరియు వారి సంతతి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 805
హదీసు 806
وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -قَالَ : { لَا يَرِثُ اَلْمُسْلِمُ اَلْكَافِرَ, وَلَا يَرِثُ اَلْكَافِرُ اَلْمُسْلِمَ } مُتَّفَقٌ عَلَيْهِ
హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధనం – ఒక ముస్లిం ఒక అవిశ్వాసికి వారసుడుగానీ, ఒక అవిశ్వాసి ఒక ముస్లింకు వారసుడు గానీ కాలేరు. (బుఖారీ, ముస్లిం)
English
Narrated Usamah bin Zaid (RA): The Prophet (ﷺ) said: "A Muslim does not inherit from an infidel and an infidel does not inherit from a Muslim." [Agreed upon].
సారాంశం
ఏ ముస్లిం కూడా చనిపోయిన తన అవిశ్వాస స్నేహితునికి వారసుడు కాలేడనీ, అలాగే ఏ అవిశ్వాసి కూడా మరణించిన తన ముస్లిం మిత్రునికి వారసుడు కాజాలడని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. అత్యధికమంది ముస్లిం విద్వాంసుల అభిప్రాయం కూడా ఇదే. అయితే మరి కొంతమంది పండితుల దృష్టిలో ఒక ముస్లిం ఒక అవిశ్వాసికి వారసుడు కాగలడు గాని ఒక అవిశ్వాసి మాత్రం ముస్లింకు వారసుడు కాజాలడు. హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు), మస్రూఖ్ (రదియల్లాహు అన్హు), సయీద్ బిన్ ముసైబ్ (రదియల్లాహు అన్హు), ఇబ్రాహీం నఖయీ (రహిమహుల్లాహ్), ఇస్హాఖ్ (రహిమహుల్లాహ్)ల అభిమతం ఇదే. “ఇస్లాం పెరిగే గుణం కల ధర్మమేగాని తరిగేది కాదు” అని హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) అంటారు. అయితే సర్వసాధారణమైన ఈ సూత్రానికి, ఇస్లాం వారసత్వ సంబంధమయిన ఆదేశాల నుండి వినాయింపు ఉంది. షరీయత్ ప్రకారం ముస్లిమైనవాడు అవిశ్వాసి యొక్క వారసుడు కాలేడు. అందుచేత అత్యధికమంది విద్వాంసుల అభిప్రాయమే ఈ సందర్భంగా ఎన్నదగినది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 806
హదీసు 807
وَعَنْ اِبْنِ مَسْعُودٍ - رضى الله عنه - فِي بِنْتٍ , وَبِنْتِ اِبْنٍ , وَأُخْتٍ - { فَقَضَى اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -" لِلِابْنَةِ اَلنِّصْفَ , وَلِابْنَةِ اَلِابْنِ اَلسُّدُسَ - تَكْمِلَةَ اَلثُّلُثَيْنِ- وَمَا بَقِيَ فَلِلْأُخْتِ } رَوَاهُ اَلْبُخَارِيُّ
హజ్రత్ ఇబ్నె మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ కూతురు, మనవరాలు, సోదరి (ముగ్గురూ) ఉండగా రెండొంతులను పూర్తి చేయడానికి కూతురికి సగ భాగం, మనవరాలికి 6వ భాగం ఇవ్వాలనీ, మిగిలినది సోదరికి చెందుతుందని నిర్ణయించారు. (బుఖారీ)
English
Narrated Ibn Mas'ud (RA) concerning the situation where there was a daughter, a son's daughter and a sister: The Prophet (ﷺ) ruled, "The daughter gets half and the son's daughter gets a sixth, completing two-thirds, and what remains goes to the sister." [Reported by al-Bukhari].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 807
హదీసు 808
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَتَوَارَثُ أَهْلُ مِلَّتَيْنِ } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ إِلَّا اَلتِّرْمِذِيَّ.. وَأَخْرَجَهُ اَلْحَاكِمُ بِلَفْظِ أُسَامَةَ. وَرَوَى النَّسَائِيُّ حَدِيثَ أُسَامَةَ بِهَذَا اَللَّفْظِ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు- ‘రెండు భిన్నమతాల అవలంబీకులు ఒండొకరికి వారసులు కాజాలరు.” (అహ్మద్ మరియు ‘నలుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలిన వారు ఉల్లేఖించారు. హాకిమ్ దీనిని ఉసామా హదీసు పదాల నుండి నకలు చేశారు. నసాయి మాత్రం ఉసామా హదీసును ఈ హదీసు – అంటే అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) – వాక్యాలతోనే వివరించారు)
English
Narrated 'Abdullah bin 'Amr (RA): Allah's Messenger (ﷺ) said: "People of two different religions do not inherit from one another." [Reported by Ahmad and al-Arba'a except at-Tirmidhi].
al-Hakim reported it with Usamah's wording.
an-Nasa'i reported Usamah's Hadith with the aforesaid wording.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 808
హదీసు 809
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَينٍ قَالَ : جَاءَ رَجُلٌ إِلَى اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -فَقَالَ : { إِنَّ اِبْنَ اِبْنِي مَاتَ , فَمَا لِي مِنْ مِيرَاثِهِ ? فَقَالَ : " لَكَ اَلسُّدُسُ " فَلَمَّا وَلَّى دَعَاهُ، فَقَالَ: "لَكَ سُدُسٌ آخَرُ" فَلَمَّا وَلَّى دَعَاهُ. فَقَالَ : " إِنَّ اَلسُّدُسَ اَلْآخَرَ طُعْمَةٌ } رَوَاهُ أَحْمَدُ وَالْأَرْبَعَةُ , وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ وَهُوَ مِنْ رِوَايَةِ اَلْحَسَنِ اَلْبَصْرِيِّ عَنْ عِمْرَانَ , وَقِيلَ : إِنَّهُ لَمْ يَسْمَعْ مِنْهُ.
హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి “నా మనవడు చనిపోయాడు. అతను వదలి వెళ్ళిన అతని ఆస్తిలో నాకు ఎంత వస్తుంది?” అని సందేహపడ్డాడు. “నీకు ఆరవ భాగం లభిస్తుంది” అని ఆయన ﷺ సమాధానమిచ్చారు. మరి అతను వెళ్ళిపోతుండగా ఆయన ﷺ అతన్ని పిలిచి, “నీ కోసం మరో ఆరో వంతు కూడా ఉంటుంది” అని అన్నారు. ఆ వ్యక్తి తిరిగి వెళుతుండగా ఆయన ﷺ అతన్ని పిలిచి “ఆఖరి ఆరవ వంతు నీకు భత్యంగా లభిస్తుంది సుమా!” అని స్పష్టపరిచారు. (దీనిని అహ్మద్ మరియు ‘నలుగురు’ ఉల్లేఖించారు – తిర్మిజీ దీనిని ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. ఈ ఉల్లేఖనాన్ని హసన్ బస్రీ గారు కూడా ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించారు. అయితే హసన్ బస్రీ గారు ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) నుండి విన్నట్లు నిరూపితం కాలేదని కూడా ఒక వాదన ఉంది)
English
Narrated 'Imran bin Husain (RA): A man came to the Prophet (ﷺ) and said, "My son's son (grandson) has died, so what do I receive from his estate (inheritance)?" He replied, "You receive a sixth;" then when he turned away he called him and said, "You receive another sixth;" and when he turned away he called him and said, "The other sixth is an allowance (beyond what is due)." [Reported by Ahmad and al-Arba'a. at-Tirmidhi graded it Sahih (authentic)].
It is from al-Hasan al-Basri's narration on the authority of 'Imran. However, it has been said that al-Hasan did not hear (Hadith) from 'Imran].
హదీసు ఉల్లేఖకులు
హసన్ బస్రీ (రహిమహుల్లాహ్). హసన్ బిన్ అబుల్ హసన్ బస్రీ అన్సారీ. అన్సార్లచే స్వేచ్ఛ నొసగబడిన బానిస. ఈయన తండ్రి పేరు యసార్. ప్రజలను సన్మార్గం వైపునకు మరలించే నాయకులలో ఒకరు. విశ్వసనీయులు. ధర్మావగాహనలో అగ్రజులు, ధర్మనిష్ఠగలవారు. ఏకాంతాన్ని ఇష్టపడేవారు. విద్వాంసులు. సౌందర్యమూర్తి. తాబయీన్ల మూడవ తరానికి అధిపతి. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో ఈయన జన్మించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)లను ఈయన చూచి ఉన్నారు. కాని వారిద్దరి నుండి ఏ హదీసు కూడా వినలేదు. హిజ్రీ 110 వ సంవత్సరం రజబ్ నెలలో 90 ఏండ్ల ప్రాయంలో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 809
హదీసు 810
وَعَنِ ابْنِ بُرَيْدَةَ , عَنْ أَبِيهِ ; { أَنَّ اَلنَّبِيَّ - صلى الله عليه وسلم -جَعَلَ لِلْجَدَّةِ اَلسُّدُسَ , إِذَا لَمْ يَكُنْ دُونَهَا أُمٌّ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَالنَّسَائِيُّ , وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ , وَابْنُ اَلْجَارُودِ , وَقَوَّاهُ اِبْنُ عَدِيٍّ.
హజ్రత్ ఇబ్నె బురైద (రదియల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త ﷺ తాతమ్మ కోసం ఆరవ వంతును నిర్ధారించారు. అయితే వారసురాలిగా మధ్యలో తల్లి లేనప్పుడే ఇది వర్తిస్తుంది.” (అబూ దావూద్, నసాయి లిరువురూ ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ, ఇబ్నె జారూద్ దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఇబ్నె అదీ దీనిని దృఢమైనదిగా పేర్కొన్నారు)
English
Narrated Ibn Buraidah (RA) on the authority of his father: The Prophet (ﷺ) appointed a sixth to a grandmother if no mother is left to inherit before her. [Reported by Abu Dawud and an-Nasa'i. Ibn Khuzaimah and Ibn al-Jarud graded it Sahih (authentic) and Ibn 'Adi graded it strong].
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 810
హదీసు 811
وَعَنْ اَلْمِقْدَامِ بْنِ مَعْدِي كَرِبَ - رضى الله عنه - قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْخَالُ وَارِثُ مَنْ لَا وَارِثَ لَهُ } أَخْرَجَهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ سِوَى اَلتِّرْمِذِيِّ , وَحَسَّنَهُ أَبُو زُرْعَةَ اَلرَّازِيُّ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ , وَالْحَاكِمُ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ మిఖ్దామ్ బిన్ మాదీ కరిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “ఎవరికయినా వారసులెవరూ బ్రతికిలేని పక్షంలో అతనికి మేనమామ వారసుడవుతాడు.” (ఈ హదీసును అహ్మద్ మరియు ‘నలుగురి’లో తిర్మిజీ మినహా మిగిలిన వారు పేర్కొన్నారు – అబూజుర్ఆ, అల్ రాజీ దీనిని ‘హసన్’గా నిర్ధారించారు. హాకిమ్ మరియు ఇబ్నె హిబ్బాన్ లు మాత్రం ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
English
Narrated al-Miqdam bin Ma'dikarib (RA): Allah's Messenger (ﷺ) said: "A maternal uncle is heir of him who has no inheritor." [Ahmad and al-Arba'a reported it excluding at-Tirmidhi. Abu Zur'a ar-Razi graded it Hasan (good), and al-Hakim and Ibn Hibban graded it Sahih (authentic).
సారాంశం
ఈ హదీసు ప్రకారం వారసులు, హక్కుదారులు ఎవరూ బ్రతికి లేనట్లయితే మేనమామ ఆస్తికి వారసుడవుతాడు. దగ్గరి బంధువులను వారసులుగా ప్రకటించే విషయంలో పండితుల మధ్య అభిప్రాయభేదం ఉంది. మేనమామ ఎంత హక్కుదారుడో పిన్నమ్మ కూడా అంతే హక్కు కలిగి ఉంటుందని మరికొందరు ఖరారు చేశారు. వారిరువురు కూడా జీవించి ఉండకపోతే ఆ ఆస్తి ‘బైతుల్మాల్’లో జమ చేయబడుతుందని అన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 811
హదీసు 812
وَعَنْ أَبِي أُمَامَةَ بْنِ سَهْلٍ قَالَ : { كَتَبَ مَعِي عُمَرُ إِلَى أَبِي عُبَيْدَةَ - رَضِيَ اَللَّهُ عَنْهُمْ- ; أَنَّ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -قَالَ : " اَللَّهُ وَرَسُولُهُ مَوْلَى مَنْ لَا مَوْلَى لَهُ , وَالْخَالُ وَارِثُ مَنْ لَا وَارِثَ لَهُ } رَوَاهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ سِوَى أَبِي دَاوُدَ , وَحَسَّنَهُ اَلتِّرْمِذِيُّ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.
హజ్రత్ అబూ ఉమామ బిన్ సహ్లా (రదియల్లాహు అన్హుమ్) కథనం : హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు నా చేత అబూ ఉబైద (రదియల్లాహు అన్హు) గార్కి ఒక లేఖ వ్రాయిస్తూ దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించినట్లు ఉదాహరించారు – “సంరక్షులెవరూ లేనివారికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తే సంరక్షకులు. వారసులెవరూ లేని వారికి మేనమామ వారసుడవుతాడు.” (అహ్మద్ మరియు ‘నలుగురి’లో అబూదావూద్ తప్ప మిగిలిన వారంతా ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని ‘హసన్’గా ఖరారు చేశారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికంగా పేర్కొన్నారు)
English
Narrated Abu Umamah bin Sahl (RA): 'Umar (RA) wrote to Abu Ubaidah (RA) that Allah's Messenger (ﷺ) had said: "Allah and His Messenger are the Patrons of him who has none and a maternal uncle is the heir of him who has no inheritor." [Reported by Ahmad and al-Arba'a except Abu Dawud. at-Tirmidhi graded it Hasan (good); Ibn Hibban graded it Sahih (authentic)].
హదీసు ఉల్లేఖకులు
1) అబూ ఉమామ బిన్ సహ్లా : ఈయన పేరు అస్అద్ అనీ, మరొక ఉల్లేఖనం ప్రకారం సాద్ అనీ తెలియవస్తోంది. అయితే ఈయన మారు పేరైన అబూ ఉమామగానే సుప్రసిద్ధులు. వంశపరంపర ఇలా ఉంది – అబూ ఉమామ బిన్ సహ్లా బిన్ హనీఫ్ బిన్ వాహబ్ అన్సారి, ఔసి, మదనీ. మదీనాకు చెందిన అన్సార్ వర్గీయులు. ఔస్ తెగవారు. దైవప్రవక్త ﷺను చూచారుగానీ ఆయన ﷺ నుండి ఏదైనా విన్నట్టు ఆధారం లేదు. హిజ్రీ 100లో – 92 ఏళ్ల ప్రాయంలో మరణించారు.
2) అబూ ఉబైద (రదియల్లాహు అన్హు) : అబూ ఉబైద ఆమిర్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ జర్రాహ్ బిన్ హిలాల్ ఖుర్షీ, ఫహ్రీ. స్వర్గలోక శుభవార్త నందుకున్న పదిమందిలో ఒకరు. తొలి కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. అబీసీనియాకు హిజ్రత్ చేసిన వారిలో ఈయనా ఉన్నారు. బద్ర్ ఉహుద్ ల నుండి తబూక్ వరకు జరిగిన యుద్ధాలన్నింటిలో పాల్గొన్నారు. ఉహుద్ యుద్ధం జరిగిన రోజు దైవప్రవక్త ﷺ గారి శిరస్త్రాణం యొక్క రెండు లోహపు చువ్వలు ఆయన ﷺ దవడల్లోకి దిగిపోగా ఈయన వాటిని తన దంతాలతో లాగివేశారు. ఆ సమయంలో ఈయన గారి రెండు పళ్ళు ఊడిపోయాయి. సిరియా దిగ్విజయ యాత్రలో ముస్లిం సేనలకు సారథ్యం వహించారు. హిజ్రీ 18లో సంభవించిన అమ్వాస్ ప్లేగు వ్యాధి వాతన పడి చనిపోయారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 812
హదీసు 813
وَعَنْ جَابِرٍ - رضى الله عنه - عَنْ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ : { إِذَا اِسْتَهَلَّ اَلْمَوْلُودُ وُرِّثَ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “జన్మించిన శిశువు కేక వేసినంతనే వారసుడుగా ఖరారైపోతాడు.” (అబూదావూద్ దీనిని ఉల్లేఖించగా, ఇబ్నె హిబ్బాన్ ‘ప్రామాణికం’గా ఖరారు చేశారు)
English
Narrated Jabir (RA): The Prophet (ﷺ) said: "When a new born cries (at the time of birth) (and then dies), it is treated as a hair." [Reported by Abu Dawud and graded as Sahih (authentic) by Ibn Hibban].
సారాంశం
కేక వేయటమంటే భావం ఏడవటం అనవచ్చు. సాధారణంగా పుట్టిన మరుక్షణమే శిశువు ఏడుపు ద్వారా ఈ ప్రపంచానికి తన ఉనికిని చాటి చెబుతుంది. అంటే సజీవంగా ఈ పుడమిపైకి అడుగు పెట్టానని చెబుతుందన్నమాట! ఈ విధంగా తన అస్తిత్వాన్ని చాటుకున్న ప్రతి జీవీ వారసత్వ హక్కును సంపాదించుకుంటుంది.
బిగ్గరగా అరిస్తేనే వారసత్వం లభిస్తుందా? ఏదేని కారణంగా ఒక శిశువు బిగ్గరగా కేక వేయలేకపోవచ్చు. కేవలం చలనం ద్వారా, శ్వాస ద్వారానే తాను సజీవంగా ఉన్నానని ప్రకటించవచ్చు. మరలాంటప్పుడు ఆ శిశువు వారసురాలు కాజాలదా?! అన్న సందేహం కలగవచ్చు. ఏ విధంగా ఉనికిని చాటుకున్నా వారసత్వం లభించితీరుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 813
హదీసు 814
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ , عَنْ أَبِيهِ , عَنْ جَدِّهِ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَيْسَ لِلْقَاتِلِ مِنَ الْمِيرَاثِ شَيْءٌ } رَوَاهُ النَّسَائِيُّ , وَاَلدَّارَقُطْنِيُّ , وَقَوَّاهُ اِبْنُ عَبْدِ اَلْبَرِّ , وَأَعَلَّهُ النَّسَائِيُّ , وَالصَّوَابُ: وَقْفُهُ عَلَى عَمْرٍو.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి ఆధారంగా, ఆయన తన తాతగారి ఆధారంగా తెలిపారు : “హంతకునికి హతుని ఆస్తినుండి ఏమీ లభించదు.” (దీనిని నసాయి మరియు దారె ఖుత్ని ఉల్లేఖించారు ఇబ్నె అబ్దుల్ బర్ దీనిని ‘దృఢమైనది’గా ఖరారు చేశారు. కాని నసాయి మాత్రం ‘మాలూల్’గా నిర్ధారించారు. వాస్తవానికి ఈ ఉల్లేఖనం ‘మౌఖూఫ్.’ అంటే ఇది అమ్ర్ గారిపై ఆధారపడి ఉందన్నది వాస్తవం)
English
Narrated 'Amr bin Shu'aib on his father's authority from his grandfather (RA): Allah's Messenger (ﷺ) said: "One who kills a man cannot inherit anything from him." [Reported by an-Nasa'i and ad-Daraqutni. Ibn 'Abdul-Barr graded it Qawiy (strong), while an-Nasa'i declared it to be defective. The right opinion is that it is Mawquf (a saying of a Companion) from 'Umar].
సారాంశం
హంతకుడు హతుని ఆస్తిపాస్తుల నుండి ఏమీ పుచ్చుకోజాలడని ఈ హదీసును బట్టి విదితమవుతోంది. హంతకునికి హతుని స్వంత ఆస్తి నుండిగానీ, పరిహారంగా లభించిన మొత్తంలో నుండిగానీ చిల్లిగవ్వ కూడా హంతకునికి లభ్యం కాజాలదని అధిక సంఖ్యాక పండితులు అభిప్రాయపడ్డారు. అయితే ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిమతం మరోవిధంగా ఉంది. హతుని కుటుంబానికి ‘రక్తపరిహారం’గా వచ్చిన సొమ్ములో నుంచి హంతకునికి ఏమీ దొరకదుగానీ, ఇతరత్రా ఆస్తిపాస్తుల్లో మాత్రం హక్కు ఉంటుందంటారు ఇమామ్ మాలిక్. అయితే ఈయనగారి వాదనకు అనుకూలంగా బలమైన నిదర్శనం ఏమీ లేదు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వంటి గొప్ప ఖలీఫాలే ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారి అభిప్రాయానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పి ఉన్నారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 814
హదీసు 815
وَعَنْ عُمَرَ بْنِ اَلْخَطَّابِ - رضى الله عنه - قَالَ : سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ : { مَا أَحْرَزَ اَلْوَالِدُ أَوْ اَلْوَلَدُ فَهُوَ لِعَصَبَتِهِ مَنْ كَانَ } رَوَاهُ أَبُو دَاوُدَ , وَالنَّسَائِيُّ , وَابْنُ مَاجَهْ , وَصَحَّحَهُ اِبْنُ اَلْمَدِينِيِّ , وَابْنُ عَبْدِ اَلْبَرِّ.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు : నేను దైవప్రవక్త ﷺ ప్రబోధిస్తుండగా విన్నాను – “తండ్రిగానీ, సంతానంగానీ ప్రోగుచేసి తమ ఇంటికి తెచ్చినదంతా అది వారి “అసబా” (రక్త సంబంధీకుల)కు చెందుతుంది. (దీనిని అబూదావూద్, నసాయి, ఇబ్నెమాజ ఉల్లేఖించారు – ఇబ్నె మదీనీ, ఇబ్నె అబ్దుల్ బర్ లు ప్రామాణికమైనదిగా ధృవీకరించారు)
English
Narrated 'Umar bin al-Khattab (RA): I heard Allah's Messenger (ﷺ) as saying, "The property which a parent or a child has a right to, goes to his 'Asabah (paternal relatives) whoever it may be. [Reported by Abu Dawud, an-Nasa'i and Ibn Majah. Ibn al-Madini and Ibn 'Abdul-Barr graded it Sahih (authentic)].
సారాంశం
ఈ హదీసులో చెప్పబడిన విషయంతో ఒక సంఘటన ముడిపడి ఉంది. ఆ రోజుల్లో ఒక స్త్రీ చనిపోయింది. ఆమె కొడుకులు ఆమె ఆస్తికి వారసులయ్యారు. కొంత కాలానికి కొడుకులు కూడా చనిపోయారు. అమ్ర్ బిన్ ఆస్ ఆ కొడుకులకు అసబా కోవకు చెందిన వారసులు కావటం చేత ఆయన వారి ఆస్తిపాస్తులకు వారసులయ్యారు. అంతలోనే ఆ స్త్రీచే స్వేచ్ఛ ప్రసాదించబడిన బానిస కూడా చనిపోయాడు. అమ్ర్ బిన్ ఆస్ ఆ బానిస ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ స్త్రీ సోదరుడు ఆ బానిస ఆస్తి తనకు రావాలని కేసు పెట్టాడు. ఆ సందర్భంగా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఈ హదీసును జ్ఞాపకం చేసి, స్వేచ్ఛ నొసగబడిన ఆ బానిస ఆస్తిని ఆ స్త్రీ సోదరునికి ఇప్పించారు. స్వేచ్ఛ నొసగబడిన బానిస వదలివెళ్ళిన ఆస్తిని ‘వలా’గా వ్యవహరిస్తారు. ఈ ‘వలా’ వారసత్వ హక్కుగా పరిగణించబడదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 815
హదీసు 816
وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ - رَضِيَ اَللَّهُ عَنْهُمَا- قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْوَلَاءُ لُحْمَةٌ كَلُحْمَةِ اَلنَّسَبِ , لَا يُبَاعُ , وَلَا يُوهَبُ } رَوَاهُ اَلْحَاكِمُ : مِنْ طَرِيقِ اَلشَّافِعِيِّ , عَنْ مُحَمَّدِ بْنِ اَلْحَسَنِ , عَنْ أَبِي يُوسُفَ ، وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ , وَأَعَلَّهُ اَلْبَيْهَقِيُّ.
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “స్వేచ్ఛ నొసగబడిన బానిస వదలివెళ్ళిన ఆస్తి (వలా) వ్యవహారం వంశపరంపర వ్యవహారం లాంటిది. దాన్ని అమ్మటం గానీ, ఒకరికి కానుకగా ఇవ్వటంగానీ కుదరదు.” (ఈ హదీసును హాకిమ్ గారు షాఫయి ముహమ్మద్ బిన్ హసన్ ద్వారా, మరి ఆయన అబూ యూసుఫ్ ఆధారంగా ఉల్లేఖించారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ‘ప్రామాణికం’ అన్నారు. అయితే బైహఖీ దీనిని ‘మాలూల్’గా పేర్కొన్నారు)
English
Narrated 'Abdullah bin 'Umar (RA): Allah's Messenger (ﷺ) said: "The right to inheritance from a freed slave is a relationship like the relationship of blood relatives (lineage); it cannot be sold or given away." [al-Hakim reported it through ash-Shafi'i's narration from Muhammad bin al-Hasan on the authority of Abu Yusuf. Ibn Hibban graded it Sahih (authentic), while al-Baihaqi graded it defective].
సారాంశం
ఈ హదీసులో ‘వలా’ను వంశపరంపరతో పోల్చి దాని క్రయవిక్రయాలు జరపటంగానీ, మొక్కుబడిగా ఇవ్వటం గానీ, ఎవరికయినా కానుకగా ఇవ్వటంగానీ చేయరాదని స్పష్టం చేయడం జరిగింది. పూర్వం అరేబియాలో ప్రజలు ‘వలా’ను (స్వేచ్ఛనొసగబడిన బానిస తరపున లభించిన మొత్తాన్ని) అమ్మటం, మొక్కుబడుల కోసం కేటాయించడం, కానుకల రూపేణా ఇవ్వటం చేసేవారు. దైవప్రవక్త ﷺ దీనిని వారించారు.
హదీసు ఉల్లేఖకులు
1. ముహమ్మద్ బిన్ హసన్ : మరో పేరు అబూ అబ్దుల్లాహ్. వంశపరంపర ప్రకారం ముహమ్మద్ బిన్ హసన్ బిన్ ఫర్ఖద్ షైబానీ అనబడతారు. సుప్రసిద్ధ హనఫీ ఇమాములలో ఒకరు. హిజ్రీ 132లో జన్మించారు. కూఫాలో పెరిగి పెద్దవారయ్యారు. విద్యార్జన కోసం స్వస్థలం వదలి అనేక ప్రాంతాలు సందర్శించారు. గొప్ప గొప్ప విద్వాంసులను, ధర్మవేత్తలను కలుసుకున్నారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి ఆశ్రమంలో చాలా కాలం తర్ఫీదు పొందారు. అనంతరం అబూ యూసుఫ్ నుండి ‘ఫికహ్’ (ధర్మావగాహన) పాఠాలు తీసుకున్నారు. ఎన్నో సునిశిత అంశాలపై రచనలు చేశారు. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృక్పథాన్ని విస్తృతంగా వ్యాపింపజేశారు. హనఫీ దృక్పథానికి సంబంధించిన మూడు మూల స్థంభాలలో ఈయన కూడా ఒక స్థంభం వంటివారు. మూడు సంవత్సరాల దాకా ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) నుండి కూడా విద్యార్జన చేశారు. ఈయన గురించి ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ఇలా అనేవారు: “నేను ముహమ్మద్ బిన్ హసన్ లాంటి లావుపాటి మనిషి నెవరినీ చూడలేదు. అయినా ఎంతో చలాకీగా ఉండేవారు. దయార్ద్ర హృదయులు. మంచి సావాసి. ఆయన్ని మించిన శ్రేయోభిలాషిని నేను చూడలేదు.” జ్ఞాపకశక్తి దృష్ట్యా హదీసులో ఈయన్ని ‘జయీఫ్’గా ఖరారు చేయటం జరిగింది. హిజ్రీ 189లో ‘రే’ ప్రాంతంలోని ‘రాన్బువియ’ గ్రామంలో మరణించారు.
2. అబూ యూసుఫ్ : ఈయన అసలు పేరు ఇమామ్ యాఖూబ్ బిన్ ఇబ్రాహీమ్ అన్సారీ. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) గారి ప్రియతమ శిష్యులుగా సుప్రసిద్ధులు. ఇరాక్ కు చెందిన ప్రఖ్యాత ధర్మవేత్తలలో ఒకరు. ఖాజియుల్ ఖుజాత్ హోదాను అలంకరించారు. కూఫాలో పెరిగి పెద్దవారయ్యారు. జీవితంలో అధికభాగం విద్యార్జనలోనే వెచ్చించారు. ఈయన తండ్రి పేదవారు. అందుచేత ఇమామ్ అబూ హనీఫా గారు తరచూ వందేసి దిర్హముల చొప్పున ఆర్థిక సాయంగా ఇస్తుండేవారు. యహ్యా బిన్ ముయిన్ ప్రకారం ధర్మవేత్తల వర్గంలో ఇమామ్ అబూ యూసుఫ్ గారే ఎక్కువగా హదీసులో సునిశిత దృష్టిగలవారు. యహ్యా బిన్ యహ్యా తమీమి ఇలా అంటున్నారు : అబూ యూసుఫ్ గారు మరణ సమయంలో ఇలా అంటూ ఉండగా నేను విన్నాను – “దైవగ్రంథం (ఖుర్ఆన్) మరియు సున్నత్ (హదీసు)లతో సమరసం చెందని నా (గత) ధార్మిక తీర్పులన్నింటినీ నేను ఉపసంహరించుకుంటున్నాను.” హిజ్రీ 182 రబీవుల్ ఆఖిర్ నెలలో 69 ఏండ్ల వయసులో ఈయన మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 816
హదీసు 817
وَعَنْ أَبِي قِلَابَةَ , عَنْ أَنَسٍ قَالَ : قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ أَفْرَضُكُمْ زَيْدُ بْنُ ثَابِتٍ } أَخْرَجَهُ أَحْمَدُ , وَالْأَرْبَعَةُ سِوَى أَبِي دَاوُدَ , وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ , وَابْنُ حِبَّانَ , وَالْحَاكِمُ , وَأُعِلَّ بِالْإِرْسَالِ.
హజ్రత్ అబూ ఖిలాబ గారు హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : “మీలో అందరికన్నా ఎక్కువగా వారసత్వ నియమ నిబంధనల గురించి తెలిసినవారు జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు).” (ఈ హదీసును అహ్మద్ మరియు ‘నలుగురి’లో అబూదావూద్ మినహా మిగిలిన వారంతా ఉల్లేఖించారు. తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారుగాని ఇది ‘ముర్సల్’ అయిన కారణంగా దీనిని లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు)
English
Narrated Abu Qilabah on the authority of Anas (RA): Allah's Messenger (ﷺ) said: "The most versed in the rules of inheritance among you is Zaid bin Thabit." [Reported by Ahmad and al-Arba'a except Abu Dawud. at-Tirmidhi, Ibn Hibban and al-Hakim graded it Sahih (authentic). However, it was considered defective due to being Mursal (missing link in the chain after the Tabi'i)].
సారాంశం
వాస్తవానికి ఇదొక సుదీర్ఘమైన హదీసులోని ఒక్క వాక్యం మాత్రమే. పూర్తి ఉల్లేఖనం ఇది : దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు – “నా అనుచర వర్గంలో అందరికన్నా దయార్ద్ర హృదయుడు, ప్రేమమయుడైన మనిషి అబూబకర్ (రదియల్లాహు అన్హు). ధర్మావలంబనలో ఎంతో ఖచ్చితంగా, కఠినంగా వ్యవహరించే వ్యక్తి ఉమర్ (రదియల్లాహు అన్హు). అందరికన్నా ఎక్కువగా బిడియం కలవాడు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు). ధర్మాధర్మాల విచక్షణా జ్ఞానంలో అందరినీ మించినవాడు ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు). అందరికన్నా బాగా, మధురంగా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తి ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు). కాగా; అందరికన్నా అధికంగా (వారసత్వ) ధర్మాలు తెలిసినవాడు జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)” – అందువల్లనే ఇస్లామీయ విద్వాంసులు వారసత్వ పంపకాల్లో భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు సాధారణంగా హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) అభిప్రాయానికే ప్రాధాన్యత నిస్తారు.
హదీసు ఉల్లేఖకులు
అబూ ఖిలాబ : ఈయన అసలు పేరు అబ్దుల్లాహ్ బిన్ జైద్ బిన్ అమ్ర్ లేదా ఆమిర్ జర్మీ, బస్రీ. గొప్ప తాబయి. విశ్వసనీయులు. జ్ఞాన సంపన్నులు. అనేక ముర్సల్ హదీసులను ఉల్లేఖించారు. ఖాజీ పదవిని కాదని సిరియాకు వచ్చేశారు. హిజ్రీ 104 లేక 106 లేక 107 లో మరణించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|7. వాణిజ్య పుస్తకం|7.20 ఆస్తుల పంపకం|హదీసు 817
You must be logged in to post a comment.