హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 4. జకాత్ పుస్తకం, 2వ అధ్యాయం: స్వచ్ఛంద దానధర్మాలు. ఈ అధ్యాయంలో 12 హదీసులు (హదీసు 508 – 519) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.
4.2 స్వచ్ఛంద దానధర్మాలు
باب صدقة التطوع
అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)
హదీసు 508
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { سَبْعَةٌ يُظِلُّهُمُ اَللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لَا ظِلَّ إِلَّا ظِلُّهُ.... } فَذَكَرَ اَلْحَدِيثَ وَفِيهِ: { وَرَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لَا تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ } مُتَّفَقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – దైవప్రవక్త ﷺ ప్రబోధించారు : “ఏడు రకాల మనుషులున్నారు. ఏ రోజున అల్లాహ్ నీడ తప్ప మరొకరి ఆశ్రయం ఉండదో ఆ రోజున అల్లాహ్ వారికి ఆశ్రయం ఇస్తాడు.” తరువాత హదీసునంతటినీ వివరించారు. అందులో ఒక వాక్యం ఇలా వుంది – “ఆ ఏడుగురిలో- కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చేసేవాడు కూడా ఉన్నాడు.”
(బుఖారీ, ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Seven people will be shaded by Allah under His shade on the day when there will be no shade except His ….” He mentioned the rest of the hadith, which says, “and a man who gives charity so secretly that his left hand does not know what his right hand has given.” (i.e. nobody knows how much he has given in charity). Agreed upon.
సారాంశం
ఏడు రకాల మనుషుల్లో మిగిలిన ఆరుగురు ఎవరు? అన్న ప్రశ్న ఇక్కడ జనించవచ్చు. ఆ ఆరుగురు వీరు – (1) న్యాయశీలుడైన నాయకుడు. (2) దైవారాధనలో కాలం గడిపిన యువకుడు. (3) ఎల్లప్పుడూ మస్జిద్లో మనసు లగ్నమై ఉండే వ్యక్తి. (4) కేవలం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ఉద్దేశ్యంతో పరస్పరం ప్రేమించుకునే, కేవలం అల్లాహ్ ప్రసన్నతను బడసే సంకల్పంతోనే ఒండొకరి నుంచి వేర్పడిపోయే ఇద్దరు వ్యక్తులు. (5) అందగత్తె, కులీనురాలైన ఒక పడుచు స్త్రీ పొందు కోసం పిలువగా, తాను దైవానికి భయపడే వాడినని చెప్పి, ఆమె పిలుపును తిరస్కరించిన వ్యక్తి. (6) ఏకాంతంలో దైవధ్యానంలో నిమగ్నుడై ఉండగా దేవునిపట్ల భక్తీ పారవశ్యంతో – నయనాల నుండి అశ్రుధారలు ప్రవహించే వ్యక్తి. (7) ఇక ఏడవవ్యక్తి గోప్యంగా దానధర్మాలు చేసేవాడు. ప్రదర్శనాబుద్ధికి తావీయకుండా – కేవలం దైవాన్ని సంతోషపరచే ఉద్దేశ్యంతో – సాటి మానవుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసే ధన్యుడు.
ఈ హదీసు సదఖయె వాజిబా (తప్పనిసరి దానం), సదఖయె నాఫిలా (స్వచ్ఛంద దానం) – రెంటినీ పరివేష్టించి ఉంది.
ప్రళయం ఒకనాడు తథ్యమనీ, ఆనాడు దైవ సింహాసనం తప్ప మరొక నీడ, మరో ఆశ్రయం ఉండబోదని కూడా ఈ హదీసు చాటిచెబుతోంది. ఆ సింహాసనం ఎటువంటిది? దాని నీడ ఎలా ఉంటుంది? ఆ స్థితి వర్ణనాతీతం. దాని జ్ఞానం అల్లాహ్కే పరిమితం.
ఈ హదీసు కేవలం పురుషులకే ప్రత్యేకమా? స్త్రీలకు ఈ అదృష్టం లేదా? అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవటం సహజం. యదార్ధమేమిటంటే ఇటువంటి సుగుణాలు గల మహిళలకు కూడా ఈ హదీసు యధాతథంగా వర్తిస్తుంది.
ఫర్జ్ మరియు వాజిబ్ సదకాలు ఇస్తున్నప్పుడు వాటిని బహిరంగంగా ఇవ్వాలి. ఎందుకంటే దీనివల్ల ఇతరులను కూడా సదాచరణ వైపునకు పురికొల్పినట్లవుతుంది. అయితే స్వచ్ఛంద లేక సాధారణ దానాలను మాత్రం గోప్యంగా ఇవ్వటం మంచిదని చెప్పబడింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్వచ్ఛంద దాన ధర్మాలు కూడా గోప్యంగా ఇవ్వటానికి వీలుపడదు. ఎంత కాదనుకున్నా అవి బహిర్గతమవుతాయి. దాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. అయితే అటువంటి సందర్భాలలో దాత సంకల్పం బావుండాలి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులను ఆర్జించే ఉద్దేశ్యంతో గాకుండా కేవలం తన ప్రభువును మెప్పించే ఉద్దేశ్యంతో దానం చేయాలి. ‘చిత్తశుద్ధి’ అంటే ఇదే మరి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 508
హదీసు 509
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ - رضى الله عنه - قَالَ: سَمِعْتُ رَسُولَ اَللَّهِ - صلى الله عليه وسلم -يَقُولُ: { كُلُّ اِمْرِئٍ فِي ظِلِّ صَدَقَتِهِ حَتَّى يُفْصَلَ بَيْنَ اَلنَّاسِ } رَوَاهُ اِبْنُ حِبَّانَ وَالْحَاكِمُ.
దైవప్రవక్త ﷺ ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ ఉఖబా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ప్రతి వ్యక్తీ తన దానాల నీడలో నిలబడి ఉంటాడు. కడకు ప్రజల తీర్పు జరిగిపోతుంది.”
(ఇబ్నె హిబ్బాన్, ముస్తద్రక్ హాకిమ్)
English
’Uqbah Ibn ‘Amir (RAA) narrated, ‘I heard the Messenger of Allah (ﷺ) say, “Everybody will be shaded by his Sadaqah (on the Day of Judgment) until it has been judged between the people.” Related by Ibn Hibban and Al-Hakim.
సారాంశం
దానధర్మాలలో ముందంజ వేసేవారి వైశిష్ట్యం ఈ హదీసులో తెలుపబడింది. ఎంత విస్తారంగా దానాలు చేసివుంటే వారి నీడ అంతగానే విస్తృతమయి ఉంటుంది. ప్రళయ దిన దృశ్యాన్ని ఓసారి ఊహించుకోండి – ఆ రోజు ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. ఆనాడు ఎవరికి కాస్తంత నీడ దొరికినా అది వారి భాగ్యమే అనాలి. అతను చేసుకున్న దాన ధర్మాల నీడ ఆనాడు అతని మన్నింపు కొరకు దైవసమక్షంలో సిఫారసు చేస్తూ ఉంటుంది. స్వచ్ఛంద దానంలో వున్న మరో శుభకరమయిన కోణం ఏమిటంటే, ‘సదఖయె వాజిబా’ను చెల్లించటంలో మనిషివల్ల ఏదయినా లోటు జరిగి ఉంటే ఆ లోటును ఇది పూరిస్తుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 509
హదీసు 510
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ, عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اَللَّهُ مِنْ خُضْرِ اَلْجَنَّةِ, وَأَيُّمَا مُسْلِمٍ أَطْعَمَ مُسْلِمًا عَلَى جُوعٍ أَطْعَمَهُ اَللَّهُ مِنْ ثِمَارِ اَلْجَنَّةِ, وَأَيُّمَا مُسْلِمٍ سَقَى مُسْلِمًا عَلَى ظَمَإٍ سَقَاهُ اَللَّهُ مِنْ اَلرَّحِيقِ اَلْمَخْتُومِ } رَوَاهُ أَبُو دَاوُدَ وَفِي إِسْنَادِهِ لِينٌ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించినట్లు హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఆయన ﷺ ఇలా ప్రబోధించారు – “ఏ ముస్లిం అయినా దుస్తులు లేని తన సోదరునికి దుస్తులు తొడిగిస్తే అల్లాహ్ అతనికి స్వర్గంలో పచ్చని పట్టు వస్త్రాలు తొడిగిస్తాడు. మరే ముస్లిం అయినా ఆకలితో అలమటించే తన సోదరునికి అన్నం పెడితే అల్లాహ్ అతనికి స్వర్గంలోని ఫలాలు తినిపిస్తాడు. ఇంకా ఏ ముస్లిమయినా దాహంతో బాధపడే తన సోదరునికి మంచినీరు (లేక పానీయం) త్రాగిస్తే అల్లాహ్ అతనికి స్వర్గలోకంలోని సీలు వేయబడివున్న స్వచ్ఛమయిన మద్యం త్రాపుతాడు.” (దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు. దీని పరంపరలో బలహీనత ఉంది)
English
Abu Sa'id AI-Khudri (RAA) narrated that The Prophet said, “Any Muslim who clothes another Muslim who is naked, Allah will clothe him from the green garments of Paradise. Any Muslim who feeds a Muslim who is hungry, Allah will feed him from the fruit of Paradise, and any Muslim who gives drink to a Muslim who is thirsty, Allah will give him a drink from the Sealed Nectar.” Related by Abu Dawud with a weak chain of narrators.
సారాంశం
పరలోకంలో అల్లాహ్ తన దాసులకు ప్రసాదించే ప్రతిఫలం ఇహలోకంలో వారు చేసిన పనులతో సమన్వయం చెందేదిగా ఉంటుందని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. అయితే స్వర్గంలోని దుస్తులు ప్రపంచంలోని దుస్తులకన్నా ఎంతో నాణ్యంగా, అందంగా, సుతిమెత్తగా ఉంటాయి. అతడు చేసిన సత్కార్యం దైవసన్నిధిలో ఆమోదయోగ్యమయినపుడే అతనికి ఈ ప్రతిఫలం లభిస్తుంది. సదాచరణ స్వీకారయోగ్యమవటానికి రెండు షరతులున్నాయి. ఒకటి: అది షరీయత్ కనుగుణంగా ఉండాలి. దైవప్రవక్త ﷺ విధానానికి విరుద్ధంగా ఉండకూడదు. రెండు: సదాచరణ వెనుక చిత్తశుద్ధి ఉండాలి. అంటే దైవప్రసన్నత పొందే సంకల్పంతో సత్కార్యం చేయాలి. దాని వెనుక ప్రదర్శనా మనస్తత్వం ఉండకూడదు.
హదీసులో ఆకలిగొన్నవారు, దుస్తులు లేనివారు, దాహంతో బాధపడేవారి ప్రస్తావన వచ్చింది. యాచించే వారి నిజ స్థితి వారి వాలకాన్ని బట్టి అర్థమైపోతుంది. అటువంటి అగత్యపరులకు, నిరాధారులకు దానాలివ్వటం మంచిదే. కాని శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉండి కూడా కష్టపడకుండా సోమరుల్లా తిరిగేవారికి, వృత్తిపరమయిన (ప్రొఫెషనల్స్) ఫకీర్లకు దానం ఇవ్వకూడదు. సిసలయిన అభాగ్య జీవులకు ఇవ్వటం వల్ల సమాజంలో వారి సమస్యలు పరిష్కృతమవుతాయి. వారి అక్కరలు తీర్తాయి. ఈ ఆచరణను అల్లాహ్ ఎంతగానో మెచ్చుకుంటాడు. ప్రతిఫలంగా వారికి శాశ్వితమయిన – అనుగ్రహభరితమయిన – స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారికి సమర్పించబడే మద్యం ప్రపంచంలోని మద్యం లాంటిది కాదు. అది సీలువేయబడిన షరాబు. పవిత్రమైన, స్వచ్ఛమయిన షరాబు. మత్తునివ్వని మద్యం. దేవుడు సమ్మతించి ఆమోదించిన (హలాల్) మద్యం.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 510
హదీసు 511
وَعَنْ حَكِيمِ بْنِ حِزَامٍ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { اَلْيَدُ اَلْعُلْيَا خَيْرٌ مِنَ اَلْيَدِ اَلسُّفْلَى, وَابْدَأْ بِمَنْ تَعُولُ, وَخَيْرُ اَلصَّدَقَةِ عَنْ ظَهْرِ غِنًى, وَمَنْ يَسْتَعْفِفْ يُعِفَّهُ اَللَّهُ, وَمَنْ يَسْتَغْنِ يُغْنِهِ اَللَّهُ. } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.
హజ్రత్ హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: “పై చేయి క్రింది చేయికన్నా ఉత్తమమైనది. మీపై ఆధారపడివున్న వారితో (దానధర్మాలు) మొదలెట్టండి. మీ అవసరాలు, అక్కరలు తీరగా ఇచ్చేదే అత్యుత్తమమయిన సదఖా. ఎవరయితే ఒకరి ముందు చేయి చాచకుండా ఉంటాడో అతన్ని (అతని గౌరవమర్యాదలను) అల్లాహ్ కాపాడతాడు. ఎవరయితే పరువుగా బ్రతుకుతాడో అతనికి అల్లాహ్ స్వయం సమృద్ధి నొసగుతాడు.” (బుఖారీ, ముస్లిం – హదీసు వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)
English
Hakim bin Hizam (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: ”The upper hand is better than the lower hand (i.e. he who gives in charity is better than he who takes it). One should begin by giving to his dependents. And the best Sadaqah (charity) is that, which is given by a wealthy person (from the money which is left over after his expenses). And whoever abstains from asking others for some financial help, Allah will provide for him and save him from asking others; Allah will make him self-sufficient.” Agreed upon and this version is of al-Bukhari.
సారాంశం
కుటుంబీకులు అధఃస్థితిలో వున్నప్పుడు వారి కష్టాలు తీర్చటం, వారి సమస్యలను పరిష్కరించటం కూడా సత్కార్యం క్రిందికే వస్తుంది. ఇంటి అక్కరలు తీరకుండానే బయటివారికి దానధర్మాలు చేయటం మంచి పద్ధతికాదు. ‘ముస్లిం’లో హజ్రత్ సోబాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మనిషి తన ఆలుబిడ్డలు మరియు కుటుంబీకులపై వెచ్చించే సంపదే అత్యుత్తమ సంపద. లేదా అతను దైవమార్గంలో ఖర్చు చేయాలి లేదా తన ఆప్తులపై, బంధుమిత్రులపై ఖర్చుపెట్టాలి.
ఈ హదీసులో సదఖా (దానం) ఇవ్వటంలోని మహత్తును గురించి చెప్పటంతోపాటు అక్కర లేకపోయినా అర్థించేవారిని సున్నితంగా మందలించటం కూడా జరిగింది. చీటికీమాటికీ తమ హీనస్థితిని ఇతరుల ముందు చాటుకోకుండా – అభిమానధనులుగా జీవించే వారి కోసం అల్లాహ్ ఉపాధి ద్వారాలను తెరుస్తాడు. ఎవరిపైనా ఆధారపడకుండా నిరపేక్షాపరులుగా జీవించే స్థితిని కల్పిస్తాడు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 511
హదీసు 512
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: { قِيلَ يَا رَسُولَ اَللَّهِ: أَيُّ اَلصَّدَقَةِ أَفْضَلُ? قَالَ: "جُهْدُ اَلْمُقِلِّ, وَابْدَأْ بِمَنْ تَعُولُ" } أَخْرَجَهُ أَحْمَدُ, وَأَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ, وَالْحَاكِمُ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: ‘ఏ దానం శ్రేష్ఠమైనది?’ అని దైవప్రవక్త ﷺను ఎవరో ప్రశ్నించగా, “తక్కువ ధనం ఉన్నవాడు చేసే దానం. నీపై ఆధారపడి ఉన్నవారి నుంచి దానాన్ని మొదలెట్టు” అని దైవ ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. (దీనిని అహ్మద్, అబూదావూద్ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ దీనిని ప్రామాణిక హదీసుగా ఖరారు చేశారు)
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) was asked, ‘Which kind of Sadaqah is better? He replied, “That which is given by one who does not have much property. And begin by giving to your dependents.” Related by Ahmad, and Abu Dawud. Ibn Khuzaimah, Ibn Hibban and AI-Hakim graded it as Sahih.
సారాంశం
ఈ హదీసు ద్వారా రెండు విషయాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఒకటి: ధనికుని దానానికీ, సామాన్యుని దానానికీ మధ్య స్పష్టమయిన వ్యత్యాసం ఉంది. రెండు : ఆలుబిడ్డల, కుటుంబ సభ్యుల కనీసావసరాలు తీర్చిన మీదట దానధర్మాలు చేయాలి. తాను పరులకు దానధర్మాలు చేస్తుండగా తన ఇంటివారలు అన్యుల ముందు చేయి చాచవలసిన నికృష్టస్థితి ఏర్పడకూడదు. అందుకే ముందు తన ఇంటివారి (షరీయత్పరంగా) ధర్మసమ్మతమయిన అక్కరలపై శ్రద్ధ చూపాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 512
హదీసు 513
وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ " تَصَدَّقُوا " فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اَللَّهِ, عِنْدِي دِينَارٌ? قَالَ: " تَصَدَّقْ بِهِ عَلَى نَفْسِكَ " قَالَ: عِنْدِي آخَرُ, قَالَ: " تَصَدَّقْ بِهِ عَلَى وَلَدِكَ " قَالَ: عِنْدِي آخَرُ, قَالَ: " تَصَدَّقْ بِهِ عَلَى زَوْجَتِكَ " قَالَ: عِنْدِي آخَرُ, قَالَ: " تَصَدَّقْ بِهِ عَلَى خَادِمِكَ " قَالَ: عِنْدِي آخَرُ, قَالَ: " أَنْتَ أَبْصَرُ بِهِ ". } رَوَاهُ أَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ وَالْحَاكِمُ.
హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : “దానధర్మాలు చేయండి” అని దైవప్రవక్త ﷺ ఉపదేశించారు. ‘దైవప్రవక్తా! నా దగ్గర ఒక్క దీనార్ మాత్రమే ఉంది’అని ఒక వ్యక్తి అన్నాడు. “దాన్ని నీ స్వయం కోసమే ఖర్చుపెట్టు” అని దైవప్రవక్త ﷺ అన్నారు. ‘మరో దీనార్ కూడా ఉంది’ అని అన్నాడావ్యక్తి. “దాన్ని నీ సంతానంపై సదఖాగా వెచ్చించు” అని ఆయన ﷺ సలహా ఇచ్చారు. ‘నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది’ అన్నాడా వ్యక్తి. “దాన్ని నీ భార్య కొరకు ఖర్చుపెట్టు’ అని సూచించారాయన ﷺ. ‘నావద్ద ఇంకొకటి కూడా ఉంది’ అని అతడు చెప్పగా “దాన్ని నీ సేవకుని కోసం ఖర్చుపెట్టు” అని ఉపదేశించారు ఆయన ﷺ. ‘దైవప్రవక్తా! నా వద్ద మరొకటి కూడా ఉందికదా!’ అని అతడు సందేహపడగా, “దీన్ని ఖర్చుపెట్టే అవగాహన నీకు ఎక్కువగానే ఉంది” అని ఆయన ﷺ అన్నారు. (ఈ హదీసును అబూదావూద్, నసాయి ఉల్లేఖించారు- ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ దీనిని ప్రామాణికమైనదిగా నిర్ధారించారు)
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Give Sadaqah.” A man then said, ‘Allah’s Messenger (ﷺ), I have a Dinar.’ He then said to him, “Give it to yourself as Sadaqah.” The man again said, ‘I have another one.’ The Messenger of Allah (ﷺ) said: “Give it to your children as Sadaqah.” He said, ‘I have another one.’ He said, “Give it to your wife as Sadaqah.” The man again said, ‘I have another one.’ The Messenger of Allah (ﷺ) said: “Give it to your servant as Sadaqah.” He said, ‘I have another one.’ The Messenger of Allah (ﷺ) said: “You know better to whom you should give it.” Related by Abu Dawud and An-Nasa’i. Ibn Hibban and Al-Hakim regarded it as Sahih.
సారాంశం
ఈ హదీసు ద్వారా అవగతమయ్యేదేమిటంటే మానవుడు షరీయత్ పరిమితుల్లో ఉంటూ తొలుత తన వాళ్ళ అవసరాలను తీర్చాలి. ధర్మసమ్మతమైన రీతిలో ఆలుబిడ్డల అవసరాలను తీర్చటం కూడా పుణ్యప్రదమయిన విషయమే. ఆ క్రమపద్ధతి ఇలా వుంది: ముందు తన స్వయానికై ఖర్చుపెట్టాలి. తరువాత సంతానం, భార్య, సేవకులూ వస్తారు. ఆ తరువాత తన ఇష్టమొచ్చిన వారిపై ఖర్చుపెట్టవచ్చు. లేదా భవిష్యత్తు కొరకు పొదుపు చేయవచ్చు. ఏది ఖర్చుచేసినా అతడు ఈ క్రమపద్ధతిని దృష్టిలో పెట్టుకోవాలి.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 513
హదీసు 514
وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم -{ إِذَا أَنْفَقَتِ اَلْمَرْأَةُ مِنْ طَعَامِ بَيْتِهَا, غَيْرَ مُفْسِدَةٍ, كَانَ لَهَا أَجْرُهَا بِمَا أَنْفَقَتْ وَلِزَوْجِهَا أَجْرُهُ بِمَا اِكْتَسَبَ وَلِلْخَازِنِ مِثْلُ ذَلِكَ, لَا يَنْقُصُ بَعْضُهُمْ مِنْ أَجْرِ بَعْضٍ شَيْئًا } مُتَّفَقٌ عَلَيْهِ..
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) వివరించారు – “స్త్రీ తన ఇంటి సొమ్మును దుబారాగా ఖర్చుపెట్టకుండా పొదుపును పాటిస్తే ఈ పొదుపరితనానికి బదులుగా ఆమెకు పుణ్యం లభిస్తుంది. ఆమె భర్తకు సంపాదించిన పుణ్యం లభిస్తుంది. అలాగే కోశాధికారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఎవరి పుణ్యం కూడా ఇంకొకరి పుణ్యాన్ని తగ్గించదు.”
(బుఖారీ, ముస్లిం)
English
A’ishah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “When a woman gives some of the foodstuff (which she has in her house) in charity without being extravagant (without being wasteful), she will receive the reward for what she has spent, and her husband will receive the reward because of his earning, and the keeper (if any) will be similarly rewarded. The reward of one will not decrease the reward of the others.” Agreed upon.
సారాంశం
ఒక ఉత్తమ ఇల్లాలి బాధ్యత ఏమిటో ఈ హదీసులో స్పష్టపరచబడింది. ఆమె ఎల్లప్పుడూ భర్త సంపాదనను బేరీజువేస్తూ, ఇంటి ఖర్చులను దానికనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. దుబారా ఖర్చులు చేసి, భర్త అనుమతి లేకుండా దానధర్మాలు చేసి ఇంటి ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేయకూడదు. ఇల్లాలు ఒక్కో పద్దులో పాటించే పొదుపరితనం ఆ ఇంటిల్లిపాదికీ వరంగా పరిణమిస్తుంది. భర్తను అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. అతడు నిశ్చింతగా ఉంటే బయటి వ్యవహారాలు, బాధ్యతలు సజావుగా నెరవేరుస్తాడు. ఈ విధంగా ఒక ఇల్లాలి యొక్క జాగరూకత మొత్తం వ్యవస్థ పాలిట శుభదాయకంగా పరిణమిస్తుంది. అలాగే ఒక ఇల్లాలి యొక్క అలక్ష్యం, అజాగ్రత్త మొత్తం వ్యవస్థనే అస్తవ్యస్తం చేసివేస్తుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 514
హదీసు 515
وَعَنْ أَبِي سَعِيدٍ اَلْخُدْرِيِّ - رضى الله عنه - قَالَ: { جَاءَتْ زَيْنَبُ اِمْرَأَةُ اِبْنِ مَسْعُودٍ, فَقَالَتْ: يَا رَسُولَ اَللَّهِ, إِنَّكَ أَمَرْتَ اَلْيَوْمَ بِالصَّدَقَةِ, وَكَانَ عِنْدِي حُلِيٌّ لِي, فَأَرَدْتُ أَنْ أَتَصَدَّقَ بِهِ, فَزَعَمَ اِبْنُ مَسْعُودٍ أَنَّهُ وَوَلَدُهُ أَحَقُّ مَنْ تَصَدَّقْتُ بِهِ عَلَيْهِمْ, فَقَالَ اَلنَّبِيُّ - صلى الله عليه وسلم - "صَدَقَ اِبْنُ مَسْعُودٍ, زَوْجُكِ وَوَلَدُكِ أَحَقُّ مَنْ تَصَدَّقْتِ بِهِ عَلَيْهِمْ". } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం : అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) గారి శ్రీమతి జైనబ్ (రదియల్లాహు అన్హా) వచ్చి ఇలా విన్నవించుకున్నది – “ఓ దైవప్రవక్తా ﷺ! ఈ రోజు మీరు దానధర్మాలు చేయమని ఆజ్ఞాపించారు. నా దగ్గర నా స్వంత నగ ఉంది. దాన్ని నేను దానంగా ఇవ్వాలనుకుంటున్నాను. నా ఈ దానానికి (సదఖాకు) తాను, తన పిల్లలు ఎక్కువ హక్కుదారులని అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) భావిస్తున్నారు (నిజమేనా?)” దానికి ఆయన ﷺ “ఇబ్నె మస్వూద్ చెప్పింది నిజమే. నీ భర్త, నీ పిల్లలు నీవిచ్చే సదఖాకు ఎక్కువ హక్కుదారులు” అని అన్నారు. (బుఖారీ)
English
Abu Sa'id (RAA) narrated, ‘Zainab the wife of Ibn Mas’ud came along and said to the Prophet “O Messenger of Allah (ﷺ)! You have commanded us today to give Sadaqah (charity). I have some jewelry of mine and I wanted to give it as Sadaqah, but Ibn Mas'ud claims that he and his children are the most entitled to my Sadaqah. (deserve it more than anyone else.)' The Messenger of Allah (ﷺ) said: “Ibn Mas'ud is right. Your husband and your children are more deserving.’’ Related by Al-Bukhari.
సారాంశం
‘సదఖా’ అనే అరబీ పదం చాలా విస్తృతమయింది. అది సాధారణ దానధర్మాలతోపాటు, జకాత్ నేపథ్యంలో కూడా ఉపయోగించబడుతుంది. పై హదీసులో ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) భార్య ఇవ్వదలచిన సదఖా స్వచ్ఛందమయిన సదఖా? లేక వాజిబ్ సదఖా? లేక జకాత్ మొత్తమా? అన్నది ఇక్కడ ప్రశ్న. సాధారణ సదఖా అయితే ఆమె దానికి సంబంధించి అడిగి తెలుసుకోవలసిన అవసరం లేదు. బహుశా ఇది జకాత్కి సంబంధించిన సదఖా (ఫర్జీ సదఖా) అయి ఉండవచ్చు. అధిక సంఖ్యాకులైన విద్వాంసుల, ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం భార్య తన భర్తకు జకాత్ ఇవ్వవచ్చు. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయంలో భార్య తన భర్తకు జకాత్ ఇవ్వజాలదు.
హదీసు ఉల్లేఖకులు
ఈ హదీసులో దైవప్రవక్త ﷺ ముందు ధర్మసందేహం వెలిబుచ్చిన జైనబ్ (రదియల్లాహు అన్హా) అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్(రదియల్లాహు అన్హు) సతీమణి. ఈమె బనూ సఖీఫ్ తెగకు చెందినవారు. ఈమె తండ్రి పేరు ముఆవియ లేక అబ్దుల్లా బిన్ ముఆవియ లేక అబూ ముఆవియ. ఈమె దైవప్రవక్త ﷺ, హజ్రత్ ఉమర్, మరియు తన భర్త ఆధారంగా హదీసులను ఉల్లేఖించారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 515
హదీసు 516
وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ لَا يَزَالُ اَلرَّجُلُ يَسْأَلُ اَلنَّاسَ حَتَّى يَأْتِيَ يَوْمَ اَلْقِيَامَةِ, وَلَيْسَ فِي وَجْهِهِ مُزْعَةُ لَحْمٍ } مُتَّفَقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “ఎవరయితే భిక్షాటనను, యాచించటాన్ని వృత్తిగా చేసుకుంటారో వారు ప్రళయదినాన తమ ముఖాలపై మాంసం లేని స్థితిలో లేచివస్తారు.”
(బుఖారీ, ముస్లిం)
English
Ibn ’Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “A man who persists in begging people to give him charity, will come on the Day of Judgment and there will not be a piece of flesh on his face.” Agreed upon.
సారాంశం
ఈ హదీసు ద్వారా భిక్షాటనం ఖండించబడింది. కేవలం మూడు రకాల మనుషులు మాత్రమే యాచించటం సమ్మతం. ఒకటి : ప్రకృతి వైపరీత్యాల, అవాంఛనీయ సంఘటనల వాతనపడి సర్వస్వాన్నీ కోల్పోయినవారు. తిండి తిప్పల కోసం కూడా ఏమీ మిగలనివారు. వారు తమ తాత్కాలిక అవసరాల కోసం, పునరావాసం కోసం అడగవచ్చు. అలాంటి వారి అవసరాలను అర్థం చేసుకుని ఉదారంగా ఆదుకోవాలి కూడా. రెండు: అన్యాయంగా జరిమానాకు గురైనవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయినవారు. ఇలాంటి వారు ఇతరుల నుంచి అడిగి తమ దుస్థితి నుంచి బయటపడాలి. మూడు: పగలల్లా కష్టపడి పనిచేసినా కడుపునింపుకునేంత వేతనం లభించనివాడు, లేదా ఎంతగా అన్వేషించినా పని దొరకనివాడు, పరిమితమైన ఆదాయం వల్ల కుటుంబ అవసరాలు తీరనివాడు, ఆకలిదప్పులతో అలమటించేవాడు- ఇట్టి పరిస్థితిలో వారు సమాజంలోని స్థితిమంతుల నుంచి అడిగి తమ అవసరాలు తీర్చుకోవచ్చు. వీరు గాక భిక్షాటనను వృత్తిగా చేసుకున్నవారు, కష్టపడి పనిచేయగల శక్తి ఉండి కూడా ముష్టెత్తుకోవటాన్నే అలవాటుగా చేసుకున్నవారు ప్రళయదినాన అత్యంత అవమానకరమైన స్థితిలో లేపబడతారు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 516
హదీసు 517
وَعَنْ أَبِي هُرَيْرَةَ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ مَنْ سَأَلَ اَلنَّاسَ أَمْوَالَهُمْ تَكَثُّرًا, فَإِنَّمَا يَسْأَلُ جَمْرًا, فَلْيَسْتَقِلَّ أَوْ لِيَسْتَكْثِرْ } رَوَاهُ مُسْلِمٌ.
దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ఎవరయితే తన సంపదను పెంచుకునే, వృద్ధిచేసుకునే ఉద్దేశ్యంతో జనుల నుండి యాచిస్తాడో అతడు తన కోసం నిప్పులను తప్ప మరే వస్తువునూ యాచించటం లేదు. ఇప్పుడు వాటిని పెంచుకుంటాడో, తగ్గించుకుంటాడో ఇక అతని ఇష్టం.” (ముస్లిం)
English
Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “He who asks others to give to him in order to increase his own wealth, is akin to one who asks for live coals. He who wishes to have more, let him have it and he who wishes to have less, let him have it.” Related by Muslim.
సారాంశం
ఈ హదీసు ద్వారా భిక్షాటనం అధర్మంగా ఖరారు చేయబడింది. ఆరోగ్యవంతుడు, కష్టపడి పని చేయగలవాడు, ఆర్థిక స్థోమత ఉన్నవాడు కూడా జనులవద్ద యాచిస్తే అతడు సమాజంలో తనను తాను కించపరచుకున్నట్లే. అటువంటి వారికి ‘ధర్మం’ చేయటం కూడా ధర్మం కాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 517
హదీసు 518
وَعَنِ اَلزُّبَيْرِ بْنِ اَلْعَوَّامِ - رضى الله عنه - عَنِ اَلنَّبِيِّ - صلى الله عليه وسلم -قَالَ: { لَأَنْ يَأْخُذَ أَحَدُكُمْ حَبْلَهُ, فَيَأْتِي بِحُزْمَةِ اَلْحَطَبِ عَلَى ظَهْرِهِ, فَيَبِيعَهَا, فَيَكُفَّ بِهَا وَجْهَهُ, خَيْرٌ لَهُ مِنْ أَنْ يَسْأَلَ اَلنَّاسَ أَعْطَوهُ أَوْ مَنَعُوهُ } رَوَاهُ اَلْبُخَارِيُّ.
హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “మీలో ఎవరయినా త్రాడుతో కట్టెల మోపుకట్టి, వీపుపై మోసుకువచ్చి, దాన్ని అమ్ముకుంటే, తద్వారా అల్లాహ్ అతని మొహాన్ని ముష్టెత్తుకోవటం నుంచి ఆపితే, అది అతని కొరకు – ఇచ్చినా ఇవ్వకపోయినా -జనుల నుంచి యాచించటం కన్నా ఎంతో ఉత్తమం.” (బుఖారీ)
English
Az-Zubair bin Al-Awwam (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “It is better for any of you to take a rope and cut some wood (from the forest) and carry it over his back and sell it, to preserve his dignity (as he is earning his own living), rather than ask a person for something and that person may give him or not.” Related by Al-Bukhari.
సారాంశం
కష్టపడి సంపాదించటం, కలో గంజో చెమటోడ్చిన దానితో కడుపునింపుకోవటం, యాచించి తినే స్వాదిష్టమైన ఆహారంకన్నా ఎంతో మిన్న అని ఈ హదీసు సారాంశం. యాచించే వానికి ఎంతమంచి అన్నం దొరికినా యాచించే సమయంలో అతడు పొందిన అవమానం, నలుగురిచేతా అతడు అనిపించుకున్న మాటలు సాధారణమైనవి కావు. అడుక్కోవటం వల్ల పరువు ప్రతిష్ఠలుండవు. సమాజంలో అందరూ అల్పదృష్టితో చూస్తారు. తేరగా వచ్చిపడుతున్న అన్నంవల్ల అతనిలో సోమరితనం, బద్ధకం పెంపొందుతుంది. ఇలాంటి జనం పెరిగిపోతే సమాజంలో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. భిక్షాటనం ఒక్కోసారి మనిషిలోని పౌరుషాన్ని, స్వాభిమానాన్ని చంపేసి అతన్ని దొంగతనం, దోపిడీ వంటి చెడులకు కూడా పురికొల్పుతుంది.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 518
హదీసు 519
وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ - رضى الله عنه - قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ - صلى الله عليه وسلم -{ اَلْمَسْأَلَةُ كَدٌّ يَكُدُّ بِهَا اَلرَّجُلُ وَجْهَهُ, إِلَّا أَنْ يَسْأَلَ اَلرَّجُلُ سُلْطَانًا, أَوْ فِي أَمْرٍ لَا بُدَّ مِنْهُ } رَوَاهُ اَلتِّرْمِذِيُّ وَصَحَّحَهُ.
దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ సముర బిన్ జున్దుబ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “భిక్షాటనం ఒక గాయం వంటిది. దాంతో మనిషి తన ముఖాన్ని గాయపరచుకుంటాడు. అయితే గత్యంతరంలేక ఎవరయినా యాచిస్తే లేక రాజ్యపాలకునికి నివేదించుకుంటే అందులో తప్పు లేదు.” (దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు – ప్రామాణికమైన హదీసుగా కూడా ఖరారు చేశారు)
English
Samurah bin Jundub (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “begging is like a scratch with which a man scratches his face; unless one is asking the ruler or in the case of dire necessity.” Related by At-Tirmidhi, who regarded it as Sahih.
సారాంశం
అక్కరలేకపోయినా ఇతరుల ముందు చేయి చాపటం సమ్మతం కాదని ఈ హదీసు తాత్పర్యం. అవసరం ఉన్నవాడు కూడా రాజ్యపాలకుడ్ని, తన పై అధికారిని నివేదించుకోవాలి. అటువంటివారికి బైతుల్మాల్ (కోశాగారం) లో హక్కు ఉంటుంది. బైతుల్మాల్ నుండి అగత్యపరునికి ఏదన్నా ఇస్తే అతని హక్కు అతనికి ఇచ్చినట్లవుతుంది. అంతేగాని ఎవరూ అతనిపై ఉపకారం చేసినట్టుకాదు.
హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|4. జకాత్ పుస్తకం|4.2 స్వచ్ఛంద దానధర్మాలు|హదీసు 519
You must be logged in to post a comment.