హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 18. ఆణిముత్యాలు (హదీసు వేత్తలు)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – అనుబంధం: ఆణిముత్యాలు – హదీసుల క్రోడీకరణకై సేవ చేసిన ఇమాముల, హదీసువేత్తల సంక్షిప్త జీవిత చరిత్ర.

18. ఆణిముత్యాలు (హదీసు వేత్తలు)

↑ విషయ సూచిక

హదీసుల క్రోడీకరణకై అపారమైన సేవ చేసిన ఇమాముల, హదీసువేత్తల సంక్షిప్త జీవిత చరిత్ర

ఏడుగురు ఇమాములు

1. ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్)

ధార్మిక జగత్తులో పీష్వాగా, మార్గదర్శకుడుగా పరిగణించబడే నలుగురు ఇమాములలో ఈయన ఒకరు. ఈయన అసలు పేరు అబూ అబ్దుల్లాహ్ అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్ షైబానీ. హిజ్రీ 174వ సంవత్సరం రబీవుల్ అవ్వల్ నెలలో జన్మించారు. హిజ్రీ 241, రబీవుల్ అవ్వల్ నెల 12వ తేదీ శుక్రవారం నాడు బుగ్దాద్‌లో కాలధర్మం చెందారు. ధర్మమార్గంలో కఠినాతికఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని, కదలని కొండలా స్థయిర్యాన్ని ప్రదర్శించిన గొప్ప విద్వాంసులు. ఈయనకు 10లక్షల హదీసులు కంఠస్థం అయి ఉండేవి. ఈయన మరణించిన రోజున 20వేల మంది క్రైస్తవులు, యూదులు, పారసీకులు ధర్మపరివర్తన చెంది ఇస్లాం పరిధిలోకి వచ్చారని అనబడుతోంది.

2. ఇమామ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)

హదీసు విద్యలో ఈయన హదీసువేత్తలందరికీ ఇమామ్‌గా పరిగణించబడతారు. పూర్తి పేరు అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ బిన్ ముగీరా బిన్ బర్దిజ్బాహ్ జూఫీ బుఖారీ. ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారాలో హిజ్రీ 194వ సంవత్సరం షవ్వాల్ మాసంలో జన్మించారు.

హదీసుల సంకలనం కోసం ప్రపంచంలో విస్తృతంగా పర్యటించారు. హదీసు విద్యకు సంబంధించినంత వరకు ఈయన ‘దేవుని చిహ్నం’గా భావించబడేవారు. ఆయన సంకలనం చేసిన హదీసు గ్రంథం “అల్ జామె అస్సహీహ్” దివ్య ఖుర్ఆన్ తరువాత ఇస్లాం జగత్తులో అత్యంత ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతోంది. ఈయన హిజ్రీ 256వ సంవత్సరం ఈదుల్ ఫిత్ర్ రాత్రి సమర్‌ఖండ్‌లో తనువు చాలించారు.

3. ఇమామ్ ముస్లిం బిన్ హజ్జాజ్ (రహిమహుల్లాహ్)

ఈయన ప్రఖ్యాత హదీసు ఇమాములలో ఒకరు. పూర్తిపేరు ముస్లిం బిన్ హజ్జాజ్ ఖుషైరీ నీసాపూరీ. ఈయన హిజ్రీ శకం 204లో మష్‌హద్ నగరానికి సమీపంలో వున్న నీసాపూర్ పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఈ స్థలం ఈరాన్‌లో ఉంది. ఈయన సంకలనం చేసిన ‘సహీహ్ ముస్లిం’ గ్రంథం ప్రపంచంలో ‘సహీహ్ బుఖారీ’ తరువాత రెండో ప్రామాణిక హదీసుల సంకలనంగా పరిగణించబడుతున్నది. ఈయన ఇమామ్ బుఖారీతో సహా అనేకమంది అగ్ర ఇమాముల ద్వారా హదీసులు విన్నారు. హదీసు విద్యార్జన కోసం ఇరాఖ్, హిజాజ్ ప్రాంతాలలో పర్యటించారు. హిజ్రీ 271లో మరణించారు.

4. ఇమామ్ అబూదావూద్ సులైమాన్ బిన్ అష్‌అస్ (రహిమహుల్లాహ్)

ఎన్నదగ్గ హదీసువేత్తలలో ఈయన కూడా ఒకరు. పూర్తిపేరు అబూదావూద్ సులైమాన్ బిన్ ఇస్‌హాఖ్ అజ్‌దీ సజిస్తానీ. ‘సుననె అబూదావూద్’ ఈయన విరచితమే. ఈయన హిజ్రీ 202లో జన్మించారు. హిజ్రీ 276 షవ్వాల్ నెల 15వ తేదీ శుక్రవారం నాడు తన నిజప్రభువు వద్దకు చేరుకున్నారు. హదీసు విద్యలో సాటిలేని మేటి. ఈ విద్య ఆయనకు కొట్టిన పిండి అనీ, హజ్రత్ దావూద్ అలైహిస్సలాం ముందు ఉక్కు ఎలా మెత్తబడిపోయిందో అలాగే హజ్రత్ అబూదావూద్ ముందు హదీసు విద్య సులువై పోయిందని మేధావులు కొనియాడారు. మహాప్రవక్త ﷺవారి ఐదు లక్షల ప్రవచనాలను తాను లిఖించాననీ, తాను వ్రాసిన సునన్ గ్రంథంలోని హదీసులు ఆ ఐదు లక్షల హదీసుల్లో కొన్ని మాత్రమేనని ఆయన అంటుండేవారు.

5. ఇమామ్ అబూ ఈసా ముహమ్మద్ బిన్ ఈసా తిర్మిజీ (రహిమహుల్లాహ్)

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి శిక్షణలో పోతపోయబడిన ప్రియ శిష్యులలో ఇమామ్ తిర్మిజీ ఒకరు. ఉజ్బెకిస్తాన్‌లోని తిర్మిజ్ అనే పట్టణంలో హిజ్రీ 209లో జన్మించారు. ‘జామె తిర్మిజీ’ అనే గ్రంథాన్ని సంకలనం చేశారు. ఇందులో సుమారు 4వేల హదీసులున్నాయి. తన గురువర్యులైన ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మరణంపై ఈయన అమితంగా దుఃఖించారు. ఆ దుఃఖంతోనే ఆయన కంటి చూపు పూర్తిగా పోయింది. చాలా కాలం పాటు అంధులుగానే ఉండి, హిజ్రీ 279లో తన నిజ నేస్తాన్ని చేరుకున్నారు.

6. ఇమామ్ అబూ అబ్దుర్రహ్మాన్ అహ్మద్ బిన్ షుఐబ్ నసాయి (రహిమహుల్లాహ్)

ఖురాసాన్‌లోని ‘నసా’ పట్టణంలో హి.శ. 215లో ఇమామ్ నసాయి పుట్టారు. హదీసు విద్యలో నిష్ణాతులు. హదీసులను కంఠస్థం చేసుకోవటంలో దిట్ట. అందుకే హాఫిజె హదీస్‌గా పిలువబడ్డారు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం గ్రంథాల తరువాత చాలా తక్కువ బలహీన (జయీఫ్) ఉల్లేఖనాలు గల హదీసు సంకలనాల్లో ఇమామ్ నసాయి గారి ‘సునన్’ ఒకటి. ఈయన ఈజిప్టులో కొంతకాలం స్థిరపడిన తరువాత డెమాస్కస్‌కు ప్రస్థానం చేశారు. అక్కడి నుంచే “అల్ ఖసాయిస్ ఫీ ఫజ్లె అలీ – రజి” అనే రచన చేశారు. దీనిపై తీవ్ర విమర్శల వెల్లువ పెల్లుబికింది. విమర్శకులు ఆయనపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆయన మక్కా నగరానికి చేరుకున్నారు. మక్కాలోనే హి.శ. 303లో తనువు చాలించారు.

7. ఇమామ్ ముహమ్మద్ బిన్ యజీద్ బిన్ మాజా (రహిమహుల్లాహ్)

ఇబ్నె మాజాగా సుప్రసిద్ధులు. హి.శ. 207లో ఖజ్వీనీలో జన్మించారు. ఈయన సునన్ అను గ్రంథాన్ని రచించారు. ఈయన ఇమామ్ మాలిక్ సహవాసుల నుండి హదీసులను విన్నారు. ఇమామ్ మాలిక్ శిష్యునిగా అధ్యయనం చేశారు. ఈయన ద్వారా భారీ సంఖ్యలో జనులు హదీసులను ఉటంకించారు. ఈయన హదీసులలో బలహీన (జయీఫ్) ఉల్లేఖనాలు అనేకం ఉన్నాయి. ఇమామ్ ఇబ్నె మాజా హి.శ. 273 రమజాన్ నెలలో మరణించారు.

ఇంకా ఇతర ప్రముఖ హదీసు విద్వాంసులు

8. ఇస్‌హాఖ్ బిన్ రాహ్వే (రహిమహుల్లాహ్)

ఈయన హదీసుల ఇమాముగానేగాక, హదీసుల గొప్ప హాఫిజ్ (సంస్మర్త)గా కూడా ప్రసిద్ధిచెందారు. నీసాపూర్‌కి చెందినవారు. నీసాపూర్ విద్వాంసులుగానే గాక, సమకాలీన ప్రాక్ ప్రదేశాల షేఖ్‌గా ఖ్యాతి గడించారు. “ఇరాఖ్‌లో ఇస్‌హాఖ్ బిన్ రాహ్వేతో సమ ఉజ్జీ కాగల మరో వ్యక్తిని నేను చూడలేద”ని ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) కితాబు ఇచ్చారు. “స్థిరత్వం, జ్ఞాపకశక్తి, మేలిమి లాంటి విషయాలలో ఇస్‌హాఖ్ బిన్ రాహ్వే అబ్బురపడదగ్గ వ్యక్తి” అని ఇమామ్ అబూహాతిం కొనియాడారు. ఇస్‌హాఖ్ బిన్ రాహ్వే హిజ్రీ 166లో జన్మించారు. వేరొక కథనం ప్రకారం హిజ్రీ 161లో పుట్టారు. హిజ్రీ 238 షాబాన్‌లో మరణించారు.

9. అహ్మద్ బిన్ ఇబ్రాహీం ఇస్మాయిలీ (రహిమహుల్లాహ్)

ఈయన ఇమాముగా, హాఫిజ్‌గా, ఎన్నదగ్గ ఆలిమ్‌గా, షేఖుల్ ఇస్లాంగా సుప్రసిద్ధులు. పూర్తిపేరు అబూబక్ర్ అహ్మద్ బిన్ ఇబ్రాహీం బిన్ ఇస్మాయీల్ బిన్ అబ్బాస్ ఇస్మాయిలీ జర్జానీ. తన స్వస్థలంలో ప్రఖ్యాత షాఫయి విద్వాంసునిగా పరిగణించబడ్డారు. ఆయన ఎన్నో ప్రామాణికమైన రచనలు చేశారు. వాటిలో ముస్నదె ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడా ఒకటి. ఈయన గురించి ఇమామ్ హాకిమ్ ఇలా అంటున్నారు: “ఇస్మాయిలీ తన కాలపు అరుదైన వ్యక్తుల్లో ఒకరు. హదీసువేత్తల, ధర్మవేత్తల నాయకుడు. సత్శీలం, ఉదార స్వభావంలో వారందరికీ మార్గదర్శకుడు.” ఇస్మాయిలీ హిజ్రీ 277లో జన్మించారు. 94 సంవత్సరాల ప్రాయంలో – హిజ్రీ 371 రజబ్ నెలలో – తన నిజప్రభువును చేరుకున్నారు.

10. అహ్మద్ బిన్ అమ్రు బజ్జార్ (రహిమహుల్లాహ్)

ఈయన ఇమాము, హాఫిజ్ మాత్రమేగాక గొప్ప విద్వాంసులు కూడా. పూర్తిపేరు అబూబక్ర్ అహ్మద్ బిన్ అమ్రు బిన్ అబ్దుల్ ఖాలిఖ్ బస్రీ. ఈయన అగ్రశ్రేణి ఇమాములలో ఒకరుగా భావించబడతారు. ‘అల్ ముస్నదుల్ కబీర్’, ‘అల్ ఇలల్’ అనే రెండు గ్రంథాలను రచించారు. ఇమామ్ తబ్రానీ, తదితర ఇమాముల దగ్గర విద్య నార్జించారు.ఈయన హిజ్రీ 292లో మరణించారు.

11. అహ్మద్ బిన్ హుసైన్ బైహఖీ (రహిమహుల్లాహ్)

నీసాపూర్‌కు సమీపంలోనున్న బైహఖ్ పట్టణవాసులు. అసలు పేరు అబూబక్ర్ అహ్మద్ బిన్ హుసైన్. ఎన్నదగ్గ ఇమాముగా, విద్వాంసునిగా, హదీసుల సంస్మర్తగా పేరు మోశారు. హిజ్రీ 374లో జన్మించారు. హిజ్రీ 458లో తనువు చాలించారు. షాఫయి ధర్మవేత్తలలో అగ్రజులుగా పరిగణించబడతారు. ఎన్నో రచనలు చేశారు. వాటిలో సుననె కుబ్రా, సుననె సుఘ్రా, అల్ మబ్సూత్, అల్ అస్మా వస్సిఫాత్ ఎన్నదగినవి. “ఈయన రచనలన్నింటినీ కలిపితే ఇంచుమించు వెయ్యి సంపుటాలవుతాయి” అని ఇమామ్ జహబీ వక్కాణించారు.

12. అబూ హాతిం ముహమ్మద్ బిన్ ఇద్రీస్ రాజీ (రహిమహుల్లాహ్)

ఈయన అగ్రశ్రేణి హాఫిజ్‌గా, ఇమాముగా పేరుమోశారు. హిజ్రీ 195లో జన్మించారు. హిజ్రీ 277లో మరణించారు. హదీసుల ప్రామాణికతను నిర్ధారించే విద్యలో ఈయనకు మంచి ప్రవేశం ఉంది.

13. అబ్దుల్లాహ్ బిన్ అలీ బిన్ జారూద్ (రహిమహుల్లాహ్)

అత్యుత్తమ శ్రేణికి చెందిన ఇమామ్ మరియు హాఫిజ్. ఈయన పూర్తి పేరు అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ అలీ బిన్ జారూద్ నీసాపూరీ. మక్కా సమీపంలో నివసించేవారు. “అల్ ముస్తఖా ఫిల్ అహ్కామ్” అనే గ్రంథాన్ని రచించారు. హిజ్రీ 307లో మరణించారు.

14. హారిస్ బిన్ అబూ ఉసామ (రహిమహుల్లాహ్)

పూర్తిపేరు అబూ ముహమ్మద్ హారిస్ బిన్ అబూ ఉసామా ముహమ్మద్ బిన్ దాహిర్ తమీమి బుగ్దాది. ఈయన హాఫిజ్. ‘ముస్నద్’ అనే రచనను మొదలెట్టారు గాని పూర్తి చేయలేకపోయారు. ఈయన విశ్వసనీయులని ఇబ్రాహీం హర్బీ, అబూ హాతింలు వక్కాణించారు. సత్యసంధులని ఇమామ్ దారె ఖుత్ని కితాబు ఇచ్చారు. ఈయన హిజ్రీ 186లో పుట్టారు. హిజ్రీ 282లో అరఫా రోజున మరణించారు.

15. అబూ అబ్దుల్లాహ్ అల్ హాకిమ్ (రహిమహుల్లాహ్)

ప్రముఖ హదీసు పరిశోధకులు. పూర్తిపేరు అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ హాకిమ్ నీసాపూరీ. ఇబ్నుల్ బైయిగా పిలువబడేవారు. హిజ్రీ 321లో జన్మించారు. “అల్ ముస్తద్రక్ అల స్సహీహైన్” అనే గ్రంథాన్ని రచించారు. సుమారు రెండువేల మంది గురువులను కలుసుకుని, వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు. దైవభక్తి పరాయణులు. ప్రామాణికమైన రచనలెన్నో చేశారు. ఈయన హిజ్రీ 405వ సంవత్సరం సఫర్ నెలలో శాశ్వితంగా కన్ను మూశారు.

16. అబూహాతిం ముహమ్మద్ బిన్ హిబ్బాన్ (రహిమహుల్లాహ్)

ప్రఖ్యాత ఇమాములలో ఒకరు. సజిస్తాన్‌లోని ఒకానొక పురమైన ‘బుస్త్’కు చెందిన వారు. గొప్ప హదీసువేత్త, ధర్మవేత్త. ఇమామ్ ఇబ్నె ఖుజైమ (రహిమహుల్లాహ్)గారి ప్రియ శిష్యులలో ఒకరు. హిజ్రీ 354లో సమర్‌ఖండ్‌లో మరణించారు.

17. ముహమ్మద్ బిన్ ఇస్‌హాఖ్ బిన్ ఖుజైమ (రహిమహుల్లాహ్)

షేఖుల్ ఇస్లాంగా, గొప్ప హాఫిజ్‌గా, అగ్రశ్రేణి ఇమాములలో ఒకరుగా ఖ్యాతి గడించారు. హిజ్రీ 223లో నీసాపూర్‌లో జన్మించారు. ఖురాసాన్ ప్రాంతానికి ఇమాముగా, హాఫిజ్‌గా సేవలందించారు. 140కి పైచిలుకు రచనలు చేశారు. కడకు హిజ్రీ 311లో నీసాపూర్‌లో మరణించారు.

18. ఇబ్నె అబూ ఖైసమ (రహిమహుల్లాహ్)

ఈయన ఇమాముగా, హాఫిజ్‌గా, పరిశోధకునిగా ధార్మిక సేవలందించారు. పూర్తిపేరు అబూబక్ర్ అహ్మద్ బిన్ అబూ ఖైసమ జుహైర్ బిన్ హర్బ్ నసాయి బుగ్దాదీ. ‘తారీఖుల్ కబీర్’ అనే గ్రంథాన్ని వ్రాశారు. “ఈయన విశ్వసనీయులు మరియు ఎన్నదగినవార”ని దారె ఖుత్నీ ధృవీకరించారు. ఈయన గురించి ఖతీబ్ బుగ్దాదీ ఇలా అంటున్నారు : “ఇబ్నె అబూ ఖైసమ నమ్మకస్థులు, విద్వాంసుడు, నిజాయితీపరులు, చరిత్రలో మంచి ప్రజ్ఞాశాలి, కవనంలో మంచి ప్రవేశం ఉన్న వ్యక్తి.” ఈయన ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్), ఇబ్నె మొయిన్‌ల వద్ద హదీసు విద్య నేర్చుకున్నారు. 94 ఏండ్ల వయస్సులో (హిజ్రీ 289లో) మరణించారు.

19. అలీ బిన్ ఉమర్ దారె ఖుత్నీ (రహిమహుల్లాహ్)

బుగ్దాద్ నగరంలో ‘దారె ఖుతన్’ పేటకు చెందినవారు. పూర్తి పేరు అబుల్ హసన్ అలీ బిన్ ఉమర్ బిన్ అహ్మద్ బిన్ మహ్దీ బగ్దాదీ. గొప్ప హాఫిజ్ మాత్రమే గాక సాటిలేని ఇమామ్ కూడా. హిజ్రీ 306లో జన్మించారు. ఈయనకు హదీసు విద్యపై మంచి పట్టు ఉండేది. హదీసుల కథనంలో దొర్లే పొరపాట్లను పసిగట్టడంలోనూ, ఉల్లేఖకుల పేర్లను బాగా జ్ఞాపకముంచుకోవటంలోనూ దిట్ట. దారెఖుత్నీ హిజ్రీ 385లో మరణించారు.

20. ఇమామ్ దారిమీ (రహిమహుల్లాహ్)

పూర్తి పేరు అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఫజల్ బిన్ బహ్‌రామ్ తమీమి దారిమీ సమర్‌ఖందీ.. సమర్‌ఖండ్‌లో షేఖుల్ ఇస్లాంగా, హదీసుల హాఫిజ్‌గా, ఇమామ్‌గా ఖ్యాతి గడించారు. “అల్ ముస్నదుల్ అలి” అనే గ్రంథాన్ని రచించారు. హరమైన్, ఖురాసాన్, సిరియా, ఇరాఖ్, ఈజిప్టులలో హదీసు విద్యనార్జించారు. ఇమామ్ ముస్లిం, అబూదావూద్, తిర్మిజీ, నసాయి, తదితర హదీసు ఇమాములు ఈయన ద్వారా హదీసులను ఉల్లేఖించారు. ఇమామ్ దారిమీ బహుముఖ ప్రజ్ఞాశాలి. కడు వివేచనాపరులు. సద్గుణ సంపన్నులు. నిజాయితీ తత్పరత, మృదుత్వాలకు మారు పేరు ఆయన. ధర్మ నిష్ఠాపరులు. షరీయత్ సూత్రాలను వర్తమాన సమస్యలకు అన్వయింపజేసే విషయంలో ఆయనకు ఆయనే సాటి. సాధు స్వభావులు. ప్రాపంచిక వ్యామోహాలకు దూరంగా ఉండేవారు. హిజ్రీ 181లో జన్మించిన ఇమామ్ దారిమీ హిజ్రీ 255 జిల్ హజ్జ్ 8వ తేదీన మరణించారు.

21. అబూదావూద్ తయాలిసీ (రహిమహుల్లాహ్)

హదీసులను కంఠస్థం చేసుకున్న ప్రముఖులలో ఈయన చాలా గొప్పవారు. ఈయన పూర్తి పేరు సులైమాన్ బిన్ దావూద్ బిన్ జారూద్ బస్రీ. జన్మతః పారసీకులు. అల్ జుబైర్‌చే స్వేచ్ఛ నొసగబడిన బానిస. “మేము తయాలిసీని మించిన హదీసుల సంస్మర్తను చూడలేదు” అని ఖల్లాస్ మరియు అల్ మదీనీ చెప్పేవారు. “ఆయన్ని మించిన సత్యసంధులను నేను ఎరుగను” అని ఇబ్నె మహ్దీ వక్కాణించారు. ఆయన వెయ్యిమంది గురువులను కలుసుకుని హదీసులను సంకలనం చేశారు. హిజ్రీ 204లో – 80 ఏళ్ల వయస్సులో – మరణించారు.

22. ఇబ్నె అబూ అద్దున్యా (రహిమహుల్లాహ్)

ఈయన ప్రముఖ హదీసువేత్త, సజ్జనుల కోవకు చెందిన విద్వాంసులు. పూర్తిపేరు అబూబక్ర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ ఉబైద్ బిన్ సుఫ్యాన్ బిన్ అబూ అద్దున్యా ఖురషీ, ఉమవీ, బుగ్దాదీ. విముక్తి నొసగబడిన కురైష్ బానిస. ఎన్నో పుస్తకాలను రచించారు. ఖలీఫాల, సర్దారుల సంతతిలోని పలు విద్యార్థులకు ఈయన చదువులు చెప్పారు. ఈయన దగ్గర శిక్షణ పొందినవారిలో మోతజిద్ బిల్లాహ్ కూడా ఉన్నారు. ఇబ్నె అబూ అద్దున్యా హిజ్రీ 208లో జన్మించారు. హిజ్రీ 281లో మరణించారు.

23. ఇమామ్ జుహ్లీ (రహిమహుల్లాహ్)

పూర్తి పేరు అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ యహ్యా బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఖాలిద్ బిన్ ఫారిస్. హదీసు పరిజ్ఞానంలో అమీరుల్ మోమినీన్‌గా పిలువబడేవారు. బనూ జుహ్లాకు చెందినవారు. స్వేచ్ఛ నొసగబడిన బానిస. ఈయన హరమైన్, సిరియా, ఈజిప్టు, ఇరాఖ్, రే, ఖురాసాన్, యమన్ తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడి విద్వాంసుల హదీసు పాఠాలు విన్నారు. ఆ విధంగా తన అవిరళ కృషిచే హదీసు విద్యలో ఉన్నత సోపానాలను అధిరోహించారు. ఖురాసాన్‌లో మహాజ్ఞానిగా ఖ్యాతి గడించి, బోధకునిగా సేవలందించారు. “జుహ్రీ హదీసుల పరిజ్ఞానంలో నేను ముహమ్మద్ బిన్ యహ్యా జుహ్లీని మించిని వ్యక్తిని ఎరుగను” అని ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) కితాబు ఇచ్చారు. ఇమామ్ జుహ్లీ హిజ్రీ 180 తరువాత జన్మించారు. హిజ్రీ 258లో కాలధర్మం చెందారు.

24. అబూ జుర్ఆ రాజీ (రహిమహుల్లాహ్)

ఈయన పూర్తి పేరు ఉబైదుల్లాహ్ బిన్ అబ్దుల్ కరీం బిన్ యజీద్ బిన్ ఫరూఖ్ అబూ జుర్ఆ రాజీ. ఖురైష్ తెగకు చెందినవారు. స్వేచ్ఛ పొందిన బానిస. అత్యుత్తమ శ్రేణికి చెందిన హదీసువేత్త. ఇమామ్ ముస్లిం, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా తదితర హదీసువేత్తలు ఈయన ద్వారా హదీసులను ఉటంకించారు. ఈయన గురించి ఇమామ్ జహ్బీ ఇలా అంటున్నారు: “అబూ జుర్ఆ రాజీ హరమైన్ (మక్కా, మదీనా), ఇరాక్, సిరియా, అరేబియా ద్వీపం, ఖురాసాన్ మరియు ఈజిప్టు ప్రాంతాలను సందర్శించి చాలామంది ఇమాములను కలుసుకున్నారు. జ్ఞాపకశక్తి, వివేచన, ధార్మికత, చిత్తశుద్ధి, జ్ఞానం, సదాచరణ వంటి విషయాలలో ఆయన తన కాలపు ప్రముఖ వ్యక్తుల్లో ఒకరుగా భావించబడతారు.” 74 సంవత్సరాల వయస్సులో (హిజ్రీ 274లో) అశాశ్వితమైన ఈ ప్రాపంచిక జీవితాన్ని విడిచి పరలోకానికి ప్రస్థానం చేశారు.

25. సయీద్ బిన్ మన్సూర్ (రహిమహుల్లాహ్)

పూర్తి పేరు సయీద్ బిన్ మన్సూర్ బిన్ షూబ మర్వజీ. పవిత్ర మక్కా నగరానికి సమీపంలో నివసించేవారు. ‘సునన్’ అనే గ్రంథాన్ని లిఖించారు. ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ గారు ఈయన సేవల్ని కొనియాడారు. “సయీద్ బిన్ మన్సూర్ (రహిమహుల్లాహ్) గారు తమ జ్ఞాపకశక్తి నుపయోగించి మా చేత పదివేల హదీసులు వ్రాయించారు” అని హర్బ్ కర్మానీ వక్కాణించారు. సయీద్ బిన్ మన్సూర్ హిజ్రీ 227 రమజాన్ నెలలో పవిత్ర మక్కాలో మరణించారు.

26. ఇబ్నె సకన్ (రహిమహుల్లాహ్)

ఈయన హాఫిజ్, ఇమాము మరియు విశ్వసనీయులైన విద్వాంసులు. పూర్తి పేరు అబూ అలీ సయీద్ బిన్ ఉస్మాన్ సకన్ బగ్దాదీ. హదీసుల అధ్యయనంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. హదీసు గ్రంథాలను సంకలనం చేసి హదీసుల సేవ చేసిన ప్రముఖులుగా నిలిచిపోయారు. ఇబ్నె సకన్ హిజ్రీ 294లో జన్మించారు. హిజ్రీ 353లో మరణించారు.

27. ముహమ్మద్ బిన్ ఇద్రీస్ షాఫయి (రహిమహుల్లాహ్)

ధార్మిక జగత్తులో మార్గదర్శకునిగా, పీష్వాగా ఖరారు చేయబడిన నలుగురు ఇమాములలో ఈయన ఒకరు. ఈయన పూర్తి వంశ పరంపర ఈ విధంగా ఉంది : అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇద్రీస్ బిన్ అబ్బాస్ బిన్ ఉస్మాన్ బిన్ షాఫయి బిన్ సాయిబ్ బిన్ ఉబైద్ బిన్ అబ్దె యజీద్ బిన్ హాషిమ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ అబ్దె మునాఫ్ ఖురషీ మక్కీ. ఈజిప్టులో స్థిరపడ్డారు. హిజ్రీ 150లో గాజాలో జన్మించారు. అనంతరం మక్కాకు తేబడ్డారు. హిజ్రీ 204వ సంవత్సరం రజబ్ నెల చివరి తేదీ శుక్రవారం రాత్రి తన నిజప్రభువు వద్దకు చేరుకున్నారు. ఈయన ముస్లిం సమాజానికి మార్గదర్శక ఇమాముగా నిలిచారు. సమకాలీన ధర్మవేత్తలలో విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సాహితీ సముద్రంలో మహోత్తుంగ తరంగంలా కనిపించారు. ధర్మావగాహనా (ఫికహ్) సూత్రాలకు రూపకల్పన చేసి, ఈ ప్రక్రియకు ఒక ఒరవడిని ప్రసాదించారు. ఈయన తాతగారైన షాఫయి ఒక సహాబి అన్న విషయం గమనార్హం. ఆయన తన ప్రాజ్ఞ వయస్సులో మహనీయ ముహమ్మద్ ﷺను చూశారు.

28. అబూబక్ర్ బిన్ అబూ షైబ (రహిమహుల్లాహ్)

పూర్తి పేరు అబూబక్ర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబూషైబ ఇబ్రాహీం బిన్ ఉస్మాన్ బిన్ హవాసీ అన్సీ. గొప్ప హాఫిజ్. అరుదైన వ్యక్తిత్వం. హదీసు విద్యలో మేరువు వంటివారు. “అల్ ముస్నద్ వల్ ముసన్నఫ్” సహా అనేక రచనలు చేశారు. ఇమామ్ అబూ జుర్ఆ, ఇమామ్ బుఖారీ, ఇమామ్ ముస్లిం, ఇమామ్ అబూదావూద్ తదితర ప్రముఖ హదీసు ఇమాములు ఈయన ద్వారా హదీసులను ఉటంకించారు. ఈయన హిజ్రీ 235 ముహర్రం మాసంలో మరణించారు.

29. సులైమాన్ బిన్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

పూర్తిపేరు అబుల్ ఖాసిం సులైమాన్ బిన్ అహ్మద్ బిన్ అయ్యూబ్ బిన్ ముతైర్ లఖ్మీ తబరానీ. ఈయన ఎన్నదగ్గ ఇమాములలో ఒకరు. వెయ్యిమంది గురువుల నుంచి హదీసులను సంగ్రహించారు. హదీసు విద్యార్జన నిమిత్తం సిరియా నుండి బయలుదేరి 23 ఏండ్లు ప్రయాణంలో గడిపారు. ఆయన అసంఖ్యాకమైన రచనలు చేశారు. ఆయన రచనా ప్రక్రియ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘అల్ ముఅజ్జముల్ కబీర్’, ‘అల్ అజముల్ ఔసత్,’ ‘అల్ ముఅజముస్సగీర్’ వాటిలో ఎన్నదగినవి. హిజ్రీ 260లో సిరియాలోని తబరియాలో జన్మించిన తబ్రానీ అస్ఫహాన్‌లో స్థిరపడ్డారు. అస్ఫహాన్‌లోనే హిజ్రీ 360లో తనువు చాలించారు.

30. అహ్మద్ బిన్ ముహమ్మద్ తహావీ (రహిమహుల్లాహ్)

ఈయన సమకాలీన ఇమాములలో ఒకరు. హాఫిజ్ మరియు ఆచార్యులు. ఈయన పూర్తిపేరు అబూ జాఫర్ అహ్మద్ బిన్ ముహమ్మద్ సలామా బిన్ సలమ అజ్దీ మిస్రీ తహావీ హనఫీ. హిజ్రీ 228 లేదా 227లో జన్మించారు. ఈజిప్టులోని ‘తహా’ అనే గ్రామం ఆయన స్వస్థలం కావటంచేత తహావీ అనబడ్డారు. మొదట్లో ఈయన షాఫయీ పండితునిగా ఉండేవారు. తన మేనమామ అగు ముజ్నీ దగ్గర విద్య నభ్యసించేవారు. అయితే ఆయనతో ఏర్పడిన మనస్పర్థల వల్ల ఇబ్నె అబీ ఇమ్రాన్ హనఫీ వైపునకు వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి హనఫీ దృక్పథాన్ని వ్యాపింపచేసేందుకు అహోరాత్రులు కృషి సలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన కరపత్రాలు ప్రచురించారు. హదీసులను సేకరించారు. ఆయన లిఖించిన గ్రంథాలలో ‘మానీ అల్ ఆసార్’ ముఖ్యమైంది. తహావీ హిజ్రీ 321లో మరణించారు.

31. ఇబ్నె అబ్దుల్ బర్ర్ (రహిమహుల్లాహ్)

ఈయన ఇమాముగా, విద్వాంసునిగా, హాఫిజ్‌గా ఖ్యాతి చెందారు. పూర్తిపేరు అబూ ఉమర్ యూసుఫ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ బర్ర్ బిన్ ఆసిమ్ నమరీ ఖుర్తబీ. హిజ్రీ 368లో జన్మించారు. ఈయన అపారమైన జ్ఞాపకశక్తి కలవారు. మహామేధావి. వంశవృక్షాన్ని వివరించే విద్యలో మంచి ప్రవేశం ఉండేది. “హదీసు అవగాహనకు సంబంధించిన మూల సూత్రాలపై తర్జన భర్జన చేయటంలో ఆయన్ని మించిన వారిని నేను చూడలేదు” అని ఇబ్నె హజమ్ వక్కాణించారు. ఎన్నో పుస్తకాలు వ్రాశారు. వాటిలో ‘అల్ ఇస్తియాబ్’ విశ్వవిఖ్యాతి చెందింది. ఇబ్నె అబ్దుల్ బర్ర్ హిజ్రీ 463 రబీవుస్సానీ మాసంలో – 95 ఏండ్ల వయస్సులో – మరణించారు.

32. అబ్దుల్ హఖ్ (రహిమహుల్లాహ్)

ఈయన పూర్తి పేరు అబూ ముహమ్మద్ అబ్దుల్ హఖ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ హుసైన్ బిన్ సయీద్ అజ్దీ ఇష్బిలీ. హిజ్రీ 510లో జన్మించారు. స్పెయిన్‌లోని బిజాయాలో నివాసమున్నారు. ఈ ప్రాంతంలోనే తన జ్ఞాన పరిమళాన్ని పంచిపెట్టారు. హాఫిజ్ మాత్రమేగాక గొప్ప విద్వాంసులు కూడా. బిజాయాలో బోధకునిగా ఉంటూనే ఎన్నో గ్రంథాలు వ్రాశారు. ఇస్లాం ధర్మశాస్త్ర కోవిదులు. హదీసు శాస్త్రంపై మంచి పట్టు కలవారు. దైవప్రవక్త ﷺ విధానాన్ని అనుసరించటంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. ధర్మనిష్ఠాపరులు, ప్రాపంచిక వ్యామోహాలకు దూరంగా ఉండేవారు. సాహిత్యం, కళలపై ఎంతో ఆసక్తిని కనబరచేవారు. అబ్దుల్ హఖ్ 581వ సంవత్సరం రబీవుస్సానీ మాసంలో బిజాయాలో మరణించారు.

33. అబ్దుర్రజ్జాఖ్ బిన్ హుమామ్ (రహిమహుల్లాహ్)

ఈయన ఇమాము మాత్రమే కాదు, గొప్ప హదీసుల సంస్మర్త (హాఫిజ్) కూడా. పూర్తి పేరు అబూబక్ర్ అబ్దుర్రజ్జాఖ్ బిన్ హుమామ్ బిన్ నాఫె హిమేరీ సనానీ. జ్ఞాన ఖని. ఇమామ్ అహ్మద్, ఇస్‌హాఖ్, ఇబ్నె మొయిన్, జుహ్లా వంటి ప్రముఖులు ఈయన ద్వారా హదీసులను ఉటంకించారు. వార్ధక్యంలో కంటి చూపు పోయింది. జ్ఞాపకశక్తి కూడా క్షీణించింది. 85 సంవత్సరాలు జీవించి హిజ్రీ 211లో ఈ ప్రపంచాన్ని వీడి పోయారు.

34. అబ్దుల్లాహ్ బిన్ అదీ (రహిమహుల్లాహ్)

ఈయన విశ్వ విఖ్యాత ఇమాము మాత్రమే గాక ఎన్నదగిన హదీసుల హాఫిజ్ కూడా. పూర్తిపేరు అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ అదీ జుర్జానీ. ఇబ్నుల్ ఖిసార్ అనే పేరుతో పిలువబడేవారు. హిజ్రీ 279లో జన్మించారు. హిజ్రీ 375లో మరణించారు.

35. ముహమ్మద్ బిన్ అమ్ర్ అఖీలీ (రహిమహుల్లాహ్)

ఈయన కూడా ఇమాము మరియు హదీసుల సంస్మర్తగా ప్రసిద్ధిచెందారు. పూర్తిపేరు అబూ జాఫర్ ముహమ్మద్ బిన్ అమ్ర్ బిన్ మూసా బిన్ హమాద్ అఖీలీ. అగ్రశ్రేణి ఇస్లామీయ విద్వాంసులలో ఒకరు. ఎన్నో గ్రంథాలను రచించారు. వాటిలో ‘కితాబుజ్జవాఫుల్ కబీర్’ పేర్కొనదగినది. ఈయన జ్ఞాపకశక్తి కొనియాడదగినది. మక్కా మదీనాలలో నివసించారు. హిజ్రీ 322లో కాలధర్మం చెందారు.

36. అలీ బిన్ మదీని (రహిమహుల్లాహ్)

హదీసుల క్రోడీకరణలో అత్యుత్తమ శ్రేణికి చెందిన కోవిదులుగా పరిగణించబడ్డారీయన. ఈయన పూర్తి పేరు అబుల్ హసన్ అలీ బిన్ అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ బిన్ నజీ సాదీ. ఇమామ్ బుఖారీ, ఇమామ్ అబూదావూద్ సహా ఎంతోమంది హదీసు ఇమాములు ఈయన ద్వారా హదీసులను ఉటంకించారు. “దైవ ప్రవక్త ﷺ ప్రవచనాలను అందరికన్నా బాగా ఎరిగినవారు అలీ బిన్ మదీని” అని ఇబ్నె మహ్దీ వ్యాఖ్యానించారు. ఇమామ్ బుఖారీ ఇలా అంటున్నారు : “తన్ను తాను అల్పునిగా, చిన్నవానిగా తలచుకునే విషయంలో నేను అలీ బిన్ మదీనీని మించిన వారిని ఎరుగను.” హిజ్రీ 161లో జన్మించిన అలీ బిన్ మదీనీ హిజ్రీ 234లో సామిరా (ఇరాఖ్)లో మరణించారు.

37. అలీ బిన్ ముహమ్మద్ ఇబ్నుల్ ఖత్తాన్ (రహిమహుల్లాహ్)

ఈయన పూర్తి పేరు అబుల్ హసన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ మలిక్ ఫాసీ. ఈయన స్పెయిన్‌లోని ఖుర్తుబాలో హిజ్రీ 562లో జన్మించారు. మొరాకోలోని ‘ఫాస్’ పట్టణంలో నివసించేవారు. హాఫిజ్‌గా, ఇమాముగా, విమర్శకునిగా ప్రధాన భూమికను నిర్వర్తించారు. హదీసు ఉల్లేఖకుల విషయంలోగానీ, హదీసుల క్రోడీకరణ విషయంలో గాని అపారమైన పరిజ్ఞానం గల వ్యక్తిగా భావించబడ్డారు. అనేక గ్రంథాలను రచించారు. హిజ్రీ 628 రబీవుల్ అవ్వల్ నెలలో తనువు చాలించారు.

38. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్)

ఇస్లాం జగతిలోని నలుగురు ప్రధాన ఇమాములలో ఈయన ఒకరు. మదీనా తయ్యిబాకు ఇమాముగా, ముస్లిం సమాజానికి చెందిన గొప్ప ధర్మవేత్తగా, అహ్లె హదీసు సమూహానికి నాయకునిగా పరిగణించబడేవారు. ఈయన పూర్తి పేరు అబూ అబ్దుల్లాహ్ మాలిక్ బిన్ అనస్ బిన్ మాలిక్ బిన్ అబూ ఆమిర్ అస్‌బహీ. హిజ్రీ 93 లేదా 94లో జన్మించారు. తొమ్మిది వందల కన్నా ఎక్కువ మంది అధ్యాపకుల వద్ద ఈయన హదీసు జ్ఞానాన్ని ఆర్జించారు. లెక్కకు మించిన జనులు ఈయన ఆధారంగా హదీసులను ఉటంకించారు. ఈయన ప్రియ శిష్యులలో ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) కూడా ఒకరు. ప్రపంచానికి హదీసు జ్ఞాన కాంతిని అందించిన ఇమామ్ మాలిక్ హిజ్రీ 179 రబీవుల్ అవ్వల్ నెలలో కన్ను మూశారు.

39. ముహమ్మద్ బిన్ ఇస్‌హాఖ్ ఇబ్నె మంద (రహిమహుల్లాహ్)

ఈయన పెద్ద ఇమాములలో ఒకరు. హదీసుల సంస్మర్తగా సేవలందించారు. భారీ సంఖ్యలో హదీసులను కంఠస్థం చేసుకున్న హదీసువేత్తల సరసన నిలబడతారు. హదీసుల జ్ఞానాన్ని ఆర్జించాలన్న తపనతో ప్రపంచ పర్యటన చేశారు. పర్యటన ముగించుకుని వచ్చే సమయానికి ఆయన వద్ద 40 పుస్తకాల మూటలు కనిపించాయి. ఈయనకు విద్యాబోధన చేసిన గురువుల సంఖ్య 1700. హిజ్రీ 310లో జన్మించిన ఇబ్నె మంద హిజ్రీ 395లో ప్రపంచ జీవన యాత్రను చాలించి పరలోకానికి సాగిపోయారు.

40. అబూ నుఐమ్ అస్‌ఫహానీ (రహిమహుల్లాహ్)

ఈయన పూర్తి పేరు అహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ బిన్ ఇస్‌హాఖ్ బిన్ మూసా బిన్ మహ్‌రాన్ అస్‌ఫహానీ (రహిమహుల్లాహ్). అత్యుత్తమ శ్రేణికి చెందిన హదీసు ఇమాములలో ఒకరు. ఈయన పేరెన్నికగన్న విద్వాంసుల వద్ద విద్య నార్జించగా, ఎన్నదగ్గ ఎంతోమంది పండితులు ఈయన వద్ద ధర్మజ్ఞానాన్ని ఆర్జించారు. అనేక రచనలు చేశారు. వాటిలో ముస్తఖ్రజ్ అలా సహీ బుఖారీ, ముస్తఖ్రజ్ అలా సహీహ్ ముస్లిం, హులియతుల్ ఔలియా పేర్కొనదగినవి. ముఖ్యంగా ‘హులియతుల్ ఔలియా’ అమిత ప్రజాదరణ పొందింది. ఈ గ్రంథం నీసాపూర్‌కు పంపబడినపుడు అక్కడి స్థానికులు 400 దీనార్లు చెల్లించి మరీ కొన్నారని చెప్పుకుంటారు. హిజ్రీ 334 రజబ్ నెలలో జన్మించిన అబూనుఐమ్ హిజ్రీ 430, ముహర్రం నెలలో అస్ఫహాన్‌లో మరణించారు.

41. అబూ యాల అహ్మద్ బిన్ అలీ (రహిమహుల్లాహ్)

ఈయన పూర్తి పేరు అహ్మద్ బిన్ అలీ బిన్ ముసన్నా బిన్ యహ్యా బిన్ ఈసా బిన్ హిలాల్ తమీమి. హిజ్రీ 210 షవ్వాల్ నెలలో జన్మించారు. అరేబియా ద్వీపంలో ప్రముఖ హాఫిజ్‌గా, ముహద్దిస్ (హదీసువేత్త)గా ప్రసిద్ధిచెందారు. ‘అల్ ముస్నదుల్ కబీర్’ అనే గ్రంథాన్ని రచించారు. గొప్ప సహనశీలిగా, నిజాయితీపరునిగా, సత్యసంధునిగా పేరుగాంచారు. ఈయన గురించి సమఆనీ ఇలా అంటున్నారు : “నేను హాఫిజ్ ఇస్మాయీల్ బిన్ ముహమ్మద్ బిన్ ఫజ్ల్ చెప్పగా విన్నాను – ‘నేను ఎన్నో గ్రంథాలు చదివాను. ఉదాహరణకు ముస్నదుల్ అదనీ, ముస్నదె ఇబ్నె మనీ మొదలగునవి. ఇవన్నీ నదీనదాల వంటివి. అయితే ముస్నదె అబూ యాలా మాత్రం ఈ నదీనదాలన్నింటినీ తనలో కలుపుకునే సాగర సంగమం.” అబూ యాలా హిజ్రీ 210, షవ్వాల్ నెలలో జన్మించారు. హిజ్రీ 307లో మరణించారు.