హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 11.1 జిజయా మరియు తాత్కాలిక సంధి

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 11. జిహాద్ పుస్తకం, 1వ అధ్యాయం: జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1123 – 1129) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి

↑ విషయ సూచిక

باب الجزية والهدنة

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

1123

హదీసు 1123

عَنْ عَبْدِ اَلرَّحْمَنِ بْنِ عَوْفٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-أَخَذَهَا ‏- يَعْنِي: اَلْجِزْيَةُ ‏- مِنْ مَجُوسِ هَجَرَ } رَوَاهُ اَلْبُخَارِيّ ُ. وَلَهُ طَرِيقٌ فِي "اَلْمَوْطَأِ" فِيهَا اِنْقِطَاع ٍ.

దైవప్రవక్త ﷺ హజర్‌కు చెందిన జోరాస్ట్రియన్ల నుండి జిజ్‌యా పుచ్చుకున్నారని హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. (దీనిని బుఖారీ ఉల్లేఖించారు. ‘మువత్తా’లో ఈ హదీసు కథనం మరో విధంగా ఉంది-దాని పరంపరలో లింకు తెగింది)

English

’Abdur Rahman bin 'Auf (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) took the Jizyah from the Magians of Hajar.’ Related by Al-Bukhari.

సారాంశం

‘జిజ్‌యా’ అనే పదం హదీసులో వచ్చింది. జిజ్‌యా అంటే ‘జుట్టుపన్ను’ అని కొంతమంది చరిత్రకారులు భాష్యం చెప్పి ఇస్లాం మరియు ముస్లిం పరిపాలకుల పట్ల ప్రజల్లో ద్వేషాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవానికి వక్రభాష్యం తప్ప మరేమీ కాదు.

‘జిజ్‌యా’ అనేది వాస్తవానికి ‘దారుస్సలామ్’లో నివసించే ‘జిమ్మీల’ (ముస్లిమేతరుల) నుండి వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే గ్యారంటీపై ముస్లిం పరిపాలకులు వారినుండి వసూలు చేసే సుంకం మాత్రమే.

‘దారుస్సలామ్’ పై విదేశీయులు దండెత్తి వచ్చినప్పుడు వారిని నిలువరించే, వారితో ప్రాణాలొడ్డి పోరాడే బాధ్యత జిమ్మీలనబడే ముస్లిమేతర పౌరులపై ఉండదు. దేశ రక్షణ బాధ్యత ముస్లిం రాజ్యపాలకునిపై, ముస్లిం యోధులపై మాత్రమే ఉంటుంది. అంటే తమ రాజ్యంలోని ‘జిమ్మీల’ ధన మాన ప్రాణాల రక్షణ కోసం ముస్లిం యోధులు ఆత్మత్యాగానికి సిద్ధమవుతున్నందుకు ప్రతిఫలంగా మాత్రమే రాజ్యం ఈ ‘జిజ్‌యా’ను వారి నుండి వసూలు చేస్తుంది. ఒకవేళ ముస్లిం పరిపాలకుడు గనక ‘జిమ్మీల’ ధన మాన ప్రాణాలకు – ఏ కారణంగానయినా – రక్షణ కల్పించడంలో విఫలమైనపుడు ‘జిజ్‌యా’ను వసూలు చేసే అర్హతను అతడు కోల్పోతాడు.

ఇకపోతే; ముస్లిమేతరులు ఏ మతస్థులైనాసరే వారి నుండి జిజ్‌యాను వసూలు చేయవచ్చనీ, కొంతమంది పండితులు భావిస్తున్నట్లు ఇది ఒక్క గ్రంథవహుల (యూదులు, క్రైస్తవులు)కు మాత్రమే పరిమితం కాదనీ పై హదీసు ద్వారా స్పష్టమవుతున్నది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1123

1124

హదీసు 1124

وَعَنْ عَاصِمِ بْنِ عُمَرَ, عَنْ أَنَسٍ, وَعَن ْ عُثْمَانَ بْنِ أَبِي سُلَيْمَانَ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-بَعْثٍ خَالِدُ بْنُ اَلْوَلِيدِ إِلَى أُكَيْدِرِ دُومَةَ اَلْجَنْدَلِ فَأَخَذُوهُ, فَأَتَوْا بِهِ فَحَقَنَ دَمِهِ, وَصَالَحَهُ عَلَى اَلْجِزْيَةِ } رَوَاهُ أَبُو دَاوُد َ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉస్మాన్ బిన్ అబూ సులైమాన్ (రదియల్లాహు అన్హు)ల ఆధారంగా ఆసిమ్ బిన్ ఉమర్ (రహిమహుల్లాహ్) చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)ని ‘దౌమతుల్ జందల్’ పరిపాలకుడైన ఉకైదిర్ దగ్గరికి పంపారు. ఖాలిద్ (రదియల్లాహు అన్హు) అతడ్ని బంధించి దైవప్రవక్త ﷺ సమక్షంలో హాజరుపరచగా ఆయన ﷺ అతనికి ప్రాణ రక్షణ కల్పించి, జిజ్‌యా చెల్లించే షరతుపై ఒప్పందం చేసుకున్నారు. (అబూదావూద్)

English

’Asim bin ’Umar narrated On the authority of Anas and Uthman bin Abu Sulaiman (RAA),‘The Messenger of Allah (ﷺ) sent Khalid bin al-Walid to Ukaidir of Dawmat al-Jandal and they seized him and brought him to the Prophet (ﷺ). The Messenger of Allah (ﷺ) spared his life and made peace with him on the condition that he should pay Jizyah.’ Related by Abu Dawud.

సారాంశం

ఉకైదిర్ అరేబియా ప్రాంతానికి చెందిన క్రైస్తవ శ్రీమంతుడు. గస్సానీ తెగకు చెందినవాడు. దైవప్రవక్త ﷺ అతన్నుంచి జిజ్‌యా తీసుకోవడాన్నిబట్టి, అరేబియాకు చెందిన గ్రంథవహుల (అహ్లె కితాబ్) నుండి కూడా జిజ్‌యా తీసుకోవటం ధర్మసమ్మతమేనని బోధపడుతున్నది. అయితే ఖాజీ అబూ యూసుఫ్ అరబ్బు వ్యక్తి నుండి జిజ్‌యా వసూలు చేయటం పట్ల సుముఖంగా లేరు. కాని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) తదితరులు మాత్రం అరబ్బు, అరబ్బేతర ముస్లిమేతరులందరి వద్దనుండి జిజ్‌యా తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

హదీసు ఉల్లేఖకులు

1. ఆసిమ్ బిన్ ఉమర్ : అబూ ఉమర్ ఆసిమ్ బిన్ ఉమర్ బిన్ ఖతాదా బిన్ నూమాన్ అన్సారీ. ఎన్నదగ్గ తాబయీలలో ఒకరు. అనేక హదీసులను ఉల్లేఖించారు. ఇస్లామీయ చరిత్ర, మిలటరీ గణాంకాల విషయంలో నిపుణులు. ఈయన మరణ కాలం గురించి విభిన్న వాదనలున్నాయి. హిజ్రీ 119, 120, 121, 127, 129 అని రకరకాల అభిప్రాయాలున్నాయి.

2. ఉస్మాన్ బిన్ అబూ సులైమాన్ (రదియల్లాహు అన్హు) : ఉస్మాన్ బిన్ అబూ సులైమాన్ బిన్ జుబైర్ బిన్ ముత్‌యిమ్. మక్కాకు చెందిన ఖాజీ. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇబ్నె మొయిన్ (రహిమహుల్లాహ్), అబూహాతిమ్ (రహిమహుల్లాహ్)లు ఈయన్ని విశ్వసనీయులుగా ఖరారు చేశారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1124

1125

హదీసు 1125

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { بَعَثَنِي اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-إِلَى اَلْيَمَنِ, وَأَمَرَنِي أَنْ آخُذَ مِنْ كُلِّ حَالِمٍ دِينَاراً, أَوْ عَدْلَهُ معافرياً } أَخْرَجَهُ اَلثَّلَاثَةِ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِم ُ.

హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నన్ను యమన్ వైపునకు పంపిస్తూ, “నువ్వు యుక్త వయస్కులైన ప్రతి ఒక్కరి నుండీ ఒక దీనార్ చొప్పున జిజ్‌యానుగానీ, దానికి సమానమైన మాఫిరీ వస్త్రాన్నిగానీ వసూలు చెయ్యి” అని తాకీదు చేశారు. (‘ముగ్గురు’ దీనిని సేకరించారు. ఇబ్నె హిబ్బాన్, హాకిమ్‌లు దీనిని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)

English

Mu'adh bin Jabal (RAA) narrated, ‘The Messenger of Allah (ﷺ) sent me to Yemen and he commanded me to take the Jizyah from everyone who has reached the age of puberty-one Dinar- or its equivalent in Ma’afiri (garments of Yemeni origin).’ Related by the three Imams. Ibn Hibban and Al-Hakim graded it as Sahih.

సారాంశం

ఒక సంవత్సరం కాలానికి గాను చెల్లించవలసిన తలసరి జిజ్‌యా ఒక దీనారు లేక దానికి సమానమైన విలువగల మరేదైనా వస్తువు అయి ఉంటుందని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్)ల విధానం ఇదే. అయితే ఒక్క దీనారు కనీస జిజ్‌యా అనీ, అంతకుమించి కూడా వసూలు చేయవచ్చనీ, ఈ జిజ్‌యా యుక్త వయస్కుడైన స్వతంత్ర పౌరుని నుంచి మాత్రమే తీసుకోవాలనీ, బానిసలకు ఇది వర్తించదని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అన్నారు. (సుబుల్)

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1125

1126

హదీసు 1126

وَعَنْ عَائِذٍ بْنُ عَمْرِوِ الْمُزَنِيِّ ‏- رضى الله عنه ‏- عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "اَلْإِسْلَامِ يَعْلُو, وَلَا يُعْلَى" } أَخْرَجَهُ اَلدَّارَقُطْنِيّ ُ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ ఆయిజ్ బిన్ అమ్ర్ ముజనీ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “ఇస్లాం లోబరుచుకునే స్వభావం గలదే గాని లొంగి ఉండేది కాదు.”

(సుననె దారె ఖుత్నీ)

English

’A’idh bin 'Amro al-Muzani (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Islam is always superior and should never be surpassed.” Related by Ad-Daraqutni.

సారాంశం

ఇస్లాం నిత్యం పైచేయిగా ఉంటుందే తప్ప క్రింది చేయిగా ఉండదన్న సమాచారంతో పాటు, భవిష్యవాణి కూడా ఈ హదీసులో ఉంది. కాబట్టి ఇస్లాం అనుయాయులు సైద్ధాంతికంగానూ, క్రియాత్మకంగానూ ఈ ధర్మాన్ని పైచేయిగా ఉంచడానికి కృషి చేయాలి. ఇస్లాంను హెచ్చుతగ్గులు లేకుండా – ఉన్నదున్నట్టుగా – పరిచయం చేయాలి. ముందు వారు దీనికనుగుణంగా ఆచరించాలి. తమ నిజ జీవితాల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా ముస్లిమేతరులను ప్రభావితం చేయాలి.

ముస్లిమేతర జాతులతో సంధులు, ఒడంబడికలు చేసుకుంటున్నప్పుడు ఏదేని షరతు, పైకి ఇస్లాం అనుయాయుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినా కళవళపడనవసరం లేదు. ఎందుకంటే ఇస్లాం దైవ సమ్మతమైన, దేవుడు ఇష్టపడిన ధర్మం. అది ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. పరిస్థితులను సానుకూలంగా మలచటం దైవానికి ఏమాత్రం కష్టం కాదు. కాకపోతే ముస్లిం స్వయంగా చిత్తశుద్ధితో తమ ప్రభువు వైపునకు మరలాలి. అప్పుడే దేవుని కారుణ్య కడలి కదలివస్తుంది. కాగా; ఇస్లాం సైద్ధాంతికంగా, ప్రమాణాత్మకంగా కలకాలం పైచేయిగా ఉంటుందనేది మాత్రం తిరుగులేని సత్యం.

హదీసు ఉల్లేఖకులు

ఆయిజ్ బిన్ అమ్ర్ ముజనీ (రదియల్లాహు అన్హు) : మారుపేరు అబూ. బస్రాలో స్థిరపడ్డారు. సదాచార సంపన్నులైన సహాబీలలో ఒకరు. ‘బైతుర్రిజ్వాన్’ ఘట్టంలో పాల్గొన్నారు. యజీద్ బిన్ ముఆవియా పరిపాలనా కాలంలో మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1126

1127

హదీసు 1127

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { " لَا تَبْدَؤُوا اَلْيَهُودَ وَالنَّصَارَى بِالسَّلَامِ, وَإِذَا لَقِيتُمْ أَحَدَهُمْ فِي طَرِيقٍ, فَاضْطَرُّوهُ إِلَى أَضْيَقِهِ" } رَوَاهُ مُسْلِم ٌ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు : యూదులు, క్రైస్తవులు మొదట మీకు సలాం చేసే వరకూ మీరు వారికి సలాం చేయకండి. మీరెవ్వడయినా దారిలో వారికి ఎదురుపడితే అతడు ఇరుకైన మార్గం వైపునకు తప్పుకునే స్థితిని కల్పించండి.”

(ముస్లిం)

English

Abu Hurairah (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Do not start by saluting the Jews and the Christians (when you meet them), and if you meet any of them on the road, force him to go to the narrowest part of the road (i.e. do not give them positions of authority among you.)” Related by Muslim.

సారాంశం

ఈ హదీసునుబట్టి యూదులకు, క్రైస్తవులకు, జోరాస్ట్రియన్లకు, తదితర మతాల వారికి ముస్లింలు ‘సలాం’ చేయటంలో ముందంజ వేయటం సమ్మతం కాదు, అత్యధిక మంది పండితుల అభిప్రాయం కూడా ఇదే. అయితే హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) తదితరులు మాత్రం గ్రంథవహులైన జిమ్మీలకు సలాం చేయవచ్చునని అంటున్నారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1127

1128

హదీసు 1128

وَعَنْ اَلْمِسْوَرِ بْنُ مَخْرَمَةَ.‏ وَمَرْوَانُ; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-خَرَجَ عَامَ اَلْحُدَيْبِيَةِ.‏ ….‏.‏ فَذَكِّرْ اَلْحَدِيثَ بِطُولِهِ, وَفِيهِ: " هَذَا مَا صَالَحَ عَلَيْهِ مُحَمَّدُ بْنُ عَبْدِ اَللَّهِ سُهَيْلِ بْنِ عَمْرِوٍ: عَلَى وَضْعِ اَلْحَرْبِ عَشْرِ سِنِينَ, يَأْمَنُ فِيهَا اَلنَّاسُ, وَيَكُفُّ بَعْضُهُمْ عَنْ بَعْضِ" } أَخْرَجَهُ أَبُو دَاوُد َ. وَأَصْلِهِ فِي اَلْبُخَارِيّ ِ. وَأَخْرُجَ مُسْلِمٍ بَعْضِهِ مِنْ حَدِيثِ أَنَسٍ, وَفِيهِ: { أَنَّ مَنْ جَاءَ مِنْكُمْ لَمْ نَرُدْهُ عَلَيْكُمْ, وَمَنْ جَاءَكُمْ مِنَّا رَدَدْتُمُوهُ عَلَيْنَا.‏ فَقَالُوا: أَنَكْتُبُ هَذَا يَا رَسُولُ اَللَّهُ? قَالَ: "نَعَمْ.‏ إِنَّهُ مِنْ ذَهَبٍ مِنَّا إِلَيْهِمْ فَأَبْعَدَهُ اَللَّهُ, وَمَنْ جَاءَنَا مِنْهُمْ, فَسَيَجْعَلُ اَللَّهُ لَهُ فَرَجاً وَمُخْرِجاً" }.

హజ్రత్ మిస్వర్ బిన్ మఖ్రమ మరియు మర్వాన్ (రదియల్లాహు అన్హుమా)లు ఇద్దరూ ఇలా అంటున్నారు : దైవప్రవక్త ﷺ హుదైబియా (ఒప్పందం జరిగిన) సంవత్సరాన బయలుదేరారు. ఉల్లేఖకులు చెప్పిన సుదీర్ఘమయిన హదీసులో వచ్చిన ప్రస్తావన ఇది – ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ﷺ సుహైల్ బిన్ అమ్ర్‌తో చేసుకున్న ఒప్పందం ఇది. దీని (ఈ దస్తావేజు) ప్రకారం పది సంవత్సరాల దాకా యుద్ధం జరగదు. ఈ (పదేండ్ల) కాలంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉంటారు. వీరిలోని ప్రతి ఒక్కడూ (యుద్ధం నుండి) తన చేయిని ఆపుకుంటాడు. (అబూదావూద్. దీని మూలం బుఖారీలో ఉంది)

‘ముస్లిం’ ఈ హదీసులోని కొంత భాగాన్ని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించారు. అందులో ఇలా వుంది : “మీలో (ముస్లింలలో) నుంచి ఎవరు మా వద్దకు వచ్చినా అతన్ని మేము తిరిగి పంపబోము. మా మనుషుల్లో (అవిశ్వాసుల్లో) నుంచి ఎవరు మీ దగ్గరకు వచ్చినాసరే అతడ్ని మీరు తిరిగి పంపించేయాలి.” దీనిపై “ఓ దైవప్రవక్తా ﷺ! మేము దీనిని వ్రాసుకోవాలా?!” అని ఆయన సహచరులు ఆశ్చర్యంతో ప్రశ్నించగా, ఆయన ﷺ ఇలా సెలవిచ్చారు: “అవును. మాలో నుంచి ఎవడు పలాయనం చిత్తగించి వాళ్ళ వద్దకు వెళ్ళాడో అతన్ని అల్లాహ్ దూరం చేసేశాడు. మరెవరు వాళ్ళలో నుంచి పారిపోయి మా వద్దకు వచ్చాడో అతని కోసం అల్లాహ్ తప్పకుండా ఏదో ఒక మార్గం తెరుస్తాడు.”

English

Al·Miswar bin Makhramah and Marwan narrated, ‘The Messenger of Allah (ﷺ) went out in the year of al-Hudaibiyah (reconciliation)- the narrator narrated a long hadith which contained, ‘this is what Muhammad bin 'Abdullah has reconciled with Suhail bin ’Amro, to stop fighting for 10 years during which time people will live safely, and refrain from lighting one another…’ Related by Abu Dawud. It is part of a long hadith narrated by Al-Bukhari.

Muslim transmitted part of this hadith on the authority of Anas bin Malik (RAA) which says, ‘ln case any of you comes to us we shall not send him back to you (i.e. one of the Muslims who goes back to Quraysh), and in case any of us came to you, you should send him back to us (any of the people of Quraysh who goes to the Prophet they will send him back to Makkah).’ The Companions asked the Prophet (ﷺ),’O Messenger of Allah (ﷺ)! Will you write this down?’ He replied, “Yes. May Allah send out of His Mercy any of the Muslims who goes back to them. But Allah will grant a way out for anyone who comes to us from them.”

సారాంశం

హుదైబియా ఒడంబడికలోని ప్రధాన షరతును ఈ హదీసు సూచిస్తోంది. మహాప్రవక్త ﷺ సాగించిన 23 ఏండ్ల ఇస్లామీయ చరిత్రలో హుదైబియా ఒప్పందం అత్యంత కీలకమైనది. హిజ్రీ 6వ సంవత్సరంలో మక్కా అవిశ్వాసులకు – మహాప్రవక్త ﷺకు మధ్య ‘హుదైబియా బావి’ సమీపంలో జరిగిన ఈ సంధిలోని షరతులు చూడబోతే పైకి ముస్లింలను అవమానపరచేవిగా కనిపిస్తాయి. ప్రవక్త ప్రియ సహచరుల్లో కొంతమంది ఈ షరతులను చదివి ఆవేశంతో ఊగిపోయారు. కాని మహనీయ ముహమ్మద్ ﷺ ఆ సందర్భంలో చూపిన నిగ్రహం, సమయ స్ఫూర్తి అందరికీ అనుసరణీయం. అపజయం అనుకున్న ఒప్పందాన్నే అల్లాహ్ స్పష్టమయిన విజయంగా పేర్కొన్నాడు. నిర్యుద్ధ సంధి ఫలితంగా ముస్లింలకు కొంత తెరిపి లభించింది. మహాప్రవక్త ﷺ సత్సమాజ రూపకల్పనపై, సందేశ ప్రధానమైన కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరించారు. పర్యవసానంగా శీఘ్రగతిన అరేబియాలో ఇస్లాం విస్తరించింది. హిజ్రీ 10వ సంవత్సరం నాటికి అది అరేబియాలో అత్యంత బలోపేతమైన, తిరుగులేని శక్తిగా రూపొందింది.

హదీసు ఉల్లేఖకులు

1. మర్వాన్ (రదియల్లాహు అన్హు) : మర్వాన్ బిన్ హకమ్ అమవీ. ఖలీఫా అబ్దుల్ మలిక్‌కు తండ్రి. ఈయన హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) తరపున మదీనా నగరానికి గవర్నర్‌గా నియమించబడ్డారు. యజీద్ చనిపోయిన మీదట అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఖిలాఫత్ విషయంలో ఆసక్తి కనబరిచారు. అతని కుమారుడగు ముఆవియా పదవీచ్యుతుడైన తరువాత ఈజిప్టు, సిరియాలకు రాజ్యాధికారి అయ్యారు. హిజ్రీ 65లో డెమాస్కస్‌లో తనువు చాలించారు.

2. సుహైల్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) : ఈయన ఖురైషుల్లో మర్యాదస్తులుగా, మహా వక్తగా, పెద్ద మనిషిగా పరిగణించబడేవారు. బద్ర్ యుద్ధంలో ఖైదీగా ముస్లింలకు పట్టుబడ్డారు. అప్పటికి ఆయన ఇస్లాం స్వీకరించలేదు. మక్కా విజయం నాడు ఇస్లాంలో ప్రవేశించారు. అరేబియాలో ధర్మభ్రష్టతా ఉపద్రవం ప్రబలినపుడు ఖురైష్ తెగవారు ఈయన మూలంగా ఇస్లాంపై నిలకడ చూపారు. హిజ్రీ 14లో యర్మూక్ యుద్ధ సందర్భంగా హత్య గావించబడి వీర మరణం పొందారు. హిజ్రీ 18లో అమ్వాస్‌లో సంభవించిన ప్లేగు వ్యాధి సందర్భంగా మరణించారన్న వాదన కూడా ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1128

1129

హదీసు 1129

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ عَنْ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { "مِنْ قَتْلِ مُعَاهِداً لَمْ يَرَحْ رَائِحَةَ اَلْجَنَّةِ, وَإِنَّ رِيحَهَا لِيُوجَدَ مِنْ مَسِيرَةِ أَرْبَعِينَ عَامّاً" } أَخْرَجَهُ اَلْبُخَارِيّ ُ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు: “ఎవరయితే ‘ముఆహిద్’ను చంపుతాడో అతడు స్వర్గ సువాసనను ఆస్వాదించలేడు. కాగా; స్వర్గ సువాసన అనేది నలభై ఏళ్ళు ప్రయాణం చేసి పొందినంత దూరాన ఉంటుంది.” (బుఖారి)

English

'Abdullah Ibn 'Umar (RAA) narrated that The Messenger of Allah (ﷺ) said: “Whoever kills a Mu'ahid will not smell the fragrance of Paradise, even though its fragrance could be smelt at a distance of forty years.” Related by Al-Bukhari.

సారాంశం

హదీసులో ‘ముఆహిద్’ అనే పదం వచ్చింది. ముస్లిం రాజ్యపరిధిలో లేని ఒక ముస్లిమేతర వ్యక్తి – అంటే, ఇస్లామీయ ప్రభుత్వ రక్షణ పొందిన వ్యక్తిని ‘ముఆహిద్’ లేక ‘అహదీ’గా వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యక్తిని అకారణంగా, అన్యాయంగా హతమార్చటం నిషిద్ధం (హరామ్) అని ఈ హదీసు చెబుతోంది. ఈ విధంగా హత్యచేసిన ఒక ముస్లిం హంతకుని నుంచి పరిహారం తీసుకోబడదని కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే అతడు ఒడిగట్టిన ఈ పాతకానికిగాను పరలోకంలో దేవుడు అతన్ని స్వర్గ సువాసనకు దూరం చేశాడు. నలభై ఏళ్ళ కాలం నిరంతరం ప్రయాణిస్తే గాని మనిషి ఆ సువాసనను ఆస్వాదించలేనంత దూరాన అది ఉంటుందనటాన్ని బట్టి ఈ హదీసులో ముస్లింలకు తీవ్రమయిన హెచ్చరిక ఉంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|11. జిహాద్ పుస్తకం|11.1 జిజ్‌యా మరియు తాత్కాలిక సంధి|హదీసు 1129