హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) – 1.1 నీళ్ళ రకాలు

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం: మౌలానా సఫియుర్ రహ్మాన్ ముబారక్‌పూరీ · తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ · ప్రకాశకులు: అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్

బులూఘ్ అల్ మరామ్ – హదీసు మకరందం (హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ) – అరబీ, తెలుగు, English

బులూఘ్ అల్ మరామ్ (హదీసు మకరందం) – 1. శుచీ శుభ్రతల పుస్తకం, మొదటి అధ్యాయం: నీళ్ళ రకాలు. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 1 – 13) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, సారాంశం, English అనువాదంతో.

1.1 నీళ్ళ రకాలు

↑ విషయ సూచిక

باب المياه

అరబీ పాఠం, English: sunnah.com (బులూఘ్ అల్ మరామ్)

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

(వివిధ మార్గాల ద్వారా లభ్యమయ్యే నీటి వివరాలు)

1

హదీసు 1

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-فِي اَلْبَحْرِ: { هُوَ اَلطُّهُورُ مَاؤُهُ, اَلْحِلُّ مَيْتَتُهُ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَابْنُ أَبِي شَيْبَةَ وَاللَّفْظُ لَهُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ وَاَلتِّرْمِذِيُّ, وَرَوَاهُ مَالِكٌ وَالشَّافِعِيُّ وَأَحْمَدُ.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం (ఒక వ్యక్తి వెలిబుచ్చిన సందేహానికి సమాధానంగా) దైవప్రవక్త ﷺ సముద్రపు నీటి గురించి ఇలా వివరించారు: “దాని నీరు పరిశుభ్రమైనది. అందులో చని పోయినవి ధర్మ సమ్మతమైనవి” (ఈ హదీసును అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ, ఇబ్నె అబీ షైబాలు ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ మరియు తిర్మిజీలు దీన్ని ప్రామాణికమైనదిగా ధృవీకరించారు. ఇమామ్ మాలిక్, షాఫయి, అహ్మద్ కూడా ఈ ఉల్లేఖనాన్ని ఉల్లేఖించారు).

English

Narrated Abu Huraira: Allah’s Messenger (ﷺ) said regarding the sea, "It's water is purifying and its dead (animals) are lawful (to eat)." [Al- Arba’a and Ibn Abu Shaiba reported it (this version is of the latter). Ibn Khuzaima and Tirmidhi graded it Sahih. It was also reported by Malik, Shafi'i and Ahmad.]

సారాంశం

ఈ హదీసు వాస్తవానికి ఒక పృచ్ఛకుని ప్రశ్నకు సమాధానంగా ఉద్బోధించబడింది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) తదితరులు ఉటంకించిన దాని ప్రకారం ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ ﷺ సన్నిధికి వచ్చి, ‘ఓ దైవప్రవక్తా! మేము సముద్రయానం చేస్తూ ఉంటాము. మా వెంట మంచినీరు కొద్దిగానే ఉంటుంది. ఈ నీటితో గనక మేము ‘వుజూ’ చేస్తూపోతే దాహంతో చచ్చిపోతాము. కాబట్టి మేము సముద్రపు నీటితో ‘వుజూ’ చేయవచ్చా?’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా “ఆ నీరు పరిశుద్ధమైనదే” అని మహాప్రవక్త ﷺ ప్రవచించారు.

సముద్రపు నీరు ముమ్మాటికీ పరిశుద్ధమైనదనటానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. మరో గమనార్హమైన విషయం ఏమిటంటే సముద్రంలోని చరాలు – అవి కుక్క, పందిని పోలినవి అయినాసరే – హలాల్ (ధర్మ సమ్మతం) గానే పరిగణించబడతాయి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) మాత్రం కేవలం సముద్రపు చేపలనే ధర్మసమ్మతంగా భావించారు.

మహనీయ ముహమ్మద్ ﷺ వారు సముద్రపు నీటితో పాటు సముద్రంలో సహజంగా మరణించిన జంతువులను కూడా ధర్మసమ్మతమైన వాటి జాబితాలో చేర్చారు. ప్రశ్నించే వ్యక్తి అడగక పోయినప్పటికీ మహాప్రవక్త ﷺ ఈ సందేహ నివృత్తి చేశారు. ఎందుకంటే సముద్రపు నీరు ధర్మ సమ్మతమో కాదో అన్న సందేహం కలిగిన వ్యక్తి, సముద్రంలో చనిపోయిన చరాలు ధర్మ సమ్మతమా? కాదా? అన్న విషయమై కూడా తీవ్రమయిన సందేహానికి, మీమాంసకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దివ్య ఖుర్ఆన్‌లో చనిపోయిన వాటిని తినరాదన్న ఆదేశం వచ్చిందిగాని వాటికి సంబంధించిన తఫ్సీళ్ళు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర ప్రయాణాలు చేసే వ్యక్తి చనిపోయిన జలచరాల విషయంలో సందిగ్ధానికి లోనుకావచ్చు. ఈ విధంగా చూసినప్పుడు మహాప్రవక్త ﷺ గారి సమాధానం యుక్తితో, నేర్పుతో, వాత్సల్యంతో కూడుకున్నదిగా కనిపిస్తుంది.

ఇంతకీ ఈ పృచ్ఛకుడు ఎవరు? అనే విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. అతని పేరు అబ్దుల్లా అల్ ముద్‌లజీ (రదియల్లాహు అన్హు) అయి ఉండవచ్చుననీ, అబ్దుల్ అర్కీ (రదియల్లాహు అన్హు) కూడా కావచ్చుననీ ఒక వాదన ఉంది. ఉబైద్ – అల్ అర్కీ అనేది కూడా నిజం కావచ్చునని కొంతమంది వాదించారు. సముద్రం లేక నదులలో పడవ నడిపేవారిని అరబీలో ‘అర్కీ’ గా వ్యవహరిస్తారు.

సముద్రపు నీరు పరిశుద్ధమైనదనీ, దాంతో వుజూ చేయటం, దానిని (ట్రీట్‌చేసి) మన ఉపయోగం లోకి తీసుకురావటం సబబేనని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అలాగే సముద్రంలో ఉండే జంతువులు (సముద్రం బయట జీవించి ఉండలేనివి) అన్నీ – అవి సముద్రంలో చనిపోయినా లేక వాటిని పట్టుకున్న తరువాత అవి ప్రాణం విడిచినా – వాటిని తినటం సమ్మతమే. అలాగే సముద్రంలో ప్రయాణం చేయటం కూడా ధర్మసమ్మతమే.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) అగ్రశ్రేణి ప్రవక్త సహచరులలో ఒకరు. ఈయనగారి ద్వారా అందరికన్నా ఎక్కువ హదీసులు మనకు అందాయి. సంకలనకర్త అభిప్రాయం ప్రకారం ఈయనగారి అసలు పేరు అబ్దుల్లాహ్ లేక అబ్దుర్రహ్మాన్ అయి ఉంటుంది. ఈయన దౌస్ తెగకు చెందినవారు. హిజ్రీ శకం 6వ యేట ఇస్లాం స్వీకరించారు. 78 ఏళ్ళ ప్రాయంలో – హిజ్రీ 59లో – అశాశ్వతమయిన ఈ లోకాన్ని విడిచిపోయారు. మదీనాలోని “బఖీ” అనే ఖననవాటికలో ఖననం చేయబడ్డారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా ఉన్న కాలంలో ముఫ్తీగా నియమితులయ్యారు. ఈయనగారి చేత ఇంచుమించు 5384 హదీసులు ఉల్లేఖించబడినాయి. ఖచ్చితంగా హదీసుల సంఖ్య అల్లాహ్‌కే తెలుసు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 1

2

హదీసు 2

وَعَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَلْمَاءَ طَهُورٌ لَا يُنَجِّسُهُ شَيْءٌ } أَخْرَجَهُ اَلثَّلَاثَةُ وَصَحَّحَهُ أَحْمَدُ.

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: “నీరు పరిశుద్ధమైనది. ఏ వస్తువూ దానిని అశుద్ధపరచదు.” (ఈ ఉల్లేఖనాన్ని అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్నెమాజ ఉల్లేఖించారు. దీని ప్రామాణికతను అహ్మద్ ధృవీకరించారు)

English

Narrated Abu Sa'id al-Khudri: Allah’s Messenger (ﷺ) said: “Water is pure and nothing can make it impure”. [Ath-Thalatha and Ahmad who graded it Sahih]

సారాంశం

హదీసు సారాంశమేమిటంటే నీరు స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనదై ఉంటుంది. కేవలం అందులో మాలిన్యం ఉన్నంత మాత్రాన – అది తక్కువ మోతాదులో ఉన్నా, ఎక్కువ మోతాదులో ఉన్నాసరే – అది అపవిత్రం, అశుద్ధం అయిపోదు. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), జవాహిర్ మరియు ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ల అభిప్రాయం కూడా ఇదే. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) కొన్ని షరతులతో ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) చేత ఉల్లేఖించబడిన ఈ హదీసుతో ఒక ప్రత్యేక సంఘటన ముడిపడి ఉంది. అదేమంటే;

‘మేము ‘బీరె బుజాఅ’ నీటితో వుజూ చేయవచ్చా?’ అని కొంతమంది సహచరులు దైవప్రవక్త ﷺను ప్రశ్నించారు (అదొక పాత బావి. అందులో బహిష్టు బట్టలు (ముట్లు), కుక్క మాంసపు ముక్కలు, దుర్వాసనతో కూడిన వస్తువులు పారవేయబడేవి). దీనికి సమాధానంగా ఆయన ﷺ “నీరు మాత్రం పరిశుద్ధమైనది” అని చెప్పారు. ప్రశ్నించిన వారి దృష్టిలో ‘బీరె బుజాఅ’ నీరు ఉంది. ఆ బావి వెడల్పు ఆరు గజాలుంటుంది. ఆ బావిలో మహా అయితే నాభి వరకు లేక అంతకన్నా కొంచెం ఎక్కువ లోతు నీరుంటుంది. లేదంటే నాభికన్నా కొంచెం తక్కువ లోతు ఉంటుంది. అబూ దావూద్ తన సునన్‌లో కూడా దీన్ని గురించి ఇలాగే ప్రస్తావించారు.

ఈ హదీసు ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే నీరు ఇంత ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అందులో మలినం పడినంత మాత్రాన అది అశుద్ధమైపోదు. అయితే నీరు తక్కువగా ఉన్నప్పుడు మాలిన్యం పడినట్లయితే అప్పుడది అశుద్ధమైపోతుంది.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన వారు అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు). అబూ సయీద్ అనేది మరో పేరు. అసలు పేరు సాద్ బిన్ మాలిక్ బిన్ సునాన్. అన్సార్లకు చెందిన ‘ఖజ్రజ్’ తెగవారు. పెద్ద సహాబీలలో ఒకరుగా పరిగణించబడ్డారు. ఖుద్ర అనేది ఒక అన్సారీ తెగ. ఆ తెగ పేరున ఈయన ఖుదరీగా పిలువబడ్డారు. దాదాపు 86 సంవత్సరాలు జీవించారు. హిజ్రీ శకం 74వ ఏట మరణించారు. ఈయన గారి ద్వారా కూడా మనకు చాలా హదీసులు అందాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 2

3

హదీసు 3

وَعَنْ أَبِي أُمَامَةَ اَلْبَاهِلِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِنَّ اَلْمَاءَ لَا يُنَجِّسُهُ شَيْءٌ, إِلَّا مَا غَلَبَ عَلَى رِيحِهِ وَطَعْمِهِ, وَلَوْنِهِ } أَخْرَجَهُ اِبْنُ مَاجَهْ وَضَعَّفَهُ أَبُو حَاتِمٍ. وَلِلْبَيْهَقِيِّ: { اَلْمَاءُ طَاهِرٌ إِلَّا إِنْ تَغَيَّرَ رِيحُهُ, أَوْ طَعْمُهُ, أَوْ لَوْنُهُ; بِنَجَاسَةٍ تَحْدُثُ فِيهِ }.

హజ్రత్ అబూ ఉమామ అల్ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ ప్రబోధించారు – “నిశ్చయంగా నీళ్ళను ఏ వస్తువూ అపవిత్రంగానీ, మలినంగానీ చేయజాలదు – నీళ్ళపై ఆ అశుద్ధ వస్తువు తీవ్ర ప్రభావం చూపి దాని రుచి, రంగు, వాసనలో మార్పువస్తే తప్ప!” (ఇబ్నె మాజ దీనిని ఉల్లేఖించారు. అబూ హాతిమ్ దీనిని బలహీన హదీసుగా ఖరారు చేశారు). బైహఖీలో హదీసు వాక్యం ఈ విధంగా ఉంది: నీరు పరిశుద్ధమైనది (పరిశుద్ధపరచేది కూడాను). కాకపోతే నీటిలో పడిన ఆ అశుద్ధ వస్తువు నీటి వాసనను, రుచినీ, రంగును మార్చివేస్తే అప్పుడది అశుద్ధమైపోతుంది.”

English

Narrated Abu Umama Al-Bahili: Allah’s Messenger (ﷺ) said: “Water cannot be rendered impure by anything except something which changes its smell, taste and colour”. [ Ibn Majar reported it and Abu Hatim described it as Da’if (weak)].

And Al-Baihaqi reported: “Water is pure unless any impure thing is added which changes its smell, taste and colour”.

సారాంశం

కేవలం మలినం పడినంత మాత్రానికే నీరు అశుద్ధం అయిపోదు. నీరు ఎక్కువ పరిమాణంలో – అంటే రెండు పెద్ద తొట్టెలకు సమానంగా ఉన్నప్పుడు అశుద్ధతా ప్రభావం ఏర్పడదు. ఒకవేళ మలినం పడటం మూలంగా ఆ నీటి వాసన, రుచి, రంగు వంటి మూడు గుణాలలో ఏ ఒక్క గుణం మారినా ఆ నీరు అశుద్ధం అయిపోతుంది. అటువంటి నీరు అధిక పరిమాణంలో ఉన్నా, అల్ప పరిమాణంలో ఉన్నా అది అశుద్ధంగానే పరిగణించబడుతుంది.

ఈ హదీసు ప్రామాణికత రీత్యా బలహీనంగా ఉన్నప్పటికీ భావార్థం రీత్యా సరైనదే అన్న విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది. నీరు కొద్దిగా ఉన్నా, ఎక్కువ మోతాదులో ఉన్నా – మలినం పడిన కారణంగా దాని మూడు గుణాలలో ఏ ఒక్క గుణం మారినా అది అశుద్ధమైపోతుందన్న పండితుల ఏకాభిప్రాయాన్ని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), బైహఖీ (రహిమహుల్లాహ్), ఇబ్నె ముంజిర్ (రహిమహుల్లాహ్)లు నకలు చేశారు.

ఈ హదీసు ద్వారా వెల్లడయ్యే మరో విషయం ఏమిటంటే నీరు అధిక పరిమాణంలో – అంటే రెండు పెద్ద తొట్టెలకు సమానంగా లేక అంతకు మించి ఉంటే ఏ వస్తువూ దానిని అశుద్ధపరచదు. కాని మలినం మూలంగా నీటి రంగు, రుచి, వాసనలలో మార్పువస్తే మటుకు అది అశుద్ధమైపోయినట్లే.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించినవారు అబూ ఉమామ అల్ బాహిలీ (రదియల్లాహు అన్హు). అబూ ఉమామ అనేది మారు పేరు. బాహిల అనే తెగకు చెందిన వారవటం చేత బాహిలీగా వ్యవహరించబడ్డారు. ఈయన అసలు పేరు సుదై బిన్ అజ్లాన్. సుప్రసిద్ధ సహాబీలలో ఒకరు. ఈయన ద్వారా ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. ఈజిప్టులో కొంతకాలం స్థిరపడి, ఆ తరువాత ‘హిమ్స్’కు తరలి వెళ్ళారు. ఈయన మరణం హి.శ. 81 లేదా 86లో సంభవించింది. సిరియాలో తనువు చాలించిన చిట్టచివరి సహాబీ ఈయనే.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 3

4

హదీసు 4

وَعَنْ عَبْدِ اَللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: { إِذَا كَانَ اَلْمَاءَ قُلَّتَيْنِ لَمْ يَحْمِلْ اَلْخَبَثَ } وَفِي لَفْظٍ: { لَمْ يَنْجُسْ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ.‏ وَابْنُ حِبَّانَ, وَالْحَاكِمُ.

దైవ ప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: “నీటి పరిమాణం రెండు పెద్ద కడవలకు సమానంగా ఉన్నప్పుడు అది మాలిన్యాన్ని గ్రహించదు.” వేరొక ఉల్లేఖనంలోని వాక్యం ఇలా ఉంది: “నీరు అశుద్ధం కాదు.” (దీనిని అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజ ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమా, ఇబ్నె హిబ్బాన్ మరియు హాకిమ్‌లు దీని ప్రామాణికతను ధృవీకరించారు).

English

Narrated ‘Abdullah bin ‘Umar (rad): Allah’s Mesenger (ﷺ) said: “If there is enough water to fill two pots (Qulla), it carries no impurity,” Another version has: “It does not become unclean”. {Al-Arba’a reported it. Ibn Khuzaima, Ibn Hibban and Al-Hakim graded it Sahih (sound)].

సారాంశం

పై హదీసులో ప్రస్తావించబడిన కడవల సైజుకు సంబంధించి కొంత అభిప్రాయభేదం ఉంది. అయితే అరబ్బులోని రాతి తొట్టెలు సుప్రసిద్ధమైనవి. అక్కడి కవులు తమ కవితల్లో తరచూ ఈ తొట్టెలను ప్రస్తావిస్తూ ఉండేవారు. వాటి ఉపమానాలు కూడా ఇచ్చేవారు. హదీసులో ప్రస్తావనకు వచ్చిన తొట్టెలు (లేదా కడవలు) ఈ రాతి తొట్టెలే అయి ఉంటాయి. ఆ తొట్టెలలో 250 రతల్‌ల నీరు పడుతుంది. రెండు పెద్ద తొట్టెలలో సుమారు 500 రతల్‌ల నీరు పడుతుంది. నేటి ఆధునిక కొలమానం ప్రకారం ఇది 227 కిలో గ్రాములకు సమానం. ఈ పరిమాణంలో ఉన్న నీరు సాధారణంగా మలినాన్ని స్వీకరించదు. కొద్దిపాటి మాలిన్యం ఒకవేళ అందులో పడినా అది అశుద్ధమైపోదు.

ఈ హదీసు నీటి యొక్క అధిక – అల్ప పరిమాణాలను నిర్ధారించే విషయంలో కొలబద్ద వంటిది. నీళ్ళకు సంబంధించిన ఈ హదీసులన్నింటి ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే నీటి పరిమాణం రెండు పెద్ద తొట్టెలకన్నా తక్కువ ఉన్నప్పుడు – అందులో మలినం పడితే అప్పుడది అశుద్ధమైపోతుంది. నీటి రంగు, రుచి, వాసనలో మార్పు పొడసూపినా, పొడసూపకపోయినా అది అశుద్ధమైపోయిందనటంలో సందేహానికి ఆస్కారం లేదు. అయితే నీరు రెండు తొట్టెలకు సమానంగా లేక అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మలినం పడిన కారణంగా ఆ నీరు అశుద్ధం అవదు. పైగా ఆ నీరు పరిశుద్ధంగా ఉంటుంది. ఇతర వస్తువులను పరిశుద్ధపరచే శక్తి కలిగి ఉంటుంది. కాని మలినం మూలంగా దాని మూడు గుణాలలో (రంగు, రుచి, వాసన) ఏ ఒక్క గుణం మారినా అప్పుడు అది అశుద్ధ నీరుగానే భావించ బడుతుంది.

ఇంతకు ముందు మీరు చదివిన హదీసు (బావికి సంబంధించిన హదీసు)లో నీరు రెండు పెద్ద తొట్టెలకన్నా అధికంగా ఉంది. ఆ హదీసును హదీసువేత్తల ఓ పెద్ద సమూహం ప్రమాణబద్ధమైనదిగా నిర్ధారించింది. ఆ కోవకు చెందిన వారిలో ప్రముఖులు : ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), అబూ ఉబైద్ (రహిమహుల్లాహ్), అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇస్హాఖ్ (రహిమహుల్లాహ్), యహ్యా బిన్ మొయిన్ (రహిమహుల్లాహ్), ఇబ్నె ఖుజైమ (రహిమహుల్లాహ్), తహావీ (రహిమహుల్లాహ్), ఇబ్నె హిబ్బాన్ (రహిమహుల్లాహ్), దారెఖుత్ని (రహిమహుల్లాహ్), ఇబ్నె ముంద (రహిమహుల్లాహ్), హాకిమ్ (రహిమహుల్లాహ్), ఖతాబీ (రహిమహుల్లాహ్), బైహఖీ (రహిమహుల్లాహ్) ఇబ్నె హజమ్ (రహిమహుల్లాహ్) మొదలగువారు.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జ్ఞాన సంపన్నులు. గొప్ప ప్రజ్ఞాశాలి. పిన్న వయస్సులోనే ఇస్లాం స్వీకరించారు. మక్కా నుండి మదీనాకు ప్రస్థానం కూడా చేశారు. తొలిసారిగా కందక యుద్ధంలో పాల్గొన్నారు. హిజ్రీ 75 వ సంవత్సరంలో పవిత్ర మక్కాలో మరణించారు. ‘జీతువా’ స్థలంలో ఈయన అంత్యక్రియలు జరిగాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 4

5

హదీసు 5

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا يَغْتَسِلُ أَحَدُكُمْ فِي اَلْمَاءِ اَلدَّائِمِ وَهُوَ جُنُبٌ } أَخْرَجَهُ مُسْلِمٌ. وَلِلْبُخَارِيِّ: { لَا يَبُولَنَّ أَحَدُكُمْ فِي اَلْمَاءِ اَلدَّائِمِ اَلَّذِي لَا يَجْرِي, ثُمَّ يَغْتَسِلُ فِيهِ }. وَلِمُسْلِمٍ: "مِنْهُ". وَلِأَبِي دَاوُدَ: { وَلَا يَغْتَسِلُ فِيهِ مِنْ اَلْجَنَابَةِ }.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరయితే అశుద్ధావస్థకు లోనై ఉన్నారో వారు నిలిచి ఉన్న నీటిలో స్నానం చేయరాదు” (ముస్లిం). బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి: “మీలో ఎవరూ నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయటంగానీ, స్నానం చేయటంగానీ చేయరాదు.” సహీహ్ ముస్లింలోని పదం ‘ఫీహి’ బదులు ‘మిన్హు’ అని ఉంది. అంటే దానిలోని కొంత నీరును తీసుకుని స్నానం చేయరాదు. అబూదావూద్‌లోని వాక్యం ఇలా ఉంది : “వలా యగ్తసిల్ ఫీహి మినల్ జనాబతి” – అంటే – లైంగిక అశుద్ధావస్థకు లోనైన పరిస్థితిలో అందులో స్నానం చేయరాదు.”

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “None of you should take a bath in stagnant water when he is sexually impure”. [Muslim reported it]

Another version of Al-Bukhari has: “None of you should urinate in stagnant water that is not flowing, and then take bath in it”. A version of Muslim has the words “from it (i.e. the water)”. A version of Abu Da’ud has: “One should not take bath in it from sexual impurity”.

సారాంశం

హదీసులో ‘జనాబత్’ అని ఉంది. సంభోగం వల్ల మరియు వీర్య స్ఖలనం వల్ల ఏర్పడే అశుద్ధావస్థను, ‘జనాబత్’ అంటారు.

ముస్లింలోని ఉల్లేఖనంలో ‘ఫీహి’ అనే బదులు ‘మిన్హు’ అనే పదం ప్రయోగించబడింది. ఒకవేళ ‘ఫీహి’ అని ఉంటే, ‘ఆ నీటిలో ప్రవేశించటం మరియు మునగటం నిషిద్ధం’ అని అర్థం వస్తుంది. ‘మిన్హు’ అని గనక ఉంటే అందులో నుంచి కొంత నీరును తీసుకుని వేరుగా స్నానం చేయటం అని కూడా రాదు.

మొత్తం మీద ‘ముస్లిం’ ఉల్లేఖనంలో కేవలం స్నానం చేయటం నిషిద్ధం అన్న అర్థం మాత్రమే వస్తుంది. బుఖారీ ఉల్లేఖనంలోనయితే అందులో మూత్ర విసర్జన చేయటం, స్నానం చేయటం – రెండూ వారించబడ్డాయి. అబూ దావూద్ ఉల్లేఖనం దృష్ట్యా చూస్తే అందులో మూత్ర విసర్జన చేయటం, మునిగి స్నానం చేయటం, లేక అందులో నుంచి కొంత నీరును తీసుకుని వేరుగా స్నానం చేయటం – అన్నీ వారించబడ్డాయి. మొత్తానికి ఈ ఉల్లేఖనాలన్నింటి ద్వారా అవగతమయ్యేదేమిటంటే రెండు పనులూ నిషిద్ధమే. ఎందుకంటే నిలిచి ఉన్న నీరు తక్కువ పరిమాణంలో ఉంటే అది అపవిత్రం అయిపోతుంది. ఒకవేళ నిలిచి ఉన్న నీరు ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ నిరంతరం అందులో మూత్ర విసర్జన చేస్తూ, స్నానాలు కూడా చేస్తున్నందున క్రమక్రమంగా అది కలుషితమై నీటి గుణాలలో మార్పు వచ్చేస్తుంది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 5

6

హదీసు 6

وَعَنْ رَجُلٍ صَحِبَ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-"أَنْ تَغْتَسِلَ اَلْمَرْأَةُ بِفَضْلِ اَلرَّجُلِ, أَوْ اَلرَّجُلُ بِفَضْلِ اَلْمَرْأَةِ, وَلْيَغْتَرِفَا جَمِيعًا } أَخْرَجَهُ أَبُو دَاوُدَ.‏ وَالنَّسَائِيُّ, وَإِسْنَادُهُ صَحِيحٌ.

దైవప్రవక్త ﷺ సహచర్యంలో ఉండి ధార్మిక లబ్ధి పొందిన ఒక వ్యక్తి కథనం : “పురుషుడు స్నానం చేయగా మిగిలి ఉన్న నీటితో స్త్రీ స్నానం చేయటాన్ని, స్త్రీ స్నానం చేయగా మిగిలి ఉన్న నీళ్ళతో పురుషుడు స్నానమాడటాన్ని దైవప్రవక్త ﷺ వారించారు. ఒకవేళ ఇద్దరూ ఒకే సమయంలో దోసిట్లో నీళ్ళు తీసుకుని స్నాన మాడితే (అందులో అభ్యంతరం ఏమీ లేదు). (అబూ దావూద్, నసాయి. ఈ హదీసు అందజేయబడిన తీరు ప్రామాణికమైనది).

English

A man who accompanied the prophet (ﷺ) narrated: Allah’s Messenger (ﷺ) forbade a women to bathe with the water left over by a man and that a man should not bathe with the water left over by a woman (but instead) they should both take scoopfuls of the water together. [Reported by Abu Da’ud and An-Nasa’i and its chain of narrators is Sahih (authentic)].

సారాంశం

ఈ హదీసును ఉల్లేఖించిన సహచరుని పేరు వెల్లడి కానంత మాత్రాన హదీసుకు కలిగిన అనర్థం ఏమీ లేదు. ఎందుకంటే హదీసుల అభివ్యక్తిలో ప్రవక్త ప్రియ సహచరులంతా నిష్పాక్షికంగా, న్యాయంగా వ్యవహరిస్తారన్న విషయమై హదీసువేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉంది.

ఈ హదీసులో వచ్చిన ‘వారింపు’ (నహీ) హరామ్‌కు సంబంధించినది కాదు. అంటే అది నిషిద్ధం అని కాదు. అది ‘నహీయె తన్జీహి’ – అంటే అవాంఛనీయమైనది, అయిష్టకరమైనదన్న భావంలో తీసుకోబడింది. రాబోయే హదీసులో దీని వివరణ ఉంది. కనుక స్త్రీ స్నానం చేయగా మిగిలి ఉన్న నీళ్ళతో పురుషుడు స్నానం చేస్తే ఏదో ఘోరం జరిగిపోయినట్టుగా భావించవలసిన అవసరంలేదు.

ఇక – ఏకకాలంలో స్త్రీ పురుషులిద్దరూ దోసిట్లో నీళ్ళు తీసుకోవటం వల్ల ఒకరి ప్రభావం మరొకరిపై పడవచ్చు. ఆ విధంగా ఒకరు ఇంకొకరికి చెల్లు అవుతారు. ఇందులో కూడా ఆక్షేపణీయమైన విషయం ఏమీ లేదు. అందుచేత ఇందుకు అనుమతించబడింది.

ఒకవేళ భార్యా భర్తలిరువురూ ఒకే పాత్రలో నుంచి నీళ్ళు తీసుకుని స్నానం చేస్తే అది ధర్మసమ్మతమే. అయితే కేవలం భర్త లేక కేవలం భార్య – పరిశుద్ధతను పొందే సంకల్పంతో చేసే – స్నానం తరువాత మిగిలి ఉన్న నీళ్ళను తమ కొరకు ఉపయోగించటం సమ్మతం కాదు. ఇరువురి మనస్సులలో లేశమయినా శంక మిగిలి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈవిధంగా సెలవీయబడింది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 6

7

హదీసు 7

وَعَنْ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يَغْتَسِلُ بِفَضْلِ مَيْمُونَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا } أَخْرَجَهُ مُسْلِمٌ. وَلِأَصْحَابِ "اَلسُّنَنِ": { اِغْتَسَلَ بَعْضُ أَزْوَاجِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فِي جَفْنَةٍ, فَجَاءَ لِيَغْتَسِلَ مِنْهَا, فَقَالَتْ لَهُ: إِنِّي كُنْتُ جُنُبًا, فَقَالَ: "إِنَّ اَلْمَاءَ لَا يُجْنِبُ" } وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ, وَابْنُ خُزَيْمَةَ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : “దైవ ప్రవక్త ﷺ తన సతీమణి అయిన మైమూన (రదియల్లాహు అన్హా) స్నానం చేయగా మిగిలివున్న నీళ్ళతో స్నానం చేసేవారు (ముస్లిం). అస్హాబె సునన్‌లోని ఉల్లేఖనంలో ఇలా ఉంది: ప్రవక్త సతీమణులలో ఒకామె తొట్టెలాంటి ఒక పాత్రలో స్నానం చేసిన మీదట, తాను కూడా స్నానం చేసే ఉద్దేశ్యంతో దైవప్రవక్త ﷺ ఏతెంచారు. నేను ఇందులో అశుద్ధావస్థను దూరం చేసే స్నానం చేశాను కదా అని ఆమె విన్నవించుకోగా, “నీరు అశుద్ధమైనది కాదు కదా!” అని ఆయన ﷺ పలికారు. (ఈ ఉల్లేఖనాన్ని తిర్మిజీ, ఇబ్నె ఖుజైమాలు ప్రామాణికమైనదిగా ధృవీకరించారు).

English

Narrated Ibn ‘Abbas (rad): The Prophet (ﷺ) used to bath with the water left over by Maimuna (rad) [Muslim reported it].

And Ashab As-Sunan (compilers of the prophet’s sayings) reported that one of the wives of the Prophet (ﷺ) took bath from a vessel, then came the Prophet (ﷺ) and when he wanted to take bath from that (vessel), she said, “I was sexually impure”. He said, “Water does not become sexually impure”. [At-Tirmidhi and Ibn huzaima graded it Sahih (sound)].

సారాంశం

“అస్హాబె సునన్” అంటే అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్నె మాజ, అలాగే దారిమి, దారె ఖుత్ని, ఇబ్నె ఖుజైమ మరియు హాకిమ్‌లు అని భావించాలి.

ఈ హదీసు ఇంతకుముందు వచ్చిన హదీసుకు విరుద్ధమైనదే! అన్న సందేహం రావచ్చుగాని సందేహానికి తావు నివ్వవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఉమ్మత్ (ముస్లిం అనుచర సమాజం) యొక్క సౌలభ్యం నిమిత్తం ఆయన ﷺ ఇలా ప్రవచించారు. అదీగాక, ఆయన స్వయంగా దీనిని ఆచరించి చూపారు. పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ రెండు హదీసులూ వాటి కోణాలనుండి సరైనవే ననడానికి ఇదొక నిదర్శనం. గమనార్హమయిన మరో ముఖ్య విషయం ఏమంటే ఇందులోని ‘వారింపు’ ‘నిషిద్ధం’తో సమానం కాదు. ఇది కేవలం ‘అయిష్టకరమయినది’ మాత్రమే. దైవప్రవక్త ﷺ తన ధర్మ పత్ని మైమూన (రదియల్లాహు అన్హా) స్నానం చేసిన మీదట మిగిలివున్న నీళ్ళతో తాను కూడా స్నానం చేసేవారు. దీని భావం ఏమిటంటే హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) మరియు మహాప్రవక్త ﷺ – ఇరువురూ ఒకే పాత్రలో నుంచి నీరు తీసుకుని స్నానం చేసేవారు. సహీహ్ ముస్లింకు చెందిన ఇదే హదీసులోని రెండవ ఉల్లేఖనం కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది.

‘అస్హాబె సునన్’ల ఉల్లేఖనం ప్రామాణికత రీత్యా బలహీనమైనది. అందుచేత ప్రాధాన్యత నివ్వవలసిన అంశం ఏమిటంటే, భార్యాభర్తలిరువురూ కలిసి ఒకే పాత్ర నుంచి నీళ్ళు తీసుకుని స్నానం చేయటం సమంజసమేగాని, వేర్వేరుగా స్నానం చేసినపుడు ఒకరు స్నానం చేయగా మిగిలి ఉన్న నీళ్ళతో ఇంకొకరు స్నానం చేయటం సమంజసం కాదు.

హదీసు ఉల్లేఖకులు

1. ఉల్లేఖకుని పూర్తి పేరు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హుమా). ముస్లిం సమాజంలో ఆయన ‘జ్ఞాన సాగరం’గా వినుతికెక్కారు. ధార్మిక వ్యవహారాలలో గొప్ప కౌశల్యం ప్రదర్శించేవారు. ఆయన పాండితీ ప్రకర్ష గురించి ఆనాడు ఎవరికీ ఎలాంటి సందేహం ఉండేది కాదు. ఎందుకంటే ఆయనకు జ్ఞానంలో, యుక్తిలో, అవగాహనలో, అన్వయింపులో వృద్ధి నొసగమని దైవప్రవక్త ﷺ ప్రార్థించి ఉన్నారు. ఈయన హిజ్రీ 3వ సంవత్సరంలో జన్మించారు. హిజ్రీ 67లో తాయఫ్‌లో మరణించారు.

2. హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) : ఈమె పూర్తి వంశపరంపర ఇలా వుంది – మైమూనా బిన్తె హారిస్ అల్ హిలాలియ. దైవ ప్రవక్త ﷺ హిజ్రీ 7వ సంవత్సరం ఈమెను వివాహమాడారు. హిజ్రీ 61 లేక 51 లేక 66లో ఈమె మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 7

8

హదీసు 8

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ طَهُورُ إِنَاءِ أَحَدِكُمْ إِذَا وَلَغَ فِيهِ اَلْكَلْبُ أَنْ يَغْسِلَهُ سَبْعَ مَرَّاتٍ, أُولَاهُنَّ بِالتُّرَابِ } أَخْرَجَهُ مُسْلِمٌ. وَفِي لَفْظٍ لَهُ: { فَلْيُرِقْهُ }. وَلِلتِّرْمِذِيِّ: { أُخْرَاهُنَّ, أَوْ أُولَاهُنَّ بِالتُّرَابِ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలోని ఎవరి పాత్రలోనయినా కుక్క ఎంగిలి చేస్తే దాన్ని ఏడుసార్లు కడగాలి. అన్నిటికన్నా ముందు మన్నుతో తోమి (పరిశుభ్రం చేయాలి).” (ముస్లిం) ‘ఫల్ యురిఖ్’ అనీ, అంటే దాన్ని పడవేయాలని ‘ముస్లిం’లో నకలు చేయబడింది. మొదటిసారి లేదా ఆఖరిసారి మన్నుతో శుభ్రపరచాలన్న పదాలు ‘తిర్మిజీ’లో పొందుపరచబడి ఉన్నాయి.”

English

Narrated by Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “The cleansing of the utensil belonging to one of you, after it has been licked by a dog, is to wash it seven times, and using soil for cleaning at the first time.” [Muslim reported it].

Another version has: “he should spill the content”.

At-Tirmidhi’s version has “using soil at the first or last time”.

సారాంశం

“తొలిసారి లేదా ఆఖరిసారి” అన్న అనుమానం బహుశా ఉల్లేఖకునిలో కలిగి ఉంటుంది. తొలిసారి మట్టితో కడిగినా, ఆఖరిలో మట్టితో కడిగినా అది కడిగేవాని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలి. “మొదటిసారి” అనే పదం అనేక ఉల్లేఖనాలలో ఉండటం వల్ల, బుఖారీ మరియు ముస్లింలలో కూడా ఈ విధంగానే పేర్కొనబడటం మూలంగా “మొదటిసారి మన్నుతో తోమి శుభ్రపరచాల”న్న దానికే ప్రాధాన్యత నివ్వబడుతున్నది.

ఈ హదీసు ద్వారా వెల్లడయ్యేదేమిటంటే, కుక్క నోరు, దాని చొంగ, ఎంగిలి అశుద్ధం. ఈ కారణంగానే దాని శరీరమంతా అశుద్ధంగా పరిగణించబడుతుంది. అది మూతి పెట్టిన పాత్రను ఏడుసార్లు కడగటం తప్పనిసరి అనటాన్ని బట్టి అది ఎంత అపవిత్రమైన జంతువో వ్యక్తమవుతోంది. పరిశోధకుల అభిప్రాయం కూడా ఇదే. ఏడుసార్లు కడిగి, ఒకసారి మన్నుతో తోమి శుభ్రపరచటం అభిలషణీయమేగాని అనివార్యం కాదని మరి కొంతమంది భావించారు. మూడుసార్లు కడిగితే చాలని ఇంకొంతమంది వాదించారు. కాని వాస్తవమేమిటంటే హదీసులోని ఆధారం ఈ రెండు వాదాలనూ సమర్థించదు. ఏడుసార్లు తప్పనిసరిగా కడగాలని హదీసులో చెప్పబడిందంటే అందులో ఎన్నో మర్మాలు, పరమార్థాలు ఇమిడి ఉంటాయి.

సాధారణంగా కుక్క ప్రేగుల్లో చిన్న చిన్న సూక్ష్మక్రిములు చాలా ఉంటాయని వర్తమాన కాలపు వైద్యులు స్పష్టపరుస్తున్నారు. అవి నాలుగు మిల్లీ మీటర్ల దాకా పొడవుంటాయి. కుక్క మల విసర్జన చేసినపుడు ఆ మలంతోపాటు అసంఖ్యాకమయిన అండాలు కూడా బయటకు వస్తాయి. మల విసర్జన భాగంలో (పిరుదుల వద్ద) వెంట్రుకలకు అతుక్కుపోతాయి. మల విసర్జన తరువాత కుక్క నాలుకతో తనను తాను పరిశుభ్రపరచుకుంటుంది. ఆ సమయంలో అండాలు దాని మూతికి తగులుతాయి. నోటి లోనికి ప్రవేశిస్తాయి. అనంతరం ఆ కుక్క నీళ్ళ పాత్రలో మూతిపెట్టినా, నీరు త్రాగినా, లేక ఎవరయినా పాశ్చాత్యుల తరహాలో ఆ కుక్క మూతిని ముద్దు పెట్టుకున్నా ఆ అండాలు తక్షణం అంటుకుంటాయి. ఆ విధంగా అవి జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి. ఆ అండాలలోంచి సూక్ష్మ క్రిములు జనించి జీర్ణకోశాన్ని చీల్చుకుని రక్త నాళాలలోకి ప్రవేశిస్తాయి. తత్కారణంగా హృద్రోగాలు, మెదడు వ్యాధులు రావటం, ఊపిరితిత్తులు చెడిపోవటం సంభవిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ పాశ్చాత్య వైద్యులు ఖుద్దుగా నిర్ధారించారు. ఈ సూక్ష్మక్రిములు గల కుక్కలను గుర్తించటం చాలా కష్టం.

షరీయత్ పరంగా కుక్కను అపవిత్ర, అశుద్ధ జంతువుగా ఖరారు చేయటం వెనుక ఇలాంటి పరమార్థాలు ఎన్నో ఉన్నాయి. అది ఎంగిలి చేసిన పాత్రను ఏడుసార్లు కడగాలనడంలోని మర్మం ఇదే. తద్వారా ఆ పాత్ర వీలయినంత అధికంగా పరిశుభ్రం కావాలన్నది అసలు ఉద్దేశ్యం. యదార్థ జ్ఞానం మాత్రం అల్లాహ్‌కే తెలుసు.

తినే, త్రాగే పదార్థాన్ని గనక కుక్క ఎంగిలి చేస్తే దాన్ని ఉపయోగించేబదులు పారవేయాలి. హదీసు బోధన ప్రకారం దాన్ని ఏడుతూర్లు కడగాలి. దీన్నిబట్టి కుక్క స్వతహాగా అపవిత్రమైనదేగాక, అది మూతిపెట్టిన వస్తువు సయితం అపవిత్రం అయిపోతుంది. ఒకవేళ మన వినియోగంలో వున్న పాత్ర అయితే దాన్ని ఏడుసార్లు కడగాలి. ముస్లింలోని ఉల్లేఖనంలో ఏడోసారి బదులు ఎనిమిదోసారి మన్నుతో తోమాలని ఉంది. అంటే మొదటిసారి మన్నుతో తోమి, ఆ తరువాత ఏడుసార్లు నీళ్ళతో కడగాలి. ఇలా చేయటం వల్ల వీలైనంత ఎక్కువ పరిశుద్ధత ప్రాప్తమయి, సందేహానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పోతుంది. మూడుసార్లు కడిగినా పరిశుభ్రమైపోతుందని హనఫీలు భావిస్తున్నారు. వాళ్ళు తమ ఈ అభిప్రాయానికి ఆధారంగా దారెఖుత్నీలో పేర్కొనబడిన హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ‘ఫత్వా’ను ఉదాహరిస్తున్నారు. కుక్క ఎంగిలిచేసిన పాత్రను మూడుసార్లు కడగాలని అందులో ఉంది. మరి చూడబోతే ఈయనగారు ఇచ్చిన మరో ప్రామాణిక ఫత్వాలో, అలాంటి పాత్రను ‘ఏడుసార్లు కడగాలి’ అన్న పలుకు కూడా ఉంది. ఇలాంటి ద్వంద్వాభిప్రాయాలు ముందుకు వచ్చినపుడు మూల హదీసుకు అనుకూలంగానున్న ఫత్వాను తీసుకోవటం అభిలషణీయం. ప్రమాణబద్ధంగా చూసినా ‘ఏడుసార్లు కడగాలి’ అన్న ఫత్వా (తీర్పు) ఎక్కువ సరైనదిగా తోస్తున్నది (ఫత్హుల్ బారీ – సం-1, పేజి – 277).

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 8

9

హదీసు 9

وَعَنْ أَبِي قَتَادَةَ ‏- رضى الله عنه ‏- أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ ‏-فِي اَلْهِرَّةِ‏-: { إِنَّهَا لَيْسَتْ بِنَجَسٍ, إِنَّمَا هِيَ مِنْ اَلطَّوَّافِينَ عَلَيْكُمْ } أَخْرَجَهُ اَلْأَرْبَعَةُ, وَصَحَّحَهُ اَلتِّرْمِذِيُّ.‏ وَابْنُ خُزَيْمَةَ.

దైవప్రవక్త ﷺ పిల్లి గురించి ఇలా ప్రవచించారని హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) వివరించారు: “అది అపవిత్రమైనది కాదు. ఎందుకంటే అది ఎల్లవేళలా వస్తూ పోతూ ఉండే పెంపుడు జంతువు.” (దీనిని అబూ దావూద్, నసాయి, తిర్మిజీ, ఇబ్నెమాజాలు నలుగురూ ఉల్లేఖించారు. తిర్మిజీ మరియు ఇబ్నె ఖుజైమాలు దీనిని ప్రామాణికమైన హదీసుగా ధృవీకరించారు).

English

Narrated Abu Qatada (rad): Allah’s Messenger (ﷺ) said about the cat that, “It is not unclean, but is one of those who intermingle with you.” [Reported by Al-Arba’a. At-Tirmidhi and Ibn Khuzaima graded it Sahih (sound)].

సారాంశం

హదీసు పూర్వరంగం ఏమిటంటే హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) వుజూ చేసే నీళ్ళ పాత్రను ఒకచోట ఉంచారు. అంతలో ఒక పిల్లి వచ్చి అందులో మూతిపెట్టి నీరు త్రాగసాగింది. దాని అవస్థను గమనించిన హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు), పిల్లికి సౌలభ్యం కలిగించే ఉద్దేశ్యంతో ఆ పాత్రను వెంటనే ఒక ప్రక్కకు వంచారు. మీరెందుకిలా చేస్తున్నారు? అని జనులు ప్రశ్నించగా హజ్రత్ అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఇలా వివరించారు: “పిల్లి అశుద్ధమైనది కాదు” అని దైవప్రవక్త ﷺ ప్రవచించగా నేను విన్నాను.

పిల్లి ఎంగిలి అశుద్ధమైనది కాదని ఈ ఉల్లేఖనం ద్వారా రూఢీ అవుతోంది. అయితే అది ఏ పదార్థాన్నయినా ఎంగిలి చేసినపుడు దాని మూతికి అశుద్ధ వస్తువు తగిలి ఉండకూడదన్నది షరతు.

హదీసు ఉల్లేఖకులు

‘అబూ ఖతాద’ మారు పేరు. అసలు పేరు హారిస్ బిన్ రిబయి. సుప్రసిద్ధ ప్రవక్త సహచరులలో ఒకరు. ‘దైవప్రవక్త ﷺ గారి అశ్వం’గా బిరుదు లభించింది. అన్సార్లకు చెందిన వారవటంచేత అన్సారీగా కూడా వ్యవహరించబడేవారు. ఈయన ఉహుద్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈయన మరణకాలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. హిజ్రీ 40లో మరణించారని కొంతమంది, హిజ్రీ 54వ యేట పరమపదించారని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు. రెండవ అభిప్రాయమే బలమైనది, సుప్రసిద్ధమైనది.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 9

10

హదీసు 10

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { جَاءَ أَعْرَابِيٌّ فَبَالَ فِي طَائِفَةِ اَلْمَسْجِدِ, فَزَجَرَهُ اَلنَّاسُ, فَنَهَاهُمْ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فَلَمَّا قَضَى بَوْلَهُ أَمَرَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِذَنُوبٍ مِنْ مَاءٍ; فَأُهْرِيقَ عَلَيْهِ.‏ } مُتَّفَقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక పల్లెటూరి బైతు వచ్చి మస్జిదు మూలన మూత్ర విసర్జన చేస్తుండగా ప్రజలతనికి చీవాట్లు పెట్టసాగారు. అయితే దైవప్రవక్త ﷺ చీవాట్లు పెట్టరాదని వారించారు. ఆ వ్యక్తి తాపీగా మూత్ర విసర్జన చేసిన పిమ్మట దైవప్రవక్త ﷺ ఒక బొక్కెన నీరు తెప్పించి, ఆ (అశుద్ధ) స్థలంలో పారపోశారు.” (బుఖారీ, ముస్లిం)

English

Narrated Anas bin Malik (rad): A Bedouin came and urinated in one corner of the mosque and the people shouted at him, but Allah’s Messenger (ﷺ) stopped them, and when he finished urinating, the Prophet (ﷺ) ordered for a bucket of water which was spilt over it [Agreed upon].

సారాంశం

ఇంతకీ ఆ పల్లెటూరి వ్యక్తి ఎవరు? ఆయన పేరు జుల్ ఖువైసర యమానీ అనీ, ఆయన పెద్ద బొజ్జ కలవారనీ చెప్పబడుతోంది. మస్జిద్ మూల ప్రదేశంలో మూత్రం పోయటం చూసి జనం ఆయన్ని ఈసడించుకుంది. తీవ్రంగా మందలించింది. అంతలో ఆ దృశ్యం చూసిన దైవప్రవక్త ﷺ మందలిస్తున్న వారినే మందలించి, మూత్ర విసర్జనను మధ్యలో అడ్డుకొనకుండా ఉండేలా ప్రయత్నించారు. ఎందుకంటే మూత్ర విసర్జనను మధ్యలో ఆపటం వల్ల పురుషుని పురుషాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా చేయటం వల్ల ఒక్కోసారి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అదీగాక మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని మధ్యలో హడావిడి చేసి ఆపినట్లయితే, అతను అక్కడినుండి లేచి మరోచోటకు వెళతాడు. ఆ కంగారులో మూత్రపు బొట్టు అతని లుంగీపై పడవచ్చు, లేదా మూత్రం ధారాపాతంగా ప్రవహించి మస్జిదులోని ఇతరచోట్ల కూడా అశుద్ధత వ్యాపించవచ్చు. అందుకే మహాప్రవక్త ﷺ ఆ సమయంలో సమయోచితంగా స్పందించి గొడవ చేసే జనులను తొలుత శాంతింపజేశారు. ఆ తరువాత బొక్కెన నీరు తెప్పించి మూత్రం పోయబడిన అశుద్ధ స్థలంపై కుమ్మరించారు. దాంతో ఆ అశుద్ధత కాస్తా దూరమైపోయింది.

‘తిర్మిజీ’లో కూడా ఈ హదీసు హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ద్వారా సరిగ్గా ఇలాగే విశదీకరించబడింది. తిర్మిజీలో దీని నిజ నిర్ధారణ కూడా జరిగింది. ఈ హదీసు ద్వారా మనిషి మూత్రం అశుద్ధమైనదని రూఢీ అవుతోంది. ఈ విషయంపై ముస్లిం సమాజంలో ఏకాభిప్రాయం ఉంది. నేల ఒకవేళ అశుద్ధమైనదయితే నీళ్ళ ద్వారా అది పరిశుభ్రమవుతుందని కూడా ఈ అంశాన్నిబట్టి వెల్లడవుతోంది. ఈ హదీసు ద్వారా వెల్లడయ్యే మరికొన్ని ముఖ్యాంశాలు : మస్జిద్ ఔన్నత్యాన్ని కాపాడటం, అవివేకి అయిన వ్యక్తిపట్ల మృదువుగా వ్యవహరించటం, కరకుగా వ్యవహరించకపోవటం, సమయోచితంగా వ్యవహరించి దైవప్రవక్త ﷺ సమస్యను ఉత్తమ రీతిలో పరిష్కరించటం – ఇత్యాది విషయాలు అనుసరణీయమైనవి.

హదీసు ఉల్లేఖకులు

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ గారి ప్రత్యేక సేవకులు. ఆయన తల్లి ఉమ్మె సులైమ్ ఆయన్ని బాల్యంలోనే దైవప్రవక్త ﷺ గారి సేవకై అంకితం చేశారు. చివరి క్షణాల వరకూ ఈయన దైవప్రవక్త ﷺ సేవలో నిమగ్నులై ఉన్నారు. అబూ హమ్జా (రదియల్లాహు అన్హు) ఈయనకు గల మరో పేరు. ఖజ్రజ్ తెగకు చెందిన ‘నజ్జార్’ వర్గానికి చెందినవారు. ఈ కారణంగా ఈయన నజ్జారీ ఖజ్రజీ అని కూడా పిలువబడేవారు. హిజ్రీ 91లో పరమపదించారు. బస్రాలో ఈయన అంత్యక్రియలు జరిగాయి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 10

11

హదీసు 11

وَعَنْ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ أُحِلَّتْ لَنَا مَيْتَتَانِ وَدَمَانِ, فَأَمَّا الْمَيْتَتَانِ: فَالْجَرَادُ وَالْحُوتُ, وَأَمَّا الدَّمَانُ: فَالْكَبِدُ وَالطِّحَالُ } أَخْرَجَهُ أَحْمَدُ, وَابْنُ مَاجَهْ, وَفِيهِ ضَعْفٌ.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: దైవప్రవక్త ﷺ ప్రవచించారు – “రెండు రకాల మృత వస్తువులు (జంతువులు) మరియు రెండు రక్తాలు మన కొరకు హలాల్ (ధర్మ సమ్మతం) గావించబడ్డాయి. (జిబహ్ చేయబడని) ఆ రెండు వస్తువులలో ఒకటి: మిడుత, రెండవది: చేప. మిగిలిన రెండు రక్తాలలో ఒకటి : కాలేయం, రెండవది: గుల్మము” (అహ్మద్, ఇబ్నె మాజ దీనిని ఉల్లేఖించారు. ఇందులో కొంత బలహీనత కానవస్తుంది).

English

Narrated Ibn 'Umar (rad): Allah’s Messenger (ﷺ) said: "Two types of dead animals and two types of bloods have been made lawful for us, the two types of dead animals are locusts and fish (seafood), while the two types of bloods are the liver and the spleen". [Reported by Ahmad and Ibn Majah, and this Hadith has some weakness.]

సారాంశం

‘మిడుత’ ఎట్టి పరిస్థితిలోనూ హలాల్ (ధర్మ సమ్మతం) అని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. అది సహజ మరణం పొందినా లేక వేరితర కారణంగా మరణించినా దానిని తినటంలో ఎలాంటి ఆక్షేపణ లేదు. మిడుతను మనిషి వేటాడటం వల్ల గానీ, తల తెగటం వల్లగానీ మరణిస్తే హలాల్ అవుతుందనీ, ఇతరత్రా కారణాల వల్ల మరణిస్తే హలాల్ కాజాలదని ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు. చేప విషయంలోనూ అంతే. దాన్ని పట్టుకునే సమయంలో అది మరణించినా, సముద్రపు అలల తాకిడికి తట్టుకోలేక బయటపడి మరణించినా – రెండు పరిస్థితులలోనూ అది ధర్మసమ్మతమే. హనఫీ శాస్త్రం ప్రకారం పై రెండు పరిస్థితుల్లోను చేప ధర్మ సమ్మతమే గానీ, ఒకవేళ చేప దానంతట అదే మరణిస్తే లేక ఏదైనా జంతువు వాతన పడి మరణిస్తే మట్టుకు ధర్మ సమ్మతం కాదు, అది నిషిద్ధం.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 11

12

హదీసు 12

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ إِذَا وَقَعَ اَلذُّبَابُ فِي شَرَابِ أَحَدِكُمْ فَلْيَغْمِسْهُ, ثُمَّ لِيَنْزِعْهُ, فَإِنَّ فِي أَحَدِ جَنَاحَيْهِ دَاءً, وَفِي اَلْآخَرِ شِفَاءً } أَخْرَجَهُ اَلْبُخَارِيُّ. وَأَبُو دَاوُدَ, وَزَادَ: { وَإِنَّهُ يَتَّقِي بِجَنَاحِهِ اَلَّذِي فِيهِ اَلدَّاءُ }.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీరు త్రాగే పానీయాలలో ఎప్పుడయినా ఈగ గనక పడితే దాన్ని అందులో ముంచి మరీ తీయాలి. ఎందుకంటే దానికి చెందిన ఒక రెక్కలో రోగం (రోగ క్రిములు) ఉండగా రెండవ రెక్కలో రోగ నివారణ ఉంది” (దీనిని బుఖారీ, అబూ దావూద్‌లు ఉల్లేఖించారు). అబూ దావూద్‌లోని ఉల్లేఖనంలో ఒక వాక్యం అదనంగా ఉంది. అది : “ఈగ పానీయంపై వాలినపుడు వ్యాధిక్రిములు వున్న రెక్కనే అందులో ముంచుతుంది.”

English

Narrated Abu Huraira (rad): Allah’s Messenger (ﷺ) said: “When a fly falls in the drink of one of you, he should fully dip it and then throw it away because there is disease in one of its wings and cure in the other”. [Reported by Al-Bukhari]

and Abu Da’ud who added: “It (the fly) protects itself with the diseased wing (by dipping it first in a drink).

సారాంశం

అంటే ఈగ తనను సురక్షితంగా ఉంచుకునే ఉద్దేశ్యంతో వ్యాధి నివారణతో కూడుకున్న రెక్కను నీళ్ళలో ముంచకుండా జాగ్రత్తపడుతుంది. ఇమామ్ అహ్మద్ (రదియల్లాహు అన్హు), ఇబ్నె మాజ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయంలో ఈగ తన విషపూరితమయిన రెక్కను ముందు వైపు, వ్యాధి నివారణకు ఉద్దేశించిన రెక్కను వెనుకవైపు ఉంచుతుంది. ఈగను ఆ పానీయంలో ముంచి తీయటం వల్ల అది రోగానికి విరుగుడు అవుతుంది. మొదటి రెక్క ద్వారా సోకిన విషపూరిత క్రిములు రెండవ రెక్క యొక్క చికిత్స ద్వారా నిర్వీర్యమవుతాయి.

ఈ హదీసు ద్వారా అవగతమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే ఈగ గనక ఏదైనా ద్రవపదార్థంలో పడి చచ్చిపోయినంత మాత్రాన అది అశుద్ధం కాబోదు. దీనిద్వారా మరో ఆదేశం కూడా వెలికి తీయబడింది. అదేమంటే ప్రసరించే రక్తమే లేని కీటకాలు, ఉదాహరణకు : తేనెటీగ, గండు చీమ, వాటిని పోలిన ఇతరత్రా కీటకాలు గనక పానీయాలలోనూ, ప్రవహించే వాటిలోనూ పడి చచ్చిపోతే ఆ మాత్రానికే అది అశుద్ధమైపోదు. ఎందుకంటే ఇటువంటి వాటి శరీరంలో రక్తం ఉండదు. ఏదైనా వస్తువు అశుద్ధం అవడానికి రక్తస్రావం ప్రధాన కారణం అయి ఉంటుంది.

ఈ హదీసు వల్ల తేటతెల్లమయ్యే మరొక విషయం ఏమిటంటే, నష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ఈగను చంపటం సమ్మతమే. అంతేగాని తగు కారణం ఏదీ లేకుండా చంపటం వాంఛనీయం ఎంతమాత్రం కాదు. సాధారణంగా ఈగ వేడి ద్రవపదార్థంలో పడగానే చచ్చిపోతుంది. ఒక్కోసారి చల్లని పానీయాలలో ముంచినా అది చనిపోతుంది. మనం త్రాగే ఏ పదార్థంలో ఈగ పడిపోయినా అది అపవిత్రం, అశుద్ధం కాజాలదు. అట్టి పరిస్థితిలో మనం దానిని ఆ పదార్థంలో ముంచి మరీ బయట పారవేయాలి.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 12

13

హదీసు 13

وَعَنْ أَبِي وَاقِدٍ اَللَّيْثِيِّ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-{ مَا قُطِعَ مِنْ اَلْبَهِيمَةِ ‏-وَهِيَ حَيَّةٌ‏- فَهُوَ مَيِّتٌ } أَخْرَجَهُ أَبُو دَاوُدَ, وَاَلتِّرْمِذِيُّ وَحَسَّنَهُ, وَاللَّفْظُ لَهُ.

దైవప్రవక్త ﷺ ప్రబోధించారని హజ్రత్ అబూ వాఖిద్ లైసీ (రదియల్లాహు అన్హు) తెలిపారు : “బ్రతికి ఉన్న పశువులలో నుంచి ఏ భాగం కోసుకున్నా అది మృత భాగమే అవుతుంది.” (దీనిని అబూ దావూద్, తిర్మిజీలు ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని హసన్‌గా ఖరారు చేశారు).

English

Narrated Abu Waqid Al-Laithi (rad): Allah’s Messenger (ﷺ) said: “Whatever (portion) is cut off from an animal when it is alive is dead (meat). [Reported by Abu Da’ud and At-Tirmidhi who graded it Hasan (fair) and this version is of Tirmidhi].

సారాంశం

పూర్వం అజ్ఞానం ఆవరించిన అరబ్బులు బ్రతికి ఉన్న పశువులలో నుంచి కొంత మాంసాన్ని కోసుకుని తినేవారు. ఈ హదీసు క్రూరాతిక్రూరమైన ఆ చేష్టను ఖండిస్తూ, అది మృత పశువు మాంసంతో సమానమని చెప్పింది. మృత పశువు మాంసం హరామ్ (నిషిద్ధం) అన్నది గమనార్హం.

హదీసు ఉల్లేఖకులు

ఈ హదీసును ఉల్లేఖించిన వారు అబూ వాఖిద్ లైసీ. అబూ వాఖిద్ మారు పేరు. అసలు పేరు హారిస్ బిన్ ఔఫ్. బనీ ఆమిర్ బిన్ లైస్‌కు చెందిన వారవటం చేత లైసీగా పిలువబడేవారు. తొలి కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. మదీనా వాసులు. కాని తన చివరి కాలంలో మక్కాలో స్థిరపడ్డారు. బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారని భావించబడుతోంది. హిజ్రీ 65 లేక 67వ యేట మరణించారు.

హదీసు మకరందం (బులూఘ్ అల్ మరామ్)|1. శుచీ శుభ్రతల పుస్తకం|1.1 నీళ్ళ రకాలు|హదీసు 13