హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 87వ అధ్యాయం: మంచి అలవాట్లను కొనసాగించాలి. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 692) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
87. మంచి అలవాట్లను కొనసాగించాలి
باب الأمر بالمحافظة عَلَى مَا اعتاده من الخير
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{إِنَّ اللَّهَ لاَ يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّى يُغَيِّرُوا مَا بِأَنْفُسِهِمْ} [الرعد: ١١]
"యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు." (అర్రాద్ : 11)
{وَلا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِنْ بَعْدِ قُوَّةٍ أَنْكَاثاً} [النحل: ٩٢]
"స్వయంగా తాను శ్రమతో నూలు వడికి, తరువాత తానే దానిని ముక్కలు ముక్కలుగా చేసిన స్త్రీ స్థితిలాగా మీ పరిస్థితి కాకూడదు." (అన్ నహ్ల్ : 92)
{وَلا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ} [الحديد: ١٦]
"పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా విశ్వాసులు మారిపోకూడదు. ఒక సుదీర్ఘ కాలం వారిపై గడిచిపోయింది. అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి." (అల్ హదీద్ : 16)
{فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا} [الحديد: ٢٧]
"వారు దానిని పాటించే విషయంలో న్యాయం చేకూర్చలేకపోయారు." (అల్ హదీద్ : 27)
వివరణ
అల్లాహ్ మానవులకు రాజ్యం, అధికారం, సిరిసంపదలు, గౌరవమర్యాదలు లాంటి అనుగ్రహాలు ప్రసాదించి పరీక్షిస్తాడు. అందుకు వారు కృతజ్ఞతలు తెలుపుకుంటే వారికి మరిన్ని అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. అదే కృతఘ్నతా వైఖరికి పాల్పడితే ఇచ్చిన వరాలను కూడా లాక్కుంటాడు – ఇది మొదటి సూక్తికి భావం. రెండవ సూక్తిలో మంచిమార్గాన్ని వదలి చెడు మార్గాన్ని అవలంబించటాన్ని ఎంతో శ్రమతో నూలువడికి తర్వాత స్వయంగా దానిని ముక్కలు ముక్కలుగా చేసే ఉదాహరణతో పోల్చిచెప్పటం జరిగింది. మూడో సూక్తిలో ప్రత్యేకంగా విశ్వాసులను గ్రంథవహుల పోకడలకు దూరంగా ఉండమని హితబోధచేయటం జరిగింది. గ్రంథవహులంటే యూదులు, క్రైస్తవులు, దైవగ్రంథం అవతరింపజేయబడినవారు. వీరు ముందు దైవాదేశాలను పాటించారు. కాని కొంతకాలం తర్వాత ప్రాపంచిక సుఖాలకు దాసులయిపోయి దైవాదేశాలను నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వారి హృదయాలు కఠినమైపోయాయి. వారిలో చాలామంది అవిధేయులయ్యారు. నాల్గవ సూక్తిలో కూడా వీరి గురించే చెప్పబడింది. వీరు ధర్మంలో లేని వేదాంతమార్గాన్ని స్వయంగా సృష్టించుకున్నారు. తర్వాత దాన్ని పాటించనూ లేకపోయారు.
మొత్తానికి పై సూక్తుల ద్వారా చెప్పొచ్చేదేమిటంటే మనిషి పుణ్యప్రదమైన మార్గాన్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. మధ్యలో దాన్ని వదలిపెట్టడం చాలా ప్రమాదకరం.
English
“Verily, Allah will not change the (good) condition of a people as long as they do not change their state (of goodness) themselves (by committing sins and by being ungrateful and disobedient to Allah).” [Ar-Ra‘d 13:11]
“And be not like her who undoes the thread which she has spun, after it has become strong.” [An-Naḥl 16:92]
“… lest they become as those who received the Scripture [the Taurat (Torah) and the Injeel (Gospel)] before (i.e., Jews and Christians), and the term was prolonged for them and so their hearts were hardened?” [Al-Ḥadīd 57:16]
“But that they did not observe it with the right observance.” [Al-Ḥadīd 57:27]
హదీసు 692
وعن عبد اللَّه بن عمرو بن العاص رضي اللَّه عنهما قَالَ: قَالَ لي رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: يَا عبْدَ اللَّه، لاَ تَكُنْ مِثل فُلانٍ، كَانَ يقُوم اللَّيْلَ فَترَك قيَامَ اللَّيْل،" متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ నన్ను సంబోధిస్తూ, "ఓ అబ్దుల్లాహ్! ఫలానా వానిలా అయిపోమాకు. అతను రాత్రిళ్ళు నిద్రలేచి ఆరాధన చేసేవాడు. ఆ తర్వాత అతను నిద్రలేవటం మానుకున్నాడు" అని అన్నారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said to me, “O `Abdullah! Do not be like so-and-so; he used to get up at night for optional prayer but abandoned it later.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనిషి ఏదయినా మంచిపని చేయటం ప్రారంభిస్తే దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. మధ్యలో ఆ పనిని మానుకోకూడదు. మంచి పనుల్ని మధ్యలోనే విరమించుకునే మనిషి తనకు తెలియకుండానే చెడు వైపునకు మ్రొగ్గే ప్రమాదముంది. ఆరంభించిన మంచి పనిని స్థయిర్యంతో, నిలకడగా కొనసాగించటంలోనే మనిషి విజయం, క్షేమం దాగి ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సంస్కార ప్రకరణం|87. మంచి అలవాట్లను కొనసాగించాలి|హదీసు 692
You must be logged in to post a comment.