హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 8వ అధ్యాయం: నిలకడ, స్థయిర్యము. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 85 – 86) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
8. నిలకడ, స్థయిర్యము
باب الاستِقامة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{فَاسْتَقِمْ كَمَا أُمِرْتَ} [هود: ١١٢]
అల్లాహ్ సెలవిచ్చాడు : "ఓ ప్రవక్తా! నీవూ, (అవిశ్వాసం, తిరుగుబాటుల నుండి విశ్వాసం, విధేయతల వైపుకు) మరలివచ్చిన నీ సహచరులూ నీకు ఆజ్ఞాపించిన విధంగా ఋజు మార్గంపై స్థిరంగా ఉండండి." (హూద్ : 112)
{إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلائِكَةُ أَلاَّ تَخَافُوا وَلا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنْتُمْ تُوعَدُونَ نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنْفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ نُزُلاً مِنْ غَفُورٍ رَحِيمٍ} [فصلت: ٣٠،٣١،٣٢]
మరొకచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "అల్లాహ్‌యే మా ప్రభువు అని పలికి ఆ మాట మీదనే స్థిరంగా నిలబడే వారి కోసం దైవ దూతలు అవతరించి, "భయపడకండి, బాధ పడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభవార్తను విని ఆనందించండి. మేము ఈ ప్రాపంచిక జీవితంలో కూడ మీకు సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడ. అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది. మీరు ఆశించే ప్రతివస్తువూ మీదవుతుంది. ఇవీ మీకు లభించే ఆతిథ్యపు ఏర్పాట్లు, క్షమాశీలుడూ, కరుణామయుడూ అయిన దేవుని వైపు నుండి" అని అంటారు. (హామీమ్ అస్ సజ్దహ్ : 30 – 32)
{إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا فَلا خَوْفٌ عَلَيْهِمْ وَلا هُمْ يَحْزَنُونَ أُولَئِكَ أَصْحَابُ الْجَنَّةِ خَالِدِينَ فِيهَا جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ} [الأحقاف: ١٣،١٤]
ఇంకొకచోట ఇలా సెలవీయబడింది : "నిశ్చయంగా అల్లాహ్‌యే మా ప్రభువు అని ప్రకటించి, దానిపై స్థిరంగా ఉండిపోయిన వారికి ఏ భయమూ లేదు, వారు దుఃఖించడమూ జరగదు. అలాంటి వారే స్వర్గానికి పోయేవారు. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. ప్రపంచంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా." (అల్ అహ్‌ఖాఫ్ : 13-14)
English
“So stand (ask Allah to make) you (Muhammad ﷺ) firm and straight (on the religion of Islamic Monotheism) as you are commanded…” [Hūd 11:112]
“Verily, those who say: `Our Rubb is Allah (Alone),’ and then they stand firm, on them the angels will descend (at the time of their death) (saying): ‘Fear not, nor grieve! But receive the glad tidings of Jannah which you have been promised! We have been your friends in the life of this world and are (so) in the Hereafter. Therein you shall have (all) that your inner-selves desire, and therein you shall have (all) for which you ask. An entertainment from (Allah), the Oft-Forgiving, Most Merciful.”’ [Fuṣṣilat 41:30–32]
“Verily, those who say: `Our Rubb is (only) Allah,’ and thereafter stand firm and straight (on the Islamic Faith of Monotheism), on them shall be no fear, nor shall they grieve. Such shall be the dwellers of Jannah, abiding therein (forever), – a reward for what they used to do.” [Al-Aḥqāf 46:13–14]
హదీసు 85
وَعَنْ أبي عمرو، وقيل أبي عمْرة سُفْيانَ بنِ عبد اللَّه رضي اللَّه عنه قَالَ: قُلْتُ: يَا رَسُول اللَّهِ قُلْ لِي في الإِسلامِ قَولاً لاَ أَسْأَلُ عنْه أَحداً غيْركَ. قَالَ:"قُلْ: آمَنْت باللَّهِ: ثُمَّ اسْتَقِمْ " رواه مسلم.
హజ్రత్ అబూ అమ్ర్ (కొందరి అభిప్రాయం ప్రకారం అబూ అమ్ర్ సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ – రజి) కథనం: నేను దైవప్రవక్తను "నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి. (అయితే) దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకళ్ళని అడగవలసిన అవసరం రాకూడదు" అని అడిగాను. దానికి ఆయన "నేను అల్లాహ్‌ను నమ్ముతున్నాను అని చెప్పు. తరువాత ఆ మాటపైనే నిలకడగా ఉండు" అని ఉపదేశించారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం)
English
Sufyan bin `Abdullah (radiyallahu anhu) reported: I said, “O Messenger of Allah, tell me something of Islam which I will not ask anyone else about it.” He ﷺ said, “Say, `I believe in Allah’ and then be steadfast”.[Muslim].
ముఖ్యాంశాలు
స్థయిర్యాన్ని, (ఇస్తిఖామత్ను) ప్రదర్శించడమంటే ఇస్లాం ధర్మంలోని నిషేధాలను అమలుపరచడంలో నిలకడగా ఉండటం. దైవాజ్ఞల్ని, విధులను, దైవప్రవక్త సంప్రదాయాలను, పుణ్యకార్యాలను నిర్వర్తించడంతో పాటు దేవుని నిషేధాజ్ఞలకు, వారింపులకు దూరంగా ఉండటాన్నే 'ఇస్తిఖామత్' అంటారు. ఒట్టి నోటిమాటలను విశ్వాసం (ఈమాన్)గా పరిగణించడం జరగదు. విశ్వాసంతోపాటు ఆచరణ ఉంటేనే అది నిజమైన విశ్వాసంగా భావించబడుతుంది. ఎందుకంటే ఆచరణే విశ్వాసానికి ఫలితం. పండ్లు కాయని చెట్టు నిష్ప్రయోజనకరమైనట్లే ఆచరణ లేని విశ్వాసం (ఈమాన్) నిరర్థకం అవుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|8. నిలకడ, స్థయిర్యము|హదీసు 85
హదీసు 86
وعنْ أبي هُريْرة رضي اللَّه عنه: قَالَ قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "قَارِبُوا وسدِّدُوا، واعْلَمُوا أَنَّه لَنْ ينْجُو أحدٌ منْكُمْ بعملهِ"قَالوا: وَلا أنْت يَا رسُولَ اللَّه؟ قَالَ:"وَلاَ أَنَا إلاَّ أنْ يتَغَمَّدني اللَّه برَحْمةٍ منْه وَفضْلٍ "رواه مسلم. وَ"الْمُقارَبةُ": الْقَصْدُ الَّذي لا غلُوَّ فِيهِ وَلاَ تقْصيرَ. وَ"السَّدادُ": الاسْتقَامةُ وَالإِصابةُ، وَ"يتَغَمَّدني"يُلْبسُني ويَسْتُرني. قالَ الْعُلَمَاءُ: معنَى الاستقَامَةِ: لُزومُ طَاعِة اللَّهِ تَعالى، قالُوا: وَهِي مِنْ جوامِعِ الْكلِم، وهِيَ نِظَامُ الأمُورِ، وباللَّه التَّوفيق.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మధ్యేమార్గాన్ని అనుసరించండి. (వ్యవహారాల్లో నిలకడగా) ఖచ్చితంగా ఉండండి. మీలో ఎవరూ (కేవలం) తమ ఆచరణ ఆధారంగానే ముక్తిపొందలేరని తెలుసుకోండి!"
అందుకు సహచరులు "దైవప్రవక్తా! మీరు కూడానా?" అని సందేహపడగా, దానికి ఆయన "అవును, నేను కూడా (కేవలం నా ఆచరణ ఆధారంగా ముక్తి పొందలేను) అల్లాహ్ నన్ను తన కరుణా కటాక్షాలతో ముంచివేస్తే తప్ప" అని బదులిచ్చారు. (ముస్లిం)
'ముఖారబ' అంటే మధ్యేమార్గం. అతివాదానికి, మరీ మితవాదానికి మధ్య ఉండేమార్గం. 'అస్సదాద్' అంటే నిలకడ, సూటిదనం. 'యతగమ్మదనీ' అంటే 'నన్ను తొడుక్కుంటే' లేక 'నన్ను కప్పుకుంటే' అని అర్థం.
విద్వాంసులు ఇలా అభిప్రాయపడ్డారు: స్థయిర్యం (ఇస్తిఖామత్) అంటే సదా దైవవిధేయతకు కట్టుబడి ఉండటం. ఇంకా పండితులు ఇలా అన్నారు : ఈ హదీసు వాక్యాలు 'జవామివుల్ కలిమ్' (సమగ్రమైన వచనాల)లోనివి. (అంటే పదాలు క్లుప్తంగా, భావగర్భితంగా ఉంటాయి.) అంతేకాదు, ఈ హదీసు వ్యవహార సరళిని సూచిస్తోంది. వబిల్లాహిత్తౌఫీఖ్.
(సహీహ్ ముస్లింలోని 'కపటుల' ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Follow the Right Path of Faith strictly, and be steadfast; and keep in mind that none of you can achieve salvation through his (good) actions.” Someone asked, “Not even you, O Messenger of Allah?” He ﷺ said, “Not even me, unless Allah grants me His Mercy and Grace”.[Muslim].
ముఖ్యాంశాలు
విశ్వాసం (ఈమాన్)తో పాటు ఆచరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట వాస్తవమే! కాని కేవలం తాము చేసుకున్న సత్కర్మలు, సదాచరణలతోనే ముక్తి లభిస్తుందనీ, దాని ఆధారంగానే స్వర్గంలోకి ప్రవేశించగలమని భావించడం కూడా సరికాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆచరణలోని లోపాలవల్ల మన ఆచరణ దైవసన్నిధిలో స్వీకార భాగ్యాన్ని పొందలేకపోవచ్చు. అప్పుడు అలాంటి ఆచరణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కాబట్టి మనిషి ఒక వైపు సదాచరణ చేస్తూనే మరోవైపు దైవ సన్నిధిలో తన ఆచరణ స్వీకృతిని పొందాలని, దేవుడు తన్ను తన కారుణ్య ఛాయల్లోకి తీసుకోవాలని, తను చేసే ప్రతి మంచిపనిలోనూ చిత్తశుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉండాలి. అయితే దైవప్రసన్నతను బడయటానికి ఏకైక మార్గం కూడా సదాచరణేనన్న సంగతిని మరువకూడదు సుమా!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|8. నిలకడ, స్థయిర్యము|హదీసు 86
You must be logged in to post a comment.