హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 42వ అధ్యాయం: తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్లా, ఆదరణీయులగు పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా మసలుకోవటం. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 343 – 346) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
42. తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్లా, ఆదరణీయులగు పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా మసలుకోవటం
باب فضل بر أصدقاء الأب والأم والأقارب والزوجة وسائر من يندب إكرامه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 343
عن ابن عمر رضي اللَّه عنهما أَن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِن أَبرَّ البرِّ أَنْ يصِلَ الرَّجُلُ وُدَّأَبِيهِ". وعن عبدِ اللَّهِ بن دينارٍ عن عبد اللَّه بن عمر رضي اللَّه عنهما أَنَّ رجُلاً مِنَ الأَعْرابِ لقِيهُ بِطرِيق مكَّة، فَسلَّم عَليْهِ عَبْدُ اللَّه بْنُ عُمرَ، وحملهُ عَلَى حمارٍ كَانَ يرْكَبُهُ، وأَعْطَاهُ عِمامةً كانتْ عَلَى رأْسِهِ، قَالَ ابنُ دِينَارٍ: فقُلنا لهُ: أَصْلَحكَ اللَّه إِنَّهمْ الأَعْرابُ وهُمْ يرْضَوْنَ بِاليسِيرِ. فَقَالَ عبدُ اللَّه بنُ عمر: إِنَّ أَبَا هَذَا كَان وُدّاً لِعُمَرَ بنِ الخطاب رضي اللَّه عنه، وإِنِّي سمِعْتُ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول:"إِنَّ أَبرَّ البِرِّ صِلةُ الرَّجُلِ أَهْلَ وُدِّ أَبِيهِ". وفي روايةٍ عن ابن دينار عن ابن عُمَر أَنَّهُ كَانَ إِذا خَرَجَ إِلَى مَكَّةَ كَانَ لَهُ حِمارٌ يَتَروَّحُ عليْهِ إِذَا ملَّ رُكُوب الرَّاحِلَةِ، وعِمامةٌ يشُدُّ بِها رأْسهُ، فَبيْنَا هُو يوْما عَلَى ذلِكَ الحِمَارِ إذْ مَرَّ بِهِ أَعْرابيٌّ، فَقَالَ: أَلَسْتَ فُلانَ بْنَ فُلانٍ؟ قَالَ: بلَى: فَأَعْطَاهُ الحِمَارَ، فَقَالَ: ارْكَبْ هَذَا، وأَعْطاهُ العِمامةَ وَقالَ: اشْدُدْ بِهَا رأْسَكَ، فَقَالَ لَهُ بَعْضُ أَصْحابِهِ: غَفَر اللَّه لَكَ، أَعْطَيْتَ هذَا الأَعْرابيِّ حِماراً كنْتَ تَروَّحُ عليْهِ، وعِمامَةً كُنْتَ تشُدُّ بِهَا رأْسَكَ؟ فَقَالَ: إِنِّي سَمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُقولُ: "إِنْ مِنْ أَبَرِّ البِرِّ أَنْ يَصِلَ الرَّجُلُ أَهْلَ وُدِّ أَبِيهِ بَعْد أَنْ يُولِّي" وإِنَّ أَبَاهُ كَانَ صَدِيقاً لِعُمر رضي اللَّه عنه، روى هذِهِ الرِّواياتِ كُلَّهَا مسلم.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు :
"మనిషి తన తండ్రి స్నేహితులతో సత్సంబంధాలు పెట్టుకోవటం అత్యుత్తమ సత్కార్యం.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్) అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) నుండి చేసిన కథనం : మక్కా వెళ్ళేదారిలో ఆయనకు ఒక పల్లెటూరి వ్యక్తి కలిశాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఆ వ్యక్తికి సలాం చేసి తాను ఎక్కి వెళుతున్న గాడిదపై ఆ వ్యక్తిని కూడా కూర్చోపెట్టుకున్నారు. ఇంకా తల పాగాను కూడా ఆ వ్యక్తికే తొడిగించారు.
హదీసు ఉల్లేఖకులు అబ్దుల్లాహ్ బిన్ దీనార్ ఇలా తెలియజేస్తున్నారు : అది చూసి మేము అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌తో "దేవుడు మీకు మేలు చేయుగాక! వీళ్ళు పల్లెటూరి మనుషులు. అతి సామాన్య వస్తువులకే ఎంతగానో సంబరపడిపోయే రకాలు. (అలాంటి వ్యక్తికి మీరు ఇంత మర్యాద చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది?!)" అని అడిగాము. అందుకాయన "ఇతని తండ్రి (మా నాన్న) ఉమర్ బిన్ ఖత్తాబ్‌కు స్నేహితుడు. 'మనిషి తన తండ్రి మిత్రులతో సత్సంబంధాలు పెట్టుకోవటం ఎంతో గొప్ప పుణ్యకార్యమ'ని దైవప్రవక్త ﷺ చెబుతుండగా నేను విన్నాను. (అందుకే నేను ఈ వ్యక్తిని గౌరవిస్తు న్నాను)" అని చెప్పారు.
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) మక్కా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒంటెపై ప్రయాణించి విసుగెత్తి పోయినప్పుడు ఆయన గాడిదపై ప్రయాణించి కాస్త విశ్రాంతి తీసుకునేవారు. ఇంకా ఆయన దగ్గర ఓ తలపాగా కూడా ఉండేది. దాన్ని ఆయన తలకు కట్టుకునేవారు. ఒకరోజు ఆయన తన గాడిదపై ప్రయాణిస్తుండగా ఆయనకు ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఆయన అతన్ని, "నువ్వు ఫలానావాని కొడుకువి కదూ!?" అని అడిగారు. దానికతను, "అవును, ఆయన కొడుకునే" అని సమాధానమిచ్చాడు. ఆయన ఆ వ్యక్తికి తన గాడిద ఇచ్చి "నువ్వు దీనిపై ఎక్కి వెళ్ళు" అని అన్నారు. ఆ తరువాత తలపాగా కూడా ఇస్తూ, "దీన్ని నీ తలకు కట్టుకో" అని అన్నారు.
అది చూసి ఆయన స్నేహితులు కొందరు ఆశ్చర్యచకితులయి, "దేవుడు మిమ్మల్ని మన్నించుగాక! మీరు విశ్రాంతి కోసం ఉపయోగించే గాడిదను, ఆఖరికి మీరు ధరించివున్న తల పాగాను కూడా ఈ పల్లెటూరి వ్యక్తికి ఇచ్చేశారేమిటి?" అని అడిగారు. అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా సమాధానమిచ్చారు :
'మనిషి తన తండ్రి మరణానంతరం అతని మిత్రులతో సత్సంబంధాలు పెట్టుకోవటం ఎంతో గొప్ప పుణ్యకార్యమ'ని దైవప్రవక్త ﷺ చెబుతుండగా నేను విన్నాను. ఇతని తండ్రి (మా నాన్న) ఉమర్‌కు స్నేహితుడు. (అందుకే నేనితనికి మర్యాద ఇస్తున్నాను)."
(ఈ ఉల్లేఖనాలన్నీ ముస్లింవి)
(సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణం)
English
`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “The finest act of goodness is that a person should treat kindly the loved ones of his father”.[Muslim].
`Abdullah bin Dinar reported: `Abdullah bin `Umar (radiyallahu anhuma) met a bedouin on his way to Makkah, he greeted him, offered him to mount the donkey he was riding and gave him the turban he was wearing on his head. Ibn Dinar said to him: “May Allah make you pious! Bedouins can be satisfied with anything you give them (i.e., what you have given the bedouin is too much). Upon this, `Abdullah bin `Umar said, the father of this man was one of `Umar’s friends whom he loved best, and I heard Messenger of Allah saying, “The finest act of goodness is the good treatment of someone whom one’s father loves”.
Another narration goes: When `Abdullah bin `Umar (radiyallahu anhuma) set out to Makkah, he kept a donkey with him to ride when he would get tired from the riding of the camel, and had a turban which he tied round his head. One day, as he was riding the donkey, a bedouin happened to pass by him. He (`Abdullah bin `Umar) said, “Aren’t you so-and-so?” The bedouin said, “Yes”. He (`Abdullah bin `Umar) gave him his donkey and his turban and said, “Ride this donkey, and tie this turban round your head”. Some of his companions said, “May Allah forgive you, you gave to this bedouin the donkey which you enjoyed to ride for change, and the turban which you tied round your head”.`Abdullah bin `Umar said,”I heard Messenger of Allah ﷺ saying, `The finest act of goodness is the kind treatment of a person to the loved ones of his father after his death,‘ and the father of this person was a friend of `Umar (radiyallahu anhu).[Muslim].
ముఖ్యాంశాలు
తల్లిదండ్రుల మరణానంతరం వారి మిత్రులతో సత్సంబంధాలను కొనసాగించటం, వారి పట్ల మంచిగా మెలగటం అవసరం. ఇలా చేయటం గొప్ప పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. దీనికి విరుద్ధంగా తల్లిదండ్రులు మరణించిన తరువాత వారి బంధుమిత్రుల్ని విస్మరించటం, వారితో సంబంధాలు కొనసాగించకపోవటం షరీఅత్ దృష్టిలో ఎంతో అవాంఛనీయమైన చేష్ట అనిపించుకుంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|42. తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్లా, ఆదరణీయులగు పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా మసలుకోవటం|హదీసు 343
హదీసు 344
وعن أَبي أُسَيْد بضم الهمزة وفتح السين مالكِ بنِ ربِيعَةَ السَّاعِدِيِّ رضي اللَّه عنه قَالَ: بَيْنا نَحْنُ جُلُوسٌ عِنْدَ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إذ جاءَهُ رجُلٌ مِنْ بني سَلَمة فقالَ: يارسولَ اللَّه هَلْ بَقِيَ مِن بِرِّ أَبويَّ شىءٌ أَبرُّهُمَا بِهِ بَعدَ مَوْتِهِمَا؟ فَقَالَ: "نَعَمْ، الصَّلاَة علَيْهِمَا، والاسْتِغْفَارُ لَهُما، وإِنْفاذُ عَهْدِهِما مِنْ بَعْدِهِما، وصِلةُ الرَّحِمِ الَّتي لا تُوصَلُ إِلاَّ بِهِمَا، وإِكَرَامُ صَدِيقهما" رواه أَبُو داود.
హజ్రత్ అబూ ఉసైద్ మాలిక్ బిన్ రబీయా సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి మేము దైవప్రవక్త ﷺ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బనూ సలమా తెగకు చెందిన ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మరణించిన తరువాత కూడా నేను వారికి చేయగల సేవ ఏదైనా మిగిలి ఉంటుందా?" అని అడిగాడు. దానికి, "అవును, ఉంటుంది. వారి కోసం ప్రార్థిస్తూ ఉండటం, వారి మన్నింపు కోసం వేడుకోవటం, వారి తదనంతరం వారి ప్రమాణాలను పూర్తి చేయటం, కేవలం వారి ద్వారానే కలిసే బంధుత్వాలను కలపటం, వారి స్నేహితులను గౌరవించటం" అని ఆయన సమాధానమిచ్చారు. (అబూ దావూద్)
(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం)
English
Abu Usaid Malik bin Rabi`ah As-Sa`idi (radiyallahu anhu) reported: We were sitting with Messenger of Allah ﷺ when a man of Banu Salamah came to him and asked, “O Messenger of Allah! Is there any obedience to parents left that I can show to them after their death?” He ﷺ replied, “Yes, to pray for them, to supplicate for their forgiveness, to fulfill their promises after their death, to maintain the ties of kinship which cannot be maintained except through them, and honour their friends.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
తల్లిదండ్రులకు సేవ చేసుకోవటానికి వారి జీవితాలను మనపాలిట భాగ్యంగా గుర్తించాలి. వారు మరణించిన తరువాత కూడా వారికి సేవ చేయాలనుకుంటే పై హదీసులో చెప్పబడిన పద్ధతుల ద్వారా వారికి తమ సేవలు అందజేయవచ్చు. మరణించిన తల్లిదండ్రులకు పుణ్యం ప్రాప్తం కావాలంటే హదీసులో వివరించబడిన పద్ధతులనే అనుసరించాలి. వీటికి బదులు ఖురాన్ ఖానీలద్వారా, దశదిన కర్మలు, నలభై దినాల కర్మ (చహ్లుమ్)ల ద్వారా మరణించినవారికి పుణ్యం లభిస్తుందని భావించటం కేవలం అపోహ మాత్రమే. ఇవి బిద్అత్ (కొత్తపుంత)లు. వీటికి ఖుర్ఆన్ హదీసుల ద్వారా ఎలాంటి రుజువు లభించదు.
మరణించిన వారికి పుణ్యప్రాప్తి జరగాలంటే దైవప్రవక్త చెప్పినట్లు మృతుల కోసం ప్రార్థిస్తూ ఉండాలి. వారి మన్నింపు కోసం దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్రార్థనల వల్ల మరణించిన వారికే గాకుండా బ్రతికున్న వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. సంతానం మరణించిన తమ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తే దేవుడు వారి తల్లిదండ్రుల్ని మన్నించి పరలోకంలో వారికి గౌరవప్రదమైన స్థానాలను ప్రసాదించటంతో పాటు తమ తల్లిదండ్రులకోసం ప్రార్థించినందుకు సంతానానికి కూడా పుణ్యం నొసగుతాడు. వేరొక హదీసు ప్రకారం మనిషి మరణంతో అతని ఆచరణల పరంపర ఆగిపోతుంది. కాని ఆ తరువాత కూడా మూడు విధాలుగా అతనికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అతను చేసిన మంచి పని అతని మరణం తరువాత కూడా ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటే అతనికి ఎడతెగకుండా ఆ పుణ్యం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా తాను వదలివెళ్ళిన ప్రజోపయోగ జ్ఞానం వల్ల, సదాచార సంపన్నులైన సంతానం చేసే ప్రార్థనల వల్ల కూడా తనకు పుణ్యం లభిస్తూ ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|42. తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్లా, ఆదరణీయులగు పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా మసలుకోవటం|హదీసు 344
హదీసు 345
وعن عائشة رضي اللَّه عنها قَالَتْ: مَا غِرْتُ عَلَى أَحَدٍ مِنْ نِسَاءِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَا غِرْتُ عَلَى خديجةَ رضي اللَّه عنها. ومَا رَأَيْتُهَا قَطُّ، ولَكنْ كَانَ يُكْثِرُ ذِكْرَهَا، وَرُبَّما ذَبح الشَّاةَ، ثُمَّ يُقَطِّعُهَا أَعْضَاء، ثُمَّ يَبْعثُهَا في صدائِق خدِيجةَ، فَرُبَّما قلتُ لَهُ: كَأَنْ لَمْ يكُنْ في الدُّنْيَا إِلاَّ خديجةُ، فيقولُ: "إِنَّها كَانتْ وكَانَتْ وكَانَ لي مِنْهَا ولَدٌ" متفقٌ عَلَيهِ. وفي روايةٍ وإنْ كَانَ لَيذبحُ الشَّاءَ، فَيُهْدِي في خَلائِلِهَا مِنْهَا مَا يسَعُهُنَّ. وفي روايةٍ كَانَ إِذَا ذَبحَ الشَّاةَ يَقُولُ: "أَرْسِلُوا بِهَا إِلى أَصْدِقَاءِ خَدِيجةَ". وفي روايةٍ قَالَت: اسْتَأْذَنَتْ هَالَةُ بِنْتُ خُوَيْلِدٍ أُخُتُ خَديجَةَ عَلَى رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَعَرفَ اسْتِئْذَانَ خَديجَةَ، فَارْتَاحَ لَذَلِكَ فقالَ: "اللَّهُمَّ هَالَةُ بِنْتُ خوَيْلِدٍ". قوْلُهَا:"فَارتَاحَ"هُوَ بِالحاءِ، وفي الجمْعِ بَيْنَ الصحيحين لَلْحُمَيْدِي:"فَارْتَاعَ"بِالعينِ ومعناه: اهْتَمَّ بِهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : నేను దైవప్రవక్త భార్యలలో ఖదీజా గారి పట్ల ఈర్ష్య చెందినంతగా మరెవరి పట్లా చెందలేదు. అసలు నేనామెను చూడనైనా చూడలేదు. కాని దైవప్రవక్త ﷺ ఆమె గురించే ఎక్కువగా చెబుతూ ఉండేవారు. మేకను కోసినప్పుడు ఆయన దాని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తరచూ ఆమె స్నేహితురాండ్రకు (ఆ మాంసాన్ని కానుకగా) పంపుతుండేవారు. ఒక్కోసారి నేను (ఉండబట్టలేక) "మీకు ఈ లోకంలో ఒక్క ఖదీజాయే ఉంది కాబోలు" అని అనేదాన్ని. ఆ మాటకు ఆయన ఖదీజా గారి గుణగణాలు ఏకరువు పెడుతూ, "ఆమె ఎంతో మంచి మహిళ, ఆమె ద్వారానే నాకు సంతానం కలిగింది" అని అంటుండేవారు.
(బుఖారీ – ముస్లిం)
మరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ మేకను కోసినప్పుడు హజ్రత్ ఖదీజా స్నేహితురాండ్రకు వారికి సరిపోయేటంత మాంసం కానుకగా ఇచ్చేవారు. ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఆయన మేకను కోసినప్పుడు "ఇది ఖదీజా స్నేహితురాండ్రకు పంపించండి" అని ఆదేశించేవారు.
వేరొక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలిపారు: ఒకసారి ఖదీజా గారి సోదరి హాలా బిన్తె ఖువైలిద్ దైవప్రవక్తను (ఇంట్లోకి రావటానికి) అనుమతి కోరింది. అప్పుడు ఆయనకు ఖదీజా (ర.అన్హా) అనుమతి కోరుతున్నట్లు అనిపించింది (అంటే ఆయనకు ఖదీజా (రదియల్లాహు అన్హా) అనుమతి కోరే తీరు గుర్తుకొచ్చింది). దాంతో ఆయనకు ఎంతో సంతోషం కలిగింది. ఆ సంతోషంలోనే ఆయన (అప్రయత్నంగా) "అల్లాహ్! హాలా బిన్తె ఖువైలిద్" అని అన్నారు.
ఇమామ్ హుమైదీగారి గ్రంథం "అల్ జమా బైనస్సహీహైన్" లో 'ఫర్తాహ'కు బదులు 'ఫర్తాఅ' అని ఉంది. అంటే ఆయన ఆ గొంతు విని కించిత్ విచారానికి లోనయ్యారని అర్థం.
(సహీహ్ బుఖారీ – సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: I never felt jealous of any of the wives of the Prophet ﷺ as much as I did of Khadijah (radiyallahu anha), although I have never seen her, but the Prophet ﷺ used to mention her very often. Whenever he slaughtered a sheep, he would cut it into pieces and send them to the women friends of Khadijah (radiyallahu anha). When I sometimes said to him: “You treat Khadijah in such a way as if there is no woman on earth except her”. He ﷺ would say, “Khadijah was such and such (commending her and speaking well of her), and I had children from her”.[Al-Bukhari and Muslim].
Another narration is: And if he ﷺ slaughtered a sheep, he would send meat to the friends of Khadijah (radiyallahu anha) as a present as much as would suffice them.
Another narration is: When a sheep was slaughtered, he ﷺ would say, “Send this meat to Khadijah’s friends.” Once, Halah bint Khuwailid (radiyallahu anha), sister of Khadijah (radiyallahu anha), sought permission of Messenger of Allah ﷺ to enter. He recognized and recalled to his mind the manner of Khadijah (radiyallahu anha) and was deeply moved. He said, “O Allah, she must be Halah bint Khuwailid”. [Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- ఈ హదీసులో దైవప్రవక్త సతీమణి హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) గుణగణాలు పొందుపరచబడి ఉన్నాయి.
- హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) సద్గుణసంపన్నురాలైన స్త్రీ అయిన కారణంగా దైవప్రవక్త ఆమెను ఎంతగానో ప్రేమించేవారు.
- తన సతీమణి మరణానంతరం కూడా ఆయన ﷺ ఆమె స్నేహితురాళ్ళకు కానుకలు పంపుతూ ఉండేవారు. వారిని గౌరవించేవారు.
- ఒక్క ఇబ్రాహీం తప్ప ఆయన సంతానమంతా హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) ద్వారానే కలిగింది. ఇబ్రాహీం మాత్రం హజ్రత్ మారియా (రదియల్లాహు అన్హా) కడుపున పుట్టారు.
- తాను గాఢంగా ప్రేమించిన వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడు మనిషి సహజంగానే భావోద్వేగాలకు లోనవుతాడు. దైవప్రవక్త ﷺ కూడా మనలాంటి మానవులే. కనుక మరణించిన తన సతీమణి గుర్తుకొచ్చినప్పుడు ఆయన తన గతాన్ని నెమరువేసుకోవటంలో ఆశ్చర్యమేముంది?!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|42. తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్లా, ఆదరణీయులగు పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా మసలుకోవటం|హదీసు 345
హదీసు 346
وعن أَنس بن مالكٍ رضي اللَّه عنه قَالَ: خَرجْتُ معَ جرير بن عبدِ اللَّه الْبَجَليِّ رضي اللَّه عنه في سَفَرٍ، فَكَانَ يَخْدُمُني فقلتُ لَهُ: لاَ تَفْعلْ، فَقَالَ: إِنِّي قَدْ رَأَيتُ الأَنصارَ تَصْنَعُ برسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم شَيْئاً آلَيْتُ عَلى نَفْسي أَنْ لا أَصْحبَ أَحداً مِنْهُمْ إِلاَّ خَدمْتُهُ متفقٌ عَلَيهِ.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను జరీర్ బిన్ అబ్దుల్లాహ్ బజలీతో పాటు ఒకానొక ప్రయాణంలో బయలుదేరాను. ప్రయాణంలో ఆయన నాకు సేవ చేయటానికి ప్రయత్నించేవారు (చూడబోతే నేనాయనకంటే చాలా చిన్నవాణ్ణి). అందుకని నేనాయనకు "(దయచేసి) మీరిలా చెయ్యకండి" అని విన్నవించు కున్నాను. దానికి ఆయన "అన్సారీ ముస్లింలు దైవప్రవక్త ﷺకు ఇలాగే (సేవలు) చేస్తుండటం నేను చూశాను. అప్పటినుండి నేను కూడా ఏ అన్సారీతో కలిసి ఉన్నా సరే, వారికి సేవ చేయాలని ప్రతినబూనాను" అని చెప్పారు. (హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్సార్‌కు చెందిన వ్యక్తి అన్న సంగతి గమనార్హం).
(బుఖారీ – ముస్లిం)
English
Anas bin Malik (radiyallahu anhu) reported: I set out along with Jarir bin `Abdullah Al-Bajali (radiyallahu anhu) on a journey and he served me. I said to him: “Don’t do that.” Thereupon, he said, “I have seen the Ansar doing this with Messenger of Allah ﷺ, and I swore by Allah, whenever I accompany anyone of the Ansar, I would serve him”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- దైవప్రవక్త సహచరులు ఆయనను ఎంతగా అభిమానించేవారంటే ఆ అభిమానం మూలంగా వారు ఆయన సేవకులకు – వాళ్ళు వయసులో తమకన్నా చిన్నవారైనప్పటికీ – వారికి సేవ చేయటానికి ఏమాత్రం తటపటాయించేవారు కాదు. ఇది దైవప్రవక్త సహచరుల అణకువకు, వినమ్రతా భావానికి ప్రబల తార్కాణం.
- ఆయన సహచరులందరూ పరస్పరం స్నేహ, సౌభ్రాతృత్వ భావాలతో కలిసిమెలిసి ఉండేవారు. ఒండొకరి శ్రేయాన్ని కోరుకునేవారు. దైవప్రవక్త పట్ల వారికున్న అసామాన్య ప్రేమాభిమానాలే ఇందుకు కారణం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|42. తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్లా, ఆదరణీయులగు పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా మసలుకోవటం|హదీసు 346
You must be logged in to post a comment.