హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 34. స్త్రీల పట్ల సద్వ్యవహారం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 34వ అధ్యాయం: స్త్రీల పట్ల సద్వ్యవహారం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 8 హదీసులు (హదీసు 275 – 282) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

34. స్త్రీల పట్ల సద్వ్యవహారం

↑ విషయ సూచిక

باب الوصية بالنساء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ} [النساء:١٩]

"వారి (స్త్రీల) పట్ల సద్భావంతో మెలగండి." (అన్ నిసా : 19)

మరోచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు:

{وَلَنْ تَسْتَطِيعُوا أَنْ تَعْدِلُوا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ فَلا تَمِيلُوا كُلَّ الْمَيْلِ فَتَذَرُوهَا كَالْمُعَلَّقَةِ وَإِنْ تُصْلِحُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ غَفُوراً رَحِيماً} [النساء:١٢٩]

భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దానిని సాధించలేరు. కనుక ఒక భార్యవైపు ఎక్కువగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవెయ్యకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని అల్లాహ్‌కు భయపడుతూ ఉంటే, అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. (అన్ నిసా : 129)

సారాంశం

ఒకావిడకు మించి ఎక్కువ భార్యలు కల్గివున్న మనిషి ఎంత కోరుకున్నప్పటికీ భార్యలందరి మధ్య సమానమైన న్యాయం చేయలేడు. పైకి భార్యలందరి దగ్గర ఒక్కొక్క రాత్రి చొప్పున గడిపినప్పటికీ మనసులోని ప్రేమను మాత్రం అందరికీ సమానంగా పంచి ఇవ్వలేడు. ఒక భార్యను చాలా ఎక్కువగా యిష్టపడవచ్చు. మరో భార్యను అంతగా యిష్టపడకపోవచ్చు. ఇది మనసుకు సంబంధించిన విషయం. ఇందులో సంతులనాన్ని, సమతూకాన్ని పాటించటం కష్టసాధ్యం.

అయితే దాని ప్రభావం బాహ్యపరమైన వ్యవహారాలపై మాత్రం పడకూడదు. మనసుకు నచ్చిన భార్య వైపే పూర్తిగా మొగ్గిపోయి అంతగా యిష్టంలేని భార్యను విస్మరించటం, ఆమె నిత్యావసరాలను తీర్చకపోవటం తగదు. సాధ్యమైనంతవరకు బాహ్య వ్యవహారాల్లో భార్యలందరి మధ్య న్యాయంగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. ఇక మనసులోని యిష్టాయిష్టాల సంగతిని దైవానికి వదలివేయాలి. మనిషికి వాటిని అదుపుచేసుకునే అధికారం లేదని దేవునికి తెలుసు. ఆయన అతని దౌర్బల్యాన్ని క్షమించగలడు. అందుకే దైవప్రవక్త ﷺ తరచూ ఇలా ప్రార్థిస్తూ ఉండేవారు : "అల్లాహుమ్మ హాజా ఖస్మీ ఫీమా అమ్లికు ఫలాతలుమ్‌నీ ఫీమా తమ్లికు వలా అమ్లికు." (దేవా! నా అధీనంలో ఉన్న విషయాల్లో నేను ఇలా వంతులు నిర్ణయించుకున్నాను. ఇక నా ప్రమేయం లేకుండా నీ అధీనంలో ఉన్న విషయాల్లో మాత్రం (నా వల్ల ఏదైనా లోటు జరిగితే దానిపై) నన్ను నిందార్హునిగా చేయకు.)

English

“… and live with them honourably”. [An-Nisā’ 4:19]

“You will never be able to do perfect justice between wives even if it is your ardent desire, so do not incline too much to one of them (by giving her more of your time and provision) so as to leave the other hanging (i.e., neither divorced nor married). And if you do justice, and do all that is right, and fear Allah by keeping away from all that is wrong, then Allah is Ever Oft-Forgiving, Most Merciful.” [An-Nisā’ 4:129]

275

హదీసు 275

وعن أبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رسول ُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اسْتوْصُوا بِالنِّساءِ خيْراً، فإِنَّ المرْأَةَ خُلِقَتْ مِنْ ضِلَعٍ، وَإِنَّ أَعْوجَ مَا في الضِّلعِ أَعْلاهُ، فَإِنْ ذَهبتَ تُقِيمُهُ كَسرْتَهُ، وإِنْ تركتَهُ، لمْ يزلْ أَعوجَ، فاستوْصُوا بِالنِّسَاءِ" متفقٌ عَلَيهِ. وفي رواية في الصحيحين: "المرْأَةُ كالضلعِ إِنْ أَقَمْتَهاكسرْتَهَا، وإِنِ استَمتعْت بِهَا، اسْتَمتعْت وفِيها عَوجٌ ". وفي رواية لمسلمٍ: "إِنَّ المرْأَةَ خُلِقتْ مِن ضِلَعٍ، لَنْ تَسْتقِيمَ لكَ علَى طريقةٍ، فَإِنْ استمتعْت بِهَا، اسْتَمتَعْتَ بِهَا وفِيها عَوجٌ، وإِنْ ذَهَبْتَ تُقيمُها كسرتَهَا، وَكَسْرُهَا طلاقُها ". قولُهُ:"عوجٌ"هُوَ بفتح العينِ والواوِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : స్త్రీల పట్ల మంచిగా మెలగండి. ఎందుకంటే స్త్రీ (మనిషి) ప్రక్కటెముకతో సృజించబడింది. ప్రక్కటెముకలో పైభాగం చాలా వంకరగా ఉంటుంది. మీరు గనక దాన్ని తిన్నగా చేయడానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. దాని మానాన దాన్ని వదలిపెడితే అది అలాగే వంకరగా ఉండిపోతుంది. కనుక మీరు స్త్రీల పట్ల (ఔచితితో) మంచిగా మెలగండి."

(బుఖారీ – ముస్లిం)

బుఖారీ – ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : స్త్రీ ప్రక్కటెముక లాంటిది. నీవు దాన్ని సరిచేయటానికి ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. కనుక నీవు ఆమె నుండి ప్రయోజనం పొందదలిస్తే అది వంకరగా ఉన్నప్పుడు కూడా ప్రయోజనం పొందగలవు."

ముస్లింలోని ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: నిస్సందేహంగా స్త్రీ ప్రక్కటెముకతో సృజించబడింది. అది ఏ విధంగానూ తిన్నగా కాదు. కనుక నీవు ఆమె నుండి ప్రయోజనం పొందాలనుకుంటే వంకరగా ఉన్నప్పుడు కూడా ప్రయోజనం పొందగలవు. నీవు ఆమెను తిన్నగా చేయటానికి ప్రయత్నిస్తే ఆమెను విరగ్గొడతావు. ఆమెను విరవటం అంటే ఆమెకు విడాకులివ్వటమే.

ఈ హదీసులో ప్రస్తావించబడిన పదం 'అవజ్'ను అకారంతో¹ ఉచ్చరించాలి.

¹ కాని గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) తహజీబుల్ అస్మావల్లుగాత్ అనే వేరొక గ్రంథంలో 'ఇవజ్' అని ప్రస్తావించారు. వాస్తవానికి ఇదే సరైనది, బహుళ ప్రచారం పొందినదీను.

(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని స్తన్య సంబంధ ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said: “Take my advice with regard to women: Act kindly towards women, for they were created from a rib, and the most crooked part of a rib is its uppermost. If you attempt to straighten it; you will break it, and if you leave it alone it will remain crooked; so act kindly toward women”.[Al-Bukhari and Muslim].

In another narration of Al-Bukhari and Muslim, Messenger of Allah ﷺ said: “A woman is like a rib, if you attempt to straighten it, you will break it; and if you benefit from her, you will do so while crookedness remains in her”.

In another narration of Muslim, Messenger of Allah ﷺ said: ‘Woman has been created from a rib and will in no way be straightened for you; so if you want to benefit from her, you will benefit from her while crookedness remains in her. If you attempt to straighten her, you will break her, and breaking her is divorcing her”.

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'ఇస్తౌసూ బిన్నిసా' అనే పదం వచ్చింది. అంటే స్త్రీల విషయంలో నా హితవును అంగీకరించండి లేదా మీరు పరస్పరం స్త్రీల విషయమై సద్వ్యవహారం చేయమని తాకీదు చేసుకుంటూ ఉండాలి అని అర్థం. ఎలా చెప్పినా స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలన్నదే దాని భావం. పుట్టుక రీత్యా స్త్రీ పురుషునికన్నా బలహీనురాలు. సాధారణంగా స్త్రీలు సంకుచిత మనస్కులై ఉంటారు. కనుక పురుషులు వారిపట్ల ఎంతో సహనంతో వ్యవహరించాలి. ప్రతి చిన్న విషయానికీ వారిని నిలదీయకుండా సాధ్యమైనంతవరకు సడలింపుల వైఖరిని అవలంబించాలి. వారివల్ల జరిగే చిన్న చిన్న పొరపాట్లను విశాల హృదయంతో మన్నించాలి.

దైవప్రవక్త ﷺ తన సమాజానికి చేసిన ఈ హితవులో కుటుంబ సుఖజీవన రహస్యం దాగి ఉంది. దానిని ఆచరిస్తే సంసార రథం సాఫీగా ముందుకు సాగుతుంది. దీనికి భిన్నంగా స్త్రీల పట్ల కటువుగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే కుటుంబాల్లో సుఖశాంతులు కరువైపోతాయి. సంసార జీవితం దుర్భరమైపోయి సొంత ఇల్లు కూడా నరకంలా అనిపిస్తుంది. తరువాత వ్యవహారం విడాకుల దాకా వెళ్ళిందంటే భార్యాభర్తల జీవితాలు పాడుబడటంతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా నాశనమయిపోతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 275

276

హదీసు 276

وعن عبد اللَّه بن زَمْعَةَ رضي اللَّهُ عنه، أَنه سمعَ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يخْطُبُ، وذكَر النَّاقَةَ والَّذِى عقَرهَا، فَقَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: {إِذِ انْبعث أَشْقَاهَا} انْبعثَ لَها رَجُلٌ عزِيزٌ، عارِمٌ منِيعٌ في رهْطِهِ" ثُمَّ ذكَرَ النِّساءَ، فَوعظَ فِيهنَّ، فَقالَ:"يعْمِدُ أَحَدكُمْ فيجْلِدُ امْرأَتَهُ جلْد الْعَبْدِ فلَعلَّهُ يُضاجعُهَا مِنْ آخِر يومِهِ" ثُمَّ وَعَظهُمْ في ضحكهِمْ مِن الضَّرْطَةِ وَقالَ: "لِمَ يضحكُ أَحَدَكُمْ مِمَّا يفعلُ؟ " متفق عليه. "وَالْعارِمُ"بالعين المهملة والراءِ: هُو الشِّرِّيرُ المُفْسِد، وقولُه:"انبعثَ"، أَيْ: قَامَ بسرعة.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జమ్‌అ కథనం: నేను దైవప్రవక్త ﷺ ప్రసంగిస్తుండగా విన్నాను. ఆయన (ముందుగా సాలిహ్ (అలైహి) గారి) ఒంటెను గురించి, దాని గిట్టలను నరికివేసిన వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ "ఇజింబఅస అష్ఖాహ్' అన్న దైవ సూక్తిని పఠించారు. అంటే ఒంటెను చంపటానికి బలాఢ్యుడైన ఆకతాయి వ్యక్తి ఒకడు దిగ్గున లేచాడు. అతనికి తన జాతి వారి సహకారం ఉండింది అని అన్నారు. ఆ తరువాత స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ "మీలో కొందరు తమ భార్యల్ని బానిసల్ని బాదినట్లు బాదుతున్నారు. కాని అదే రోజు రాత్రి మళ్ళీ ఆమె ప్రక్కనే పడుకుంటారు. (ఇది అమానుషమైన చర్య)" అని హితబోధ చేశారు. ఆ తరువాత ఆయన అపానవాయువు (శబ్దంతో) వెలువడి నప్పుడు నవ్వరాదని జనానికి బోధిస్తూ, "తానూ చేసే పనికి నవ్వడమెందుకు?" అని అన్నారు.

(బుఖారీ – ముస్లిం)

'ఆరిమ్' అంటే ఆకతాయి, తుంటరివాడు. 'ఇంబఅస' అంటే దిగ్గున లేచాడని అర్థం.

(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, తదితర ప్రకరణల్లోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావించబడి ఉంది.)

English

`Abdullah bin Zam`ah (radiyallahu anhu) reported that he heard the Prophet ﷺ giving a speech when he mentioned the she-camel (of Prophet Salih) and the man who had killed her. Messenger of Allah ﷺ said: “When the most wicked man among them went forth (to kill the she-camel).’ (91:12) signifies that a distinguished, wicked and most powerful chief of the people jumped up to kill the she-camel.” Then he ﷺ made mention of women and said, “Some of you beat your wives as if they were slaves, and then lie with them at the end of the day”.

Then he ﷺ admonished them against laughing at another’s passing of wind, saying, “Why does any of you laugh at another doing what he does himself”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

తప్పనిసరి పరిస్థితుల్లో భర్త భార్యను స్వల్పంగా దండించటానికి ఇస్లాం అనుమతిస్తోంది. అది కూడా ఇతర ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడే! దివ్య ఖుర్‌ఆన్ ప్రకారం భార్య భర్తకు విధేయత చూపకపోతే ముందుగా ఆమెకు నచ్చజెప్పాలి. అప్పటికీ భర్త మాట వినకపోతే భర్త ఆమెను తన పడక నుండి వేరుచేయాలి. అర్థం చేసుకునే స్త్రీకయితే అదే పెద్ద చురక. కాని అప్పటికీ ఆమె అతని మాట వినకపోతే అప్పుడు తల, ముఖానికి తగలకుండా భర్త ఆమెను స్వల్పంగా దండించవచ్చు. అది కూడా ఆమె ఇలా చేస్తే దారికి వస్తుందన్న నమ్మకం ఉన్నప్పుడే చేయాలి. లేకపోతే దానిక్కూడా దూరంగా ఉండటం మంచిది. అంతేగాని ఒకేసారి ఆమెతో కటువుగా వ్యవహరించటం, గొడ్డును బాదినట్లు బాదటం చేయకూడదు. ఇస్లాం ఇలా చేయటాన్ని ఎన్నటికీ అనుమతించదు.

దైవప్రవక్త ﷺ ఈ హదీసులో బోధిస్తున్నది కూడా అదే. సంసార రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాల్లాంటివారు. ఆడదానికి మగవాడు అవసరమయినట్లే మగవాడికి కూడా ఆడది కావాలి. దాంపత్య జీవితంలో ఇద్దరికీ ప్రాముఖ్యం ఉంది. స్త్రీ లేనిదే పురుషుడికి రాత్రి గడవటం కష్టమైపోతుంది. అలాంటప్పుడు భార్యను బానిసరాలిగా చేసి వేధించటం న్యాయమేనా? ఆమె కూడా మనిషేనన్న సంగతిని భర్త గుర్తించాలి. ఆమె భావాలను గౌరవించాలి. చిన్న చిన్న విభేదాలొచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పంతాలకు పోకుండా సాధ్యమైనంతవరకు సర్దుబాటు చేసుకొని కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించాలి.

ఈ హదీసులో చెప్పబడిన ఇంకో విషయం ఏమిటంటే, అపానవాయువు సహజంగా అందరికీ వెలువడేదే. తాను చేసే పని ఇతరులకు ఎదురైనప్పుడు దానికి నవ్వడమెందుకు? కనుక ఎవరికైనా శబ్దంతో అపానవాయువు వెలువడితే నలుగురిలో నవ్వి అతన్ని నవ్వులపాలు చేయటం ఎంతో అసభ్యకరమైన చేష్ట. ఇస్లాం దీనిని గర్హిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 276

277

హదీసు 277

وعن أَبي هريرةَ رضي اللَّه عنه قَالَ: قالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ يَفْرَكْ مُؤْمِنٌ مُؤْمِنَةً إِنْ كَرِه مِنها خُلقاً رضِيَ مِنْها آخَرَ" أَوْ قَالَ:"غيْرَهُ"رواه مسلم. وقولُهُ:"يفْركْ"هُوَ بفتحِ الياءِ وإِسكانِ الفاءِ وفتح الراءِ معناه: يُبغضُ، يقَالُ: فَركَتِ المرْأَةُ زَوْجَهَا، وفَرِكَهَا زَوْجُها، بكسر الراءِ، يفركُها بفتحهَا: أَيْ: أَبغضهَا، واللَّه أعلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఏ విశ్వాసీ విశ్వాసురాలిని (భార్యను) అసహ్యించు కోరాదు. అతనికి ఆమెలో ఒక గుణం నచ్చకపోయినప్పటికీ అతనికి నచ్చిన మరో గుణం ఆమెలో ఉండవచ్చు. (ముస్లిం)

ఈ హదీసులో దైవప్రవక్త ﷺ "ఆఖర్"కు బదులు 'గైర' అనే పదాన్ని వాడి ఉంటారని ఒకానొక ఉల్లేఖకుని సందేహం. 'యఫ్రక్' అంటే (మనసులో) అక్కసును ఉంచుకోవటం. భార్య భర్తను అసహ్యించుకుందని చెప్పటానికి ఫరికతిల్ మర్‌అతు జౌజహా అనీ, భర్త అసహ్యించుకున్నాడని చెప్పటానికి ఫరికహా జౌజుహా అని అంటారు. అంటే ఆమెపట్ల వైరభావం కలిగి ఉన్నాడని అర్థం. (వల్లాహు ఆలమ్)

(సహీహ్ ముస్లింలోని స్తన్య సంబంధ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “A believer must not hate (his wife) believing woman; if he dislikes one of her characteristics he will be pleased with another”.[Muslim].

ముఖ్యాంశాలు

ప్రతి మనిషిలో కొన్ని తప్పుల (లోపా)తో పాటు కొన్ని ఒప్పులు కూడా ఉంటాయి. కనుక సంసార జీవనంలో భర్తకు భార్యలో చిన్నా చితకా ఏవైనా అవగుణాలు కనిపిస్తే వాటికి ప్రాముఖ్యం ఇవ్వకుండా ఆమెలోని మంచిగుణాల వైపు దృష్టి సారించాలి. అదేవిధంగా భార్యకు భర్తలో ఏమైనా లోపాలు కనపడితే పెద్ద మనసుతో వాటిని మన్నించి అతని సుగుణాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇలా భార్యాభర్తలిద్దరూ విశాలహృదయంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మసలుకుంటే వారి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇద్దరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 277

278

హదీసు 278

وعن عَمْرو بنِ الأَحْوَصِ الجُشميِّ رضي اللَّه عنه أَنَّهُ سمِعَ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في حَجِّةِ الْوَداع يقُولُ بَعْدَ أَنْ حَمِدَ اللَّه تَعَالَى، وَأَثنَى علَيْهِ وذكَّر ووعظَ، ثُمَّ قَالَ: "أَلا واسْتَوْصوا بِالنِّساءِ خَيْراً، فَإِنَّمَا هُنَّ عَوانٍ عَنْدَكُمْ لَيْس تمْلكُونَ مِنْهُنَّ شَيْئاً غيْرَ ذلِكَ إِلاَّ أَنْ يأْتِينَ بِفَاحشةٍ مُبيِّنةٍ، فإِنْ فَعلْنَ فَاهْجُروهُنَّ في المضَاجعِ، واضْربُوهنَّ ضَرْباً غيْر مُبرِّحٍ، فإِنْ أَطعنَكُمْ فَلا تبْغُوا عَلَيْهِنَّ سَبيلاً، أَلا إِنَّ لَكُمْ عَلَى نِسائِكُمْ حَقًّا، ولِنِسائِكُمْ عَلَيْكُمْ حَقّاً، فَحَقُّكُمْ عَلَيْهنَّ أَن لا يُوطِئْنَ فُرُشكمْ منْ تَكْرهونَ، وَلا يأْذَنَّ في بُيُوتكمْ لِمن تكْرهونَ، أَلا وحقُّهُنَّ عَلَيْكُمْ أَن تُحْسنُوا إِليْهنَّ في كِسْوتِهِنَّ وَطعامهنَّ". رواه الترمذي وَقالَ: حديث حسن صحيحٌ. قوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم"عوانٍ"أَيْ: أَسِيرَاتٌ، جمْعُ عانِيةٍ، بِالْعَيْنِ المُهْمَلَةِ، وَهِيَ الأَسِيرَةُ، والْعانِي: الأَسِيرُ. شَبَّهَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم المرْأَةَ في دُخُولَهَا تحْتَ حُكْم الزَّوْجِ بالأَسيرِ"والضرْبُ المُبرِّحُ": هُوَ الشَّاقُّ الشديدُ، وقوله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"فَلا تَبْغُوا عَلَيْهِنَّ سَبِيلاً"أَيْ: لاَ تَطلُبوا طرِيقاً تحْتجُّونَ بِهِ عَلَيْهِنَّ وَتُؤذونهنَّ بِهِ، واللَّه أعلم.

హజ్రత్ అమ్ర్ బిన్ అహ్వస్ జుషమీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ అంతిమ హజ్ సందర్భంగా ఉపన్యసిస్తూ ముందుగా దైవాన్ని స్తుతించారు. ప్రజలకు హితబోధ చేశారు. (ఇస్లాం బోధనలు) గుర్తు చేశారు. ఆ తరువాత ఇలా అన్నారు : "వినండి, భార్యల పట్ల మంచిగా మెలగండి. వారు మీ దగ్గర బందీలుగా ఉన్నారు. మీరు వారితో సంభోగించవచ్చు. వారు తమ శీలాన్ని కాపాడుకుంటూ మీ సంపదను కాపాడుతూ ఉంటారు. అంతేగాని దానికి మించి మీకు వారిపై ఎలాంటి అధికారం లేదు. అయితే వారు బహిరంగంగా నీతిబాహ్యతకు పాల్పడితే (అప్పుడు మీరు వారిని దండించవచ్చు.) ఒకవేళ వారు (అలాంటి తప్పేదయినా చేస్తే) మీరు వారిని పడకల నుండి వేరుగా ఉంచండి. (అప్పటికీ తప్పు మానుకోకపోతే) వారిని హింసించకుండా కొట్టండి. వారు గనక మీకు విధేయత చూపితే ఇక (మీరు దురుద్దేశ్యంతో వారిని వదిలించుకునే) మార్గాలు అన్వేషించకండి. జాగ్రత్త! మీకు మీ భార్యలపై హక్కులు ఉన్నట్లే, మీ భార్యలకు కూడా మీపై హక్కులున్నాయి. వారిపై మీకున్న హక్కు ఏమిటంటే, వారు మీ పడకలను మీకిష్టం లేనివారిచే తొక్కినీయకూడదు. మీకిష్టం లేని వారిని ఇంట్లోకి రావటానికి అనుమతించకూడదు.

ఇక వారికి మీపై ఉన్న హక్కు ఏమిటో వినండి! మీరు వారికి (వీలైనంతవరకు) మంచి అన్న వస్త్రాలను సమకూర్చాలి.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్' మరియు 'సహీహ్'గా పేర్కొన్నారు.)

'అవానిన్' ఆనియతున్‌కు బహువచనం. అంటే బందీలు. 'ఆని' అనేది పులింగం. తన భర్త వద్ద ఉండే స్త్రీని దైవప్రవక్త ﷺ ఖైదీతో పోల్చిచెప్పారు. 'జర్బెముబర్రహ్' అంటే నొప్పి కలిగేలా కొట్టడం. 'వారి కోసం మార్గాలు అన్వేషించకండి' అంటే వారికి పైచేయి అయి వారిని హింసించటానికి ప్రయత్నాలు చేయకండి అని అర్థం. (లేదా విడాకులు ఇవ్వడానికి సాకులు వెతకటమనే భావం కావచ్చు.)

(జామె తిర్మిజీ నికాహ్ అధ్యాయం)

English

`Amr bin Al-Ahwas Al-Jushami (radiyallahu anhu) reported that he had heard the Prophet ﷺ saying on his Farewell Pilgrimage, after praising and glorifying Allah and admonishing people, “Treat women kindly, they are like captives in your hands; you do not owe anything else from them. In case they are guilty of open indecency, then do not share their beds and beat them lightly but if they return to obedience, do not have recourse to anything else against them. You have rights over your wives and they have their rights over you. Your right is that they shall not permit anyone you dislike to enter your home, and their right is that you should treat them well in the matter of food and clothing”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో కూడా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు స్త్రీని దైవప్రవక్త ﷺ చెప్పినట్లు స్వల్పంగా మాత్రమే దండించాలని చెప్పబడింది. కొట్టడం వల్ల ఆమెలో మొండితనం మరింత పెరుగుతుందనే భయముంటే అసలు కొట్టకుండా ఉండటమే మంచిది.
  2. భర్త బయటికి వెళ్ళినప్పుడు భార్య తన శీలంతోపాటు, భర్త సొమ్మును, సంపదను కనిపెట్టుకొని ఉండాలి. భర్తకు యిష్టంలేని వారిని – వారు అతని సన్నిహితులు, సమీప బంధువులైనా సరే – ఇంట్లో అడుగుపెట్ట నివ్వకూడదు.
  3. భార్యకు మంచి ఆహారాన్ని, దుస్తుల్ని, నిత్యావసరాలను సమకూర్చటం భర్త కనీస బాధ్యత అనిపించుకుంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 278

279

హదీసు 279

وعن مُعَاويَةَ بنِ حَيْدةَ رضي اللَّه عنه قَالَ: قلتُ: يَا رَسُول اللَّه مَا حَقُّ زَوْجَةِ أَحَدنَا عَلَيْهِ؟ قَالَ: "أَن تُطْعمَها إِذَا طَعِمْتَ، وتَكْسُوهَا إِذَا اكْتَسيْتَ وَلاَ تَضْربِ الْوَجهَ، وَلا تُقَبِّحْ، وَلا تَهْجُرْ إِلاَّ في الْبَيْتِ" حديثٌ حسنٌ رواه أَبو داود وَقالَ: معنى"لا تُقَبِّحْ"أَى: لا تقُلْ قَبَّحَكِ اللَّه.

హజ్రత్ ముఆవియా బిన్ హైదా (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త ﷺను, "మా భార్యలకు సంబంధించి మాపై ఉన్న బాధ్యతలేమిటి?" అని అడగ్గా, "నువ్వు అన్నం తిన్నప్పుడు ఆమెకు కూడా తినిపించు. నువ్వు బట్టలు తొడుక్కోవాలనుకున్నప్పుడు ఆమెకు కూడా తొడిగించు. ముఖం మీద మాత్రం కొట్టకు. (అదేపనిగా) ఆమె లోపాలు ఎంచకు.(సంస్కరణ నిమిత్తం) ఆమెను వేరుగా ఉంచాలనుకుంటే ఇంట్లోనే (వేరుగా) ఉంచు" అని ఆయన అన్నారు. (ఈ హదీసు హసన్ కోవకు చెందినది. దీనిని అబూదావూద్ వెలికితీశారు.) ఇంకా 'లా తుఖబ్బిహ్' అనే పదానికి భర్త భార్యను 'దేవుడు నిన్ను అందవికారిగా చేయాలని' శపించకూడదనే అర్థం చెప్పారు.

(సుననె అబూదావూద్‌లోని నికాహ్ ప్రకరణం)

English

Mu`awiyah bin Haidah (radiyallahu anhu) reported: I asked Messenger of Allah ﷺ: “What right can any wife demand of her husband?” He replied, “You should give her food when you eat, clothe her when you clothe yourself, not strike her on the face, and do not revile her or separate from her except in the house”.[Abu Dawud].

ముఖ్యాంశాలు

భర్త మాట వినని స్త్రీకి బుద్ధి చెప్పే ఉద్దేశ్యంతో ఆమెను వేరుపరచాల్సిన పరిస్థితి ఎదురయినప్పుడు ఆమెను ఇంట్లోనే ఉంచి, ఆమెతో కలవకుండా ఉండాలి. అంతేగాని ఇంటినుండి గెంటేయకూడదు. స్త్రీని ఇంట్లో వేరుపరచి ఉంచినప్పటికీ, ఆమెతో మాట్లాడకుండా ఉండటం మంచిది కాదని, దానివల్ల భార్యాభర్తల యెడబాటు మరింత పెరిగిపోయే అవకాశముందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే అంతగా అవసరమనుకుంటే భార్యను ఇంటిబయట కూడా వేరుగా ఉంచవచ్చు. అంతేగాని నోటికొచ్చినట్లు తిట్టడం, రోజూ కొడుతూ ఉండటం, విడాకులిస్తానని, ఇంటి నుండి బయటికి గెంటేస్తానని బెదిరించటం, నిత్యావసరాలు సమకూర్చకపోవటం, అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించటం, చిత్రహింసలు పెట్టడం, ముఖంపై కొట్టడం లాంటివి చేయకూడదు. చీటికీమాటికి భార్యను కసురుకోవటం, పిల్లల ముందు, బంధువుల ముందు అవమానపరచటం ఇవన్నీ అనాగరిక చేష్టలు. గృహిణి గృహరాణి లాంటిది. కనుక భర్త ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి. ఒకవేళ స్త్రీ హద్దుమీరి ప్రవర్తిస్తే అప్పుడు ఖుర్‌ఆన్, హదీసుల వెలుగులో సమస్యను పరిష్కరించాలే తప్ప ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించరాదు. లేకపోతే ఇహపరాల్లోనూ భర్త నష్టానికి గురికావలసి వస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 279

280

హదీసు 280

وعن أبي هريرةَ رضي اللَّه عنه، قَالَ: قالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَكْمَلُ المُؤْمنين إِيمَاناً أَحْسنُهُمْ خُلُقاً، وَخِياركُمْ خيارُكم لِنِسَائِهِم" رواه التِّرمذي وقال: حديثٌ حسنٌ صحيحٌ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఉత్తమ నడవడిక గలవారే పరిపూర్ణ విశ్వాసులు. మీలో తమ భార్యల పట్ల మంచిగా మెలిగేవారే అందరికన్నా శ్రేష్ఠులు." (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్' మరియు 'సహీహ్'గా పేర్కొన్నారు.)

(జామె తిర్మిజీలోని నికాహ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “The believers who show the most perfect Faith are those who have the best behaviour, and the best of you are those who are the best to their wives”.[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 280

281

హదీసు 281

وعن إِياس بنِ عبدِ اللَّه بنِ أَبي ذُباب رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تَضْربُوا إِمَاءَ اللَّهِ" فَجاءَ عُمَرُ رضي اللَّه عنه إِلى رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ: ذَئِرْنَ النِّساءُ عَلَى أَزْواجهنَّ، فَرَخَّصَ في ضَرْبهِنَّ فَأَطاف بِآلِ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نِساءٌ كَثِيرٌ يَشْكونَ أَزْواجهُنَّ، فَقَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَقَدْ أَطَافَ بآلِ بَيْت مُحمَّدٍ نِساءٌ كَثيرِ يشْكُونَ أَزْوَاجَهُنَّ لَيْسَ أُولِئك بخيارِكُمْ" رواه أَبُو داود بإسنادٍ صحيح. قوله:"ذَئِرْنَ"هُوَ بذَال مُعْجَمَة مفْتوحَة ثُمَّ هَمْزة مَكْسُورَة ثُمَّ راءٍ سَاكِنَة ثُمَّ نُون, أي: اجْتَرَأْنَ, قوله:"أَطاف"أيْ: أحَاطَ.

హజ్రత్ ఇయాస్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబూ జుబాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ "దేవుని దాసీలను (అంటే స్త్రీలను) కొట్టకండని (ప్రజలకు) హితబోధ చేశారు. ఆయన ఈ హితోపదేశం చేసిన కొంతకాలానికి ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయన దగ్గరికి వచ్చి "స్త్రీలు తమ భర్తలకు ఎదురుతిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. అప్పుడు దైవప్రవక్త ﷺ (అవసరమైతే) భార్యల్ని కొట్టేందుకు అనుమతి ఇచ్చారు. (ఆ తరువాత కొంతకాలానికి) ఎంతోమంది స్త్రీలు దైవప్రవక్త ﷺ సతీమణుల దగ్గరికి వచ్చి తమ భర్తలు తమల్ని కొడుతున్నారని ఫిర్యాదులు చేయసాగారు. ఆ సమయంలో దైవప్రవక్త ﷺ ప్రజలతో, "చాలా మంది స్త్రీలు ముహమ్మద్ ఇంటిదగ్గర గుమిగూడి తమ భర్తల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. మీలో తమ భార్యల్ని వేధించేవారు మంచివారు కారు జాగ్రత్త!" అని అన్నారు.

(దీనిని అబూదావూద్ దృఢమైన ఆధారంతో వెలికితీశారు.)

'జయిర్‌న' అంటే 'ఎదురు తిరగటం' అని అర్థం. 'అతాఫ' అంటే చుట్టుముట్టడం అని అర్థం.

(సుననె అబూదావూద్‌లోని నికాహ్ ప్రకరణం)

English

Iyas bin `Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Do not beat Allah’s bondwomen.” When `Umar (radiyallahu anhu) came to Messenger of Allah ﷺ and complained saying: “The women have become very daring towards their husbands,” He ﷺ gave permission to beat them. Then many women went to the family of the Messenger of Allah (wives) complaining of their husbands, and he (the Prophet ﷺ) said, “Many women have gone round Muhammad’s family complaining of their husbands. Those who do so, that is, those who take to beating their wives, are not the best among you”.[Abu Dawud].

ముఖ్యాంశాలు

చీటికిమాటికి భార్యల్ని కొట్టి హింసించటం నైతిక అధోగతికి తార్కాణమని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. కనుక భర్తలు తమ భార్యల పట్ల ఉత్తమ రీతిలో వ్యవహరించాలి. అందుకు దైవప్రవక్త ﷺ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏనాడూ ఏ భార్యనూ కొట్టలేదు. ఆఖరికి సేవకురాలిని కూడా కొట్టలేదు. అయితే ధర్మపోరాటంలో మాత్రం ఆయన దైవధిక్కారుల్ని తన చేతులతో శిక్షించారు. అలాగే దేవుని నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించిన వారిని కూడా ఆయన దండించారు. (సుననె నసాయి)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 281

282

హదీసు 282

وعن عبدِ اللَّه بنِ عمرو بن العاص رضي اللَّه عنهما أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الدُّنْيَا مَتَاعٌ، وَخَيْرُ مَتاعهَا المَرْأَةُ الصَّالحةُ" رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "ప్రపంచమంతా సామగ్రియే. అందులో సదాచార సంపన్నురాలైన భార్య అత్యుత్తమ సామగ్రి (లాంటిది). (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని స్తన్యసంబంధ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “The world is but a (quick passing) enjoyment; and the best enjoyment of the world is a pious and virtuous woman”.[Muslim].

ముఖ్యాంశాలు

అబూదావూద్ మరియు నసాయిలలోని వేరొక హదీసులో సదాచార సంపన్నురాలైన భార్య ఈ లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది : భర్త తన వంక చూసినప్పుడు అతన్ని పులకింపజేస్తుంది. భర్త ఆజ్ఞల్ని శిరసావహిస్తుంది. అతను ఇంట్లో లేనప్పుడు తన శీలాన్ని, అతని సొమ్మును కాపాడుతూ ఉంటుంది. కనుక మనిషి ఇహపరాల సాఫల్యం కావాలనుకుంటే, ధర్మపరాయణురాలైన స్త్రీనే వివాహమాడాలి. స్త్రీని ఎంపిక చేసేటప్పుడు ఆమె అందచందాలు, సిరిసంపదలు, వంశప్రతిష్ఠలకన్నా ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాంటి స్త్రీ ఇహలోకంలో ఉత్తమ గృహిణిగా భర్తకు సహకరించటంతోపాటు అతని పరలోక సాఫల్యానికి కూడా తోడ్పడుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|34. స్త్రీల పట్ల సద్వ్యవహారం|హదీసు 282