హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 233. హజ్ విధింపు, ఘనత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 233వ అధ్యాయం: హజ్ విధింపు, ఘనత. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 14 హదీసులు (హదీసు 1272 – 1285) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

233. హజ్ విధింపు, ఘనత

↑ విషయ సూచిక

باب وجوب الحج وفضله

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلاً وَمَنْ كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ} [آل عمران: ٩٧]

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ప్రజలపై అల్లాహ్‌కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్‌ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాహ్‌కు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి." (ఆలి ఇమ్రాన్: 97)

వివరణ

దైవగృహమైన కాబా దగ్గరికి వెళ్ళిరావటానికి అయ్యే ఖర్చులు, తాము ప్రయాణంలో ఉన్న కాలంలో తమ ఇంటివారి అవసరాలకు అయ్యే ఖర్చులకు సరిపడా ధనాన్ని కల్గివున్నవారు జీవితంలో ఒక్కసారయినా విధిగా హజ్‌యాత్ర చేయాలి. స్తోమత కలిగివున్నప్పటికీ హజ్ చేయకపోవటాన్ని దివ్యఖుర్‌ఆన్ 'కుఫ్ర్' (ధర్మతిరస్కారం)గా పేర్కొన్నది. దీనిద్వారా స్తోమత కలిగివుండి కూడా హజ్ చేయకుండా ఉండటం ఎంతటి ఘోరమైన పాపమో అర్ధమవుతోంది. హదీసుల్లో కూడా ఈ విషయాన్ని తీవ్రంగా గర్హించటం జరిగింది.

English

“And Hajj (pilgrimage to Makkah) to the House (Ka`bah) is a duty that mankind owes to Allah, those who can afford the expenses (for one’s conveyance, provision and residence); and whoever disbelieves [i.e., denies Hajj (pilgrimage to Makkah), then he is a disbeliever of Allah], then Allah stands not in need of any of the `Alamin (mankind, jinn and all that exists).” [Āl ‘Imrān 3:97]

1272

హదీసు 1272

وَعَنِ ابن عُمرَ، رضي اللَّه عَنْهُمَا، أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَال: "بُنِيَ الإسْلامُ عَلَى خَمْسٍ: شَهادَةِ أَنْ لاَ إلهَ إلاَّ اللَّه وأَنَّ مُحَمَّداً رسولُ اللَّهِ، وإقَامِ الصَّلاةِ وإِيتَاءِ الزَّكَاةِ، وحَجِّ البيْتِ، وصَوْمِ رَمَضَانَ" متفقٌ عليهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఇస్లాం ధర్మం ఐదు విషయాలపై ఆధారపడి ఉంది. 1) అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ ﷺ దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, 2) నమాజును స్థాపించటం, 3) జకాత్ చెల్లించటం, 4) హజ్ చేయటం, 5) రమజాన్ నెలలో ఉపవాసం పాటించటం.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం-సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “(The superstructure of) Islam is based on five (pillars), testifying the fact that La ilaha illallah wa anna Muhammad-ar-Rasul-ullah [there is no true god except Allah, and Muhammad ( ﷺ) is the Messenger of Allah], establishing As-Salat (the prayers), paying Zakat (poor due), the pilgrimage to the House [of Allah (Ka`bah)], and the Saum (fasting) during the month of Ramadan.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకు ముందు నమాజు, జకాత్, ఉపవాస ప్రకరణాల్లో కూడా వచ్చింది. ఇక్కడ దీనిని ఇస్లామియ ప్రధాన విధుల్లో నాల్గవది అయిన హజ్ విధింపును తెలియపరిచే ఉద్దేశ్యంతో పొందుపరచటం జరిగింది. అయితే ఇంతకు ముందు చెప్పబడినట్లు ఈ హజ్ అనేది స్తోమత కలిగినవారిపై మాత్రమే విధిగా చేయబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1272

1273

హదీసు 1273

وعنْ أبي هُرَيْرةَ، رضي اللَّه عنهُ، قالَ: خَطَبَنَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ: "يَا أَيُّهَا النَّاسُ إنَّ اللَّه قَدْ فَرضَ عَلَيْكُمُ الحَجَّ فحُجُّوا"فقَالَ رجُلٌ: أَكُلَّ عَامٍ يَا رسولَ اللَّهِ؟ فَسَكتَ، حَتَّى قَالَها ثَلاثاً. فَقَال رَسُولُ اللِّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لَوْ قُلْتُ نَعَمْ لَوجَبت وَلمَا استَطَعْتُمْ"ثُمَّ قَالَ:"ذَرُوني مَا تركْتُكُمْ، فَإنَّمَا هَلَكَ منْ كانَ قَبْلَكُمْ بكَثْرَةِ سُؤَالهِمْ، وَاخْتِلافِهِم عَلى أَنْبِيائِهمْ، فَإذَا أَمَرْتُكُمْ بِشَيءٍ فَأْتوا مِنْهُ مَا استطَعْتُم، وَإذا نَهَيتُكُم عَن شَيءٍ فَدعُوهُ ". رواهُ مسلمٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త ﷺ మాకు ఉపన్యాసం ఇస్తూ, "ప్రజలారా! దేవుడు మీపై హజ్‌యాత్రను విధిగా చేశాడు. కనుక మీరు హజ్ చేయండి" అన్నారు. అంతలో ఒక వ్యక్తి 'ప్రతి సంవత్సరం చేయాలా దైవప్రవక్తా?' అని అడిగారు. అందుకు దైవప్రవక్త ﷺ మౌనం వహించారు. ఆ వ్యక్తి అదే ప్రశ్న మూడుసార్లు అడిగాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ "నేను గనక 'ఔను' అనంటే దాన్ని మీరు తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది. కాని మీలో ఆ శక్తి లేదు" అని అన్నారు.

ఆయన ఇంకా ఇలా బోధించారు: ఏ విషయాలనయితే నేను మీకు చెప్పకుండా వదిలేస్తున్నానో వాటిని గురించి మీరు నన్ను అడక్కండి. నిశ్చయంగా మీకు పూర్వం గతించిన జాతులు ఈ విధంగా అనవసర ప్రశ్నలు వేయటం మూలంగా, తమ ప్రవక్తలతో విభేదించటం మూలంగానే నాశనమయిపోయాయి. కనుక నేను మీకు దేని గురించయినా ఆదేశించినప్పుడు మీరు మీ శక్తిమేరకు దాన్ని అచరించండి. ఒకవేళ ఏదయినా చేయకూడదని వారిస్తే (వెంటనే) దానిని వదిలేయండి. (అందులోనే మీకు శ్రేయం ఉంది). (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ delivered a Khutbah and said, “O people! Hajj (pilgrimage to the House of Allah) has been made incumbent upon you, so perform Hajj.” A man inquired: “O Messenger of Allah, is it prescribed every year?” He ﷺ remained silent till the man repeated it thrice. Then he ﷺ said, “Had I replied in the affirmative, it would have surely become obligatory, and you would not have been able to fulfill it.” Afterwards he said, “Do not ask me so long as I do not impose anything upon you, because those who were before you were destroyed on account of their frequent questioning and their disagreement with their Prophets. So when I order you to do something, do it as far as you can; and when I forbid you from doing anything, eschew it.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1273

1274

హదీసు 1274

وَعنْهُ قَالَ: سُئِلَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أَيُّ العَمَلِ أَفضَلُ؟ قَالَ: "إيمانٌ بِاللَّهِ ورَسُولِهِ"قيل: ثُمَّ ماذَا؟ قَالَ:"الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ"قِيلَ: ثمَّ ماذَا؟ قَال:"حَجٌ مَبرُورٌ" متفقٌ عليهِ. المَبرُورُ هُوَ الَّذِي لا يَرْتَكِبُ صَاحِبُهُ فِيهِ معْصِية.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺను "ఆచరణలన్నిటిలోకెల్లా శ్రేష్ఠమైనది ఏది?" అని విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ "దేవుణ్ణి, దైవప్రవక్తను విశ్వసించటం" అని అన్నారు. "ఆ తర్వాత ఏది?" అని అడిగితే "దైవమార్గంలో పోరాడటం" అని చెప్పారు. "ఆ తర్వాత ఏది?" అని అడిగితే, 'హజ్జె మబ్రూర్' అని చెప్పారు దైవప్రవక్త ﷺ.

(బుఖారీ-ముస్లిం)

హజ్ యాత్రికుడు తన యాత్రా కాలంలో ఎలాంటి అవిధేయతకు ఒడిగట్టకుండా జాగ్రత్తపడితే అలాంటి హజ్‌ను 'హజ్జె మబ్రూర్' అని అంటారు.

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ was asked: “Which deed is the best?” He ﷺ replied, “Faith in Allah and His Messenger.” Then he was asked: “What is next?” He replied, “Jihad (holy fighting) in the Cause of Allah.” Then he was asked, “What is after that?” He ﷺ replied, “Hajj Mabrur (an accepted pilgrimage).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

హజ్ యాత్ర అత్యంత శ్రేష్ఠమైన ఆచరణల్లో ఒకటని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఆ హజ్‌ను చిత్తశుద్ధితో, ఎలాంటి అవిధేయతా కార్యాలకు ఒడిగట్టకుండా నెరవేర్చి ఉండాలి. కొంతమంది 'హజ్జె మబ్రూర్' అనే పదాన్ని 'స్వీకృతి పొందిన హజ్' అని తర్జుమా చేశారు. అయితే మనిషి చేసే హజ్ దైవసన్నిధిలో స్వీకృతికి నోచుకున్నదా లేదా అన్న విషయం మనకు ఎలా తెలియాలి? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తటం సహజమే. దానికి, అలాంటి మనిషి మునుపటి కన్నా ఎక్కువ దైవారాధకుడుగా మారిపోతాడనీ, అతని నడవడికలో చాలా మార్పు వస్తుందనీ, అతని సత్ప్రవర్తనే ఈ విషయాన్ని సూచిస్తుందనీ వారు సమాధానమిచ్చారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1274

1275

హదీసు 1275

وَعَنْهُ قالَ: سَمِعْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقولُ: "منْ حجَّ فَلَم يرْفُثْ، وَلَم يفْسُقْ، رجَع كَيَومِ ولَدتْهُ أُمُّهُ". متفقٌ عَلَيْهِ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు: ఎవడయితే ఎలాంటి అపసవ్యమైన చేష్టలకు, వ్యర్ధవిషయాలకు పాల్పడకుండా, దైవ అవిధేయతకు ఒడిగట్టకుండా జాగ్రత్తపడుతూ హజ్ చేస్తాడో అతను ఆ రోజే తల్లి గర్భం నుంచి పుట్టినవానిలా (పరమ పవిత్రుడై) తిరిగి వస్తాడు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whoever performs Hajj (pilgrimage) and does not have sexual relations (with his wife), nor commits sin, nor disputes unjustly (during Hajj), then he returns from Hajj as pure and free from sins as on the day on which his mother gave birth to him.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

హదీసు మూలంలో 'రఫస్' అనే పదం వచ్చింది. అసలు నిఘంటువులో 'రఫస్' అన్న పదానికి అశ్లీలపు మాటలు మాట్లాడటం, పోకిరి పలుకులు పలకటం, భార్య ముందు లైంగిక వాంఛల్ని వెలిబుచ్చటం అనే అర్ధాలున్నాయి. హజ్ యాత్రా కాలంలో భార్యతో సంభోగించటం నిషిద్ధం. కనుక హజ్‌యాత్రకు సంబంధించి దీక్షబూనిన తర్వాత దాని గురించి మాట్లాడటం, భార్యాభర్తలు పరస్పరం లైంగిక వాంఛల్ని వెలిబుచ్చుకోవటం కూడా అధర్మకార్యాలుగా పరిగణించబడతాయి. దైవ అవిధేయతకు పాల్పడటమంటే ప్రజలతో జగడాలు పెట్టుకోవటం, కొట్లాటకు దిగటం అని భావం. హజ్ దినాల్లో ముఖ్యంగా వీటికి కూడా దూరంగా ఉండాలి. పై నియమ నిబంధనలన్నిటినీ నిక్కచ్చిగా పాటించి హజ్ నెరవేరిస్తే, పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే ఒక విషయం గమనార్హం. ఇక్కడ మన్నించబడేవి కేవలం చిన్నచిన్న పాపాలే. ఘోరపాపాలు మన్నించబడటానికి 'పశ్చాత్తాపం' అవసరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1275

1276

హదీసు 1276

وعَنْهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قالَ: "العُمْرَة إِلَى العُمْرِة كَفَّارةٌ لِمَا بيْنهُما، والحجُّ المَبرُورُ لَيس لهُ جزَاءٌ إلاَّ الجَنَّةَ". متفقٌ عليهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒక ఉమ్రా తర్వాత మరొక ఉమ్రా చేయటం వాటి మధ్య జరిగిన పాపాలన్నిటికీ పరిహారం అవుతుంది. మబ్రూర్ (ఆమోద ముద్రపడిన) హజ్‌కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ లేదు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉమ్రా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “(The performance of) `Umrah is an expiation for the sins committed between it and the previous `Umrah; and the reward of Hajj Mabrur (i.e., one accepted) is nothing but Jannah.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు భావం కూడా పై హదీసు లాంటిదే. ఉమ్రా చేయటం మూలంగా కేవలం చిన్నచిన్న పాపాలు మాత్రమే మన్నించబడతాయి. ఉమ్రా చేసే పద్ధతి ఏమిటంటే ముందుగా దానికోసం దీక్షబూని కాబా గృహం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత సఫా, మర్వా కొండల మధ్య సయీ చేసి (అంటే పరుగెత్తి) శిరోముండనం చేయించుకోవాలి లేదా వెంట్రుకలు కత్తిరించుకోవాలి.

ఇకపోతే ఉమ్రా కూడా హజ్ మాదిరిగా విధిగా చేయవలసిందేనా కాదా? అన్న విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఉమ్రా చేయటం విధి (ఫర్జ్) అని అంటే మరికొందరు సున్నతె ముఅక్కదా అని అంటున్నారు. ఇంకొందరయితే దాన్ని నఫిల్‌గా భావిస్తున్నారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం మాత్రం మొదటి విషయం వైపుకే మ్రొగ్గుచూపుతున్నది. కొంతమంది దైవప్రవక్త సహచరుల మాటలు కూడా దీనిని సమర్ధిస్తున్నాయి. అలాకాని పరిస్థితుల్లో ఉమ్రా చేయటం విధి కాదన్న అభిప్రాయమే సరయినది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1276

1277

హదీసు 1277

وَعَنْ عَائِشَةَ، رضي الله عَنْهَا، قَالَتْ: قُلْتُ يَا رَسُولَ اللَّه، نَرى الجِهَادَ أَفضَلَ العملِ، أفَلا نُجاهِدُ؟ فَقَالَ:"لكِنْ أَفضَلُ الجِهَادِ: حَجٌّ مبرُورٌ" رواهُ البخاريُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: నేనొకసారి దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ, "దైవప్రవక్తా! మేము దైవమార్గంలో పోరాడటాన్ని శ్రేష్ఠమైన ఆచరణగా భావిస్తాం. అందుకని మాకూ దైవమార్గంలో పోరాడాలని ఉంది" అని అన్నాను. అందుకాయన, "ఉండవచ్చు, కాని (మీ కొరకు) శ్రేష్ఠమైన పోరాటం 'హజ్జె మబ్రూర్' చేయటానికి ప్రయత్నించటం" అని చెప్పారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని హజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: I said: “O Messenger of Allah! We consider Jihad as the best deed, should we not then go for Jihad?” The Messenger of Allah ﷺ said, “The best Jihad for you women is Hajj Mabrur (i.e., one accepted by Allah).”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

సాధారణ పరిస్థితుల్లో స్త్రీల కొరకు హజ్‌యాత్ర చేయటమే శ్రేష్ఠమైన జిహాదు. ఎందుకంటే ఇస్లాంలో రాజకీయాలు, రాజ్య నిర్వహణ, ఆర్థిక వాణిజ్య సంబంధాలు, యుద్ధం సంధి మొదలగు బయటి వ్యవహారాలన్నిటికీ పురుషులే బాధ్యులు. స్త్రీలకు ఈ బాధ్యతలేవీ వర్తించవు. అయితే కొన్ని ముఖ్య యుద్ధ సందర్భాల్లో క్షతగాత్ర సైనికులకు కట్లుకట్టడం కోసం, అన్నపానీయాలు అందించటం కోసం ఒకవేళ అవసరమయితే స్త్రీలను కూడా (పరదా నియమ నిబంధనలకు కట్టుబడి) యుద్ధభూమికి తీసుకెళ్ళవచ్చు. అంతేగాని మహిళలకు ప్రత్యేకంగా సైనిక శిక్షణనిచ్చి పురుషుల మాదిరిగా వారిని కూడా శత్రువులతో పోరాడే నిమిత్తం యుద్ధభూమికి పంపటం అన్యాయం. ఇలా చేస్తున్నవారు పాశ్చాత్య దేశాలను గ్రుడ్డిగా అనుకరిస్తున్నారని గ్రహించాలి. ఇస్లామియ బోధనల్లో దీనికి ఎలాంటి స్థానం లేదు. పైన పేర్కొనబడిన దైవప్రవక్త ప్రవచనం కూడా ఈ విషయాన్ని సమర్ధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1277

1278

హదీసు 1278

وَعَنْهَا أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَالَ:"مَا مِنْ يَوْمٍ أَكثَرَ مِنْ أنْ يعْتِقَ اللَّه فِيهِ عبْداً مِنَ النَّارِ مِنْ يَوْمِ عَرَفَةَ". رواهُ مسلمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దేవుడు తన దాసులకు అరఫా రోజు (అంటే జుల్‌హిజ్జా మాసపు తొమ్మిదో తేదీన) నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించినంతగా మరే రోజులోనూ ప్రసాదించడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ said, “There is no day on which Allah sets free more slaves from Hell than He does on the Day of `Arafah.”[Muslim].

ముఖ్యాంశాలు

జుల్‌హిజ్జా మాసపు తొమ్మిదో తేదీన (అరఫా రోజున) దేవుడు చాలా ఎక్కువ సంఖ్యలో మానవులకు నరకాగ్ని నుండి విముక్తినొసగుతాడు. వాస్తవం ఏమిటంటే హజ్‌యాత్ర చేసే ఎన్నో లక్షలమంది హాజీలు కాబా గృహాన్ని సందర్శించినప్పుడు దైవసన్నిధిలో చిత్తశుద్ధితో నిష్కల్మష హృదయంతో పశ్చాత్తాపం చెంది ఆయన ప్రసన్నతను చూరగొంటారు. ఫలితంగా హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో సమావేశమై ఉన్నప్పుడు తన ప్రత్యేక కారుణ్యంతో వారినందరినీ మన్నించి నరకం నుండి వారిని విముక్తుల్ని చేస్తాడు. దేవుడు మనల్ని కూడా అలాంటి అదృష్టవంతుల్లో చేర్చుగాక! (ఆమీన్)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1278

1279

హదీసు 1279

وعنِ ابنِ عباسٍ، رضي اللَّه عنهُما، أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"عُمرَةٌ في رمَضَانَ تَعدِلُ عَمْرَةً أَوْ حَجَّةً مَعِي" متفقٌ عليهِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ 'రమజాన్ మాసంలో చేసే ఉమ్రా, హజ్‌యాత్రకు లేదా నాతోపాటు చేయబడిన హజ్‌కు సమానం' అని ప్రవచించారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉమ్రా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “(The performance of) `Umrah during Ramadan is equal to Hajj (pilgrimage).” Or said, “Equal to the performance of Hajj with me.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

హజ్‌కు సమానమంటే దానివల్ల హజ్ బాధ్యత తీరిపోతుందనీ, ఇక హజ్ చేయవలసిన అవసరం ఉండదని అర్ధం ఎంతమాత్రం కాదు. ఆ నెలలో ఉమ్రా చేస్తే, జుల్ హిజ్జా మాసంలో హజ్ చేసినంత పుణ్యం లభిస్తుందని మాత్రమే దాని భావం. రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే ఏకకాలంలో రెండు ఆరాధనలు చేసినట్లవుతుంది. బహుశా అందుకే దానికంత పుణ్యం లభించి ఉండవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1279

1280

హదీసు 1280

وَعَنْهُ أنَّ امرَأَةً قالَتْ: يَا رَسُولَ اللَّهِ، إنَّ فَريضَةَ اللَّهِ عَلَى عِبَادِهِ في الحجِّ، أَدْرَكتْ أَبي شَيخاً كَبِيراً، لاَ يَثبُتُ عَلى الرَّاحِلَةِ أَفَأْحُجُّ عَنهُ؟ قَالَ:"نَعَمْ". متفقٌ عليهِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారే చేసిన కథనం: ఒక స్త్రీ (దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి) "దైవప్రువక్తా! దేవుడు తన దాసులపై విధిగా చేసిన హజ్ మా నాన్నగారికి అనివార్యమయినప్పటికీ ఆయన ముసలివారయిపోయారు. వాహనం మీద సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారాయన. మరి ఆయన తరపున నేను హజ్ చేయవచ్చునా?" అని అడిగింది. అందుకాయన "చేయవచ్చ"ని సమాధానమిచ్చారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: A woman came to the Messenger of Allah ﷺ and said, “Allah’s obligation upon His slaves has become obligatory on my father in his old age. My father is very old and incapable of riding. May I perform Hajj on his behalf?” He ﷺ said, “Yes.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

హదీసులో పేర్కొనబడిన మహిళ తండ్రి ముసలితనంలో హజ్ చేయగలిగే ఆర్ధిక స్తోమతగలవారయ్యాడు. కాని విపరీతమైన వృద్ధాప్యం మూలంగా అతనిలో ప్రయాణం చేయగలిగే శక్తిలేకపోయింది. కనుక దైవప్రవక్త ﷺ అతని కూతురికి అతని తరపున హజ్ చేసేందుకు అనుమతినిచ్చారు. అయితే ఈ విధంగా ఇతరుల తరపున హజ్ యాత్ర చేసే ప్రత్యామ్నాయ వ్యక్తులు ముందుగా స్వయంగా తమ హజ్ బాధ్యతను నెరవేర్చి ఉండాలని ఇతర హదీసులు ఉద్ఘాటిస్తున్నాయి. ఈ సందర్భంగా గమనించదగిన మరొక విషయం ఏమిటంటే, ఆర్థిక స్తోమత కలిగివుండిన తల్లిదండ్రులు హజ్ చేయకుండా చనిపోతే వారి తరపున వారి వారసులు హజ్ చేయడం చాలా అవసరం. లేకపోతే ఆ తల్లిదండ్రుల మీద ఆ బాధ్యతారుణం అలాగే ఉండిపోతుంది. ప్రళయదినాన దాన్ని గురించి వారిని నిలదీయటం జరుగుతుంది. పేదవారిపై హజ్ ఫర్జ్ కాదు గనుక ఒకవేళ వారు అదే స్థితిలో చనిపోతే వారి తరపున హజ్ చేయవలసిన అవసరం ఉండదు. ఎవరయినా పుణ్యఫలాపేక్షతో చేస్తే అది వేరే విషయం. దానికిగాను వారికి నఫిల్ హజ్ చేసిన పుణ్యం తప్పకుండా లభిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1280

1281

హదీసు 1281

وعن لقًيطِ بنِ عامرٍ، رضي اللَّه عنهُ، أَنَّهُ أَتى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَال: إنَّ أَبِي شَيخٌ كَبيرٌ لاَ يستَطِيعٌ الحجَّ، وَلا العُمرَةَ، وَلا الظَعَنَ، قَالَ:"حُجَّ عَنْ أَبِيكَ واعْتمِرْ ". رواهُ أَبو داودَ، والترمذيُّ وقال: حديثٌ حسنٌ صحيح.

హజ్రత్ లఖీత్ బిన్ ఆమిర్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం తను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళి, "(దైవప్రవక్తా!) మా నాన్న చాలా ముసలివారు. ఆయన హజ్, ఉమ్రా చేయలేరు. ఆయనలో ప్రయాణం చేసే శక్తి కూడా లేదు" అని విన్నవించుకున్నారు. అందుకాయన "మరయితే నీ నాన్న తరపున నువ్వే హజ్, ఉమ్రా (బాధ్యతలు) నిర్వర్తించు" అని ఆదేశించారు.

(అబూదావూద్, తిర్మిజీ-హసన్ సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని హజ్ విధుల ప్రకరణం – సుననె తిర్మిజీలోని హజ్ అధ్యాయాలు)

English

Laqit bin `Amir (radiyallahu anhu) reported: I came to the Prophet ﷺ and said: “My father is a very old man and does not have strength to perform Hajj (pilgrimage) or `Umrah or to undertake the journey.” The Prophet ﷺ said, “Perform Hajj and `Umrah on behalf of your father.”[Abu Dawud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1281

1282

హదీసు 1282

وعَنِ السائبِ بنِ يزيدَ، رضي اللَّه عنهُ، قَالَ: حُجَّ بي مَعَ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، في حَجةِ الوَداعِ، وأَنَا ابنُ سَبعِ سِنِينَ. رواه البخاريُّ.

హజ్రత్ సాయిబ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) కథనం: (నా బాల్యంలో) వీడ్కోలు హజ్ యాత్ర సందర్భంగా దైవప్రవక్త ﷺ వెంట (మా ఇంటివారు) నన్ను కూడా హజ్ చేయించారు. అప్పటికి నా వయసు ఏడేండ్లు.

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని హజ్ ప్రకరణం)

English

As-Sai’b bin Yazid (radiyallahu anhu) reported: I was seven years old when I was taken to perform Hajj (pilgrimage). This was during the time the Messenger of Allah ﷺ performed the Hajjat-ul-Wada` (Farewell Pilgrimage).

[Al-Bukhari].

ముఖ్యాంశాలు

చిన్నపిల్లలు కూడా హజ్‌యాత్ర చేయవచ్చు. వారిని హజ్ చేయించే పెద్దలకు దానిపుణ్యం లభిస్తుంది. ఆ విధంగా బాల్యంలో హజ్ చేసిన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆర్థిక స్తోమత కలిగిన వారయితే వారు తిరిగి హజ్ చేయవలసి ఉంటుంది. బాల్యంలో హజ్ చేసినంత మాత్రాన ఆ బాధ్యత నెరవేరినట్లు కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1282

1283

హదీసు 1283

وَعنِ ابنِ عبَّاسٍ، رضي اللَّه عَنْهُمَا، أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، لَقِيَ رَكْباً بِالرَّوْحَاءِ، فَقَالَ:"منِ القَوْمُ؟ "قَالُوا: المسلِمُونَ. قَالُوا: منْ أَنتَ؟ قَالَ:"رسولُ اللَّهِ"فَرَفَعَتِ امْرَأَةٌ صَبِياً فَقَالتْ ألهَذا حجٌّ؟ قَالَ:"نَعَمْ ولكِ أَجرٌ" رواهُ مُسلمٌ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒకసారి దైవప్రవక్త ﷺ రౌహా ప్రాంతంలో ఒక ప్రయాణీకుల బృందాన్ని కలిశారు. ఆయన వారిని ఉద్దేశ్యించి, "ఎవరు మీరు?" అని అడిగారు. దానికి వారు సమాధానమిస్తూ, "మేము ముస్లింలం. మీరెవరూ?" అని అడిగారు. "నేను దైవప్రవక్తను" అని బదులిచ్చారాయన. అంతలో ఒక మహిళ ఒక అబ్బాయిని ఎత్తిచూపుతూ, 'ఇతను హజ్ చేయవచ్చా?' అని అడిగింది. అందుకాయన, "చేయవచ్చు. దాని పుణ్యం నీకు లభిస్తుంది" అని చెప్పారు.

(ముస్లిం)

(సహీహ్ బుఖారి, హజ్ ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ came across a caravan at Ar-Rauha’ and asked who the people in the caravan were. They replied that they were Muslims. They asked: “Who are you?” He ﷺ said, “I am the Messenger of Allah.” Then a woman lifted up a boy to him and asked: “Would this child be credited with having performed the Hajj (pilgrimage)?” Whereupon he ﷺ said, “Yes, and you will have a reward.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1283

1284

హదీసు 1284

وَعَنْ أنسٍ، رضي اللَّه عنهُ، أنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حَجَّ عَلَى رَحْلٍ، وَكَانتْ زامِلتَهُ. رواه البخاريُّ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఒక అంబారీ మీద (కూర్చొని) హజ్ చేశారు. (ఆ సందర్భంగా) ఆయన ప్రయాణ సామగ్రి కూడా దాని మీదే ఉండేది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని హజ్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ performed the pilgrimage on an unsaddled camel which also carried his provisions (i.e., his Zamilah).[Al-Bukhari].

ముఖ్యాంశాలు

హదీసులో 'జామిలహ్' అనే పదం వచ్చింది. ప్రయాణసామగ్రి మోపబడిన ఒంటె, కంచర గాడిద తదితర వాహన జంతువుల్ని జామిలహ్ అంటారు. అంతిమ హజ్ యాత్ర సందర్భంగా దైవప్రవక్త ﷺ తాను స్వారీ చేస్తున్న ఒంటె మీదే ప్రయాణ సామగ్రిని ఉంచుకున్నారు. ఆ విధంగా ఆయన వాహనం జామిలహ్ (ప్రయాణ సామగ్రిని మోసే జంతువు) అయిందన్న మాట.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1284

1285

హదీసు 1285

وَعَنِ ابنِ عبَّاسٍ، رضي اللَّه عَنْهُمَا، قَالَ: كَانَت عُكاظُ وَمِجَنَّةُ، وَذو المجَازِ أَسْواقاً في الجَاهِلِيَّةِ، فَتَأَثَّمُوا أن يَتَّجرُوا في الموَاسِمِ، فَنَزَلتْ: {لَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَنْ تَبْتَغُوا فَضلاً مِن رَبِّكُم} [البقرة: ١٩٨] في مَوَاسِم الحَجِّ. رواهُ البخاريُّ. [كتاب الجهاد]

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఉకాజ్, మిజన్నహ్, జుల్ మజాజ్ అనేవి అంధయుగపు సంతలు. (తిరునాళ్ల, జాతరల సమయంలో ఇక్కడ కొనుగోళ్ళు, అమ్మకాలు జరిగేవి.) అయితే (ఇస్లాం వచ్చిన తర్వాత) దైవప్రవక్త సహచరులు హజ్ మాసాలలో వ్యాపారం చేయటాన్ని పాపంగా తలపోసేవారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. "(హజ్ దినాలలో) మీరు దేవుని అనుగ్రహాన్ని (అంటే ఉపాధిని) అన్వేషించదలచుకుంటే నిరభ్యంతరంగా అన్వేషించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు." (అల్‌బఖర:198)

(బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని హజ్ ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: Ukaz, Mijannah and Dhul-Majaz were markets during the pre-Islamic period. The Companions disliked trading there till the following Ayat of the Noble Qur’an were revealed: “There is no sin on you if you seek the Bounty of your Rubb (during pilgrimage by trading)…” (2:198)[Al-Bukhari].

ముఖ్యాంశాలు

హజ్‌యాత్రా కాలం రెండు నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. ఈ పవిత్ర దినాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం ధర్మసమ్మతమా కాదా అనే సందేహం కొద్దీ, వ్యాపారం చేస్తే అంధయుగపు చర్యలకు పాల్పడినట్లు అవుతుందేమోనన్న భయంతో దైవప్రవక్త సహచరులు ఆ కాలంలో వ్యాపారం చేయటాన్ని పాపకార్యంగా తలపోశారు. అప్పుడు విశ్వప్రభువు వారి అపోహల్ని, అపార్ధాల్ని దూరం చేస్తూ పైన పేర్కొనబడిన దివ్యఖుర్‌ఆన్ ఆయతును అవతరింపజేశాడు. హజ్‌యాత్రా కాలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించటం అధర్మమేమీ కాదనీ, దానివల్ల హజ్, ఉమ్రాలకు ఎలాంటి విఘాతం కలగదని ఆ వాక్యం స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం అనుమతి మాత్రమే. హజ్ యాత్రా దినాల్లో తప్పకుండా వ్యాపారం చేయాల్సిందేనని ఈ ఆయతు బోధించదు. కనుక ఆయా దినాల్లో వీలైనంత ఎక్కువగా దైవారాధన చేసి పరలోక పుణ్యాన్ని ఆర్జించుకోవాలనుకునేవారు వ్యాపార వ్యవహారాలన్నిటినీ త్యజించి పూర్తి ఏకాగ్రతతో దైవారాధనలో లీనమయిపోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|హజ్ ప్రకరణం|233. హజ్ విధింపు, ఘనత|హదీసు 1285