హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 228వ అధ్యాయం: షవ్వాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1255) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
228. షవ్వాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం
باب استحباب صوم ستة من أيام من شوال
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1255
عَنْ أَبي أَيوبِ رضِيَ اللَّه عَنْهُ، أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ صَامَ رَمَضانَ ثُمَّ أَتَبَعَهُ سِتًّا مِنْ شَوَّالٍ كانَ كصِيَامِ الدَّهْرِ" رواهُ مُسْلِمٌ.
హజ్రత్ అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: ఎవరయినా రమజాన్ నెలసాంతం ఉపవాసాలు పాటించి ఆ తర్వాత షవ్వాల్ మాసపు ఆరు రోజులు ఉపవాసం పాటిస్తే వారు కాలమంతా ఉపవాసం పాటించినట్లే.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Ayyub (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who observes As-Saum (the fasts) in the month of Ramadan, and also observes As-Saum for six days in the month of Shawwal, it is as if he has observed As-Saum for the whole year.”[Muslim].
ముఖ్యాంశాలు
"ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది" అన్న దివ్యఖుర్ఆన్ సూక్తి ఆధారంగా ఒక రమజాన్ నెల ఉపవాసం పాటిస్తే పది నెలలు ఉపవాసం పాటించినట్లుగా పరిగణించబడుతుంది. ఆ తర్వాత షవ్వాల్ మాసంలో పాటించబడే ఆర్రోజుల ఉపవాసం రెండు నెలల ఉపవాసంగా భావింపబడుతుంది. అవన్నీ కలిసి మొత్తం పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరమన్నమాట. ఆ విధంగా ఎవరయినా ప్రతి యేడు రమజాన్తోపాటు షవ్వాల్ మాసంలో ఆరు రోజులు నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఉంటే వారు జీవితమంతా ఉపవాసం పాటించినట్లుగా భావించటం జరుగుతుంది. కనుక షవ్వాల్ మాసపు ఆరు రోజుల ఉపవాసాలు నఫిల్ అయినప్పటికీ వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ఉపవాసాలను నిరంతరాయంగానయినా పాటించవచ్చు లేదా అప్పుడప్పుడయినా పాటించవచ్చు. అయితే ఆరు ఉపవాసాలనూ షవ్వాల్ నెలలోనే పాటించాలన్నది నియమం. ఇకపోతే వ్యాధి, ప్రయాణం తదితర కారణాలచేత రమజాన్ మాసపు ఉపవాసాలన్నీ పాటించలేక పోయినవారు ముందుగా వాటిని పూర్తి (ఖజా) చేసుకొని ఆ తర్వాతే షవ్వాల్ మాసపు నఫిల్ ఉపవాసాలు పాటించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|228. షవ్వాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసం పాటించటం అభిలషణీయం|హదీసు 1255
You must be logged in to post a comment.