హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 227వ అధ్యాయం: అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1251 – 1254) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
227. అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత
باب فضل صوم يوم عرفة وعاشوراء وتاسوعاء
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1251
عنْ أَبي قتَادةَ رضِي اللَّه عَنْهُ، قالَ: سئِل رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: عَنْ صَوْمِ يوْمِ عَرَفَةَ؟ قَالَ:"يكفِّرُ السَّنَةَ المَاضِيةَ وَالبَاقِيَةَ" رواه مسلمٌ.
హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, "అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది" అని వివరించారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Qatadah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ was asked about the observance of Saum (fasting) on the day of `Arafah. He said, “It is an expiation for the sins of the preceding year and the current year.”[Muslim].
ముఖ్యాంశాలు
జుల్హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని 'అరఫా రోజు' అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు, కనుక ఆ రోజును 'అరఫాత్ రోజు'గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్థనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆ రోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆ రోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ల పాపాలను తుడిచిపెట్టేస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|227. అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత|హదీసు 1251
హదీసు 1252
وعنْ ابنِ عباسٍ رضيَ اللَّه عنهما، أَنَّ رَسول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم صَامَ يوْمَ عاشوراءَ، وأَمَرَ بِصِيَامِهِ. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఆషూరా రోజు (అంటే ముహర్రమ్ నెల పదో తేదీన) స్వయంగా ఉపవాసం ఉన్నారు. ఆ రోజు ఉపవాసం పాటించమని (తన సహచరుల్ని) ఆదేశించారు కూడా. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం -సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ observed Saum (fasting) on the day of `Ashura’ and commanded us to fast on this day.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ముహర్రమ్ పదో తేదీని 'ఆషూరా' అని పిలుస్తారు. ఇతర హదీసుల ద్వారా తెలిసేదేమంటే, దైవప్రవక్త ﷺ మక్కా నుండి మదీనాకు వలసవచ్చినప్పుడు మదీనాలోని యూదులు ముహర్రమ్ మాసపు పదో తేదీన ఉపవాసం పాటించటాన్ని ఆయన గమనించారు. వారిని ఉద్దేశ్యించి, "మీరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తారు?" అని అడిగారు. దానికి యూదులు, "దేవుడు ఈ రోజు మూసా ప్రవక్తకు ఫిరౌన్ ఆగడాల నుండి విముక్తినొసగాడు. ఆ సంతోషఘడియల్ని పురస్కరించుకుని మేము ఈ రోజు ఉపవాసం పాటిస్తాం" అని చెప్పారు. అది విని దైవప్రవక్త ﷺ "మూసా ప్రవక్త సంతోషంలో పాలుపంచుకోవటానికి మీకంటే మేము ఎక్కువ హక్కుదారులం" అంటూ ఆయన కూడా ఆ రోజు ఉపవాసం పాటించారు. అంతేకాదు, వచ్చే ఏడాది గనక బ్రతికుంటే యూదులకు వ్యతిరేకంగా తాను పదో తేదీతోపాటు తొమ్మిదో తేదీన కూడా ఉపవాసం పాటిస్తానని ప్రకటించారు. వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన తన సహచరులకు 'మీరు ఆషూరా రోజుతోపాటు తొమ్మిదో తేదీ లేక పదకొండో తేదీన కూడా ఉపవాసం పాటించండి. ఆ విధంగా రెండు రోజులు ఉపవాసం పాటించి యూదుల పట్ల వ్యతిరేకతను ప్రదర్శించండి' అని బోధించారు. కనుక ముహర్రమ్ మాసపు 9, 10, 11 తేదీల్లో ఉపవాసం పాటించటం మస్నూన్ (సంప్రదాయం). కాని శోచనీయమైన విషయం ఏమిటంటే నేడు ముస్లింలు ఈ సంప్రదాయాన్నయితే ఆచరించరు; పైగా దాని స్థానంలో అనేక దురాచారాలను నిర్వహిస్తారు. లేదంటే షియాలు జరిపే ప్రత్యేక సంతాప ఊరేగింపుల్లో పాల్గొంటారు. నిజం చెప్పాలంటే అలాంటి ఊరేగింపుల్లో పాల్గొనటం మహాపాపం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|227. అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత|హదీసు 1252
హదీసు 1253
وعنْ أَبي قَتَادةَ رضيَ اللَّه عَنْهُ، أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سُئِلَ عَنْ صِيَامِ يَوْمِ عاشُوراءِ، فَقَال:"يُكَفِّرُ السَّنَةَ المَاضِيَةَ"ر واه مُسْلِمٌ.
హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺను ఆషూరా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధాన మిస్తూ, "అది గత సంవత్సరపు పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది" అని చెప్పారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Qatadah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ was asked about observing As-Saum (the fast) on the tenth day of Muharram, and he replied, “It is an expiation for the sins of the preceding year.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|227. అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత|హదీసు 1253
హదీసు 1254
وعَنِ ابنِ عَبَّاسٍ رَضِيَ اللَّه عنْهُمَا، قَالَ: قالَ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لَئِنْ بَقِيتُ إِلى قَابِلٍ لأصُومَنَّ التَّاسِعَ" رواهُ مُسْلِمٌ. [باب استحباب صوم ستة أيام من شوال] …
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒకవేళ నేను వచ్చే సంవత్సరం వరకు బ్రతికుంటే ముహర్రమ్ మాసపు (పదో తేదీతో పాటు) తొమ్మిదో తేదీన కూడా ఉపవాసం పాటిస్తాను. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “If I remain alive till the next year, I shall also observe fast on the ninth of Muharram.”[Muslim].
ముఖ్యాంశాలు
కొంతమంది ఈ హదీసును "నేను కేవలం తొమ్మిదో తేదీన మాత్రమే ఉపవాసం పాటిస్తాను" అనే అర్థంలో వివరించారు. కాని ఈ వివరణ సరయినది కాదు. ఇతర హదీసులు ఈ వివరణను త్రోసిపుచ్చుతున్నాయి. దైవప్రవక్త ﷺ యూదుల పట్ల వ్యతిరేకతను ప్రదర్శించాలనే ఉద్దేశ్యంతో ముహర్రమ్ మాసపు పదో తేదీతోపాటు తొమ్మిదో తేదీన కూడా ఉపవాసం పాటిస్తానని నిశ్చయించుకున్నారు. అంతేకాదు, తన సహచరుల్ని కూడా అలా చేయమని ఆదేశించారు. ముస్నదె అహ్మద్ గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది. ఈ విషయాన్ని మేము ఇంతకు ముందు ముఖ్యాంశాల్లో కూడా వివరించాం. అందుకే హదీసు మూలాన్ని కూడా ఆ భావానికి అనుగుణంగా అనువదించాం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|227. అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత|హదీసు 1254
You must be logged in to post a comment.