హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 225వ అధ్యాయం: ముహర్రమ్, షాబాన్ మరియు గౌరవప్రదమైన మాసాల్లో పాటించే ఉపవాసాల ఘనత. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1247 – 1249) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
225. ముహర్రమ్, షాబాన్ మరియు గౌరవప్రదమైన మాసాల్లో పాటించే ఉపవాసాల ఘనత
باب بيان فضل صوم المُحَرَّم وشعبان والأشهر الحُرمُ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1247
عَنْ أَبي هُريرَةَ رضيَ اللَّه عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَفْضَلُ الصِّيَامِ بعْدَ رَمضَانَ: شَهْرُ اللَّهِ المحرَّمُ، وَأَفْضَلُ الصَّلاةِ بَعْد الفَرِيضَةِ: صَلاةُ اللَّيْلِ" رواه مسلمٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: రమజాన్ తర్వాత దేవుని మాసమయిన ముహర్రమ్ నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. అదే విధంగా ఫర్జ్ (విధి) నమాజుల తర్వాత పాటించబడే (నఫిల్) నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శ్రేష్ఠమైనది.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The best month for observing Saum (fasting) next after Ramadan is the month of Allah, the Muharram; and the best Salat (prayer) next after the prescribed Salat is Salat at night (Tahajjud prayers).”[Muslim].
ముఖ్యాంశాలు
ముహర్రమ్ మాసపు ఘనతను వెల్లడించటానికి దాన్ని "దేవుని మాసం" అని అనటం జరిగింది. ఉదాహరణకు మనం దైవగృహం, దేవుని ఒంటె అని చెబుతుంటాం. అలా చెప్పినంత మాత్రాన అవి దేవుడు వాడుకునే వస్తువులు కానక్కర్లేదు. వాటి విశిష్టతను వివరించటమే దాని ఉద్దేశ్యం. నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో ముహర్రమ్ కూడా ఒకటి. ఇస్లామీయ క్యాలెండరు ఈ మాసంతోనే ప్రారంభమవుతుంది. మిగతా మూడు మాసాలు జుల్ఖాదా, జుల్హిజ్జా, రజ్జబ్. వీటిలో ముహర్రమ్ మాసపు ప్రత్యేకత ఏమిటంటే ఈ నెలలో పాటించబడే ఉపవాసాలు ఒక్క రమజాన్ నెలను మినహాయించి చూస్తే మిగతా నెలలన్నిటి ఉపవాసాల కన్నా ఎంతో శ్రేష్ఠమైనవి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|225. ముహర్రమ్, షాబాన్ మరియు గౌరవప్రదమైన మాసాల్లో పాటించే ఉపవాసాల ఘనత|హదీసు 1247
హదీసు 1248
وعَنْ عائشةَ رَضِيَ اللَّه عَنْهَا، قالَتْ: لَمْ يَكُنِ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَصُوم مِنْ شَهْرٍ أَكْثَرَ مِنْ شَعْبَانَ، فَإِنَّه كانَ يَصُوم شَعْبَانَ كلَّه. وفي رواية: كَانَ يَصُومُ شَعْبَانَ إِلاَّ قَلِيلاً. متفقٌ عليه.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ షాబాన్ నెలలో (నఫిల్) ఉపవాసాలు పాటించినంతగా మరే ఇతర నెలలోనూ పాటించేవారు కాదు. నిశ్చయంగా ఆయన షాబాన్ నెలసాంతం ఉపవాసం పాటించేవారు.
వేరొక ఉల్లేఖనం ప్రకారం షాబాన్ నెలలోని కొన్ని రోజులు మినహాయించి మిగతా రోజులన్నీ ఆయన ఉపవాసం పాటించేవారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ did not observe voluntary Saum (fasting) so frequently during any other month as he did during Sha`ban. He observed Saum throughout the month of Sha`ban.
Another narration is: He ﷺ observed Saum during the whole month of Sha`ban except a few days.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺ షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించటానికి గల కారణాన్ని వేరొక హదీసు ఈ విధంగా వివరించింది: దాసుల కర్మలు షాబాన్ మాసంలో దైవసన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. అందుకని దైవప్రవక్త ﷺ తాను ఉపవాసంలో ఉన్న స్థితిలోనే తన కర్మలు దైవసన్నిధిలో ప్రవేశపెట్టబడాలన్న ఉద్దేశ్యంతో ఆ మాసంలో వీలైనంత ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు (నసాయి).
అయితే సామాన్య ముస్లింలు మాత్రం షాబాన్ మాసపు పదిహేనవ తేదీ వరకు ఉపవాసాలు పాటించి,ఆ తర్వాత నఫిల్ ఉపవాసాలు పాటించటం మానుకోవాలి. లేకపోతే ఒళ్ళు నీరసించి, శక్తిసామర్ధ్యాలు క్షీణించి రమజాన్ మాసంలో విధిగా పాటించవలసిన ఉపవాసాల మీద దాని ప్రభావం పడవచ్చు. అది వాంఛనీయం కాదు. ఇకపోతే దైవప్రవక్త ﷺ సంగతి వేరు. ఆయనకు దేవుని తరపు నుండి ఎంతో ఆధ్యాత్మిక శక్తి లభిస్తూ ఉండేది. అందువల్ల ఆయన ఎన్ని ఉపవాసాలు పాటించినా నీరసించిపోయేవారు కాదు. బహుశా అందుకేనేమో తాను స్వయంగా 'సౌమె విసాల్' (నిరంతర ఉపవాసాలు) పాటించినప్పటికీ ఆయన తన అనుచర సమాజాన్ని మాత్రం ఆ విధంగా నిరంతరంగా ఉపవాసాలు పాటించకుండా వారించారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|225. ముహర్రమ్, షాబాన్ మరియు గౌరవప్రదమైన మాసాల్లో పాటించే ఉపవాసాల ఘనత|హదీసు 1248
హదీసు 1249
وعن مجِيبَةَ البَاهِلِيَّةِ عَنْ أَبِيهَا أَوْ عمِّها، أَنَّهُ أَتى رَسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ثُمَّ انطَلَقَ فَأَتَاهُ بعدَ سَنَة، وَقَد تَغَيَّرتْ حَالهُ وَهَيْئَتُه، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ أَمَا تعْرِفُنِي؟ قَالَ:"وَمَنْ أَنتَ؟ "قَالَ: أَنَا البَاهِلِيُّ الَّذِي جِئتك عامَ الأَوَّلِ. قَالَ:"فَمَا غَيَّرَكَ، وقَدْ كُنتَ حَسَنَ الهَيئةِ؟ "قَالَ: مَا أَكلتُ طَعَاماً مُنْذُ فَارقْتُكَ إِلاَّ بلَيْلٍ. فَقَال رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"عَذّبْتَ نَفسَكَ،"ثُمَّ قَالَ:"صُمْ شَهرَ الصَّبرِ، وَيَوماً مِنْ كلِّ شَهر"قَالَ: زِدْني، فإِنَّ بِي قوَّةً، قَالَ:"صُمْ يَوميْنِ"قَالَ: زِدْني، قَالَ:"صُمْ ثلاثَةَ أَيَّامٍ"قالَ: زِدْني. قَالَ: صُمْ مِنَ الحُرُمِ وَاتْرُكْ، صُمْ مِنَ الحرُم وَاترُكْ، صُمْ مِنَ الحرُمِ وَاتْرُكُ"وقالَ بِأَصَابِعِهِ الثَّلاثِ فَضَمَّهَا، ثُمَّ أَرْسَلَهَا. رواه أَبُو داود. وَ"شهرُ الصَّبرِ": رَمضانُ.
హజ్రత్ ముజీబా బాహిలియా తన తండ్రి లేక పెదనాన్న నుండి చేసిన కథనం ప్రకారం ఆయన ఒకసారి దైవప్రవక్త ﷺ ను సందర్శించుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి తిరిగొచ్చారు. అప్పటికి ఆయన చాలా మారిపోయి ఉన్నారు. ఆయన వాలకంలో చాలా మార్పులొచ్చాయి. (దైవప్రవక్త – సల్లం- తన వంక ఆశ్చర్యంగా చూస్తుంటే) "ఏమిటి దైవప్రవక్తా! నేనెవర్నో గుర్తురావటం లేదా?" అన్నారు. "అదే, ఎవర్నువ్వు?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. "నేను దైవప్రవక్తా! బాహిలీని….. క్రితం సంవత్సరం మీ దగ్గరికి వచ్చాను చూడండి….." అన్నారాయన. ఆ మాట విని దైవప్రవక్త ﷺ ఆశ్చర్యపోతూ,"(నువ్వా!) ఏమిటి మనిషి అలా మారిపోయావ్. ఇంతకు ముందు చాలా బావుండే వాడివే!" అన్నారు. అందుకాయన "(మరేంలేదు దైవప్రవక్తా!) నిరుడు మిమ్మల్ని కలుసుకొని వెళ్ళినప్పటి నుంచి (పగలల్లా ఉపవాసం పాటించి) కేవలం రాత్రి భోజనం మాత్రమే చేస్తున్నాను" అని చెప్పారు. అది విని దైవప్రవక్త ﷺ ఆయన్ని మందలిస్తూ, "ఆత్మ శిక్షకు పాల్పడ్డావా? (ఇక నుంచి) సహన మాసం (రమజాన్)లో ఉపవాసాలు పాటించి ఆ తర్వాత ప్రతి నెలా ఒక రోజు మాత్రమే ఉపవాసం ఉండు" అని హితోపదేశం చేశారు. "నా దగ్గర చాలా బలముంది. కనుక ఉపవాసాల సంఖ్యను మరికాస్త పెంచండి" అని కోరారాయన. "అయితే రెండు రోజులు ఉపవాసం ఉండు" అని అన్నారు దైవప్రవక్త ﷺ. ఆయన మళ్ళీ, "ఇంకాస్త పెంచండి"అని కోరారు. "మూడ్రో జులు ఉపవాసం ఉండు చాలు" అని అన్నారు దైవప్రవక్త ﷺ.
ఆయన మళ్ళీ "నా కోసం ఇంకా పెంచండి" అని కోరారు. అప్పుడు దైవప్రవక్త ﷺ "(అవసరం లేదు) గౌరవప్రదమైన మాసాల్లో (మూడ్రోజులు) ఉపవాసం పాటించి ఆ తర్వాత వదలిపెట్టు. గౌరవప్రదమైన (నిషిద్ధ) మాసాల్లో ఉపవాసం పాటించి ఆ తర్వాత వదలిపెట్టు. గౌరవప్రదమైన (నిషిద్ధ) మాసాల్లో మూడ్రోజులు ఉపవాసం పాటించి ఆ తర్వాత వదలిపెట్టు" అని (మూడుసార్లు) బోధించారు.
ఆ సమయంలో ఆయన తన మూడు వ్రేళ్ళను కలుపుతూ, వదిలేస్తూ సైగ చేసి చూపించారు. (అబూదావూద్)
(సుననె అబూదావూద్లోని ఉపవాసాల ప్రకరణం)
షేఖ్ అల్బానీగారు "అత్తాలీఖుర్రగీబు అలత్తర్గీబి వత్తర్హీబ్" అనే గ్రంథంలో ఈ హదీసు ఆధారాలను బలహీనమైనవిగా ఖరారు చేశారు.
English
Reported Mujibah Al-Bahiliyah on the authority of her father or uncle that he visited the Messenger of Allah ﷺ once and then went to see him again after a year. His appearance had totally changed. He asked the Messenger of Allah ﷺ if he had recognized him. The Messenger of Allah ﷺ asked, “Who are you?” He replied: “I am Al-Bahili who visited you last year.” The Messenger of Allah ﷺ said, “You were quite handsome, what has changed your appearance so much?” He replied, “Since my departure from here, I have not eaten anything except at night.” The Messenger of Allah ﷺ remarked, “You have put yourself to torture. Observe Saum (fasting) during the Month of Patience (i.e., Ramadan) and fast one day from each month.” He submitted, “Permit me to observe more voluntary fasts because I have capacity to do so.” The Messenger of Allah ﷺ said, “Then observe fasts for two days in every month.” He said, “Permit me to observe more.” The Messenger of Allah ﷺ said, “Observe fasts on three days in every month.” He requested that he should be allowed to observe more fasts. The Messenger of Allah ﷺ said, “Fast three days during the sacred months and omit fasting for three days alternately.” He ﷺ joined his three fingers together and left them apart while repeating this sentence thrice.[Abu Dawud].
ముఖ్యాంశాలు
ముజీబా బాహిలియా తండ్రి పేరు అబ్దుల్లాహ్ బిన్ హారిస్ బాహిలీ. ఒకవేళ ఈ హదీసుని వివరించినది ఆమె పెదనాన్న అయితే ఆయన పేరు తెలియదు. దానిక్కారణం ఆయన గారి అసలు పేరు ఖ్యాతిగాంచలేదు. ఏమయినప్పటికీ ఆయన ఒక సంవత్సరం మొత్తం పగలల్లా ఉపవాసం ఉండి కేవలం రాత్రి భోజనం మాత్రమే చేసేవారు. దానివల్ల ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. అది చూసి దైవప్రవక్త ﷺ ఆయన్ని మందలించి ఎల్లప్పుడూ ఉపవాసం పాటించవద్దని వారించారు. దానికి బదులు ప్రతి నెలా ముఖ్యంగా నిషిద్ధ (అంటే గౌరవప్రదమైన) మాసాల్లో మూడ్రోజులు ఉపవాసముండి ఆ తర్వాత వదిలేయమని తాకీదు చేశారు. ఒక సత్కార్యానికి పదిరెట్ల పుణ్యం లభిస్తుంది. కనుక మూడ్రోజులు ఉపవాసముంటే ముప్పై రోజులు ఉపవాసం పాటించినట్లే. ఆ విధంగా ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసముంటే నిత్యం ఉపవాసం పాటించినట్లే అవుతుంది కదా!
ఒకవేళ ఎవరయినా మరీ ఎక్కువ ఓపిక ఉన్నవారయితే వారు దావూదీ ఉపవాస వ్రతాన్ని అనుసరించాలి. అంటే ఒకరోజు ఉపవాసం పాటిస్తే, మరోరోజు ఉపవాసం వదిలేయాలి. దావూద్ (అలైహిస్సలామ్) ఇలాగే చేసేవారు. మరో విషయం ఏమిటంటే మనిషి ఉపవాసానికి అలవాటు పడిపోకూడదు. అలవాటు పడిపోతే ఉపవాసంలో ఆకలి, బాధ అనిపించదు. కనుక ఒకరోజు విడిచిపెట్టి మరో రోజు ఉపవాసం పాటించాలి. దానివల్ల సరిక్రొత్తగా ఉపవాసం ప్రారంభించినప్పుడల్లా ఆకలి బాధలు కల్గుతాయి. అవి పుణ్యఫలాలకు కారణభూతమవుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|225. ముహర్రమ్, షాబాన్ మరియు గౌరవప్రదమైన మాసాల్లో పాటించే ఉపవాసాల ఘనత|హదీసు 1249
You must be logged in to post a comment.