హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 224. ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 224వ అధ్యాయం: ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1243 – 1246) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

224. ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు

↑ విషయ సూచిక

باب في مَسائل من الصوم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1243

హదీసు 1243

عَنْ أَبي هُريرةَ رَضيَ اللَّه عَنْهُ، عَن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "إِذا نَسِيَ أَحَدُكُم، فَأَكَلَ أَوْ شَرِبَ، فَلْيتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللَّه وَسَقَاهُ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరయినా ఉపవాస స్థితిలో మరిచిపోయి ఏదన్నా తిన్నా లేక త్రాగినా (వారి ఉపవాసం భంగం కాదు. ఆ తర్వాత మరేమీ తినకుండా) వారు తమ ఉపవాసాన్ని పూర్తిచేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి వారికి దేవుడు తినిపించాడు, త్రాపించాడు.(బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “If any one of you forgetfully eats or drinks (while observing fasting) he should complete his Saum (fasting), for Allah has fed him and given him to drink.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఉపవాస స్థితిలో మరిచిపోయి ఏదయినా తిన్నా త్రాగినా దానివల్ల ఉపవాసానికి ఎలాంటి భంగం కలగదు. గుర్తొచ్చిన వెంటనే ఆ పనిని వదలిపెట్టి ఉపవాసాన్ని కొనసాగించాలి. ఆ ఉపవాసాన్ని మళ్ళీ పాటించనవసరం లేదు. అదే విధంగా దానికి ఎలాంటి పరిహారాన్ని కూడా చెల్లించుకోవాల్సిన అవసరం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|224. ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు|హదీసు 1243

1244

హదీసు 1244

وعن لَقِيطِ بنِ صَبِرةَ رَضِيَ اللَّه عَنْهُ، قالَ: قلتُ: يَا رسول اللَّه أَخْبِرْني عَنِ الْوُضوءِ؟ قَالَ:"أَسْبِغِ الْوضُوءَ، وَخَلِّلْ بَيْن الأَصَابِعِ، وَبَالَغْ في الاسْتِنْشَاقِ، إِلاَّ أَنْ تكُونَ صَائماً" رواه أَبُو داود، والترمذي وقال: حديثٌ حسنٌ صحيحٌ.

హజ్రత్ లఖీత్ బిన్ సబిరా (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺ ను అడిగాను, "దైవప్రవక్తా! నాకు వుజూ గురించి తెలియుజేయండి" అని. అందుకాయన నాకు ఈ విధంగా ఉపదేశించారు: సంపూర్ణరీతిలో వుజూ చేసుకో, వ్రేళ్ళ మధ్య భాగాన్ని కూడా తడుపుకో. (సువాసనను గట్టిగా పీల్చినట్టు) ముక్కులోనికి బాగా నీళ్ళు ఎక్కించి శుభ్రం చేసుకో. అయితే ఉపవాస స్థితిలో మాత్రం అలా చేయనవసరం లేదు.

(అబూదావూద్, తిర్మిజీ – హసన్)

(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల ప్రకరణం – సుననె తిర్మిజీలోని ఉపవాసానికి సంబంధించిన అధ్యాయాలు)

English

Laqit bin Sabirah (radiyallahu anhu) reported: I requested the Messenger of Allah ﷺ to talk to me about ablution. He said, “Perform the Wudu’ well (by washing those parts of the body, such as the face, hands and feet beyond what is required, like washing the hands up to the upper-arm instead of the elbow). Cleanse the base of your fingers and sniff water deep into the nose except when you are observing fast.”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

సాధారణ పరిస్థితుల్లో బాగా వుజూ చేయాలనుకున్నప్పుడు ముక్కులోనికి నీళ్ళు ఎక్కించి ముక్కును పూర్తిగా శుభ్రం చేసుకోవటం, నోటిలోనికి నీళ్ల తీసుకుని పుక్కిలిస్తూ 'గరారా' కూడా చేయటం అవసరం. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేయకపోవటమే మంచిది. లేనిపక్షంలో ముక్కు లేక గొంతు ద్వారా నీళ్లు లోనికి వెళ్లిపోయి ఉపవాసం భంగం అయ్యే ప్రమాదముంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|224. ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు|హదీసు 1244

1245

హదీసు 1245

وعنْ عائشةَ رضي اللَّه عَنْها، قالَتْ: كانَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يدْرِكُهُ الفَجْرُ وَهُوَ جُنُبٌ مِنْ أَهْلِهِ، ثُمَّ يَغْتَسِلُ ويَصُومُ. متفقٌ عليه.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక్కోసారి దైవప్రవక్త ﷺ ఉషోదయం వేళ (నిద్ర లేచేటప్పుడు ఆ రాత్రి) తమ భార్యతో కలిసి ఉండటం చేత లైంగిక అశుద్ధావస్థలో ఉండేవారు. ఆ తర్వాత (ఉషోదయం వేళ) స్నానం చేసి ఉపవాసం ఉండేవారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ would wake up at Fajr time in a state of Janabah; so he would take bath before dawn and observe fasting.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|224. ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు|హదీసు 1245

1246

హదీసు 1246

وعنْ عائشةَ وأُمِّ سَلَمَةَ، رَضيَ اللَّه عنْهُما، قَالَتَا: كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُصْبِح جُنُباً مِنْ غَيْرِ حُلْمٍ، ثُمَّ يصُومُ"متفقٌ عليهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) మరియు ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా)లు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒక్కోసారి తెల్లవారు (నిద్ర) లేచేటప్పుడు లైంగిక అశుద్ధావస్థలో ఉండేవారు. అయితే అది స్వప్నావస్థలో జరిగిన వీర్యస్ఖలనం కాదు. ఆ తర్వాత ఆయన అదే స్థితిలో ఉపవాసం ప్రారంభించేవారు.

(బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

`Aishah, and Umm Salamah (radiyallahu anhum) reported: The Messenger of Allah ﷺ would wake during Ramadan (fasting) in a state of major impurity without a wet dream, but on account of sexual intercourse and he would take a bath before dawn.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై రెండు హదీసుల భావం ఒక్కటే. దైవప్రవక్త ﷺ కొన్నికొన్నిసార్లు నిద్రలేచేటప్పుడు లైంగిక అశుద్ధావస్థలో ఉండేవారు. అయినప్పటికీ ఆయన అదే స్థితిలో సహ్‌రీ భుజించి ఉపవాసం మొదలుపెట్టేవారు. ఆ తర్వాత తలంటు పోసుకొని నమాజ్ చేసేవారు. నమాజ్ చేయటానికి పరిశుభ్రత అవసరంగాని, ఉపవాసం ప్రారంభించటానికి పరిశుద్ధావస్థ అవసరం లేదు. అంచేత లైంగిక అశుద్ధస్థితిలో ఉపవాసం ప్రారంభించినా దానివల్ల ఉపవాసానికి ఎలాంటి భంగం కలగదు.

మరో విషయం ఏమిటంటే దైవప్రవక్త ﷺకు కలిగే అశుద్ధావస్థ భార్యతో సంభోగించినందువల్ల కలిగేదే గాని స్వప్నావస్థలో వీర్యస్ఖలనం వల్ల కలిగేది కాదు. ఎందుకంటే ప్రముఖుల అభిప్రాయం ప్రకారం స్వప్నావస్థలో వీర్యస్ఖలనం అనేది పైశాచిక దుష్ట ప్రేరేపణల వల్ల జరుగుతుంది. దైవప్రవక్తలు అలాంటివాటి నుండి సురక్షితంగా ఉంటారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|224. ఉపవాసానికి సంబంధించి కొన్ని ఆదేశాలు|హదీసు 1246