హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 22వ అధ్యాయం: శ్రేయోభిలాష. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 183 – 185) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
22. శ్రేయోభిలాష
باب النصيحة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ} [الحجرات:١٠]
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు: "విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు" (అల్ హుజురాత్ : 10)
మరోచోట హజ్రత్ నూహ్ – అలైహి – తన జాతి వారితో అన్నమాటను ఈ విధంగా ప్రస్తావించాడు:
{وَأَنْصَحُ لَكُمْ} [الأعراف: ٦٢]
"నేను మీ బాగుకోరేవాడిని." (అల్ ఆరాఫ్ : 62)
{وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ} [لأعراف: ٦٨]
ఇంకొకచోట హజ్రత్ హూద్ ప్రవక్త పలుకులు గమనించదగినవి: "నేను మీ యొక్క నమ్మదగిన శ్రేయోభిలాషిని." (అల్ ఆరాఫ్ : 68)
English
“The believers are nothing else than brothers (in Islamic religion)”. [Al-Ḥujurāt 49:10]
“(Nuh said) I give sincere advice to you”. [Al-A‘rāf 7:62]
“(And Hud said) And I am a trustworthy adviser (or well-wisher) for you”. [Al-A‘rāf 7:68]
హదీసు 183
فَالأَوَّلُ: عن أَبِي رُقيَّةَ تَميمِ بنِ أَوْس الدَّارِيِّ رضي اللَّه عنه أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الدِّينُ النَّصِيحَةُ"قُلْنَا: لِمَنْ؟ قَالَ"للَّه وَلِكِتَابِهِ ولِرسُولِهِ وَلأَئمَّةِ المُسْلِمِينَ وَعَامَّتِهِمْ "رواه مُسْلم.
హజ్రత్ అబూ రుఖయ్యా తమీమ్ బిన్ ఔస్ దారీ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "ధర్మమంటే మంచిని అభిలషించటం" అని అన్నారు. అప్పుడు మేము "(దైవప్రవక్తా!) ఎవరి మంచిని అభిలషించాలి?" అని సందేహపడగా, "అల్లాహ్ మరియు ఆయన గ్రంథం, ఆయన ప్రవక్త, ముస్లిం నేతలు, ఇంకా సామాన్య ముస్లింలందరి విషయంలోనూ మంచిని అభిలషించటమే ధర్మం" అని ఆయన ﷺ అన్నారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
Tamim bin Aus Ad-Dari (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Ad-Deen is sincerity”. We said: “For whom?” He replied, “For Allah, His Book, His Messenger and for the leaders of the Muslims and their masses”.[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు శ్రేయోభిలాష ప్రాధాన్యతను వివరిస్తోంది. ప్రజలందరి బాగు కోరి పనిచేయాలని అంటోంది. దేవుని బాగు కోరడమంటే ఆయనపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించి, మిక్కిలి చిత్తశుద్ధితో, భక్తిప్రపత్తులతో ఆయన్ని ఆరాధించడం అని అర్థం. దైవగ్రంథ హితం కోరడమంటే, మనస్ఫూర్తిగా దానిని ధృవీకరించాలి. దాని పారాయణాన్ని నిత్యకృత్యంగా చేసుకోవాలి. దాంట్లో మార్పులూ, చేర్పులూ చేయకుండా దాని ఆదేశాలను యథాతథంగా పాటించాలన్నమాట! ఆ తరువాత దైవప్రవక్త బాగు కోరడమంటే, ఆయన చెప్పిన విషయాన్ని ధృవీకరిస్తూ, ఆయనకు విధేయత చూపాలి. ఆయన సంప్రదాయాలను హెచ్చుతగ్గులు లేకుండా పాటించాలి. ముస్లిం నేతల హితం కోరడమంటే, సత్యం విషయంలో వారిని సమర్థించాలి. షరీఅత్‌కు విరుద్ధమైన ఆదేశాలు ఇవ్వనంతవరకూ వారికి విధేయత కనబరుస్తూ ఉండాలి. వారు పెడదారులు తొక్కినప్పుడు సన్మార్గం గురించి వారికి బోధించాలేగాని వారికి ఎదురు తిరగడం, తిరుగుబాటు ధోరణుల్ని అనుసరించటం మంచిపద్ధతి కాదు. ఒకవేళ వారు బహిరంగంగానే దైవధిక్కారానికి పాల్పడితే అలాంటి సమయంలో వారిని గద్దెదింపడం ముస్లిం ప్రజల కర్తవ్యం అవుతుంది. ఇక సామాన్య ముస్లిం ప్రజానీకం యొక్క బాగుకోరడమంటే, ఇహలోక జీవితంలో వారి ఆచరణల సంస్కరణకోసం, పరలోకంలో వారి సాఫల్యం కోసం పాటుపడటం, ప్రజల్ని సరైన మార్గంలో నడిపించడం, మంచిని గురించి ఆదేశిస్తూ, చెడుపనుల నుంచి వారించటమని అర్థం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|22. శ్రేయోభిలాష|హదీసు 183
హదీసు 184
الثَّاني: عَنْ جرير بْنِ عبدِ اللَّه رضي اللَّه عنه قَالَ: بَايَعْتُ رَسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلى: إِقَامِ الصَّلاَةِ، وإِيتَاءِ الزَّكَاةِ، وَالنُّصْحِ لِكلِّ مُسْلِمٍ. متفقٌ عَلَيهِ.
హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను నమాజును స్థాపిస్తానని, జకాత్ (విధిదానం) చెల్లిస్తానని ఇంకా ముస్లింలందరి శ్రేయాన్ని కోరుకుంటానని దైవప్రవక్త ﷺ ముందు 'బైత్' (ప్రతిజ్ఞ) చేశాను.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం, ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)
English
Jarir bin `Abdullah (radiyallahu anhu) reported: I made my covenant with Messenger of Allah ﷺ on the observance of Salat, payment of Zakat, and giving counsel to Muslim.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ప్రజలు ఒండొకరి మంచిని కోరుకోవాలని ఈ హదీసు చెబుతోంది. దైవప్రవక్త ﷺ నమాజ్, జకాత్ లాంటి విధులతోపాటు ప్రజాశ్రేయాన్ని కాంక్షించే విషయంలోనూ తన అనుచరుల నుండి 'బైత్' (ప్రమాణం) తీసుకునేవారంటే ఇస్లాంలో శ్రేయోభిలాషకు ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|22. శ్రేయోభిలాష|హదీసు 184
హదీసు 185
الثَّالثُ: عَنْ أَنَس رضي اللَّه عنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى يُحِبَّ لأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ" متفقٌ عليه.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు: "తన కోసం యిష్టపడేదే తన సోదరునికోసం కూడా యిష్టపడనంతవరకూ మీలో ఎవరూ (నిజమైన) విశ్వాసి కాజాలరు." (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణాల్లో ఈ హదీసు వచ్చింది.)
English
Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “No one of you becomes a true believer until he likes for his brother what he likes for himself”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు కూడా ముస్లింలు పరస్పరం మంచిని కోరుకోవాలని నొక్కి వక్కాణిస్తోంది. దీనిపై ప్రజలు నిక్కచ్చిగా అమలుచేస్తే నేడు సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, దగా, మోసం, కుట్రల జాడ్యాన్ని దూరం చేయటం ఏమంత కష్టం కాదు. ఇస్లాం ధర్మం ఇలాంటి అమూల్యమైన నైతిక సూత్రాలెన్నో బోధించింది. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే మంచిని పెంచడానికి, చెడులను నిర్మూలించడానికి నియుక్తమైన ముస్లిం సమాజం సైతం నేడు పరిస్థితుల ఇంద్రజాలానికి మోసపోయి విశిష్టమైన, విలక్షణమైన ఇస్లామీయ నైతిక సూత్రాలను విస్మరించి కూర్చుంది. ఫలితంగా ఎన్నో వైఫల్యాలను చవిచూస్తోంది. దారితప్పిన జ్యోతికరునికి వెలుతురు కూడా అరువై పోయినట్లయింది నేటి ముస్లిం సమాజ పరిస్థితి!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|22. శ్రేయోభిలాష|హదీసు 185
You must be logged in to post a comment.