హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 209. వుజూ తర్వాత రెండు రకాతులు చేయటం అభిలషణీయం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 209వ అధ్యాయం: వుజూ తర్వాత రెండు రకాతులు చేయటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1147) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

209. వుజూ తర్వాత రెండు రకాతులు చేయటం అభిలషణీయం

↑ విషయ సూచిక

باب استحباب ركعتين بَعْد الوضوء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1147

హదీసు 1147

عن أَبي هُريرةَ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ رَسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ لِبلالٍ: "يَا بِلالُ حَدِّثْنِي بِأَرْجَى عَمَل عَمِلْتَهُ فِي الإِسْلامِ، فَإِنِّي سمِعْتُ دَفَّ نَعْلَيْكَ بيْنَ يَديَّ في الجَنَّة"قَالَ: مَا عَمِلْتُ عَمَلاً أَرْجَى عنْدِي مِنْ أَنِّي لَم أَتَطَهَّرْ طُهُوراً فِي سَاعَةٍ مِنْ لَيْلٍ أَوْ نَهارٍ إِلاَّ صَلَّيْتُ بِذلكَ الطُّهورِ مَا كُتِبَ لِي أَنْ أُصَلِّيَ". متفقٌ عَلَيْهِ. وهذا لفظ البخاري. "الدَّفُّ"بالفاءِ: صَوْتُ النَّعْلِ وَحَرَكَتُهُ عَلى الأرْضِ، واللَّه أَعلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త ﷺ బిలాల్‌ను ఉద్దేశ్యించి "బిలాల్! నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను. (ఏమిటి విశేషం?) ఇస్లాం స్వీకరించిన తర్వాత నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో కాస్త నాక్కూడా చెబుతావా?" అని అడిగారు.

దానికి సమాధానమిస్తూ హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు), "(దైవప్రవక్తా!) నేను రేయింబవళ్ళలో, ఎప్పుడు వుజూ (లేక గుసుల్) చేసినా ఆ తర్వాత (వెంటనే) నా అదృష్టంలో వ్రాసి ఉన్నన్ని రకాతుల నమాజ్ తప్పకుండా చేస్తాను. ఇంతకన్నా గొప్ప ఆశావహ ఆచరణ ఏదీ నా దృష్టిలో లేదు" అని చెప్పారు. (బుఖారీ-ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీలోనివి.)

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to Bilal (radiyallahu anhu) “Tell me about the most hopeful act (i.e., one which you deem the most rewarding with Allah) you have done since your acceptance of Islam because I heard the sound of the steps of your shoes in front of me in Jannah.” Bilal said: “I do not consider any act more hopeful than that whenever I make Wudu’ (or took a bath) in an hour of night or day, I would immediately perform Salat (prayer) for as long as was destined for me to perform.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

హదీసు మూలంలో 'తుహూర్' అనే పదం వాడబడింది. తుహూర్ అంటే శుద్ధి అని అర్థం. వుజూ, గుసుల్, తయమ్ముమ్-ఈ మూడింటి ద్వారా షరీఅత్ ఆశించే శుద్ధి ప్రాప్తిస్తుంది. కనుక ఈ మూడింటిని తుహూర్‌గానే పరిగణించటం జరుగుతుంది. మొత్తానికి హజ్రత్ బిలాల్ రేయింబవళ్ళలో ఎప్పుడు వుజూ లేక గుసుల్ చేసినా ఆ తర్వాత వెంటనే కొన్ని రకాతులు నఫిల్ నమాజు తప్పకుండా చేసేవారు. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆయన రెండు రకాతులు చేసేవారని తెలుస్తున్నది. ఆయన చేసిన పనిని దేవుడు మెచ్చుకొని ఆయనకు ఇంతటి ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. ఆయన గొప్పదనాన్ని దైవప్రవక్త ﷺ కూడా తమ కళ్ళారా వీక్షించారు.

దైవప్రవక్త ﷺకు ఈ దర్శనం మేరాజ్ (గగన యాత్ర) సందర్భంలో కలిగి ఉండవచ్చు లేదా తనపై మగత ఆవరించినప్పుడు ఆయన ఈ విషయాన్ని తిలకించి ఉండవచ్చు. ఏది ఏమైనా దీని ద్వారా తహియ్యతుల్ వుజూ (వుజూ తర్వాత చేసే) నమాజు ప్రాముఖ్యత వెల్లడౌతోంది. కొంతమంది పండితులు ఈ హదీసు విస్తృత భావాన్ని దృష్టిలో పెట్టుకొని తహియ్యతుల్ వుజూ, తహియ్యతుల్ మస్జిద్ నమాజులు, 'అవ్‌ఖాతె మక్రూహ్' (నమాజు అయిష్టకరమైన వేళ)ల్లో కూడా చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దైవప్రవక్త ﷺ ఫజ్ర్ మరియు అస్ర్ తర్వాత నఫిల్ నమాజులు చేయకూడదని వారించినట్లు తెలుపుతున్న హదీసుల్ని దృష్టిలో పెట్టుకొని మరికొంతమంది పండితులు, ఈ నమాజు 'అవ్‌ఖాతె మక్రూహ్'లో చేయకూడదని తలపోస్తున్నారు. ఆధారాల దృష్ట్యా ఇరువురి అభిప్రాయాలూ సరైనవే. కనుక ఎవరయినా నమాజు అయిష్టకరమయ్యే వేళ మస్జిద్‌లోకి ప్రవేశించి రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ లేక తహియ్యతుల్ వుజూ నమాజు చేసుకుంటే అతన్ని తప్పుపట్టడంలో అర్థం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|209. వుజూ తర్వాత రెండు రకాతులు చేయటం అభిలషణీయం|హదీసు 1147