హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 206. చాష్త్ నమాజ్ ఘనత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 206వ అధ్యాయం: చాష్త్ నమాజ్ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని ప్రోత్సహించటం గురించి. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1140 – 1143) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

206. చాష్త్ నమాజ్ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని ప్రోత్సహించటం గురించి

↑ విషయ సూచిక

باب فضل صلاة الضحى وبيان أقلِّها وأكثرها وأوسطها، والحثِّ عَلَى المحافظة عَلَيْهَا

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1140

హదీసు 1140

عنْ أَبي هُريرةَ رَضي اللَّه عنْهُ، قَالَ: أوصَاني خَليلي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِثَلاثٍ صِيامِ ثَلاثَةِ أَيَّامٍ مِن كُلِّ شَهْرٍ، وركْعَتي الضُّحَى، وأَنْ أُوتِرَ قَبل أَنْ أَرْقُد"متفقٌ عَلَيْهِ. وَالإيتَارُ قَبْلَ النَّوْمِ إنَّمَا يُسْتَحَبُّ لِمَنْ لاَ يَثِقُ بِالاسْتِيقَاظِ آخِرَ اللَّيل فإنْ وَثِقَ فَآخِرُ اللَّيل أفْضَلُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: నా మిత్రులు (ముహమ్మద్ ﷺ నాకు హితోపదేశం చేశారు- ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం పాటించమనీ, చాష్త్ వేళ రెండు రకాతుల నమాజ్ చేయమనీ, నిద్రపోకముందే విత్ర్ నమాజ్ చేసుకోమనీను. (బుఖారీ, ముస్లిం)

నిద్రపోకముందే విత్ర్ నమాజ్ చేయటమనేది రాత్రి చివరి వేళలో నిద్రలేవగలమని నమ్మకం లేనివారికి మాత్రమే అభిలషణీయమైన పద్ధతి. ఒకవేళ నమ్మకముంటే రాత్రి చివరి వేళలో విత్ర్ చేసుకోవటమే ఉత్తమం.

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: My Khalil (the Messenger of Allah ﷺ) directed me to fast three days of each month, and to observe two Rak`ah Duha (optional prayer) at forenoon, and to perform the Witr prayer before going to bed.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇక్కడ 'హితోపదేశం చేశార'ంటే అర్థం తాకీదు చేశారని. ఎందుకంటే ఫర్జ్ నమాజులతోపాటు నఫిల్ నమాజులను కూడా ఆచరించటం దైవసామీప్యాన్ని పొందటానికి అత్యుత్తమమైన మార్గం.

పైన హదీసులో ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం పాటించాలని ఆదేశించబడింది. దానిప్రకారం నెలలో ఎప్పుడైనా మూడ్రోజులు ఉపవాసం ఉండవచ్చు. అయితే పున్నమి దినాల్లో (అంటే చాంద్రమాసంలోని 13,14,15 తారీకుల్లో) ఉపవాస ముండటం ఉత్తమం. ఎందుకంటే దైవప్రవక్త ﷺ కూడా ఆయా దినాల్లో ఉపవాసం పాటించేవారని హదీసుల ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|206. చాష్త్ నమాజ్ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని ప్రోత్సహించటం గురించి|హదీసు 1140

1141

హదీసు 1141

وعَنْ أَبي ذَر رَضِي اللَّه عَنْهُ، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يُصبِحُ عَلى كُلِّ سُلامَى مِنْ أَحدِكُمْ صدقَةٌ: فَكُلُّ تَسبِيحة صدَقةٌ، وَكُلُّ تَحمِيدةٍ صَدَقَة، وكُل تَهليلَةٍ صدَقَةٌ، وَكُلُّ تَكبيرَةٍ صدَقةٌ، وأَمر بالمعْروفِ صدقَةٌ، ونهيٌ عنِ المُنْكَرِ صدقَةٌ، ويُجْزِئ مِن ذلكَ ركْعتَانِ يركَعُهُما مِنَ الضُّحَى "رواه مسلم.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు)కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం తన ఒక్కొక్క కీలుకు బదులుగా సదఖా (దానం) ఇచ్చుకోవలసి ఉంటుంది. (అయితే) ప్రతిసారి 'సుబ్‌హానల్లాహ్' అని పలకటం సదఖాగా పరిగణించబడుతుంది. ప్రతిసారి 'అల్‌హమ్దు లిల్లాహ్' అని అనటం కూడా సదఖాయే. ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అని అనటమూ సదఖాయే. ప్రతిసారి 'అల్లాహు అక్బర్' అని అనటం కూడా సదఖాయే. మంచిని గురించి ఆదేశించటం, చెడు నుండి ఆపటం కూడా సదఖాయే. ఎవరైనా వీటన్నిటికీ బదులుగా చాష్త్ వేళ రెండు రకాతుల నమాజ్ చేసినా సరిపోతుంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “In the morning, charity is due on every joint bone of the body of everyone of you. Every utterance of Allah’s Glorification (i.e., saying Subhan Allah) is an act of charity, and every utterance of His Praise (i.e., saying Al-hamdu lillah) is an act of charity and every utterance of declaration of His Greatness (i.e., saying La ilaha illAllah) is an act of charity; and enjoining M`aruf (good) is an act of charity, and forbidding Munkar (evil) is an act of charity, and two Rak`ah Duha prayers which one performs in the forenoon is equal to all this (in reward).”[Muslim].

ముఖ్యాంశాలు

తెల్లవారుజామున మనిషి నిద్రలేచిన తర్వాత తన కీళ్ళన్నీ సురక్షితంగా ఉన్నందుకుగాను అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దానికి అతి సులువైన మార్గం ఏమిటంటే అనునిత్యం దైవాన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను, గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండాలి. హదీసులో పేర్కొనబడిన వచనాలను పలుకుతూ ఉంటే, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క సదఖాగా (దానంగా) పరిగణించబడుతుంది. మానవుని దేహంలో మొత్తం 360 కీళ్ళుంటాయి. కనుక ప్రతి మనిషి అన్నిసార్లు తప్పకుండా దైవాన్ని స్తుతించాలి.

పై హదీసులో మనిషి తన దేహంలోని ప్రతి కీలుకు బదులుగా సదఖా (దానం) చెల్లించవలసి ఉంటుంది అని చెప్పబడింది. వాస్తవానికి సదఖా అంటే అర్థం దానం అని మాత్రమే కాదు. ఈ పదానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ప్రతి మంచి పని, ప్రతి పుణ్యకార్యం సదఖాగానే పరిగణించబడుతుంది. ఆ విధంగా చూస్తే సుబ్‌హానల్లాహ్, అల్‌హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటూ దైవధ్యానంలో నిమగ్నులై ఉండటం కూడా దానంగానే పరిగణించబడుతుంది. ప్రజలకు మంచిని గురించి ఆజ్ఞాపించటం, వారిని చెడుల నుండి వారించటం కూడా సదఖాగానే పరిగణించబడుతుంది. అయితే వీటన్నిటికి బదులుగా చాష్త్ వేళ రెండు రకాతుల నమాజ్ చేసుకుంటే అదికూడా దేహంలోని కీళ్ళన్నిటి తరఫున సదఖాగా భావింపబడుతుంది. ప్రధానంగా ఈ విషయాన్ని బోధించటానికే ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద పొందుపరచటం జరిగింది. దీనిద్వారా చాష్త్‌వేళ చేయబడే రెండు రకాతుల నఫిల్ నమాజు యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతున్నది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|206. చాష్త్ నమాజ్ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని ప్రోత్సహించటం గురించి|హదీసు 1141

1142

హదీసు 1142

وعَنْ عائشةَ رضيَ اللَّه عَنْها، قالتْ: كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يصلِّي الضُّحَى أَرْبعاً، ويزَيدُ مَا شاءَ اللَّه. رواه مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ చాష్త్‌వేళ నాలుగు రకాతులు చేసేవారు. దైవం తలిస్తే అంతకన్నా ఎక్కువగా కూడా చేసేవారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ used to perform four Rak`ah of Duha prayer (at the forenoon) and would add to them whatever Allah wished.[Muslim].

ముఖ్యాంశాలు

సాధారణంగా దైవప్రవక్త ﷺ చాష్త్ వేళ నాలుగు రకాతులు చేసేవారు. అయితే అప్పుడప్పుడూ ఎక్కువ రకాతులు కూడా చేసేవారు. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆయన ఎనిమిది రకాతుల వరకు చేసేవారని తెలుస్తోంది. కనుక మనం ఆ సమయంలో, మనకు వీలైన విధంగా రెండు, నాలుగు, ఎనిమిది రకాతుల వరకు చేసుకోవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|206. చాష్త్ నమాజ్ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని ప్రోత్సహించటం గురించి|హదీసు 1142

1143

హదీసు 1143

وعنْ أُمِّ هانيءٍ فاخِتةَ بنتِ أَبي طالبٍ رَضِيَ اللَّه عنْها، قَالتْ: ذهَبْتُ إِلى رَسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عامٍ الفَتْحِ فَوجدْتُه يغْتَسِلُ، فَلَمَّا فَرَغَ مِنْ غُسْلِهِ، صَلَّى ثَمانيَ رَكعاتٍ، وَذلكَ ضُحى. متفقٌ عَلَيْهِ. وهذا مختصرُ لفظِ إحدى روايات مسلم.

హజ్రత్ ఉమ్మె హానీ ఫాఖితా బిన్తె అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హా) కథనం: మక్కా విజయం వరించిన సంవత్సరం నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన స్నానం చేస్తున్నారు. స్నానం ముగించుకున్న తర్వాత ఆయన ఎనిమిది రకాతులు చేశారు. అప్పుడది చాష్త్ సమయం. (బుఖారీ-ముస్లిం)

ఈ వాక్యాలు ముస్లింలోని ఓ సంక్షిప్త ఉల్లేఖనం లోనివి.

(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Umm Hani, daughter of Abu Talib (radiyallahu anha) reported: I went to the Messenger of Allah ﷺ on the day of the conquest of Makkah. He was taking a bath at that time. When he finished the bath, he performed eight Rak`ah (of optional) prayers. This was during the Duha (forenoon).[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ఎనిమిది రకాతుల ప్రస్తావన ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆయన రెండేసి రకాతుల చొప్పున చేసేవారని తెలుస్తోంది. అయితే చాష్త్ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? చాష్త్ మరియు ఇష్‌రాఖ్ రెండూ ఒకటేనా లేక రెండు వేర్వేరు నమాజులా? అనే విషయాల్లో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం చాష్త్ మరియు ఇష్‌రాఖ్ నమాజులు రెండూ ఒక్కటే. సూర్యోదయం అయిన వెంటనే ఇది నెరవేర్చబడుతుంది. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం అసలిది జుహా నమాజు. దీని సమయం సూర్యోదయం తర్వాత నుంచి మొదలయి, సూర్యుడు నెత్తి నుండి వాలకముందు వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో తొలివేళలో చేయబడే నమాజును ఇష్‌రాఖ్ గానూ, చివరివేళలో చేయబడే నమాజును చాష్త్‌గానూ పరిగణిస్తారు.

ఇంకొందరు పండితుల అభిప్రాయం ప్రకారం సూర్యుడు ఒక ఈటెంత పైకి ఎక్కిన తర్వాత చేయబడే రెండు రకాతుల నమాజును 'ఇష్‌రాఖ్ నమాజ్' అంటారు. ఆ తర్వాత సూర్యకిరణాలు విరజిమ్మి నాలుగోవంతు ఆకాశం వెలుగుతో నిండిపోయినప్పుడు నాలుగు రకాతులు చేయాలి. దీనిని 'చాష్త్ నమాజ్' అంటారు (మిర్‌ఆతుల్ మఫాతీహ్). ఏది ఏమైనా మొత్తానికి ఈ నమాజు చేయటం అభిలషణీయం (ముస్తహబ్) అని అత్యధికమంది విద్వాంసులు అంటున్నారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|206. చాష్త్ నమాజ్ ఘనత, దాని రకాతుల కనిష్ట, గరిష్ట, మధ్యమ సంఖ్య, దాన్ని క్రమం తప్పకుండా చేస్తూ ఉండమని ప్రోత్సహించటం గురించి|హదీసు 1143