హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 180వ అధ్యాయం: దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం. ఈ అధ్యాయంలో 11 హదీసులు (హదీసు 991 – 1001) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం

↑ విషయ సూచిక

باب فضل قراءة القرآن

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

991

హదీసు 991

عن أَبي أُمامَةَ رضي اللَّه عنهُ قَالَ: سمِعتُ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "اقْرَؤُا القُرْآنَ فإِنَّهُ يَأْتي يَوْم القيامةِ شَفِيعاً لأصْحابِهِ" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఖుర్‌ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది, తనను పారాయణం చేసినవారి కొరకు సిఫారసుదారుగా వస్తుంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Umamah (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “Read the Qur’an, for it will come as an intercessor for its reciters on the Day of Resurrection.”[Muslim].

ముఖ్యాంశాలు

నిత్యం దివ్యఖుర్‌ఆన్ పారాయణం చేస్తుండేవారు ఎంతో అదృష్టవంతులు. ప్రళయ దినాన దేవుని సన్నిధిలో దివ్యఖుర్‌ఆన్ స్వయంగా వారి కొరకు సిఫారసు చేస్తుంది. ఆ రోజు దేవుడు ఖుర్‌ఆన్‌కు మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. దాంతో అది తనను పఠించినవారిని, తనను పారాయణం చేసినవారిని మన్నించమని దైవాన్ని కోరుతుంది. దైవం కూడా దాని సిఫారసును అంగీకరిస్తాడు. అయితే ఒట్టి పారాయణంతోనే తమకు ఆ భాగ్యం లభిస్తుందని భావించకూడదు. దివ్యఖుర్‌ఆన్ పారాయణంతోపాటు నిజజీవితంలో కూడా దాని ఆదేశాలను ఆచరించాలి. దాని ఆజ్ఞలకు అనుగుణంగా మన జీవితాల్ని మలచుకోవాలి. దాని ఆదేశాల్ని లెక్కచేయకుండా, దాని ఆజ్ఞల పట్ల అశ్రద్ధ వహిస్తూ కేవలం మధురాతి మధురంగా దాన్ని పారాయణం చేసినంత మాత్రాన దేవుడు పులకించిపోడని తెలుసుకోవాలి!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 991

992

హదీసు 992

وعَن النَّوَّاسِ بنِ سَمعانَ رضيَ اللَّه عنهُ قالَ: سمِعتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "يُؤْتى يوْمَ القِيامةِ بالْقُرْآنِ وَأَهْلِهِ الذِين كانُوا يعْمَلُونَ بِهِ في الدُّنيَا تَقدُمهُ سورَةُ البقَرَةِ وَآل عِمرَانَ، تحَاجَّانِ عَنْ صاحِبِهِمَا" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ నవ్వాస్ బిన్ సమ్‌ఆన్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ప్రళయ దినాన ఖుర్‌ఆన్‌ను మరియు ప్రపంచంలో దాన్ని ఆచరించినవారిని (దైవసన్నిధిలో) హాజరుపరచటం జరుగుతుంది. అప్పుడు బఖరా, ఆలిఇమ్రాన్ సూరాలు అందరికన్నా ముందుండి తమను పఠించినవారికి అనుకూలంగా వాదిస్తాయి. (ముస్లిం)

(సహీహ్ ముస్లిం, ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

An-Nawwas bin Sam`an (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “The Qur’an and its people who applied it, will be brought on the Day of Resurrection preceded with Surat Al-Baqarah and Surat Al-`Imran arguing on behalf of those who applied them.”[Muslim].

ముఖ్యాంశాలు

మొత్తం ఖుర్‌ఆన్, అందులోనూ ముఖ్యంగా బఖరా మరియు ఆలి ఇమ్రాన్ సూరాలు- తమను పఠించి, ఆచరించినవారి కొరకు దైవసన్నిధిలో సిఫారసు చేస్తాయి. తమ ప్రభువుని బ్రతిమాలి అయినా వారికి మన్నింపు లభించేలా చేస్తాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 992

993

హదీసు 993

وعن عثمانَ بن عفانَ رضيَ اللَّه عنهُ قَالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "خَيركُم مَنْ تَعَلَّمَ القُرْآنَ وَعلَّمهُ" رواه البخاري.

హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఖుర్‌ఆన్‌ను నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరిలోకెల్లా ఉత్తములు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ఖుర్‌ఆన్ మహాత్యాల ప్రకరణం)

English

`Uthman bin `Affan (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The best amongst you is the one who learns the Qur’an and teaches it.”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 993

994

హదీసు 994

وعن عائشة رضي اللَّه عنها قالتْ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الَّذِي يَقرَأُ القُرْآنَ وَهُو ماهِرٌ بِهِ معَ السَّفَرةِ الكرَامِ البررَةِ، وَالَّذِي يقرَأُ القُرْآنَ ويتَتَعْتَعُ فِيهِ وَهُو عليهِ شَاقٌّ لَهُ أجْران" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్ పండితుడయి ఉండి, దాన్ని పఠించే వ్యక్తి (ప్రళయ దినాన) గౌరవనీయులు, పుణ్యాత్ములయిన దైవదూతల వెంట ఉంటాడు. ఖుర్‌ఆన్‌ను పఠించడంలో తడబడుతూ, శ్రమకోర్చి పారాయణం చేసేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు. (బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తౌహీద్ ప్రకరణం-సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

ముఖ్యాంశాలు:

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ హదీసుకు పెట్టిన శీర్షిక ద్వారానూ, ఇంకా ఇతర హదీసుల ద్వారానూ బోధపడేదేమంటే, ఇక్కడ పండితుడంటే ఖుర్‌ఆన్‌ను చక్కని ఉచ్చారణతో, శాస్త్రోక్తంగా మధురాతి మధురంగా పఠించేవాడని అర్థం. ఆ విధంగా ఖుర్‌ఆన్‌ను మధురంగా పఠించేవారికి ప్రళయదినాన గొప్పగొప్ప దైవదూతలకు లభించే సత్కారం లభిస్తుందన్నమాట. ఇకపోతే హదీసులో ప్రస్తావనకు వచ్చిన రెండో వ్యక్తి ఎవరంటే, అతను ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకోలేకపోయినప్పటికీ, ఖుర్‌ఆన్ పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోయినప్పటికీ, ఖుర్‌ఆన్ పట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమాభిమానాల మూలంగా- ఎంత కష్టంగా ఉన్నప్పటికీ దాన్ని చదవటానికి ప్రయత్నిస్తాడు. అలాంటి వ్యక్తికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. చదివినందుకు ఒక రెట్టు పుణ్యం లభిస్తే, ఆ కష్టాన్ని ఓర్చుకున్నందుకు మరో రెట్టు పుణ్యం లభిస్తుంది.

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ said, “The one who is proficient in the recitation of the Qur’an will be with the honourable and obedient scribes (angels) and he who recites the Qur’an and finds it difficult to recite, doing his best to recite it in the best way possible, will have a double reward.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 994

995

హదీసు 995

وعن أَبي موسى الأشْعريِّ رضي اللَّه عنهُ قال: قال رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مثَلُ المؤمنِ الَّذِي يقْرَأُ القرآنَ مثلُ الأُتْرُجَّةِ: ريحهَا طَيِّبٌ وطَعمُهَا حلْوٌ، ومثَلُ المؤمنِ الَّذي لاَ يَقْرَأُ القُرْآنَ كَمثَلِ التَّمرةِ: لاَ رِيح لهَا وطعْمُهَا حلْوٌ، ومثَلُ المُنَافِق الَّذِي يَقْرَأُ القرْآنَ كَمثَلِ الرِّيحانَةِ: رِيحها طَيّبٌ وطَعْمُهَا مرُّ، ومَثَلُ المُنَافِقِ الَّذِي لاَ يَقْرَأُ القرآنَ كَمَثلِ الحَنْظَلَةِ: لَيْسَ لَها رِيحٌ وَطَعمُهَا مُرٌّ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్ పారాయణం చేసే విశ్వాసి నారింజ పండులాంటివాడు. నారింజ పండులో సువాసన కూడా ఉంటుంది. ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖుర్‌ఆన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూరపండు లాంటివాడు. అందులో సువాసన లేకపోయినా, దాని రుచి మాత్రం తియ్యగా ఉంటుంది. ఖుర్‌ఆన్ పారాయణం చేసే కపట విశ్వాసి (గులాబి, యాస్మీన్‌లాంటి) సుగంధ మొక్కలాంటివాడు. పైకి దాని వాసన బాగున్నా రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖుర్‌ఆన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మెత్తకాయ లాంటివాడు. అందులో ఎలాగూ సువాసన ఉండదు. అదీగాక దాని రుచి చేదుగా ఉంటుంది.

(బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అన్నపానీయాల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The believer who recites the Qur’an is like a citron whose fragrance is sweet and whose taste is delicious. A believer who does not recite the Qur’an is like a date-fruit which has no fragrance but has a sweet taste. The hypocrite who recites the Qur’an is like a colocynth whose fragrance is so sweet, but its taste is bitter. The hypocrite who does not recite the Qur’an is like basil which has no fragrance and its taste is bitter.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో నాలుగు రకాల వ్యక్తుల గురించి చెప్పబడింది. వారిలో ఇద్దరు విశ్వాసులైతే మరో ఇద్దరు కపట విశ్వాసులు. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటంతోపాటు దాని ప్రకారం ఆచరించే విశ్వాసి, మంచి రుచి, సువాసనలు గల నారింజ పండులాంటి వాడని పేర్కొనటం జరిగింది. ఎందుకంటే అతను తన మంచి పనుల చేత ఇటు దేవుని దృష్టిలో ప్రియమైన దాసునిగా రాణించటంతోపాటు అటు ప్రజల్లో కూడా గొప్ప ఆదరణీయుడుగా పేరొందుతాడు. ఇహపరాల్లోనూ సాఫల్యాన్ని సంపాదిస్తాడు. కాగా; ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయలేకపోయినప్పటికీ నిజ జీవితంలో ఖుర్‌ఆన్ ఆజ్ఞల్ని ఆచరించే విశ్వాసికి బహుశా ఇహలోకంలో అంతగా ఆదరణ లభించకపోవచ్చు. కాని పరలోకంలో (దైవసన్నిధిలో) మాత్రం అతనికి గొప్ప ఆదరణ లభిస్తుంది. ఖర్జూర పండులో సువాసన లేకపోయినా రుచిమాత్రం ఎంతో తియ్యగా ఉంటుంది కదా! ఖుర్‌ఆన్ చదవటం రాని విశ్వాసి పరిస్థితి కూడా అంతే!

వీరికి భిన్నంగా ఖుర్‌ఆన్ పారాయణం చేసే కపట విశ్వాసి, సువాసనలు గుభాళించే చేదుమొక్క లాంటివాడని చెప్పబడింది. ఇలాంటివాడు తన మధుర కంఠంతో ఖుర్‌ఆన్ పారాయణం చేసి లోకుల మెప్పు పొందినా, పరలోకంలో మాత్రం అతను శాశ్వత వినాశానికి గురికావలిసిందే! దానిక్కారణం అతను ఎంత మధురంగా పారాయణం చేసినప్పటికీ ఖుర్‌ఆన్ ఆదేశాలు అతనికి ఏమాత్రం మింగుడుపడవు. అంచేత ప్రదర్శనా బుద్ధితో అతను చేసే ఈ పారాయణానికి ఇహలోకంలో ఆదరణ లభిస్తుందేమోగాని పరలోకంలో మాత్రం అతనికి పరాభవం తప్పదు. ఇకపోతే హదీసులో పేర్కొనబడిన చివరి వ్యక్తి ఖుర్‌ఆన్ చదవటం రాని కపట విశ్వాసి. ఇలాంటి వారికి ఇహపరాల్లోనూ అవమానమే మిగులుతుంది. అందుకే ఇలాంటి వారిని ఉమ్మెత్తకాయలతో పోల్చటం జరిగింది. ఉమ్మెత్తకాయ రుచి చేదుగా ఉంటుంది. పైగా దాని కంపు ముక్కుపుటాలను అదరగొడుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 995

996

హదీసు 996

وعن عمرَ بن الخطابِ رضي اللَّه عنهُ أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ اللَّه يرفَعُ بِهذَا الكِتَابِ أَقواماً ويضَعُ بِهِ آخَرين" رواه مسلم.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతుల్ని ఉచ్ఛస్థితికి లేపుతాడు. మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలుచేస్తాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Verily, Allah elevates some people with this Qur’an and abases others.”[Muslim].

ముఖ్యాంశాలు

ఖుర్‌ఆన్ ఆదేశాలను పాటిస్తే జాతులు, సమాజాలు ఉచ్ఛస్థితికి చేరుకుంటాయనీ, ఒకవేళ వాటిని పాటించకుండా వదిలేస్తే అవి అధోగతి పాలవుతాయని పై హదీసు ఉద్ఘాటిస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. మనం మహాప్రవక్త ﷺ కాలంనాటి నుంచి ఈ నాటి వరకు తరతరాల చరిత్రను తరచి చూస్తే బోధపడే సత్యం ఇదే! ఖుర్‌ఆన్‌ను తమ జీవన సంవిధానంగా చేసుకొని, తమ జీవితాలను ఖుర్‌ఆన్ చట్రంలో బిగించుకున్నవారు ఎన్నో ప్రగతి శిఖరాలను అధిరోహించారు. దీనికి భిన్నంగా ఖుర్‌ఆన్‌ను విడనాడిన వారు ఇహలోకంలో అధోగతి పాలయ్యారు. ఇక పరలోకంలోనూ వారికి మిగిలేది పరాభవమే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 996

997

హదీసు 997

وعنِ ابن عمر رضي اللَّه عنهما عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لا حَسَدَ إلاُّ في اثنَتَيْن: رجُلٌ آتَاهُ اللَّه القُرآنَ، فهوَ يقومُ بِهِ آناءَ اللَّيلِ وآنَاءَ النَّهَارِ، وَرجُلٌ آتَاهُ اللَّه مَالاً، فهُو يُنْفِقهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النهارِ" متفقٌ عَلَيْهِ. "والآناءُ": السَّاعاتُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప, మరెవ్వరి పట్లా అసూయ చెందకూడదు. ఒకడు: దేవుడు ఖుర్‌ఆన్ జ్ఞానాన్ని ప్రసాదించగా, రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండోవాడు: దేవుడు సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు (దైవమార్గంలో) ఖర్చుపెట్టే వ్యక్తి.

(బుఖారీ-ముస్లిం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said: “Envy is justified in regard to two types of persons only: a man whom Allah has given knowledge of the Qur’an, and so he recites it during the night and during the day; and a man whom Allah has given wealth and so he spends from it during the night and during the day.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 997

998

హదీసు 998

وعنِ البُراء بنِ عَازِبٍ رضيَ اللَّه عَنهما قَالَ: كَانَ رَجلٌ يَقْرَأُ سورةَ الكَهْفِ، وَعِنْدَه فَرسٌ مَربوطٌ بِشَطَنَيْنِ فَتَغَشَّته سَحَابَةٌ فَجَعَلَت تَدنو، وجعلَ فَرسُه ينْفِر مِنها. فَلَمَّا أَصبح أَتَى النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. فَذَكَرَ له ذلكَ فَقَالَ: "تِلكَ السَّكِينَةُ تَنَزَّلتْ للقُرآنِ" متفقٌ عَلَيْهِ. "الشَّطَنُ"بفتحِ الشينِ المعجمةِ والطاءِ المهملة: الْحَبْلُ.

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక వ్యక్తి (ఖుర్‌ఆన్‌లోని) కహఫ్ సూరా పారాయణం చేస్తుంటే అతనున్నచోట (ఆకాశంలో) ఒక మేఘం ఆవరించి అతని వైపునకు రాసాగింది. ఆ సమయంలో అతనికి సమీపంలోనే ఒక గుర్రం రెండు త్రాళ్ళతో కట్టివేయబడి ఉంది. ఆ మేఘాన్ని చూసి అది బెదరసాగింది. తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు. అది విని ఆయన ﷺ, "ఖుర్‌ఆన్ మూలంగా అవతరించిన 'స్థిమితం' అది" అని చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఖుర్‌ఆన్ మహాత్యాల ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: A man was reciting Surat Al-Kahf, and a horse was tied with two ropes beside him. As he was reciting, a cloud overshadowed him, and as it began to come nearer and nearer, the horse began to trample voilently. The man came to the Messenger of Allah ﷺ in the morning and mentioned the incident to him. He ﷺ said, “That was tranquillity which descended as a result of the recitation of the Qur’an.”

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా కహఫ్ సూరా మహత్యం వెల్లడౌతోంది. మనిషి గనక భక్తిశ్రద్ధలతో, మనసుని దైవం పైనే లగ్నం చేసుకొని ఖుర్‌ఆన్ పారాయణం చేస్తే తప్పకుండా స్థిమితం ఆవరిస్తుంది. హృదయాలు నెమ్మదిస్తాయి. ఆ స్థిమితమే భౌతికతను సంతరించుకొని మేఘం లేక పొగ మంచు రూపంలో కన్పించిందని ఈ హదీసులో చెప్పబడింది. ఖుర్‌ఆన్ పారాయణం జరిగినప్పుడు దేవుని తరపు నుండి కారుణ్య దూతలు కూడా దిగివస్తారని ఇతర హదీసుల ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 998

999

హదీసు 999

وعن ابن مسعودٍ رضيَ اللَّه عنهُ قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ قرأَ حرْفاً مِنْ كِتَابِ اللَّهِ فلَهُ حسنَةٌ، والحسنَةُ بِعشرِ أَمثَالِهَا لاَ أَقول: ألم حَرفٌ، وَلكِن: أَلِفٌ حرْفٌ، ولامٌ حرْفٌ، ومِيَمٌ حرْفٌ" رواه الترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా దైవగ్రంథంలోని ఒక అక్షరాన్ని చదివితే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక్క పుణ్యం పదిపుణ్యాలకు సమానంగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం 'అలిఫ్ లామ్ మీమ్' అనేది ఒకే అక్షరం కాదు. పైగా 'అలిఫ్' ఒక అక్షరం, 'లామ్' ఒక అక్షరం, 'మీమ్' ఒక అక్షరం.

(తిర్మిజీ దీనిని వెలికితీసి 'హసన్', 'సహీహ్'గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్ పుణ్య అధ్యాయాలు)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whoever recites a letter from the Book of Allah, he will be credited with a good deed, and a good deed gets a ten-fold reward. I do not say that Alif-Lam-Mim is one letter, but Alif is a letter, Lam is a letter and Mim is a letter.”[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 999

1000

హదీసు 1000

وعنِ ابنِ عباسٍ رضيَ اللَّه عنهما قال: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ الَّذي لَيس في جَوْفِهِ شَيْءٌ مِنَ القُرآنِ كالبيتِ الخَرِبِ" رواه الترمذي وقال: حديث حسن صحيح.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఏమాత్రం ఖుర్‌ఆన్ పరిజ్ఞానం లేని హృదయం పాడుబడిన ఇంటితో సమానం.

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్', 'సహీహ్'గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్ పుణ్య అధ్యాయాలు)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “He who does not memorize any part from the Qur’an he is like the ruined house.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

నిర్మానుష్యమైన, పాడుబడిన ఇండ్లలో శుభశ్రేయాలు అవతరించవు. అలాగే ఖుర్‌ఆన్ జ్ఞానంలేని హృదయాల్లో కూడా ఆధ్యాత్మిక తాజాదనం, శ్రేయోశుభాలనేవి ఉండవు. అంచేత ముస్లిం అయిన ప్రతి వ్యక్తీ ఎంతో కొంత ఖుర్‌ఆన్‌ను తప్పకుండా కంఠస్తం చేసుకొని ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 1000

1001

హదీసు 1001

وعن عبدِ اللَّهِ بنِ عَمْرو بن العاصِ رضي اللَّه عَنهما عنِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "يُقَالُ لِصاحبِ الْقُرَآنِ: اقْرأْ وَارْتَقِ وَرَتِّلْ كَما كُنْتَ تُرَتِّلُ في الدُّنْيَا، فَإنَّ منْزِلَتَكَ عِنْد آخِرِ آيةٍ تَقْرَؤُهَا" رواه أَبو داود، والترْمذي وَقالَ: حديث حسن صحيح.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "ఖుర్‌ఆన్‌ను కంఠపాఠం చేసుకున్న వ్యక్తితో (ప్రళయ దినాన) ఇలా అనబడుతుంది: నువ్వు ప్రపంచంలో నెమ్మదిగా ఖుర్‌ఆన్ పఠించినట్లు, ఇప్పుడు కూడా అలాగే పఠిస్తూ పైకెళ్ళు. అలా పఠిస్తూ వెళ్తూ, ఎక్కడ పఠనం ఆపుతావో ఆ చివరి వాక్యం దగ్గరే నీ అంతస్తు ఉంటుంది."

(అబూదావూద్, తిర్మిజీలు దీనిని వెలికితీశారు. ఇంకా తిర్మిజీ దీనిని 'హసన్', 'సహీహ్'గా పేర్కొన్నారు.)

(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం – సుననె తిర్మిజీలోని ఖుర్‌ఆన్ పుణ్య అధ్యాయం)

English

`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “The one who was devoted to the the Qur’an will be told on the Day of Resurrection: `Recite and ascend (in ranks) as you used to recite when you were in the world. Your rank will be at the last Ayah you recite.”’[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఖుర్‌ఆన్‌ను కంఠపాఠం చేసుకున్నవారిని, నిత్యం దైవగ్రంథాన్ని అధ్యయనం చేస్తుండే వారిని స్వర్గంలో ఘనంగా సత్కరించటం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరికి ఎంత ఎక్కువగా ఖుర్‌ఆన్ జ్ఞాపకం ఉంటుందో వారు అంతే ఎత్తయిన భవనాల్లో ఉంటారు. అందుకే స్వర్గంలో తమ అంతస్తులు పెరిగేందుకు అనువుగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువగా ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|180. దివ్యఖుర్‌ఆన్ పారాయణ మహాత్యం|హదీసు 1001