హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 160వ అధ్యాయం: శ్మశానంలో హితబోధ చేయవచ్చు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 945) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
160. శ్మశానంలో హితబోధ చేయవచ్చు
باب الموعظة عند القبر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 945
عن عليٍّ رَضِيَ اللَّهُ عنه قَالَ: كُنَّا فِي جنَازَةٍ في بَقِيع الْغَرْقَد فَأَتَانَا رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فقَعَدَ، وقعدْنَا حَوْلَهُ وَمَعَهُ مِخْصَرَةٌ فَنَكَسَ وَجَعَلَ يَنْكُتُ بِمِخْصَرتِهِ، ثُمَّ قَالَ: "مَا مِنكُمْ مِنْ أَحَدٍ إلاَّ وَقَدْ كُتِبَ مقْعَدُهُ مِنَ النَّارِ ومَقْعَدُهُ مِنَ الجنَّة"فقالوا: يَا رَسُولَ اللَّهِ أَفَلاَ نَتَّكِلُ عَلَى كتابنَا؟ فَقَالَ:"اعْمَلُوا، فَكُلٌّ مُيَسَّرٌ لِمَا خُلِقَ لَهُ "وذكَر تمامَ الحديث، متفقٌ عَلَيْهِ
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం : మేమొక జనాజా వెంట బఖీవుల్ గర్ఖద్ శ్మశానానికి వెళ్ళాం. అంతలో దైవప్రవక్త ﷺ కూడా అక్కడికి వచ్చి ఒకచోట కూర్చున్నారు. కాసేపటికి మేము కూడా ఆయన చుట్టూ గుమిగూడి కూర్చున్నాం. అప్పుడు ఆయన చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తలక్రిందికి దించుకొని బెత్తంతో నేలమీద గీకసాగారు. కాసేపటికి (తల పైకెత్తి), "మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో ఉంటుందనే విషయం (ముందుగానే) వ్రాసిపెట్టబడింది" అని అన్నారు. ఆ మాట విని ఆయన సహచరులు, "దైవప్రవక్తా! అలాగయితే మేము ఆచరణను వదలిపెట్టి విధివ్రాతను నమ్ముకుంటే చాలుకదా!" అని విన్నవించుకున్నారు. అందుకాయన "(లేదు) మీరు కర్మలు ఆచరించండి. ప్రతి మనిషికీ అతని అదృష్టం మేరకే కర్మలు ఆచరించే భాగ్యం లభిస్తుంది" అని అన్నారు. (సశేషం)
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని విధివ్రాత ప్రకరణం)
English
`Ali (radiyallahu anhu) reported: We were accompanying a funeral procession in Baqi` Al-Gharqad (graveyard in Al-Madinah) when the Messenger of Allah ﷺ proceeded towards us and sat down. We sat around him. He had a small stick in his hand. He was bending down his head and scraping the ground with the stick. He said, “There is none among you but has a place assigned for him either in the Jannah or in the Hell.” The Companions said: “O Messenger of Allah, should we not depend upon what has been written for us (and give up doing good deeds)?” The Messenger of Allah ﷺ said, “Carry on doing good deeds. Every one will find it easy to do such deeds (as will lead him to his destined place) for which he has been created.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ద్వారా శ్మశానంలో ప్రజలకు హితబోధ చేయవచ్చనే విషయం వెల్లడౌతోంది. గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) పెట్టిన శీర్షిక ఉద్దేశ్యం కూడా అదే. శ్మశానంలో శవాల్ని, సమాధుల్ని చూసినప్పుడు మనిషి హృదయం సహజంగానే వైరాగ్యం వైపుకు మ్రొగ్గుతుంది. ఐహిక అనాసక్తత పెరిగి ప్రపంచం అశాశ్వతమన్న విషయం గుర్తొస్తుంది. మనస్సులు మెత్తబడతాయి. అలాంటి సందర్భాల్లో వారికి హితబోధ చేస్తే అతి త్వరగా వారిలో పరివర్తన వచ్చే అవకాశాలున్నాయి.
ఈ హదీసులో విధివ్రాత గురించి కూడా వివరించటం జరిగింది. స్థూలంగా దాని భావం ఏమిటంటే మంచి పనులు చేసేవారు స్వర్గానికి వెళ్తారు. చెడు పనులు చేసేవారు నరకానికి వెళ్తారు. ఈ విషయం సృష్టి ఆరంభంలోనే వ్రాసిపెట్టబడింది. దాన్నే 'విధివ్రాత' అని అంటారు. ప్రపంచంలో ఏది జరిగినా విధి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అయితే విధివ్రాతలో వ్రాసిపెట్టబడినంత మాత్రాన మానవులు తమ కర్మలకు బాధ్యులు కారని చెప్పలేం. ఎందుకంటే విధివ్రాత గురించిన జ్ఞానం ఎవరికీ లేదు కనుక.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|160. శ్మశానంలో హితబోధ చేయవచ్చు|హదీసు 945
You must be logged in to post a comment.