హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 108. ఒత్తిగిలి తినటం అవాంఛనీయం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 108వ అధ్యాయం: ఒత్తిగిలి తినటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 746 – 747) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

108. ఒత్తిగిలి తినటం అవాంఛనీయం

↑ విషయ సూచిక

باب كراهية الأكل متكئاً

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

746

హదీసు 746

عن أَبي جُحَيْفَةَ وهبِ بنِ عبد اللَّه رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا آكُلُ مُتَّكِئاً" رواه البخاري. قال الخَطَّابيُّ: المُتَّكِيءُ هُنا: هُوَ الجالِسُ مُعْتَمِداً عَلَى وِطاءٍ تحته، قَالَ: وأَرَادَ أَنَّهُ لا يَقعُدُ عَلى الْوطَاءِ والْوسائِدِ كَفعْلٍ مَنْ يُريدُ الإِكْثار مِنَ الطعامِ بل يَقْعدُ مُسْتَوْفِزاً لاَ مُسْتوْطِئاً، ويَأْكُلُ بُلْغَةً. هَذَا كلامْ الخطَّابي، وأَشَار غَيْرهُ إِلى أَنَّ المتكيءَ هُوَ المائلُ عَلى جَنْبِه، واللَّه أعلم.

హజ్రత్ అబూ జుహైఫా వహబ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ, "నేను (ఎన్నడూ) ఒత్తిగిలి తినను" అని అన్నారు. (బుఖారీ)

ఇమామ్ ఖత్తాబీ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : ఒత్తిగిలి అంటే క్రింద పరువబడి ఉన్న పరుపుకు ఆనుకొని కూర్చోవటం అని అర్థం. విపరీతంగా అన్నం బొక్కేయాలని పరుపులపై, దిండ్లపై కూర్చొని తినేవారిలాగా తాను కూర్చోనని దైవప్రవక్త ఉద్దేశ్యం. ఆయన అన్నం తినటానికి తేరకుదేరి కూర్చునేవారు కారు. అలాకాకుండా అప్రశాంతంగా కూర్చొని పూట గడిచేటంత మాత్రమే తినేవారు.

ఇది ఇమామ్ ఖత్తాబీ అభిప్రాయం. ఆయనగాక ఇతర పండితులందరూ ఒత్తిగిలి అంటే ఓ ప్రక్కకు ఒరిగి తినడం అని సూచించారు. – వాస్తవం అల్లాహ్‌కు తెలుసు.

(సహీహ్ బుఖారీలోని భోజనాల ప్రకరణం)

English

Abu Juhaifah Wahb bin `Abdullah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “I do not eat reclining (against a pillow).”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

అసలు ఒత్తిగిలి తినటం అంటే ఏమిటి? దీని గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఒత్తిగిలి అంటే ఏదో ఒక ప్రక్కకు వంగి తినటమని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు కుడిచేయిగాని, ఎడమ చేయిగాని నేలకు ఆనించి కూర్చోవటం, గోడకు ఆనుకొని కూర్చోవటం మొదలగు పద్ధతులు ఒత్తిగిలి కూర్చోవటం క్రిందికి వస్తాయి.

ఇమామ్ ఖత్తాబీ (రహిమహుల్లాహ్) అభిప్రాయంలో ఒత్తిగిలి అంటే మెత్తగా ఉండే పరుపు మీద తీరిగ్గా, ప్రశాంతంగా కూర్చోవటం. అలాగే ఎక్కువ తినాలనే ఉద్దేశ్యంతో బాసికపట్టు వేసుకొని కూర్చోవటం. కాని ఈ పద్ధతి వత్తిగిలి కూర్చోవటం క్రిందికి వస్తుందని చెప్పలేం. కనుక ఒత్తిగిలి అనే పదానికి మొదట్లో చెప్పిన భావమే సరయినదిగా తోస్తోంది. హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : అన్నం తినటానికి కూర్చొనే పద్ధతుల్లో అభిలషణీయమైన పద్ధతి ఏమిటంటే, కాళ్ళు మోకాళ్ళ వరకు మడచి అరికాళ్ళ మీద కూర్చోవాలి. లేదా కుడికాలు ఎత్తి ఎడమకాలి ఆధారంగా కూర్చోవాలి. (ఫత్‌హుల్ బారీ).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|108. ఒత్తిగిలి తినటం అవాంఛనీయం|హదీసు 746

747

హదీసు 747

وعن أَنسٍ رضي اللَّه عنه قَالَ: رَأَيْتُ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جَالِساً مُقْعِياً يَأْكُلُ تمْراً، رواه مسلم. "المُقْعِي"هُوَ الَّذِي يُلْصِقُ أليَتيهِ بالأرضِ، ويُنْصِبُ ساقَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తొడలు నిలబెట్టి కూర్చొని ఖర్జూర పండ్లు తింటుండగా చూశాను. (ముస్లిం)

'ముఖ్‌యీ' అంటే పిరుదులు నేలకు ఆనించి ముంగాళ్ళ ఆధారంగా కూర్చున్నవాడు అని అర్థం.

English

Anas (radiyallahu anhu) reported: I saw Messenger of Allah ﷺ eating some dates while sitting on his buttocks, with his legs raised.[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త ﷺ భోజనం చేస్తున్నప్పుడు కూర్చున్న తీరుని గురించి వివరించటం జరిగింది. ఈ విధంగా కూర్చోవటంలో మనిషి మిక్కిలి అప్రశాంతంగా ఉంటాడు. వాస్తవానికి దైవప్రవక్త ﷺ తొందరగా ఏదయినా పనిమీద వెళ్లాల్సి ఉన్నప్పుడు ఆ విధంగా కూర్చొని కొన్ని ఖర్జూర పండ్లు మాత్రమే తిని వెళ్ళిపోయేవారు. ఈ విషయాన్ని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారి వేరొక ఉల్లేఖనం సమర్థిస్తోంది. ఆ ఉల్లేఖనం కూడా ముస్లిం గ్రంథంలోనే ఉంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|భోజన నియమాలు|108. ఒత్తిగిలి తినటం అవాంఛనీయం|హదీసు 747