హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్
రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – మొదటి సంపుటంలోని ప్రారంభ విషయాలు: ముందుమాటలు, గ్రంథ పరిచయం, గ్రంథకర్త జీవిత విశేషాలు, గ్రంథకర్త ముందుమాట. ఈ పేజీలోని 5 భాగాలకు కింది జాబితా నుండి వెళ్లవచ్చు.
కృతజ్ఞతాంజలి!
'రియాజుస్సాలిహీన్' అనేది ఓ విశ్వ విఖ్యాత హదీసు సంకలన గ్రంథం. క్రీ.శ. 7వ శతాబ్దంలో ప్రఖ్యాత ఇస్లాం తత్వవేత్త, విద్వాంసులు అబూ జకరియా యహ్యా బిన్ షరఫ్ నవవీ (రహిమహుల్లాహ్) గారి చేత సంకలనం చేయబడిన ఈ హదీసు గ్రంథం నేటికి కూడా ముస్లిం సమాజంలో గొప్ప ఆదరణకు నోచుకుంటోంది. ఈ గ్రంథ ప్రామాణికత మీద, దీని ప్రాముఖ్యత మీద యావత్తు ముస్లిం సమాజం ఏకాభిప్రాయాన్ని కలిగి ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్రంథం ఇంత గొప్పగా జనాదరణ పొందటానికి కారణం ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) గారు ఇందులో ముత్యాలు, రతనాల వంటి హదీసులను పొందుపరిచారు.
ఇంత గొప్ప గ్రంథాన్ని "హదీసు కిరణాలు" అనే పేరుతో తెలుగులో ప్రచురించే సౌభాగ్యం మాకు కలగటం నిజంగా దైవానుగ్రహం. అందుకు మేము ఆయనకు ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. ఈ పుస్తకంలోని సుగుణాలన్నీ అల్లాహ్ తరపు నుంచి వచ్చినవి. లోపాలు మా స్వయంకృతాలు.
అల్లాహ్ ఈ సత్కార్యంలో పాలుపంచుకున్న వారందరికీ ఇహపరాల్లోనూ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్)
– ముహమ్మద్ సైఫుద్దీన్
ప్రెసిడెంట్, ట్రూత్ పబ్లికేషన్స్
↑ విషయ సూచిక · తదుపరి: ఆశీర్వచనాలు ↓
ఆశీర్వచనాలు
భాష అన్నది అభిప్రాయాల వెల్లడికి సాధనం. ఆ సాధనాన్ని వినియోగించుకుని ఏ విషయాన్నయినా వెల్లడించవచ్చు, దేన్నయినా ప్రచారం చేయవచ్చు, ఏ దుష్ప్రచారమయినా చేయవచ్చు. ప్రకృతి ప్రసాదించిన సాధనాలను మానవ శ్రేయానికీ, మానవ సౌఖ్యానికీ, మానవ సాఫల్యానికీ వినియోగించిన వ్యక్తి ఎవరయినా సరే మానవుల్లో ఉత్తమ శ్రేణికి చెందిన వాడవడంలో ఎటువంటి సందేహమూ లేదు. మిత్రులు, సత్యపథ సహచరులు ఎస్. ఎమ్. రసూల్‌గారు అటువంటి ఉత్తమ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి అనడం అతిశయోక్తి కాదు.
ఎస్. ఎమ్. రసూల్ పిన్న వయసులోనే ధర్మమార్గాన తాఁ నడవటమే కాక, ధర్మ పథ చిహ్నాలను తోటి మానవ సోదరులకు సయితం పరిచయం చేయాలన్న తపన గలవారు. ఈ భావన, తపన, ఆవేదన ఎంతయినా శ్లాఘనీయం. దైవం వీటిలో మరింత వృద్ధిని అనుగ్రహించుగాక! లోగడ రసూల్ ధార్మిక పుస్తకాలు కొన్నింటిని తెలుగులో అందజేసినా తొలిసారిగా ఈయన 'హదీసు' వచనాలను ఆంధ్రీకరించేందుకు పూనుకుని చాలా మటుకు సఫలీకృతులయ్యారనే నేను చెప్పగలను. దైవం ఈయన కలంలో ఇతోధిక శక్తిని ప్రసాదించుగాక!
'రియాజుస్సాలిహీన్' అనే హదీసు సంకలన గ్రంథాన్ని 'హదీసు కిరణాలు' అనే పేరుతో తెలుగు ప్రజలకు అందజేస్తున్నారు ఎస్.ఎమ్. రసూల్. అన్నివిధాలా ప్రోత్సాహానికీ, ప్రోద్బలానికి అర్హులు. అల్లాహ్ ఈయనకు, శక్తితోపాటు సద్బుద్ధినీ సదా తోడుగా కొనసాగనివ్వాలని ప్రార్థిస్తున్నాము.
హైదరాబాద్
23-11-2005
– ఎస్.ఎమ్. మలిక్
గౌరవ సంపాదకులు, 'గీటురాయి'
↑ విషయ సూచిక · తదుపరి: గ్రంథ పరిచయం ↓
గ్రంథ పరిచయం
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఇన్నల్ హమ్ద లిల్లాహ్. నహ్మదుహూ వ నస్తయీనుహూ వ నస్తగ్ఫిరుహూ వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి ఆమాలినా మైంయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహ్. వమైంయ్యుజ్లిల్ ఫలా హాదియ లహ్. వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్. సల్లల్లాహు అలైహి వ సల్లం. అమ్మాబాద్ :
ఇస్లాం ధర్మం సంపూర్ణ జీవన విధానం. యావత్ ప్రపంచ మానవాళి మార్గదర్శకత్వం కోసం పరమప్రభువైన అల్లాహ్ తరపు నుంచి అవతరించిన నిజధర్మం. ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో, దాని బోధనల గురించి తెలుసుకోవటంలో రెండు వస్తువులు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఒకటి : దివ్య ఖుర్ఆన్. రెండు : దైవప్రవక్త ﷺ గారి సున్నత్ అనగా హదీసులు. ఈ రెండింటి మూలం ఒక్కటే. అదే దైవవాణి (వహీ).
"అతను (అంటే ముహమ్మద్ – సల్లం) తన మనోవాంఛలను అనుసరించి చెప్పటం లేదు. ఇది ఒక వహీ, అతనిపై అవతరింపజేయబడుతుంది." (నజ్మ్ సూరా : 3, 4 సూక్తులు).
వహీ అనేది అల్లాహ్ తరపు నుంచి ప్రవక్తలపై అవతరిస్తుంది. ప్రపంచంలో మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపబడినవారు దైవప్రవక్తలు. వీరి సంఖ్య ఖచ్చితంగా అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అయితే ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్త పుట్టాడన్నది ఎవరూ తిరస్కరించలేని నిజం.
"మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము : అల్లాహ్‌ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి." (నహ్ల్ సూరా : 36)
ఆ ప్రవక్తల పరంపరలో అందరికంటే చివర్లో ప్రభవించినవారే ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వ సల్లం. ఆయన ప్రపంచమంతటి కోసం కారుణ్యమూర్తిగా, అంతిమ దైవప్రవక్తగా పంపబడ్డారు.
"ముహమ్మద్! ఇలా ప్రకటించు : మానవులారా! నేను మీ అందరి వైపునకు వచ్చిన అల్లాహ్ సందేశహరుణ్ణి." (ఆరాఫ్ సూరా : 157వ సూక్తి)
ఆయన తర్వాత ఇక ప్రళయం వరకూ మరే ప్రవక్తా రాడు. కనుక ఆయన ధర్మాన్ని పరిపూర్ణం చేయటం జరిగింది.
"ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. మీ కొరకు ఇస్లామ్‌ను మీ ధర్మంగా అంగీకరించాను." (మాయిదా సూరా : 3వ సూక్తి)
ఈ ధర్మంలో ఎలాంటి హెచ్చుతగ్గులు జరగకుండా ఉండటానికి దీనిని కాపాడే బాధ్యత కూడా అల్లాహ్ స్వయంగా తీసుకున్నాడు.
"ఈ జ్ఞాపికను మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని రక్షిస్తాము." (హిజ్ర్ సూరా : 9వ సూక్తి)
దీనిద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ఒక పరిపూర్ణమైన, సురక్షితమైన జీవన సంవిధానం. అది దైవవాణి (వహీయె ఇలాహి) ఆధారంగా రూపొందింది. దివ్య ఖుర్ఆన్ సూక్తులు దైవవాణే. అలాగే దైవప్రవక్త ﷺ ఖుర్ఆన్కు చెప్పిన వివరణలు, ప్రజలకు అనుసరించమని చెప్పిన బోధనలు కూడా వహీ ఆధారంగా చెప్పినవే.
ఇస్లాం ధర్మం ప్రపంచవాసులందరిది. కనుక దీని బోధనల్లో ఒక విధమైన సమతౌల్యం, సమగ్రత కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో నిశితబుద్ధితో ఆలోచించేవాడెవడైనా ఈ ధర్మాన్ని సులభంగా అర్థం చేసుకొని ఆచరించగలడు. ఇది విశ్వ ప్రభువు నిర్ణయించిన ధర్మం కనుక ఇందులో భౌగోళిక, వంశప్రాతిపదికలపై మానవులను విభజించటం జరగలేదు. పైగా ఈ ధర్మంలో విశ్వాసానికి, సిద్ధాంతానికి, నీతి నడవడికలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది.
"మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలూ తెలిసినవాడూను." (హుజురాత్ : 13)
ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించటానికి దైవప్రవక్త ﷺ ను ఆదర్శమూర్తిగా పరిగణించటం జరిగింది. ఆయనగారి ఉత్తమ ఆదర్శాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని మసలుకోవటం, ఆయనగారి నైతికతా నడవడికల అద్దంలో చూసుకొని తమల్ని తాము సంస్కరించుకోవటం ముస్లింలకు పరిపాటి అయింది.
"వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించే ప్రతి వ్యక్తికి." (అహ్జాబ్ సూరా : 21)
దైవప్రవక్త ﷺ గారి రేయింబవళ్ల దినచర్యలు, వ్యక్తిగతమైన సామూహికమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం భద్రపరచబడి ఉంది. ప్రపంచంలోని మరే సంస్కర్త లేక నాయకుని లేక నేత యొక్క జీవితమూ ఈ విధంగా భద్రపరచబడిలేదు. ఎవరూ తిరస్కరించలేని సత్యమిది. దీనికిగల ముఖ్య కారణమేమిటంటే దైవప్రవక్త ﷺను అనుసరించనిదే ఎవరూ ఇస్లాం పరిధుల్లో ఉండలేరు. ఒక వ్యక్తి ముస్లిం అవటానికి అతను దైవప్రవక్త అడుగుజాడల్లో నడవటం చాలా అవసరం.
"విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి. మీ పనులను వృధా చేసుకోకండి." (ముహమ్మద్ : 33)
"ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు : మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడూను." (అలి ఇమ్రాన్ : 31)
అనుసరణ కోసం విద్యాజ్ఞానాలు చాలా అవసరం. ఫలానా విషయంలో దైవప్రవక్త ఆదేశం ఏమిటీ? ఆయన ఆచరణ ఏమిటి? అన్నది తెలుసుకున్నప్పుడే ఆయన్ని అనుసరించటానికి వీలవుతుంది. అంటే దైవప్రవక్త ﷺను అనుసరించటానికి హదీసు విద్య, ముస్లిం అవటానికి, పరలోకంలో ముక్తి పొందటానికి దైవప్రవక్త అనుసరణ చాలా ముఖ్యమన్నమాట. కాని మరోవైపు ప్రపంచంలోని ఏ గొప్ప సంస్కర్తకూ ఆ స్థానం లేదు. అతని జీవితంలోని ఒక కోణం గౌరవప్రదంగా ఉంటే మిగతా కోణాలన్నీ చీకటిగా ఉంటాయి. ఒకరి జీవిత చరిత్రలోని కొంతభాగం గుర్తుంటే మిగతా భాగమంతా అనామకంగా ఉంటుంది. ఒకరి జీవితంలోని బయటి జీవితం విజయవంతంగా కనపడినా గృహస్త జీవితం మాత్రం విఫలమై ఉంటుంది. కనుక అటువంటి నాయకులు ఏ కారణాల చేతనయితే ఖ్యాతి గడించారో కేవలం ఆ కారణాల వైపు మాత్రమే ప్రజలు తమ దృష్టిని కేంద్రీకరించారు. వాటిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. మిగతా జీవితం మొత్తాన్ని వదలిపెట్టేశారు. కాని దైవప్రవక్త ﷺ జీవితం అన్ని విధాలుగా విజయవంతమైనది. అత్యున్నత ఆదర్శప్రాయమైనది. కనుక ఆయన జీవితంలోని ప్రతి కోణం సురక్షితంగా ఉంది. అదీగాక ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో, దాన్ని ఆచరించటంలో కూడా ఆయన సున్నతు (జీవన విధానం) ప్రధాన భూమికను పోషిస్తుంది. అందుచేత ఆయన జీవితాన్ని భద్రపరచటానికి అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి. ఆయన జీవితంలో జరిగిన చిన్న పెద్ద సంఘటనలన్నింటిని, ఆయన ఆజ్ఞల్ని, అనుజ్ఞల్ని మొదలగు వాటినన్నింటిని ఆయన సహచరులు గుర్తుపెట్టుకున్నారు. తమ జీవితాలను కూడా వాటికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాకుండా వాటిలో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకుండా వాటిని యథాతథంగా తర్వాతి తరాల వారికి అందజేశారు. పైగా దైవప్రవక్త ﷺను అనుసరించాలన్న వారి విపరీతమైన కోరికే వారిని హదీసులను గుర్తుపెట్టుకునేందుకు దోహదం చేసింది. అందుకే ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు : హదీసులను గుర్తుపెట్టుకోవటానికి అత్యంత మంచి పద్ధతి వాటిని అనుసరించటం. ఆచరణ ఎంత ఎక్కువగా ఉంటే విషయాలు కూడా అన్ని ఎక్కువగా గుర్తుంటాయి. విషయపరిజ్ఞానం కూడా అంత పరిపక్వతనొందుతుంది.
దైవప్రవక్త సహచరులు కొందరు తమ అవసరాన్నిబట్టి దైవప్రవక్త ﷺ గారి బోధనల్ని రాసి భద్రపరచుకునేవారు. ఆ కాలంలో అరబ్బు దేశంలో వ్రాతపని అరుదుగా ఉండేది. వారు ఎక్కువగా తమ జ్ఞాపక శక్తిమీదే ఆధారపడేవారు. అరబ్బు చరిత్ర గురించి తెలిసిన వాడెవడైనా వారి ఈ అలవాటుని ధృవీకరిస్తాడు. అదీగాక దైవప్రవక్త ﷺ నుంచి హదీసులను నకలు చేసిన ఆయన అనుచరుల సంఖ్య కూడా పరిమితంగా లేదు. దైవప్రవక్త ﷺ గారి వార్థక్యంలోనైతే వారి సంఖ్య వేలకు దాటిపోయింది. వారిలో ఎవరైనా ఏ విషయాల్లోనైనా తప్పు చేస్తే అతన్ని సరిదిద్దటానికి ఎంతోమంది సహచరులు ఉండేవారు. ముఖ్యమైన వ్యవహారాల గురించి చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకోవటం కోసం సమావేశాలు కూడా జరుగుతుండేవి. ముఖ్యంగా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఖిలాఫత్ కాలంలోనయితే ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. ఎప్పుడైనా ఏ ముఖ్య వ్యవహారంలోనైనా సీనియర్ సహాబీల అవసరం ఏర్పడవచ్చు కనుక హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తాను ఖిలాఫత్ బాధ్యతలు చేపట్టిన ప్రారంభకాలంలో సీనియర్ సహాబీ లెవరూ ప్రభుత్వ అనుమతి లేకుండా, అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప ఖిలాఫత్ ముఖ్య పట్టణాన్ని వదలి బయటికి వెళ్ళరాదని ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఆ సీనియర్ సహాబీల పర్యవేక్షణలో తాబయీన్లతో కూడిన ఒక పెద్ద, అత్యంత ప్రతిభావ్యుత్పత్తులు గల ఒక శిష్యగణం తయారయింది. వారంతా చాలా క్రమబద్ధతతో హదీసుల సేకరణ, సంకలన కార్యాల కోసం బాగా కృషిచేశారు. ఆ కాలంలో ముఖ్యమైన హదీసు గ్రంథాలెన్నో సంకలనం చేయబడ్డాయి. ఉదా : సహీఫయె హుమామ్ ఇబ్నె మంబహ్ (హి.శ. 132). దీనిని ప్రముఖ దైవప్రవక్త సహచరులు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారి శిష్యులు సంకలనం చేశారు. అలాగే సహీఫయె సయీద్ బిన్ అరూబ (హి.శ. 156), సహీఫయె రబీ బిన్ సబీహ్ (హి.శ. 160). తర్వాత ముఅత్తా ఇమామ్ మాలిక్ బిన్ అనస్ (హి.శ. 179), వీటి తర్వాత సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, అబూ దావూద్ మొదలగు ఎన్నో హదీసు గ్రంథాలు క్రోడీకరించబడ్డాయి. ఇక్కడ మచ్చుకు ప్రారంభకాలంలో సంకలనం చేయబడిన కొన్ని గ్రంథాల పేర్లు మాత్రమే పేర్కొనబడ్డాయి. హదీసు విద్యకు పునాదులుగా భావించబడే ఈ మూలగ్రంథాల్లో ఆ గ్రంథకర్తల నుంచి దైవప్రవక్త ﷺ వరకు ఆయా హదీసులను అందజేసిన వారందరి పేర్లూ నమోదు చేయబడి ఉన్నాయి. ఆ ఆధారాల ప్రాతిపదిక మీదే హదీసు యొక్క ప్రామాణికత, అప్రామాణికతల గురించి చర్చించటానికి వీలయింది. తర్వాత ఆ మూల గ్రంథాల నుంచే కొన్ని ఉపశీర్షికలతో ఇతర అనేక గ్రంథాలు సంకలనం చేయబడ్డాయి. వాటి గ్రంథకర్తలు వాటిలో తమ అభిరుచికి, అవసరాలకు అనుగుణంగా హదీసులను పొందుపరిచారు. బులూగుల్ మరామ్, రియాజుస్సాలిహీన్, మిష్కాత్ మొదలగు గ్రంథాలన్నీ ఆ కోవకు చెందినవే. ఈ గ్రంథాల్లో ప్రతి హదీసు చివర్లో, దాని ఆధారాలు, శాస్త్రపరంగా దాని ప్రామాణికతలు కూడా పేర్కొనబడ్డాయి. ఇటువంటి గ్రంథాల మూలంగా తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ జ్ఞానం ఆర్జించటానికి వీలయింది. ధర్మ విషయాలు అర్థం చేసుకోవటం సులభమయింది. ఈ గ్రంథాలను సంకలనం చేసినవారు హదీసు విద్యలో ఆరితేరినవారు. వేలాది హదీసుల్లో నుంచి వారు వీటిని సేకరించారు. కనుక ఒక సామాన్య వ్యక్తి తనకు అవసరమైన విషయాలు హదీసు భాండాగారాల్లో వెతుక్కునే బదులు ఈ సంకలన గ్రంథాల ద్వారా గ్రహించటం అత్యంత సులభమైపోయింది. వీటిలో కొన్ని గ్రంథాలకు విపరీతమైన ఖ్యాతి లభించింది. అలాంటిదే ఈ రియాజుస్సాలిహీన్ గ్రంథం. దీని ద్వారా దైవంతో అనుబంధం, పరలోక చింతనా మార్గాలు సుగమం అయ్యాయి. సామాన్యులు, ప్రముఖులు, పండితులు, విద్యార్థులందరి నుంచి ఈ గ్రంథానికి గొప్ప ఆదరణ లభించింది.
రియాజుస్సాలిహీన్ : ఎవరైనా దైవప్రవక్త ﷺ గారి విధానానికి అనుగుణంగా జీవితం గడపదలచుకుంటే ఆయనగారి దైనందిన కార్యక్రమాల గురించి తెలుసుకోవటం కోసం "రియాజుస్సాలిహీన్" ఎలాంటి హదీసుల సంకలనమంటే దానిద్వారా మనిషి చాలా వరకు తన అవసరాన్ని తీర్చుకోగలడు. హదీసు విజ్ఞాన జగత్తులో హి.శ. 7వ శతాబ్దా నికి చెందిన ప్రముఖ ధర్మపండితులు, హదీసువేత్త ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ నవవీ (హి.శ. 631 – 676) ఈ గ్రంథాన్ని సంకలనం చేశారు. ఆ కాలంలోని సుప్రసిద్ధ పండితులు, గొప్ప గొప్ప హదీసువేత్తలు సైతం ఆయన జ్ఞానాన్ని, పరిశోధనను, ఆయనగారి ధర్మపరాయణతను వేనోళ్లా పొగిడారు. ఆయన ఖ్యాతి సిరియా నుంచి మొదలై మొత్తం ఇస్లామీయ జగత్తులో వ్యాపించింది. ఆయన గ్రంథాలకు అన్నిచోట్లా గొప్ప ఆదరణ లభించింది. హదీసు జ్ఞానఖనుల్లో పరివ్యాప్తమై ఉన్న వేలాది హదీసుల నుంచి ఆయన ఈ సంకలనాన్ని తయారుచేశారు. ఇందులో మొత్తం 1894 హదీసులు ఉన్నాయి. అవి విశ్వాసాలు, చిత్తశుద్ధి మొదలుకొని దైవప్రవక్త ﷺ గారి విధానానికి అనుగుణంగా జీవితం గడపటం వరకు అన్ని విషయాల్లోనూ మనిషికి మార్గదర్శకత్వం వహిస్తాయి. దేవుని హక్కులు, దాసుల హక్కులు, ఆచరణల మహాత్మ్యం, చెడుల పట్ల ఏవగింపు, ఆత్మ నిగ్రహం, ధార్మిక – ప్రాపంచిక కర్తవ్యాల మధ్య సమతౌల్యం మొదలగు విషయాలకు సంబంధించిన హదీసులు వివిధ శీర్షికల క్రింద పొందుపరచబడ్డాయి. ఇమామ్ నవవీగారు తాను రాసిన ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయం క్రింద సదరు శీర్షికకు సంబంధించిన దివ్య ఖుర్ఆన్ సూక్తులు కొన్ని ప్రస్తావించారు. తర్వాత దానికే సంబంధించిన మరికొన్ని హదీసులు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ హదీసులు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోనివే. మిగతావి ఇతర హదీసు గ్రంథాల్లోనివి. ఆ హదీసులతో పాటు వాటి ఆధారాలు కూడా ఇవ్వబడ్డాయి. మక్తబా దారుస్సలామ్, రియాద్, సవూదీ అరేబియా వారు హదీసును చదవగానే దాని సారాంశం పూర్తిగా బోధపడాలనీ, ప్రజలకు, విద్యార్థులకు హదీసుల్ని అర్థం చేసుకోవటంలో ఇబ్బందులేమీ కలగకుండా ఉండాలని ఈ పుస్తకం మీద మరింత కృషిచేసి ఇందులో ఆచూకీ గ్రంథాల పేర్లు, ముఖ్యాంశాలు, వివరణలు జోడించారు. ఈ పనిలో సుప్రసిద్ధ ధర్మపండితులు హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ (లాహోర్)గారు ఎంతగానో శ్రమించారు. ఆయనగారు దివ్య ఖుర్ఆన్ గ్రంథానికి కూడా "అహ్సనుల్ కలామ్" అన్న పేరుతో వ్యాఖ్యానం రాసి వున్నారు. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రచురితమయ్యింది.
తెలుగులో ఈ గ్రంథాన్ని వెలువరించదలచినప్పుడు వివరణలు, సారాంశాలు ప్రామాణికమైనవిగా, సర్వజనామోద యోగ్యంగా ఉండాలని అందులో ఎలాంటి లుకలుకలు, ప్రమాణబద్ధంకాని విషయాలు ఉండకూడదని ఆ దారుస్సలామ్ ద్వారా ప్రచురిత మైన మూలగ్రంథప్రతినే దృష్టిలో పెట్టుకోవటం జరిగింది.
ఇంత ముఖ్యమైన గ్రంథాన్ని తెలుగులో తర్జుమా చేయించి ప్రచురిస్తున్నందుకు మాకు కేవలం ఆనందమే కాదు రెట్టింపు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే మా విద్యాలయం "జామిఅతుల్ ఖుర్ఆన్" నుంచే పట్టభద్రుడైన ఒక విద్యార్థి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. నిజానికి జామియా నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులు షరీఅత్ జ్ఞానంతోపాటు ఆధునిక విద్య అనగా ధార్మిక విద్యతోపాటు ప్రాపంచిక విద్యల్లోనూ ప్రవేశం కలవారై ఉండాలనీ, ప్రాంతీయ భాషల్లో ధర్మసేవ చేయటానికి అర్హత కలవారై ఉండాలన్న ఉద్దేశ్యంతోనే జామిఅతుల్ ఖుర్ఆన్ విద్యాలయం స్థాపించబడింది. నేడు ఉర్దూలో ధర్మసేవ చేస్తున్న ఉలమాలకు కొదువ లేదు. కాని షరీఅత్ విద్య మీద పట్టును కలిగి ఉండి దాంతోపాటు ప్రాంతీయ భాషల్లో నైపుణ్యం గల పండితులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అల్లాహ్ కృషివల్ల ఈ సంస్థ నుంచి ఇంతకు ముందు ఇతర పుస్తకాలు కూడా తెలుగు భాషలో వెలువరించబడి తెలుగు జనావళి మన్ననలు అందుకున్నాయి. ఈ విద్యాలయ సంస్థాపకులు హాఫిజ్ వ ఖారీ ముహమ్మద్ తఖీయుద్దీన్ (అలైహిర్రహ్మా) గారు ఈ విద్యాలయ నిర్మాణం కోసం, దీని అభివృద్ధికోసం శాయశక్తులా కృషి చేశారు. అహర్నిశలూ శ్రమించారు. బహుశా ఇది ఆయన మరియు ఆయన సహాయకుల చిత్తశుద్ధి ఫలితమేనేమో…. అచిర కాలంలోనే ఈ జామియాకు ఎన్ని విజయాలు లభించాయంటే…. అందుకు అల్లాహ్‌కు ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. దాని స్థాపకులు ఇప్పుడు మన మధ్య లేరు కాని దీని పుణ్యంలో మనతోపాటు ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిద్దాం. ఎందుకంటే దీనికి అంకురార్పణం చేసింది ఆయనే. ఆ అంకురమే నేడు మహావృక్షంలా తయారైంది. దాని ఫలాలతో, చల్లని నీడలతో జనం ప్రయోజనం పొందుతున్నారు.
ఒక భాషలో ఉన్న పుస్తకాన్ని మరొక భాషలోకి అనువదించటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ విషయం విద్యావంతులకు తెలియని విషయం కాదు. ముఖ్యంగా అది ఏదైనా ప్రత్యేక శాస్త్రానికి సంబంధించినదయితే….?! హదీసు విషయం అంతకంటే ఎక్కువ సున్నితమైనది. సాహిత్య పుస్తకాల్లోలాగా కాకుండా ఇందులో ప్రతి పదానికీ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ధర్మానికి, షరీఅత్కు సంబంధించిన వ్యవహారం. దీనికోసం చాలా సూక్ష్మదృష్టి, నిజాయితి అవసరం. అప్పుడే అందులోని ఏ విషయం కూడా తన వాస్తవపరిధి నుంచి వైదొలగకుండా ఉంటుంది. దీనికోసం షరీఅత్ విద్య మీద పట్టుని కలిగి ఉండటంతోపాటు భాషా నైపుణ్యం కూడా ఉన్న అనువాదకులు అవసరమవుతారు. ఈ సందర్భంగా మా ప్రియ విద్యార్థి మౌల్వీ రసూల్….. ఎంతైనా అభినందనీయుడు. ఈ అబ్బాయి ఈ మహోన్నత కార్యాన్ని ఎంతో కష్టపడి, నిజాయితితో పూర్తిచేశాడు. ప్రముఖ తెలుగు పండితులు, గౌరవనీయ సోదరులగు అజీజుర్రహ్మాన్ గారి పునఃపరిశీలనతో ఈ అనువాదానికి మరింత బలం చేకూరింది. ఆయన ఇంతకు ముందు ఎన్నో పుస్తకాలు, అనేక గ్రంథాలు తెలుగుభాషలోకి విజయవంతంగా అనువాదం చేసివున్నారు, ఆయనగారు ఈ గ్రంథ ముసాయిదా ఆద్యంతం చదివారు. అవసరమైన చోట్ల సవరణలు చేశారు, తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. జామియా కమిటీ అధ్యక్షులు జనాబ్ సైపుద్దీన్ గారికి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయనగారు ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో ఈ ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. లేకపోతే ఈ పని ఇంత సులభంగా ముగింపుకి చేరుకోగలిగేది కాదు. చివరగా ఈ గ్రంథాన్ని అత్యంత అందంగా, ఆకర్షణీయంగా ప్రచురించటానికి కృషిచేసిన ప్రియతములు మౌల్వీ రజియుద్దీన్ మస్వూద్గారి ప్రయత్నాలు బహుధా ప్రశంసనీయం. ఆయనగారు ఈ గ్రంథం యొక్క అంతరంగిక సౌందర్యంతోపాటు బాహ్య సొగసుకు, ప్రామాణికతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నిజం చెప్పాలంటే ధార్మిక పుస్తకాల ప్రచురణలో సాధారణంగా ఇలాంటి విషయాలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు.
విశ్వప్రభువైన అల్లాహ్ మనందరి కృషిని ఆమోదించుగాక! ఈ బృహత్తర కార్యంలో ఏ విధంగానైనా సహాయ సహకారాలనందించిన వారందరికి గొప్ప ప్రతిఫలం ప్రసాదించుగాక! వారికోసం దీనిని సదఖయె జారియా (శాశ్వత పుణ్యకార్యం)గా మలచుగాక! మనందరికి దైవగ్రంథాన్ని, దైవప్రవక్త ﷺ సున్నతును అర్థం చేసుకొని ఆచరించే, ఇతరులకు ఆ సందేశాన్ని అందజేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఈ సంకలనం ద్వారా వీలైనంత ఎక్కువమందికి ప్రయోజనం పొందే అదృష్టాన్ని కలిగించుగాక!
వ సల్లల్లాహు వ సల్లమ వ బారక అలా నబియ్యినా ముహమ్మదింవ్వ ఆలిహీ వ అస్హాబిహీ అజ్మయీన్. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.
ముహమ్మద్ అబ్దుల్ హాది ఉమరీ మదనీ
మజ్లిసుల్ ఖజాయిల్ ఇస్లామీ అధ్యక్షులు, బ్రిటన్
11, రజబ్ హి.శ. 1426
క్రీ.శ. 2005 ఆగస్టు, 17.
↑ విషయ సూచిక · తదుపరి: గ్రంథకర్త జీవిత విశేషాలు ↓
గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) గారి సంక్షిప్త జీవిత విశేషాలు
– హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్
జననం – జీవిత లక్ష్యం
ఇమామ్ నవవీ గారి పూర్తి పేరు అబూ జకరియ్యా ముహీయుద్దీన్ యహ్యా బిన్ షరఫ్ నవవీ, బిన్ మరీ బిన్ హసన్ బిన్ హుసైన్ బిన్ ముహమ్మద్ బిన్ జుమ్ఆ బిన్ హిజామ్ – నవవీ అనగా నవాకు చెందినవాడు అని అర్థం. నవా అనేది డెమాస్కస్‌కు సమీపంలో హూరాన్ నగరంలోని ఒక బస్తీ పేరు. ఆయన ముత్తాత హిజామ్ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.
ఇమామ్ నవవీ ఈ నవా బస్తీలోనే హి. శ. 631వ యేట జన్మించారు. ఈయన తండ్రి పుణ్యాత్ముడు, సత్పురుషుడు. తన ప్రియ కుమారునిలో తెలివితేటలను, ప్రతిభా వ్యుత్పత్తులను గమనించిన ఆయన ఇమామ్ నవవీకి ఉత్తమ శిక్షణను అందించారు. షైఖ్ యాసీన్ బిన్ యూసుఫ్ మురాకషి ఇలా అంటున్నారు : నేను ఇమామ్ నవవీని నవా ఊరిలో చూశాను. అప్పుడు ఆయనకు పదేళ్లు ఉండి ఉంటాయి. తోటి పిల్లలు ఆయన్ని తమవెంట ఆడమని ఒత్తిడి చేస్తుంటే ఆయన వారి నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. పిల్లల ఒత్తిడి మరీ పెరిగిపోవటంతో ఆయన ఏడ్వటం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా దివ్య ఖుర్ఆన్ సూక్తులు పఠిస్తూ ఉన్నారాయన. ఆయన తెలివితేటలు చూసి నాకు ఆయన మీద ప్రేమ పుట్టింది. నేను ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, "ఈ అబ్బాయి తన కాలంలో ఓ మహా పండితుడు, గొప్ప దైవారాధకుడు, ఐహిక అనాసక్తపరుడు అవుతాడని, ప్రజలకు ఇతని మూలంగా ప్రయోజనం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను" అని ఆయనతో చెప్పాను. అందుకాయన "నువ్వు జ్యోతిషుడివా?" అని అడిగారు. "జ్యోతిషుణ్ణి అయితే కాను గాని నా నోటి ద్వారా ఈ పలుకులు అల్లాహ్ చెప్పించాడు" అన్నాను నేను.
ఆ ఉపాధ్యాయుడు ఆ విషయం ఇమామ్ నవవీ నాన్నతో చెప్పాడు. ఆ మాట వినగానే ఆయన నాన్న తన కుమారుణ్ణి ధర్మసేవ కోసం అంకితం చేద్దామని నిశ్చయించుకున్నారు. కొంతకాలంలోనే నవవీగారు ఖుర్ఆన్ చూసి చదవటం పూర్తి చేసుకున్నారు. అప్పుడు ఆయనకు యవ్వన దశ కూడా దగ్గరపడింది. ఆనాడు నవా బస్తీలో ధర్మవిద్యలో నైపుణ్యాన్ని బోధించే పాఠశాలలు లేవు. అందుకని ఇమామ్ నవవీ నాన్న ఆయన్ని డెమాస్కస్ తీసుకొని వెళ్ళారు. ఆ కాలంలో డెమాస్కస్ నగరం నిపుణులకు నిలయం. పండితులకు ఆయువు పట్టు. ఎక్కడెక్కడినుంచో విద్యార్థులు అక్కడికి చేరుకునేవారు. వివిధ విద్యలు నేర్పించే పాఠశాలలు అక్కడ మూడువందలకు పైచిలుకు ఉండేవి. ఇమామ్ గారు అక్కడ రవాహియా అనే ఓ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. ఇది ఉమవీ యూనివర్సిటీ సంబంధిత పాఠశాల. దీనిని స్థాపించినవాడు ఒక వ్యాపారి. అతని పేరు జకియుద్దీన్ అబుల్ ఖాసిమ్ అలియాస్ ఇబ్నె రవాహా. అతని మారుపేరుతోనే ఆ పాఠశాలను 'మద్రసయె రవాహియా' అని పిలిచేవారు. ఆనాటి గొప్ప గొప్ప పండితులు ఆ పాఠశాలలో విద్యను బోధించేవారు. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) స్వయంగా ఇలా చెప్పారు : "నేను ఇక్కడ రెండేళ్లు గడిపాను. ఆ కాలంలో నేను ఎన్నడూ విశ్రాంతి కోసం నేలమీద మేను వాల్చలేదు. అలాగే అన్నం కూడా 'బతికితే చాలు' అన్నట్లుగా పుచ్చుకునేవాణ్ణి."
అక్కడ చదివిన పుస్తకాలన్నిటినీ ఆయన ఆ కాలంలోనే పరిశోధించి వాటికి పాద వ్యాఖ్యానాలు రాస్తూపోయారు. ఆయన శ్రమను, యోగ్యతను, విద్యపట్ల గల మక్కువను, అంకితభావాన్ని గమనించిన ఆయన గురువులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆయన్ని అమితంగా ప్రేమించటం మొదలుపెట్టారు.
అధ్యాపకులు – గురువులు
డెమాస్కస్‌లో ఉన్నప్పుడు ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇరవైకి పైచిలుకు పండితుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఈ గురువులందరూ మహా పండితులు. వివిధ విద్యల్లో ఆరితేరినవారు. ఒకరు ఫికహ్ శాస్త్రంలో నిపుణుడైతే మరొకరు హదీసు శాస్త్ర పారంగతుడు. ఒకరు 'ఉసూల్' విద్యలో ప్రముఖుడైతే ఇంకొకరు అరబీ విద్యల్లో దిట్ట.
విద్య పట్ల ఆసక్తి, అంకితభావం
ఇమామ్ నవవీ గారికి విద్యపట్ల గల శ్రద్ధాసక్తుల్ని ఆయనకు దానిమీద గల అంకితభావాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఆయన పన్నెండు పాఠాలు చదివేవారు. పాఠం చదివినప్పుడే దాని వివరణ, పాదవ్యాఖ్యానం రాసేపని కూడా చేసేవారు. రాత్రిపూట చాలా తక్కువగా నిద్రపోయేవారు. నిద్ర ముంచుకువస్తే పుస్తకాల మీదే కాసేపు కునుకు తీసేవారు. తర్వాత మేల్కొని మళ్లీ విద్యా కార్యకలాపాల్లో నిమగ్నులయ్యేవారు. ఇమామ్ జహబీ (రహిమహుల్లాహ్) ఆయన గురించి ఇలా చెబుతున్నారు : రేయింబవళ్లు విద్యాపనుల్లో నిమగ్నమై ఉండే ఆయన గారి ఈ పద్ధతి ప్రజల్లో ఒక సామెతగా చెప్పుకోబడేది. ఆయన తన సమయమంతా విద్యార్జనకోసమే అంకితం చేసుకున్నారు. కాసేపు తరగతిలో కూర్చొని విద్యాభ్యాసం చేస్తారు. కాసేపు దాన్ని కంఠస్తం చేస్తూ ఉంటారు. మరికాసేపు పాఠంలోని కఠిన సందర్భాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇంకాసేపు ఇతర పుస్తకాలు చదువుతూ, చదివిన విషయాలు రాసుకుంటూ ఉంటారు. ఆఖరికి దారిలో నడిచినప్పుడు కూడా పాఠం గుర్తుచేసుకునేవారు లేదా ఏదయినా పుస్తకం చదువుతూ ఉండేవారు. అల్లాహ్ ఆయనకు జ్ఞాపకశక్తితో పాటు అవగాహనా సామర్థ్యం కూడా మెండుగా ప్రసాదించాడు. ఇది దేవుని మహదనుగ్రహం. అల్లాహ్ ప్రసాదించిన వరాలను సద్వినియోగం చేసుకునేవారి వృద్ధివికాసాల విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాగే ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) కూడా దేవుడు తనకు అనుగ్రహించిన వరాలను బాగా సద్వినియోగం చేసుకొని గొప్ప ఉన్నతిని సాధించారు.
నిరాడంబరత – ఉత్తమ నడవడిక
విద్యలో ఎంత ఉన్నతిని సాధించినా ఆయన స్వభావంలో మాత్రం ఎంతో అణకువ కనిపించేది. ఆయన ఎల్లప్పుడూ చాలా నిరాడంబరమైన దుస్తులు ధరించేవారు. ఆహారం కూడా సామాన్య ఆహారం. పూటగడవటానికన్నట్లు కాస్తంత పుచ్చుకునేవారు. రుచికరమైన ఆహారం తినటం, ఆడంబరంతో కూడిన వస్త్రాలు ధరించటం నిషిద్ధం కాదుగాని విద్యార్థుల విద్యా నిమగ్నతకు మాత్రం అవి ఎంతైనా విరుద్ధమే. అందుకే చాలామంది పండితులు, శాస్త్రవేత్తలు తమ జీవితాల్లో వీటికి అంతగా ప్రాముఖ్యతనివ్వరు. వీరి దృష్టిలో అసలు ప్రాముఖ్యత బోధన అధ్యయనాలు, ధర్మ సందేశ ప్రచార కార్యాలకు, పుస్తక పఠనానికి, రచనా వ్యాసంగానికి ఇతర విద్యావిషయిక కార్యాలకు మాత్రమే ఉంటుంది. వీటిలోనే వారికి ఆనందం, తృప్తి లభిస్తాయి. ఏమైనప్పటికీ ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) దైవభీతి, ధర్మపరాయణత, ఐహిక అనాసక్తతలపరంగానూ చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఉద్దేశ్యాలు చాలా గొప్పవి. కాని కోరికలు మాత్రం చాలా చిన్నవి. షేఖ్ ముహీయుద్దీన్ గారు ఇమామ్ గారి గురించి ఇలా చెబుతున్నారు :
"ఆయనలో మూడు గొప్ప స్థానాలుండేవి. వాటిలో ప్రతిఒక్కటీ ఎలాంటి స్థానమంటే ఎవరిలోనయినా అదొక్కటి ఉంటే అతన్ని సందర్శించుకోవటానికి ప్రజలు ప్రపంచం నలువైపుల నుంచి తండోపతండాలుగా వస్తారు. మొదటి స్థానం : విద్య మరియు దానికి సంబంధించిన బాధ్యతల నిర్వహణ. రెండవ స్థానం : ప్రపంచం పట్ల సంపూర్ణ నిరాసక్తత. మూడవ స్థానం : మంచి చేయమని ఆజ్ఞాపిస్తూ చెడు చేస్తున్నవారిని ఆపటం. ఇమామ్ నవవీలో ఈ మూడు సుగుణాలూ ఉండేవి. ఆయన ఓ మహా పండితుడు, ఓ నిరుపమాన ఐహిక అనాసక్తిపరుడు. అలాగే నిర్భయుడైన ఓ ధర్మసందేశ ప్రచారకుడు కూడా.
మరణం, విద్యా సేవ
తవ 19 యేండ్ల ప్రాయంలో ఇమామ్ డెమాస్కస్‌కు వచ్చారు. అక్కడ ఎందరో అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఎన్నో విద్యాలయాల్లో బోధనా సేవలందించారు. రచనా వ్యాసంగంలో, గ్రంథసంకలనాల్లో చెప్పుకోదగిన కార్యాలు నిర్వర్తిం చారు. వాటిలో సహీహ్ ముస్లిం వివరణ, తహ్జీబుల్ అస్మా వల్లుగాత్, కితాబుల్ అజ్కార్, రియాజుస్సాలిహీన్ లాంటి ప్రధాన గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిద్వారా లక్షలాది జనం ప్రయోజనం పొందుతున్నారు. వాటిద్వారా విశ్వప్రభువు ఆమోదించే సన్మార్గం ఏదో తెలుసుకుంటున్నారు. డెమాస్కస్‌లో 28 యేళ్లు గడిపిన తర్వాత ఇమామ్ గారు తన జన్మస్థలానికి చేరుకున్నారు. ఆ సంవత్సరమే హి.శ. 676లో కొంతకాలం అనారోగ్యంపాలై చివరికి కన్నుమూశారు. కాని విజ్ఞానపరమైన తన సేవల ద్వారా మాత్రం ఆయన విజ్ఞాన జగత్తులో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అల్లాహ్ ఆయన్ని క్షమించి ఆయనమీద దయజూపుగాక!
↑ విషయ సూచిక · తదుపరి: గ్రంథకర్త తొలిపలుకులు ↓
గ్రంథకర్త (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్) తొలిపలుకులు
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
పొగడ్తలన్నీ సర్వ శక్తిమంతుడు, ఒక్కడైన అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సర్వాధికుడు, అమితంగా మన్నించేవాడు, రాత్రిని పగటిలోనికి, పగలును రాత్రిలోకి ప్రవేశింపజేసేవాడు (దీనివల్ల వేసవిలో రాత్రులు చిన్నవిగానూ, పగళ్లు దీర్ఘమైనవిగానూ మరియు శీతాకాలంలో రాత్రులు దీర్ఘమైనవిగానూ, పగళ్లు చిన్నవిగానూ అయిపోతుంటాయి లేదా ఆయన రాత్రిని పగటిపైకి కమ్మివేసేవాడు, అంటే పగటి కాలం పూర్తవగానే రాత్రి వచ్చేస్తుంది. అలాగే, రాత్రి నిష్క్రమించగానే పగలు మొదలవుతుంది) రేయింబవళ్ళ ఈ రాకపోకలు అల్లాహ్ పనితనమే. మనోనేత్రం కలవారికి, విజ్ఞతాదృష్టి కలవారికి ఇందులో హితబోధ వుంది. బుద్ధిజీవులు, ఆలోచనాపరుల కొరకు ఇందులో గుణపాఠం ఉంది. సృష్టిలో తన ధర్మం కోసం ఎన్నుకున్న వారికి ఆయన (ఇహలోక వాస్తవికతను గురించి) కనువిప్పు కలిగించాడు. ఈ ప్రపంచంలో వారికి దైవభీతి, ధర్మపరాయణతలు అనుగ్రహించాడు. ఇటువంటి వారు నిత్యం ఆయన ధ్యానంలో, ఆయన చింతనలో నిమగ్నులై వుంటారు. విశ్వంలో వ్యాపించివున్న దేవుని నిదర్శనాల నుండి గుణపాఠాన్ని గ్రహిస్తూ, అనునిత్యం తమ ప్రభువును స్మరిస్తూ ఉంటారు. ఆయనే వారికి ఆజ్ఞల్ని పాలించే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. పరలోక శాశ్వత నిలయం కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు, తమ ప్రభువు తమ పట్ల అప్రసన్నుడయ్యే చేష్టల నుంచీ, తమని నరకానికి గొనిపోయే పాపకార్యాల నుండి బయటపడే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. వారిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిపడినా, కాలం ఏ మలుపు తిరిగినా, పరిస్థితుల స్వరూపంలో ఎలాంటి మార్పులు పొడసూపినా సరే వారు (దైవానికి విధేయత చూపే, చెడులకు దూరంగా ఉండే) తమ నడవడికపై స్థిరంగా ఉంటారు.
నేను అల్లాహ్‌ను స్తుతిస్తున్నాను. అత్యున్నతమైన, అతి పవిత్రమైన ఆయన కీర్తినీ, సర్వాంగవర్తీయ, సుప్రయోజనకర ఘనతను కొనియాడుతున్నాను. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన సద్వర్తనుడనీ, అత్యంత ఉదాత్తుడనీ, క్షమాశీలి అనీ, కనికరించేవాడనీ నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ ﷺ ఆయన దాసుడని, సందేశహరుడని, ఆయనకు ప్రియుడు మరియు సఖుడని, సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించేవారని, పటిష్ఠమైన ధర్మం వైపునకు ఆహ్వానించేవారని కూడా నేను సాక్ష్యం పలుకుతున్నాను. ఆయనపై మరియు ప్రవక్తలందరిపై, వారి అనుచరులపై, సకల సద్వర్తనులపై దైవ కారుణ్యం మరియు శాంతి వర్షించుగాక!
దైవప్రశస్తి, ప్రవక్త ప్రశంసల అనంతరం : అల్లాహ్ సెలవిచ్చాడు : "నేను జిన్నాతులను, మానవులను కేవలం వారు నన్ను ఆరాధించాలని మాత్రమే పుట్టించాను. నేను వారినుండి ఎలాంటి ఉపాధినీ ఆశించను; వారు నాకు అన్నం పెట్టాలని కోరను; దీనిద్వారా వెల్లడయ్యేదేమంటే మానవులు, జిన్నాతులు దైవదాస్యం కోసం మాత్రమే పుట్టించబడ్డారు. కాబట్టి వారు తప్పనిసరిగా తమ పుట్టుక పరమార్థం వైపు దృష్టి సారించాలి. లౌకిక అనాసక్తత, దైవభక్తి భావాలను అలవరచుకోవాలి. ప్రాపంచిక భోగలాలసకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇహలోకం ఏదో ఒకనాడు నశించి పోయేదే. ఇది శాశ్వత నిలయం కాదు. ఇదొక తాత్కాలిక వాహనమేగాని సుఖ సంతోషాల నికేతనం కాదు. ఇది అంత మయ్యే తటాకమే గాని శాశ్విత నివాసం కాదు. కాబట్టి ప్రపంచ వాసుల్లో ఎక్కువగా దాస్యం చేసేవారే అందరికన్నా విజ్ఞులు. ప్రాపంచిక సుఖ భోగాల కోసం పరుగులు తీయకుండా ఉండేవారే అందరిలోకెల్లా బుద్ధిజీవులు.
అల్లాహ్ సెలవిస్తున్నాడు : "ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు. వేమము ఆకాశం నుండి నీటిని కురిపించగా మనుషులూ పశువులూ అందరూ తినే భూ ఉత్పత్తులు బాగా దట్టంగా తయారయ్యాయి. ఆపై భూమి మంచి స్థితిలో ఉన్నప్పుడు పొలాలు బాగా పండి శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజమానులు "ఇక మేము వీటివల్ల లాభం పొందగలము" అని అనుకుంటున్న సమయంలో, అకస్మాత్తుగా రాత్రి వేళనో, పగటి పూటనో మా ఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఏమీ లేనట్లు దానిని సర్వనాశనం చేశాము. ఇలా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాము." (యూనుస్ – 24). దివ్య ఖుర్ఆన్లో ఈ భావాన్నిచ్చే వాక్యాలు అనేకం ఉన్నాయి. ఒకానొక కవి చాలా బాగా చమత్కరించాడు:
"బుద్ధిమంతులైన అల్లాహ్ దాసులు ఇహలోకానికి విడాకులిచ్చేశారు. ప్రాపంచిక పరీక్షలంటే వారు భయంతో కంపిస్తారు."
"వారు ప్రపంచాన్ని బాగా పరికించారు. ఈ ప్రపంచం బతికున్న ఏ మనిషికీ గమ్యం కాజాలదు అన్న వాస్తవాన్ని గ్రహించిన పిదప …..
వారు ప్రపంచాన్ని (నౌక లేనిదే దాటటానికి వీలులేని) ఓ లోతైన సముద్రంగా ఖరారు చేశారు. దానికోసం తమ సత్కర్మలనే నౌకలుగా చేసుకున్నారు."
పైన నేను పేర్కొన్నట్లు, ఇహలోక వాస్తవికత ఇదే అయినప్పుడు, ఇంతకు ముందు నేను అన్నట్లు మన పరిస్థితి, మనందరి పుట్టుక పరమార్థం ఇదే అయినప్పుడు బాధ్యతగల ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా సద్వర్తనుల నడవడికనే ఎంచుకోవాలి. బుద్ధిజీవులు, బుధజనుల బాటలోనే నడవాలి. నేను సూచించిన దానికోసం సన్నాహాలు చేసుకోవాలి. నేను అప్రమత్తం చేసిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. దీనికోసం అన్నింటికన్నా సవ్యమైనది, గమ్యం వైపుకు అత్యుత్తమ రీతిలో ముందుకు నడిపే రహదారి – మన ప్రవక్త ﷺ ద్వారా పటిష్ఠమైన ఆధారాలతో రుజువైన హదీసులను ఎంచుకోవడం. ముందు, వెనకటి తరాల వారందరికీ ఆయన నాయకులు. గతించినవారు, భవిష్యత్తులో రాబోయే వారందరిలోకెల్లా అత్యంత గౌరవనీయులు, ఆదరణీయులు. ఆయనపై, ఇంకా ఇతర ప్రవక్తలందరిపై దేవుని కరుణాకటాక్షాలు కురియుగాక! అల్లాహ్ ఆదేశించాడు : "మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాలలో మీరు పరస్పరం సహకరించుకోండి." (అల్ మాయిద – 2) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ద్వారా దృఢమైన ఆధారంతో రుజువైన విషయం: ఆయన ఇలా బోధించారు – "ఒక దాసుడు తన సోదరునికి తోడ్పడుతున్నంత కాలం అల్లాహ్ అతనికి తోడ్పడుతూనే ఉంటాడు (245వ హదీసు). ఆయన ఇంకా ఇలా అన్నారు :
ఎవడైతే ఒక మంచిపని వైపుకు జనులను ఆహ్వానించాడో అతనికి ఆ పనిని అవలంబించిన వారందరికీ లభించే పుణ్య ఫలం లభిస్తుంది. అయితే దానివల్ల వారి పుణ్యంలోనూ ఎటువంటి కోత విధించటం జరగదు. (174వ హదీసు, 20వ అధ్యాయం). ఇంకా ఆయన హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశించి ఇలా ఉపదేశించారు :
"అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నీ మూలంగా అల్లాహ్ ఏ ఒక్క వ్యక్తికైనా సన్మార్గాన్ని ప్రసాదిస్తే, అది నీ పాలిట ఎరుపు ఒంటెల కన్నా ఎంతో మేలైనది." (175వ హదీసు, 20వ అధ్యాయం)
ఈ హదీసులను దృష్టిలో పెట్టుకొనే నేను క్లుప్తంగా ప్రామాణిక హదీసులను క్రోడీకరించాలనుకున్నాను. అందులో పాఠకునికి పరలోకంలో సామాగ్రిగా ఉపయోగపడే హదీసులు ఉండాలని, తద్వారా అతనికి అంతర్బాహ్య సంస్కారాలు అలవడాలనీ, ఇంకా అవి సదాచరణవైపు ప్రోత్సాహకరంగా, దురాచరణ పట్ల హెచ్చరికగా ఉండాలని ఆశించాను. ఈ హదీసుల ద్వారా ప్రాపంచిక వ్యామోహం తగ్గటంతో పాటు ఆత్మ తృప్తికి సామాగ్రి సమకూరాలన్నది నా ఆశయం. ఈ హదీసులు నడవడికను తీర్చిదిద్దడంతో పాటు అంతరంగాలను కూడా శుద్ధి చేయాలనీ, మానసిక రుగ్మతలకు చికిత్స కావాలనీ కోరుకుంటున్నాను. మానవ అవయవాల సంరక్షణతో పాటు వాటి వక్రతలను కూడా సరిచేయగలగాలనీ, ఇవేగాకుండా దేవుణ్ణి కనుగొన్న వారి ఉద్దేశాలన్నీ కూడా ఈ హదీసుల ద్వారా నెరవేరాలని నేను కాంక్షిస్తున్నాను.
ఇందులో నేను కేవలం ప్రముఖ ప్రామాణికమైన గ్రంథాలకు సంబంధించిన దృఢమైన, స్పష్టమైన హదీసులను మాత్రమే ప్రస్తావించాలని, ప్రియ గ్రంథమైన ఖుర్ఆన్లోని గౌరవప్రదమైన వాక్యాలతో అధ్యాయములను ఆరంభించాలని, ఏదైనా పదానికి సరైన ఉచ్చారణ కావాలన్నా లేక దాని నిగూఢ భావాన్ని విపులీకరించవలసి వచ్చినా అక్కడ విలువైన సూచనలతో విషయాన్ని అలంకరించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఏ హదీసు చివరలోనైనా నేను "ముత్తఫఖున్ అలైహ్" అనంటే ఆ హదీసు బుఖారీ మరియు ముస్లింలు ఉభయులూ ఉల్లేఖించారని అర్థం చేసుకోవాలి.
ఈ గ్రంథమే గనక పూర్తయితే – శ్రద్ధగా అధ్యయనం చేసేవారికి అది సత్కార్యాల వైపు నడిపించగలదని, అనేక చెడులు, వినాశకర పాపాల నుంచి రక్షించగలదని ఆశిస్తున్నాను. ఈ గ్రంథం సహాయంతో ఏ కొంతైనా లబ్ధిపొందిన సోదరుణ్ణి – నా కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా గురువుల కోసం, మిత్రులు, మరియు ముస్లిములందరి కోసం దుఆ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మహోన్నతుడైన అల్లాహ్ పైనే నాకు నమ్మకముంది. నా సమస్త కార్యాలు, ఆయనకే అప్పజెబుతున్నాను, ఆయనపైనే నాకు విశ్వాసం. నాకు అల్లాహ్ చాలు. ఆయనే అత్యుత్తమ కార్య సాధకుడు, పాపాల బారి నుండి రక్షించబడాలన్నా, మంచి పనులు చేయాలన్నా ఆయన తోడ్పాటు లేకుండా సాధ్యం కాదు. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను.