మహా ప్రవక్త మహితోక్తులు – 31. సంప్రాప్త వస్తు ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 31. సంప్రాప్త వస్తు ప్రకరణం. ఇందులో 6 హదీసులు (హదీసు 1123 – 1128), 3 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFసంప్రాప్త వస్తు ప్రకరణం3 పేజీలు · 0.2 MB

31. సంప్రాప్త వస్తు ప్రకరణం

كتاب اللقطة
అధ్యాయాలు (3)
  1. – దొరికిన వస్తువుల్ని ఏం చేయాలి? H 1123 – 1124
  2. 2 యజమాని అనుమతి లేకుండా పశువు పాలను పితకరాదు H 1125
  3. 3 అతిథి మర్యాద H 1126 – 1128

దొరికిన వస్తువుల్ని ఏం చేయాలి?

1123

హదీసు 1123

حديث زَيْدِ بْنِ خَالِدٍ رضي الله عنه، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَسَأَلَهُ عَنِ اللُّقَطَةِ، فَقَالَ: اعْرِفْ عِفَاصَهَا وَوِكَاءَهَا، ثُمَّ عَرِّفْهَا سَنَةً، فَإِنْ جَاءَ صَاحِبُهَا، وَإِلاَّ فَشَأْنَكَ بِهَا قَالَ: فَضَالَّةُ الْغَنَمِ قَالَ: هِيَ لَكَ أَوْ لأَخِيكَ أَوْ لِلذِّئْبِ قَالَ: فَضَالَّةُ الإِبِلِ قَالَ: مَالَكَ وَلَهَا مَعَهَا سِقَاؤُهَا وَحِذَاؤُهَا، تَرِدُ الْمَاءَ وَتَأكُلُ الشَّجَرَ حَتَّى يَلْقَاهَا رَبُّهَا

أخرجه البخاري في: 42 كتاب المساقاة: 12 باب شرب الناس والدواب من الأنهار

హజ్రత్ జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవ ప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి దొరికిన వస్తువు గురించి విచారించగా దైవప్రవక్త ﷺ ఇలా చెప్పారు:- “అతని డబ్బు సంచిని, దాని మూతి కట్టుడును గుర్తుంచుకొని ఒక ఏడాది పాటు ప్రజలలో దాన్ని గురించి ప్రకటిస్తూ ఉండు. సంచి యజమానివస్తే దాన్ని అతనికిచ్చివేయి. రాకపోతే నువ్వే దాన్ని కోరిన విధంగా ఖర్చుపెట్టుకో.” ఆ వ్యక్తి (మరో విషయం ప్రస్తావిస్తూ) “మరి ఎవరికైనా తప్పిపోయిన మేక దొరికితే దాన్ని ఏం చేయాలి?” అని అడిగాడు. “అదీ నీదవుతుంది లేదా నీ (ధార్మిక) సోదరునిదవుతుంది లేదా తోడేలుదవుతుంది” అన్నారు దైవప్రవక్త ﷺ. తిరిగి ఆ వ్యక్తి తప్పిపోయిన ఒంటె విషయం ఏమిటని అడిగాడు. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “దాని సంగతి నీకెందుకు? దాంతో పాటు అతని నీటితిత్తి, చెప్పులు ఉంటాయి. దాని యజమాని వచ్చి తోలు కెళ్ళే వరకు అది ఆకులు అలములు మేస్తూ, నీళ్ళు త్రాగుతూ తిరుగుతుంటుంది” అని అన్నారు.★

(సహీహ్ బుఖారీ:- 42వ ప్రకరణం-ముసాఖాత్, 12వ అధ్యాయం- షుర్బిన్నాసివద్దవాబ్బి మినల్ అన్‌హార్)

★ ఇతరులకు చెందిన విలువైన ప్రతి అభద్రతా వస్తువును షరీఅత్ పరిభాషలో ‘లుఖ్తా’ అంటారు. దీన్ని తెలుగులో దొరికిన వస్తువని అనువదించడం జరిగింది. ఆ వస్తువు తనంతట తాను కాపాడుకోజాలదు. అది నష్టపోయే ప్రమాదం ఉంది. దొరికిన వస్తువుని ఏం చేయాలనే విషయంలో ధర్మవేత్తల్లో భేదాభిప్రాయాలున్నాయని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) వ్రాస్తున్నారు: అలాంటి వస్తువుని తీసేసుకోవడం అభిలషనీయం అన్నది సరయిన అభిప్రాయం. దాన్ని తీసుకోవడం తప్పనిసరి (వాజిబ్) అన్నది రెండవ అభిప్రాయం. మరొక అభిప్రాయం ప్రకారం ఆ వస్తువు పడి కన్పించిన చోటు భద్రమైనదయితే దాన్ని తీసుకోవడం అభిలషనీయం, ఆ చోటు భద్రమైనది కాకపోతే దాన్ని తీసుకోవడం తప్పనిసరి. అంటే ముస్లింకు చెందిన సొత్తు కొల్లగొట్ట బడకూడదని అర్థం.

పోతే ఆ వస్తువు విలువైనదయితే, వస్తువు యజమాని దాని గుర్తులు తెలిపి తీసుకెళ్లమని ఒక ఏడాది పాటు ప్రకటన చేస్తూ ఉండటం అనివార్యం (వాజిబ్). అయితే ఈ పని తరువాత దాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఉద్దేశ్యం ఉన్నప్పుడే ఇలా చేయాలి. వస్తువుని కాపాడే ఉద్దేశ్యం మాత్రమే ఉన్నప్పుడు దాన్ని గురించి సంవత్సరం పాటు ప్రకటన చేస్తూ ఉండటం తప్పనిసరి కాదు. వస్తువు యజమాని వచ్చే వరకూ దాన్ని కాపాడుతూ ఉంటే సరిపోతుంది. అయితే యజమానికి తన వస్తువు ఫలానా వ్యక్తి దగ్గర ఉందని తెలియాలంటే దాన్ని గురించి ప్రకటన చేయడం చాలా అవసరం. అది అంతగా విలువలేని వస్తువయితే దాన్ని గురించి సంవత్సరం పాటు ప్రకటన చేయవలసిన అవసరం లేదు. యజమాని ఇక రాడని నమ్మకం ఏర్పడేవరకు ప్రకటన చేస్తే చాలు.

ప్రకటన చేసే పద్ధతి కూడా గమనార్హమైనది. యజమాని వచ్చి తాను పోగొట్టుకున్న వస్తువు గుర్తులు చెప్పి తీసుకోవడానికి వీలుగా వస్తువు తీసిన వ్యక్తి అది దొరికిన చోట, బజార్లలో, మస్జిద్‌లలో, సమావేశాల్లో దాన్ని గురించి ప్రకటన చేయాలి. నిర్ణీత గడువులోగా యజమాని వచ్చి గుర్తులు చెబితే దాన్ని అతనికి అప్పగించాలి. గడువు దాటిన తరువాత అయినా సరే యజమాని వచ్చి గుర్తులు చెబితే, వస్తువుని తీసుకున్నవాడు దాన్ని సొంతం చేసుకున్నప్పటికీ, అది పెరిగి లేదా రెండింతలు అయినప్పటికీ అంటే, పశువు అయినప్పుడు అది బాగా బలిసిపోవడం, దూడను ఈనడం వగైరా జరిగినప్పటికీ దాన్ని యజమానికి ఇప్పించడం ధర్మసమ్మతమే. అయితే ప్రకటన గడువు దాటి దాన్ని సొంతం చేసుకున్న తరువాత అసలు యజమానికి ఇప్పించేందుకు అతనిపై వత్తిడి చేయకూడదు.

మహా ప్రవక్త మహితోక్తులు|31. సంప్రాప్త వస్తు ప్రకరణం|హదీసు 1123

1124

హదీసు 1124

حديث أُبَيِّ بْنِ كَعْبٍ رضي الله عنه، قَالَ: وَجَدْتُ صُرَّةً عَلَى عَهْدِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فِيهَا مِائَةُ دِينَارٍ، فَأَتَيْتُ بِهَا النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: عَرِّفْهَا حَوْلاً فَعَرَّفْتُهَا حَوْلاً، ثمَّ أَتَيْتُ، فَقَالَ: عَرِّفهَا حَوْلاً فَعَرَّفْتُهَا حَوْلاً، ثُمَّ أَتَيْتُهُ، فَقَالَ: عَرِّفْهَا حَوْلاً فَعَرَّفْتُهَا حَوْلاً، ثُمَّ أَتَيْتُهُ الرَّابِعَةَ فَقَالَ: اعْرِفْ عِدَّتَهَا وَوِكَاءَهَا وَوِعَاءَهَا، فَإِنْ جَاءَ صَاحِبُهَا، وَإِلاَّ اسْتَمْتِعْ بِهَا

أخرجه البخاري في: 45 كتاب اللقطة: 10 باب هل يأخذ اللقطة ولا يدعها تضيع حتى لا يأخذها من لا يستحق

హజ్రత్ అబీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో నాకొక (డబ్బు) సంచి దొరికింది. అందులో వంద దీనార్లు ఉన్నాయి. నేను దాన్ని తీసుకొని దైవ ప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి విచారించాను. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “సంచి యజమాని అన్వేషణ కోసం ఒక యేడాది పాటు దాన్ని గురించి ప్రకటన చేస్తూ ఉండు” అని అన్నారు. నేను ఒక ఏడాది పాటు అలా ప్రకటన చేశాను. తరువాత దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి ఇప్పుడేం చేయాలని అడిగాను. “మరో సంవత్సరం పాటు ప్రకటన చేస్తూ ఉండు” అన్నారు ఆయన. నేనలాగే మరో సంవత్సరం పాటు ప్రకటన చేశాను. ఆ తరువాత మళ్ళీ దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి అడిగాను. ఆయన ఇంకొక సంవత్సరం పాటు ప్రకటన చేస్తూ ఉండమని చెప్పారు. నేను ఇంకొక సంవత్సరం పాటు ప్రకటన చేసి నాల్గవసారి దైవప్రవక్త ﷺ సన్నిధిలో హాజరయ్యాను. అప్పుడు దైవప్రవక్త ﷺ నన్ను ఉద్దేశించి “దాన్ని లెక్కపెట్టుకొని, దాని మూతి కట్టుడు, పాత్ర (వగైరా) ఆనవాళ్ళను గుర్తుపెట్టుకో. (మరి కొన్నాళ్ళు వేచి చూడు. ఈలోగా) దాని యజమాని వస్తే ఇచ్చేయి. లేకపోతే నువ్వే దాన్ని వాడుకో” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 45వ ప్రకరణం – లుఖ్తా, 10వ అధ్యాయం – హల్‌యా ఖుజుల్లుఖ్త వలాయద్ వుహా….)

మహా ప్రవక్త మహితోక్తులు|31. సంప్రాప్త వస్తు ప్రకరణం|హదీసు 1124

2వ అధ్యాయం – యజమాని అనుమతి లేకుండా పశువు పాలను పితకరాదు

1125

హదీసు 1125

باب تحريم حلب الماشية بغير إِذن مالكها

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ يَحْلُبَنَّ أَحَدٌ مَاشِيَةَ امْرِىءٍ بِغَيْرِ إِذْنِهِ، أَيُحِبُّ أَحَدُكُمْ أَنْ تُؤْتَى مَشْرُبَتُهُ فَتُكْسَرَ خِزَانَتُهُ، فَيُنْتَقَلَ طَعَامُهُ فَإِنَّمَا تَخْزُنُ لَهُمْ ضُرُوعُ مَوَاشِيهِمْ أَطْعِمَاتِهِمْ؛ فَلاَ يَحْلُبَنَّ أَحَدٌ مَاشِيَةَ أَحَدٍ إِلاَّ بِإِذْنِهِ

أخرجه البخاري في: 45 كتاب اللقطة: 8 باب لا تحتلب ماشية أحد بغير إذن

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- ఎవరైనా సరే అనుమతి లేకుండా ఇతరుల పశువుల పాలను పితకకూడదు. ఎవరైనా మీ ధాన్యాగారంలో ప్రవేశించి, గాదులు, పెట్టెలు విరగ్గొట్టి ధాన్యాన్ని దోచుకెళ్తే మీకెలా ఉంటుంది? మీలో ఎవరైనా ఈ విషయాన్ని ఇష్టపడతారా? అలాగే పశువుల పొదుగులు కూడా వారికి ఆహార గిడ్డంగులే. అందుచేత ఇతరుల పశువుల పాలను వారి అనుమతి లేకుండా పితకకండి.

(సహీహ్ బుఖారీ:- 45వ ప్రకరణం-లుఖ్తా, 8వ అధ్యాయం- లా తుహ్తలబు మాషియతు అహదిన్ బిగైరి ఇజ్న్)

మహా ప్రవక్త మహితోక్తులు|31. సంప్రాప్త వస్తు ప్రకరణం|హదీసు 1125

3వ అధ్యాయం – అతిథి మర్యాద

1126

హదీసు 1126

باب الضيافة ونحوها

حديث أَبِي شُرَيْحٍ الْعَدَوِيِّ، قَالَ: سَمِعَتْ أُذُنَايَ، وَأَبْصَرَتْ عَيْنَايَ، حِينَ تَكَلَّمَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ جَارَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ جَائِزَتَه قَالَ: وَمَا جَائِزَتُهَ يَا رَسُولَ اللهِ قَالَ: يَوْمٌ وَلَيْلةٌ، وَالضِّيَافَةُ ثَلاَثَةُ أَيَّامٍ، فَمَا كَانَ وَرَاءَ ذَلِكَ فَهُوَ صَدَقَةٌ عَلَيْهِ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ

أخرجه البخاري في: 78 كتاب الأدب: 31 باب من كان يؤمن بالله واليوم الآخر فلا يؤذ جاره

హజ్రత్ అబూ షురైహ్ అదవీ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు- “అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు తన ఇరుగు పొరుగును తప్పనిసరిగా గౌరవించాలి. అలాగే అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు విధిగా తన అతిథిని సత్కరించి ఆతిగ్యమివ్వాలి”. అప్పుడు కొందరు అనుచరులు “దైవప్రవక్తా! ఈ సత్కారం ఎన్ని రోజులు జరగాలి?” అని అడిగారు. దానికి దైవప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారు -“ఒక రోజు బాగా సత్కరించాలి. మూడు రోజులు సాధారణ ఆతిథ్యమివ్వాలి. అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే అది (అతిథికి) దానం (ఇచ్చినట్లు)గా పరిగణించబడుతుంది. పోతే అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించేవాడు పలికితే మంచి మాటనే పలకాలి, లేకపోతే మౌనంగా ఉండాలి.”

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం- అదబ్, 31వ అధ్యాయం – మన్‌కాన యూమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫలా యూజి జారహు)

మహా ప్రవక్త మహితోక్తులు|31. సంప్రాప్త వస్తు ప్రకరణం|హదీసు 1126

1127

హదీసు 1127

حديث أَبِي شُرَيْحٍ الْكَعْبِيِّ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ، جَائِزَتُهُ يَوْمٌ وَلَيْلَةٌ، وَالضِّيَافَةُ ثَلاَثَةُ أَيَّامٍ، فَمَا بَعْدَ ذَلِكَ فَهُوَ صَدَقَةٌ، وَلاَ يَحِلُّ لَهُ أَنْ يَثْوِيَ عِنْدَهُ حَتَّى يُحْرِجَهُ

أخرجه البخاري في: 78 كتاب الأدب: 85 باب إكرام الضيف وخدمته إياه بنفسه

హజ్రత్ అబూ షురైహ్ కాబి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన అతిథికి మర్యాద చేయాలి. ఒక పగలు, ఒక రాత్రి ఆతిథ్యమివ్వడం అతని విధి. మూడు రోజులు ఆతిథ్యమిస్తే చాలా మంచిది. అంతకంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమిస్తే అది దానం (సదఖా)గా పరిగణించబడుతుంది. అయితే ఆతిథ్యమిచ్చేవాని ఇంట అతనికి కష్టం కలిగేటంత కాలం వరకు తిష్ఠవేసి కూర్చోవడం సమ్మతం కాదు.

(సహీహ్ బుఖారీ:- 78వ ప్రకరణం- అదబ్, 85వ అధ్యాయం- ఇక్రాముజ్జైఫి వఖిద్మతుహు ఇయ్యాహు బినఫ్సిహీ)

మహా ప్రవక్త మహితోక్తులు|31. సంప్రాప్త వస్తు ప్రకరణం|హదీసు 1127

1128

హదీసు 1128

حديث عُقْبَةَ بْنِ عَامِرٍ، قَالَ: قُلْنَا لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِنَّكَ تَبْعَثُنَا فَنَنْزِلُ بِقَوْمٍ لاَ يَقْرُونَا، فَمَا تَرَى فِيهِ فَقَالَ لَنَا: إِنْ نَزَلْتُمْ بِقَوْمٍ فَأُمِرَ لَكُمْ بِمَا يَنْبَغِي لِلضَّيْفِ فَاقْبَلُوا، فَإِنْ لَمْ يَفْعَلُوا فَخُذُوا مِنْهُمْ حَقَّ الضَّيْفِ

أخرجه البخاري في: 46 كتاب المظالم: 18 باب قصاص المظلوم إذا وجد مال ظالمه

హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము ఓ రోజు దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ “మీరు మమ్మల్ని (ఎక్కడికైనా) పంపినపుడు ఒక్కోసారి మేము మాకు ఆతిథ్యమివ్వని వారి దగ్గరి కెళ్ళి బస చేయవలసి వస్తుంది. అలాంటి పరిస్థితిలో మేము ఏం చేయాలి?” అని అడిగాము. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “మీరేదయినా తెగవారి ప్రాంతానికి వెళ్ళి విడిది చేసినప్పుడు ఆ తెగవాళ్ళు మీకు సంప్రదాయం ప్రకారం తగిన ఆతిథ్యమివ్వడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే మీరు మీకు దక్కవలసిన (అతిథి) హక్కును వారి నుండి రాబట్టుకోండి” అని అన్నారు.★

(సహీహ్ బుఖారీ:- 46వ ప్రకరణం- మజాలిమ్, 18వ అధ్యాయం – ఖిసాసిల్ మజ్లూమి ఇజా వజదమాల జాలిమిహీ)

★ ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్), ఇమామ్ లైస్ (రహిమహుల్లాహ్) లు ఈ హదీసు బాహ్యార్థాన్ని తీసుకున్నారు. అధిక సంఖ్యాక ధర్మవేత్తలు దీని అంతరార్థాన్ని తీసుకుంటూ “అతిథి తీవ్రమైన ఆకలి బాధతో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో అతనికి విధిగా ఆతిథ్యం ఇవ్వవలసి ఉంటుంది. ప్రజలెవరూ అతనికి ఆతిథ్యమివ్వని పక్షంలో అతను బలవంతంగానైనా తన అవసరాన్ని వారి నుండి తీర్చుకోవచ్చు లేదా నోటితో వారికి తనకు రావలసిన హక్కేమిటో చెప్పి తీసుకోవచ్చు” అని అన్నారు. అయితే ఇది ఇస్లాం ప్రారంభకాలంలో ఉండిన స్థితి అని, తరువాత ఇది రద్దయిపోయిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. కాని ఈ ఆజ్ఞ రద్దయిపోయిందనడానికి ఎలాంటి ఆధారం లేదు. (ఇమామ్ నవవీ – రహ్మలై).

మహా ప్రవక్త మహితోక్తులు|31. సంప్రాప్త వస్తు ప్రకరణం|హదీసు 1128