మహా ప్రవక్త మహితోక్తులు – 21. వాణిజ్య ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 21. వాణిజ్య ప్రకరణం. ఇందులో 34 హదీసులు (హదీసు 965 – 998), 16 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFవాణిజ్య ప్రకరణం10 పేజీలు · 0.6 MB

21. వాణిజ్య ప్రకరణం

كتاب البيوع
అధ్యాయాలు (16)
  1. 1 అస్పష్ట విధానాల ద్వారా వ్యాపారం చేయడం అక్రమం H 965 – 967
  2. 3 పశుపిల్లను తల్లి కడుపులో ఉండగానే కొనడం నిషిద్ధం H 968
  3. 4 బేరం మీద బేరం చేయడం, కొనే ఉద్దేశ్యం లేకుండా ధర పెంచడం, మోసం చేయడానికి పొదుగులో పాలను ఆపి ఉంచడం నిషిద్ధం H 969 – 971
  4. 5 పట్టణం వెలుపలి కెళ్ళి వాణిజ్య బృందాల దగ్గర సరుకు కొనడం నిషిద్ధం H 972
  5. 6 స్థానికుడు (పట్టణవాసి) గ్రామస్థుని సరుకు కొని (అమ్మడం) నిషిద్ధం H 973 – 974
  6. 8 కొన్న వస్తువుని స్వాధీనం చేసుకోకముందే మరొకనికి అమ్మడం ధర్మ సమ్మతం కాదు H 975 – 977
  7. 10 కొనేవాడు, అమ్మేవాడు వ్యాపార సమావేశంలో ఉన్నంత వరకు వ్యాపార వ్యవహారాన్ని కొనసాగించడానికి లేదా రద్దు పరచడానికి వారికి హక్కుంది H 978 – 979
  8. 11 వ్యాపారంలో నిజం చెప్పడం, నిజమైన మాట పలకడం గురించి H 980
  9. 12 వ్యాపారంలో మోసపోయినవాడు ఏం చేయాలి? H 981
  10. 13 పండ్లు వాడేందుకు యోగ్యమయినవి కానంత వరకు వాటిని చెట్ల మీద ఉండగానే అమ్మడం నిషిద్ధం H 982 – 984
  11. 14 పచ్చి ఖర్జూర పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్మడం నిషిద్ధం H 985 – 990
  12. 15 ఎవరైనా పండ్లున్న ఖర్జూర చెట్టునమ్మితే….. H 991
  13. 16 ముహాఖలా, ముజాబనా, ముఖాబరా పద్ధతులు నిషిద్ధం H 992
  14. 17 భూములు అద్దెకు ఇవ్వడం గురించి H 993 – 996
  15. 18 ధాన్యానికి బదులు భూమిని అద్దెకివ్వడం గురించి H 997
  16. 21 భూమిని ఉచితంగా ఇవ్వడం గురించి H 998

1వ అధ్యాయం – అస్పష్ట విధానాల ద్వారా వ్యాపారం చేయడం అక్రమం

965

హదీసు 965

باب إِبطال بيع الملامسة والمنابذة

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنِ الْمُلاَمَسَةِ وَالْمُنَابَذَةِ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 63 باب بيع المنابذة

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ వస్తువుని చేత్తో తాకడం ద్వారా, చేతిలోకి తీసుకొని విసరి వేయడం ద్వారా వ్యాపార నిర్ధారణ చేయడాన్ని నిషేధించారు.(1)

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 63వ అధ్యాయం – బైఉల్ మనాబిజా ]

(1) ఇక్కడ మూలభాషలో “ములామస; మునాబజ” అనే పదాలు వచ్చాయి. ఇవి రెండూ వ్యాపార నిర్ధారణ కోసం పూర్వం అరేబియాలో వాడే పదాలు. (1) నీవు గనక నా వస్త్రాన్ని తాకితే బేరం కుదిరినట్లే అని అమ్మకందారుడు కొనుగోలుదారుడుతో అంటాడు. దీన్ని “ములామస” వ్యాపారం అంటారు. ఈ వ్యాపారంలో కొనుగోలుదారుడు బట్ట నాణ్యతను పూర్తిగా పరిశీలించడానికి వీల్లేదు. (2) రెండో వ్యాపార విధానంలో అమ్మకందారుడు ఈ వస్త్రాన్ని వంద రూపాయలకు నీ వైపు విసురుతున్నానంటాడు. కొనుగోలుదారుడు దానికి అంగీకరించి ఆ వస్త్రాన్ని పట్టుకుంటాడు. దాంతో బేరం అయిపోయినట్లే. దీన్ని “మునాబస” అంటారు. ఈ రెండు వ్యాపార విధానాలను దైవప్రవక్త ﷺ నిషేధించారు.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 965

966

హదీసు 966

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: يُنْهى عَنْ صِيَامَيْنِ وَبَيْعَتَيْنِ؛ الْفِطْرِ وَالنَّحْرِ، وَالْمُلاَمَسَةِ وَالْمُنَابَذَةِ

أخرجه البخاري في: 30 كتاب الصوم: 67 باب الصوم يوم النحر

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- రెండు ఉపవాసాలను రెండు రకాల క్రయ విక్రయాలను (దైవప్రవక్త ﷺ కాలంలో) వారించడం(2) జరుగుతుండేది. ఒకటి; ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్హా దినాలలో ఉపవాసం పాటించడం. రెండు; తాకడం, తీసుకొని విసరడంల ద్వారా వ్యాపారం చేయడం.

[సహీహ్ బుఖారీ : 30వ ప్రకరణం – సౌమ్, 67వ అధ్యాయం – అస్సౌమి యౌమున్నహ్ర్]

(2) వారించడం అంటే ఇక్కడ ‘నిషేధించడం’ అని అర్థం. అంటే ఇలా చేయడం హరాం (నిషిద్ధం) అని భావించబడేది.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 966

967

హదీసు 967

حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: نَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ لِبْسَتَيْنِ وَعَنْ بَيْعَتَيْنِ: نَهى عَنِ الْمُلاَمَسَةِ وَالْمُنَابَذَةِ فِي الْبَيْعِ؛ وَالْمُلاَمَسَةُ لَمْسُ الرَّجُلِ ثَوْبَ الآخَرِ بِيَدِهِ بِاللَّيْلِ أَوْ بِالنَّهَارِ وَلاَ يُقَلِّبُهُ إِلاَّ بِذلِكَ، وَالْمُنَابَذَةُ أَنْ يَنْبِذَ الرَّجُلُ إِلَى الرَّجُلِ بِثَوْبِهِ وَيَنْبِذَ الآخَرُ ثَوْبَهُ، وَيَكُونَ ذلِكَ بَيْعَهُمَا مِنْ غَيْرِ نَظَرٍ وَلاَ تَرَاضٍ وَاللِّبْسَتَيْنِ: اشْتِمَالُ الصَّمَّاءِ؛ وَالصَّمَّاءُ أَنْ يَجْعَلَ ثَوْبَهُ عَلَى أَحَدِ عَاتِقَيْهِ، فَيَبْدُوَ أَحَدُ شِقَّيْهِ لَيْسَ عَلَيْهِ ثَوْبٌ، وَاللِّبْسَةُ الأُخْرَى احْتِبَاؤُهُ بِثَوْبِهِ وَهُوَ جَالِسٌ لَيْسَ علَى فَرْجِهِ مِنْهُ شَيْءٌ

أخرجه البخاري في: 77 كتاب اللباس: 20 باب اشتمال الصماء

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ రెండు రకాల వస్త్ర ధారణల నుండి (ముస్లింలను) వారించారు. అలాగే అమ్మకం కొనుగోళ్ళ వ్యవహారంలో వస్తువుని చేత్తో తాకడం, విసరి వేయడం ద్వారా వ్యాపార నిర్ధారణ చేయడం నుండి కూడా వారించారు.

తాకి నిర్ధారణ చేయడమంటే ఒక వ్యక్తి రాత్రి గాని, పగలు గాని రెండవ వ్యక్తికి చెందిన వస్త్రాన్ని అటూ ఇటూ తిప్పి చూడకుండా కేవలం చేత్తో తాకి కొనుగోలు ఒప్పందానికి రావడం అన్నమాట. విసరి నిర్ధారణ చేయడమంటే పరికించకుండా, (నోటి మాటలతో) అంగీకారం తెలుపకుండా ఒక వ్యక్తి తన వస్త్రాన్ని రెండవ వ్యక్తి వైపుకు విసరడం, రెండవ వ్యక్తి తన వస్త్రాన్ని మొదటి వ్యక్తి వైపు విసరడం ద్వారా వ్యాపార ఒప్పందానికి రావడం అన్నమాట.

నిషేధించిన రెండు రకాల వస్త్రధారణల విషయానికి వస్తే అందులో ఒకటి, వస్త్రాన్ని ఒక భుజం (నగ్నంగా) వదలి, రెండవ భుజం మీదుగా వేసుకొని కట్టుకోవడం. రెండవ పద్ధతి, ముందు వైపు నుంచి మర్మావయం కన్పించేలా వస్త్రం చుట్టుకొని కూర్చోవడం.

[సహీహ్ బుఖారీ : 77వ ప్రకరణం – లిబాస్, 20వ అధ్యాయం – ఇష్తిమాలిస్సమా]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 967

3వ అధ్యాయం – పశుపిల్లను తల్లి కడుపులో ఉండగానే కొనడం నిషిద్ధం

968

హదీసు 968

باب تحريم بيع حبل الحبلة

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنْ بَيْعِ حَبَلِ الْحَبَلَةِ، وَكَانَ بَيْعًا يَتَبَايَعُهُ أَهْلُ الْجَاهِلِيَّةِ، كَانَ الرَّجُلُ يَبْتَاعُ الْجَزُورَ إِلَى أَنْ تُنْتَجَ النَّاقَةُ، ثُمَّ تُنْتَجُ الَّتِي فِي بَطْنِهَا

أخرجه البخاري في: 34 كتاب البيوع: 61 باب بيع الغرر وحبل الحبلة

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ ఒంటె కడుపులో ఉన్న ఒంటె పిల్లను అమ్మి వేయడాన్ని నిషేధించారు. ఈ విధమైన వ్యాపారం అజ్ఞాన కాలంలో ఉండేది. (ఆనాడు) ఒక వ్యక్తి (ఉనికిలోకే రాని ఒక) ఒంటెను కొనే ముందు అమ్మే వాడితో ఒప్పందం చేసుకుంటూ “సూడి ఒంటె కడుపులో ఉన్న పిల్ల (బయటికొచ్చి) పెరిగి పెద్దదయి ఈనాలి” అని మాట్లాడుకుంటాడు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 61వ అధ్యాయం – బైయిల్ గరరి వ హబ్లిల్ హబ్లా]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 968

4వ అధ్యాయం – బేరం మీద బేరం చేయడం, కొనే ఉద్దేశ్యం లేకుండా ధర పెంచడం, మోసం చేయడానికి పొదుగులో పాలను ఆపి ఉంచడం నిషిద్ధం

969

హదీసు 969

باب تحريم بيع الرجل على بيع أخيه وسومه على سومه وتحريم النجش وتحريم التصرية

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ يَبِيعُ بَعْضُكُمْ عَلَى بَيْعِ أَخِيهِ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 58 باب لا يبيع على بيع أخيه ولا يسوم على سوم أخيه حتى يأذن له أو يترك

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఆదేశించారు :-

“ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడు బేరం చేస్తుంటే అతని బేరం మీద బేరం. చేయకూడదు”.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 58వ అధ్యాయం – లా యబీవు అలా బైయి అఖీహి వలా యసూమ్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 969

970

హదీసు 970

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ تَلَقَّوُا الرُّكْبَانَ وَلاَ يَبِيعُ بَعْضُكُمْ عَلَى بَيْعِ بَعْضٍ وَلاَ تَنَاجَشُوا وَلاَ يَبِيعُ حَاضِرٌ لِبَادٍ وَلاَ تُصَرُّوا الْغَنَمَ وَمَنِ ابْتَاعَهَا فَهُوَ بِخَيْرِ النَّظَرَيْنِ بَعْدَ أَنْ يَحْتَلِبَهَا؛ إِنْ رَضِيهَا أَمْسَكَهَا، وَإِنْ سَخِطَهَا رَدَّهَا وَصَاعًا مِنْ تَمْرٍ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 64 باب النهي للبائع أن لا يحفِّل الإبل والبقر وكل محفَّلة

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:-

“పశువులు, వాహనాలపై సరుకులు తెస్తున్నవారు మార్కెట్‌కు చేరుకోకముందే మీరుఎదురేగి వారిని కలుసుకోకండి. ఇతరులు బేరం చేస్తున్నప్పుడు అదే వస్తువు గురించి మీరు బేరం చేయకండి. కొనే ఉద్దేశ్యం లేకుండా (ఇతరుల్ని మోసగించడానికి) పాట పాడి ధరలు పెంచకండి. పట్టణవాసి బయట నుండి వచ్చే (గ్రామీణ) వ్యక్తి దగ్గరి సరుకును అమ్మకూడదు. మేక పొదుగులో పాలను ఆపి ఉంచకూడదు. ఒకవేళ ఎవరైనా (మోసపోయి) అలాంటి పశువును కొన్న పక్షంలో, పాలు పితుక్కున్న తరువాత ఆ మేకను ఇష్టమయితే ఉంచుకోవడానికి, ఇష్టం లేకపోతే ఒక ‘సా’ ఎత్తు ఖర్జూర పండ్లిచ్చి వాపసు చేయడానికి అతనికి హక్కుంది”.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 64వ అధ్యాయం – అన్న హిలిల్ బాయి అన్‌ల్లా యుహప్ఫిలల్ ఇబ్లిల్…]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 970

971

హదీసు 971

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: نَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ التَّلَقِّى، وَأَنْ يَبْتَاعَ الْمُهَاجِرُ لِلأَعْرَابِيِّ، وَأَنْ تَشْتَرِطَ الْمَرْأَة طَلاَقَ أُخْتِهَا، وَأَنْ يَسْتَامَ الرَّجُلُ عَلَى سَوْمِ أَخِيهِ؛ وَنَهى عَنِ النَّجْشِ وَعَنِ التَّصْرِيَةِ

أخرجه البخاري في: 54 كتاب الشروط: 11 باب الشروط في الطلاق

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ ఈ క్రింది పనులు చేయకూడదని వారించారు: (ఒకటి) వ్యాపార సరుకులు తెచ్చే వాణిజ్య ఒప్పందాలకు ఎదురేగి వారితో మాట్లాడటం. (రెండు) పట్టణ (స్థానిక) వ్యక్తి గ్రామీణుని దగ్గరున్న సరుకును (అత్యధిక లాభాలకు అమ్ముకోవడానికి) కొనడం. (మూడు) స్త్రీ తాను పెళ్ళి చేసుకోదలచిన పురుషునికి అతను తన మొదటి భార్యకు విడాకులివ్వాలని షరతు విధించడం. (నాలుగు) ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడు బేరం చేస్తున్నప్పుడు అదే వస్తువు కోసం పోటాపోటీగా బేరం చేయడం. (ఐదు) కొనే ఉద్దేశ్యం లేకుండా వస్తువు ధరను (పాటపాడి) పెంచేయడం. (ఆరు) కొనుగోలుదారుడ్ని ఎక్కువ పాలిచ్చే పశువని భ్రమింపజేయడానికి పశువు పొదుగులో పాలు ఆపి ఉంచడం.

[సహీహ్ బుఖారీ : 54వ ప్రకరణం – షురూత్, 11వ అధ్యాయం – అష్షురూతి ఫిత్తలాఖ్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 971

5వ అధ్యాయం – పట్టణం వెలుపలి కెళ్ళి వాణిజ్య బృందాల దగ్గర సరుకు కొనడం నిషిద్ధం

972

హదీసు 972

باب تحريم تلقى الجلب

حديث عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه، قَالَ: مَنِ اشْتَرَى شَاةً مُحَفَّلَةً فَرَدَّهَا فَلْيَرُدَّ مَعَهَا صَاعًا؛ وَنَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ تُلَقَّى الْبُيُوعُ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 64 باب النهي للبائع أن لا يحفِّل الإبل والبقر والغنم وكل محفَّلة

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం:- పాలు పితకనందున పెద్ద పొదుగున్న మేకని భ్రమపడి ఎవరైనా దాన్ని కొన్న తరువాత (మోసం గ్రహించి) వాపసు చేయదలచుకుంటే అతనా మేకతో పాటు ఒక ‘సా’ ఎత్తు ఖర్జూర పండ్లు కూడా (మేక యజమానికి) ఇచ్చి వేయవలసి ఉంటుంది. పోతే పట్టణం వెలుపల వాణిజ్య బృందాలకు ఎదురేగి వారి దగ్గర సరుకు కొనడాన్ని దైవప్రవక్త ﷺ వ్యతిరేకించారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 64వ అధ్యాయం – అన్నహిలిల్ బాయి అ్రల్లా యుహఫ్ఫిలల్ ఇబ్లి….]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 972

6వ అధ్యాయం – స్థానికుడు (పట్టణవాసి) గ్రామస్థుని సరుకు కొని (అమ్మడం) నిషిద్ధం

973

హదీసు 973

باب تحريم بيع الحاضر للبادي

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ تَلَقَّوُا الرُّكْبَانَ وَلاَ يَبِيعُ حَاضِرٌ لِبَادٍ (قَالَ الرَّاوِي) فَقُلْتُ لاِبْنِ عَبَّاسٍ: مَا قَوْلُهُ لاَ يَبِيعُ حَاضِرٌ لِبَادٍ قَالَ: لاَ يَكُونُ لَهُ سِمْسَارًا

أخرجه البخاري في: 34 كتاب البيوع: 68 باب هل يبيع حاضر لباد بغير أجر وهل يُعينُهُ أو ينصحه

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలిపారు:- “మీరు అమ్మకంలో అత్యధిక లాభాలు గడించే ఉద్దేశంతో పట్టణం వెలుపలికెళ్ళి వర్తక బిడారాలను ముందుగా వెళ్ళి కలుసుకోకండి. పట్టణవాసి బయట నుండి సరుకులతో వచ్చే గ్రామీణుని సరుకు అమ్మకూడదు.”

ఈ హదీసుని ఉల్లేఖించినవారు హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ని “పట్టణవాసి గ్రామీణుని కొరకు సరుకు అమ్మడం అంటే ఏమిటి?” అని అడిగారు. దానికి ఆయన “అంటే దళారిగా మారకూడదని అర్థం” అన్నారు.

[సహీహ్ బుఖారీ: 34వ ప్రకరణం – బుయూ, 68వ అధ్యాయం – హల్‌యబీవు హాజిరుల్లిబాద్ బిగైరి అజ్రన్ వహల్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 973

974

హదీసు 974

حديث أَنَسِ بْنِ مَالَكٍ رضي الله عنه، قَالَ: نُهِينَا أَنْ يَبِيعَ حَاضِرٌ لِبَادٍ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 70 باب لا يبيع حاضر لباد بالسمسرة

హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- స్థానిక వ్యక్తి బయట నుండి వచ్చేవారి సరుకును (దళారిగామారి) అమ్మకూడదని మాకు ఆజ్ఞాపించబడింది.★

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 70వ అధ్యాయం – లాయబీవు హాజిరుల్లి బాదిన్ బిస్సమ్సరా]

★ ఈ హదీసుల ద్వారా దళారితనం హరాం (నిషిద్ధం) అని స్పష్టంగా తెలుస్తోంది. సలఫీ ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, బయట నుంచి వచ్చే వ్యాపారస్థుని వాణిజ్య సామగ్రిని ఎక్కువ ధరకు అమ్మే ఉద్దేశ్యంతో తీసుకొని తన దగ్గర ఉంచుకుంటే అది అక్రమ చర్య (హరాం) అవుతుంది. అయితే ఆ వస్తువులు ప్రజలకు అప్పుడు అవసరం లేకపోతే అతనా వ్యాపార సామగ్రిని తన దగ్గర పెట్టుకొని ప్రజలకు అవసరమొచ్చినప్పుడు అమ్మవచ్చు. ఇందులో తప్పులేదు. అయితే ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్), ముజాహిద్ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ప్రకారం, బయట నుంచి వచ్చిన వ్యాపారస్థుడి వర్తక సామగ్రిని స్థానికుడు అమ్మి పెట్టడం ధర్మసమ్మతమే. ఈ వ్యవహారం బయట నుండి వచ్చిన వ్యాపారి పట్ల స్థానికుడి సత్ప్రవర్తన క్రిందికి వస్తుంది. ఇలాంటి వ్యాపార వ్యవహారం అక్రమం, అధర్మం అని పేర్కొన్న హదీసులు వీరిద్దరి దృష్టిలో వీగిపోయినట్లే. నిజం అల్లాహ్ కే ఎరుక.

– నవవీ (రహిమహుల్లాహ్).

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 974

8వ అధ్యాయం – కొన్న వస్తువుని స్వాధీనం చేసుకోకముందే మరొకనికి అమ్మడం ధర్మ సమ్మతం కాదు

975

హదీసు 975

باب بطلان بيع المبيع قبل القبض

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: أَمَّا الَّذِي نَهى عَنْهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَهُوَ الطَّعَامُ أَنْ يُبَاعَ حَتَّى يُقْبَضَ قَالَ ابْنُ عَبَّاسٍ: وَلاَ أَحْسِبُ كُلَّ شَيْءٍ إِلاَّ مِثْلَهُ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 55 باب بيع الطعام قبل أن يقبض وبيع ما ليس عندك

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:– దైవప్రవక్త ﷺ ధాన్యం, అపరాలను గురించి వాటిని (అమ్మకందారుడి నుండి) స్వాధీనం చేసుకోకముందే (మరొకనికి) అమ్మకూడదని ఆంక్ష విధించారు. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉద్దేశ్యంలో ఈ ఆజ్ఞ ఇలాంటి వస్తువులకు మాత్రమే గాని అన్ని వస్తువులకు వర్తించదు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 55వ అధ్యాయం – బైఇత్తఆమిఖబ్ల అయ్యుఖ్బజ్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 975

976

హదీసు 976

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنِ ابْتَاعَ طَعَامًا فَلاَ يَبيعُهُ حَتَّى يَسْتَوْفِيَهُ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 51 باب الكيل على البائع والمعطي

హజ్రత్ అబ్దుల్లాబిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ధాన్యం లేక అపరాలను కొన్న తరువాత వాటిని స్వాధీనం చేసుకోనంతవరకు మరొకరికి అమ్మకూడదు.”★

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 51వ అధ్యాయం – అల్‌కైలి అలల్ బాయి వల్ మాతి]

★ ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ప్రకారం ఒక్క ధాన్యం, అపరాలే కాదు స్థిర, చర వస్తువులన్నీ స్వాధీనంలోకి తీసుకోకముందే అమ్మడం ధర్మ సమ్మతం కాదు. అయితే ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం భూమి, ఇల్లు, తోట మొదలైన స్థిరాస్తులు స్వాధీనం చేసుకోవడానికి ముందే అమ్మడం ధర్మ సమ్మతమే. ఎక్కువ మంది ధర్మవేత్తలు ఈ అభిప్రాయాన్నే సమర్థించారు.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 976

977

హదీసు 977

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: كَانُوا يَبْتَاعُونَ الطَّعَامَ فِي أَعْلَى السُّوقِ فَيَبِيعُونَهُ فِي مَكَانِهِمْ، فَنَهَاهُمْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يَبِيعُوهُ فِي مَكانِهِ حَتَّى يَنْقُلُوه

أخرجه البخاري في: 34 كتاب البيوع: 72 باب منتهى التلقي

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- ప్రజలు పెద్ద మార్కెట్‌లో సరుకు కొని అక్కడ ఒక చోట వాటిని అమ్మేవారు. దైవప్రవక్త ﷺ సరుకును అదే చోట అమ్మకూడదని, దాన్ని తీసికెళ్ళి వేరే చోట అమ్ముకోవాలని ఆదేశించారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 72వ అధ్యాయం – మున్తహ అత్తలఖీ ]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 977

10వ అధ్యాయం – కొనేవాడు, అమ్మేవాడు వ్యాపార సమావేశంలో ఉన్నంత వరకు వ్యాపార వ్యవహారాన్ని కొనసాగించడానికి లేదా రద్దు పరచడానికి వారికి హక్కుంది

978

హదీసు 978

باب ثبوت خيار المجلس للمتبايعين

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْمُتَبَايِعَانِ كُلُّ وَاحِدٍ مِنْهُمَا بِالْخِيَارِ عَلَى صَاحِبِهِ مَا لَمْ يَتَفَرَّقَا إِلاَّ بَيْعَ الْخِيَارِ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 44 باب البيعان بالخيار ما لم يتفرقا

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు:- కొనేవారు, అమ్మేవారు ఇద్దరూ వ్యాపారం జరుగుతున్న చోట ఉన్నంతవరకు వారికి వ్యాపార వ్యవహారాన్ని కొనసాగించడానికి లేదా రద్దు పరచడానికి హక్కుంది. అయితే హక్కుకు సంబంధించిన షరతు ఏదైనా పెడితే ఆ షరతును బట్టి హక్కుంటుంది.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 44వ అధ్యాయం – అల్‌బయ్యుఆనిబిల్ ఖియారి మాలమ్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 978

979

హదీసు 979

حديث ابْنِ عُمَرَ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ قَالَ: إِذَا تَبَايَعَ الرَّجُلاَنِ فَكُلُّ وَاحِدٍ مِنْهُمَا بِالْخِيَارِ مَا لَمْ يَتَفَرَّقَا، وَكَانَا جَمِيعًا؛ أَوْ يُخَيِّرُ أَحَدُهُمَا الآخَرَ فَتَبَايَعَا عَلَى ذلِكَ فَقَدْ وَجَبَ الْبَيْعُ، وَإِنْ تَفَرَّقَا بَعْدَ أَنْ يَتَبَايَعَا وَلَمْ يَتْرُكْ وَاحِدٌ مِنْهُمَا الْبَيْعَ فَقَدْ وَجَبَ الْبَيْعُ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 45 باب إذا خير أحدهما صاحبه بعد البيع فقد وجب البيع

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “కొన్నవాడు, అమ్మినవాడు వ్యాపార వ్యవహారం జరిగిన చోట కలిసి ఉన్నంతవరకు వారికి వ్యాపార వ్యవహారం ఖాయపరచడానికి లేదా రద్దు చేయడానికి హక్కు ఉంటుంది. లేదా దాన్ని ఖాయపరచడానికి లేదా రద్దు పరచడానికి ఒకరికొకరు అధికారం ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత వారిద్దరు వ్యాపార వ్యవహారాన్ని అమలు పరచడానికి అంగీకరిస్తే అప్పుడు కూడా ఆ వ్యవహారం ఖాయమయిపోతుంది. ఒకవేళ వారిద్దరు వ్యాపార వ్యవహారం జరుపుకున్న తరువాత పరస్పరం విడిపోతూ ఇద్దరిలో ఏ ఒక్కరూ సరుకును మానుకునే విషయం ప్రస్తావించకపోతే అప్పుడు కూడా వ్యాపార వ్యవహారం ఖాయమయిపోతుంది (ఇక దాన్ని రద్దు చేసే హక్కు ఉండదు)”.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 45వ అధ్యాయం – ఇజాఖైర అహదుహుమా సాహిబ బాదల్ బైయి వజిబల్‌బై]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 979

11వ అధ్యాయం – వ్యాపారంలో నిజం చెప్పడం, నిజమైన మాట పలకడం గురించి

980

హదీసు 980

باب الصدق في البيع والبيان

حديث حَكِيمِ بْنِ حِزَامٍ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الْبَيِّعَانِ بِالْخِيَارِ مَا لَمْ يَتَفَرَّقَا أَوْ قَالَ: حَتَّى يَتَفَرَّقَا، فَإِنْ صَدَقَا وَبَيَّنَا بُورِكَ لَهُمَا فِي بَيْعِهِمَا، وَإِنْ كَتَمَا وَكَذَبَا مُحِقَتْ بَرَكَةُ بَيْعِهِمَا

أخرجه البخاري في: 34 كتاب البيوع: 19 باب إذا بين البيعان ولم يكتما ونصحا

హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “కొనేవారు, అమ్మేవారు పరస్పరం విడిపోనంతవరకు వారిద్దరికి (వ్యాపార వ్యవహారాన్ని రద్దు పరచడానికి లేదా ఖాయపరచడానికి) హక్కుంటుంది. వ్యాపార వ్యవహారంలో వారిద్దరు నిజం చెప్పి, ఏ విషయాన్నీ దాచకుండా పరస్పరం స్పష్టంగా మసలుకుంటే అలాంటి వ్యాపారంలో ఇద్దరికీ శుభం కలుగుతుంది. దానికి భిన్నంగా వారిద్దరు అబద్ధమాడి పరస్పరం (సరుకు) లోపాలను దాచినట్లయితే ఆ వ్యాపారంలో వారిద్దరికీ ఎలాంటి శుభం చేకూరదు.”

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 19వ అధ్యాయం – ఇజా బయ్యనల్ బైఆని వకమ్ యక్తుమా]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 980

12వ అధ్యాయం – వ్యాపారంలో మోసపోయినవాడు ఏం చేయాలి?

981

హదీసు 981

باب من يخدع في البيع

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَجُلاً ذَكَرَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّهُ يُخْدَعُ فِي الْبُيُوعِ، فَقَالَ: إِذَا بَايَعْتَ فَقُلْ لاَ خِلاَبَةَ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 48 باب ما يكره من الخداع في البيع

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- వ్యాపారంలో నిరంతరం మోసానికి గురవుతున్న ఒక వ్యక్తిని గురించి దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావన వచ్చింది. అప్పుడు దైవప్రవక్త ﷺ “నీవు ఏదైనా కొనేటప్పుడు గాని లేదా అమ్మేటప్పుడు గాని మోసం చేయకూడదని ముందే చెప్పేయాలి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 48వ అధ్యాయం – మాయక్రహు మినల్ ఖిదాయి ఫిల్‌బై]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 981

13వ అధ్యాయం – పండ్లు వాడేందుకు యోగ్యమయినవి కానంత వరకు వాటిని చెట్ల మీద ఉండగానే అమ్మడం నిషిద్ధం

982

హదీసు 982

باب النهى عن الثمار قبل بدوّ صلاحها بغير شرط القطع

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ نَهى عَنْ بَيْعِ الثِّمَارِ حَتَّى يَبْدُوَ صَلاَحُهَا، نَهى الْبَائِعَ وَالْمُبْتَاعَ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 85 باب بيع الثمار قبل أن يبدو صلاحها

హజ్రత్ అబ్దుల్లాబిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- పండ్లు వాడేందుకు యోగ్యమైనవని స్పష్టం కానంతవరకు వాటిని అమ్మకూడదని దైవప్రవక్త ﷺ వారించారు. ఆయన కొనేవాడిని, అమ్మేవాడిని కూడా వారించారు.★

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 85వ అధ్యాయం – బైయిష్నిమారి ఖబ్ల అన్‌య్యబ్దు సలాహిహా]

★ పండ్లు, కాయలు కోయనివ్వకుండా చెట్లకే ఉండనివ్వాలని షరతు పెట్టి వ్యాపారం చేయకూడదు. వ్యాపారం జరిగిన తరువాత అవి చీడపట్టి చెడిపోవచ్చు లేదా మరేదైనా కారణం వల్ల పంటకు నష్టం కలగవచ్చు. అప్పుడు అమ్మకందారుడు తన సోదరుని డబ్బు అప్పనంగా ఎగరేసుకున్న వాడవుతాడు. అదే విధంగా ఎలాంటి షరతు లేకుండా అమ్మడం కూడా ధర్మసమ్మతం కాదు. కాకపోతే పండ్లు బాగా పలకమారి పంటకు వచ్చినప్పుడు అమ్మడం, కొనడం ధర్మసమ్మతమే.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 982

983

హదీసు 983

حديث جَابِرٍ رضي الله عنه، قَالَ: نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ بَيْعِ الثَّمَرِ حَتَّى يَطِيبَ، وَلاَ يُبَاعُ شَيْءٌ مِنْهُ إِلاَّ بِالدِّينَارِ وَالدِّرْهَمِ إِلاَّ الْعَرَايَا

أخرجه البخاري في: 34 كتاب البيوع: 83 باب بيع الثمر على رؤوس النخل بالذهب والفضة

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- పండ్లు బాగా పెరిగి పంటకు రానంతవరకూ వాటిని అమ్మకూడదని దైవప్రవక్త ﷺ వారించారు. అలాగే ఆ పండ్లను అరాయా(1) (నగదు చేతిలో లేని నిరుపేద కొనుగోలుదారుల) విషయంలో తప్ప దిర్హం, దీనార్‌లకు (అంటే నగదు పైకానికి) మాత్రమే అమ్మాలని ఆయన ﷺ ఆదేశించారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 83వ అధ్యాయం -బైయిస్సమరి అలా రూసిన్నఖ్లి బిజ్జహబి వల్ ఫిజ్జహ్]

(1) తోట యజమాని తన తోటలో నుండి పండ్లు కోసి ఉన్న కొన్ని చెట్లను ఎవరైనా పేదవాడికి దానం చేసిన పక్షంలో ఆ పేదవాడు తన దగ్గర నగదు పైకం, వెండి బంగారాలు ఉండవు కనుక వాటిని ఇతరులకు లేదా స్వయంగా తోట యజమానికి ఎండు (ఖర్జూర) ఫలాలకు అమ్ముకోవచ్చు. ఈ అనుమతి నిరుపేదలకు మాత్రమే ఉంది, ఇతరులకు లేదు. దీన్నే “అరాయా” అంటారు. ఇతరులు నగదు పైకం చెల్లించి కొనుక్కోవలసి ఉంటుంది.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 983

984

హదీసు 984

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ بَيْعِ النَّخْلِ حَتَّى يَأْكُلَ أَوْ يُؤْكَلَ وَحَتَّى يُوزَنَ قِيلَ لَهُ: وَمَا يُوزَنُ قَالَ رَجُلٌ عِنْدَهُ: حَتَّى يُحْرَزَ

أخرجه البخاري في: 35 كتاب السلم: 4 باب السلم في النخل

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- ఖర్జూరపండ్లు తినడానికి యోగ్యమవనంతవరకు లేదా బరువయినవి కానంత వరకు వాటిని అమ్మకూడదని దైవప్రవక్త ﷺ వారించారు. అప్పుడు “బరువైనవి అంటే ఏమిటీ?” అని ఎవరో అడిగితే (సమావేశంలో కూర్చొన్న) ఒక వ్యక్తి, “అంటే నిల్వ చేయడానికి వీలయినవి (బాగా పండి పంటకు వచ్చినవి) అని అర్థం” అన్నారు.

[సహీహ్ బుఖారీ : 35వ ప్రకరణం – సల్మ్, 4వ అధ్యాయం – అస్సలమి ఫిన్నఖ్ల్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 984

14వ అధ్యాయం – పచ్చి ఖర్జూర పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్మడం నిషిద్ధం

985

హదీసు 985

باب تحريم بيع الرطب بالتمر إِلاَّ في العرايا

حديث زَيْدِ بْنِ ثَابِتٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَرْخَصَ لِصَاحِبِ الْعَرِيَّةِ أَنْ يَبِيعَهَا بِخَرْصِهَا

أخرجه البخاري في: 34 كتاب البيوع: 82 باب بيع المزابنة وهي بيع الثمر بالتمر

హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం:- నగదు డబ్బు చేతిలో లేని నిరుపేద అమ్మకందారులు తమ (తోటలోని పచ్చి) ఖర్జూర పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్ముకోవచ్చని దైవప్రవక్త ﷺ అనుమతినిచ్చారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 82వ అధ్యాయం – బైఇల్ ముజాబినతి వహియబైవుస్సమరి బిత్తమర్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 985

986

హదీసు 986

حديث سَهْلِ بْنِ أَبِي حَثْمَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، نَهى عَنْ بَيْعِ الثَّمَرِ بِالتَّمْرِ وَرَخَّصَ فِي الْعَرِيَّةِ أَنْ تُبَاعَ بِخَرْصِهَا يَأْكُلُهَا أَهْلُهَا رُطَبًا

أخرجه البخاري في: 34 كتاب البيوع: 83 باب الثمر على رؤوس النخل بالذهب والفضة

హజ్రత్ సహెల్ బిన్ అబీ హస్మా (రదియల్లాహు అన్హు) కథనం:- చెట్టు మీది ఖర్జూర పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్మకూడదని దైవప్రవక్త ﷺ వారించారు. అయితే నగదు డబ్బు చెల్లించలేని నిరుపేదలు తాజాపండ్లు తినడానికి వీలుగా వారు (తమ చెట్లమీది పండ్లను) అంచనా(2) వేసుకొని ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్ముకోవచ్చని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 83వ అధ్యాయం – బైయిస్సమరి అలా రూసిన్నఖ్లి బిజ్జహబి వల్‌ఫిజ్జ]

(2) అంచనా అంటే, చెట్టుకున్న తాజా పండ్లు ఎండిన తరువాత ఎంత ఉంటాయో ఆ మేరకు ఎండు ఖర్జూరాలు లెక్క కట్టి ఇవ్వాలి.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 986

987

హదీసు 987

حديث رَافِعِ بْنِ خَدِيجٍ وَسَهْلِ بْنِ أَبِي حَثْمَةَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، نَهى عَنِ الْمُزَابَنَةِ، بَيْعِ الثَّمَرِ بِالتَّمْرِ، إِلاَّ أَصْحَابَ الْعَرَايَا فَإِنَّهُ أَذِنَ لَهُمْ

أخرجه البخاري في: 42 كتاب المساقاة: 17 باب الرجل يكون له ممر أو شِرْب في حائط أو في نخل

హజ్రత్ రాఫె బిన్ ఖుదీజ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ సహెల్ బిన్ అబీ హస్మ (రదియల్లాహు అన్హు)ల కథనం:- చెట్ల మీది తాజా ఖర్జూర పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్మకూడదని దైవప్రవక్త ﷺ వారించారు. అయితే నగదు డబ్బు చెల్లించలేని నిరుపేదలకు మాత్రమే అలా అమ్మేందుకు అనుమతి ఉంది.

[సహీహ్ బుఖారీ : 42వ ప్రకరణం – ముసాఖాత్, 17వ అధ్యాయం – అర్రజులు యకూనులహూ మమ్రావు….]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 987

988

హదీసు 988

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَخَّصَ فِي بَيْعِ الْعَرَايَا فِي خَمْسَةِ أَوْسُقٍ أَوْ دُونَ خَمْسَةِ أَوْسُقٍ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 83 باب بيع الثمر على رؤوس النخل بالذهب والفضة

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ అయిదు వసఖ్ (దాదాపు ఆరున్నర క్వింటాళ్ళ)ల వరకు లేదా అయిదు వసఖ్‌ల లోపు అరాయా వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చారు.(1)

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 83వ అధ్యాయం – బైయిస్సమరి అలా రూసిన్నఖ్లి బిజ్జహబి వల్ ఫిజ్జా]

(1) బరువురీత్యా ఒక వసఖ్ అరవై ‘సా’లకు సమానం. ఒక ‘సా’ అయిదు సేర్లకు సమానం. ఒక ‘సేరు’ ఎనభై తులాలకు సమానం. ఒక ‘తులం’ దాదాపు పదకొండున్నర ‘గ్రాముల’కు సమానం. 567 పాద సూచిక చూడండి. పేదలకు అయిదు వసఖ్‌ల వరకు అమ్ముకోవడానికి అనుమతి ఉంది. ఇతరులకు ఈ అనుమతి లేదు. “అయిదు వసఖ్‌ల వరకు లేదా అయిదు వసఖ్‌ల లోపు” అనే విషయంలో దైవప్రవక్త ﷺ కచ్చితంగా ఏం చెప్పారో ఉల్లేఖకునికి గుర్తులేదు.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 988

989

హదీసు 989

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، نَهى عَنِ الْمُزَابَنَةِ، وَالْمُزَابَنَةُ بَيْعُ الثَّمَرِ بِالتَّمْرِ كَيْلاً، وَبَيْعُ الزَّبِيبِ بِالْكَرْمِ كَيْلاً

أخرجه البخاري في: 34 كتاب البيوع: 75 باب بيع الزبيب بالزبيب والطعام بالطعام

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ ‘ముజాబనా’ వ్యాపారం చేయకూడదని వారించారు. ముజాబనా వ్యాపారం అంటే (చెట్టు మీది) పచ్చి ఖర్జూర పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు తూచి అమ్మడం లేదా కొనడం లేక పచ్చి ద్రాక్షా పండ్లను ఎండు ద్రాక్షా పండ్లకు బదులు తూచి అమ్మడం లేదా కొనడం అని అర్థం.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 75వ అధ్యాయం – బైయిజ్జబీబ్ బిజ్జబీబి వత్తఆమిబిత్తఆమ్]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 989

990

హదీసు 990

حديث ابْنِ عُمَرَ، قَالَ: نَهى رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ المُزَابَنَةِ أَنْ يَبِيعَ ثَمَرَ حَائِطِهِ إِنْ كَانَ نَخْلاً بِتَمْرٍ كَيْلاً، وَإِنْ كَانَ كَرْمًا أَنْ يَبِيعَهُ بِزَبِيبٍ كَيْلاً، أَوْ كَانَ زَرْعًا أَنْ يَبِيعَهُ بِكَيْلِ طَعَامِ، وَنَهى عَنْ ذَلِكَ كُلِّهِ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 91 باب بيع الزرع بالطعام كيلا

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ ‘ముజాబనా’ వ్యాపారం చేయకూడదని వారించారు. ముజాబనా వ్యాపారమంటే ఒక వ్యక్తి తన తోటలోని తాజా ఖర్జూర పండ్లను తూనికతో ఎండు ఖర్జూరపండ్లకు బదులు అమ్మడం; లేదా తాజా ద్రాక్ష పండ్లను తూనికతో ఎండు ద్రాక్ష పండ్లకు బదులు అమ్మడం; లేదా పొలంలోని పంటను తూనికతో అమ్మడం. ఇలాంటి ఏ పద్ధతి కూడా అవలంబించకూడదని ఆయన ﷺ వారించారు.(2)

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 91వ అధ్యాయం – బైయిజ్జరయి బిత్తఆమి కీలా]

(2) కొలచి అమ్మడం, కొనడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం కాదు. ‘ముజాబనా’ అనే ఈ వ్యాపార పద్ధతిలో మోసం, పొరపాట్లు ఉండే ప్రమాదం ఉన్నందున దీన్ని దైవప్రవక్త ﷺ నిషేధించారు.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 990

15వ అధ్యాయం – ఎవరైనా పండ్లున్న ఖర్జూర చెట్టునమ్మితే…..

991

హదీసు 991

باب من باع نخلا عليها ثمر

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ بَاعَ نَخْلاً قَدْ أُبِّرَتْ فَثَمَرُهَا لِلْبَائِعِ إِلاَّ أَنْ يَشْتَرِطَ الْمُبْتَاعُ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 90 باب من باع نخلا قد أبرت أو أرضا مزروعة

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఎవరైనా ఖర్జూర చెట్టును అంటుకట్టిన(3) తర్వాత అమ్మితే ఆ చెట్టు పండ్లు కొనుగోలుదారునికి చెందుతాయి. అయితే అమ్మేవాడు దాన్ని అమ్మేటపుడు (పండ్లు ఇవ్వనని) షరతు విధించిన పక్షంలో ఆ పండ్లు అమ్మకందారునికి చెందుతాయి.”

[సహీహ్ బుఖారీ :34వ ప్రకరణం – బుయూ, 90వ అధ్యాయం – మన్ బాఅనఖ్లన్ ఖద్ ఉబిరత్ ఔరజన్ మజ్రూఆ]

(3) ‘అంటుకట్టు’ పద్ధతిలో ఖర్జూరాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 991

16వ అధ్యాయం – ముహాఖలా, ముజాబనా, ముఖాబరా పద్ధతులు నిషిద్ధం

992

హదీసు 992

باب النهى عن المحاقلة والمزابنة وعن المخابرة وبيع الثمرة قبل بدوّ صلاحها، وعن بيع المعاومة وهو بيع السنين

حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ الْمُخَابَرَةِ وَالْمُحَاقَلَةِ وَعَنِ الْمُزَابَنَةِ وَعَنْ بَيْعِ الثَّمَرِ حَتَّى يَبْدُوَ صَلاَحُهَا، وَأَنْ لاَ تُبَاعَ إِلاَّ بِالدِّينَارِ وَالدِّرْهَمِ إِلاَّ الْعَرَايَا

أخرجه البخاري في: 42 كتاب المساقاة: 17 باب الرجل يكون له ممرّ أو شرْب في حائط أو في نخل

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- ముఖాబరా, ముహాఖలా, ముజాబనా(4) (వంటి) వ్యాపార పద్ధతుల్ని దైవప్రవక్త ﷺ నిషేధించారు. అలాగే పండ్లు పూర్తిగా పంటకు వచ్చినట్లు స్పష్టం కానంత వరకు వాటిని అమ్మకూడదని, నగదు డబ్బుకు మాత్రమే పండ్లను అమ్మాలని కూడా ఆయన ﷺ ఆదేశించారు.

[సహీహ్ బుఖారీ : 42వ ప్రకరణం – ముసాఖా, 17వ అధ్యాయం – అర్రజులు యకూనులహూ మమరావు….]

(4) “ముఖాబరా” అనేది ఒక విధమైన వ్యవసాయ ఒప్పందం. దీని ప్రకారం సేద్య భూమి ఒకరిదయి ఉంటే విత్తనం, శ్రమ మరొకరివయి ఉంటాయి. లేదా నిర్ణీత భాగంలో వ్యవసాయ ఒప్పందం ఉంటుంది. ఉదా:- 1/3 భాగం లేదా 1/4 భాగం. (దీన్నే మన తెలుగు నాట పాలికివ్వడం అంటారు.)

“ముహాఖలా” అంటే, కొందరి అభిప్రాయం ప్రకారం సేద్యపు భూమిని గోధుమలకు బదులుగా అమ్మడం, మరికొందరి అభిప్రాయం ప్రకారం సేద్యపు భూమిని గోధుమలకు బదులుగా అద్దెకు ఇవ్వడం. అయితే కొందరు ముఖాబరా, ముహాఖలాల్లో ఎలాంటి భేదం లేదంటారు. అంటే 1/3 లేక 1/4 వాటా చొప్పున సేద్య భూమిని పాలికివ్వడమే ‘ముహాఖలా’ అంటారు. మరికొందరు ధాన్యాన్ని వెన్నులలోనే ఉంచి గోధుమలకు బదులుగా అమ్మడం అని అర్థం తీసుకున్నారు. మరి కొందరు వ్యవసాయోత్పత్తులు పంటకు రాకముందే అమ్మడం అని అర్థం తీసుకున్నారు.

“ముజాబనా” గురించి 989, 990 హదీసుల్లో వచ్చింది.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 992

17వ అధ్యాయం – భూములు అద్దెకు ఇవ్వడం గురించి

993

హదీసు 993

باب كراء الأرض

حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: كَانَتْ لِرِجَالٍ مِنَّا فُضُولُ أَرَضِينَ، فَقَالُوا: نُؤَاجِرُهَا بِالثُّلثِ وَالرُّبُعِ وَالنِّصْفِ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ كَانَتْ لَهُ أَرْضٌ فَلْيَزْرَعْهَا أَو لِيَمْنَحْهَا أَخَاهُ فَإِنْ أَبَى فَلْيُمْسِكْ أَرْضَهُ

أخرجه البخاري في: 51 كتاب الهبة: 35 باب فضل المنيحة

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మాలో కొందరి దగ్గర బీడు భూములు వృధాగా పడి వున్నాయి. అలాంటి భూములను వారు అర్ధపంట, పావుపంట లేదా మూడోవంతు పంట షరతుపై పాలికివ్వాలని భావించారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా బోధించారు. “భూమి ఉన్నవాడు అందులో స్వయంగా సేద్యం చేయాలి లేదా తన తోటి ముస్లిం సోదరునికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేద్యం చేసుకోవడానికి ఇచ్చేయాలి. ఇలా (ఈ రెండింటిలో ఏదీ) చేయకపోతే ఆ భూమిని అలాగే పడి ఉండనివ్వాలి”.

[సహీహ్ బుఖారీ : 51వ ప్రకరణం – హిబా, 35వ అధ్యాయం – ఫజ్జిల్ మనీహా]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 993

994

హదీసు 994

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ كَانَتْ لَهُ أَرْضٌ فَلْيَزْرَعْهَا أَو لِيَمْنَحْهَا أَخَاهُ فَإِنْ أَبَى فَلْيُمْسِكْ أَرْضَهُ

أخرجه البخاري في: 41 كتاب المزارعة: 18 باب ما كان من أصحاب النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يواسي بعضهم بعضًا في الزراعة والثمرة

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:-

“ఎవరి దగ్గరయినా భూమి ఉంటే అతనా భూమిలో స్వయంగా సేద్యం చేసుకోవాలి లేదా తోటి ముస్లిం సోదరునికెవరికైనా దాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేద్యం చేసుకోవడానికి ఇచ్చి వేయాలి. అలా చేయకపోతే ఆ భూమిని అలాగే ఆపి ఉంచాలి.”

[సహీహ్ బుఖారీ : 41వ ప్రకరణం – ముజారా, 18వ అధ్యాయం – మాకాన మిన్ అస్‌హాబిన్నబీ ﷺ]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 994

995

హదీసు 995

حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، نَهى عَنِ الْمُزَابَنةِ وَالْمُحَاقَلَةِ؛ وَالْمُزَابَنَةُ اشْتِرَاءُ الثَّمَرِ بِالتَّمْرِ فِي رُءُوسِ النَّخْلِ

أخرجه البخاري في: 34 كتاب البيوع: 82 باب بيع المزابنة وهي بيع الثمر بالتمر

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- ముజాబనా, ముహాఖలా★ (వంటి) వ్యాపార పద్ధతుల్ని దైవప్రవక్త ﷺ నిషేధించారు. ముజాబనా అంటే ఖర్జూర చెట్ల మీది తాజా పండ్లను ఎండు ఖర్జూర పండ్లకు బదులు అమ్మడం అన్నమాట.

[సహీహ్ బుఖారీ : 34వ ప్రకరణం – బుయూ, 82వ అధ్యాయం – బైయిల్ ముజాబినతి వహియ బైఉస్సమరి బిస్సమర్]

★ “ముహాఖలా” గురించి 992వ హదీసులో వచ్చింది.

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 995

996

హదీసు 996

حديث ابْنِ عُمَرَ وَرَافِعِ بْنِ خَدِيجٍ عَنْ نَافِعٍ، أَنَّ ابْنَ عُمَرَ، كَانَ يُكْرِي مَزَارِعَهُ عَلَى عَهْدِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبِي بَكْرٍ وَعُمَرَ وعُثْمَانَ وَصَدْرًا مِنْ إِمَارَةِ مُعَاوِيَةَ، ثُمَّ حُدِّثَ عَنْ رَافِعِ بْنِ خَدِيجٍ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهى عَنْ كِرَاءِ الْمَزَارِعِ؛ فَذَهَبَ ابْنُ عُمَرَ إِلَى رَافِعٍ فَذَهَبْتُ مَعَهُ، فَسَأَلَهُ؛ فَقَالَ: نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ كِرَاءِ الْمَزَارِعِ، فَقَالَ ابْنُ عُمَرَ: قَدْ عَلِمْتَ أَنَّا كُنَّا نُكْرِي مَزَارِعَنَا عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِمَا عَلَى الأَرْبِعَاءِ وَبِشَيْءٍ مِنَ التِّبْنِ

أخرجه البخاري في: 41 كتاب المزارعة: 18 باب ما كان من أصحاب النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يواسي بعضهم بعضًا في الزراعة والثمرة

హజ్రత్ నాఫె (రహిమహుల్లాహ్) కథనం:- దైవప్రవక్త ﷺ కాలంలో, ఖలీఫాలు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ల కాలంలో హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) పాలన ప్రారంభ కాలంలో కూడా హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తన వ్యవసాయ భూమిని (అద్దెకు) పాలికిచ్చేవారు. అయితే వ్యవసాయ భూములను పాలికివ్వరాదని దైవప్రవక్త ﷺ వారించినట్లు హజ్రత్ రాఫె (రదియల్లాహు అన్హు) తెలిపారని విని ఆయన హజ్రత్ రాఫె (రదియల్లాహు అన్హు) దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆయనతో పాటు నేనూ వెళ్ళాను. హజ్రత్ రాఫె (రదియల్లాహు అన్హు)ని విచారిస్తే, దైవప్రవక్త ﷺ వ్యవసాయ భూముల్ని పాలికివ్వడాన్ని వారించారని ఆయన అన్నారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ మాట విని “మీకు తెలుసో లేదో, దైవప్రవక్త ﷺ కాలంలో మేము మా వ్యవసాయ భూముల్ని పిల్లకాలువలపై పెరిగే పంటకు, కొంత గడ్డికి బదులు అద్దెపై ఇచ్చేవాళ్ళము” అని అన్నారు. ★

[సహీహ్ బుఖారీ : 41వ ప్రకరణం – ముజారా, 18వ అధ్యాయం – మాకాన మిన్ అస్‌హాబిన్నబీ ﷺ యువాసి బాజుహుమ్….]

★ ఈ హదీసులో హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) హజ్రత్ రాఫె (రదియల్లాహు అన్హు) చెప్పిన విషయంతో ఏకీభవించలేదని తెలుస్తోంది. కాని ‘సహీహ్ ముస్లిం’లో వచ్చిన ఉల్లేఖనాలు ధీనికి భిన్నంగా ఉన్నాయి. వాటి ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) హజ్రత్ రాఫె (రదియల్లాహు అన్హు)ని విచారించిన తరువాత (సేద్య) భూములను అద్దెకివ్వడాన్ని మానేశారు. ఈ మార్పుకు కారణం ఏమిటని ఎవరైనా అడిగితే, “దైవప్రవక్త ﷺ భూములను అద్దెకివ్వరాదని వారించినట్లు రాఫె (రదియల్లాహు అన్హు) తెలియజేశారు అని సమాధానమిచ్చేవారు. అదీగాక దైవప్రవక్త ﷺ ఆ తరువాత ఇలా చేయడాన్ని వారించి ఉండవచ్చని కూడా ఆయన భావించారు.

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ సమస్యను గురించి చర్చిస్తూ ఇలా వ్రాశారు. వ్యవసాయ భూముల్ని అద్దెకిచ్చే (అంటే కౌలుకిచ్చే) విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హజ్రత్ తావుస్ (రహిమహుల్లాహ్), హసన్ బస్రీ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ప్రకారం ధాన్యానికి బదులుగా గాని, వెండీ బంగారాలకు బదులుగా గానీ, లేదా వ్యవసాయోత్పత్తుల భాగానికి బదులుగా గానీ వ్యవసాయ భూముల్ని అద్దెకివ్వడం ఏ మాత్రం ధర్మసమ్మతం కాదు.

ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ప్రకారం వెండి, బంగారాలు, వస్త్రాలు, ఇతర వస్తువులకు బదులుగా సేద్యభూమిని అద్దెకు (కౌలుకు) ఇవ్వడం ధర్మసమ్మతమే. కాకపోతే వ్యవసాయోత్పత్తుల భాగానికి బదులుగా మాత్రం అద్దెకివ్వడం సరయిన పద్ధతి కాదు. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం వెండి బంగారాలకు బదులుగా అద్దెకివ్వడం సమంజసమే కాని, ధాన్యానికి బదులుగా అద్దెకివ్వడం మాత్రం సరికాదు. పోతే ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూయూసుఫ్ (రహిమహుల్లాహ్), ఇమామ్ ముహమ్మద్ (రహిమహుల్లాహ్), మాలికీ ధర్మవేత్తల్లోని ఒక వర్గం అభిప్రాయం ప్రకారం ధాన్యం, పంటల భాగం, వెండి బంగారాలకు బదులుగా, మరే విధంగానైనా సేద్యపు భూమిని అద్దెకివ్వడం సమంజసమే. ఇబ్నె షరీహ్ (రహిమహుల్లాహ్), ఇబ్నె ఖజీమా (రహిమహుల్లాహ్), ఖతాబి (రహిమహుల్లాహ్), సలఫీ ధర్మవేత్తలలోని పరిశోధకులు కూడా ఈ అభిప్రాయాన్నే సమర్థించారు; దీనికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. అయితే హదీసుల్లో వచ్చిన నిషేధానికి వీరు వివరణ ఇస్తూ ఇది కొంత అయిష్టకరమైన విషయం అని అన్నారు. అంటే ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా వ్యవసాయం చేసుకోవడానికి తోటి ముస్లింకు భూమిని ఉచితంగా ఇవ్వాలని, సేద్యపుభూమిని ఉచితంగా ఇచ్చే విషయాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే అద్దెకివ్వరాదని వారించడం జరిగిందని వారి అభిప్రాయం. నిజం అల్లాహ్ కే తెలుసు.

[ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్)]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 996

18వ అధ్యాయం – ధాన్యానికి బదులు భూమిని అద్దెకివ్వడం గురించి

997

హదీసు 997

باب كراء الأرض بالطعام

حديث ظُهَيْرِ بْنِ رَافِعٍ، قَالَ: لَقَدْ نَهَانَا رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ أَمْرٍ كَانَ بِنَا رَافِقًا (قَالَ رَافِعُ بْنُ خَدِيجٍ رَاوِي هذَا الْحَدِيثِ) قُلْتُ: مَا قَالَ رسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَهُوَ حَقٌّ قَالَ: دَعَانِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَا تَصْنَعُونَ بِمَحَاقِلِكُمْ قُلْتُ: نُؤَاجِرُهَا عَلَى الرُّبُعِ وَعَلَى الأَوْسُقِ مِنَ التَّمْرِ وَالشَّعِيرِ قَالَ: لاَ تَفْعَلُوا، ازْرَعُوهَا أَوْ أَزْرِعُوهَاَ أَوْ أَمْسِكُوهَا قَالَ رَافِعٌ، قُلْتُ: سَمْعًا وَطَاعَةً

أخرجه البخاري في: كتاب المزارعة: 18 باب ما كان من أصحاب النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يواسي بعضهم بعضًا في الزراعة والثمرة

హజ్రత్ జుహైర్ బిన్ రాఫె (రదియల్లాహు అన్హు) కథనం:- “దైవప్రవక్త ﷺ మమ్మల్ని మాకు ప్రయోజనం చేకూర్చే ఒక పని నుండి వారించారు.” (ఈ హదీసును ఉల్లేఖించిన రాఫె బిన్ ఖుదైజ్ మాట్లాడుతూ) “దైవప్రవక్త ﷺ చెప్పినది వాస్తవం, సత్యంతో కూడినది” అని అన్నాను నేను. తిరిగి జుహైర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “దైవప్రవక్త ﷺ నన్ను పిలిచి “నీవు నీ వ్యవసాయ భూముల విషయంలో ఎలా చేస్తున్నావు?” అని అడిగారు. దానికి నేను ‘అద్దెకు ఇస్తున్నాను లేదా నాల్గవ భాగం పంటకై పాలికిస్తున్నాను లేదా కొన్ని వసఖ్‌ల ఎత్తు ఖర్జూరపండ్లు, గోధుమలకు బదులుగా ఇస్తున్నాను’ అని చెప్పాను. అప్పుడు దైవప్రవక్త ﷺ “అలా చేయకు. నువ్వు స్వయంగా సేద్యం చెయ్యి లేదా (ప్రతిఫలం తీసుకోకుండా) ఇతరులకు సేద్యం చేసుకోవడానికి ఇచ్చెయ్యి, లేదా దాన్ని అలాగే పడి ఉండనివ్వు” అని అన్నారు. హజ్రత్ రాఫె మాట్లాడుతూ “నేనీ ఆదేశం విని, మీ ఆజ్ఞ విన్నాను, దానికి కట్టుబడి ఉంటాను” అని అన్నాను.

[సహీహ్ బుఖారీ : 41వ ప్రకరణం – మజారా, 18వ అధ్యాయం – మాకాన మిన్ అస్‌హాబిన్నబీ ﷺ]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 997

21వ అధ్యాయం-భూమిని ఉచితంగా ఇవ్వడం గురించి

998

హదీసు 998

باب الأرض تمنح

حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَمْ يَنْهَ عَنْهُ (أَيِ الْمُخَابَرَةِ) وَلكِنْ قَالَ: أَنْ يَمْنَحَ أَحَدُكُمْ أَخَاهُ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَأْخُذَ عَلَيْهِ خَرْجًا مَعْلُومًا

أخرجه البخاري في: 41 كتاب المزارعة: 10 باب حدثنا علي بن عبد الله

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ వ్యవసాయ భూమిని పాలికివ్వకూడదని మమ్మల్ని వారించలేదు. నిర్ణీత పైకంతో భూమిని అద్దెకు ఇవ్వడంకంటే ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా దాన్ని తోటి ముస్లిం సోదరునికి ఉచితంగా ఇవ్వడం ఎంతో మంచిదని మాత్రమే ఆయన అన్నారు.

[సహీహ్ బుఖారీ : 41వ ప్రకరణం – మజారా, 10వ అధ్యాయం – హద్దసనా అలీ బిన్ అబ్దుల్లా]

మహా ప్రవక్త మహితోక్తులు|21. వాణిజ్య ప్రకరణం|హదీసు 998