మహా ప్రవక్త మహితోక్తులు – 19. శాప ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 19. శాప ప్రకరణం. ఇందులో 6 హదీసులు (హదీసు 952 – 957) ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFశాప ప్రకరణం3 పేజీలు · 0.2 MB

19. శాప ప్రకరణం

كتاب اللعان
952

హదీసు 952

حديث سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ، أَنَّ عُوَيْمِرًا الْعَجْلاَنِيَّ جَاءَ إِلَى عَاصِمِ بْنِ عَدِيٍّ الأَنْصَارِيِّ، فَقَالَ لَهُ: يَا عَاصِمُ أَرَأَيْتَ رَجُلاً وَجَدَ مَعَ امْرَأَتِهِ رَجُلاً أَيَقْتُلُهُ فَتَقْتُلُونَهُ، أَمْ كَيْفَ يَفْعَلُ سَلْ لِي يَا عَاصِمُ عَنْ ذَلِكَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَسَأَلَ عَاصِمٌ عَنْ ذَلِكَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَكَرِهَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمَسَائِلَ وَعَابَهَا، حَتَّى كَبُرَ عَلَى عَاصِمٍ مَا سَمِعَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمَّا رَجَعَ عَاصِمٌ إِلَى أَهْلِهِ، جَاءَ عُوَيْمِرٌ، فَقَالَ: يَا عَاصِمُ مَاذَا قَالَ لَكَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ عَاصِمٌ: لَمْ تَأْتِنِي بِخَيْرٍ، قَدْ كَرِهَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْمَسْئَلَةَ الَّتِي سَأَلْتُهُ عَنْهَا قَالَ عُوَيْمِرٌ: وَاللهِ لاَ أَنْتَهِي حَتَّى أَسْأَلَهُ عَنْهَا فَأَقْبَلَ عُوَيْمِرٌ حَتَّى أَتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَسْطَ النَّاس فَقَالَ: يَا رَسُولَ اللهِ أَرَأَيْتَ رَجُلاً وَجَدَ مَعَ امْرَأَتِهِ رَجُلاً أَيَقْتُلُهُ فَتَقْتُلُونَهُ أَمْ كَيْفَ يَفْعَلُ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَدْ أَنْزَلَ اللهُ فِيكَ وَفِي صَاحِبَتِكَ، فَاذْهَبْ فَأْتِ بِهَا قَالَ سَهْلٌ: فَتَلاَعَنَا، وَأَنَا مَعَ النَّاسِ عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلَمَّا فَرَغَا قَالَ عُوَيْمِرٌ: كَذَبْتُ عَلَيْهَا يَا رَسُولَ اللهِ إِنْ أَمْسَكْتُهَا؛ فَطَلَّقَهَا ثَلاَثًا، قَبْلَ أَنْ يَأْمُرَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

أخرجه البخاري في:68 كتاب الطلاق: 4 باب من أجاز طلاق الثلاث

హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాది (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఆసిమ్ బిన్ అదీ అన్సారీ (రదియల్లాహు అన్హు) దగ్గరకు హజ్రత్ ఉవైమిర్ అజ్లానీ (రదియల్లాహు అన్హు) వచ్చి ఇలా అన్నారు: “ఆసిమ్! ఎవరైనా తన భార్య పక్కలో మరో (పరాయి) వ్యక్తి ఉండటం చూస్తే, మీరు ప్రతీకారం (ఖిసాస్)గా చంపినట్లు అతనా వ్యక్తిని చంపవచ్చా చెప్పండి. లేకపోతే అతనేం చేయాలి? ఆసిమ్! మీరు నా కోసం ఈ సమస్యను గురించి దైవప్రవక్త ﷺను అడిగి చెప్పండి”. అప్పుడు హజ్రత్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) ఈ సమస్యను దైవప్రవక్త ﷺ ముందు ప్రస్తావించి పరిష్కారం అడిగారు. అయితే ఈ విషయమై హజ్రత్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) అడిగిన ప్రశ్నలు దైవప్రవక్త ﷺకు నచ్చలేదు. దానిపై దైవప్రవక్త ﷺ వ్యక్తపరచిన మాటలు విని హజ్రత్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) ముఖం చిన్నబుచ్చుకున్నారు.

ఆ తర్వాత ఆయన ఇంటికి తిరిగొచ్చారు. హజ్రత్ ఉవైమిర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని చూసి “ఆసిమ్! దైవప్రవక్త ﷺ ఏమన్నారు?” అని అడిగారు. “నువ్వు నన్ను లేనిపోని వ్యవహారంలో ఇరికించావు. దైవప్రవక్త ﷺ నేనడిగిన ప్రశ్న విని అయిష్టత వ్యక్తపరిచారు” అన్నారు హజ్రత్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు). హజ్రత్ ఉవైమిర్ (రదియల్లాహు అన్హు) అది విని “అల్లాహ్ సాక్షి! నేనీ సమస్య గురించి దైవప్రవక్త ﷺను తప్పకుండా అడుగుతాను” అని అన్నారు. ఈ మాట చెప్పి ఆయన దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళిపోయారు.

దైవప్రవక్త ﷺ ప్రజల మధ్య కొలువు తీరి కూర్చున్నారు. హజ్రత్ ఉవైమిర్ (రదియల్లాహు అన్హు) ఆయన దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! ఒక వేళ ఎవరైనా తన భార్య పక్కలో పరాయి వ్యక్తిని చూస్తే ఏం చేయాలో చెప్పండి. అతనా వ్యక్తిని చంపవచ్చా? చంపివేస్తే చట్టం ప్రతీకారం (ఖిసాస్)గా తిరిగి అతడ్ని చంపివేస్తుందా? లేకుంటే ఇలాంటి స్థితిలో అతనేం చేయాలి?” అని అడిగారు. దైవప్రవక్త ﷺ ఈ ప్రశ్నలు విని “అల్లాహ్ నీ గురించి, నీ భార్య గురించి ఆజ్ఞ అవతరింపజేశాడు. వెళ్ళి నీ భార్యను ఇక్కడికి పిలుచుకురా” అన్నారు.

హజ్రత్ సహెల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం:- వాళ్ళిద్దరు (దైవప్రవక్త సన్నిధికి వచ్చి) పరస్పరం ‘లిఆన్’★ (శాప ప్రమాణం) చేసుకున్నారు. ఆ సమయంలో అందరితో పాటు నేను కూడా దైవప్రవక్త ﷺ సన్నిధిలో కూర్చొని ఉన్నాను. ఆ తర్వాత హజ్రత్ ఉవైమిర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺను సంబోధిస్తూ “దైవప్రవక్తా! నేనిప్పుడు ఆమెను భార్యగా స్వీకరించానంటే, దానర్థం నేనామెపై అపనింద మోపానన్న మాట” అని అన్నారు. అందుచేత ఆయన ఈ విషయంలో దైవప్రవక్త ﷺ నుంచి మరో ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా వెంటనే తన భార్యకు మూడు విడాకులు ఇచ్చేశారు.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 4వ అధ్యాయం – మన్ అజాజ తలాఖుస్సలాస్]

★ ‘లిఆన్’ అనేది అసలు పదం. ‘లిఆన్’ అంటే పరస్పరం శపించుకోవడం అని శాబ్దిక అర్థం. షరీఅత్ పరిభాషలో “భర్త తన భార్యపై అక్రమ సంబంధపు నింద మోపి సాక్షులను తీసుకురాలేని పక్షంలో, ఆ భార్యాభర్తలు న్యాయాధికారి సమక్షంలో కొన్ని ప్రత్యేక మాటల ద్వారా సాక్ష్యం పలకడాన్ని ‘లిఆన్’ అంటారు. ఈ మాటల చివర్లో “సాక్ష్యం పలికే ఈ వ్యక్తి అబద్ధమాడి ఉంటే అతని లేక ఆమెపై అల్లాహ్ శాపం పడుగాక!” అనే వాక్యం ఉంటుంది. ఆ తరువాత భార్యాభర్తలు శాశ్వతంగా విడిపోతారు. ఇక ముందెన్నడూ వారిద్దరు పరస్పరం వివాహమాడలేరు.

మహా ప్రవక్త మహితోక్తులు|19. శాప ప్రకరణం|హదీసు 952

953

హదీసు 953

حديث ابْنِ عُمَرَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ لِلْمُتَلاَعِنَيْنِ: حِسَابُكُمَا عَلَى اللهِ، أَحَدُكُمَا كَاذِبٌ، لاَ سَبِيلَ لَكَ عَلَيْهَا قَالَ: يَا رَسُولَ اللهِ مَالِي قَالَ: لاَ مَالَ لَكَ، إِنْ كُنْتَ صَدَقْتَ عَلَيْهَا فَهُوَ بِمَا اسْتَحْلَلْتَ مِنْ فَرْجِهَا، وَإِنْ كُنْتَ كَذَبْتَ عَلَيْهَا فَذَاكَ أَبْعَدُ، وَأَبْعَدُ لَكَ مِنْهَا

أخرجه البخاري في: 68 كتاب الطلاق: 53 باب المتعة التي لم يفرض لها

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ పరస్పరం ‘లిఆన్’ (దూషణ ప్రమాణం) చేసుకున్న వారితో “ఇప్పుడు మీరిద్దరి లెక్క అల్లాహ్ చేతిలో ఉంది. మీరిద్దరిలో ఒకరు అబద్ధాల కోరున్నారు” అని అన్నారు. (ఆ తర్వాత ఆయన పురుష ముద్దాయిని ఉద్దేశించి) “ఇప్పుడు నీకు ఈమెతో ఎలాంటి సంబంధం లేదు” అని అన్నారు. ఆ వ్యక్తి “దైవప్రవక్తా! మరి నా సొమ్ము (మహర్) సంగతేమిటి?” అన్నాడు. “ఇప్పుడు నీకు ఎలాంటి సొమ్ము లభించదు. నువ్వు మోపిన నింద నిజమయితే నీవిచ్చిన సొమ్ముకు బదులుగా ఆమె దగ్గర నీవు దాంపత్య సుఖాన్ని అనుభవించావు. ఒకవేళ నువ్వు అపనింద మోపి ఉంటే ఆ సొమ్ము వాపసు తీసుకోవడానికి నీకు అసలే హక్కు లేదు’ ’ అని తీర్పిచ్చారు దైవప్రవక్త ﷺ.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 53వ అధ్యాయం – అల్‌ముత్ అతిల్లతి లమ్ యుఫ్రజ్‌లహా]

మహా ప్రవక్త మహితోక్తులు|19. శాప ప్రకరణం|హదీసు 953

954

హదీసు 954

حديث ابْنِ عُمَرَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لاَعَنَ بَيْنَ رَجُلٍ وَامْرَأَتِهِ، فَانْتَفَى مِنْ وَلَدِهَا، فَفَرَّقَ بَيْنَهُمَا، وَأَلْحَقَ الْوَلَدَ بِالْمَرْأَةِ

أخرجه البخاري في: 68 كتاب الطلاق: 35 باب يلحق الولد بالْمُلاَعِنَة

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ ఒక పురుషుని చేత, అతని భార్య చేత పరస్పరం ‘లిఆన్’ (దూషణ ప్రమాణం) చేయించారు. పురుషుడు ఆ సందర్భంలో పిల్లవాడు తనవాడు కాదని నిరాకరించాడు. అప్పుడు దైవప్రవక్త ﷺ పిల్లవాడ్ని తల్లికి చెందినవాడిగా పరిగణించారు.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 35వ అధ్యాయం – యల్ హఖుల్ వలదు బిల్ ములాయినా]

మహా ప్రవక్త మహితోక్తులు|19. శాప ప్రకరణం|హదీసు 954

955

హదీసు 955

حديث ابْنِ عَبَّاسٍ، أَنَّهُ ذُكِرَ التَّلاَعُنُ عِنْدَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ عَاصِمُ بْنُ عَدِيٍّ فِي ذَلِكَ قَوْلاً ثُمَّ انْصَرَفَ فَأَتَاهُ رَجُلٌ مِنْ قَوْمِهِ يَشْكُو إِلَيْهِ أَنَّهُ قَدْ وَجَدَ مَعَ امْرَأَتِهِ رَجُلاً، فَقَالَ عَاصِمٌ: مَا ابْتُلِيتُ بِهذَا إِلاَّ لِقَوْلِي فَذَهَبَ بِهِ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَخْبَرَهُ بِالَّذِي وَجَدَ عَلَيْهِ امْرَأَتَهُ وَكَانَ ذَلِكَ الرَّجُلُ مُصْفَرًّا، قَلِيلَ اللَّحْمِ، سَبْطَ الشَّعَرِ؛ وَكَانَ الَّذِي ادَّعَى عَلَيْهِ، أَنَّهُ وَجَدَهُ عِنْدَ أَهْلِهِ، خَدْلاً، آدَمَ، كَثِيرَ اللَّحْمِ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: اللهُمَّ بَيِّنْ فَجَاءَتْ شَبِيهًا بِالرَّجُلِ الَّذِي ذَكَرَ زَوْجُهَا أَنَّهُ وَجَدَهُ، فَلاَعَنَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَيْنَهُمَا قَالَ رَجُلٌ لاِبْنِ عَبَّاسٍ، فِي الْمَجْلِسِ: هِيَ الَّتِي قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَوْ رَجَمْتُ أَحَدًا بِغَيْرِ بَيِّنَةٍ رَجَمْتُ هذِهِ فَقَالَ: لاَ، تِلْكَ امْرَأَةٌ كَانَتْ تُظْهِرُ فِي الإِسْلاَمِ السُّوءَ

أخرجه البخاري في: 68 كتاب الطلاق: 31 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لو كنت راجما بغير بينة

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ ముందు ‘లిఆన్’ (దూషణ ప్రమాణం) ప్రస్తావన వచ్చినపుడు హజ్రత్ ఆసిమ్ బిన్ అదీ (రదియల్లాహు అన్హు) ఆ విషయంలో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి ఆయన తెగకు చెందిన ఒకతను వచ్చి “నేను నా భార్య పక్కలో ఎవరో ఓ పరాయి వ్యక్తి ఉండటం చూశాను” అని తెలిపాడు. దానికి హజ్రత్ ఆసిమ్ (రదియల్లాహు అన్హు) “నేనీ వ్యవహారంలో ఇంతకు ముందే నా నోట వెలువడిన మాటల కారణంగా ఇరుకున పడ్డాను” అని చెప్పి ఆ వ్యక్తిని దైవప్రవక్త ﷺ సన్నిధికి తీసుకెళ్ళారు.

అప్పుడు ఆ వ్యక్తి దైవప్రవక్త ﷺ ముందు తన భార్య పక్కలో తాను చూసిన పరాయి మనిషిని గురించి వివరాలు తెలిపాడు. అతను ఎర్రగా, బక్కపలచగా, సరళమైన శిరోజాలతో ఉన్నాడు. అతను తన భార్య పక్కలో చూశానని ఆరోషించిన అపరిచిత వ్యక్తి కండలు తిరిగి భారీ కాయంతో బొద్దుగా, చామనఛాయలో ఉన్నాడు. దైవప్రవక్త ﷺ, “అల్లాహ్! నీవే ఈ వ్యవహారంలో వాస్తవాన్ని బట్టబయలు చేయాలి” అని ప్రార్థించారు. చివరికి ఆ స్త్రీ పిల్లవాడ్ని కనగానే నిజం బయటపడింది. పిల్లవాడిలో ఆమె భర్త ఆరోపించిన వ్యక్తి పోలికలే ఉన్నాయి. అప్పుడు దైవప్రవక్త ﷺ ఆ స్త్రీ పురుషుల (భార్యభర్తల) చేత పరస్పరం ‘లిఆన్’ (దూషణ ప్రమాణం) చేయించారు.

ఈ హదీసు సమావేశంలో కూర్చొన్న ఒక వ్యక్తి హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా)ని ఉద్దేశించి “దైవప్రవక్త ﷺ ఒక స్త్రీ విషయంలో, సాక్షులు లేకుండా ఎవరికైనా రాళ్లు రువ్వే శిక్ష విధించవలసి వస్తే తానీ స్త్రీకి రాళ్ళు రువ్వే శిక్ష విధిస్తానని అన్నారు కదా! ఆ స్త్రీ ఈమేనా?” అని అడిగాడు. దానికి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) “కాదు. ఆమె మరో స్త్రీ. ఇస్లాం హయాంలో కూడా ఆమె బహిరంగంగా వ్యభిచారం చేస్తుండేది” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 31వ అధ్యాయం – ఖౌలిన్నబీ ﷺ లౌకున్తు రజిమన్ బిగైరి బయ్యినా]

మహా ప్రవక్త మహితోక్తులు|19. శాప ప్రకరణం|హదీసు 955

956

హదీసు 956

حديث الْمُغِيرَةِ بْنِ شُعْبَةَ، قَالَ: قَالَ سَعْد ابْنُ عُبَادَةَ: لَوْ رَأَيْتُ رَجُلاً مَعَ امْرَأَتِي لَضَرَبْتُهُ بِالسَّيْفِ غَيْرَ مُصْفَحٍ فَبَلَغَ ذلِكَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: تَعْجَبُونَ مِنْ غَيْرَةِ سَعْدٍ وَاللهِ لأَنَا أَغْيَرُ مِنْهُ، وَاللهُ أَغْيَرُ مِنِّي وَمِنْ أَجْلِ غَيْرَةِ اللهِ حَرَّمَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ؛ وَلاَ أَحَدَ أَحَبُّ إِلَيْهِ الْعُذْرُ مِنَ اللهِ، وَمِنْ أَجْلِ ذَلِك بَعَثَ الْمُبَشِّرِينَ وَالْمُنْذِرِينَ؛ وَلاَ أَحَدَ أَحَبُّ إِلَيْهِ الْمَدْحَةُ مِنَ اللهِ، وَمِنْ أَجْلِ ذَلِكَ وَعَدَ اللهُ الْجَنَّةَ

أخرجه البخاري في: 97 كتاب التوحيد: 20 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لا شخص أغير من الله

హజ్రత్ ముగీరా బిన్ షేబా (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) ఒకసారి ఇలా అన్నారు. “నేను నా భార్య పక్కలో పరాయి వ్యక్తిని గనక చూస్తే, అతడ్ని ఎలాంటి పరిస్థితిలోనూ క్షమించను. అతడ్ని తప్పకుండా చంపివేస్తాను.” హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) పలికిన ఈ పలుకులు దైవప్రవక్త ﷺకు తెలిసి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు –

“మీరు సాద్ (రదియల్లాహు అన్హు) పౌరుషం పట్ల ఆశ్చర్యపోతున్నారా? అల్లాహ్ సాక్షి! నేను అంతకంటే ఎక్కువ పౌరుషం కలవాడ్ని. అల్లాహ్ నాకంటే ఎక్కువ పౌరుషం కలవాడు. అల్లాహ్ తనకున్న ఈ పౌరుషం వల్లనే ఆయన అన్ని రకాల అశ్లీల విషయాల్ని అవి బహిరంగమైనవయినా లేదా రహస్యమైనవయినా సరే – నిషేధించాడు. కారణం లేకుండా అల్లాహ్ ఏ పనీ చేయడు. ఈ విషయంలో ఆయన్ని మించిన వారెవరూ లేరు. అందువల్లనే ఆయన తన ప్రవక్తలను(పుణ్యాత్ములను) శుభవార్త అందజేసేవారిగా, (పాపాత్ములకు దైవశిక్షను గురించి) భయపెట్టే వారిగా నియమించి పంపాడు. అల్లాహ్ మించిన ప్రశంసపాత్రుడు మరెవరూ లేరు. అందువల్లనే ఆయన (తనను స్తుతించే వారికి) స్వర్గ ప్రవేశం గురించి వాగ్దానం చేశాడు.”

[సహీహ్ బుఖారీ : 97వ ప్రకరణం – తౌహీద్, 20వ అధ్యాయం – ఖౌలిన్నబీ ﷺ లాషఖ్స అగ్‌మర్ మినల్లాహ్]

మహా ప్రవక్త మహితోక్తులు|19. శాప ప్రకరణం|హదీసు 956

957

హదీసు 957

حديث أَبِي هُرَيْرَةَ، أَنَّ رَجُلاً أَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللهِ وُلِدَ لِي غُلاَمٌ أَسْوَدُ، فَقَالَ: هَلْ لَكَ مِنْ إِبِلٍ قَالَ: نَعَمْ، قَالَ: مَا أَلْوَانَهَا قَالَ: حُمْرٌ قَالَ: هَلْ فِيهَا مِنْ أَوْرَقَ قَالَ: نَعَمْ قَالَ: فَأَنَّى ذَلِكَ قَالَ: لَعَلَّهُ نَزَعَهُ عِرْقٌ قَالَ: فَلَعَلَّ ابْنكَ هذَا نَزَعَهُ

أخرجه البخاري في: 68 كتاب الطلاق: 26 باب إذا عرض بنفي الولد

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! నాకొక మగపిల్లవాడు పుట్టాడు. కాని నల్లగా ఉన్నాడు, నేను ఎర్రగా ఉన్నాను. (ఇది ఎలా సంభవం)?” అని అన్నాడు. దైవప్రవక్త ﷺ ఈ మాట విని “నీ దగ్గర ఒంటెలున్నాయా?” అని అడిగారు. అతను ‘ఉన్నాయి’ అన్నాడు. “అయితే అవి ఏ రంగులో ఉన్నాయి?” అడిగారు దైవప్రవక్త ﷺ మళ్ళీ. “ఎర్ర రంగులో ఉన్నాయి” అన్నాడతను. “వాటిలో ఏదైనా బూడిద రంగు ఒంటెలు కూడా ఉన్నాయా?” అని అడిగారు దైవప్రవక్త ﷺ. “బూడిద రంగువి కూడా ఉన్నాయి” అన్నాడతను. “మరి ఈ బూడిద రంగు ఒంటెలు ఎక్కడ్నుంచి వచ్చాయి?” ప్రశ్నించారు దైవప్రవక్త ﷺ. “వాటికి వాటి తాత ముత్తాతలలో ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది” సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. “అదే విధంగా నీ కొడుక్కు కూడా అతని తాత ముత్తాతలలో ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది కదా!” అన్నారు దైవప్రవక్త ﷺ.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 26వ అధ్యాయం – ఇజాఅరజబిన ఫిల్ వలద్]

మహా ప్రవక్త మహితోక్తులు|19. శాప ప్రకరణం|హదీసు 957