హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 6. దైవభీతి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 6వ అధ్యాయం: దైవభీతి. ఈ అధ్యాయంలో 5 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 69 – 73) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

6. దైవభీతి

↑ విషయ సూచిక

باب التقوى

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ} [آل عمران: ١٠٢]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌కు ఏ విధంగా భయపడాలో, ఆ విధంగా భయపడండి." (ఆలి ఇమ్రాన్ : 102)

{فَاتَّقُوا اللَّهَ مَا اسْتَطَعْتُمْ} [التغابن: ١٦]

మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు : "మీకు సాధ్యమైనంత వరకు అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి." (అత్ తగాబున్ : 16)

రెండో సూక్తి మొదటి సూక్తి అర్థాన్ని మరింత విపులీకరిస్తుంది. ఏ విధంగా భయపడాలో ఆ విధంగా అంటే మీకు సాధ్యమైనంతవరకు అని వివరిస్తుంది.

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلاً سَدِيدا} [الأحزاب: ٧٠]

ఇంకొకచోట అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: "విశ్వాసులారా! అల్లాహ్‌కు భయవడండి. సూటిగా, సమంజసంగా మాట్లాడండి." (అల్ అహ్‌జాబ్ : 70)

{وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مَخْرَجاوَيَرْزُقْهُ مِنْ حَيْثُ لا يَحْتَسِبُ} [الطلاق: ٢،٣]

దైవానికి భయపడుతూ ఉండాలని ఆదేశిస్తున్న సుప్రసిద్ధ సూక్తులు అనేకం ఉన్నాయి. ఇంకొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "ఎవడు అల్లాహ్‌కు భయపడుతూ పనిచేస్తాడో అతనికి అల్లాహ్ కష్టాల నుండి గట్టెక్కే మార్గం చూపుతాడు. ఇంకా అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా, అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు." (అత్ తలాఖ్ : 2,3)

{إِنْ تَتَّقُوا اللَّهَ يَجْعَلْ لَكُمْ فُرْقَاناً وَيُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَيَغْفِرْ لَكُمْ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ} [لأنفال: ٢٩]

మరోచోట అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "మీరు గనక భయభక్తులను అవలంబిస్తే, అల్లాహ్ మీకు (సత్యా సత్యాల మధ్య విచక్షణ పాటించే) గీటురాయిని ప్రసాదిస్తాడు. మీ నుండి మీ చెడులను దూరం చేస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ అత్యధికంగా అనుగ్రహించేవాడు." (అన్‌ఫాల్ : 29)

ఈ అధ్యాయంలో దివ్యఖుర్‌ఆన్ సూక్తులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు క్రింద పేర్కొనబడ్డాయి-

English

“O you who believe! Fear Allah as He should be feared”. [Āl ‘Imrān 3:102]

“So, keep your duty to Allah and fear Him as much as you can…” [At-Taghābun 64:16] This second Verse explains the meaning of the first one.

“O you who believe! Keep your duty to Allah and fear Him, and speak (always) the truth”. [Al-Aḥzāb 33:70]

“… And whosoever fears Allah and keeps his duty to Him, He will make a way for him to get out (from every difficulty). And He will provide him from (sources) he never could imagine…” [Aṭ-Ṭalāq 65:2–3]

“If you obey and fear Allah, He will grant you Furqan [(a criterion to judge between right and wrong), or (Makhraj, i.e., a way for you to get out from every difficulty)], and will expiate for you your sins, and forgive you; and Allah is the Owner of the great bounty”. [Al-Anfāl 8:29]

69

హదీసు 69

وأَمَّا الأَحَاديثُ فَالأَوَّلُ: عَنْ أبي هُرَيْرَةَ رضي اللَّهُ عنه قَالَ: قِيلَ: يَا رسولَ اللَّهِ مَن أَكْرَمُ النَّاسِ؟ قَالَ:"أَتْقَاهُمْ"فقَالُوا: لَيْسَ عَنْ هَذا نَسْأَلُكَ، قَالَ:"فيُوسُفُ نَبِيُّ اللَّهِ ابنُ نَبِيِّ اللَّهِ ابنِ نَبيِّ اللَّهِ ابنِ خَلِيلِ اللَّهِ". قَالُوا: لَيْسَ عن هَذَا نَسْأَلُكَ، قَالَ: فعَنْ مَعَادِنِ الْعَرَب تسْأَلُونِي؟ خِيَارُهُمْ في الْجاهِليَّةِ خِيَارُهُمْ في الإِسلامِ إذَا فَقُهُوا" متفقٌ عَلَيهِ. و"فَقُهُوا"بِضَمِّ الْقَافِ عَلَى الْمَشْهورِ، وحُكِي كسْرُهَا. أَي: عَلِمُوا أَحْكَامَ الشَّرْعِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి దైవప్రవక్తను "ప్రజల్లో అందరికన్నా ఆదరణీయుడు ఎవడు?" అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన "వారిలో అందరికన్నా ఎక్కువగా దైవానికి భయపడుతూ ఉండేవాడు" అని సమాధానమిచ్చారు. అప్పుడు సహచరులు "ఓ దైవప్రవక్తా! మేమడుగుతున్నది దాని గురించి కాదు" అని విన్నవించుకున్నారు. అందుకు ఆయన "అలాగైతే యూసుఫ్ (అలైహి) (అందరికన్నా శ్రేష్ఠులు). ఎందుకంటే ఆయన స్వయంగా ఒక దైవప్రవక్త. ఇంకా ఆయన తండ్రి, తాత కూడా దైవప్రవక్తలే. ముత్తాత కూడా దైవప్రవక్తే. అంతేకాదు ఆయన దేవుని స్నేహితుడు కూడాను" అని అన్నారు. సహచరులు మళ్ళీ "మేమడుగుతున్నది దీని గురించి కూడా కాదు" అన్నారు. అందుకు ఆయన "మరి మీరు నన్ను అరబ్బు వంశాల గురించి అడుగుతున్నారా ఏమిటి?" (అలాగయితే వినండి!) అజ్ఞాన కాలంలో శ్రేష్ఠులుగా భావించ బడిన వారు ఇస్లాం వచ్చిన తరువాత కూడా శ్రేష్ఠులుగానే ఉంటారు. (అంటే ఇస్లాం వ్యక్తుల ప్రాపంచిక పరువు ప్రతిష్ఠల్లో, అంతస్థుల్లో లోటు రానీయదు). కాకపోతే వారు ధర్మాన్ని అర్థం చేసుకునేవారై ఉండాలి."

(బుఖారీ – ముస్లిం)

'ఫఖుహూ' విస్తృత ప్రచారంలో 'ఖ'కు ఉకారం ఉన్నప్పటికీ ఇకారంతో కూడా చదవటం జరిగింది. ఈ పదానికి "వారు షరీఅత్ ఆదేశాలు తెలుసుకోవాలి" అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని మహిమోన్నతల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడింది.)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: It was asked, “O Messenger of Allah! Who is the most honourable amongst mankind?” He ﷺ said, “The most honourable of them is one who is the most pious of them.” They said, “We are not asking about this”. He said, “Then, the most honourable of men was Yusuf (Joseph), the Prophet of Allah, the son of Allah’s Prophet, who was the son of the Prophet of Allah, who was the son of the Khalil of Allah (i.e., Ibrahim ﷺ)‘ They said, “We are not asking you about this.” He enquired, “Are you then asking me about the classes of the Arabs? The best of them in the Pre-Islamic Period of Ignorance are the best of them in Islam, provided they comprehend the religious knowledge”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాం ప్రభవనానికి పూర్వం ప్రాపంచికంగా గౌరవప్రతిష్ఠలు, వంశ విశిష్ఠతలను కలిగివున్న తెగలు, సమాజాల హోదాను, గొప్పదనాన్ని ఇస్లాం తరువాత కూడా ఉపేక్షించలేదన్న దానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. ఇస్లాం రాకకు మునుపు కూడా కొన్ని అరబ్బు తెగలు దాతృత్వం, శూరత్వం, సత్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడటం వంటి విషయాల్లో పేరు గడించాయి. అయితే ఇస్లాం వీటితోపాటు ధర్మావగాహన, ధర్మబద్ధమైన ఆచరణ అవసరమన్న నియమం పెట్టి వారి శక్తిసామర్థ్యాలను, ఆత్మగౌరవం, అంకిత భావాలవంటి ఉత్తమ గుణాల దిశను ధర్మం వైపుకు మళ్ళించింది. అంతకు ముందు వారి శక్తి సామర్థ్యాలు దైవ తిరస్కార మార్గంలో వినియోగించబడేవి. కాని ఇస్లాం వచ్చిన తరువాత అవి దైవధర్మ ఔన్నత్యం కోసం అంకితమయ్యాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|6. దైవభీతి|హదీసు 69

70

హదీసు 70

الثَّانِي: عَنْ أبي سَعيدٍ الْخُدْرِيِّ رضي اللَّه عنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إنَّ الدُّنْيا حُلْوَةٌ خضِرَةٌ، وإنَّ اللَّهَ مُسْتَخْلِفُكُمْ فِيهَا. فينْظُر كَيْفَ تَعْمَلُونَ. فَاتَّقوا الدُّنْيَا واتَّقُوا النِّسَاءِ. فَإِنَّ أَوَّلَ فِتْنةِ بَنِي إسْرَائيلَ كَانَتْ في النسَاء" رواه مسلم.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు : నిస్సందేహంగా ప్రపంచం రమణీయంగా, మనోహరంగా కనబడుతుంది. అల్లాహ్ మిమ్మల్ని ఈ ప్రపంచానికి నాయకులుగా చేసి మీరు బాధ్యతల్ని ఎలా నెరవేరుస్తారో పరీక్షిస్తాడు. కాబట్టి (మీరు ఈ పరీక్షలో నెగ్గాలనుకుంటే) ప్రపంచానికి (మోసపోకుండా) జాగ్రత్తగా ఉండండి. స్త్రీల (వల్ల ఉత్పన్నమయ్యే ఉపద్రవాల)కు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇస్రాయీల్ సంతతివారు మొట్ట మొదటిసారిగా స్త్రీల విషయంలోనే పరీక్షకు గురయ్యారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రేమైక వచనాల ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The life of the world is sweet and green. Allah makes you generations succeeding one another so that He may try you in respect of your actions. So beware of the beguilements of the world and those of women. The first trial of Banu Israel was through women”.[Muslim].

ముఖ్యాంశాలు

పండ్లు తినడానికి కమ్మగా మధురంగా ఉండి పైకి మనోహరంగా నిగనిగలాడుతూ కనిపించినట్లే ప్రపంచంలోని ప్రతి వస్తువూ మనిషికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించి అతణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. అలాంటి మనోహర వస్తువుల కోవకు చెందినదే స్త్రీ కూడాను. స్త్రీలు సృష్టించే ఉపద్రవాలు, వారి పన్నాగాలు చాలా భయంకరంగా ఉంటాయి. కనుక మానవులు ప్రపంచంలోని అందమైన వస్తువుల పై పై ఆకర్షణకు మోసపోకుండా ఆంతరంగిక సౌందర్యానికి, గుణవిశేషాలకు ప్రాధాన్యతనివ్వాలి. షరీఅత్ ఆదేశాలను లక్ష్యపెట్టకుండా ప్రాపంచిక ఆకర్షణలకు, స్త్రీ వ్యామోహానికి లోనైనవాడు ఇహపరాల్లోనూ పెద్ద నష్టానికి గురవుతాడనీ, ఇందుకు విరుద్ధంగా షరీఅత్ సూచించిన విధానం ప్రకారం ప్రాపంచిక వస్తువుల నుండి తగు రీతిలో ప్రయోజనం పొందేవాడు వాటి ఇంద్రజాలానికి మోసపోకుండా సురక్షితంగా ఉంటాడనీ ఈ హదీసు బోధపరుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|6. దైవభీతి|హదీసు 70

71

హదీసు 71

الثالثُ: عَنْ ابْنِ مَسْعُودٍ رضي اللَّه عنه أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَقُولُ: "اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدَى وَالتُّقَى وَالْعفافَ والْغِنَى" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా వేడుకునేవారని హజ్రత్ ఇబ్నె మస్‌ఊద్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : "ఓ దేవా! నేను నీ నుండి సన్మార్గాన్ని, భయభక్తులను, సౌశీల్యాన్ని, (ప్రజలపట్ల) నిరపేక్షతా భావాన్ని అర్థిస్తున్నాను." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని దైవధ్యాన ప్రకరణం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported that the Prophet ﷺ used to say: “Allahumma inni as’alukal-huda wat-tuqa wal-`afafa wal-ghina (O Allah! I ask You for guidance, piety, chastity and self-sufficiency)”.[Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసులో పేర్కొనబడిన దైవప్రవక్త గారి వేడుకోలు వచనాలలో ముందుగా సన్మార్గాన్ని (హిదాయత్‌ను) ప్రసాదించమని కోరుకోవటం జరిగింది. అంటే జీవితంలో అడుగడుగునా దైవం తనకు సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంపై ముందుకు నడిపించాలనీ, ఆ సన్మార్గంపైనే నిలకడగా ఉండేటట్లు చేయాలని అర్థం. తఖ్వా అంటే దైవం పట్ల భయభక్తుల్ని కలిగివుండటం. ఏదైనా మంచిపని చేయాలన్నా, ఏదైనా చెడుపనికి దూరంగా ఉండాలన్నా అంతర్గతంగా ప్రేరణవారణ భావాలతో మనిషికి ఈ దైవభీతే మార్గదర్శకత్వం వహిస్తుంది. సౌశీల్యం (ఇఫాఫ్) అంటే అల్లాహ్ నిషేధించిన విషయాల జోలికి పోకుండా ఉండటం. 'గినా' (నిరపేక్షాభావం) 'ఫఖ్ర్' (ఆపేక్ష)కు వ్యతిరేకపదం. అంటే మనసులోని నిరపేక్షాభావం. ప్రజలపట్ల, ప్రజల సొమ్ము పట్ల నిరపేక్షులుగా ఉండటమన్నమాట. అత్యంత సమగ్రమైన, భావగర్భితమైన ఈ వేడుకోలు వచనాలతో దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మేలుచేస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|6. దైవభీతి|హదీసు 71

72

హదీసు 72

الرَّابعُ: عَنْ أبي طَريفٍ عدِيِّ بْنِ حاتمٍ الطائِيِّ رضي اللَّه عنه قالَ: سَمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "مَنْ حَلَفَ عَلَى يمِين ثُمَّ رَأَى أتقَى للَّهِ مِنْها فَلْيَأْتِ التَّقْوَى "رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ తరీఫ్ అదీ బిన్ హాతిం తాయి (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: 'ఎవరికైనా ఏదైనా విషయమై ప్రమాణం చేసిన తరువాత, దైవభక్తిపరంగా అంతకన్నా మెరుగైన విషయం కనబడితే అప్పుడు ఆ దైవ భక్తితో కూడిన విషయాన్నే అతను ఆచరించాలి." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రమాణాల ప్రకరణం)

English

`Adi bin Hatim At-Ta’i (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ say: “He who has taken an oath (to do something) but found something else better than that (which brings him closer to Allah), then he should do that which is better in piety (and he should expiate for the breaking of oath)”.[Muslim].

ముఖ్యాంశాలు

స్థూలంగా ఈ హదీసులో మనిషి ఎల్లప్పుడూ దైవం పట్ల భయభక్తుల్ని కల్గివుండాలని నొక్కి వక్కాణించబడింది. ఆఖరికి ఎవరైనా తాను దైవ అవిధేయతకు పాల్పడతానని ప్రమాణం చేస్తే అటువంటప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి తన తప్పుడు ప్రమాణాన్ని భంగం చేసుకొని పరిహారాన్ని చెల్లించాలి. అంతేగాని నిజంగానే దైవ అవిధేయతకు, దైవభీతికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడకూడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|6. దైవభీతి|హదీసు 72

73

హదీసు 73

الْخَامِسُ: عنْ أبي أُمَامَةَ صُدَيَّ بْنِ عَجْلانَ الْباهِلِيِّ رضي اللَّهُ عنه قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَخْطُبُ في حَجَّةِ الْودَاع فَقَالَ: "اتَّقُوا اللَّه، وصَلُّوا خَمْسكُمْ، وصُومُوا شَهْرَكمْ، وأَدُّوا زكَاةَ أَمْوَالِكُمْ، وَأَطِيعُوا أُمَرَاءَكُمْ، تَدْخُلُوا جَنَّةَ رَبِّكُمْ" رواه التِّرْمذيُّ، في آخر كتابِ الصلاةِ وَقالَ: حديثٌ حسنٌ صحيح.

దైవప్రవక్త ﷺ తన అంతిమ కాబా యాత్ర (హజ్జతుల్ విదా) సందర్భంగా ప్రసంగిస్తూ ఇలా అన్నారని హజ్రత్ అబూ ఉమామ సుదై బిన్ అజ్లాన అల్ బాహ్లి (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: "అల్లాహ్‌కు భయపడండి. మీ (పై విధించబడిన) ఐదు పూటల నమాజులు చేస్తూ ఉండండి. మీ (రమజాన్) నెలలో ఉపవాసాలు పాటించండి. మీ సంపదల లోనుండి జకాత్ దానాన్ని చెల్లించండి. మీ పైఅధికారులకు విధేయత చూపండి. ఇలా చేస్తే మీరు మీ ప్రభువు స్వర్గంలోకి ప్రవేశిస్తారు." (తిర్మిజీ దీనిని నమాజు ప్రకరణం చివర్లో ఉల్లేఖించారు. ఇంకా దీనిని 'హసన్' మరియు 'సహీహ్'గా పేర్కొన్నారు.)

(సుననె తిర్మిజీలోని నమాజు అధ్యాయములలో ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Abu Umamah (radiyallahu anhu) said: I heard Messenger of Allah ﷺ during the sermon of the Farewell Pilgrimage saying, “Be mindful of your duty to Allah; perform your five daily Salat, observe Saum during the month (of Ramadan) , pay the Zakat on your properties and obey your leaders; (if you do so) you will enter the Jannah of your Rubb”.[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో 'హజ్జతుల్ విదా' (అంతిమ హజ్) అనే పదం వచ్చింది. అసలు 'విదా' అనేది 'తౌదీ' అనే పదం నుండి వచ్చింది. 'తౌదీ' అంటే వీడ్కోలు చెప్పడం. దైవప్రవక్త ﷺ తన జీవితంలో ఆఖరిసారిగా చేసిన కాబా యాత్రను 'హజ్జతుల్ విదా'గా వ్యవహరిస్తారు. ఒకవిధంగా దైవప్రవక్త ﷺ ఈ యాత్ర సందర్భంగానే ప్రజలందరికీ వీడ్కోలు పలికారు. అందుకే దీనికి 'హజ్జతుల్ విదా' (వీడ్కోలు హజ్) అనే పేరు వచ్చింది.
  2. విశ్వాసులు తమ పైఅధికారులకు, నాయకులకు విధేయత చూపాలని కూడా ఈ హదీసులో నొక్కిచెప్పబడింది. అయితే వారు దైవాదేశాలకు విరుద్ధంగా ఆజ్ఞలు జారీ చేస్తూ బాహాటంగా దైవతిరస్కార ధోరణిని అవలంబిస్తున్నపక్షంలో విశ్వాసులు అటువంటి అధికారులకు విధేయత కనబరచాలన్న నియమం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|6. దైవభీతి|హదీసు 73