హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 317. అలవాటుగా వచ్చే పొరపాటు ప్రమాణం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 317వ అధ్యాయం: ప్రమాణం చేసే ఉద్దేశ్యం లేకుండా అలవాటు ప్రకారం నోటి నుండి 'దైవసాక్షి!' లాంటి పదాలు వెలువడటం 'పొరపాటు ప్రమాణం' క్రిందికి వస్తుంది. ఇది క్షమార్హమైనది. దీనికి పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1721) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

317. ప్రమాణం చేసే ఉద్దేశ్యం లేకుండా అలవాటు ప్రకారం నోటి నుండి 'దైవసాక్షి!' లాంటి పదాలు వెలువడటం 'పొరపాటు ప్రమాణం' క్రిందికి వస్తుంది. ఇది క్షమార్హమైనది. దీనికి పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు

↑ విషయ సూచిక

باب العفو عن لغو اليمين وأنَّه لا كفارة فِيهِ، وَهُوَ مَا يجري عَلَى اللسان بغير قصد اليمين كقوله عَلَى العادة: لا والله، وبلى والله، ونحو ذَلِكَ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{لاَ يُؤَاخِذُكُمُ اللَّهُ بِاللَّغْوِ فِي أَيْمَانِكُمْ وَلَكِنْ يُؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُمُ الْأَيْمَانَ فَكَفَّارَتُهُ إِطْعَامُ عَشَرَةِ مَسَاكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ فَمَنْ لَمْ يَجِدْ فَصِيَامُ ثَلاثَةِ أَيَّامٍ ذَلِكَ كَفَّارَةُ أَيْمَانِكُمْ إِذَا حَلَفْتُمْ وَاحْفَظُوا أَيْمَانَكُمْ} [المائدة: ٨٩]

"మీరు చేసే అర్థంలేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కానీ మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి) పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టటం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వటం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యటం. ఈ స్తోమత లేనివారు మూడురోజులపాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి." (అల్‌మాయిద: 89)

ముఖ్యాంశాలు

ఒక విషయం ఆ విధంగా జరగకపోయినప్పటికీ దాని గురించి తనకు తెలిసినది చెబుతూ దాని మీద ప్రమాణం చేయటం లేదా ప్రమాణం చేసే ఉద్దేశ్యం లేకపోయినా అలవాటు ప్రకారం నోటి నుండి దైవంసాక్షి! అనే పదాలు వెలువడటాన్ని పొరపాటు వల్ల జరిగే ప్రమాణాలుగా భావించవచ్చు. ఈ ప్రమాణాలు అబద్ధాలుగా తేలినా వాటికి పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు. పరలోకంలో కూడా వీటి గురించి ప్రశ్నించటం జరగదు. ప్రమాణాలను కాపాడుకోవటమంటే ప్రతి చిన్న విషయానికీ ప్రమాణం చేయకుండా ఉండటం, చేసిన ప్రమాణాలను పూర్తి చేయటం అని భావం.

English

“Allah will not punish you for what is unintentional in your oaths, but He will punish you for your deliberate oaths; for its expiation (a deliberate oath) feed ten Masakin (poor persons), on a scale of the average of that with which you feed your own families, or clothe them or manumit a slave. But whosoever cannot afford (that), then he should observe fast for three days. That is the expiation for the oaths when you have sworn. And protect your oaths (i.e., do not swear much).” [Al-Mā’idah 5:89]

1721

హదీసు 1721

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللَّه عَنْهَا قَالَتْ: أُنْزِلَتْ هَذِهِ الآيَةُ: {لاَ يُؤَاخِذُكُمْ اللَّه بِاللَّغْو في أَيْمَانِكُمْ} في قَوْلِ الرَّجُلِ: لا واللَّهِ، وَبَلى واللَّهِ. رواه البخاري.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: "మీరు చేసే అర్థంలేని ప్రమాణాల విషయంలో అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు" అనే దివ్యఖుర్‌ఆన్ సూక్తి (ప్రమాణ ఉద్దేశ్యం లేకుండా మాటిమాటికీ) "దైవంసాక్షి! ఎందుకు కాదు దైవం సాక్షి" అని అంటూ ఉండేవాని విషయంలో అవతరించింది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని తఫ్సీర్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Ayah: “Allah will not punish you for what is unintentional in your oaths …” was revealed in respect of those persons who are in the habit of repeating: `No, by Allah’; and `Yes, by Allah.’[Al-Bukhari].

ముఖ్యాంశాలు

1) ఇంతకు ముందు అధ్యాయంలో, ఈ అధ్యాయంలో వచ్చిన సూక్తుల్ని గమనిస్తే మనకు మూడు రకాల ప్రమాణాలున్నట్లు తెలుస్తుంది. ఒకటి అబద్ధపు ప్రమాణం; దీని గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. రెండోది పొరపాటు వల్ల చేసే ప్రమాణం; దీనికి పాపంగాని, పరిహారంగాని లేదు. ఇకపోతే మూడోది యమీనె మున్‌అఖిదహ్. అంటే భవిష్యత్తులో ఏదో ఒక పని చేస్తాననో లేక చెయ్యను అనో మనస్ఫూర్తిగా ప్రమాణం చేయటం. ఈ ప్రమాణాన్ని భంగపరిస్తే పైన దివ్యఖుర్‌ఆన్ సూక్తిలో పేర్కొనబడినట్లు పరిహారం చెల్లించవలసి ఉంటుంది.

2) ప్రమాణ భంగానికి చెల్లించవలసిన పరిహారంలో పదిమంది నిరుపేదలకు మధ్యరకపు అన్నం తినిపించాలని ప్రస్తావించబడింది. కాని ఆ అన్నం [ప]రిమాణం ఎంత ఉండాలి? అన్న విషయంలో మాత్రం ప్రామాణిక హదీసులు ఏవీ లేవు. కొందరు పండితులు ఉదయం మరియు రాత్రి భోజనమంత అని పేర్కొన్నారు. మరికొందరు- రమజాన్ నెలలో ఉపవాసం ఉండి భార్యతో సంభోగించేవాడు చెల్లించవలసిన పరిహారం ప్రస్తావన ఉన్న హదీసుని నిదర్శనంగా చేసుకొని ప్రమాణ భంగానికి కూడా ఒక్కో నిరుపేదకు ఒక 'ముద్' ఆహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆ హదీసులో దైవప్రవక్త ﷺ అరవైమంది నిరుపేదలకు పంచిపెట్టటం కోసం సదరు వ్యక్తికి పదిహేను 'సా'ల ఖర్జూరాలు ఇచ్చారు. ఒక 'సా' నాలుగు 'ముద్'లకు సమానమైన కొలమానం. ఈ విధంగా పదిమంది నిరుపేదలకు కూరతో నిమిత్తం లేకుండా పది ముద్‌ల (దాదాపు 6 1/4 కి.గ్రా.ల) ఆహారం ఇవ్వవలసి ఉంటుంది (ఇబ్నెకసీర్). అంటే ఆరు కిలోల పిండిగాని, బియ్యంగాని, ఖర్జూరపండ్లుగాని ఇవ్వాలి. ఒకవేళ చెలామణి ప్రకారం పదిమంది నిరుపేదలకు ఒకపూట మధ్యరకపు అన్నం తినిపించినా మా దృష్టిలో అది సరిపోతుంది. వాస్తవం అల్లాహ్‌కే బాగా తెలుసు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|317. ప్రమాణం చేసే ఉద్దేశ్యం లేకుండా అలవాటు ప్రకారం నోటి నుండి 'దైవసాక్షి!' లాంటి పదాలు వెలువడటం 'పొరపాటు ప్రమాణం' క్రిందికి వస్తుంది. ఇది క్షమార్హమైనది. దీనికి పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు|హదీసు 1721