హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 304. వేటినీ దుశ్శకునంగా భావించరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 304వ అధ్యాయం: వేటినీ దుశ్శకునంగా భావించరాదు. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1676 – 1679) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

304. వేటినీ దుశ్శకునంగా భావించరాదు

↑ విషయ సూచిక

باب النهي عن التَّطَيُّرِ فِيهِ الأحاديث السابقة في الباب قبله.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

ఇంతకుముందు అధ్యాయంలో వచ్చిన హదీసులు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తాయి. (మరిన్ని హదీసులు క్రింద పేర్కొనటం జరుగుతోంది.)

1676

హదీసు 1676

وعنْ أنَسٍ رضي اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا عَدْوَى وَلاَ طِيَرَةَ ويُعْجِبُنى الفألُ"قالُوا: ومَا الْفَألُ؟ قَالَ:"كَلِمةٌ طيِّبَةٌ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "అంటు, దుశ్శకునం అనేవి ఒట్టిమాటలే. అయితే శకునం అంటే నాకిష్టం."

అది విని అనుచరులు, "శకునం ఏమిటి?" అని అడిగారు. అందుకాయన, "మంచి మాట (వినటం, మంచి జరుగుతుందని ఆశించటం)" అని చెప్పారు.

(సహీహ్ బుఖారీలోని తిబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలామ్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Not the transmission of disease of one person to another and no evil omen, but I am pleased with good omens.” He was asked: “What is good omen?” He replied, “A good word.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

'అంటు' అంటే అంటు వ్యాధులన్న మాట. పై హదీసును మొట్టమొదటగా చదివేవారు తప్పకుండా కొంత ఆశ్చర్యానికి లోనవుతారు. ఎందుకంటే పై హదీసు అంటువ్యాధులనేవి అసలు ఉండవని అంటోంది. కాని మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా ఎన్నో అంటువ్యాధులు మన చుట్టూ సమాజంలో ప్రబలి ఉన్నాయి. మరి ఈ హదీసు వాస్తవ విరుద్ధం కాదా! అని మనకు అనిపించవచ్చు. నిజానికి ఈ హదీసు భావం అది కాదు. ఎందుకంటే కొన్ని వ్యాధులు ఒకరి ద్వారా మరొకరికి సోకే అవకాశాలు ఉంటాయని తెలిపే సంఘటనలు, దృష్టాంతాలు హదీసుల్లో కూడా ఎన్నో ఉన్నాయి. (ఉదాహరణకు ఈ గ్రంథంలోనే 361వ అధ్యాయం క్రింది హదీసులు చూడండి).

ఈ హదీసు యొక్క అసలు ఉద్దేశం మనిషి విశ్వాసాన్ని, అతని నమ్మకాన్ని క్రమబద్ధీకరించటం, మనిషికి దేవునిపై ఉండవలసిన అచంచల విశ్వాసం పట్టుసడలి అతని నమ్మకమంతా భౌతిక కారణాల మీద కేంద్రీకృతం కాకుండా చేయటం. ఒక వ్యక్తి ద్వారా మరో వ్యక్తికి అంటువ్యాధి సోకినప్పుడు దానికి పూర్తిగా మొదటి వ్యక్తే కారణమని అనుకోవటం సమంజసం కాదు. అలాగాకుండా ఏ విధంగా మొదటి వ్యక్తి దైవం తలచిన కారణంగా వ్యాధికి లోనయ్యాడో రెండో వ్యక్తి కూడా అలాగే దైవచిత్తం మూలంగానే వ్యాధికి గురయ్యాడని భావించటమే సరైనది. కావాలంటే చూడండి. ఒక్కోసారి అంటువ్యాధి రోగి చుట్టుప్రక్కల వాళ్ళెవరికీ సోకకుండా ఎక్కడో దూరాన ఉన్న వారికి సోకుతుంది. మరి ఈ విధంగా జరగటానికి బాహ్యాపరమైన కారణాలు మీరు ఎన్నయినా చెప్పుకోండి. అంతిమంగా ఆ కారణాలను సృష్టించినవాడు మాత్రం అల్లాహ్‌యే కదా! ఆ విశ్వాసం జారిపోకూడదన్నదే పై హదీసు ఉద్దేశం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|304. వేటినీ దుశ్శకునంగా భావించరాదు|హదీసు 1676

1677

హదీసు 1677

وعَنْ ابْنِ عُمَرَ رضي اللَّه عَنْهُما قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: لا عَدْوى وَلا طِيَرَةَ، وإنْ كَان الشُّؤمُ في شَىْءٍ، فَفي الدَّارِ، والمَرْأةِ وَالفَرَسِ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్(రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అంటు, దుశ్శకునాలనేవి ఏమీ లేవు. అపశకున మనేది ఒకవేళ ఉంటే ఇంట్లో, స్త్రీలో, గుర్రంలో ఉండాలి. (బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తిబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలామ్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “There is no infection and no evil omen; but if there is anything (that may be a source of trouble) then it could be a house, a horse, and a woman.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

వాస్తవానికి ఏ వస్తువూ అపశకునం కాదుగాని, తమలోని కొన్ని లక్షణాల మూలంగా కొన్ని వస్తువులు కొందరిపాలిట అపశకునంగా పరిణమించవచ్చు. ఉదా: ఇల్లు ఇరుకుగా ఉండటం, ఇరుగుపొరుగువారు మంచివారు కాకపోవటం మొదలగునవి. ఇలాంటి ఇంట్లో మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. ఒకవేళ భార్య గొడ్రాలో లేక దుర్భాషలాడేదో, నీతిచెడిందో అయినప్పుడు అలాంటి స్త్రీ భర్తపాలిట అపశకునంగా తయారవుతుంది. ఆమె వల్ల భర్తకు మనశ్శాంతికి బదులు బాధలు, కష్టాలు వస్తాయి. అలాగే గుర్రాన్ని దైవమార్గంలో జిహాద్ కోసం ఉపయోగించనప్పుడు లేక అది సరిగా పరుగెత్తలేకపోయినప్పుడు ఆ గుర్రం తన యజమానిపాలిట అపశకునంగా తయారవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|304. వేటినీ దుశ్శకునంగా భావించరాదు|హదీసు 1677

1678

హదీసు 1678

وعَنْ بُريْدةَ رضِيَ اللَّه عَنْهُ أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ لا يتطَيَّرُ. رَواهُُ أبُو داود بإسنادٍ صحيحٍ.

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ దుశ్శకునాలు చూసేవారు కాదు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు.)

(సుననె అబూదావూద్‌లోని తిబ్ ప్రకరణం)

English

Buraidah (radiyallahu anhu) said: The Prophet never took ill omens.[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|304. వేటినీ దుశ్శకునంగా భావించరాదు|హదీసు 1678

1679

హదీసు 1679

وَعنْ عُرْوَةَ بْنِ عامِرِ رضي اللَّه عَنْهُ قَالَ: ذُكِرتِ الطَّيَرَةُ عِنْد رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقَالَ: "أحْسَنُهَا الْفَألُ، وَلا تَرُدُّ مُسْلِماً، فَإذا رَأى أحَدُكُمْ ما يَكْرَه، فَلْيقُلْ: اللَّهُمَّ لاَ يَأتى بالحَسَناتِ إلاَّ أنتَ، وَلا يَدْفَعُ السَّيِّئاتِ إلاَّ أنْتَ، وَلا حوْلَ وَلا قُوَّةَ إلاَّ بِكَ" حديثٌ صَحيحٌ رَوَاهُ أبو داودُ بإسنادٍ صَحيحٍ

హజ్రత్ ఉర్వా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ దగ్గర శకునం గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడాయన ఇలా అన్నారు: శకునాలన్నిటిలో మంచి శకునం ఉత్తమమైనది. అపశకునం చూసి ముస్లిం తన పని మానేయరాదు. మీలో ఎవరికయినా తమకు నచ్చని విషయం ఎదురైతే ఈ విధంగా ప్రార్థించి (పని కొనసాగించాలి) "అల్లాహ్! మేలు చేసేవాడివి నీవే. కీడును తొలగించేవాడివి కూడా నీవే. చెడుల నుండి కాపాడుకోవాలన్నా మంచిపనులు చేయాలన్నా నీ శక్తితోనే సాధ్యమవుతుంది."

(ఈ హదీసు 'సహీహ్' కోవకు చెందినది. అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.)

(సుననె అబూదావూద్‌లోని తిబ్ ప్రకరణం)

English

`Urwah bin `Amir (radiyallahu anhu) said: When talking of omens was mentioned in the presence of the Messenger of Allah ﷺ he said, “The best type of omen is the good omen.” He added, “A Muslim should not refrain from anything because of an omen.” He ﷺ told them, “When any of you sees anything which he dislikes, he should say: `Allahuma la ya’ti bil-hasanati illa Anta, wa la yadfa`us-sayyi’ati illa Anta, wa la hawla wa la quwwata illa Bika (O Allah ! You Alone bring good things; You Alone avert evil things, and there is no might or power but in You).”’[Abu Dawud with Sahih Isnad].

ముఖ్యాంశాలు

1) 'తియరహ్' అనే పదానికి అసలు అర్థం మంచి లేక చెడు శకునాలు చూడటం. కాని ముస్లిం అయిన వ్యక్తి అన్నిటినీ మంచి శకునాలుగానే భావిస్తాడు. అతను ఏదయినా పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అపశకునాలను పట్టించుకోడు. వాటి మూలంగా తన పనులు పాడుచేసుకోడు. పైగా మంచిజరిగినా చెడు జరిగినా దైవం తలచుకుంటేనే జరుగుతుందని నమ్ముతాడు. తనకు శుభం కలగాలని దైవాన్ని వేడుకుంటాడు.

2) సాధారణంగా ప్రజలు అపశకునంగా భావించే విషయాలు ఎదురయినప్పుడు లేక మనసులో దురాలోచనలు కలిగినప్పుడు పైన పేర్కొనబడిన దుఆ పఠించి పని కొనసాగించటం అభిలషణీయం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|304. వేటినీ దుశ్శకునంగా భావించరాదు|హదీసు 1679