హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 237. బానిసల పట్ల సద్వ్యవహారం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 237వ అధ్యాయం: బానిసల పట్ల సద్వ్యవహారం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 1361 – 1362) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

237. బానిసల పట్ల సద్వ్యవహారం

↑ విషయ సూచిక

باب فضل الإِحْسَان إِلَى المملوك

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَاعْبُدُوا اللَّهَ وَلا تُشْرِكُوا بِهِ شَيْئاً وَبِالْوَالِدَيْنِ إِحْسَاناً وَبِذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَى وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ} [النساء: ٣٦]

"అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములు చేయవద్దు. తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధులూ నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి." (నిసా: 36)

English

“Worship Allah and join none with Him (in worship); and do good to parents, kinsfolk, orphans, Al-Masakin (the poor), the neighbour who is near of kin, the neighbour who is a stranger, the companion by your side, the wayfarer (you meet), and those (slaves) whom your right hands possess.” [An-Nisā’ 4:36]

1361

హదీసు 1361

وعنِ المَعْرُور بن سُويْدٍ قالَ: رأَيْتُ أَبَا ذَرٍّ، رضِيَ اللَّه عَنْهُ، وعليهِ حُلَّةٌ، وعَلى غُلامِهِ مِثْلُهَا، فَسَألْتُهُ عَنْ ذَلِكَ، فَذكر أنَّه سَابَّ رَجُلاً عَلَى عهْدِ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَعَيَّرَهُ بأُمِّهِ، فَقَال النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّك امْرُؤٌ فِيك جاهِليَّةٌ": هُمْ إخْوانُكُمْ، وخَولُكُمْ، جعَلَهُمُ اللَّه تَحت أيدِيكُمْ، فَمَنْ كَانَ أَخُوهُ تَحت يَدهِ فليُطعِمهُ مِمَّا يَأْكلُ، وَلْيُلْبِسْهُ مِمَّا يلبَسُ، وَلاَ تُكَلِّفُوهُم مَا يَغْلبُهُمْ، فَإنْ كَلَّفتُمُوهُم فَأَعِينُوهُم "،متفقٌ عَلَيْهِ.

హజ్రత్ మారూర్ బిన్ సువైద్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు: నేనొకసారి అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు)గార్ని చూశాను. ఆ సమయంలో ఆయన, ఆయన బానిస ఇద్దరూ ఒకేరకమైన దుస్తులు ధరించి ఉన్నారు. నేను (మీ బానిసకు కూడా అలాంటి బట్టలే ఎందుకు తొడిగించారని) అడిగాను. అందుకాయన సమాధానమిస్తూ ఈ విధంగా వివరించారు.

"దైవప్రవక్త ﷺ కాలంలో నేనో (బానిస) వ్యక్తిని తిట్టాను. అతని తల్లిని గురించి ప్రస్తావించి ఎత్తిపొడిచాను. (ఎలాగో ఈ విషయం దైవప్రవక్త ﷺకు తెలిసింది) అప్పుడాయన (నన్ను మందలిస్తూ) ఇలా అన్నారు:

"అబూ జర్ర్! నీలో ఇంకా ఆ అజ్ఞానం పోలేదయ్యా. (అసలు మీరు బానిసల్ని గురించి ఏమనుకుంటున్నారు?) వారు మీ సోదరుల్లాంటి వారు. దేవుడు వారిని మీ అధీనంలో ఉంచాడు. వారు మీకు సేవ చేస్తున్నారు. కనుక తమ అధీనంలో ఉండే సోదరులకు తాము తినేటటు వంటి తిండే పెట్టాలి. తాము తొడిగేటటువంటి బట్టలే వారికీ తొడిగించాలి. మీరు మోయలేని భారాన్ని వారిపై మోపకండి. ఒకవేళ (అవసరం వల్ల) మోపినా మీరు కూడా వారికి సహాయపడండి."

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని బానిస విమోచన ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రమాణాల ప్రకరణం)

English

Al-Ma`rur bin Suwaid (radiyallahu anhu) reported: I saw Abu Dharr (radiyallahu anhu) wearing a nice gown, and his slave was also wearing one similar to it. I asked him about it, and he said that he had exchanged harsh words with a person during the lifetime of the Messenger of Allah ﷺ and put him to shame by making a reference to his mother. That person came to the Messenger of Allah ﷺ and made mention of that to him. Thereupon the Messenger of Allah said, “You are a person who has remnants of the `Days of Ignorance’ in you. Your slaves are your brothers. Allah has placed them under your authority. He who has his brother under him, should feed him from whatever he eats, and dress him with whatever he wears, and do not burden them (assign burdensome task to them) beyond their capacity; and if you burden them then help them.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

తమ అధీనంలో ఉండే బానిసల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఈ హదీసు తాకీదు చేస్తోంది. అయితే ఆ ఉత్తమ వ్యవహారం ఎలా ఉండాలి? దానికి ప్రమాణం ఏమిటి? ఈ విషయం కూడా ఇందులో వివరించబడింది. తాము తినే మంచి ఆహారమే తమ బానిసలకూ తినిపించాలి. తాము తొడిగే దుస్తుల్లాంటి దుస్తులే వారికి కూడా ఇవ్వాలి. వారిని తమ పర్యవేక్షణలో ఉన్న సోదరులుగా భావించాలి. మొత్తానికి వారి జీవిత ప్రమాణం కూడా తమ జీవిత ప్రమాణానికి తగ్గట్టుగా ఉండేందుకు సహాయపడాలి. బానిసలు ఇస్లాం స్వీకరించిన వారయితే ధర్మం రీత్యా వారు తమ సోదరులవుతారు. లేదా కనీసం మానవత రీత్యానన్న వారిని తమ సోదరులుగానే భావించాలి. వారూ మనుషులేననీ, తమకులాగే వారికి కూడా అవసరాలుంటాయనే విషయాన్ని మర్చిపోరాదు. అగత్యపరుల పట్ల ఎల్లప్పుడూ సానుభూతిని ప్రదర్శించాలని ఇస్లాం ధర్మం నొక్కివక్కాణిస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకొని మన ఇండ్లల్లో పనిచేసే నౌకర్లు లేదా మన దగ్గర పనిచేసే కూలీల, ఉద్యోగుల పట్ల కూడా ఉత్తమంగా వ్యవహరించటం, వారి పట్ల సానుభూతిని ప్రదర్శించటం అవసరమని చెప్పవచ్చు. అలాంటి వారి నుండి కూడా వారి శక్తికి మించిన పని తీసుకోకూడదు. వారిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవటానికి ప్రయత్నించరాదు. వారు బానిసలు కాకపోవచ్చు. కాని వారు మరొకరికి తలొగ్గి పనిచేస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అలాంటివారిపట్ల కరకుగా, అసభ్యకరంగా ప్రవర్తించటం ఎంత మాత్రం సమంజసం కాదు.

ఈ ఉపదేశాల ద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ధర్మం సర్వమానవ సమానత్వాన్ని కోరుతోంది. మానవుల మధ్య వర్ణ, వర్గ, ఉచ్ఛనీచ, నిమ్నోన్నతా భావాలను రూపుమాపి వారి మధ్య సామాజిక న్యాయ సంస్థాపనకు, సమానత్వ సౌధ నిర్మాణానికి అది ఏనాడో పునాదిరాళ్ళు వేసింది. ఈనాడు మానవుల మధ్య సంబంధాలు మెరుగుపడటంలో ఇస్లాం పోషించిన పాత్ర అద్వితీయమైనది. వర్గ వైషమ్యాలను రూపుమాపటం కోసం ఇస్లాం ధర్మం శాంతియుతమైన, మౌనవిప్లవాన్ని అనుసరించింది. అది కార్మికుల్ని కూడగట్టి, దళితుల పార్టీలు స్థాపించి పెట్టుబడిదారీ వర్గం మీద, సంపన్నుల మీద విజృంభించి అమాయకుల రక్తపాతాన్ని సృష్టించమని చెప్పదు. ఇలాంటి హింసాత్మక విధానాల వల్ల సమాజంలోని వివిధ వర్గాల మధ్య విద్వేషం, వైషమ్యాలు పెచ్చరిల్లుతాయి. రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించి ప్రజలు అశాంతి అలజడుల వాతావరణంలో జీవితం గడపాల్సివస్తుంది. దీనికి భిన్నంగా ఇస్లాం ధర్మం బానిసలు – యజమానుల మధ్య , కూలీలు – కాంట్రాక్టర్ల మధ్య సోదర, సమానత్వ భావాలను పెంపొందింపజేసింది. సమాజంలోని వర్గాలవారందరూ నిమ్నోన్నతాభావాల్ని విడనాడి పరస్పరం ప్రేమాభిమానాలతో, ఆప్యాయతానురాగాలతో జీవితం గడపాలని నొక్కి వక్కాణించింది. అదీగాక ఇస్లాంలో ఒక వ్యక్తి శీలనిర్మాణం కులం ప్రాతిపదిక మీదనో లేక ఆస్తి అంతస్తుల ప్రాతిపదిక మీదనో జరగదు. మీలో ఎవరయితే ఎక్కువగా దైవానికి భయపడతారో వారే అందరికన్నా శ్రేష్ఠులు అని ప్రకటిస్తోంది దివ్యఖుర్‌ఆన్. అలాంటి దైవభక్తిపరులు ధనికులయినా కావచ్చు నిరుపేదలయినా కావచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|237. బానిసల పట్ల సద్వ్యవహారం|హదీసు 1361

1362

హదీసు 1362

وَعَنْ أَبي هُريرَةَ، رضي اللَّه عَنْهُ، عَن النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: قالَ: "إِذَا أَتى أحدَكم خَادِمُهُ بِطَعامِهِ، فَإنْ لَمْ يُجْلِسْهُ معهُ، فَليُناولْهُ لُقمةً أوْ لُقمَتَيْنِ أوْ أُكلَةً أوْ أُكلَتَيْنِ، فَإنَّهُ ولِيَ عِلاجهُ" رواه البخاري. "الأُكلَةُ"بضم الهمزة: هِيَ اللُّقمَةُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలో ఎవరి దగ్గరికయినా అతని సేవకుడు అన్నం (వండి) తెస్తే (అతన్ని కూడా తమ వెంట కూర్చోబెట్టుకొని తినిపించాలి) ఒకవేళ తమవెంట కూర్చోబెట్టుకోవటానికి వీలుకాకపోతే అతనికి ఒకటి రెండు ముద్దలయినా పెట్టాలి. అతను (వంటవార్పు) బాధ భరించి నందుకుగాను అలా చేయటం (ధర్మం).

(బుఖారీ)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When your servant brings food for you and you do not seat him with you, you should at least give him a morsel or two out of it because he has prepared it himself.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

కేవలం అన్నం విషయంలోనే కాదు, ఇతర తినుబండారాలు, నిత్యావసర వస్తువుల విషయంలోనూ ఇలాగే ఉదారబుద్ధితో వ్యవహరించాలి. ఇంట్లో పనిచేసే నౌకర్లు, పనివాళ్ళతో కలిసి భోంచేస్తే చాలా మంచిది. ఒకవేళ పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోతే తమ ఆహారంలోనుంచే వారికి కూడా కొంత పెట్టాలి లేదా వారికోసం మరేదయినా ఏర్పాటు చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|237. బానిసల పట్ల సద్వ్యవహారం|హదీసు 1362