హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 211. కృతజ్ఞతా పూర్వక సజ్దా

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 211వ అధ్యాయం: భౌతిక వరమేదయినా ప్రాప్తించినప్పుడు లేదా బాహ్యాపరమైన ఆపదలేవయినా తొలగిపోయినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా దైవసన్నిధిలో మోకరిల్లటం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1160) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

211. భౌతిక వరమేదయినా ప్రాప్తించినప్పుడు లేదా బాహ్యాపరమైన ఆపదలేవయినా తొలగిపోయినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా దైవసన్నిధిలో మోకరిల్లటం అభిలషణీయం

↑ విషయ సూచిక

باب استحباب سجُود الشكرعند حصول نعمة ظاهرة أَو اندفاع بلية ظاهرة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1160

హదీసు 1160

عَنْ سَعْدِ بنِ أَبي وَقَّاصٍ رَضِيَ اللَّه عنْهُ قَالَ: خَرَجْنَا مَعَ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِن مَكَّةَ نُرِيدُ المَدِينَةَ، فَلَمَّا كُنَّا قَرِيبًا مِن عَزْوَراءَ نَزَلَ ثُمَّ رَفَعَ يَدَيْهِ، فدعَا اللَّه سَاعَةً، ثُمَّ خَرَّ سَاجِدًا، فَمَكَثَ طَوِيلاً، ثُمَّ قامَ فَرَفَعَ يَدَيْهِ، ساعَةً، ثُمَّ خَرَّ ساجِدًا فَعَلَهُ ثَلاثاً وَقَالَ: "إِنِّي سَأَلْتُ رَبِّي، وَشَفَعْتُ لأُمَّتِي، فَأَعْطَاني ثُلُثَ أُمَّتي، فَخَررتُ سَاجِداً لِرَبِّي شُكرًا، ثُمَّ رَفعْتُ رَأْسِي، فَسَأَلْتُ رَبِّي لأُمَّتي، فَأَعْطَانِي ثُلثَ أُمَّتي، فَخررْتُ سَاجِداً لربِّي شُكراً، ثمَّ رَفعْت رَأسِي فَسَألتُ رَبِّي لأُمَّتي، فَأعطاني الثُّلُثَ الآخَرَ، فَخَرَرتُ ساجِدا لِرَبِّي" رواه أَبُو داود.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం: మేమొకసారి దైవప్రవక్త ﷺ వెంట మదీనా వెళ్ళాలనే ఉద్దేశ్యంతో మక్కా నుండి బయలుదేరాం. ఆ విధంగా ప్రయాణం చేస్తూ వేము 'అజ్‌వరా' అనే ప్రాంతం దరిదాపులకు చేరుకున్నాక, ఆయన తన వాహనం మీది నుంచి క్రిందికి దిగి చేతులు రెండూ పైకెత్తి కాసేపు దేవుణ్ణి ప్రార్ధించారు. తర్వాత సజ్దా చేశారు. చాలా సేపటి వరకు అదే స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత లేచి నిలబడి కాసేపు చేతులెత్తి ప్రార్థించారు. ఆ తర్వాత మళ్ళీ (దైవసన్నిధిలో) మోకరిల్లారు. ఆయన మూడుసార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఇలా అన్నారు:

"నేను నా ప్రభువుని అర్ధించాను. నా అనుచర సమాజం గురించి సిఫారసు చేశాను. దానికి దేవుడు నా అనుచర సమాజంలోని మూడోవంతు ప్రజల (గురించి సిఫారసు చేయటానికి నాకు అనుమతి)నిచ్చాడు. అప్పుడు నేను కృతజ్ఞతా పూర్వకంగా నా ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడ్డాను. తర్వాత తలపైకెత్తి అనుచర సమాజ శ్రేయస్సు కోసం నా ప్రభువుని ప్రార్థించాను. దానికాయన మరో మూడోవంతు ప్రజల (గురించి సిఫారసు చేయటానికి అనుమతి)నిచ్చాడు. అందుకు నేను కృతజ్ఞతా పూర్వకంగా నా ప్రభువు సన్నిధిలో మోకరిల్లాను. ఆ తర్వాత తలపైకెత్తి మళ్ళీ నా అనుచర సమాజ శ్రేయస్సు కోసం నా ప్రభువును ప్రార్థించాను. దానికాయన ఇంకో మూడోవంతు ప్రజల (గురించి సిఫారసు చేయటానికి నాకు అనుమతి)నిచ్చాడు. అప్పుడు నేను కృతజ్ఞతా పూర్వకంగా నా ప్రభువు సన్నిధిలో మోకరిల్లాను. (అబూదావూద్)

(సుననె అబూదావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: We left Makkah with the Messenger of Allah ﷺ for Al-Madinah, and when we were near `Azwara,’ he ﷺ alighted (from his riding-camel) raised his hands in supplication to Allah for a while and prostrated himself. He remained for a long time in prostration. Then he stood up and raised his hands for a while, after which he prostrated himself (again), and remained for a long time in prostration. Then he stood up and raised his hands for a while, after which he prostrated himself for the third time. Then he ﷺ said, “I supplicated my Rubb and made intercession for my Ummah, and He granted me one-third of them. So I again prostrated myself in gratitude to my Rubb. Then I raised my head and supplicated my Rubb for my Ummah, and He granted me another third of them. Again I raised my head and supplicated my Rubb for my Ummah and He granted me the last third of them. So I fell into prostration out of gratitude before my Rubb.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

స్థూలంగా ఈ హదీసు భావం ఏమిటంటే, ముహమ్మదీయ అనుచర సమాజంలోని వారందరూ అంతిమంగా స్వర్గానికే వెళతారు. ముస్లింలలో ఎవరూ కూడా నరకంలో శాశ్వత శిక్షను అనుభవించరు. కొందరు నరకంలో కొంతకాలం శిక్షననుభవించి స్వర్గానికి వెళ్తే, మరికొందరు దైవప్రవక్త సిఫారసు మూలంగా స్వర్గానికి వెళ్తారు. ఇంకొందరు ప్రత్యేక దైవానుగ్రహం చేత స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఈ విషయం ముమ్మాటికీ సరయినదే. ఇతర ఎన్నో హదీసులు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. కాని సదరు అధ్యాయం క్రింద పేర్కొనబడిన హదీసు మాత్రం ప్రామాణికమైనది కాదు. షేఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) ఈ హదీసుని బలహీనమైనదిగా ఖరారు చేశారు. ఇకపోతే కృతజ్ఞతాపూర్వకంగా దైవసన్నిధిలో మోకరిల్లే విషయాన్ని తెలియపరచటం కోసం గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద పొందుపరచారు. ఈ హదీసు బలహీనమైనదయినప్పటికినీ ఇతర ఎన్నో ప్రామాణికమైన హదీసులు ఈ హదీసులోని భావాన్ని సమర్ధిస్తున్నాయి. కనుక సంతోష సమయాల్లో, ఆపదలు తొలగి పోయినప్పుడు కృతజ్ఞతాభావంతో దైవసన్నిధిలో మోకరిల్లటం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ తన పశ్చాత్తాపం ఆమోదించబడిందన్న శుభవార్త విన్నప్పుడు, దైవం పట్ల కృతజ్ఞతా భావంతో మోకరిల్లారని సహీహ్ బుఖారీ గ్రంథంలో ఉంది. ఆ వృత్తాంతం ఈ గ్రంథంలో కూడా ఎంతో విపులంగా వివరించబడింది. (మొదటి భాగంలోని 21వ హదీసు చూడండి).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|211. భౌతిక వరమేదయినా ప్రాప్తించినప్పుడు లేదా బాహ్యాపరమైన ఆపదలేవయినా తొలగిపోయినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా దైవసన్నిధిలో మోకరిల్లటం అభిలషణీయం|హదీసు 1160