హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 162వ అధ్యాయం: మృతుని తరఫు నుండి దానధర్మాలు చేయటం, అతని శ్రేయస్సు కొరకు ప్రార్థించటం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 948 – 949) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
162. మృతుని తరఫు నుండి దానధర్మాలు చేయటం, అతని శ్రేయస్సు కొరకు ప్రార్థించటం
باب الصدقة عن الميت والدعاء لَهُ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు :
{وَالَّذِينَ جَاءُوا مِنْ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْأِيمَانِ} [الحشر: ١٠]
"వారి తర్వాత వచ్చిన వారు ఇలా ప్రార్థిస్తారు: ఓ ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు." (అల్ హష్ర్ : 10)
వివరణ :
పైన పేర్కొన్న సూక్తిలో "వారి తర్వాత వచ్చినవారు" అంటే తాబయీన్లు, వారి తర్వాత ప్రళయం వరకు వస్తూ ఉండే ముస్లింలని అర్థం. అసలు "వారు" అంటే దైవప్రవక్త అనుచరులని భావం. ఈ సూక్తిలో తమ తర్వాతి తరాల మన్నింపు కొరకు, తమ సమకాలికుల మన్నింపు కొరకు ప్రార్థన ఉంది. పై సూక్తిని నిదర్శనంగా తీసుకొని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) మృతుని శ్రేయస్సు కోసం ప్రార్థించవచ్చని అంటున్నారు. అలాగే మృతుని తరఫు నుండి దానధర్మాలు కూడా చేయవచ్చని ఇతర హదీసుల ద్వారా బోధపడుతోంది. కనుక ఈ రెండు మార్గాల ద్వారా మృతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు.
English
“And those who came after them say: `Our Rubb! Forgive us and our brothers who have preceded us in Faith.”’ [Al-Ḥashr 59:10]
హదీసు 948
وعَنْ عائِشَةَ رَضيَ اللَّهُ عَنْهَا أَنَّ رَجُلاً قَالَ للنَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إنَّ أُمِّي افتُلتَتْ نَفْسُهَا وَأُرَاهَا لَوْ تَكَلَّمَتْ، تَصَدَّقَتْ، فَهَل لهَا أَجْرٌ إنْ تصَدَّقْتُ عَنْهَا؟ قَالَ:"نَعَمْ ". متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. ఆమెకు ఆ సమయంలో మాట్లాడే అవకాశం లభించి ఉంటే ఆమె తన తరఫున దానధర్మాలు చేయమని ఆదేశించి ఉండేదని నా అనుమానం. ఇప్పుడు ఆమె తరఫు నుండి నేను దానధర్మాలు చేస్తే దానివల్ల ఆమెకు పుణ్యం లభిస్తుందా?" అని అడిగాడు. అందుకాయన లభిస్తుందని సమాధానం చెప్పారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: A man said to the Prophet ﷺ: “My mother has died suddenly. I think that if she were able to talk (alive) she would have given in Sadaqah (charity). So, if I give Sadaqah now on her behalf, will she get the reward?” The Messenger of Allah ﷺ said, “Yes (she will be rewarded for that).” [Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మృతుల కొరకు చేయబడే 'దుఆలు' స్వీకరించబడినట్లుగానే వారి తరఫు నుండి చేయబడే దానధర్మాల వల్ల కూడా వారికి పుణ్యం లభిస్తుంది. దుఆలు మరియు దానధర్మాలు- మృతులకు పుణ్యం అందజేయటానికి ఉన్నవి ఈ రెండు మార్గాలే. ఇవి తప్పించి మన నాట బహుళ ప్రచారంలో ఉన్న సాప్తదిన కర్మలు, దశదిన కర్మలు, నలభై దినాల కర్మలు మొదలగు ఆచారాలన్నీ ధర్మవిరుద్ధమైన పోకడలు. ఒక విధంగా ఇవన్నీ సహవాస దోషం వల్ల ముస్లిం ప్రజానీకానికి అబ్బిన దురాచారాలని చెప్పవచ్చు. అదేవిధంగా మృతులకు పుణ్య సమర్పణ కోసం 'ఖురాన్ ఖానీలు' నిర్వహించటం కూడా అనాచారమే. ఇవన్నీ నిష్ప్రయోజనకరమైన పనులు. వీటిద్వారా చనిపోయిన వారికి పుణ్యప్రాప్తి జరుగుతుందని భావించటం అవివేకం!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|162. మృతుని తరఫు నుండి దానధర్మాలు చేయటం, అతని శ్రేయస్సు కొరకు ప్రార్థించటం|హదీసు 948
హదీసు 949
وعن أَبي هُرَيْرَةَ رَضيَ اللَّه عَنْهُ أنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا مَاتَ الإنسَانُ انقطَعَ عمَلُهُ إلاَّ مِنْ ثَلاثٍ: صَدقَةٍ جاريَةٍ، أوْ عِلم يُنْتَفَعُ بِهِ، أَوْ وَلَدٍ صَالحٍ يَدعُو لَهُ "رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర తెగిపోతుంది. అయితే మూడు మార్గాల ద్వారా (మాత్రం అతనికి పుణ్యప్రాప్తి జరుగుతూనే ఉంటుంది). అవి : సదఖయె జారియా (ఎడతెగని దానం), ప్రయోజనకరమయిన విద్య, మృతుని శ్రేయస్సు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులయిన అతని సంతానం.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని వీలునామా ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When a man dies, his deeds come to an end, except for three: A continuous charity, knowledge by which people derive benefit, pious son who prays for him.”[Muslim].
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన మూడు మార్గాల ద్వారా మనిషికి మరణించిన మీదట కూడా పుణ్యం లభిస్తూ ఉంటుంది. వీటిని "సదఖాతె జారియా" (శాశ్వత పుణ్యకార్యాలు) అని అంటారు. ఉదాహరణకు మృతుడు గనక తన జీవితంలో మస్జిద్లు, సత్రాలు, వైద్యశాలలు, పాఠశాలలు లాంటివి నిర్మించి ఉంటే అవి నడుస్తున్నంతకాలం, ప్రజలు వాటిద్వారా ప్రయోజనం పొందుతూ ఉన్నంత కాలం మృతునికి దానివల్ల పుణ్యం లభిస్తూనే ఉంటుంది. కనుక మనిషికి మరణానంతరం పుణ్యప్రాప్తి జరగటానికి ఇదొక మార్గం.
రెండో మార్గం, ప్రజలకు ఉపయోగకరమైన విద్యను బోధించి చనిపోవటం, ఉదాహరణకు ఖుర్ఆన్ హదీసుల గ్రంథాలను క్రోడీకరించటం, మంచి పుస్తకాలు రచించటం, ధర్మజ్ఞానాన్ని ప్రచారం చేయటం, ప్రజలకు ధర్మబోధ చేయటం మొదలగునవి. వీటివల్ల కూడా మనిషికి మరణానంతరం పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఇకపోతే కన్నవారి శ్రేయస్సు కోసం ప్రార్థించే సంతానం మరణానంతరం మృతునికి లభించే పుణ్యానికి మూడో మార్గం. ఈ మూడు మార్గాలు తప్ప మరేమార్గం ద్వారానూ మృతులకు పుణ్యప్రాప్తి జరగదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|162. మృతుని తరఫు నుండి దానధర్మాలు చేయటం, అతని శ్రేయస్సు కొరకు ప్రార్థించటం|హదీసు 949
You must be logged in to post a comment.