హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 124. చిరుత తోలుమీద కూర్చోరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 124వ అధ్యాయం: చిరుత తోలుమీద కూర్చోరాదు, దాన్ని వాహనంమీద ఆసనంగా కూడా ఉపయోగించరాదు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 811 – 812) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

124. చిరుత తోలుమీద కూర్చోరాదు, దాన్ని వాహనంమీద ఆసనంగా కూడా ఉపయోగించరాదు

↑ విషయ సూచిక

باب النهي عن افتراش جلود النمور والركوب عَلَيْهَا

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

811

హదీసు 811

عنْ مُعاويةَ رضي اللَّه عنه قالَ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ تَرْكَبوا الخَزَّ وَلاَ النّمارَ". حديث حسن، رواهُ أَبو داود وغيره بإسنادٍ حسنٍ.

హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీ వాహన ఆసనాల మీద పట్టువస్త్రాలు, చిరుత తోళ్లు ఉపయోగించకండి. (అబూ దావూద్, తదితరులు దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు).

(సుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం)

English

Mu`awiyah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Do not ride on saddles made from silk or leopard’s skin.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'ఖజ్' అనే పదం వాడబడింది. ఖజ్ అంటే ఉన్ని మరియు పట్టు కలిపి తయారు చేయబడిన వస్త్రమని కొందరు పండితులు అంటున్నారు. ఇలా అనేవారు ఖజ్ అనే వస్త్రాన్ని వాడుకోవటం ధర్మసమ్మతమేనని చెబుతారు. వీరి అభిప్రాయం ప్రకారం ఆ కాలంలో ముస్లిమేతర శ్రీమంతులు, పరలోక విస్మయకారులు తమ దర్పాన్ని ప్రదర్శించటానికి అలాంటి వస్త్రాలే ధరించేవారు. అలాంటి సమయంలో ముస్లింలు వారిని అనుకరించకుండా ఉండాలన్నదే ఈ వారింపు ఉద్దేశ్యం. పై హదీసుని ఈ అర్థంలో తీసుకుంటే, ఖజ్ వస్త్రాలు ధరించటం అవాంఛనీయమైనవిగా మాత్రమే పరిగణించబడుతుంది. కాని ఒకవేళ ఖజ్‌ను అసలైన పట్టువస్త్రమనుకుంటే, అలాంటప్పుడు ఖజ్ వస్త్రాలు ధరించటం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. చాలా మంది పండితులు ఖజ్ అంటే స్వచ్ఛమైన పట్టు అనే భావిస్తున్నారు.

ఏది ఏమైనా పట్టుతో నేయబడిన జీను ఉపయోగించటం, పట్టు అంబారీల మీద కూర్చోవటం ధర్మసమ్మతం కాదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అదేవిధంగా చిరుతపులి తోలుతో చేయబడిన జాకెట్లు, ఇతర వస్త్రాలు ధరించటం కూడా ధర్మసమ్మతం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|124. చిరుత తోలుమీద కూర్చోరాదు, దాన్ని వాహనంమీద ఆసనంగా కూడా ఉపయోగించరాదు|హదీసు 811

812

హదీసు 812

وعن أَبي المليح عن أَبيهِ، رضيَ اللَّه عنه، أنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى عنْ جُلُودِ السِّباعِ. رواهُ أَبُو دَاود، والترمذيُّ، والنسائيُّ بأَسَانِيد صِحَاحٍ. وفي روايةِ الترمذي: نهَى عنْ جُلُودِ السِّباعِ أنْ تُفْتَرَشَ.

హజ్రత్ అబుల్ మలీహ్ తన తండ్రి నుండి చేసిన కథనం : దైవప్రవక్త ﷺ క్రూర మృగాల తోళ్ళను ఉపయోగించరాదని వారించారు.

(అబూ దావూద్, తిర్మిజీ, నసాయాలు దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు).

తిర్మిజీలోని వేరొక ఉల్లేఖనంలో, "క్రూర మృగాల తోళ్ళపై కూర్చోవద్దని వారించారు" అని ఉంది.

English

Abul-Malih on the authority of his father reported: Messenger of Allah ﷺ prohibited the use of the skins of wild animals.[Abu Dawud, At-Tirmidhi and An-Nasa’i].

Another narration in At-Tirmidhi is: Messenger of Allah ﷺ forbade the use of the skins of wild animals in making Firash (i.e., something to sit on or lie down on, such as cushions, pillows, covers, spreads, saddles, etc.).

ముఖ్యాంశాలు

ఈ హదీసు భావం ఇంతకు ముందు వివరించబడిన హదీసు భావం కన్నా విస్తృతంగా ఉంది. ఇందులో అన్నిరకాల క్రూరమృగాల తోళ్ళ వాడకాన్ని, వాటితో ప్రయోజనం పొందటాన్ని నిషేధించటం జరిగింది. క్రూరమృగాల తోళ్ళను ఎంత పరిశుభ్రం చేసినా వాటి వెండ్రుకలు అశుద్ధంగానే ఉంటాయనీ, అందుకే వాటి వాడకం నిషేధించబడిందనీ కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఈ నిషేధం పరిశుభ్రం చేయబడని తోళ్ళకు సంబంధించినదని అన్నారు. ఇంకొంతమంది పండితులు ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ, "గర్విష్టులు, అహంకారులు క్రూర మృగాల తోళ్ళతో చేయబడిన బట్టలు ధరిస్తారు. కనుక ముస్లింలను వారిని అనుకరించకుండా ఉంచాలన్నదే ఈ నిషేధం ఉద్దేశ్యం" అని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అల్లామా షౌకానీ (రహిమహుల్లాహ్) చెప్పిన మాటలు గమనార్హమైనవి. ఆయన ఇలా అన్నారు :

"ఈ హదీసులోని వారింపు విస్తృతార్థంలో ఉంది. అంటే క్రూరమృగాల తోళ్ళు – అవి పరిశుభ్రం చేయబడినవయినా, చేయబడనివయినా వాటి వాడకం నిషిద్ధం. ఈ హదీసు "పరిశుభ్రం చేస్తే ఏ చర్మమయినా పరిశుభ్రమయిపోతుంది" అన్న హదీసు పరిధిలోకి రాదు. ఇందులోని నిషేధాజ్ఞే ఓ ప్రత్యేకమైన ఆదేశం. కనుక క్రూరమృగాల చర్మాలు ఎట్టి పరిస్థితుల్లోనయినా అశుద్ధంగానే ఉంటాయి. వాటిని ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వస్త్రధారణ ప్రకరణం|124. చిరుత తోలుమీద కూర్చోరాదు, దాన్ని వాహనంమీద ఆసనంగా కూడా ఉపయోగించరాదు|హదీసు 812