మహా ప్రవక్త మహితోక్తులు – 27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు). ఇందులో 19 హదీసులు (హదీసు 1066 – 1084), 11 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFవిశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)8 పేజీలు · 0.5 MB

27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)

كتاب الأيمان
అధ్యాయాలు (11)
  1. 1 అల్లాహ్ మీద కాకుండా మరెవరి మీదా ప్రమాణం చేయకూడదు H 1066 – 1067
  2. 2 ఎవరైనా లాత్, ఉజ్జాల పేర్లతో ప్రమాణం చేస్తే వారు సద్వచనం (కలిమా) పఠించాలి H 1068
  3. 3 ఒకపని చేస్తానని ప్రమాణం చేశాక దాని కంటే మెరుగైనది మరోపని ఉందని తెలిస్తే H 1069 – 1071
  4. 5 ప్రమాణం చేస్తున్నప్పుడు ఇన్షాఅల్లాహ్ (దైవ చిత్తమయితే) అనాలి H 1072 – 1073
  5. 6 భార్యాపిల్లలకు బాధకలిగే ప్రమాదముంటే ప్రమాణం కోసం పట్టుపట్టరాదు H 1074
  6. 7 అవిశ్వాసిగా ఉన్నప్పుడు చేసుకున్న మొక్కుబడిని ముస్లింగా మారిన తర్వాత ఏం చేయాలి? H 1075
  7. 9 తన బానిసపై వ్యభిచార నింద మోపిన వాడికి పరలోక శిక్ష H 1076
  8. 10 బానిసలకు తాను తినేదే పెట్టాలి. వారిపై ఎక్కువ భారం వేయకూడదు H 1077 – 1078
  9. 11 యజమాని శ్రేయస్సు కోరడంతో పాటు ఉత్తమరీతిలో దైవారాధన చేసే బానిస H 1079 – 1081
  10. 12 ఉమ్మడి బానిసలో తన భాగానికి స్వేచ్ఛ నివ్వడం గురించి H 1082 – 1083
  11. 13 ‘ముదబ్బిర్’ బానిసను అమ్మడం ధర్మసమ్మతమే H 1084

1వ అధ్యాయం – అల్లాహ్ మీద కాకుండా మరెవరి మీదా ప్రమాణం చేయకూడదు

1066

హదీసు 1066

باب النهي عن الحلف بغير الله تعالى

حديث عُمَرَ، قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ اللهَ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ قَالَ عُمَرُ: فَوَاللهِ مَا حَلَفْتُ بِهَا مُنْذَ سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ذَاكِرًا وَلاَ آثِرًا

أخرجه البخاري في: 83 كتاب الأيمان: 4 باب لا تحلفوا بآبائكم

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- “ఎవరూ తన తాత ముత్తాతల మీద ప్రమాణం చేయకూడదని అల్లాహ్ గట్టిగా వారించాడ”ని దైవప్రవక్త ﷺ నాకు తెలియజేశారు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను ఈ ఉపదేశం విన్న తర్వాత నేనెప్పుడూ నా తాత ముత్తాతల మీద ప్రమాణం చేయలేదు. నా తరపునా ఇలా చేయలేదు; మరెవరి తరపునా చేయలేదు.

[సహీహ్ బుఖారీ : 83వ ప్రకరణం – ఈమాన్, 4వ అధ్యాయం – లాతహ్లిపూ బిఆబాయికుమ్]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1066

1067

హదీసు 1067

حديث ابْنِ عُمَرَ أَنَّهُ أَدْرَكَ عُمَرَ بْنَ الْخَطَّابِ فِي رَكْبٍ وَهُوَ يَحْلِفُ بِأَبِيهِ، فَنَادَاهُمْ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَلاَ إِنَّ اللهَ يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ، فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللهِ، وَإِلاَّ فَلْيَصْمُتْ

أخرجه البخاري في: 78 كتاب الأدب: 74 باب من لم ير إكفار من قال ذلك متأولاً أو جاهلا

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)ని కొందరు రౌతులతో కలసి వెళ్తూ తన తండ్రి పేరుతో ప్రమాణం చేస్తూ ఉండటం చూశారు. అప్పుడాయన హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని పిలిచి “జాగ్రత్త! మీరు మీ తాతముత్తాతల మీద ప్రమాణం చేయకూడదని అల్లాహ్ గట్టిగా తాకీదు చేశాడు. అందువల్ల ఎవరైనా ప్రమాణం చేయదలచుకుంటే అల్లాహ్ పేరుతో ప్రమాణం చేయాలి. లేకపోతే ఊరుకోవాలి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 78వ ప్రకరణం – అదబ్, 74వ అధ్యాయం -.మన్‌లమ్‌యర ఇక్ఫార మన్ ఖాలజాలిక్…]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1067

2వ అధ్యాయం – ఎవరైనా లాత్, ఉజ్జాల పేర్లతో ప్రమాణం చేస్తే వారు సద్వచనం (కలిమా) పఠించాలి

1068

హదీసు 1068

باب من حلف باللات والعزى فليقل لا إله إلا الله

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ حَلَفَ فَقَالَ فِي حَلِفِهِ وَالَّلاتِ وَالْعُزَّى، فَلْيَقُلْ، لاَ إِلهَ إِلاَّ اللهُ؛ وَمَنْ قَالَ لِصَاحِبِهِ، تَعَالَ أُقَامِرْك، فَلْيَتَصَدَّقْ

أخرجه البخاري في: 65 كتاب التفسير: 53 سورة والنجم: 2 باب أفرأيتم اللات العزى

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఎవరైనా లాత్, ఉజ్జాల పేర్లతో ప్రమాణం చేస్తే (దానికి ప్రాయశ్చిత్తంగా) అతను ‘లా యిలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పఠించాలి. అలాగే ఎవరైనా ఒకరితో ‘నేను నీతో జూదం ఆడ్తాను’ అని అంటే (దానికి ప్రాయశ్చిత్తంగా) అతను దానం చేయాలి”.

[సహీహ్ బుఖారీ : 65వ ప్రకరణం – తఫ్సీర్, 53 – నజ్మ్‌సూరా, 2వ అధ్యాయం – అఫర అయితు ముల్లాత్]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1068

3వ అధ్యాయం – ఒకపని చేస్తానని ప్రమాణం చేశాక దాని కంటే మెరుగైనది మరోపని ఉందని తెలిస్తే

1069

హదీసు 1069

باب ندب من حلف يمينًا فرأى غيرها خيرًا منها أن يأتي الذي هو خير ويكفّر عن يمينه

حديث أَبِي مُوسى رضي الله عنه، قَالَ: أَرْسَلَنِي أَصْحَابِي إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَسْأَلهُ الْحُمْلاَنَ لَهُمْ إِذْ هُمْ مَعَهُ فِي جَيْشِ الْعُسْرَةِ، وَهِيَ غَزْوَةُ تَبُوكَ فَقُلْتُ: يَا نَبِيَّ اللهِ إِنَّ أَصْحَابِي أَرْسَلونِي إِلَيْكَ لِتَحْمِلَهُمْ، فَقَالَ: وَاللهِ لاَ أَحْمِلُكُمْ عَلَى شَيْءٍ وَوَافَقْتُهُ وَهُوَ غَضْبَانُ، وَلاَ أَشْعُرُ، وَرَجَعْتُ حَزِينًا مِنْ مَنْعِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَمِنْ مَخَافَةِ أَنْ يَكُونَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَجَدَ فِي نَفْسِهِ عَلَيَّ؛ فَرَجَعْتُ إِلَى أَصْحَابِي فَأَخْبَرْتُهُمُ الَّذِي قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَلْبَثْ إِلاَّ سُوَيْعَةً إِذْ سَمِعْتُ بِلاَلاً يُنَادِي، أَي عَبْدَ اللهِ بْنَ قَيْسٍ فَأَجَبْتُهُ، فَقَالَ: أَجِبْ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْعُوكَ، فَلَمَّا أَتَيْتُهُ قَالَ: خُذْ هذَيْنِ الْقَرِينَيْنِ وَهذَيْنِ الْقَرِينَيْنِ لِسِتَّةِ أَبْعِرَةٍ ابْتَاعَهُنَّ حِينَئِذٍ مِنْ سَعْدٍ فَانْطَلِقْ بِهِنَّ إِلَى أَصْحَابِكَ، فَقُلْ إِنَّ اللهَ أَوْ قَالَ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَحْمِلُكُمْ عَلَى هؤُلاَءِ فَارْكَبُوهُنَّ فَانْطَلَقْتُ إِلَيْهِمْ بِهِنَّ فَقُلْتُ: إِنَّ النَبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَحْمِلَكُمْ عَلَى هؤُلاَءِ، وَلكِنِّي، وَاللهِ لاَ أَدَعُكُمْ حَتَّى يَنْطَلِقَ مَعِي بَعْضُكُمْ إِلَى مَنْ سَمِعَ مَقَالَةَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لاَ تَظُنُّوا أَنِّي حَدَّثْتُكُمْ شَيْئًا لَمْ يَقُلْهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَقَالُوا لِي: إِنَّكَ عِنْدَنَا لَمُصَدَّقٌ وَلَنَفْعَلَنَّ مَا أَحْبَبْتَ فَانْطَلَقَ أَبُو مُوسى بِنَفَرٍ مِنْهُمْ حَتَّى أَتَوُا الَّذِينَ سَمِعُوا قَوْلَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْعَهُ إِيَّاهُمْ، ثُمَّ إِعْطاءَهُمْ بَعْدُ، فَحَدَّثُوهُمْ بِمِثْلِ مَا حَدَّثَهُمْ بِهِ أَبُو مُوسى

أخرجه البخاري في: 64 كتاب المغازي: 78 باب غزوة تبوك وهي غزوة العسرة

హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త ﷺ వెంట తబూక్ పోరాటానికి వెళ్ళబోతున్న నా స్నేహితులు వాహనాల ‘కోసం విజ్ఞప్తి చేయమని చెప్పి నన్ను దైవప్రవక్త ﷺ సన్నిధికి పంపారు. నేను వెళ్ళి “దైవప్రవక్తా! నా స్నేహితులు తమకు వాహనాలు ప్రసాదించమని అభ్యర్ధించడానికి నన్ను మీ దగ్గరికి పంపించారు” అని అన్నాను. దైవప్రవక్త ﷺ ఈ మాట విని “అల్లాహ్ సాక్షి! నేను మీకు ఎలాంటి వాహనాన్ని ఏర్పాటు చేయను” అని అన్నారు.

నేను దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళినపుడు ఆయన చాలా కోపంలో ఉన్నారు. నాకా సంగతి తెలియదు. అందువల్ల ఆయన అలా నిరాకరించడంతో నన్ను కూడా కోప్పడతారేమో నన్న భయంతో నేను చాలా బాధపడుతూ తిరిగొచ్చాను. నా మిత్రుల దగ్గరికి వచ్చి దైవప్రవక్త ﷺ ఇలా అన్నారని తెలియజేశాను. ఆ తర్వాత కాస్సేపు గడిచిందో లేదో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) గారి పిలుపు విన్పించింది. “అబ్దుల్లా బిన్ ఖైస్ ఎక్కడున్నాడు?” ★ అంటూ ఆయన బిగ్గరగా అన్నారు. నేనాయన కంఠం విని దగ్గరికెళ్ళాను. ఆయన నన్ను చూడగానే “దైవప్రవక్త ﷺ నిన్ను పిలుస్తున్నారు, పద” అన్నారు. నేను వెంటనే దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాను.

అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ఇదిగో, ఈ ఒంటెల జతను తీసికెళ్ళు. ఈ జతను కూడా తీసికెళ్ళు. ఇలా మొత్తం ఆరు ఒంటెలు ప్రసాదించారు. వీటిని ఆయన అప్పుడే హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) దగ్గర కొన్నారు – వీటిని నీ స్నేహితుల దగ్గరకు తీసుకెళ్ళి అల్లాహ్ (లేక దైవప్రవక్త అని అన్నారు) ఈ ఒంటెలను మీ స్వారీ కోసం ప్రసాదించాడు. కనుక మీరీ ఒంటెలు ఎక్కి యుద్ధానికి బయలు దేరండి”.

నేను ఒంటెలను తీసుకొని నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను: “అల్లాహ్ మీ స్వారీ కోసం ఈ ఒంటెలను ప్రసాదించాడు. ఇక మీరు వీటినెక్కి యుద్ధానికి బయలుదేరండి. అయితే మీలో కొందరు నా వెంట బయలుదేరి దైవప్రవక్త ﷺనాతో అన్న మాటలు విన్న వారి దగ్గరకు నడవాలి. నేను మీ దగ్గరకు వచ్చి దైవప్రవక్త ﷺ చెప్పని మాటలు మీకు చెబుతున్నానేమోనని మీరు అనుమానించవచ్చు. అందువల్ల మీరిలా చేయాలి, అప్పటి దాకా నాకు తృప్తి ఉండదు; ఈ వ్యవహారం కూడా ముగిసిపోదు.”

దీనికి వారు సమాధానమిస్తూ “నీవు చెప్పింది నిజమేనని మాకు నమ్మకం ఉంది (దాన్ని ధృవపరచుకోనవసరం లేదు). సరే కానివ్వు (నువ్వు అడుగుతున్నావు కాబట్టి) నీ కోర్కె ప్రకారమే చేస్తాము” అని అన్నారు. తర్వాత హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) వారిలో కొందరిని వెంట బెట్టుకొని దైవప్రవక్త ﷺతో జరిగిన సంభాషణ విన్నవారి దగ్గరకు వెళ్ళారు. దైవప్రవక్త ﷺ మొదట నిరాకరించడం, తర్వాత ఇవ్వడం వగైరా జరిగిన వృత్తాంతమంతా వారికి తెలుసు. కనుక వారు కూడా హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) చెప్పిన విషయాలే తెలియజేశారు.

[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజి, 78వ అధ్యాయం – గజ్వతి తబూక్]

★ ఇఎ హజ్రత్ అబూ మూసా అష్అరి (రదియల్లాహు అన్హు) గారి మరొక పేరు.

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1069

1070

హదీసు 1070

حديث أَبِي مُوسى عَنْ زَهْدَمٍ، قَالَ: كُنَّا عِنْدَ أَبِي مُوسى فَأُتِيَ ذَكَرَ دَجَاجَةً، وَعِنْدَهُ رَجُلٌ مِنْ بَنِي تَيْمِ اللهِ أَحْمَرُ، كَأَنَّهُ مِنَ الْمَوَالِي، فَدَعَاهُ لِلطَّعَام، فَقَال: إِنِّي رَأَيْتُهُ يَأَكُل شَيْئًا فَقَذِرْتُهُ؛ فَحَلَفْتُ لاَ آكلُ فَقَالَ: هَلُمَّ فَلأُحَدِّثْكُمْ عَنْ ذَاك إِنِّي أَتَيْتُ النَبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي نَفَرٍ مِنَ الأَشْعَرِيِّينَ نَسْتَحْمِلهُ، فَقَالَ: وَاللهِ لاَ أَحْمِلُكمْ، وَمَا عِنْدِي مَا أَحْمِلُكُمْ وَأُتِيَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِنَهْبِ إِبِلٍ، فَسَأَلَ عَنَّا، فَقَالَ: أَيْنَ النَّفَرُ الأَشْعَرِيُّونَ فَأَمَرَ لَنَا بِخَمْسِ ذَوْدٍ، غُرِّ الذُّرَى، فَلَمَّا انْطَلَقْنَا قلْنَا: مَا صَنَعْنَا لاَ يُبَارَكُ لَنَا فَرَجَعْنَا إِلَيْهِ، فَقُلْنَا: إِنَّا سَأَلْنَاكَ أَنْ تَحْمِلَنَا فَحَلَفْتَ أَنْ لاَ تَحْمِلَنَا، أَفَنَسِيتَ قَالَ: لَسْتُ أَنَا حَمَلْتُكُمْ، وَلكِنَّ اللهَ حَمَلَكُمْ، وَإِنِّي وَاللهِ إِنْ شَاءَ اللهُ، لاَ أَحْلِفُ عَلَى يَمِينٍ فَأَرَى غَيْرَهَا خَيْرًا مِنْهَا إِلاَّ أَتَيْتُ الَّذِي هُوَ خَيْرٌ، وَتَحَلَّلْتُهَا

أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 15 باب ومن الدليل على أن الخمس لنوائب المسلمين

హజ్రత్ జహ్‌దమ్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) దగ్గర కూర్చొని ఉండగా, ఆయన ముందు (కోడిమాంసం ఉన్న) కంచం వచ్చింది. ఆయన దగ్గర బనీ తైముల్లా తెగకు చెందిన ఒక తెల్లవాడు కూర్చొని ఉన్నాడు. చూడటానికి అతను బానిసలా ఉన్నాడు. హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) అతడ్ని కూడా తినమని పిలిచారు. అయితే అతను (తినడానికి వెనకాడుతూ) “నేనీ కోడి ఏదో (మాలిన్యం) తింటుంటే చూశాను. అప్పటి నుండి నాకు (కోడిమాంసం అంటే) రోత పుట్టింది. నేను కోడి మాంసం తిననని ప్రమాణం చేశాను” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ అబూమూసా ఇలా అన్నారు :

“ప్రమాణం గురించి నీకొక హదీసు విన్పిస్తాను. (ముందు) ఇది తిందువుగాని రా. నేను అష్అరీ తెగకు చెందిన కొందరు వ్యక్తులతో కలసి ఓ సారి దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళాను. మేము స్వారీ జంతువులు ఇప్పించమని ఆయన్ని విన్నవించుకున్నాము. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “అల్లాహ్ సాక్షి! నేను మీకు స్వారీ కోసం జంతువుల్ని ఇవ్వలేను. మీ కివ్వడానికి అసలు నా దగ్గర అలాంటి జంతువులే లేవు” అని అన్నారు. ఆ తర్వాత దైవప్రవక్త ﷺ దగ్గరకు , యుద్ధ సొత్తుకు సంబంధించిన కొన్ని ఒంటెలు వచ్చాయి. అప్పుడు ఆయన “అష్అరీ తెగ మనుషులేరి?” అని మమ్మల్ని గురించి అడిగారు. ఆయన మాకు తెల్లమూపురాలున్న అయిదు ఒంటెలు ఇచ్చేయమని ఆజ్ఞాపించారు. మేము వాటిని తీసుకొని వెళ్తూ ‘ఏమిటీ మనం ఇలా చేశాం (ఆయన ప్రమాణం చేశాక కూడా మనం ఆయన దగ్గర ఈ ఒంటెల్ని తీసుకున్నాం)? ఇవి మనకు శుభాల్ని కలిగించవు’ అని చెప్పుకున్నాం పరస్పరం. దాంతో మేము ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళి “దైవప్రవక్తా! మేము స్వారీ కోసం పశువుల్ని అడిగినపుడు మీరు మొదట్లో ఇవ్వనని ప్రమాణం చేశారు కదా! మీకా విషయం ఆ తర్వాత బహుశా జ్ఞాపకం రాలేదేమో!” అని అన్నాము. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు; “నిజానికి మీకీ స్వారీ జంతువుల్ని నేనివ్వలేదు; అల్లాహ్ ప్రసాదించాడు. పోతే అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేనేదయినా పని చేస్తానని లేదా చేయనని ప్రమాణం చేసినప్పుడల్లా ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా చేయడంలో ప్రయోజనం ఉందని భావిస్తే మాత్రం దైవ చిత్తమయితే నేను తప్పకుండా ప్రమాణ భంగం చేసి ఆ పని చేస్తాను. కాకపోతే ప్రమాణ భంగానికి పరిహారం చెల్లించుకుంటాను”.★

[సహీహ్ బుఖారీ : 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖమ్స్, 15వ అధ్యాయం – వమినద్దలీలి అనిల్ ఖుమ్స్ లినవాయ బిల్ ముస్లిమీన్ ]

★ ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ హదీసుపై ఇలా వ్యాఖ్యానించారు:- ప్రమాణం చేసిన తరువాత దాన్ని భంగపరచడంలోనే శ్రేయస్సు ఉందని తెలిస్తే భంగపరచాలి. కాకపోతే ప్రమాణ భంగానికి పరిహారం చెల్లించుకోవలసి ఉంటుంది. ప్రమాణ భంగానికి పరిహారం తప్పకుండా చెల్లించాలన్న విషయంలో ధర్మవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉంది.

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1070

1071

హదీసు 1071

حديث عَبْدِ الرَّحْمنِ بْنِ سَمُرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا عَبْدَ الرَّحْمنِ بْنَ سَمُرَةَ لاَ تَسْأَلِ الإِمَارَةَ، فَإِنَّكَ إِنْ أُوتِيْتَهَا عَنْ مَسْئَلَةٍ وكِلْتَ إِلَيْهَا، وَإِنْ أُوتِيْتَهَا مِنْ غَيْرِ مَسْئَلَةٍ أُعِنْتَ عَلَيْهَا، وَإِذَا حَلَفْتَ عَلَى يَمِينٍ فَرَأَيْتَ غَيْرَهَا خَيْرًا مِنْهَا فَكَفِّرْ عَنْ يَمِينِكَ وَأْتِ الَّذِي هُوَ خَيْرٌ

أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 1 باب قول الله تعالى (لا يؤاخذكم الله باللغو في أيمانكم)

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ సముర (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు దైవప్రవక్త ﷺ నాకు హితబోధ చేస్తూ ఇలా అన్నారు: “అబ్దుర్రహ్మాన్ బిన్ సముర! నీవు ఎన్నడూ పదవిని, నాయకత్వాన్ని కోరుకోకు. నీ కోరిక ప్రకారం పదవీ పాలానాధికారాలు గనక ఇవ్వడం జరిగితే ఆ బాధ్యత పూర్తిగా నీదే అవుతుంది. (దైవ సహాయం పొందే అర్హతను కోల్పోతావు). ఒకవేళ నీవు కోరకుండానే ఆ బాధ్యతా భారం నీపై మోపబడితే మటుకు ఆ బాధ్యతా నిర్వహణలో నీకు దైవ సహాయం లభిస్తుంది. అలాగే నీవు ఏదైనా పని చేస్తానని ప్రమాణం చేసినపుడు ఆ తర్వాత ఆ పనికి వ్యతిరేకంగా మరోపని చేయడంలో శ్రేయస్సు ఉందని భావిస్తే ప్రమాణ భంగం చేసి శ్రేయస్సు ఉన్న ఆ పని చెయ్యి. అయితే ప్రమాణ భంగం చేసినందుకు పరిహారం ఇచ్చుకోవాలి.”

[సహీహ్ బుఖారీ : 83వ ప్రకరణం – ఈమాన్ వన్నజూర్, 1వ అధ్యాయం – ఖౌలిల్లాహి త ఆలా, లాయు అఖిజు కుముల్లాహు బిల్లగ్వి ఫీ ఈమానికుమ్]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1071

5వ అధ్యాయం – ప్రమాణం చేస్తున్నప్పుడు ఇన్షాఅల్లాహ్ (దైవ చిత్తమయితే) అనాలి

1072

హదీసు 1072

باب الاستثناء

حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ سُلَيْمَانُ بْنُ دَاوُدَ عَلَيْهِمَا السَّلاَمُ: لأَطُوفَنَّ اللَّيْلَةَ بِمِائَةِ امْرَأَةٍ، تَلِدُ كُلُّ امْرَأَةٍ غُلاَمًا يُقَاتِلُ فِي سَبِيلِ اللهِ فَقَالَ لَهُ الْمَلَكُ: قُلْ إِنْ شَاءَ اللهُ فَلَمْ يَقُلْ، وَنَسِيَ؛ فَأَطَافَ بِهِنَّ، وَلَمْ تَلِدْ مِنْهُنَّ إِلاَّ امْرَأَةٌ نِصْفَ إِنْسَانٍ قَالَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ قَالَ إِنْ شَاءَ اللهُ لَمْ يَحْنَثْ، وَكَانَ أَرْجَى لِحَاجَتِهِ

أخرجه البخاري في: 67 كتاب النكاح: 119 باب قول الرجل لأطوفن الليلة على نسائه

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సులైమాన్ బిన్ దావూద్ (అలైహిస్సలాం) ఓ రోజు (ఒక నిర్ణయం తీసుకుంటూ) “ఈ రోజు రాత్రి నా భార్యలు వంద మందినీ కలుసుకుంటాను. వారందరికీ ఒక్కొక్క పిల్లవాడు పుడ్తాడు. వీరు (పెద్దవారయి) దైవమార్గంలో యుద్ధం చేస్తారు, అవిశ్వాసులతో పోరాడతారు” అని అన్నారు. ఆ సమయంలో ఒక దైవదూత (అశరీరవాణి) “ఇన్షాఅల్లాహ్ (దైవ చిత్తమయితే) అని చెప్పు” అన్నారు. కాని హజ్రత్ సులైమాన్ (అలైహిస్సలాం) ఇన్షాఅల్లాహ్ అని చెప్పడం మరచిపోయారు. తర్వాత ఆయన ఆ రాత్రి తన భార్యలందర్నీ కలుసుకున్నారు. కాని వారిలో ఒక్క భార్యకు తప్ప ఎవరికీ సంతానం కలగలేదు. ఆ భార్య అయినా అర్ధబాలుడ్ని (అసంపూర్ణ పిండాన్ని) మాత్రమే కన్నది.

(ఈ సంఘటనపై) దైవప్రవక్త ﷺ (వ్యాఖ్యానిస్తూ) “హజ్రత్ సులైమాన్ (అలైహిస్సలాం) ‘ఇన్షాఅల్లాహ్’ అని చెప్పి ఉంటే ఆయన కోరిక ఈడేరి ఉండేది. ఆయన లక్ష్యం నెరవేరే అవకాశం ఎక్కువగా ఉండేది” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 67వ ప్రకరణం – నికాహ్, 119వ అధ్యాయం – ఖౌలిర్రజులి లఅతూఫన్నల్లైలత అలానిసాయి]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1072

1073

హదీసు 1073

حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: قَالَ سُلَيْمَانُ بْنُ دَاوُدَ، لأَطُوفَنَّ اللَّيْلَةَ عَلَى سَبْعِينَ امْرَأَةً، تَحْمِلُ كُلُّ امْرَأَةٍ فَارِسًا يُجَاهِدُ فِي سَبِيلِ اللهِ فَقَالَ لَهُ صَاحِبُهُ، إِنْ شَاءَ اللهُ، فَلَم يَقُلْ، وَلَمْ تَحْمِلْ شَيْئًا إِلاَّ وَاحِدًا سَاقِطًا إِحْدَى شِقَّيْهِ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَوْ قَالَهَا لَجَاهَدُوا فِي سَبِيلِ اللهِ

أخرجه البخاري في: 60 كتاب الطلاق: 40 باب قول الله تعالى (ووهبنا لداود سليمان نعم العبد إنه أواب)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు:- “హజ్రత్ సులైమాన్ బిన్ దావూద్ (అలైహిస్సలాం) ఇలా అన్నారు – “ఈ రోజు రాత్రి నేను నా డెబ్బైమంది భార్యల్ని తప్పకుండా కలుస్తాను. ప్రతి భార్యా ఒక పిల్లవాడ్ని కంటుంది. అతను అశ్వరూఢుడయి దైవమార్గంలో యుద్ధం చేస్తాడు”. ఆ సమయంలో ఆయన సహచరుడు “ఇన్షా అల్లాహ్”అని చెప్పు అని అన్నాడు. కాని ఆయన చెప్పలేకపోయారు. తత్ఫలితంగా ఒక భార్య తప్ప ఎవరూ గర్భం దాల్చలేదు. ఆ గర్భిణీ భార్య అయినా అర్ధ శరీరం అవిటిగా ఉన్న బిడ్డను మాత్రమే కన్నది… సులైమాన్ (అలైహిస్సలాం) గనక ఇన్షాఅల్లాహ్ అని ఉంటే అందరూ దైవమార్గంలో పోరాడేవాళ్ళు (జన్మించి ఉండేవాళ్ళు)” (1)

[సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా, 40వ అధ్యాయం – ఖౌలిల్లాహిత ఆలా వ వహబ్నా లిదావూద సులైమాన్]

(1) ఈ హదీసు ద్వారా రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి; ముస్లింలు ఏ పని చేయాలనుకున్నా ‘ఇన్షాఅల్లాహ్’ (దైవచిత్తమయితే) చేస్తానని తప్పకుండా అనాలి. రెండు: ప్రమాణం, ప్రతిజ్ఞలు చేయదలచినపుడు కూడా ‘ఇన్షా అల్లాహ్’ అని అంటే, ఆ పని నెరవేరకపోయినా ప్రమాణ భంగం కాదు. ప్రమాణం చేసిన తర్వాత ‘ఇన్షాఅల్లాహ్’ అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

హజ్రత్ తావుస్ (రహిమహుల్లాహ్), హజ్రత్ హసన్ బస్రీ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ప్రకారం ప్రమాణం చేసిన సమావేశంలోనే ఇన్షా అల్లాహ్ అనాలి. హజ్రత్ సయీద్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం ప్రమాణం చేసిన నాలుగు నెలలలోగా ఇన్షాఅల్లాహ్ అనవచ్చు. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) అభిప్రాయం ప్రకారం ప్రమాణం చేసిన తర్వాత గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా ఇన్షాఅల్లాహ్ అనవచ్చు. అదే విధంగా తలాఖ్ (విడాకులు) విషయంలో ‘ఇన్షాఅల్లాహ్’ తలాఖ్ ఇస్తాను అని అంటే అది తలాఖ్ క్రిందకు రాదు. ఏమైనప్పటికీ భవిష్యత్తుకు సంబంధించిన ఏ వ్యవహారంలో నయినా ఇన్షాఅల్లాహ్ అని నోటితో పలకడం చాలా అవసరం. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) దృష్టిలో మాత్రం అలా మనస్సులో సంకల్పించుకుంటే సరిపోతుంది.

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1073

6వ అధ్యాయం – భార్యాపిల్లలకు బాధకలిగే ప్రమాదముంటే ప్రమాణం కోసం పట్టుపట్టరాదు

1074

హదీసు 1074

باب النهي عن الإصرار على اليمين فيما يتأذى به أهل الحالف مما ليس بحرام

حديث أَبِي هُرَيْرَةَ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: وَاللهِ لأَنْ يَلِجَّ أَحَدُكُمْ بِيَمِينِهِ فِي أَهْلِهِ آثَمُ لَهُ عِنْدَ اللهِ مِنْ أَنْ يُعْطِيَ كَفَّارَتَهُ الَّتِي افْتَرَضَ اللهُ عَلَيْهِ

أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 1 باب قول الله تعالى (لا يؤاخذكم الله باللغو في أيمانكم)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. భార్యాపిల్లల వ్యవహారంలో (వారి బాగోగులు ఖాతరు చేయకుండా) చేసిన ప్రమాణం పట్ల మొండి వైఖరి అవలంబించడం ఘోరమైన పాపం. అలాంటి ప్రమాణాన్ని భంగపరచి అల్లాహ్ నిర్ణయించిన పాప పరిహారం చెల్లించడం కంటే ఆ ప్రమాణాన్ని భంగపరచకుండా దానిపై స్థిరంగా ఉండటమే అల్లాహ్ దగ్గర ఎక్కువ పాపానికి కారణభూతమవుతుంది.”(2)

[సహీహ్ బుఖారీ : 83వ ప్రకరణం – ఈమాన్ వ నజూర్, 1వ అధ్యాయం – ఖౌలిల్లాహిత ఆలా లా యూఖజుకుమ్]

(2) సాధారణంగా చేసిన ప్రమాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగపరచకూడదు. అయితే భార్యా పిల్లలకు (బంధుమిత్రులకు కూడా) నష్టం కలిగించే, వారిని కష్టాల్లో పడవేసే ప్రమాణం చేసి ఉంటే మాత్రం దాన్ని భంగపరచడం చాలా అవసరం. అలాంటి ప్రమాణాన్ని•భంగపరచకపోతే మనిషి పాపాత్ముడవుతాడు. ఉదాహరణకు, ఎవరైనా తన భార్యతో కలిసి భోజనం చేయనని, ఆమెతో మాట్లాడనని లేక ఇంట్లో వెచ్చాలు తీసుకురానని ప్రమాణం చేసి ఉంటే అలాంటి ప్రమాణాన్ని భంగపరచాలి. కాకపోతే ప్రమాణ భంగానికి పరిహారం మాత్రం చెల్లించుకోవలసి ఉంటుంది. ప్రమాణాన్ని భంగపరిస్తే పాపానికి పాల్పడిన వారయ్యే ప్రమాదం ఉంటే అలాంటి ప్రమాణాన్ని భంగపరచకూడదు. ఉదాహరణకు, ఎవరైనా తన భార్యతో కలసి మద్యం సేవించనని, లేదా జూదమాడనని ప్రమాణం చేసి ఉంటే దాని మీదే స్థిరంగా ఉండాలి. [ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్)]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1074

7వ అధ్యాయం – అవిశ్వాసిగా ఉన్నప్పుడు చేసుకున్న మొక్కుబడిని ముస్లింగా మారిన తర్వాత ఏం చేయాలి?

1075

హదీసు 1075

باب نذر الكافر وما يفعل فيه إِذا أسلم

حديث ابْنِ عُمَرَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ رضي الله عنه، قَالَ: يَا رَسُولَ اللهِ إِنَّهُ كَانَ عَلَيَّ اعْتِكَافُ يَوْمٍ فِي الْجَاهِلِيَّة، فَأَمَرَهُ أَنْ يَفِيَ بِهِ قَالَ: وَأَصَابَ عُمَرُ جَارِيَتَيْنِ مِنْ سَبْيِ حُنَيْنٍ فَوَضَعَهُمَا فِي بَعْضِ بُيُوتِ مَكَّةَ، قَالَ: فَمَنَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى سَبْيِ حُنَيْنٍ، فَجَعَلُوا يَسْعَوْنَ فِي السِّكَكِ؛ فَقَالَ عُمَرُ: يَا عَبْدَ اللهِ انْظُرْ مَا هذَا فَقَالَ: مَنَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى السَّبْيِ، قَالَ: اذْهَبْ فَأَرْسِلِ الْجَارِيَتَيْنِ

أخرجه البخاري في: 57 كتاب فرض الخمس: 19 باب ما كان النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يعطي المؤلفة قلوبهم

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం :- హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఓసారి దైవప్రవక్త ﷺను “దైవప్రవక్తా! నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఓ రోజు ‘ఏతెకాఫ్’ (1)చేస్తానని మొక్కుబడి చేసుకున్నాను” అని అన్నారు. దైవప్రవక్త ﷺ ఈ మాట విని “నీ మొక్కుబడిని తీర్చుకో” అని ఆదేశించారు.

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు ‘హునైన్ యుద్ధ ఖైదీలలో ఇద్దరు మహిళా బానిసలు లభించారు. వాళ్ళిద్దర్ని ఆయన మక్కాలోని ఒక ఇంట్లో వదలిపెట్టారు. తర్వాత దైవప్రవక్త ﷺ హునైన్ యుద్ధ ఖైదీలకు ఒక మేలు చేశారు (అంటే వారిని బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు). అప్పుడు వారు మక్కా వీధుల్లో పరుగెత్తసాగారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) అది చూసి తన కుమారునితో “అబ్దుల్లా! అటు చూడు ఏమిటీ విశేషం?” అని అన్నారు. దానికాయన సమాఢానమిస్తూ “దైవప్రవక్త ﷺ ఖైదీలకు మేలు చేశారు (వారికి స్వేచ్ఛ ప్రసాదించారు)” అని అన్నారు. “అయితే నువ్వు కూడా వెళ్ళి ఆ ఇద్దరు మహిళా బానిసల్ని కూడా విడుదల చేసెయ్యి” అన్నారు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు).

[సహీహ్ బుఖారీ : 57వ ప్రకరణం – ఫర్జుల్ ఖమ్స్, 19వ అధ్యాయం – మాకానన్నబీయ్యి ﷺ యాతిల్]

(1) దీన్ని గురించి ‘సహీహ్ ముస్లిం’లో ఈ విధంగా ఉంది:- హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) అజ్ఞాన కాలంలో కాబా గృహంలో ఒక రోజు ఏతెకాఫ్ (తపోనిష్ట) పాటిస్తానని మొక్కుబడి చేసుకున్నారు. మక్కా విజయానంతరం హునైన్ పోరాటం నుండి తిరిగి వస్తూ జారానా అనే ప్రాంతంలో ఆయన దైవప్రవక్త ﷺ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తే, నీ మొక్కుబడిని తీర్చుకో అన్నారు దైవప్రవక్త ﷺ.

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1075

9వ అధ్యాయం – తన బానిసపై వ్యభిచార నింద మోపిన వాడికి పరలోక శిక్ష

1076

హదీసు 1076

باب التغليظ على من قذف مملوكه بالزنا

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: سَمِعْتُ أَبَا الْقَاسِمِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ قَذَفَ مَمْلُوكَهُ، وَهُوَ بَرِيءٌ مِمَّا قَالَ، جُلِدَ يَوْمَ الْقِيَامَةِ، إِلاَّ أَنْ يَكُونَ كَمَا قَالَ

أخرجه البخاري في: 86 كتاب الحدود: 45 باب قذف العبيد

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “తన యాజమాన్యంలో ఉండే అమాయకులయిన (బానిస స్త్రీ లేక పురుషుని)పై వ్యభిచార నింద మోపే వ్యక్తికి ప్రళయ దినాన కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుంది. అయితే ఆ బానిసలు వారి యజమాని చెప్పినటువంటివారే అయితే మాత్రం (అతనికి ప్రళయ దినాన శిక్ష పడదు)”(2)

[సహీహ్ బుఖారీ : 86వ ప్రకరణం – హుదూద్, 45వ అధ్యాయం – ఖజ్ఫిల్ అబీద్]

(2) బానిసలపై వ్యభిచార నింద మోపిన యజమానికి ఇహలోకంలో చట్టపరంగా ఎలాంటి శిక్ష లేదు. వ్యభిచార నిందారోపణ తప్పని రుజువయితే న్యాయస్థానం అతడ్ని కేవలం మందలించి వదిలిపెడ్తుంది. పరలోకంలో మాత్రం అతనికి పూర్తి శిక్ష పడుతుంది.

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1076

10వ అధ్యాయం – బానిసలకు తాను తినేదే పెట్టాలి. వారిపై ఎక్కువ భారం వేయకూడదు

1077

హదీసు 1077

باب إطعام المملوك مما يأكل وإِلباسه مما يلبس ولا يكلفه ما يغلبه

حديث أَبِي ذَرٍّ عَنِ الْمَعْرُورِ، قَالَ: لَقِيتُ أَبَا ذَرٍّ بِالرَّبَذَةِ، وَعَلَيْهِ حُلَّةٌ وَعَلَى غُلاَمِهِ حُلَّةٌ، فَسَأَلْتُهُ عَنْ ذلِكَ، فَقَالَ: إِنِّي سَابَبْتُ رَجُلاً فَعَيَّرْتُهُ بِأُمِّهِ، فَقَالَ لِيَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: يَا أَبَا ذَرٍّ أَعَيَّرْتَهُ بِأُمِّهِ إِنَّكَ امْرُؤٌ فِيكَ جَاهِلِيَّةٌ، إِخْوَانُكُمْ خَوَلُكُمْ جَعَلَهُمُ اللهُ تَحْتَ أَيْدِيكُمْ، فَمَنْ كَانَ أَخُوهُ تَحْتَ يَدِهِ فَلْيُطْعِمْهُ مِمَّا يَأْكُلُ، وَلْيُلْبِسْهُ مِمَّا يَلْبَسُ، وَلاَ تُكَلِّفُوهُمْ مَا يَغْلِبُهُمْ، فَإِنْ كَلَّفْتُمُوهُمْ فَأَعِينُوهُمْ

أخرجه البخاري في: 2 كتاب الأيمان: 22 باب المعاصي من أمر الجاهلية

హజ్రత్ మారూర్ బిన్ సువైద్ (రహిమహుల్లాహ్) కథనం:- ఓ రోజు నాకు హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు)గారు ‘రబ్జా’ అనే ప్రదేశంలో తారసపడ్డారు. అప్పుడాయన, ఆయన బానిస ఒకే విధమైన దుస్తులు ధరించి ఉన్నారు. నేను దానికి కారణం ఏమిటని అడిగితే హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు.

“నేనొకసారి ఒక (బానిస) వ్యక్తిని దూషించాను. అతని తల్లి గురించి ప్రస్తావించి సిగ్గు చేటయిన విషయమని అన్నాను. (అతను దీన్ని గురించి దైవప్రవక్త ﷺకు ఫిర్యాదు చేశాడు) అప్పుడు దైవప్రవక్త ﷺ నాతో ఇలా అన్నారు:- “అబూజర్! నీవు ఇతడ్ని ఇతని తల్లి పేరెత్తి దూషించావా? నీలో అజ్ఞాన కాలం నాటి అనాగరిక ఛాయలు ఇంకా తొంగి చూస్తున్నాయి. (గుర్తుంచుకో) నీ బానిసలు, సేవకులు కూడా నీ సోదరుల వంటి వారే. కాకపోతే వారిని అల్లాహ్ నీ స్వాధీనంలో ఉంచాడు. మనిషి తన చేతి క్రింద పని చేసే తన సోదరునికి తను తినేటటువంటి తిండే పెట్టాలి. తను ధరించేటటువంటి దుస్తులే ఇవ్వాలి. తన సేవకులపై అతను మోయలేని బరువును వేయకూడదు. అలాంటి కఠినమైన పనేదయినా అప్పగిస్తే ఆ పనిలో అతనికి సహాయపడాలి.”

[సహీహ్ బుఖారీ : 2వ ప్రకరణం – ఈమాన్, 22వ అధ్యాయం – అల్ మఆసి మిన్ అమ్రిల్ జాహిలియ్య]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1077

1078

హదీసు 1078

حديث أَبِي هُرَيْرَةَ، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا أَتَى أَحَدَكُمْ خَادِمُهُ بِطَعَامِهِ، فَإِنْ لَمْ يُجْلِسْهُ مَعَهُ فَلْيُنَاوِلْهُ أُكْلَةً أَوْ أُكْلَتَيْنِ، أَوْ لُقْمَةً أَوْ لُقْمَتَيْنِ، فَإِنَّهُ وَلِيَ حَرَّهُ وَعِلاَجَهُ

أخرجه البخاري في: 70 كتاب الأطعمة: 55 باب الأكل مع الخادم

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే (అంటే భోజనం తక్కువగా ఉంటే) అందులో నుంచి రెండు మూడు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ, పొయ్యి వేడీ భరించాడు”.

[సహీహ్ బుఖారీ : 70వ ప్రకరణం – అత్ఇమూ, 55వ అధ్యాయం – అల్ అకుల్ మఅల్ ఖాదిమ్]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1078

11వ అధ్యాయం – యజమాని శ్రేయస్సు కోరడంతో పాటు ఉత్తమరీతిలో దైవారాధన చేసే బానిస

1079

హదీసు 1079

باب ثواب العبد وأجره إِذا نصح لسيده وأحسن عبادة الله

حديث ابْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الْعَبْدُ إِذَا نَصَحَ سَيِّدَهُ وَأَحْسَنَ عِبَادَةَ رَبِّهِ، كَانَ لَهُ أَجْرُهُ مَرَّتَيْنِ

أخرجه البخاري في: 49 كتاب العتق: 16 باب العبد إذا أحسن عبادة ربه ونصح سيده

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు:- “యజమాని శ్రేయస్సు కోరడంతో పాటు, తన (నిజ) ప్రభువుని ఉత్తమ రీతిలో ఆరాధించే బానిసకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 16వ అధ్యాయం – అల్ అబ్ది ఇజా అహ్సన ఇబాదతి రబ్బిహీ]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1079

1080

హదీసు 1080

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لِلْعَبْدِ الْمَمْلُوكِ الصَّالِحِ أَجْرَانِ وَالَّذِي نَفْسِي بِيَدِهِ، لَوْلاَ الْجِهَادُ فِي سَبِيلِ اللهِ وَالْحَجُّ وَبِرُّ أُمِّي، لأَحْبَبْتُ أَنْ أَمُوتَ وَأَنَا مَمْلوكٌ

أخرجه البخاري في: 49 كتاب العتق: 16 باب العبد إذا أحسن عبادة ربه ونصح سيده

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు:- “సజ్జనుడు, విశ్వాసపాత్రుడయిన బానిసకు రెండింతలు పుణ్యం లభిస్తుంది. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. దైవమార్గంలో జిహాద్, హజ్‌యాత్ర, తల్లిసేవ లాంటి సత్కార్యాలు గనక లేకపోయి ఉంటే నేను బానిసగా చనిపోవడాన్ని కోరుకుంటాను.”

[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 16వ అధ్యాయం – అల్ అబ్ది ఇజా అహ్సన ఇబాదతి రబ్బిహీ]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1080

1081

హదీసు 1081

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: نِعْمَ مَا لأَحَدِهِمْ يُحْسِنُ عِبَادَةَ رَبِّهِ، وَيَنْصَحُ لِسَيِّدِهِ

أخرجه البخاري في: 49 كتاب العتق: 16 باب العبد إذا أحسن عبادة ربه ونصح سيده

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “తన (నిజ) ప్రభువును ఉత్తమరీతిలో ఆరాధించడంతో పాటు, తన యజమాని పట్ల విశ్వాసపాత్రుడయి అతనికి సేవ చేసే వ్యక్తి ఎంత (అదృష్టవంతుడు) ధన్యుడు!”

[సహీహ్ బిఖారీ : 49వ ప్రకరణం – అల్ ఇత్ఖ్, 16వ అధ్యాయం – అల్అబ్ది ఇజా అహ్సను ఇబాదతి రబ్బిహీ]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1081

12వ అధ్యాయం – ఉమ్మడి బానిసలో తన భాగానికి స్వేచ్ఛ నివ్వడం గురించి

1082

హదీసు 1082

باب من أعتق شركًا له في عبد

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَعْتَقَ شِرْكًا لَهُ فِي عَبْدٍ، فَكَانَ لَهُ مَالٌ يَبْلُغُ ثَمَنَ الْعَبْدِ، قُوِّمَ الْعَبْدُ قِيمَةَ عَدْلٍ، فَأَعْطَى شُرَكَاءَهُ حِصَصَهُمْ وَعَتَقَ عَلَيْهِ، وَإِلاَّ فَقَدْ عَتَقَ مِنْهُ مَا عَتَقَ

أخرجه البخاري في: 49 كتاب العتق: 4 باب إذا أعتق عبدًا بين اثنين

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఎవరైనా ఉమ్మడి యాజమాన్యం క్రింద ఉన్న బానిసకు తన భాగం మేరకు స్వేచ్ఛ నివ్వదలచినపుడు అతని దగ్గర బానిస విమోచనానికి కావలసిన మిగతా ధర అంతపైకం గనక ఉంటే, బానిస ధరను న్యాయవంతంగా నిర్ణయించి ఇతర భాగస్వాములకు రావలసిన మొత్తాన్ని అతనే తన పైకం నుండి చెల్లించి ఆ బానిసకు పూర్తిగా విముక్తి కలిగించాలి. అలా చేయలేకపోతే అతను బానిసకు ఏ మేరకు స్వాతంత్ర్యం ఇస్తాడో ఆ మేరకే ఆ బానిస స్వ చ్ఛాపరుడవుతాడు”.

[సహీహ్ బుఖారీ : 49వ ప్రకరణం – అల్ఇత్ఖ్, 4వ అధ్యాయం – ఇజాఇత్ఖి అబ్దమ్ బైనస్ నైన్]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1082

1083

హదీసు 1083

حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَعْتَقَ شَقِيصًا مِنْ مَمْلُوكِهِ، فَعَلَيْهِ خَلاَصُهُ فِي مَالِهِ؛ فَإِنْ لَمْ يَكُنْ لَهُ مَالٌ قُوِّمَ الْمَمْلُوكُ قِيمَةَ عَدْلٍ ثُمَّ اسْتُسْعِيَ غَيْرَ مَشْقُوقٍ عَلَيْهِ

أخرجه البخاري في: 47 كتاب الشركة: 5 باب تقويم الأشياء بين الشركاء بقيمة عدل

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా అన్నారు:- “ఒకవేళ ఎవరైనా ఉమ్మడి యాజమాన్యం క్రింద ఉన్న బానిసకు తన భాగం మేరకు స్వేచ్ఛనివ్వదలిస్తే అతను తన సంపద నుండి మిగతా ధర కూడా (ఇతర వాటాదారులకు) చెల్లించి ఆ బానిసకు పూర్తిగా విముక్తి కలిగించాలి. అతని దగ్గర అంత పైకం లేకపోతే, బానిస ధరను న్యాయవంతంగా నిర్ణయించి, కూలీనాలీ ద్వారా సంపాదించి మిగతా పైకాన్ని చెల్లించి పూర్తిగా స్వేచ్ఛాపరుడయ్యేందుకు బానిసకు వీలు కల్పించాలి. అయితే ఈ విషయంలో బానిసపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు.”

[సహీహ్ బుఖారీ : 47వ ప్రకరణం – అష్షిరికా – 5వ అధ్యాయం – తఖ్వీముల్ అష్యాయి బైన షుర్కా అబి ఖీమతుల్ అదల్]

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1083

13వ అధ్యాయం – ‘ముదబ్బిర్’ బానిసను అమ్మడం ధర్మసమ్మతమే

1084

హదీసు 1084

باب جواز بيع المدبر

حديث جَابِرٍ، أَنَّ رَجُلاً مِنَ الأَنْصَارِ دَبَّرَ مَمْلُوكًا لَهُ، وَلَمْ يَكُنْ لَهُ مَالٌ غَيْرُهُ، فَبَلَغَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: مَنْ يَشْتَرِيهِ مِنِّي فَاشْتَرَاهُ نعَيْمُ بْنُ النَّحَّامِ بِثَمَانِمِائَةِ دِرْهَمٍ

أخرجه البخاري في: 84 كتاب الكفارات: 7 باب عتق المدبر

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- అన్సార్ తెగకు చెందిన ఒక వ్యక్తి తన బానిసను ‘ముదబ్బిర్’ చేశాడు. (అంటే మరణానంతరం తన బానిసకు స్వేచ్ఛ లభిస్తుందని ప్రకటించాడు) ఆ వ్యక్తి దగ్గర ఆ బానిస తప్ప మరో ఆస్తి లేదు. దైవప్రవక్త ﷺకు ఈ సమాచారం అందగానే ఆయన తన అనుచరులతో “ఈ బానిసను నా నుండి కొనేవారెవరైనా ఉన్నారా మీలో?” అని అన్నారు. అప్పుడు నయీమ్ బిన్ నిహామ్ (రదియల్లాహు అన్హు) ముందుకు వచ్చి ఆ బానిసను ఎనిమిది వందల దిర్హంలకు కొన్నారు.★

[సహీహ్ బుఖారీ : 84వ ప్రకరణం – కప్ఫారాత్, 7వ అధ్యాయం – ఇత్ఖిల్ ముదబ్బిర్]

★ ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం ఈ ఉల్లేఖనంలో ‘నయీమ్ బిన్ నిహామ్’ అని ప్రస్తావించబడిన పేరు తప్పు. సరయిన పేరు నయీమ్ నిహాం. నిహాం అనేది ఆయన బిరుదు, ఆయన తండ్రి పేరు కాదు. ఆయన తండ్రి పేరు అబ్దుల్లా. దీనిక్కారణం మరో ఉల్లేఖనంలో దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు. “నేను స్వర్గంలో ప్రవేశించాను (మేరాజ్ సంఘటన సందర్భంగా) అక్కడ నాకు నయీమ్ స్వరం (నహ్మ) వినిపించింది”.

ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) దృక్పథం ప్రకారం, యజమాని చనిపోకముందు, ముదబ్బిర్ బానిసలను అమ్మడం ధర్మసమ్మతమే. కాని ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్), ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్)ల దృక్పథం ప్రకారం ఇలా అమ్మడం సరయిన పద్ధతి కాదు.

మహా ప్రవక్త మహితోక్తులు|27. విశ్వాస ప్రకరణం (ప్రతిజ్ఞలు, ప్రమాణాలు – వాటి ఆజ్ఞలు)|హదీసు 1084