మహా ప్రవక్త మహితోక్తులు – 25. వీలునామా ప్రకరణం

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ
ఉర్దూ అనువాదం: సయ్యిద్ షబ్బీర్ అహ్మద్ · తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అల్-లూలు వల్ మర్జాన్ – మహా ప్రవక్త మహితోక్తులు (అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ) – అరబీ, తెలుగు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) – 25. వీలునామా ప్రకరణం. ఇందులో 9 హదీసులు (హదీసు 1052 – 1060), 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి హదీసు తెలుగు అనువాదం, అరబీ మూలంతో.

⬇ డౌన్లోడ్ PDFవీలునామా ప్రకరణం5 పేజీలు · 0.3 MB

25. వీలునామా ప్రకరణం

كتاب الوصية
అధ్యాయాలు (5)
  1. – వీలునామా ఆజ్ఞలు, నియమాలు. H 1052
  2. 1 వీలునామా మొత్తం ఆస్తిలో మూడోవంతుకు మాత్రమే వర్తిస్తుంది H 1053 – 1054
  3. 2 మృతునికి దానధర్మాల పుణ్యం చేరుతుంది H 1055
  4. 4 వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆజ్ఞలు H 1056
  5. 5 వీలునామా రాయడానికి విషయమేదీ లేనపుడు వీలునామా రాయకపోవడంలో తప్పులేదు H 1057 – 1060

వీలునామా ఆజ్ఞలు, నియమాలు.

1052

హదీసు 1052

حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَا حَقُّ امْرِىءٍ مُسْلِمٍ لَهُ شَيْءٌ يُوصِي فِيهِ يَبِيتُ لَيْلَتَيْنِ إِلاَّ وَوَصِيَّتُهُ مَكْتُوبَةٌ عِنْدَهُ

أخرجه البخاري في: 55 كتاب الوصايا: 1 باب الوصايا

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు:- “ఒక ముస్లిం ఏదైనా వస్తువు కలిగి ఉండి దాని విషయంలో వీలునామా వ్రాయదలచినపుడు (వెంటనే వ్రాయాలి), రెండు రాత్రులు గడచిపోయినా వీలునామా వ్రాయకుండా దాన్ని అట్లే ఉంచడం అతనికి వాంఛనీయం కాదు”.

[సహీహ్ బుఖారీ : 55వ ప్రకరణం – వసాయా, 1వ అధ్యాయం – అల్ వసాయా]

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1052

1వ అధ్యాయం – వీలునామా మొత్తం ఆస్తిలో మూడోవంతుకు మాత్రమే వర్తిస్తుంది

1053

హదీసు 1053

باب الوصية بالثلث

حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ رضي الله عنه، قَالَ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَعُودُنِي عَامَ حَجَّةِ الْوَدَاعِ، مِنْ وَجَعٍ اشْتَدَّ بِي، فَقُلْتُ: إِنِّي قَدْ بَلَغَ بِي مِنَ الْوَجَعِ وَأَنَا ذُو مَالٍ، وَلاَ يَرِثُنِي إِلاَّ ابْنَةٌ، أَفَأَتَصَدَّقُ بِثُلُثَيْ مَالِي قَالَ: لاَ فَقُلْتُ: بِالشَّطْرِ فَقَالَ: لاَ ثُمَّ قَالَ: الثُّلُثُ، وَالثُّلُثُ كَبِيرٌ أَوْ كَثِيرٌ، إنَّكَ أَنْ تَذَرَ وَرَثَتَكَ أَغْنِيَاءَ خَيْرٌ مِنْ أَنْ تَذَرَهُمْ عَالَةً يَتَكَفَّفُونَ النَّاسَ، وَإِنَّكَ لَنْ تُنْفِقَ نَفَقَةً تَبْتَغِي بِهَا وَجْهَ اللهِ إِلاَّ أُجِرْتَ بِهَا حَتَّى مَا تَجْعَلُ فِي فِي امْرَأَتِكَ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ أُخَلَّفُ بَعْدَ أَصْحَابِي قَالَ: إِنَّكَ لَنْ تُخَلَّفَ فَتَعْمَلَ عَمَلاً صَالِحًا إِلاَّ ازْدَدْتَ بِهِ دَرَجَةً وَرِفْعَةً، ثُمَّ لَعَلَّكَ أَنْ تُخَلَّفَ حَتَّى يَنْتَفِعَ بِكَ أَقْوَامٌ وَيُضَرَّ بِكَ آخَرُونَ، اللهُمَّ أَمْضِ لأَصْحَابِي هِجْرَتَهُمْ وَلاَ تَرُدَّهُمْ عَلَى أَعْقَابِهِمْ، لكِنَ الْبَائِسُ سَعْدُ ابْنُ خَوْلَةَ، يَرْثِي لَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ مَاتَ بِمَكَّةَ

أخرجه البخاري في: 23 كتاب الجنائز: 37 باب رثي النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سعد بن خولة

హజ్రత్ సాద్ బిన్ అబీ వఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- వీడ్కోలు హజ్ జరిగిన యేడు నేను వ్యాధితో తీవ్రంగా బాధపడుతుంటే దైవప్రవక్త ﷺ నన్ను పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు నేను ఆయనతో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నా జబ్బు బాగా ముదిరిపోయింది. నేను ధనవంతుడ్ని. నాకు ఒక్క కూతురు తప్ప వారసులు లేరు. ఈ స్థితిలో నేను మూడింట రెండొంతులు ఆస్తిని దానం చేయవచ్చా?” అని అడిగేను నేను. “లేదు, అర్ధభాగం కూడా చేయకూడదు” అన్నారు దైవప్రవక్త ﷺ.

ఆ తర్వాత ఆయన ఇలా ప్రవచించారు; “మూడింట ఒక వంతు ఆస్తిని దానం చెయ్యి. నిజానికి ఇది కూడా ఎక్కువే. నీ వారసులు ప్రజల ముందు చేతులు జాపి దేబరించేలా వారిని నిరుపేదలుగా, నిరాధారులుగా చేసి వెళ్ళడం కంటే స్థితిపరులుగా చేసి వెళ్ళడం ఎంతో ఉత్తమం. నీవు ఏది ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టేటప్పుడు దైవప్రసన్నత పొందడం నీ ఉద్దేశ్యమయి ఉంటే నీకు దాని పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది. చివరికి నీ భార్య కోసం వెచ్చించే ధనం కూడా నీకు పుణ్యం ఆర్జించి పెడుతుంది.”

ఆ తర్వాత నేను “(సరే) దైవప్రవక్తా! నా స్నేహితులంతా మదీనా వెళ్ళిపోతే, నేను వెనకబడిపోయి ఇక్కడ మక్కాలోనే ఉండిపోవలసి వస్తుందా?” ★ అని అడిగాను. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు. “ఎంత మాత్రం లేదు. నీవు ఎవరి వెనుకా ఉండిపోవు. నీ హోదా అంతస్తులు పెరిగే విధంగా (భవిష్యత్తులో) నీవు ఎన్నో ఘనకార్యాలు చేయవలసి ఉంది. అదీగాక నీ వలన అనేకమందికి ప్రయోజనం చేకూరి, అనేక మందికి నష్టం వాటిల్లే వరకు నీవు బహుశా జీవించి ఉంటావు. అల్లాహ్! నా అనుచరుల హిజ్రత్ (వలస) కార్యాన్ని పూర్తిగా నెరవేరనివ్వు. వారిని వెనక్కి పంపివేయకు. అయితే పాపం సాద్ బిన్ ఖౌలా (రదియల్లాహు అన్హు) మాత్రం దురదృష్టవంతుడు”. దైవప్రవక్త ﷺ ఇలా చెప్పడం ద్వారా సాద్‌బిన్ ఖౌలా (రదియల్లాహు అన్హు) మక్కాలో చనిపోయి అక్కడే ఖననం కావడం పట్ల తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు.

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 37వ అధ్యాయం – రిసాయిన్నబీ ﷺ సాద్ బిన్ ఖౌలా]

★ “నేను వెనుకపడిపోయి ఇక్కడే ఉండిపోవలసి వస్తుందా?” అంటే నాకు మక్కాలోనే చావచ్చి అంత్యక్రియలు జరిగిపోతాయా? అన్నది అంతరార్థం. మక్కా నుండి మదీనా వలసపోయిన ముస్లింలకు మక్కాలో చనిపోవడం ఇష్టం లేదు. పోతే “నీ వల్ల అనేక మందికి ప్రయోజనం చేకూరి, ఇతరులకు నష్టం వాటిల్లుతుంది” అన్న దైవ ప్రవక్త ﷺ పలుకుల్లో భవిష్యత్ ప్రకటన తొంగి చూస్తోంది. అది నిజం అని తేలింది కూడా. హజ్రత్ సాద్ బిన్ అబీ వఖాస్ (రదియల్లాహు అన్హు) మూలంగానే ముస్లిం యోధులు ఈరాన్, ఇరాఖ్‌లలో విజయపతాకాలు ఎగరవేశారు. ఈ యుద్ధాలలో ముస్లింలకు ఎంతో ప్రయోజనం చేకూరగా అవిశ్వాసులకు ఎంతో నష్టం వాటిల్లింది.

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1053

1054

హదీసు 1054

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: لَوْ غَضَّ النَّاسُ إِلَى الرُّبُعِ؛ لأَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: الثُّلُثُ، وَالثُّلُثُ كَثِيرٌ أَوْ كَبِيرٌ

أخرجه البخاري في: 55 كتاب الوصايا: 3 باب الوصية بالثلث

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అంటున్నారు:- అయ్యో! ప్రజలు (మూడింట ఒక వంతును ఇంకా తగ్గించి) నాల్గింట ఒక వంతుకు వీలును మారిస్తే ఎంత బాగుండు!! ఎందుకంటే దైవప్రవక్త ﷺ “మూడింట ఒక వంతు కూడా చాలా ఎక్కువే” ★ అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 55వ ప్రకరణం – వసాయా, 3వ అధ్యాయం – అల్ వసీయతి బిస్సుల్స్]

★ అత్యధిక మంది ధర్మవేత్తల ఏకాభిప్రాయం ప్రకారం వారసులు కలిగి ఉన్న వ్యక్తి మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఆస్తికి వీలునామా రాసిపోయినప్పటికీ అది చెల్లదు. వారసులు అనుమతిస్తే మాత్రం చెల్లుతుంది. ఏమయినప్పటికీ మూడింట ఒక వంతుకు కొంచెం తక్కువ ఆస్తికి వీలునామా వ్రాయడమే మంచిది.

హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) అయిదింట ఒక వంతుకు మాత్రమే వీలునామా రాశారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా), హజ్రత్ ఇస్‌హాఖ్ (రదియల్లాహు అన్హు)లు నాల్గింట ఒక వంతుకు వీలునామా రాశారు. మరికొందరు సహబీలు (రదియల్లాహు అన్హు) ఆరింట ఒక వంతుకు, ఇంకా కొందరు సహాబీలు పదింట ఒక వంతుకు వీలునామా రాశారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా), హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ల అభిప్రాయం ప్రకారం, వారసులు ఎక్కువ మంది ఉండి ఆస్తి తక్కువగా ఉన్నప్పుడు అసలు వీలునామా రాయకపోవడమే మంచిది.

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1054

2వ అధ్యాయం – మృతునికి దానధర్మాల పుణ్యం చేరుతుంది

1055

హదీసు 1055

باب وصول ثواب الصدقات إلى الميت

حديث عَائِشَةَ، أَنَّ رَجُلاً قَالَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ أُمِّي افْتُلِتَتْ نَفْسُهَا وأَظُنُّهَا لَوْ تَكَلَّمَتْ تَصَدَّقَتْ، فَهَلْ لَهَا أَجْرٌ إِنْ تَصَدَّقْتُ عَنْهَا قَالَ: نَعَمْ

أخرجه البخاري في: 23 كتاب الجنائز: 95 باب موت الفجأة البغتة

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒకతను దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి “నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. (చనిపోయేముందు) ఆమె మాట్లాడగలిగి ఉంటే దైవమార్గంలో దానం చేసి ఉండేదని నేను భావిస్తున్నాను. మరి నేనిప్పుడు ఆమె తరపున దానం చేస్తే దాని పుణ్యం ఆమెకు చేరుతుందా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త ﷺ చేరుతుందని చెప్పారు.

[సహీహ్ బుఖారీ : 23వ ప్రకరణం – జనాయెజ్, 95వ అధ్యాయం – మౌతిల్ పుజా అతి బగ్‌తత]

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1055

4వ అధ్యాయం – వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఆజ్ఞలు

1056

హదీసు 1056

باب الوقف

حديث ابْنِ عُمَرَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ أَصَابَ أَرْضًا بِخَيْبَرَ، فَأَتَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْتَأْمِرُهُ فِيهَا، فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنِّي أَصَبْتُ أَرْضًا بِخَيْبَرَ لمْ أُصِبْ مَالاً قَطُّ أَنْفَسَ عِنْدِي مِنْهُ، فَمَا تَامُرُ بِهِ قَالَ: إِنْ شِئْتَ حَبَّسْتَ أَصْلَهَا وَتَصَدَّقْتَ بِهَا قَالَ: فَتَصَدَّقَ بِهَا عُمَرُ أَنَّهُ لاَ يُبَاعُ وَلاَ يُوهَبُ وَلاَ يُورَثُ، وَتَصَدَّقَ بِهَا فِي الْفُقَرَاءِ وَفِي الْقُرْبَى وَفِي الرِّقَابِ وَفِي سَبِيلِ اللهِ وَابْنِ السَّبِيلِ وَالضَّيْفِ، لاَ جُنَاحَ عَلَى مَنْ وَلِيَهَا أَنْ يَأكُلَ مِنْهَا بِالْمَعْرُوفِ وَيُطْعِمَ، غَيْرَ مُتَمَوِّلٍ قَالَ (الرَّاوِي) : فَحَدَّثْتُ بِهِ ابْن سِيرِينَ، فَقَالَ: غَيْرَ مُتَأَثِّلٍ مَالاً

أخرجه البخاري في: 54 كتاب الشروط: 19 باب الشروط في الوقف

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)కు ఖైబర్ (ప్రాంతం)లో కొంత (వ్యవసాయ) భూమి లభించింది. దాని వినియోగం గురించి విచారించడానికి ఆయన దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళి “దైవప్రవక్తా! నాకు ఖైబర్‌లో కొంత భూమి దొరికింది. ఇది ఎంతో మంచి భూమి (సారవంతమైన నేల). ఇలాంటి భూమి నాకు ఇదివరకెప్పుడూ లభించలేదు. మరి దీన్ని గురించి మీ హితోపదేశం ఏమిటో సెలవియ్యండి” అని అన్నారు. దానికి దైవప్రవక్త ﷺ సమాధానమిస్తూ “నీవు కావాలనుకుంటే భూమి యాజమాన్య హక్కును నీ కోసం ఉంచుకొని దానికి (రాబడి)ని దానం చెయ్యి” అని అన్నారు.

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ ఆదేశాన్ని శిరసావహిస్తూ, భూమి ఒకవైపు అమ్ముడుపోకుండా మరొకవైపు ఎవరికీ దాన్ని ఇనాముగా ఇవ్వడానికి వీలు లేకుండా, వేరొక వైపు వారసులకు పంపకం కాకుండా ఉంచి, దాని రాబడిని నిరుపేదలు, బంధువులు, బానిసల దాస్య విముక్తి, రుణగ్రస్తుల రుణ విముక్తి, బాటసారులు, అతిథులు, ఇతర సత్కార్యాల కోసం వినియోగమయ్యేలా దానం చేశారు. అయితే దాని రక్షణ కోసం నియమించబడిన ధర్మకర్తకు దాని రాబడిలో కొంత భాగాన్ని సముచితమైన రీతిలో తాను, తన భార్యాపిల్లలు అనుభవించడానికి అనుమతి ఉంది. కాని (తద్వారా) ఆస్తి కూడ బెట్టుకోవడానికి అతనికి ఎలాంటి అధికారం లేదు.

హదీసు ఉల్లేఖకుని కథనం:- నేనీ హదీసుని ఇబ్నె సైరీన్ (రహిమహుల్లాహ్) ముందు ప్రస్తావించినపుడు ఆయన ఇలా అన్నారు; “ధర్మకర్త ఈ వఖ్ఫ్ ఆస్తిని ధనికుడయిపోవాలన్న కాంక్షతో, స్వప్రయోజనాలు ఆశించి ఖర్చు చేయడానికి వీల్లేదు”.

[సహీహ్ బుఖారీ : 54వ ప్రకరణం – అష్షురూత్, 19వ అధ్యాయం – అష్షురూతి ఫిల్ వఖ్ఫ్]

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1056

5వ అధ్యాయం – వీలునామా రాయడానికి విషయమేదీ లేనపుడు వీలునామా రాయకపోవడంలో తప్పులేదు

1057

హదీసు 1057

باب ترك الوصية لمن ليس له شيء يوصي فيه

حديث عَبْدِ اللهِ بْنِ أَبِي أَوْفَى عَنْ طَلْحَةَ ابْنِ مُصَرِّفٍ قَالَ: سَأَلْتُ عَبْدَ اللهِ بْنَ أَبِي أَوْفَى هَلْ كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَوْصى قَالَ: لاَ فَقُلْتُ: كَيْفَ كُتِبَ عَلَى النَّاس الْوَصِيَّةُ، أَوْ أُمِرُوا بِالْوَصِيَّةِ قَالَ: أَوْصى بِكِتَابِ اللهِ

أخرجه البخاري في: 55 كتاب الوصايا: 1 باب الوصايا وقول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وصية الرجل مكتوبة عنده

హజ్రత్ తల్హా బిన్ మసర్రఫ్ (రహిమహుల్లాహ్) కథనం:- నేనొకసారి హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీఔఫా (రదియల్లాహు అన్హు) గారిని “దైవప్రవక్త ﷺ వీలునామా రాశారా?” అని అడిగాను. దానికాయన లేదన్నారు. “మరి ప్రజలకు వీలునామా (ఆజ్ఞ)ను ఎలా విధించారు? లేక ప్రజలకు వీలునామా ఆజ్ఞ ఎలా ఇచ్చారు?’ ’ అని అడిగాను నేను.( హజ్రత్ తల్హా (రదియల్లాహు అన్హు) ఇక్కడ ఎలాంటి పదాలు వాడారో ఉల్లేఖకునికి సరిగా గుర్తులేదు) అప్పుడు హజ్రత్ అబ్దుల్లా బిన్ అబీ ఔఫా (రదియల్లాహు అన్హు) “దైవగ్రంధాన్ని గట్టిగా పట్టుకొని దాని ప్రకారం నడచుకోవాలని దైవప్రవక్త ﷺ ఉపదేశించారు కదా!” అని అన్నారు. ★

[సహీహ్ బుఖారీ : 55వ ప్రకరణం – అల్‌వసాయా, 1వ అధ్యాయం – అల్‌వసాయా వఖౌలిన్నబీ ﷺ]

★ దైవప్రవక్త ﷺ ఎలాంటి ఆస్తి వదలి పెట్టిపోలేదు గనక ఆయన ధన వ్యవహారంలో వీలునామా రాయలేదు. కాని దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకొని దాని ప్రకారం నడచుకోవాలని మాత్రం వీలునామా రాసిపోయారు. వారసులకు ఆస్తి పంపకం విషయంలో వీలునామా విధి గురించి ఖుర్‌ఆన్‌లో ఉంది. అయితే కొంత కాలానికి వారసుల వాటాలు స్వయంగా అల్లాహ్ (నిసా సూరాలో) నిర్ణయించినందున, ఈ వీలునామా విధి రద్దయిపోయింది.

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1057

1058

హదీసు 1058

حديث عَائِشَةَ، عَنِ الأَسْوَدِ، قَالَ: ذَكَرُوا عِنْدَ عَائِشَةَ أَنَّ عَلِيًّا رضي الله عنه كَانَ وَصِيًّا فَقَالَتْ: مَتَى أَوْصَى إِلَيْهِ وَقَدْ كُنْتُ مُسْنِدَتَهُ إِلَى صَدْرِي، أَوْ قَالَتْ: حَجْرِي، فَدَعَا بِالطَّسْتِ، فَلَقَدِ انْخَنَثَ فِي حَجْرِي فَمَا شَعَرْتُ أَنَّهُ قَدْ مَاتَ، فَمَتَى أَوْصى إِلَيْهِ

أخرجه البخاري في: 55 كتاب الوصايا: 1 باب الوصايا وقول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وصية الرجل مكتوبة عنده

హజ్రత్ అస్వద్ బిన్ యజీద్ (రహిమహుల్లాహ్) కథనం:- ప్రజలు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ముందు “హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ నుండి (ఆయన) వీలునామా అమలు పరచడానికి అధికారం పొందిన వ్యక్తి” అని ప్రస్తావించారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ మాట విని ఇలా అన్నారు: “దైవప్రవక్త ﷺ ఆయనకు వీలునామా గురించి ఎప్పుడు ఉపదేశించారు? నేను దైవప్రవక్త ﷺను అక్కున చేర్చుకొని కూర్చున్నాను (లేదా ఆమె ఇలా అన్నారు). దైవప్రవక్త ﷺ నా వడిలో (పడుకొని) ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఒక పళ్ళెం తెప్పించారు. ఆయన (లేవడానికి ప్రయత్నించి) నా వడిలో పడిపోయారు. నాకప్పుడు ఆయన తుదిశ్వాస విడిచి పెట్టారన్న సంగతి కూడా తెలియదు. అలాంటప్పుడు ఆయన అలీ (రదియల్లాహు అన్హు)కి వీలునామా ఉపదేశం ఎప్పుడు చేసినట్లు?”

[సహీహ్ బుఖారీ : 55వ ప్రకరణం – అల్‌వసాయా, 1వ అధ్యాయం – అల్‌వసాయా ఖౌలిన్నబీ ﷺ]

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1058

1059

హదీసు 1059

حديث ابْنِ عَبَّاسٍ، أَنَّهُ قَالَ: يَوْمُ الْخَمِيسِ، وَمَا يَوْمُ الْخَمِيسِ ثمَّ بَكَى حَتَّى خَضَبَ دَمْعُهُ الْحَصْبَاءَ، فَقَالَ: اشْتَدَّ بِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَجَعُهُ يَوْمَ الْخَمِيسِ، فَقَالَ: ائْتُونِي بِكِتَابٍ، أَكْتُبْ لَكُمْ كِتَابًا لَنْ تَضِلُّوا بَعْدَهُ أَبَدًا فَتَنَازَعُوا، وَلاَ يَنْبَغِي عِنْدَ نَبِيٍّ تَنَازُعٌ فَقَالُوا: هَجَرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: دَعُونِي فَالَّذِي أَنَا فِيهِ خَيْرٌ مِمَّا تَدْعُونِي إِلَيْهِ وَأَوْصى عِنْدَ مَوْتِهِ بِثَلاَثٍ: أَخْرِجُوا الْمُشْرِكِينَ مِنْ جَزِيرَةِ الْعَرَبِ، وَأَجِيزُوا الْوَفْدَ بِنَحْوِ مَا كُنْتُ أُجِيزُهُمْ وَنَسِيتُ الثَّالِثَةَ

أخرجه البخاري في: 56 كتاب الجهاد: 176 باب هل يستشفع إلى أهل الذمة ومعاملتهم

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గురువారం గురించి ప్రస్తావిస్తూ “గురువారం గురించి మీకేమైనా తెలుసా?” అని అడిగారు. అలా చెప్పిన వెంటనే ఆయన కళ్ళు అశ్రుపూరితాలయి ప్రవహించసాగాయి. నేలమీది కంకర సయితం కన్నీటితో తడిసిపోయే అంతగా దుఃఖించారు ఆయన. ఆ తర్వాత ఇలా అన్నారు –

“గురువారం దైవప్రవక్త ﷺ వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో ఆయన ﷺ “నేను మీకొక దస్తావీజు రాసిస్తాను. వ్రాత సామగ్రి తీసుకురండి, ఈ దస్తావీజు ఉంటే ఇక మీరెన్నడూ దారి తప్పరు” అని అన్నారు. ప్రజలు ఈ మాట విని పరస్పరం భేదాభిప్రాయాల్లో పడిపోయారు. దైవప్రవక్త ﷺ సన్నిధిలో ఇలా వాదులాడుకోవడం మంచి పని కాదు. వారిలో కొందరు “(దైవప్రవక్తా!) మీరు మమ్మల్ని వదలిపెడ్తున్నారా?” అని అడిగారు. (ఈ మాటల్లో ‘మీరు బోధించిన బోధనలు అస్పష్టంగా ఉన్నాయా?’ అనే అర్థం కూడా ఇమిడి ఉంది) దైవప్రవక్త ﷺ ఈ పరిస్థితి చూసి “(మీరంతా) నా దగ్గర్నుంచి వెళ్ళిపొండి. మీరు నన్ను (పరస్పరం జగడమాడుకుంటూ) ఇరికించిన స్థితి కంటే ప్రస్తుతం నేనున్న స్థితే మంచిది. అందువల్ల నన్ను నా మానాన వదలిపెట్టండి” అని అన్నారు.

ఆ తర్వాత హజ్రత్ అబ్దుల్లాబిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ ఇలా అన్నారు :- “దైవప్రవక్త ﷺ ఇహలోకం వీడిపోతూ మూడు ఉపదేశాలు చేశారు. ఒకటి: బహుదైవారాధకుల్ని అరేబియా ద్వీపం నుండి తీసివేయడం. రెండు: మీరు ఇక ముందు వచ్చే ప్రతినిధి వర్గాలకు కూడా నేను గౌరవించినట్లే బాగా గౌరవించి ఆతిథ్యమివ్వాలి. మూడో విషయం నేను మరచిపోయాను.”★

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, 176వ అధ్యాయం – హల్ యుస్తష్ ఫవు ఇలా అహ్లిజ్జిమ]

★ మూడో విషయం గురించి ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ సమస్యపై సహాబీలలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు దైవప్రవక్త ﷺ తన అంత్య దశలో హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ని (సేనాపతిగా నియమించి) సైన్యాన్ని తీసుకొని (యుద్ధానికి) బయలుదేరవలసిందిగా ఆదేశించారని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు. అందువల్ల కొందరు ధర్మవేత్తలు మూడో విషయం ఇదే అయి ఉంటుందని భావించారు. మరి కొందరు ధర్మవేత్తల ప్రకారం, దైవప్రవక్త ﷺ మూడవ ఉపదేశంగా తన సమాధిని విగ్రహాలయంగా చేసుకొని పూజించకూడదని అన్నారు. వాస్తవం అల్లాహ్ కే తెలుసు.

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1059

1060

హదీసు 1060

حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: لَمَّا حُضِرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَفِي الْبَيْتِ رِجَالٌ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: هَلُمُّوا أَكْتُبْ لَكُمْ كِتَابًا لاَ تَضِلُّوا بَعْدَهُ فَقَالَ بَعْضُهُمْ: إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَدْ غَلَبَهُ الْوَجَعُ، وَعِنْدَكُمْ القُرْآنُ، حَسْبُنَا كِتَابُ اللهِ فَاخْتَلَفَ أَهْلُ الْبَيْتِ وَاخْتَصَمُوا؛ فَمِنْهُمْ مَنْ يَقُولُ: قَرِّبُوا يَكْتُبْ لَكُمْ كِتَابًا لاَ تَضِلُّوا بَعْدَهُ وَمِنْهُمْ مَنْ يَقُولُ غَيْرَ ذلِكَ فَلَمَّا أَكْثَرُوا اللَّغْوَ وَالاخْتِلافَ، قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قُومُوا قَالَ عُبَيْدُ اللهِ (الرَّاوِي) فَكَانَ يَقُولُ ابْنُ عَبَّاسٍ: إِنَّ الرَّزِيَّةَ كُلَّ الرَّزِيَّةِ مَا حَالَ بَيْنَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَبَيْنَ أَنْ يَكْتُبَ لَهُمْ ذلِكَ الْكِتَابَ، لاِخْتِلاَفِهِمْ وَلَغَطِهِمْ

أخرجه البخاري في: 64 كتاب المغازي: 83 باب مرض النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ووفاته

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం:- దైవప్రవక్త ﷺకు మరణ ఘడియ ఆసన్నమయినపుడు ఆయన ఇంట్లో చాలా మంది జనం గుమిగూడారు. దైవప్రవక్త ﷺ వారిని ఉద్దేశించి “రాత సామగ్రి తీసుకు రండి. నేను మీకు మీరెన్నటికీ దారి తప్పని విధంగా ఒక దస్తావేజు రాసిస్తాను” అని అన్నారు. అప్పుడు కొందరు పరస్పరం (మాట్లాడుకుంటూ) “దైవప్రవక్త ﷺ పరిస్థితి ఇప్పుడు విషమించింది. (ఈ స్థితిలో ఆయన్ని మరింత బాధపెట్టకూడదు) మన దగ్గర దివ్యఖుర్‌ఆన్ ఉంది. మనకీ దైవగ్రంథం చాలు” అని అన్నారు. దాంతో ఇంటి ముందు గుమిగూడిన జనంలో పరస్పరం విభేదాలు పొడసూపాయి. వారు పరస్పరం పోట్లాటకు దిగారు. కొందరు తమ అభిప్రాయం వ్యక్తపరుస్తూ “రాత సామగ్రి తీసుకొస్తే, దైవప్రవక్త ﷺ మన కోసం ఇక ముందు మనం ఎన్నడూ దారి తప్పడానికి ఆస్కారం లేకుండా దస్తావీజు రాస్తారు కదా!” అని అన్నారు. మరి కొందరు వారితో విభేదించారు. ఈ విధంగా వ్యర్థ సంభాషణ, భేదాభిప్రాయాలు, పోట్లాటలు మితిమీరిపోవడంతో దైవప్రవక్త ﷺ (విసుగెత్తిపోయి) “ఇక్కడ్నుంచి మీరంతా వెళ్ళిపోండి” అని అన్నారు.

ముస్లింలపై వచ్చి పడిన ఈ ఆపద పెద్ద ఆపదే. అప్పుడు ప్రజల్లో విభేదాలు వచ్చి పరిస్థితి గందరగోళంగా మారడం వల్లనే దైవప్రవక్త ﷺ వీలునామా రాయించడం మానేశారు.

[సహీహ్ బుఖారీ : 64వ ప్రకరణం – మగాజీ, 53వ అధ్యాయం – మరజున్నబీ ﷺ వవఫాతిహీ]

మహా ప్రవక్త మహితోక్తులు|25. వీలునామా ప్రకరణం|హదీసు 1060