[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
కలిమయె తౌహీద్: లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం
లాఇలాహ ఇల్లల్లాహ్, ఇస్లాం యొక్క పునాది. ఇస్లాంలో దాని స్థానం చాలా గొప్పది. అది ఇస్లాం స్థంబాలలో మొదటిది. విశ్వాస భాగాలలో ఉన్నత భాగం. మరియు సత్కార్యాల అంగీకారము ఆ వచనాన్ని హృదయ పూర్వకంగా పఠించి దాని అర్దాన్ని తెలుసుకొని, దాని ప్రకారం ఆచరించడంపైనే ఆధారపడి ఉంది.
దాని వాస్తవ అర్థం: “వాస్తవంగా అల్లాహ్ తప్ప వేరెవరు ఆరాధనలకు అర్హులు కారు“. ఇదే సరియైన అర్థం. ఇది కాక ‘అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడు లేడు’, ‘అల్లాహ్ తప్ప శూన్యము నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవడు లేడు’ లేక ‘విశ్వంలో అల్లాహ్ తప్ప మరేమి లేదు’ అనే భావాలు (లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం) కావు.
ఈ పవిత్ర వచనములో రెండు విషయాలు (రుకున్ లు) ఉన్నాయి:
(1) నిరాకరించుట, ఇది ‘లాఇలాహ‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఈశ్వరత్వాన్ని, ఆరాధన అర్హతను) ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.
(2) అంగీకరించుట, ఇది ‘ఇల్లల్లాహ్‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధనల)కు అర్హత గల అద్వితీయుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట.
అల్లాహ్ తప్ప మరెవ్వరి ఆరాధన, ప్రార్థన చేయరాదు. ఆరాధన లోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట యోగ్యం లేదు.
ఏ వ్యక్తి ‘లాఇలాహ ఇల్లల్లాహ్‘ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పఠిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో మరియు దృఢ విశ్వాసముతో బహుదైవారాధనను తిరస్కరించి, అల్లాహ్ ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ ముస్లిం (విధేయుడు). ఇలాంటి విశ్వాసముంచకుండా ఆచరించువాడు మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు). మరియు దీనికి వ్యతిరేకంగా ఆచరించువాడు అది అతను నోటితో పలికినా ముష్రిక్ (బహుదైవారాధకుడు), కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడు.
లాఇలాహ ఇల్లల్లాహ్ ఘనత:
ఈ పవిత్ర వచన ఘనతలు, లాభాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని క్రింద తెలుపబడుతున్నని.
1- తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా, అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లాఇలాహ ఇల్లల్లాహ్ అడ్డుపడుతుంది. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం చెప్పారు:
“లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని హృదయంలో గోదుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో ఇసుమంత / రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44, ముస్లిం 193).
2- మానవులు, జిన్నాతులు దీని (లాఇలాహ ఇల్లల్లాహ్) కొరకే పుట్టించ బడ్డారు. సూరా జారియాత్ (51: 56)లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(నేను మానవులను జిన్నాతులను నన్ను ఆరాధించుటకే సృష్టించాను).
పై ఆయతులో ‘యఅ౯ బుదూన్‘ అన్న పదానికి అర్థం ఆరాధించుట, అంటే ఆరాధనలో అల్లాహ్ ఏకత్వాన్ని పాటించుట.
3- ప్రవక్తలను పంపబడింది, గ్రంథాలను అవతరింప జేయబడింది దీని ప్రచారం కొరకే. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండి:
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ
(నీకు పూర్వం మేము ప్రతి ప్రవక్తకు ‘నేను తప్ప వేరు ఆరాధింపదగిన దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించండి’ అని సందేశం పంపియున్నాము). (అంబియా 21: 25).
4- ప్రవక్తల ప్రచార ఆరంభం ఇదే (లాఇలాహ ఇల్లల్లాహ్). ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే పిలుపునిచ్చాడు. చదవండి అల్లాహ్ ఆదేశం:
يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ
(మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప వేరు దేవుడు మీకు లేడు). (సూరయే ఆరాఫ్ 7: 73).
లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలు:
ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించినట్లు.
1- ఇల్మ్ (జ్ఞానం): పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) అనంగీకారం, అంగీకారం మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము, తుచ్చము‘ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.
అల్లాహ్ ఆదేశం:
(తెలుసుకో! అల్లాహ్ తప్ప వేరు ఆరాధింపదగిన వాడెవడు లేడు అని)
(ముహమ్మద్ 47: 19).
ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః
‘వాస్తవ ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప’ అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు“. (ముస్లిం 26).
2- యఖీన్ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.
సూర హుజురాత్ (49: 15)లో అల్లాహ్ ఆదేశం:
إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا
(ఎవరు అల్లాహ్ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడని మరియు నేను అల్లాహ్ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).
3- ఖుబూల్ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు.
అల్లాహ్ ఇదే ఆదేశమిచ్చాడు:
آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
[ప్రవక్త తన ప్రభువు నుండి తనకు నొసంగబడిన గ్రంథమును విశ్వసించారు. విశ్వాసులు కూడా విశ్వసించారు. అందరు అల్లాహ్ను, అతని దూతలను, గ్రంథములను, ప్రవక్తలను విశ్వసిస్తూ ‘మేము ఆయన ప్రవక్తల మధ్య వ్యత్యాసము పాటించము, మేము వింటిమి విధేయులైతిమి, మా ప్రభువా! నీ మన్నింవును వేడుకొను చున్నాము, నీ వద్దకే మరలి వచ్చువారలము’ అని అంటారు]. (బఖర 2: 285).
ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకు: కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)
وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ
(అల్లాహ్, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీనుకునే హక్కు లేదు). (అహ్ జాబ్ 33: 36).
4- ఇన్ఖియాద్ (లొంగిపోవుట, శిరసావహించుట): పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్ ఖియాద్ మరియు ఖబూల్ లో తేడా ఏమనగా? ఖబూల్ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్ఖియాద్ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకు వచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే అతను ఇన్ఖియాద్ యొక్క నిబంధన పాటించనట్లే.
అల్లాహ్ ఇలా సంభోదించాడు:
وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ
మీరు మీ ప్రభువు వైెవునుకు మరలి ఆయనకే విధేయత చూపండి. (జుమర్ 39: 54).
మరో చోట (నిసా 4: 65) లో ఇలా ఆదేశించాడు:
فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا
(నీ ప్రభువు సాక్షిగా! వారు తమలోని జగడముల తీర్పునకై నిన్ను న్యాయ నిర్ణేతగా మరియు నీవు చేయు తీర్పును గూర్చి వారుతమ మనున్సులో సంకట పడక సంతోషముతో అంగీకరించనంత వరకు వారు విశ్వాసులు కారు).
5- సిద్ఖ్ : (సత్యత): మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి.
సూర తౌబా (9:119)లో అల్లాహ్ ఆదేశం:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ
(ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులతో ఉండండి).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు:
“హృదయాంతర సత్యముతో ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ పఠించినవారు స్వర్గంలో చేరుదురు”. (ముస్నద్ అహ్మద్ ).
ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని భావర్ధాలను మనస్ఫూర్తిగా నమ్మకుండా ఉన్నట్లయితే అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్ ఆదేశించాడు, అంతే కాదు, ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు.
సూర నూర్ (24: 54)లో ఉంది:
أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(అల్లాహ్ కు విధేయులు కండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులు కండి).
6- ఇఖ్లాస్: మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్పపరంగా షిర్క్ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్ యేతరుని ప్రేమలో, అల్లాహ్ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా తర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్ అభిష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు.
సూర జుమర్ (39: ౩)లో ఉంది:
أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ
(నిస్సందేహంగా, ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే)
وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ
(వారు అల్లాహ్కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆదేశించటం జరిగింది). (బయ్యిన 98: 5).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇత్బాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ చదివిన వారిపై నిశ్చయంగా అల్లాహ్ నరకమును నిషేధించాడు“. (బుఖారి 425, మస్లిం 33).
7- ముహబ్బత్ (ప్రేమ): ఈ పవిత్ర వచనము మరియు దీనికి సంబంధించిన వాటి ప్రేమ.
ముస్లిం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి, వారిద్దరి ప్రేమ అందరి ప్రేమకు మించియుండాలి. ప్రేమకు సంబంధించిన షరతులు వగైరా పూర్తిగా పాటించాలి. అల్లాహ్ను మరియు అల్లాహ్ ప్రేమించువాటిని గౌరవభావంతో, భయం మరియు ఆశలతో ప్రేమించాలి. ఉదా: స్థలాల్లో మక్కా, మదీన, మస్దిదులు. కాలాల్లో: రమజాను, జిల్ హిజ్జ మొదటిదశ వగైరా. మానవుల్లో: ప్రవక్తలు, దూతలు, సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు వగైరా. సత్కార్యాల్లో: నమాజు, జకాతు, ఉపవాసం (రోజా), హజ్జ్. వాచ సంబంధమైన: జిక్ర్ (అల్లాహ్ స్మరణ), ఖుర్ఆన్ పారాయణం వగైరాలు.
మనిషి అల్లాహ్ ప్రేమించువాటిని తన మనుసు, కోరికలు ప్రేమించే వాటిపై ఆధిక్యతివ్వాలి. ఇంకా అల్లాహ్ అసహ్యించుకునేవాటిని అసహ్యించుకోవాలి: అవిశ్వాసులను, అవిశ్వాసాన్ని, పాపాల్ని (అస్లీలతల్ని), అవిధేయతలను అసహ్యించుకోవాలి.
అల్లాహ్ ఆదేశం:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ
(ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో యుద్దం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు). (మాఇద 5: 54).
‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ భావం:
మనోవాక్కుల ద్వారా ఆయన అల్లాహ్ దాసుడు మరియు సర్వ మానవాళికి అల్లాహ్ ప్రవక్త అని విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి, అంటే:
- (1) ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి,
- (2) ఆయన తెలిపిన విషయాలన్ని సత్యం అని నమ్మాలి,
- (3) నిషేధించిన, ఖండించిన వాటికి దూరంగా ఉండాలి,
- (4) ఆయన చూపించిన విధంగానే అల్లాహ్ ను ఆరాధించాలి.
‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ సాక్ష్యం పలికినప్పుడు అందులో ఉన్న రెండు మూల విషయాల్ని (రుకున్ లను) గ్రహించాలి. అవి: ‘అబ్దుహు వ రసూలుహు‘. ఈ రెండు రుకున్లు ఆయన హక్కులో హెచ్చు తగ్గులు చేయుట నుండి కాపాడతాయి. ఆయన ‘అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త‘. ఈ రెండు ఉత్తమ గుణాల ద్వారా ఆయన సర్వ మానవాళిలో గొప్ప ప్రావీణ్యత గలవారు. ఇక్కడ ‘అబ్ద్‘ యొక్క అర్ధం దాసుడు, ఉపాసకుడు అని. అంటే ఆయన మనిషి, ఇతర మనుషులు ఎలా పుట్టారో ఆయన కూడా అలాగే పుట్టారు. మానవులకు ఉన్నటువంటి అవసరాలే ఆయనకు ఉండేవి. సూర కహ్ఫ్ (18:110)లో అల్లాహ్ ఆదేశం:
قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ
(ప్రవక్తా ఇలా చెప్పు: నేను కేవలం ఒక మానవుణ్ణి. మీలాంటి వాణ్ణి).
ఇదే సూరా మొదటి ఆయతులో ఇలా ఉంది:
الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ
(అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన తమ దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ).
‘రసూల్‘ అనగా ఆయన సర్వ మానవాళి వైపునకు శుభవార్తనిచ్చు, హెచ్చరించు ప్రవక్త అని అర్థం. (దీనికి సంబంధించిన ఆధారాలు ఖుర్ఆనులో చాలా ఉన్నాయి. చూడండి సూర సబా (34:28), సూర అంబియా (21:107).
ఈ రెండు ఉత్తమ గుణాలు (రుకున్లు) ఆయన పట్ల అతిశయోక్తి (హెచ్చు) మరియు అమర్యాద (తగ్గు)ల నుండి కాపాడతాయి. ఎలా అనగా ఆయన అనుచరులు అని చెప్పుకునే కొందరు ఈ రోజుల్లో ఆయన స్థానాన్ని, హక్కును అర్థం చేసుకోక అతిశయమించి ఆయన్ని అల్లాహ్తో సమానంగా పోలుస్తున్నారు. అల్లాహ్ను వదలి ఆయనతో మొరపెడుతున్నారు. అవసరాలు తీర్చడం, కష్టాలు తొలగించడం లాంటి అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్న వాటిని ఆయనతో కొరుతున్నారు. మరి కొందరు ఆయన గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఆయన్ను ప్రవక్తగా నమ్మడం లేదు. లేదా ఆయన అనుకరణలో కొరత చూపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన విషయాలకు వ్యతిరేకమైన వాటిని నమ్ముతున్నారు. ఇతరుల మాటలను ఆయన సున్నతల కంటే ప్రాధాన్యతనిస్తున్నారు, ఆయన సున్నతులను ఆచరించకుండా వదులుతున్నారు, ఆయన తీసుకువచ్చిన సత్య మాట/ బాటకు వ్యతిరేకమైన మాట/బాటలపై గుడ్డిగా మొండిపట్టుతో ఉన్నారు.
పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)
ఇతరములు: [విశ్వాసము]