
ప్రస్తుత కాలంలో బిద్‌అతులు (కల్పిత ఆచారాలు) హెచ్చరిల్లిపోయాయి. దీనికి ప్రధాన కారణం నేటి కాలానికీ – దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలానికీ మధ్య చాలా ఎక్కువ అంతరం ఉండటం, నిజ జ్ఞానం కొరవడటం, షరీయత్‌కు వ్యతిరేకమయిన విషయాల వైపు పిలుపు ఇచ్చేవారు అధికంగా ఉండటం.
మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఇలా చెప్పి ఉన్నారు :
“మీరు తప్పకుండా మీ పూర్వీకుల అడుగు జాడల్లో నడుస్తారు.”
(దీనిని ఇబ్నెమాజా-3994 ఉల్లేఖించి, ప్రామాణికంగా పేర్కొన్నారు)
ఈ హదీసు ప్రకారం ముస్లిములు అన్యుల ఆచార వ్యవహారాలను ఎక్కువగా అనుకరించటం మొదలెట్టారు.
మీలాదున్నబీ పేరిట ఉత్సవాలు :
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజు పేరుతో పండుగ జరుపుకోవటం వాస్తవానికి క్రైస్తవుల అనుకరణ. క్రైస్తవులు ఏసుక్రీస్తు (ఈసా అలైహిస్సలాం) పుట్టిన రోజు పండుగ జరుపుకుంటారు. విద్యాగంధం లేని ముస్లిములు, రుజుమార్గానికి కుడిఎడమ వైపుల్లో కాలిబాటలు తీసుకున్న విద్వాంసులు (ఉలమా) ఏటేటా రబీవుల్ అవ్వల్ మాసంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజును పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటారు. కొంతమంది ఈ ఉత్సవాన్ని మస్జిదుల్లో జరుపుకుంటే, మరికొంతమంది తమ ఇండ్లలో చేసుకుంటారు. ఇంకా కొందరు కొన్ని నిర్ణీత బహిరంగ స్థలాలలో ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో ముస్లిం సమాజానికి చెందినవారు చాలాపెద్ద సంఖ్యలోనే హాజరవుతారు. ఇంతకుముందు చెప్పినట్లు ఇది క్రైస్తవుల నుండి పుణికిపుచ్చుకున్న పోకడ. పూర్వం క్రైస్తవులు ఏసుక్రీస్తు పుట్టిన రోజు పండుగను తమంతట తామే కల్పించుకున్నారు. సాధారణంగా ఈ మీలాద్ ఉత్సవాలలో క్రైస్తవులను పోలిన ఎన్నో బిద్‌అతులు చేయబడతాయి. కొన్ని షిర్కుతో కూడిన పనులు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకు:
ఈ సందర్భంలో చదవబడే నాతులు, కవితలలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విషయంలో అతిశయిల్లడం కద్దు. వారు ఆ నాతులలో అల్లాహ్ బదులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను మొరపెట్టుకోవటం మొదలెడతారు. సహాయం కొరకు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)నే అర్ధించసాగుతారు. కాగా; తనను పొగిడే విషయంలో అవధులు మీరరాదని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) స్వయంగా తాకీదు చేసి ఉన్నారు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు :
“క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసాను పొగడటంలో మితిమీరిపోయినట్లుగా మీరు నన్ను పొగడటంలో మితిమీరకండి (కడకు వారు తమ ప్రవక్తను దేవుని కుమారునిగా చేసేశారు). చూడండి! నేనొక దాసుడను. కాబట్టి నన్ను అల్లాహ్ దాసుడు, అల్లాహ్ సందేశహరుడు అని అనండి.” (బుఖారి, ముస్లిం)
ఒక్కోసారి ‘మీలాద్’ పేరిట జరిగే ఈ సదనాలలో స్త్రీలు పురుషులు కలిసిపోతారు. ఈ మిశ్రమ సమ్మేళనాలు నైతిక పతనానికి, భావ కాలుష్యానికి కూడా కారణం అవుతాయి.
ఒక్కోసారి వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సమావేశాలకు హాజరవుతారని కూడా నమ్ముతుంటారు. ఈ సమావేశాలలో సామూహికంగా (కొన్నిచోట్ల స్రీలు – పురుషులు కూడా) నాతె షరీఫ్ పఠిస్తారు. కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. బృందగానాలు ఆలాపిస్తారు. సూఫీ మహాశయులు కల్పించుకున్న ప్రత్యేక ధ్యానాలు కూడా ఈ సందర్భంగా పాటించబడతాయి. అదలా ఉంచితే స్త్రీ, పురుషుల మిశ్రమ సమావేశాలు ఉపద్రవానికి కారణభూతం అయ్యే ప్రమాదం ఉంటుంది.
అలాంటిదేమీ లేదండీ! కేవలం మేమిక్కడ సమావేశమై భోజనాలు చేసి వెళ్ళిపోతామండీ అని కొంతమంది చెబుతుంటారు. వారు చెప్పిందే నిజమే అయినా అది కూడా ఇస్లాం ధర్మంలో ఓ కొత్తపోకడే. (ధర్మంలో ప్రతి కొత్త విషయావిష్కరణ బిద్‌అతే. ప్రతి బిద్‌అత్ మార్గభ్రష్టత వైపు గొనిపోతుంది). కాలక్రమేణా ఈ చిన్న విషయాలే చెడుల వైపునకు, నీతి బాహ్యత వైపునకు దారితెరుస్తాయి.
మేము దీనిని బిద్‌అత్ అని ఎందుకన్నామంటే ఖుర్‌ఆన్ హదీసులలో ఈ ఉత్సవానికి ఎలాంటి ఆధారం లేదు. సలఫె సాలిహీన్ ఆచరణ ద్వారా కూడా దీనికి సంబంధించిన ఉపమానం ఏదీ లభించటం లేదు. హిజ్రీ 4వ శతాబ్ది తరువాతనే ఇది ఉనికిలోనికి వచ్చింది. ఫాతిమీ షియాలు దీనిని మొదలు పెట్టారు.
ఇమామ్ అబూ హఫస్ తాజుద్దీన్ అల్ఫాఖానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు :
ముబారికీన్‌కు చెందిన ఒక బృందం తరఫున – రబీవుల్ అవ్వల్ నెలలో మీలాద్ ఉత్సవం పేరిట నిర్వహించబడే ఈ సమావేశం గురించి, “ధర్మం (దీన్)లో దీనికేదన్నా ఆధారం ఉందా?” అని ప్రశ్నించటం జరిగింది. దీనికి సంబంధించి వారు స్పష్టమయిన, నిర్దిష్టమైన సమాధానం కావాలని కోరారు. కాబటి దేవుడిచ్చిన సద్బుద్ధితో సమాధానం ఇవ్వబడుతోంది :
“దైవగ్రంథంలోగానీ, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంప్రదాయంలో గానీ నేడు చెలామణీలో ఉన్న మీలాద్‌కు ఎలాంటి ‘మూలం’ లేదు. ఎలాంటి నిదర్శనం కూడా నాకు కనిపించలేదు. ఉమ్మత్‌కు చెందిన ఎన్నదగ్గ ఉలమాలు, ఆదర్శప్రాయులైన వారు కూడా ఈ విధంగా ఆచరించినట్లు లేదు. పైగా ఇదొక బిద్‌అత్. దీనిని పనీ పాటా లేని వ్యక్తులు, నిరుద్యోగులు కనుగొన్నారు. ఇదొక మనోవాంఛ. పదార్థ పూజారులు దీనిని తమ పబ్బం గడుపుకునేందుకు వాడుకుంటున్నారు.” (రిసాలతుల్ మోరిద్ ఫీ అమలుల్ మౌలిద్)
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి :
“ఇదేవిధంగా కొంతమంది ఏసుక్రీస్తు (ఈసా – అలైహిస్సలాం) పుట్టిన రోజు విషయంలో క్రైస్తవులను అనుకరిస్తూ లేదా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రేమలో, భక్తితత్పరతలో ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజు పండుగను ఆవిష్కరించారు. వాస్తవానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుట్టినరోజు నిర్ధారణ విషయంలో ఇప్పటికీ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. తొలికాలపు సజ్జనులు సయితం ఈ ‘ఉత్సవం’ జరుపుకోలేదు. ఒకవేళ ఇలా చేయటంలో ‘మంచి’ అనేది ఏదయినా ఉంటే, లేదా మంచికి ఆస్కార ముంటుందని అయినా ఆశాభావం ఉండి ఉంటే ఆ సజ్జనులు (రహిమహుముల్లాహ్) ఇలాంటి సంబరం తప్పకుండా జరుపుకునేవారే. ఎందుకంటే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమాదరణల విషయంలో ఆ మహనీయులు మనకన్నా గొప్పవారే. వారు ఎల్లప్పుడూ మేలును, శుభాన్ని కాంక్షించేవారు. యదార్దానికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను అనుసరించటం ద్వారానే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల (పేమాదరణలకు సార్ధకత లభిన్తుంది. ఆయన ఆజ్ఞలను శిరసావహించేవారు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నెలకొల్పిన సంప్రదాయాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో పాటువడేవారు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) రాకలోని లక్ష్యాన్ని నెరవేర్చటానికి మనోవాక్కాయ కర్మల చేత కృషిచేసేవారు మాత్రమే నిజంగా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమాదరణలు గలవారు. ఎందుకంటే అన్సార్ – ముహాజిర్లలోని ప్రథమశ్రేణి సహాబీలు గానీ, వారిని అనుసరించే తరువాతి తరాల వారుగానీ ఇలాగే చేసేవారు.” (ఇఖ్తెజా అస్సిరాతల్ ముస్తఖీమ్ – 2/615, డా. నాసిరుల్ అఖల్ పరిశోధన)
ఈ కొత్త పోకడను ఖండిస్తూ లెక్కలేనన్ని పుస్తకాలు (పాతవి, కొత్తవి) ప్రచురించ బడ్డాయి. ఈ మీలాద్ ఉత్సవం స్వతహాగా ఒక బిద్‌అత్ అవటంతో పాటు అది మరెన్నో మీలాదుల నిర్వహణకు ప్రేరకం అయ్యే అవకావం ఉంది. మరెందరో ఔలియాల, పెద్ద విద్వాంసుల, నాయకుల మీలాద్ (బర్త్‌డే) లకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ విధంగా ముస్లిం సముదాయం కీడుకు, ఉపద్రవానికి ద్వారం తెరుచుకుంటుంది.
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 222-224)
మీలాద్ ఉన్ నబీ:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
You must be logged in to post a comment.