మరణాంతరం జీవితం – పార్ట్ 02: మరణ యాతన, సమాధిలో ప్రశ్నోత్తరాలు, సమాధి శిక్షలు అనుగ్రహాలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతరం జీవితం – పార్ట్ 02 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 02. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:21 నిముషాలు]

ఋజుమార్గం టీవి  ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. “ఎవరికి చావు ఎలా వస్తుంది? “అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము.

అందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే చావు ఎప్పుడైతే వస్తుందో, మరణదూతను మన కళ్లారా మనం చూస్తామో అప్పుడు చావు యొక్క వాస్తవికత తెలుస్తుంది. చావుకు సంబంధించిన విషయాలు మన ముందు స్పష్టం అవుతాయి. అల్లాహ్ యొక్క ఎంత  గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి. చనిపోయే ఏ మనిషి కూడా “నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఈ కష్టాల్లో ఉన్నాను. ఇకనైనా మీరు నాతో గుణపాఠం నేర్చుకోండి. విశ్వాస మార్గాన్ని అవలంబించండి. సత్కార్యాలు చేస్తూ పోండి మీరు” అని ఎవరూ కూడా చెప్పలేరు. తాను ఏ కష్టాలను భరిస్తున్నాడో వాటి నుండి తనను తాను రక్షించు కోవటానికి ఏదైనా మార్గం ఉందా అని అరుస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కల ఉన్న అతని బంధువులకు, మిత్రులకు ఏది చెప్పలేక పోతాడు. కానీ అల్లాహ్ యొక్క ఎంత  గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి, ఆ వివరాలు మనకు అల్లాహ్ ముందే మనకు ఎందుకు తెలియజేశాడు? ఎందుకంటే ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు మనం చక్క దిద్దుకోవాలి.

ఒకసారి సూరతుల్ మూమినూన్ లోని ఆయతును గమనించండి

حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

వారిలోని ఒకరికి చావు సమీపించినప్పుడు, ఓ నా ప్రభువా తిరిగి నన్ను ఇహలోకానికి మరోసారి పంపు.ఏ సత్కార్యాలు అయితే నేను ఇంతవరకు చేసుకోలేకపోయానో ఏ సత్కార్యాల్ని నేను విలువ లేకుండా వదిలేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ మరణ సందర్భంలో వాటి యొక్క విలువ ఎంత అనేది నేను ఆ తిరిగి సత్కార్యాలు చేసుకుంటాను. తిరిగి నన్ను ఇహలోకంలోకి పంపు. అప్పుడు ఏమి సమాధానం వస్తుంది? కల్లా ముమ్మాటికి అలా జరగదు.ఒక మాట అతను నోటితో పలుకుతున్నాడు. కానీ అతని కోరిక ఎన్నటికీ పూర్తి కాదు. పునరుత్థాన దినం మరోసారి వారిని సజీవులుగా లేపబడేది. ఆరోజు వరకు వారి వెనక ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు తెరలో వారు అక్కడే ఉంటారు. (సూరతుల్ మూమినూన్ 23:99-100)

చావు వచ్చినప్పుడే దాని యొక్క వాస్తవికత అనేది మన ముందు స్పష్టమవుతుంది. ఆ విషయాలని అల్లాహ్ తెలిపాడు. మనం వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

సూరత్ అష్షూరా ఆయత్ నెంబర్ 44 లో కూడా అల్లాహ్ తఆలా విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి.

 وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ

“దుర్మార్గులు, అవిశ్వాసులు, షిర్క్ చేసేవాళ్ళు, పాపాలు లో మునిగి ఉన్న వాళ్ళు శిక్షను చూసినప్పుడు వారు ఏమంటారో అప్పుడు మీరు చూసెదరు. ఏమి ఇహలోకానికి తిరిగి పోవడానికి ఏదైనా అవకాశం ఉందా? అనివారు అప్పుడు అడుగుతారు” (సూరత్ అష్షూరా 42:44)

కానీ ఎలాంటి అవకాశం ఏమి ఇవ్వడం జరగదు. ఈ సందర్భంలో చావు సమీపించిన సందర్భములో అల్లాహ్ కరుణలో మనపై ఉన్నటువంటి గొప్ప కరుణ ఒకటి ఏమిటంటే ఎవరైతే ఆ చివరి సమయంలో కూడా తన సృష్టికర్తను మరచిపోకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్  చదువుతారో అలాంటి వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు తెలియపరిచారు. సునన్ అబీ దావూద్ లోని హదీద్ లో ఇలా ఉంది: ఇహలోకంలో ఎవరి చివరి మాట “లా ఇలాహ ఇల్లల్లాహ్”అల్లాహ్ తప్ప వేరే సత్యఆరాధ్యుడు మరి ఎవ్వడు లేడు. ఈ సద్వచనం తన చివరి మాటలు అవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితులు, బాధకరమైన సమయంలో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎవరికి గుర్తొస్తుందో అల్లాహ్ కే బాగా తెలుసు. కానీ ఇహ లోకంలో దాని గురించి కాంక్ష ఉంచిన వారు, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, అలాంటి వారికి అల్లాహ్ తఆలా ఆ సత్భాగ్యం ప్రసాదించగలడు.

ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోతాడో  సామాన్యంగా తీసుకెళ్ళి అంత క్రియలు అన్నీ చేసి సమాధిలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు సమాధిలో ఎవరికి, ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనందరి గురించి చాలా ముఖ్యమైన విషయం.

సమాధిలో పెట్టడం జరిగిన తరువాత ఒకవేళ అతను విశ్వాసుడు అయితే, పుణ్యాత్ముడు అయితే, సత్కార్యాలు చేసే వాడు అయితే, అతనికి అతని యొక్క ఆత్మ తిరిగి అతని శరీరంలో వేయడం జరుగుతుంది. అతను లేచి కూర్చుంటాడు. అదే సమయంలో ఎప్పుడైతే అతను కళ్ళు తెరుస్తాడో సూర్యాస్తమయం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అన్నట్లుగా కనబడుతుంది. అప్పుడే ఇద్దరు దైవ దూతలు అతని వద్దకు వస్తారు. అతను అంటాడు పక్కకు జరగండి. నా అసర్ నమాజ్ నాకు ఆలస్యం అయిపోయింది నేను అసర్ నమాజ్ చేసుకుంటాను. వారు అంటారు, ఇది నమాజ్ చేసే సమయం కాదు. నమాజ్లు చేసే సమయం ఇహలోకంలో సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మా ప్రశ్నలకు మీరు సిద్దం కావాలి. నీ ప్రభువు ఎవరు? నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవాడివి? అని అంటే అతను విశ్వాసి కనుక రబ్బీ అల్లాహ్  నా ప్రభువు అల్లాహ్, నేను ఆయన్నే ఆరాధిస్తూ ఉంటిని అని అంటాడు. రెండవ ప్రశ్న అడుగుతాడు. నీ ధర్మం ఏది? ఏ ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటివి? అతడు అంటాడు, నా ధర్మం ఇస్లాం ధర్మం అని. తర్వాత మూడో ప్రశ్న జరుగుతుంది. మీ మధ్య ప్రవక్తగా పంపబడిన ఆ ప్రవక్త ఎవరు అని? అప్పుడు అతను అంటాడు: ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని. అప్పుడు వారు నాలుగో ప్రశ్న అడుగుతారు. సామాన్యంగా ఎక్కువ మంది మన ముస్లిం సోదరులకి బహుశా ఈ మూడు ప్రశ్నలు తెలిసి ఉన్నాయి. కానీ నాలుగో ప్రశ్న కూడా ప్రశ్నించడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ముస్నద్అ హ్మద్ ఇంకా వేరే హాదీస్ గ్రంధాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా సహీ హదీద్ లతో రుజువైన విషయం. ఏంటి నాలుగో ప్రశ్న? నీవు ఈ నిజమైన మూడు సమాధానాలు ఏదైతే ఇచ్చావో దీని జ్ఞానం నీకు ఎలా ప్రాప్తం అయింది? ఈ సరైన సమాధానం నువ్వు ఎలా తెలుసుకున్నావు? అప్పుడు అతడు అంటాడు, నేను అల్లాహ్ గ్రంధాన్ని చదివాను. దానిని విశ్వసించాను. అందులో ఉన్న విషయాల్ని సత్యంగా భావించి సత్యరూపంలో నేను ఆచరించడం కూడా మొదలుపెట్టాను. అందుగురించి నాకు జ్ఞానం ప్రాప్తం అయ్యింది అని అంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజు మనకు మనం ముస్లింలమని ఎంత సంతోషించినా ఖురాన్ జ్ఞానం పొందక ఉంటే, ఖురాన్ యొక్క విద్యనేర్చుకోకుండా ఉంటే, ఇస్లాం ధర్మజ్ఞానాన్ని అభ్యసించి దాని ప్రకారంగా ఆచరించకుండా ఉంటే బహుశా మనకు కూడా సమాధానాలు సరైన రీతిలో ఇవ్వడం కష్టతరంగా ఉండవచ్చు. అల్లాహ్ అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి మనల్ని కాపాడుగాక.

ప్రస్తుతం ఇప్పుడు నేను మీముందు విశ్వాసులు అయితే సత్కార్యం చేసే వారు అయితే ఏ మంచి సమాధానం ఇస్తారు అని వివరించాను. ఒకవేళ దీనికి భిన్నంగా అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు, దుష్కార్యాలు చేసేవారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అది తెలియ పరుస్తున్నాను. ఆ తరువాత సమాధిలో ఎవరికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి. ఎవరు ఎలాంటి అనుగ్రహాలకు అర్హులవుతారు. అది తర్వాత మనం తెలుసుకుందాం ఇన్షాఅల్లాహ్. 

విశ్వాసికి ఏ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందో, అతను ఎలా సమాధానం ఇస్తాడో మనం తెలుసుకున్నాము కదా? ఇక రండి అవిశ్వాసిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దుర్మార్గులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతి మానవుడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైతే వారిని ప్రశ్నించడం జరుగుతుందో వారు ఎలాంటి సమాధానం ఇస్తారు? అనే విషయం తెలుసుకుందాం.

అవిశ్వాసి, కపట విశ్వాసులు, దుర్మార్గులను సమాధిలో పెట్టబడిన తర్వాత ఆత్మ వారి శరీరంలో వేయబడుతుంది. అతను ఆ సందర్భంలో లేచి కూర్చుంటాడు. ఇద్దరు దేవదూతలు వస్తారు. “నీ ప్రభువు ఎవరు?” అని అతని అడుగుతారు. అయ్యో, అయ్యో, నాకు తెలియదు అని అంటాడు. “మీ ధర్మం ఏది?” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. “మీలో పంపబడిన ప్రవక్త ఎవరు” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ తర్వాత విషయం సహీహ్ బుఖారీ లో కూడా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? “నీవు ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు ఎందుకు తెలిసిన వారిని అనుసరించలేదు? ఖురాన్ గ్రంధాన్ని పారాయణం ఎందుకు చేయలేదు? విశ్వాస మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?” అని ఇనుప గదముతో తల మీద, మరొక హదీస్ లో స్పష్టంగా ఉంది, రెండు చెవుల మధ్యలో వెనుక భాగములో చాలా బలంగా కొట్టడం జరుగుతుంది. ఆ యొక్క దెబ్బతో ఎంత పెద్ద శబ్దంతో అతను అరుస్తాడు అంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “మానవులు మరియు జిన్నాతులు తప్ప సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి అతని అరుపును వింటారు.” ఇక తర్వాత అతనికి శిక్షలు మొదలవుతాయి.

సోదరులారా సోదరీమణులారా వింటున్న ఈ విషయాలు, వింటున్న మీరు, “అరే వాళ్ళు వాళ్ళ విషయాలు అలా చెప్పుకుంటున్నారు” అని ఎగతాళి చేసి విలువ నివ్వకుండా వినడం కూడా మానుకుంటే ఇప్పుడు నాకు నష్టం కలిగేది ఏమీ లేదు. కానీ మన అందరం కూడా ఒక రోజు చనిపోయేది ఉంది. మరియు సమాధి యొక్క ఈ శిక్షల గురించి ఏదైతే తెలుపడం జరుగుతుందో, సమాధిలో జరిగే ఈ ప్రశ్నోత్తరాల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో వాటన్నిటిని మనం కూడా ఎదుర్కొనేది ఉంది.

ఇక్కడ ఒక విషయం గమనించండి, సామాన్యంగా సర్వమానవులు కూడా చనిపోయే వారిని సమాధిలో తీసుకొచ్చి పెట్టడమే సరైన పద్ధతి. అందు గురుంచే మాటి మాటికి సమాధి యొక్క అనుగ్రహాలు, సమాధి శిక్షలు, సమాధిలో ఎలాంటి ప్రశ్నోత్తరాల జరుగుతాయి. సమాధి, సమాధి అని మాటిమాటికీ మనం అంటూ ఉంటాము. కానీ ఎవరైనా సమాధి చేయబడకుండా అగ్నికి ఆహుతి అయితే, క్రూర జంతువు వారిని తినేస్తే, లేదా సముద్రంలో వారు కొట్టుకుపోయినా లేదా విమానం గాలిలోనే పేలిపోయి ఏ ముక్కలు ముక్కలు మిగలకుండా వారు అలాగే హతమైనా, నాశనమైనా, ఏ విధంగా చనిపోయినా, ఆ చావు ఎలా జరిగినా కానీ శరీరం నుండి ఆత్మ వేరు అవుతుంది. ఆ తర్వాత శరీరం మిగిలి ఉండి ఉంటే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఖననం చేయడం జరిగితే అందులో ఆ ఆత్మను వేయబడి ప్రశ్నించడం జరుగుతుంది. లేదా అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ తన ఇష్టప్రకారం వేరే ఏదైనా ఒక శరీరం ఏర్పాటు చేసి ఆత్మను అందులో వేయవచ్చు, లేదా డైరెక్టుగానే ఆత్మతోనే ఈ ప్రశ్నోత్తరాలు కూడా జరపవచ్చు. ఈ ప్రశ్నోత్తరాలు జరగడం సత్యం. ఇందులో అనుమానానికి ఏ తావులేదు.

ఇక తరువాత సరైన సమాధానం ఇచ్చిన విశ్వాసి మరియు సత్కార్యాలు చేసేవారు, అలాంటి వాళ్లలో అల్లాహ్ మనల్ని కూడా చేర్చుగాక, వారికీ సమాధిలో ఎలాంటి అనుగ్రహాలు మొదలవుతాయి అంటే ముందు వారికి నరకం వైపు నుండి ఒక చిన్న కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగో నరకంలో మీ స్థానం చూడండి. కానీ అల్లాహ్ దయ మీపై కలిగింది. అల్లాహ్ మిమ్మల్ని ఈ నరకం నుండి కాపాడాడు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. తర్వాత స్వర్గం యొక్క కిటికీ తెరవడం జరుగుతుంది. అందులో వారి యొక్క స్థానం చూపడం జరుగుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ప్రతి ఒక్కరు స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి వారి స్థానాలను చూస్తారు సమాధిలో ఉండి.”

ఆ తరువాత అల్లాహ్ ఆకాశం నుండి ఒక శుభవార్త ఇస్తాడు: “నా ఈ దాసుని  కొరకు స్వర్గపు ద్వారాలు, స్వర్గపు కిటికీలు తెరవండి”. అక్కడి నుండి సువాసన వస్తూ ఉంటుంది. మరియు మంచి గాలి వస్తూ ఉంటుంది మరియు “ఈ దాసుని కొరకు స్వర్గం యొక్క పడక అతని గురించి వేయండి.” అంతేకాదు అతనికి ఆ పడకలు వేయడం జరుగుతాయి. స్వర్గం నుండి సువాసన గాలులు వస్తూ ఉంటాయి. అంతలోనే అతను చూస్తాడు, ఒక అందమైన వ్యక్తి అతని వైపునకు వస్తూ ఉన్నాడు. అయ్యా! నీవు ఎవరివి? చాలా అందమైన ముఖముతో దగ్గరికి అవుతున్నావు మరియు ఏదో శుభవార్త తీసుకొని వస్తున్నట్లుగా కనబడుతున్నావు. అసలు నువ్వు ఎవరివి? అని అంటే ఆ వ్యక్తి అంటాడు, “నేను నీ యొక్క సత్కార్యాల్ని. ఇహలోకంలో నీవు ఏ సత్కార్యాలు అయితే చేశావో నన్ను అల్లాహ్ ఈ రూపంలో నీ వద్దకు తీసుకొచ్చాడు. హాజరు పరిచాడు. నీవు ఎలాంటి ఒంటరితనం నీకు ఏర్పడకుండా నీవు ఎలాంటి భయం చెందకుండా ప్రళయం సంభవించే వరకు ఆ తర్వాత మరోసారి అల్లాహ్ తఆలా ఈ సమాధుల నుండి లేపేవరకు నేను నీకు తోడుగా ఉండాలి”. ఇంతే కాకుండా ఇంకా ఎన్నో వరాలు కూడా ఉంటాయి. ఇన్షా అల్లాహ్ వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత మనం మీ ముందు తెలుపుతామని,

అయితే ఎవరైతే సమాధానం సరియైన విధంగా ఇవ్వరో, అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు గా ఉంటారో వారికి ఏం జరుగుతుంది? స్వర్గం వైపు నుండి ఒక కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగోండి స్వర్గం లో మీ స్థానం ఉండేది, కానీ మీరు సరైన సమాధానం ఇవ్వలేదు కనుక ఈ స్థానం మీకు లేదు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. నరకం నుండి ఒక కిటికీ తెరవడం జరుగుతుంది. అక్కడి నుండి అగ్ని జ్వాలలు, దుర్వాసన, మంట, వేడి వస్తూ ఉంటుంది. మరియు ఆకాశం నుండి ఒక దుర్వార్త ఇచ్చే వారు ఇలా దుర్వార్త ఇస్తాడు, నా దాసునికి నరకం యొక్క పడక వేయండి. నరకం యొక్క కిటికీలు తెరవండి. అంతలోనే అతను చూస్తాడు, భయంకరమైన నల్లటి ముఖముతో ఒక వ్యక్తి అతని వైపు వస్తున్నాడు. ఓ దుర్మార్గుడా, ఓ చెడ్డ ముఖము కలవాడా, దుర్వాసనతో కూడుకొని ఉన్నవాడా, దూరమైపో ఏదో దుర్వార్త నీవు నాకు తీసుకొని వస్తున్నట్టు ఉన్నది. అతను అంటాడు, అవును నేను నీ దుష్కర్మల్ని. నేను నీకు ప్రళయదినం వరకు తోడుగా ఉండి నీ యొక్క బాధలు ఇంకా పెంచడానికి అల్లాహ్ నన్ను నీతో పాటు ఉండడానికి పంపాడు.

మహాశయులారా ఈ విధంగా సమాధిలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే విశ్వాస మార్గాన్ని అవలంబించరో, దుష్కార్యాలు చేస్తూ ఉంటారో, ఇంకా వేరే ఎన్నో పాపాలకు ఒడికడతారో వారికి కూడా ఎన్నో రకాలుగా శిక్షలు జరుగుతూ ఉంటాయి. వారికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి మరియు సమాధి శిక్షల నుండి కూడా మనం సురక్షితంగా ఉండడానికి ఇహలోకంలో ఎలాంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి. ఈ విషయాలుఇన్షా అల్లాహ్ ముందు మనం తెలుసుకుందాం.

సమాధి శిక్షలు సమాధి యొక్క అనుగ్రహాలు ఏమిటో తెలుసుకునేకి ముందు ఒక విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అదేమిటంటే ఈ సమాధి పరలోకం యొక్క మజిలీలలో మొదటి మజిలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దీని గురించి తెలిపారు: సమాధి, పరలోక మజిలీల లో మొట్టమొదటి మజిలీ. ఒకవేళ ఇక్కడ అతడు పాస్ అయ్యాడు అంటే, ఇక్కడ అతనికి మోక్షం లభించింది అంటే, దీని తర్వాత ఉన్న మజిలీల లో అతనికి ఇంకా సులభతరమే అవుతుంది. మరి ఎవరైతే ఈ తొలి మజిలీలో గెలువరో, తొలి మజిలీలో పాస్ అవ్వరో ఇక్కడ వారికి మోక్షం ప్రాప్తం కాదో ఆ తరువాత మజిలీలలో ఇంతకంటే మరీ ఘోరమైన, కష్టతరమైన సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది.”

అందుగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నో సందర్భాల్లో సమాధి శిక్షల నుండి మీరు అల్లాహ్ యొక్క శరణుకోరండి అని మాటిమాటికీ చెబుతూ ఉండేవారు. సమాధి యొక్క శిక్షల నుండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజుల్లో కూడా శరణు కోరుతూ ఉండేవారు. వేరే సందర్భాలలో కూడా శరణుకోరుతూ ఉండేవారు. ఎప్పుడైనా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ హాజరైన ప్రజలకు బోధ చేస్తూ కూడా ఈ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పేవారు.

అందుగురించి సోదరులారా సమాధి శిక్షలకు మనం గురి కాకుండా ఉండడానికి ముందే వాటి గురించి తెలుసుకొని ఇహ లోకంలోనే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. వాటి గురించి ఏ సత్కార్యాలు అవలంబిస్తే మనం అక్కడ శిక్షలనుండి రక్షణ పొందగలుగుతామో వాటిని చేసుకొనే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తఆలా మనందరికీ సత్భాగ్యం  ప్రసాదించుగాక.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో, సమాధిలో ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు లభిస్తాయి? మరియు ఎవరికి ఎలాంటి శిక్షలు కలుగుతాయి? అనే విషయాలు తెలుసుకుందాము.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ  బరకాతుహు

పూర్తి భాగాలు క్రింద వినండి 

మరణాంతరం జీవితం – పార్ట్ 01 : చావు, అది ఎవరికి ఎలా వస్తుంది? మరణం తర్వాత ఎవరికి ఏమి జరుగుతుంది? [ఆడియో,టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతరం జీవితం – పార్ట్ 01 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 01. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 24:35 నిముషాలు]

అల్ హందు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మాబాద్!

ప్రియపాఠకులరా! మనం “మరణాంతరం జీవితం” అనే ఈ అంశం లో ముందు మరణం, మరియు అది ఎవరికి ఎలా వస్తుంది? మరణం తర్వాత ఎవరికి ఏమి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!

అయితే మహాశయులారా! ఇహలోకంలో ఎవరు ఎలా జీవించినా  కష్టాల్లో, సుఖాల్లో, ఆనందంలో, బాధలో ఎలా జీవితం గడిపినా, వృద్ధులైనా, పిల్లలైనా, బీదవారైనా, శ్రీమంతులైనా ప్రతి ఒక్కరూ చావు ఒడిలోకి తప్పని సరిగా వెళ్ళ వలసి ఉంది. మానవులు వారి వారి విభిన్న విశ్వాసాలు, వారి యొక్క విభిన్న మతాలు, వారు జీవించే విధానాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ప్రతీ  విషయంలో వారు విభేదించుకుంటున్నప్పటికీ విభేదించలేని ఏదైనా విషయం ఉందీ అంటే, అందరూ ఏకంగా నమ్మే విషయం ఏదైనా ఉందీ అంటే; అది చావు మాత్రమే. మనమందరం మరణించ వలసిన వాళ్ళం. మరణం దాని నుండి తప్పించుకుపోవడానికి ఎవరికీ సాధ్యపడదు. మరణానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు ముందు మనం తెలుసుకుందాం.

ఇందులో తొలి విషయం ఏమిటంటే; ప్రతీ జీవి చావు రుచి తప్పక చూడవలసి ఉంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విషయం స్పష్టంగా తెలిపాడు:

[كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ] {آل عمران 185 ، الأنبياء 35 ، العنكبوت 57}

“ప్రతి జీవి చావురుచి చూడక తప్పదు”. (ఆలి ఇమ్రాన్ 3:185, అంబియా 21:35, అన్కబూత్ 29:57). సూర రహ్మాన్ (55:26)లో ఉంది:

[كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ] {الرحمن 26}

“ఈ విశ్వంలో నివసించే వారందరూ కూడా నశింతురు”.

చావు నుండి తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు. ఈ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే ఉత్తములైన, సర్వ సృష్టిలో శ్రేష్ఠులైనవారు ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి అల్లాహ్ సూరె జుమర్ 39:30లో ఇలా తెలియపరిచాడు:

[إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُمْ مَيِّتُونَ] {الزمر 30}

“ప్రవక్తా  నీవు కూడా ఒకరోజు చనిపోయేవారివి, చనిపోక తప్పదు మరియు వారందరూ కూడా తప్పక చావ వలసి ఉన్నది”.

అల్లాహు తఆలా సూరయే అంబియా 21:34లో మరీ స్పష్టంగా ఈ విషయం తెలియపరిచాడు:

[وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِنْ قَبْلِكَ الْخُلْدَ أَفَإِنْ مِتَّ فَهُمُ الْخَالِدُونَ] {الأنبياء 34}

“(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ”?

ఇక ఎవ్వరికీ ఇలాంటి అవకాశం దొరకనప్పుడు చావు తప్పనిసరిగా దాని రుచి మనం చూడవలసినప్పుడు, దాని గురించి మనం సంసిద్ధత అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలి. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పరుచుకోవాలి’ అని ఎలాగైతే అంటారో, అలాగే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే, మనం జీవులుగా ఉన్నంతవరకే మనకు పరలోకంలో కావలసిన సామాగ్రినంతా ఇక్కడే సరిపెట్టుకోవాలి. ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియపరిచారు:

اغْتَنِمْ خَمْسًا قَبْلَ خَمْسٍ: حَيَاتَكَ قَبْلَ مَوْتِكَ , وَصِحَّتَكَ قَبْلَ سَقَمِكَ،

وَفَرَاغَكَ قَبْلَ شُغْلِكَ , وَشَبَابَكَ قَبْلَ هَرَمِكَ , وَغِنَاكَ قَبْلَ فَقْرِكَ.

ఐదు విషయాల్ని మరో ఐదు విషయాలు సంభవించక ముందే అదృష్టంగా భావించుకో: (1) చావు రాకముందు బ్రతికి ఉన్న ఈ రోజుల్ని అదృష్టంగా భావించు; సత్కార్యాలు చేసుకునే, విశ్వాస మార్గాన్ని అవలంభించే ప్రయత్నంచేయి.(2) ఆరోగ్యాన్ని అనారోగ్యానికి ముందు అదృష్టంగా భావించు. (3) తీరికను పనులు మోపయ్యేకి  ముందు అదృష్టంగా భావించు. (4) యవ్వనాన్ని వృద్ధాప్యానికి ముందు అదృష్టంగా భావించు. (5) శ్రీమంతునిగా ఉన్నావు, డబ్బు ధనం చేతిలో ఉంది, దీన్ని అదృష్టంగా భావించు పేదరికానికి గురి అయ్యేకి ముందు. (ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబా 34319, ముస్తద్రక్ హాకిం 7846, సహీహ్ తర్గీబ్ 3355).

ఐదు విషయాలను మీరు గమనించండి! మరో ఐదు విషయాల కంటే ముందు వీటిని అదృష్టంగా భావించి, సద్వినియోగించుకోకుంటే ఎంత నష్టపోతామో!. గమనార్హమైన విషయం ఏమిటంటే; మనిషి చనిపోయిన తరువాత అతని వెంట ఏ డబ్బు, ధనము రాదు. ఏ ఆస్తి ఏ బిల్డింగ్లు, ఏ ప్రాపర్టీ రాదు. అతను తన వెంట కేవలం తాను చేసిన *సత్కార్యాలు మరి దుష్కార్యాలు* తీసుకెళ్తాడు.

ఇహలోకంలో విశ్వాస మార్గాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉంటే, చనిపోయిన తర్వాత జీవితంలో సుఖశాంతులు పొందుతాము. ఒకవేళ విశ్వాస మార్గాన్ని అవలంభించకుంటే మరణానంతర జీవితంలో కష్టాలను, దుఃఖాలను, శిక్షలను భరించలేము.

చావు విషయంలో తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే; చావు చాలా గుప్తమైన విషయం. ఎవరికీ చెప్పి రాదు. వచ్చేకి ముందు మెస్సేజ్ చేసి కానీ, కాలింగ్ బెల్ ఇచ్చి గాని, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేసీ రాదు. అకస్మాత్తుగా చావు వచ్చేస్తుంది. ఈ విషయం మనం మన కళ్లారా చూస్తున్నాం. అయినా మనం గుణపాఠం నేర్చుకోవటం లేదు. ఎవరికీ ఎక్కడ ఏ సమయంలో చావు వచ్చునో  అది కేవలం అల్లాహ్  తప్ప మరెవ్వరికీ  తెలియదు. సూర లుఖ్మాన్ 31:34లో ఉంది:

[وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ]  {لقمان 34}

“ఏ మానవుడు ఏ ప్రదేశంలో చనిపోతాడో ఎవరికీ తెలియదు”.

చావు విషయంలో మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే; అది వచ్చినప్పుడు క్షణం పాటు ముందు కావాలన్నా కానిపని. ఆలస్యం కావాలన్నా అది ఆలస్యం కావడానికి ఎలాంటి అవకాశం లేదు.

[وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً وَلَا يَسْتَقْدِمُونَ] {الأعراف34}

“ప్రతి జాతికీ ఒక గడువు అంటూ ఉన్నది. వారి గడువు వచ్చిందంటే, వారి ఆ సమయం వచ్చిందంటే క్షణం పాటు ముందుగానీ వెనకగానీ అవ్వడానికి ఏ మాత్రం అవకాశం లేదు”. (ఆరాఫ్ 7:34)

ఇప్పటివరకు చావు గురించి విన్న విషయాలు వీటి ద్వారా మనకు ఎంతో బోధ కలగాలి. చావు రాకముందే మనం దానికి సిద్ధం అయ్యి ఉండాలి.

కానీ చావుకు సంబంధించిన ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కేవలం మీ చెవులతోనే కాకుండా మనస్సుతో వినండి. హృదయాంతర చెవులతో విని వాటిని మదిలో నాటుకోండి . దానికి సిద్ధమయ్యే ప్రయత్నం చేయండి. అదేమిటంటే చావు ఎవరికి ఎలా వస్తుంది?

విశ్వాసుడు,  పుణ్యాత్ముడు ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మి, ఆయన భయంతో, తన జీవితం ఆయన విధేయత లో గడిపిన వారికి చావు ఎలా వస్తుంది?

ముస్నద్ అహ్మద్ (18534) మరియు షేఖ్ అల్బానీ గారి సహీ తర్గీబ్ (3558)లో ఉంది: చాలా శ్రద్ధగా చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము, తద్వారా పరలోకానికై ఇహలోకములోనే సిద్ధమవుదాము.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో ఒక అనుచరుడ్ని ఖననం చేయడానికి స్మశానవాటిక (ఖబరిస్థాన్) వెళ్లిన సందర్భంలో సమాధి తయారవడంలో కొంత ఆలస్యం ఉండగా సహచరులకు పరలోక ప్రయాణం యొక్క వివరాలు ఎలా ఉంటాయో తెలియజేశారు. 2 లేదా 3 సార్లు ముందుగా చెప్పారు:

اسْتَعِيذُوا بِاللهِ مِنْ عَذَابِ الْقَبْرِ

సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు వేడుకోండి.

(ఇలాంటి మాట మనం చదివినప్పుడు, లేదా విన్నప్పుడు: ‘అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్ ’అనాలి. అంటే ‘ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాను).

ఆ తర్వాత విశ్వాసుని సంఘటన తెలియబరుస్తూ ఇలా చెప్పారు:

إِنَّ الْعَبْدَ الْمُؤْمِنَ إِذَا كَانَ فِي انْقِطَاعٍ مِنَ الدُّنْيَا وَإِقْبَالٍ مِنَ الْآخِرَةِ، نَزَلَ إِلَيْهِ مَلَائِكَةٌ مِنَ السَّمَاءِ بِيضُ الْوُجُوهِ، كَأَنَّ وُجُوهَهُمُ الشَّمْسُ، مَعَهُمْ كَفَنٌ مِنْ أَكْفَانِ الْجَنَّةِ، وَحَنُوطٌ مِنْ حَنُوطِ الْجَنَّةِ، حَتَّى يَجْلِسُوا مِنْهُ مَدَّ الْبَصَرِ، ثُمَّ يَجِيءُ مَلَكُ الْمَوْتِ، عَلَيْهِ السَّلَامُ، حَتَّى يَجْلِسَ عِنْدَ رَأْسِهِ، فَيَقُولُ:

ఎప్పుడైతే ఒక విశ్వాసికి ఈ లోకాన్ని వదిలేసి పరలోక ప్రయాణ సమయం వస్తుందో అప్పుడు ఆకాశం నుండి కొందరు దైవదూతలు దిగి వస్తారు. వారి ముఖాలు తెల్లగా ఉంటాయి, సూర్యునిలాగా మెరుస్తూ ఉంటాయి, స్వర్గపు కఫన్  దుస్తులు, సువాసనలు వారి వెంట ఉంటాయి. ఆ మనిషి ఎంత దూరం చూడగలుగుతాడో, అంతవరకు వారు కూర్చొని ఉంటారు. (వారందరూ విశ్వాసికి పరలోక ప్రయణానికి స్వాగతం పలుకుతూ ఉంటారు). అంతలోనే మలకుల్ మౌత్ (ప్రాణం తీయు దూత) కూడా హాజరవుతాడు. అతని తలాపున కూర్చుంటాడు (ఆ ప్రాణం తీయు దూత ఎంతో ప్రేమగా మృదువుగా అంటాడు):

أَيَّتُهَا النَّفْسُ الطَّيِّبَةُ، اخْرُجِي إِلَى مَغْفِرَةٍ مِنَ اللهِ وَرِضْوَانٍ

చాలా పవిత్రమైన పరిశుద్ధమైన ఓ ఆత్మ! అల్లాహ్ యొక్క విశాలమైన క్షమాపణ, మన్నింపు మరియు ఆయన సంతృప్తి వైపునకు వచ్చేసెయి.

ఈ సందర్భంలో సూర ఫజ్ర్ లోని ఆయతులు కూడా చదవవచ్చు:

[يَاأَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ (27) ارْجِعِي إِلَى رَبِّكِ رَاضِيَةً مَرْضِيَّةً (28) ]

ఓ శాంతిగల, విశ్వాసముగల ఆత్మ! నీవు నీ ప్రభువు పట్ల సంతోషంగా ఉంటివి, నీ ప్రభువు నీ పట్ల సంతోషంగా ఉన్నాడు, ఇక నీవు నీ ప్రభువు వైపునకు వచ్చేసేయి.

قَالَ: فَتَخْرُجُ تَسِيلُ كَمَا تَسِيلُ الْقَطْرَةُ مِنْ فِي السِّقَاءِ، فَيَأْخُذُهَا، فَإِذَا أَخَذَهَا لَمْ يَدَعُوهَا فِي يَدِهِ طَرْفَةَ عَيْنٍ حَتَّى يَأْخُذُوهَا، فَيَجْعَلُوهَا فِي ذَلِكَ الْكَفَنِ، وَفِي ذَلِكَ الْحَنُوطِ، وَيَخْرُجُ مِنْهَا كَأَطْيَبِ نَفْحَةِ مِسْكٍ وُجِدَتْ عَلَى وَجْهِ الْأَرْضِ

అప్పుడు శరీరం నుండి ఆత్మ, కుండలో నుండి నీటి చుక్క పడినట్లు చాలా సులువుగా బయటకు వస్తుంది. ఆ తరువాత ప్రాణం తీయు దూత ఎంతో సునాయాసంగా, సులభతరంగా దానిని తీసుకుంటాడు. అతను తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న దైవదూతలు అందరూ స్వర్గపు కఫన్ దుస్తులు, సువాసనల్లో దానిని చుట్టుకుంటారు. ఆ ఆత్మలో నుండి భూమండలంపై ఎక్కడా లేనటువంటి సువాసన వస్తూ ఉంటుంది.

قَالَ: ” فَيَصْعَدُونَ بِهَا، فَلَا يَمُرُّونَ، يَعْنِي بِهَا، عَلَى مَلَإٍ مِنَ الْمَلَائِكَةِ، إِلَّا قَالُوا: مَا هَذَا الرُّوحُ الطَّيِّبُ؟ فَيَقُولُونَ: فُلَانُ بْنُ فُلَانٍ، بِأَحْسَنِ أَسْمَائِهِ الَّتِي كَانُوا يُسَمُّونَهُ بِهَا فِي الدُّنْيَا، حَتَّى يَنْتَهُوا بِهَا إِلَى السَّمَاءِ الدُّنْيَا، فَيَسْتَفْتِحُونَ لَهُ، فَيُفْتَحُ لَهُمْ فَيُشَيِّعُهُ مِنْ كُلِّ سَمَاءٍ مُقَرَّبُوهَا إِلَى السَّمَاءِ الَّتِي تَلِيهَا، حَتَّى يُنْتَهَى بِهِ إِلَى السَّمَاءِ السَّابِعَةِ.

ఆ దైవదూతలు దానిని తీసుకొని పైకి వెళ్తారు, ఎక్కడెక్కడ ఏ దైవదూతల సమూహం కలసినా ‘ఈ పవిత్రమైన ఆత్మ ఎవరిది’? అని అడుగుతారు, ఈ దైవదూతలు ఫలాన బిన్ ఫలాన అని ఇహలోకములో ఉన్న అతని మంచి పేరు చెబుతారు, ఈ విధంగా మొదటి ఆకాశం వరకు చేరుకుంటారు. ఆకాశపు ద్వారం తెరువండని కోరుతారు, అది వారి కొరకు తెరువబడుతుంది, ఇదే విధంగా ప్రతి ఆకాశంపై జరుగుతుంది, ప్రతి ఆకాశపు దూతల్లో ముఖ్యులైనవారు వారి వెంట పై ఆకాశం వరకు వెళ్తారు, చివరకు ఏడవ ఆకాశం పైకి చేరుకుంటారు.

فَيَقُولُ اللهُ عَزَّ وَجَلَّ: اكْتُبُوا كِتَابَ عَبْدِي فِي عِلِّيِّينَ، وَأَعِيدُوهُ إِلَى الْأَرْضِ،

అల్లాహ్ ఆదేశిస్తాడు: నా దాసుడిని ఇల్లియ్యీన్ జాబితాలో రాయండి, ఆ ఆత్మను తిరిగి భూమిలోకి పంపండి. సూర తాహా 20:55లో ఉంది:

[مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَى ]

“దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.”.

ఆ ఆత్మను తిరిగి అతని భౌతికాయంలోకి పంపడం జరుగుతుంది.

ఇలా విశ్వాసి అయి ఉంటే,  సత్కార్యాలు చేసేవారు అయి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదాలతో, ఎంత గొప్ప స్వాగతం పలుకుతూ దైవదూతలు వచ్చి స్వర్గం యొక్క కఫన్ దుస్తులు తీసుకొచ్చి, స్వర్గం నుండి సువాసనలను తీసుకొచ్చి ఎంతో సునాయాసంగా సులభతరంగా అతని శరీరంలో నుండి అతని ఆత్మను బయటికి తీసి పైకి తీసుకెళ్తారు. అల్లాహు తఆలా మనందరికి విశ్వాస మార్గాన్ని అవలంబించి, సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక, మరియు మన శరీరంలో నుండి, ఆత్మ వేరు అయ్యే సందర్భంలో కూడా లా ఇలాహ్ ఇల్లల్లాహ్ అనే సద్వచనం (కలిమా తయ్యిబా) చదివే సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమీన్

కానీ ఎవరైతే అవిశ్వాసాన్ని అవలంభించి ఉంటారో, బహుదైవారాధనలో పడి ఉంటారో, పాపాల్లో కూరుకుపోయి ఉంటారో, నిజ సృష్టికర్త అయిన ఏకైక అల్లాహ్ ను విశ్వసించకుండా లేదా విశ్వసించినట్లుగా నటించి, అంతరాత్మలో ఇస్లాం పట్ల, విశ్వాసం పట్ల ప్రేమ ఉండవలసినదిగా కాకుండా తమ జీవితం అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఇష్టానికి భిన్నంగా తమ కోరికల ప్రకారం గడుపుతూ ఉంటారో వారి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి అదే హదీసులో చదవండి:

ఇక ఎప్పుడైతే అవిశ్వాసికి లేదా వంచకుడికి, కపట విశ్వాసికి ఈప్రపంచాన్ని విడనాడి పరలోకానికి పయనమయ్యే సమయం వస్తుందో, అతని వద్దకు ఎవరొస్తారు? వారి ముఖాలు ఎలా ఉంటాయి? తెల్లగా నవ్వు ముఖంతో మెరుస్తూ ఉంటాయా? లేదు, లేదు! వారి ముఖాలు నల్లగా, భయంకరంగా ఉంటాయి, దుర్వాసన గల నరకపు దుస్తులు తీసుకు వస్తారు, అతని దృష్టి ఎంత దూరం పడుతుందో అంత దూరము వరకు పెద్ద సంఖ్యలో కూర్చొని ఉంటారు. అంతలోనే మరణదూత వస్తాడు, అతని తలాపున కూర్చొని అంటాడు:

أَيَّتُهَا النَّفْسُ الْخَبِيثَةُ، اخْرُجِي إِلَى سَخَطٍ مِنَ اللهِ وَغَضَبٍ

ఓ దుష్టఆత్మ! అల్లాహ్ యొక్క ఆగ్రహానికి అల్లాహ్ యొక్క కోపానికి గురి కావడానికి బయటికి రా!

కానీ ఆత్మ మరణదూత చేతిలో రాకుండా శరీరంలో పరిగెత్తుతూ ఉంటుంది. చివరికి ఆ మరణదూత శరీరంలో నుండి లాగి తీస్తాడు. అది ఎంత కఠినంగా వస్తుందంటే ఎలాగైతే ఒక పచ్చి గుడ్డను, తడిగా ఉన్న బట్టను ముళ్ళ కంప నుండి తీసేటప్పుడు ఏ ఇబ్బందికరంగా వస్తుందో అంతకంటే మరీ ఇబ్బందికరంగా వస్తుంది.

ఆ తర్వాత దైవ దూతలు నరకం నుండి తీసుకొచ్చిన దుష్ట, దుర్వాసనగల కఫన్ దుస్తులలో చుట్టుకుంటారు. భూమండలంపై ఎక్కడా లేనటువంటి దర్వాసన వస్తూ ఉంటుంది. వెంటనే తీసుకొని ఆకాశం వైపునకు వెళతారు, ఏ దైవదూతల సమూహం నుండి దాటినా వారు ఈ  దుష్టఆత్మ ఎవరిది? అని అడుగుతారు. వీరంటారు: ప్రపంచంలో పిలువబడే ఫలానా బిన్ ఫలాన చెడ్డ మనిషి అని.  ఈ విధంగా మొదటి ఆకాశం వరకు చేరుకొని, ద్వారం తెరువండని అనుమతి కోరితే, ద్వారం తెరువబడదు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్, సూరె ఆరాఫ్ (7)లోని ఆయత్ 40 పారాయణం చేశారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ وَلَا يَدْخُلُونَ الْجَنَّةَ حَتَّىٰ يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ ۚ ]

“వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకూ వారు స్వర్గంలో ప్రవేశించలేరు”.

అల్లాహ్ ఆదేశిస్తాడు: అత్యంత క్రింద ఉన్న భూమిలోని సిజ్జీన్ జాబితాలో ఇతనిని నమోదు చేయండి. మళ్ళీ ఆ ఆత్మను అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరయే హజ్ (22)లోని ఆయతు 31 పఠించారు:

[وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ]

అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రిందపడి పోయిన వానితో సమానం. ఇప్పుడతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి లేదా పెనుగాలి అయినా ఎత్తి దూరప్రదేశంలో విసిరేస్తుంది.

ఇక ఆ ఆత్మ మళ్ళీ తిరిగి అతని శరీరంలోకి వస్తుంది. మళ్ళీ తరువాత ప్రశ్న ఉత్తరాలు జరుగుతాయి. వాటి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ సమాధిలో ఎవరికీ ఏమి జరుగుతుంది అనే ఎపిసోడ్ లో చదువుదాము. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే; అవిశ్వాసుల ప్రాణం తీయబడే సందర్భంలో వారికి ఎలాంటి కష్టం, బాధ కలుగుతుందో అల్లాహ్  స్పష్టంగా ఖుర్ఆన్ లో తెలియపరిచాడు:

[وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ]

ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్‌ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు!”.

అలాంటి ఆ సమయం రాకముందే మనం గుణపాఠం నేర్చుకోవాలి. విశ్వాసమార్గాన్ని సత్కార్యాలు అవలంభించేమార్గాన్ని నడిచే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశయులారా ఎవరికీ చావు ఎలా వస్తుంది అనే విషయం ఏదైతే చదవుతున్నామో, దీని తరువాయి అంశం చదవడం మర్చిపోకండి. అల్లాహ్  మనందరికీ చావు రాక ముందే దానికి సంబంధించిన సంసిద్ధతలు ఏర్పాటు చేసుకునే  సద్భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్!

వస్సలామ్ అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: