నికాహ్ (వివాహం)లో ‘వలీ’ (సంరక్షకుని) అనుమతి అవసరం

నికాహ్ (వివాహం లేక శుభ లగ్నం) కొరకు వధువు తండ్రిగానీ లేక ఆమె తరపు పెద్ద మనిషిగానీ సంరక్షకుడు (వలీ)గా ఉండి తన సమ్మతిని తెలియజేస్తాడు. వధూవరుల తరఫు బంధుమిత్రులు. శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలిపి గౌరవప్రదమైన రీతిలో వధువును తీసుకుని వెళతారు. ఇప్పటి వరకూ ముస్లిం సమాజంలోనూ, ప్రాచ్య దేశాల ఇతర మతవర్గాల వారిలోనూ ఇదే పద్ధతి నడుస్తూ వస్తోంది. కాని లజ్జావిహీనమైన పాశ్చాత్య సంస్కృతి మూలంగా మన సంప్రదాయానికి విఘాతం ఏర్పడింది. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన అబ్బాయిలు- అమ్మాయిలు దొంగచాటుగా ప్రేమ వ్యవహారం నడిపి ఇద్దరూ కలిసి జీవిస్తామని, కలిసి మరణిస్తామని ఊసులాడుకుంటారు. పెద్దలకు చెప్పాపెట్టకుండా ఇంటి నుండి పారిపోయి నాలుగైదు రోజులు మాయమైపోతారు. ఆ తరువాత నేరుగా కోర్టుకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. “వలీ లేకుండా కూడా నికాహ్ అయిపోతుంది” అన్న ఫత్వా ఆసరాగా కోర్టు నికాహ్ ధృవపత్రం జారీ చేస్తుంది. కన్నవారు అవమానభారంతో కృంగిపోతారు. ఈ రకమయిన నికాహ్ను ‘కోర్టు మ్యారేజ్’ గా వ్యవహరిస్తున్నారు. ఈ రకమయిన చేష్ట ఒక ఇస్లామీయ ప్రబోధనల పైనేకాదు, యావత్ ప్రాచ్య సంస్కృతి పైనే తిరుగుబాటుకు ప్రతీక. దీని ఉద్దేశం. వివాహాది శుభకార్యాలలో ఇస్లామీయ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి దేశంలో పాశ్చాత్య తరహా సంస్కృతిని ప్రవేశ పెట్టడమే.

నికాహ్ సమయంలో ‘వలీ’ (సంరక్షకుడు) ఉండటం, అతని సమ్మతి లభించటం గురించి ఖుర్ఆన్ హదీసులలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. స్త్రీల వివాహ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగా స్త్రీలను సంబోధించకుండా వారి ‘వలీ’లను సంబోధించటం జరిగింది. ఉదాహరణకు:

షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించి మోమిన్లు కానంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి.“(అల్ బఖర: 221)

దీన్నిబట్టి స్పష్టంగా అవగతమయ్యేదేమిటంటే స్త్రీ తనంతట తానుగా నికాహ్ చేసుకోజాలదు. అందుకే ఆమె సంరక్షకులనుద్దేశించి ‘ఆదేశం’ ఇవ్వబడింది – ఆమెను ముష్రిక్కు పురుషునికిచ్చి వివాహం చెయ్యకూడదని. వలీ (సంరక్షకుని) అంగీకారం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొన్ని ప్రవచనాలను కూడా గమనిద్దాం: ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

వలీ (అనుమతి) లేకుండా వివాహమే అవదు” (అబూదావూద్, తిర్మిజీ, ఇబ్నుమాజా).

మరొక హదీసులో ఇలా ఉంది:

“ఏ స్త్రీ అయితే వలీ అనుమతి లేకుండానే నికాహ్ చేసుకుందో ఆమె నికాహ్ మిథ్య. ఆమె నికాహ్ మిథ్య. ఆమె నికాహ్ మిథ్య.” (అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్సుమాజా).

ఇమామ్ ఇబ్ను మాజా (రహిమహుల్లాహ్) పొందుపరచిన ఒక హదీసులోని పదజాలం మరింత తీవ్రంగా వుంది. అల్లాహ్ ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించే ఏ విశ్వాసురాలు కూడా ‘వలీ’ లేకుండా నికాహ్ చేసుకోవటం గురించి ఊహించనైనా లేదు. ఇంతకీ హదీసులో ఏమనబడిందంటే- “తన నికాహ్ ను స్వయంగా చేసుకునే స్త్రీ వ్యభిచారిణి మాత్రమే.”

ఇక్కడ గమనార్హమైన రెండు విషయాలు ఉన్నాయి. –

ఒకటి; ఒకవేళ ఏ స్త్రీ సంరక్షకుడైనా నిజంగానే దుర్మార్గుడు, స్వార్ధపరుడై ఉండి ఆ స్త్రీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పక్షంలో షరీయత్ ప్రకారం అటువంటి వ్యక్తి గార్డియన్‌గా అనర్హుడైపోతాడు. అతని స్థానంలో ఆమె సమీప బంధువుల్లోని వేరొక వ్యక్తి వలీ’గా ఖరారవుతాడు. ఒకవేళ ఆమె కుటుంబీకుల్లో ఏ ఒక్కరూ ఆమెకు శ్రేయోభిలాషులు కారని తేలినప్పుడు ఆ ఊరి పెద్దగానీ, రాజ్యాధికారిగానీ ఆమె తరపున ‘వలీ’గా ఉంటాడు. ఈ నేపథ్యంలో మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “వలీ అన్నవాడే లేని స్త్రీకి రాజ్యాధికారి వలీగా ఉంటాడు.”(తిర్మిజీ)

రెండు; సంరక్షకుని అనుమతి లేకుండా వివాహమాడరాదని తాకీదు చేసిన ఇస్లాం, స్త్రీ అంగీకారంతో నిమిత్తం లేకుండా ఆమె వివాహం తన ఇష్టానుసారం జరిపించరాదని సంరక్షకునికి కూడా ఆంక్ష విధించింది. “కన్య అయిన ఒక స్త్రీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తన తండ్రి తనకు ఇష్టం లేని వ్యక్తితో తన వివాహం జరిపించాడని ఫిర్యాదు చేసింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) – ఆమె కోరుకుంటే ఆ నికాహ్ కు కట్టుబడి ఉండవచ్చనీ, లేదంటే రద్దు పరచుకోవచ్చని ఆమెకు అధికారం ఇచ్చారు.” (అబూ దావూద్, నసాయి, ఇబ్నుమాజా),

అలాగే ఒక వ్యక్తి వితంతువు అయిన తన కుమార్తె వివాహం తన ఇష్టంతో జరిపించగా, ఆ వివాహాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రద్దుపరిచారు. (బుఖారి)

దీని భావమేమిటంటే నికాహ్ సందర్భంగా వలీ అనుమతితో పాటు వధువు అంగీకారం అనివార్యం. ఒకవేళ ఏ కారణంగానయినా వారిద్దరి మధ్య అభిప్రాయ భేదం పొడసూపితే జీవితంలోని మెట్టపల్లాల గురించి వలీ ఆమెకు నచ్చజెప్పి ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకునేలా యత్నించాలి. ఒకవేళ ఈ ప్రయత్నం ఫలించకపోతే అమ్మాయి. ఇష్టపడే మరో సంబంధం చూసి పెళ్ళి జరిపించాలి.

నికాహ్ లో అటు గార్డియన్, ఇటు వధువు- ఇరువురి అంగీకారాన్ని పరస్పరం అనివార్య అంశం ఖరారు చేసి ఇస్లామీయ షరియత్ ఒక మధ్యేమార్గాన్ని తెరచింది. తద్వారా వారిరువురి భావావేశాలను, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుని ఏ ఒక్కరికీ తలవంపు జరగకుండా చూడటం జరిగింది.

ఖుర్ఆన్ హదీసులు ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చిన తరువాత కూడా అబ్బాయిలు అమ్మాయిలు తమ తల్లిదండ్రుల మాటను ఖాతరు చెయ్యకపోవలసిన ఖర్మ ఏం పట్టింది? చెప్పాపెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోవటమెందుకు? వివాహానికి ముందే చాటుమాటు సరసాలెందుకు? వివాహం (నికాహ్) పేరుతో కోర్టులో నాటకమెందుకు? సంరక్షకుడు (వలీ) లేకుండా నికాహ్ చేసుకోవటం ధర్మసమ్మతమే అనుకుంటే పాశ్చాత్య తరహా పెళ్లిళ్లకు ఇస్లామీయ పెళ్లిళ్లకు మధ్య వ్యత్యాసం ఏం మిగిలిందీ? పాశ్చాత్య సమాజంలో స్త్రీకి ఇవ్వబడిన ఈ ‘స్వాతంత్రమే’ అక్కడి కొంపల్ని కూల్చేస్తున్నది. చిందరవందర అవుతున్న తమ బ్రతుకుల్ని చూసి పాశ్చాత్య వివేచనాపరులు సయితం ఆవేదనకు లోనవుతున్నారు. 1995లో అమెరికా ప్రధమ మహిళ అయిన హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్లో పర్యటించినప్పుడు ఆమె ఇస్లామాబాద్ లోని కాలేజ్ ఫర్ వుమెన్ విద్యార్ధినులతో మాట్లాడుతూ ఉద్వేగపూరితంగా ఇలా అన్నారు: “అమెరికాలో ప్రస్తుతం అతి పెద్ద సమస్య ఏమిటంటే అవివాహిత విద్యార్థినులు గర్భవతులై పోతున్నారు. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఏమిటంటే యువతీయువకులు తమ మతపరమైన, సామాజికమైన విలువలపై తిరుగుబాటు చేయకూడదు. వారు ముస్లిములైనా సరే, క్రైస్తవులయినాసరే తమ ధార్మిక సామాజిక నియమ నిబంధనలకు కట్టుబడి వివాహాలు చేసుకోవాలి. వారు తమ తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను మంటగలపకూడదు. వారి సుఖశాంతులను హరించకూడదు.”. (‘జంగ్’ దినపత్రిక: 28-3-1995)

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

నికాహ్ (పెళ్లి) ఆదేశాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ] [PDF] [152 పేజీలు] [14.7 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

%d bloggers like this: