
5 వ అధ్యాయం
“అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు” అనే ప్రమాణానికి ఆహ్వానించుట
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం:
قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّ
“ఇలా చెప్పండి! నా మార్గం ఇది. స్పష్టమగు సూచనను అనుసరించి నేను అల్లాహ్ వైపునకు పిలుస్తాను“. (యూసుఫ్ 12 : 108).
ఇబ్ను అబ్బాసు (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మఆజ్ (రదియల్లాహు అన్హు) ను యమన్ దేశానికి పంపుతూ ఇలా ఉపదేశించారు:
“నీవు గ్రంథమివ్వబడిన (క్రైస్తవుల) వైపునకు వెళ్తున్నావు. మొట్టమొదట నీవు వారిని “లాఇలాహ ఇల్లల్లాహ్” సాక్ష్యం ఇవ్వాలని ఆహ్వానించు”. మరో రివాయత్ లో ఉంది. “అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మాలని చెప్పు. వారు నీ ఈ మాటకు విధేయులయితే, అల్లాహ్ వారికి రోజుకు (24 గంటల్లో) ఐదు సార్లు నమాజు చేయుట విధించాడని తెలుపు. నీ ఈ మాటకు కూడా విధేయత చూపితే, అల్లాహ్ వారిపై జకాత్ విధించాడని తెలియజేయి. అది వారి ధనికుల నుండి వసూలు చేసి, పేదలకు పంచబడుతుంది అని తెలుపు. నీ ఈ మాటను వారు అమలు పరుస్తే, (వారి నుండి జకాత్ వసూలు చేసినప్పుడు) వారి శ్రేష్ఠమైన వస్తువుల జోలికి పోకు. పీడితుని ఆర్తనాదాలకు భయపడు. పీడితుని ఆర్తనాదానికి, అల్లాహ్ కు మధ్య ఏలాంటి అడ్డుతెర ఉండదు”.
సహల్ బిన్ సఅద్ కథనం: ఖైబర్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను రేపు యుద్ధపతాకం ఎలాంటి వ్యక్తికి ఇస్తానంటే, అతను అల్లాహ్, ఆయన ప్రవక్తని ప్రేమిస్తాడు. అతన్ని అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రేమిస్తారు. అల్లాహ్ అతని ద్వారా (ఖైబర్) విజయం చేకూరుస్తాడు“. ఆ పతాకం ఎవరికి దొరుకుతుందో అన్న ఆలోచనలోనే వారు రాత్రి గడిపి, తెల్లవారుకాగానే ప్రవక్త సమక్షంలో హాజరయి, తనకే ఆ పతాకం లభిస్తుందని ఆశించారు. అప్పుడు “అలీ బిన్ అబీ తాలిబ్ ఎక్కడున్నాడ“ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడిగారు. ఆయన కళ్ళలో ఏదో బాధగా ఉంది అని సమాధానమిచ్చారు ప్రజలు. ఎవరినో పంపి అతన్ని పిలిపించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతని కళ్ళల్లో తమ లాలాజలాన్ని ఉమ్మినారు. తక్షణమే అలీ (రదియల్లాహు అన్హు) తనకసలు ఎలాంటి బాధే లేనట్లు పూర్తిగా ఆరోగ్య వంతులైపోయారు. యుద్ధ పతాకం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలీ (రదియల్లాహు అన్హు) చేతికి ఇచ్చి, ఇలా బోధించారు: “నీవు నెమ్మదిగా, హుందాగా వెళ్ళి వారి మైదానంలో దిగు. ఆ తరువాత వారికి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజెయ్యి. వారు నిర్వహించవలసిన అల్లాహ్ హక్కులు వారిపై ఏమున్నాయో వారికి బోధించు. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఏ ఒక్కనికి అల్లాహ్ రుజు మార్గం (ఇస్లాం) ప్రసాదించినా అది నీకోసం ఎరుపు రంగు ఒంటెల కంటే ఎంతో విలువైనది, శ్రేష్ఠమైనది“. (బుఖారి, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట (ప్రవక్త మరియు) ఆయన్ని అనుసరించిన వారి జీవితాశయం.
2. ‘ఇఖ్లాసు’ ఉండుట చాలా ముఖ్యం. ఎందుకనగా ధర్మం వైపు ఆహ్వానిస్తున్నామంటున్న అనేక మంది స్వయంగా తమ వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారు.
3. విద్య ఆధారంగా (ధర్మప్రచారం చేయుట) కూడా ఒక విధి.
4. అల్లాహ్ ను లోపాలు లేని పవిత్రుడని నమ్ముటమే ఉత్తమమైన తౌహీద్.
5. అల్లాహ్ లోపాలు గలవాడని భావించుట చాలా చెడ్డ షిర్క్.
6. ముస్లిం, ముష్రికులకు అతి దూరంగా ఉండాలి. ఎందుకనగా అతను షిర్క్ చేయనప్పటికి వారిలో కలసిపోయే ప్రమాదముంటుంది.
7. విధుల్లో మొట్టమొదటిది తౌహీద్.
8. అన్నిటికి ముందు, చివరికి నమాజుకన్నా ముందు తౌహీద్ ప్రచారం మొదలు పెట్టాలి.
9. మఆజ్ హదీసులో “అన్ యువహ్హిదుల్లాహ్” (అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించుట) మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” రెండిటి భావం ఒక్కటే. .
10. మనిషి దైవ గ్రంథం పొందిన (యూదుడు, క్రైస్తవుడు లాంటి) వాడు అయి కూడా “లాఇలాహ ఇల్లల్లాహ్” అర్థం తెలుసుకోలేకపోవచ్చు, లేక తెలుసుకొని కూడా దాని ప్రకారం ఆచరించకపోవచ్చు.
11. విద్యను క్రమ క్రమంగా నేర్పాలని బోధపడింది.
12. ముఖ్యమైన విషయంతో ఆరంభించాలని తెలిసింది.
13. జకాత్ సొమ్మును ఎందులో ఖర్చు పెట్టాలో తెలిసింది.
14. (జకాత్ సొమ్ము ఎందులో ఖర్చు చెయ్యాలి తెలియక, మఆజ్ సందేహ పడకుండా ప్రవక్త ముందే వివరించినట్లు) శిష్యులను సందిగ్ధంలో పడవేసే విషయాలను పండితుడు ముందే విశదీకరించాలి.
15. (జకాత్ వసూలు చేసే అతను) కేవలం మంచి సొమ్ము మాత్రమే తీసుకొనుట నివారించబడింది.
16. పీడుతుని ఆర్తనాదానికి భయపడాలి.
17. అతని ఆర్తనాదం స్వీకరించబడటానికి ఏదీ అడ్డు పడదు అని తెలుపబడింది.
18. ప్రవక్త, సహాబీలు, ఇతర మహాభక్తులు (తౌహీద్ ప్రచారంలో) భరించిన కష్టాలు, ఆకలి, అంటు వ్యాధి బాధలు, తౌహీద్ యొక్క నిదర్శనాలు.
19. “నేను యుద్ధపతాకం ఇస్తాను” అన్న ప్రవక్త మాట, ఆయనకు ప్రసాదించబడిన అద్భుత సంకేతం (ము’అజిజ).
20. అలీ (రదియల్లాహు అన్హు) కళ్ళల్లో ఆయన లాలాజలం పెట్టడం కూడా ఒక అద్భుత సంకేతమే.
21. అలీ (రజియల్లాహు అన్హు) యొక్క ఘనత తెలిసింది.
22. ఇందులో సహాబాల ఘనత కూడా తెలుస్తుంది. ఎలా అనగా? యుద్ధ పతాకం ఏ అదృష్టవంతునికి లభిస్తుందో అని ఆలోచించడంలోనే నిమగ్నులయ్యారు, అతని ద్వారానే అల్లాహ్ విజయం ప్రసాదిస్తాడన్న విషయం వారు మరచిపోయారు.
23. అదృష్టంపై విశ్వాసం ఇందులో రుజువవుతుంది. అది ఎలా? యుద్ధ పతాకం కోరినవారికి లభించలేదు. కోరని, ఏ మాత్రం ప్రయత్నం చేయని వారికి లభించింది.
24. “నిదానంగా బయలుదేరు” అన్న ప్రవక్త మాటలో (యుద్ధ) శిక్షణ, పద్దతి బోధపడుతుంది.
25. ఎవరితో యుద్ధం చేయబోతున్నారో ముందు వారికి ఇస్లాం పిలుపు నివ్వా లి.
26. ఇంతకు ముందే పిలుపు ఇవ్వడం, లేక యుద్ధం జరిగియుంటే పరవా లేదు.
27. “వారిపై విధియున్న వాటిని వారికి తెలుపు” అనడంలో ధర్మ ప్రచార రంగంలో అవసరమైన వివేకం కానవస్తుంది.
28. ఇస్లాంలో అల్లాహ్ హక్కులు ఏమున్నవో వాటిని తెలుసుకొనుట ఎంతైనా అవసరం.
29. ఒక్క వ్యక్తి అయినా తమ ద్వారా రుజుమార్గం పొందుతే ఇది ఎంత పుణ్యకార్యమో తెలుస్తుంది. .
30. ఫత్వా ఇస్తున్నప్పుడు అవసర సందర్భంగా అల్లాహ్ నామముతో ప్రమాణం చేయవచ్చును.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్): ఈ గ్రంధంలోని అధ్యాయాల్లో ఏ క్రమాన్ని పాటించారో అది చాలా ఉత్తమమైనది. మొదట తౌహీద్ “విధి” అని తెలిపారు, తరువాత దాని ఘనత, సంపూర్ణత ప్రస్తావన తెచ్చి, పిదప బాహ్యంతర్యాల్లో దాని “నిర్ధారణ”, ఆ తరువాత దానికి విరుద్ధమైన షిర్క్ తో భయంను ప్రస్తావించారు. ఇలా మనిషి ఒక విధంగా తనకు తాను పరిపూర్ణుడవుతాడు. ఆ తరువాత “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పిలుపునివ్వాలన్న అధ్యాయాన్ని చేర్చారు.
ఇది ప్రవక్తల విధానం. ఒకే అల్లాహ్ ఆరాధన చేయాలని వారు తమ జాతి వారికి పిలుపు ఇచ్చారు. ఇదే విధానం ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ది. ఆయన వివేకంతో, చక్కని హితబోధతో, ఉత్తమమైన రీతిలో వాదనతో ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చారు. అందులో అలసిపోలేదు. బలహీనత చూపలేదు. అల్లాహ్ ఆయన ద్వారా ఇస్లాం ధర్మాన్ని స్థాపించాడు. అది తూర్పు, పశ్చిమాల్లో వ్యాపించింది. అనేక మంది ఋజుమార్గం పొందారు. ఆయన స్వయంగా ఈ బాధ్యతను నెరవేర్చుతూ, తమ అనుచరులను ప్రచారకులుగా తీర్చిదిద్ది ఇతర ప్రాంతాలకు పంపేవారు. మొట్ట మొదట తౌహీద్ గురించే బోధించాలని చెప్పేవారు. ఎందుకనగా సర్వ కర్మల అంగీకారం దానిపైనే ఆధారపడియుంది. ఇలాంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అందుకే మొదట తౌహీద్ గురించి తెలుసుకోవాలి. పిదప దాని ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిపై తన శక్తి మేరకు ఈ బాధ్యత ఉంటుంది. పండితుడు తన విద్య తో ఈ బాధ్యతను నెరవేర్చాలి. ధన, ప్రాణ శక్తి గలవాడు, హోదా గలవాడు దాన్ని ఉపయోగించి ఈ బాధ్యతను నెరవేర్చాలి. కనీసం ఒక మాటతోనైనా ఈ బాధ్యతను నెరవేర్చినవానిని అల్లాహ్ కరుణించుగాక! శక్తి, సామర్థ్యాలు కలిగియుండి కూడా ఈ బాధ్యతను నెరవేర్చని వానికి వినాశము ఉంటుంది.
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
You must be logged in to post a comment.